Tuesday, 15 May 2018

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - యుద్ధ కాండ 42వ దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Yuddha Kanda 42 Day

యుద్ధ కాండ

నలభై రెండవ రోజు ప్రవచనము



పుష్పకవిమానంలో నందిగ్రామానికి ఏతెంచినటువంటి రామ చంద్ర ప్రభువుయొక్క పాదములకు పాదుకలు తొడగినవాడై భరతుడు రామ చంద్ర మూర్తితో అంటున్నాడు శిర స్యంఽజలిమ్ ఆదాయ కైకేయ్యాఽఽనన్ద వర్ధనః ! బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్య పరాక్రమమ్ !! ఇక్కడా కైకేయ్యాఽఽనన్ద వర్ధనః అంటారు భరతున్ని, అంటే కైకేయి యొక్క ఆనందమును వృద్ది చేసినవాడు. సాధారణంగా కొడుకుకి ఉన్నటువంటి పేరు సంస్కృతంలో ʻనందనుడుʼ అని అంటే ఆనందమునుకల్పిస్తాడు తల్లిదండ్రులకి, అందుకే దేవకీనందనుడు, పార్వతీనందనుడు నందన శబ్దాన్ని తల్లితోకలిపివేస్తారు అంటే తల్లికి ఆనందమునిచ్చేటటువంటివాడై ఉంటాడని. కన్నకడుపూ అనిగదా పోతనగారంతటివారు మహాభాగవతంచేస్తూ చేతులారంగ శివునిఁ బూజింపఁడేని నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁ డేని దయయు సత్యంబులో నుగాఁదలఁపఁడేని గలుగనేటికిఁ దల్లులకడుపుచేటు అంటారు. లోకంలో ఏ తండ్రి కన్నబిడ్డో అనరు, ఎవరైనా మహాత్ముడై పదిమందికి ఉపకారం చేసేటటువంటి జీవనం  చేసేటటువంటివాడు కనపడితే ʻఏతల్లికన్నబిడ్డోʼ అంటారు. అమ్మకి కీర్తి తెస్తాడు కొడుకు అమ్మకి కీర్తి తెస్తుంది కూతురు. కాబట్టి తొమ్మిది నెలలు కష్టపడి ఆ పిల్లవాన్ని కడుపులో భరించి మృత్యువుతో సమానమైనటువంటి ప్రసవేదనని తాననుభవించి ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లి కోరుకునేదేమిటంటే ఆ పిల్లవాడివలన వంశమునకు కీర్తి రావాలని కోరుకుంటుంది.
కీర్తికి కారణం పదిమందికి ఉపకరించేటటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండడం, కాబట్టి ఇక్కడ ఎలా కైకేయ్యాఽఽనన్ద వర్ధనః అయ్యాడు అంటే కైకేయ్యికి నిజంగా రామ చంద్ర మూర్తికి రాజ్యమివ్వకూడదని భరతుడికి రాజ్యమివ్వాలనీ ఆవిడ హృదయంలో ఉన్నటువంటి సంకల్పంకాదు. ఈ విషయం మందరవెళ్ళి మాట్లాడటం ప్రారంభం చేసినప్పుడే మనకి స్పష్టమౌతుంది ఆవిడ ఎంత సంతోషించిందో... రామ చంద్ర మూర్తికి రాజ్యమిస్తున్నారంటే అయోధ్య కాండలో ఎంత ఆనందపడిపోయిందో కాని మందరా లేనిపోనటువంటి భయాన్ని సృష్టించి ఆమె మనసుని కదిలిపోయేటట్టుగా చేసింది. అందుకే దశరథ మహారాజుగారు నిన్నటిరోజున దర్శనమిచ్చినప్పుడు రామ చంద్ర మూర్తికి ʻరామా! దేవతల యొక్క సంకల్పమిది నేను పెట్టిన ముహూర్తానికి పట్టాభిషేకం జరగకూడదూని దేవతలు నిర్ణయించారుʼ అందుకే నేను  పెట్టుకున్న ముహూర్తం భగ్నమైపోయింది, అయిపోయి నీవు అరణ్యవాసానికి వెళ్ళావు, నీవు అరణ్యవాసానికి వెడితే తప్పా రావణ వధ జరగదూని సంకల్పించిన దేవతలు కైకేయి చేత ఆ కోరిక కోరేటట్లుచేశారూని చెప్పారు.
కాబట్టి నిజానికి కైకేయికీ రామ చంద్ర

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
మూర్తి యొక్క పట్టాభిషేకాన్ని పాడుచెయ్యాలన్ని ఉద్యేశ్యం కాని భరతుడికి రాజ్యం ఇవ్వాలన్న కోరికగాని లేని తల్లి ఆవిడ, ఆవిడకి రాముడు రాజు కావడమే ఆమెకు ఇష్టం. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళల్లో రాముడి పట్టాభిషేకం చూసి ఓర్వలేనిదిగా మనం అనుమానపడవలసినది ఎవరైనా ఉంటే కైకేయి గురించి మనం ఏమైనా అనుమానం పడుతామోననీ మహర్షి మరొక్కసారి జ్ఞాపకంచేస్తున్నారు కైకేయ్యాఽఽనన్ద వర్ధనః నిజంగా కైకేయికి రాముడు రాజు కావాలని కోరగలిగినటువంటి విశాలమైన హృదయముండడం ఒకెత్తూ రాజరికం తనకి అయాచితంగా లభించినా 14 సంవత్సరములు రాజ్యం చెయ్యవయ్యాని రాముడే అధికారమిచ్చినా రామ పాదుకలుపెట్టి రాజ్యంచేసి, ఒకవేళ భరతునికి రాజ్యవ్యామోహం ఏమాత్రం ఉన్నట్లు అనుమానం కలిగితే నీవు వెనక్కొచ్చేయ్ హనుమా... నేను రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తానని రామ చంద్ర మూర్తి ప్రతిపాదించినా 14 సంవత్సరములు అధికారము తరువాత కూడా అధికారమునందు ఏమాత్రమూ వాంచలేకుండా ఇది రాముడిది నేను పరిపాలిస్తున్నాను తప్పా నేను పరిపాలిస్తున్నవాడనుకానూ అని ప్రతీక్షణం జాగరూకుడై ఏపాటి అభిజాక్ష్యమూ పెంచుకోకుండా రామ కింకరుడిగా మిగిలిపోయినటువంటి మహాపురుషుడు భరతుడు ఆయన అలా ఉండబట్టి కైకేయి యొక్క కోరిక ఇవ్వాళ తీరుతూంది కాబట్టి ఆయన కైకేయ్యాఽఽనన్ద వర్ధనః. శిర స్యంజలిమ్ ఆదాయ ఇప్పటిదాకా తాను అధికారంలో ఉన్నాడు తానే పరిపాలన చేశాడు అయినా రామున్ని చూసేటప్పటికి ఎంత వినయమంటే ఆయనకీ శిర స్యంఽజలిమ్ ఆదాయ ఇదీ ఈ వినయం పెద్దలను చూసినప్పుడు ఆ గౌరవంతో ప్రవర్తించగలగడం పుట్టుకతో రావాలి.
రాకపోతే ఏమౌతుందంటే ఎవర్ని ఎక్కడ గౌరవించాలో చేతకానితనం అలవాటౌతుంది కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ పెద్దలకి కోపం వస్తుంది ఎందుకొస్తుందంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోవడంవల్లే కోపమొస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవలసినదేమిటంటే ఏ సందర్భంలో ఎక్కడ ఏ కాలంలో ఎవర్ని గౌరవించాలో ఆ గౌరవం ఇవ్వడం చేతనైతేనే ఆయా స్థానములను అలంకరించవలసి ఉంటుంది. అది చేత కాకపోతే వాళ్ళకీ ప్రమాదం పెద్దల యొక్క ఆగ్రహాన్ని పొందుతారు. కాబట్టి అలా కాకూడదూ అంటే ఆయా కాలములయందు ఆయా సందర్భములలో ఎవర్ని ఎలా గౌరవించాలో నేర్చుకుని ఉండాలి. ఇదీ భరతుడు మళ్ళీ మనకు చూపిస్తాడు శిర స్యంజలిమ్ ఆదాయ ఎంత వినయమో మహానుభావుడికి శిరస్సుయందు రెండు చేతులు దోసిలి కట్టి అంజలి ఘటించి పరమ వినయంతో రామ చంద్ర మూర్తి దగ్గరకొచ్చి బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్య పరాక్రమమ్ సత్యపరాక్రముడైనటువంటి రాముడు అంటారు మహర్షి. ఆయన ఎప్పుడు అనుష్టించినా అదే మారనటువంటి పరబ్రహ్మమునందు రమించడానికి, మారేటటువంటి ధర్మాన్ని పట్టుకున్నటువంటివాడు రామ చంద్ర మూర్తి. అందుకే సత్యం ఎవ ఈష్వరొ లొకె సత్య పద్మా సమాష్రితా ! సత్య మూలాని సర్వాణి సత్యాన్ నాస్తి పరం పదమ్ !! అంటాడు.
నాకు సత్యమే సర్వస్వం సత్యమునే లక్ష్మి ఆశ్రయించి ఉంది, అలా ఆశ్రయించినటువంటి సత్యమును నేను విడిచిపెడితే నేను సమస్తమూ పోగొట్టుకుంటాను, నాకు సత్యమే కావాలంటాడు రాముడు. కాబట్టి సత్యమే పరాక్రమముగా కలిగినటువంటివాడు, సత్య పరాక్రముడైనటువంటి రాముడితో భరతుడు మాట్లాడుతున్నాడు పూజితా మామికా మాతా దత్తం రాజ్యమ్ ఇదం మమ ! త ద్దదామి పున స్తుభ్యం యథా త్వమ్ అదదా మమ !! రామా! మహానుభావా నీవు పూజితా మామికా

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
మాతా మా అమ్మ మాటకి ఎంత గౌరవించావయ్యా... నిజంగా ఆరోజున దశరథ మహారాజుగారు ఒక స్త్రీ మాటకు నేను కట్టుబడ్డాను ఈమె వరములన్నిపేరుతో నిర్భదింస్తూంది, రామా నీవు నన్ను ఖైదిచేసి రాజ్యం పుచ్చుకో అన్నారు. అయినాసరే నాన్నగారు నాకు మిమ్మల్ని ఖైదు చేసి రాజ్యం పుచ్చుకోవడంకాదు మిమ్ములను సత్యమునందు నిలబెట్టినవాడు కొడుకనీ, అమ్మా... పుట్టినప్పటినుంచి నన్ను చూస్తున్నావు రాజ్యమే కావాలంటే తల్లీ నీవు నాన్నగారిని వరాలడగాలామ్మా నీవు పిలిచి చెప్తే నేను వెళ్ళిపోనా అమ్మా నాకివన్నీ అక్కరలేదమ్మా... అనీ నాహమర్థపరో దేవి! లోకమావస్తుముత్సహే ! విద్ధిమామృషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితమ్ !! అంటాడు మహానుభావుడు అయోధ్యకాండలో అమ్మా నాకు ధర్మము కావాలమ్మా నేను ఋషిని నాకు దేనిమీదా కోర్కె ఉన్నవాడినికాను అటువంటి ఋషినమ్మానేను, కాబట్టి నాకు కావలసింది ధర్మమొక్కటే, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టటం ఒక్కటే, నీవు చెప్తే వెళ్ళిపోనామ్మా అంటాడు. అంతగా నా తల్లిని పూజించినటువంటివాడివి పూజితా మామికా మాతా మా అమ్మ మాటను నిజం చేయడానికి మా అమ్మ కోరుకున్న కోరిక నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టివెళ్ళిపోయావు రామా! దత్తం రాజ్యమ్ ఇదం మమ ఆ రాజ్యాన్ని 14 యేళ్లు పరిపాలించూని నాకిచ్చావు నీవు అదీ 14 యేళ్లు ʻనీదైన రాజ్యాన్ని నీకొరకు నేను పరిపాలించాను తప్పా నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకొన్ని నేను ఎన్నడూ పరిపాలించలేదు కాబట్టి త ద్దదామి పున స్తుభ్యం దానినే నీకు ఇస్తున్నానుʼ మళ్ళీ  యథా త్వమ్ అదదా మమ నీవు ఎలా ఇచ్చావో అలా తిరిగి నీకు నేను అందజేసేస్తున్నాను.
ఇదీ మనుష్యుడిగా జన్మించినటువంటి ప్రతివాడూ కూడా ఈశ్వరుని విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటిమాట. ఏ విభూతి మనకు కలిగినా అది ఈశ్వరానుగ్రహమే తిరిగి మనం ఎవరికి సమర్పించవలసిందంటే దాన్ని ఈశ్వరునికే సమర్పించడం నైవేద్యం, ఆయనకే సమర్పించి ప్రసాదంగా అనుభవించినవాడెవడో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆయన అంటాడు ధుర మేకాకినా న్యస్తామ్ ఋషభేణ బలీయసా ! కిశోరవత్ గురుం భారం న వోడు మహ ముత్సహే !! అన్నయ్యా ఎక్కడైనా లోకంలో ఒక గుఱ్ఱము యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలదా రెండు ప్రాణులు ఒక్కలా ఉంటాయిని, హంస ఎలా నడువ గలదో అలా ఒక కాకి నడవగలదాన్నయ్యా! నీవు ఒక్క విషయాన్ని బాగా ఆలోచనచెయ్యి యథా చాఽఽరోపితో వృక్షో జాత శ్చాన్త ర్నివేశనే ! మహాం శ్చ సుదురాఽఽరోహో మహా స్కన్ధః ప్రశాఖవాన్ !! శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్ ! తస్య నానుభవే దర్థం యస్య హేతోః స రోప్యతే !! ఒక యజమాని ఒక చెట్టునాటాడు అది చాలా పెద్ద చెట్టయ్యింది ఆయన అది మంచి పళ్ళిస్తుందీ అనుకున్నాడు, పెద్ద పెద్ద కొమ్మలొచ్చాయి చాలా గొప్ప పువ్వులొచ్చాయి కానీ అది మాత్రం పళ్ళు పండలేదు పువ్వులతో ఆగింది కాయలు కూడా కాయలేదు, ఇప్పుడూ ఆ చెట్టు నాటినటువంటి వ్యక్తీ ఇది మంచి పళ్ళిస్తుందనుకుంటే ఇంత పెద్ద చెట్టయ్యింది పుష్పించింది కానీ పిందెలేదు కాయలేదు పండులేదని ఎలా బాధపడుతాడో ఆలా...
నీవు రాజ్యం చెయ్యాలనీ ధర్మాత్ముడైనవాడు రాజ్యపాలన చెయ్యడానికి నాకు కొడుకు కావాలీని నాన్నగారు అశ్వమేధ యాగం పుత్రకామేష్టీ చేశారు, అటువంటి ధర్మాత్ముడికి నీవు కొడుకుగా పుట్టావు పుట్టీ కూడా నీవు ఇప్పుడు రాజ్య స్వీకారం చెయ్యకపోతే అదిగో పళ్ళు పండని చెట్టు ఎలా ఉంటుందో అన్నయ్యా! అలా ఉంటుంది కాబట్టి నీవు రాజ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. నీవు గొప్ప భోగములకు ఐశ్వర్యమునకు తగినవాడవు కానీ 14 సంవత్సరములపాటు

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
కటికనేలమీద పడుకున్నావు నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకున్నావు నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవలసినటువంటి సీతమ్మ ఎక్కడో అశోకవనంలో శింశుపా వృక్షం కింద అలా ఏడుస్తూ ఆ తల్లి ఉండిపోయింది అన్నయ్యా ఇక నుంచి నీవు అలా ఉండడానికి వీల్లేదు ఈ క్షణం నుంచి తూర్య సంఘాత నిర్ఘోషైః కాంచీ నూపుర నిర్వనైః ! మధురై ర్గీత శబ్ధై శ్చ ప్రతిబుధ్యస్వ రాఘవ !! అన్నయ్యా! నీవు ఇక నుంచి నిద్రలేవడమన్నదీ గొప్ప మంగళ ధ్వనుల మధ్య తూర్యనాదముల మధ్య గొప్ప స్త్రీల యొక్క వడ్డాణముల యొక్క చప్పుడు గాజుల చప్పుడు మధ్య నీవు నిద్రలేవాలి అంటే అంతఃపుర స్త్రీల మధ్యలో నీవు చాలా గొప్పగా హంసతూలికా తల్పముమీద శయనించినవాడవై నిద్రలేవాలి తప్పా అన్నయ్యా నీవు ఇలా కష్టపడకూడదు.
యావ దాఽఽవర్తతే చక్రం యావతీ చ వసుంధరా ! తావత్ త్వమ్ ఇహ సర్వస్య స్వామిత్వమ్ అభివర్తయ !! స్వామి అంటారు, స్వామి అన్నమాట ఇద్దరియందే ప్రయోగించాలి ఎవర్ని పడితేవాళ్ళనిపట్టుకుని స్వామి అనకూడదు ఇద్దరినే స్వామి అనాలి. ఒకటి స్వామి అన్నమాట భర్తకు చెల్లుతుంది భార్య భర్తని స్వామీ అని పిలవవచ్చు, రెండు ఈశ్వరున్ని సరే స్వామి అంటాము కానీ యదార్థమునకైతే అమరకోశాన్ని బట్టి స్వామి అన్నమాట ఎవరికి చెల్లుతుందంటే ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరునికే ఆయనకొక్కరికే స్వామీ అన్న నామము అన్వయమౌతుంది. మిగిలినవాళ్ళకి స్వామి అన్ననామం అన్వయమౌతుందని అమరకోశం చెప్పలేదు కానీ మనం అంటాం దానికేం పెద్ద దోశమేం కాదు. ఎందుకంటే అందర్నీ ఆ స్వరూపంగానే భావన చేస్తాము కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవలసి విశయం కాదు. కానీ స్వామీ అని పిలిస్తే మాత్రం ఇద్దరినే పిలవాలీని శాస్త్రవాక్కు. ఈశ్వరున్ని అలా ఉంచండి ఒకటి స్త్రీ భర్తని పిలవాలి రెండు ఒక్క గురువుగారికి మాత్రమే స్వామీ అన్నమాట చెందుతుంది. ఒక్క గురువుగారిని సంబోధించేటప్పుడు స్వామీ అని పిలిచి సంబోధించవచ్చు ఎందుకంటే స్వామీ అంటే సమస్తమూ తనదైనవాడు, కేవలము తన సంకల్పముచేతా శిష్యుడిని అనుగ్రహించగలిగినవాడు ఆయన కోపముచేతా నశింపజేయగలిగినవాడు అందుకని ఆయన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉండగలిగినవాడు అంతటి ఉపాసనా బలమున్నవాడు. అందుకుకదూ సర్వతంత్ర స్వతంత్రాని పిలుస్తుంటాం గురుస్తోత్రంలో అటువంటి మహనీయులు కాబట్టి గురువుగారిదగ్గరికెళ్ళి సంబోధించినప్పుడు ʻహే స్వామిన్ʼ అని పిలుస్తుంటారు స్వామీ అను సంభోదనముంది. భరతుడు ఇవ్వాళ స్వామీ అని పిలుస్తున్నాడు స్వామీ అని పిలుస్తున్నాడంటే ఒక్కటే కారణం ఆయనయందు ఈశ్వర తత్వాన్ని చూశాడూని గుర్తు, ఒక గురు తత్వాని చూశాడు తప్పా కేవలము ఒక అన్నగారిని చూసి మాట్లాడుతున్నవాడు కాడు.
ఎందుకంటే అన్నగారిని స్వామీ అన్న మాటతో సంబోధనలేదు యావ దాఽఽవర్తతే చక్రం ఒక రథ చక్రము ఎంతదూరమెడుతుందో అంతవరకూ ఉన్నటువంటి ఈ భూమండలానికి యావతీ చ వసుంధరా ఎంతవరకు ఈ భూమి ఉందో, భూమికంతటికీ తావత్ త్వమ్ ఇహ సర్వస్య స్వామిత్వమ్ అభివర్తయ అక్కడవరకు అంతానీదే... నీదైనటువంటిది మాకిచ్చి మేము ఆనందమనుభవిస్తే మా ఆనందాన్ని చూసి నీవు ఆనందాన్ని అనుభవిస్తున్నావు. ఇదే మనం సాధారణంగా ఈశ్వరుని విషయంలో ఇద్దరు భార్యలుగా చూపిస్తుంటారు మనవాళ్ళు ఉభయ నాంచారులూ అంటారు, అంటే ʻశ్రీ-భూʼ సమేత వేంకటేశ్వరులు అంతకన్నా ఇంకొక మాటలేదు శాస్త్రంలో శ్రీ భూ సమేత వేంకటేశ్వరులు, ఎందుకలా ఉంటాడు అంటే ఆయనకేం సరదాకి ఇద్దరు పెళ్ళాలు చేసుకున్నాడనికాదు ʻశ్రీ-భూʼ మీరు ఆలోచించండి మధ్యలో ఉన్నవాడు ఈశ్వరుడు. ఆయనకి

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
ʻభూమిʼ ఒక భార్య ʻశ్రీʼ ఒక భార్య. ఈ భూమికి శర్వాణి తత్వముంది, అందుకే శర్వః అన్న నామము విష్ణువుకి ఉంది శర్వః అన్న నామము శివునికీ ఉంది. శివుని యొక్క అష్టమూర్తులలో ఒక నామము శర్వ, అందుకే శర్వాయ దేవాయ నమః అంటాము అలాగే శర్వః అని విష్ణువుని కూడా సంభోధిస్తాము, విష్ణు సహస్త్రనామంలో ఉందా నామము. శర్వుడు అంటే భూమి నుండి ఐశ్వర్యమును ఇచ్చేవాడు అని. ఐశ్వర్యము ఎక్కడనుంచి వస్తుందంటే భూమిలోనుండే వస్తుంది.
నేను మీకు ఇతః పూర్వము ఎక్కడో మనవిచేశాను ఆదిత్యహృదయం చెప్తూనో ఎక్కడో ఈ శరీరం బతకాలీ అంటే కావాలిసినవి భూమిలోంచే వస్తాయి ఒక ఆపిల్ పండు కావాలి భూమిలోంచి రావాలి అన్నం కావాలి భూమిలోంచి రావాలి ఈ శరీరానికి భోగం కావాలి భూమిలోంచేరావాలి ఇప్పుడు ఈ ఫ్యానేదో ఉంది ఈ ఫాను తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచే వస్తుంది ఈ ఫ్యాను తిరగడానికి కావలసిన విద్యుత్తు భూమిలో ఉన్న నీరు నుండి వస్తుంది. కాబట్టి భోగమునకు శరీరము నిలబడడానికి కూడా భూమి కారణము. ఇప్పుడు ఈ భూమి ఎవరిది ఈశ్వరునిది అందుకని ఆయనకి భార్య. ఈ భూమిలోంచి ఐశ్వర్యమిస్తోంది భూమి, కానీ అది మీ కష్టాన్ని బట్టి ఐశ్వర్యమొస్తుంది. అనుభవించడం..? మీరు అనుభవించాల అనుభవించ కూడాదాన్నది మీరు కష్టపడ్డారు కాబట్టి ఇవ్వాలనేం లేదు మీరు కష్టపడినది మీకు ఇవ్వాలావద్దా మీ చేత అనుభవింపచెయ్యాలావద్దా అని నిర్ణయించవలసినవాడు మధ్యలో ఉన్నవాడు. వీడు కష్టపడినందుకు పంటపండినా ఈశ్వరుని యందు ద్వేష బుద్ధితో బతకడం లోకంలో ఎక్కువైపోతూంది అనుకోండి అనాచారము ఎక్కువైపోయిందనుకోండి ఆస్థిక్యబుద్ధి నశించిపోయిందనుకోండి యజ్ఞ యాగాది క్రతువులు నశించిపోయావనుకోండి పెద్దలైనవారి వద్ద వినయ విధేయతలు నశించిపోయాయనుకోండి ఈశ్వరుని యొక్క ఆగ్రహానికి గురౌతారు. ఈశ్వరుడేమంటాడంటే దీనిని ఐశ్వర్యముగా మార్చవద్దూ అంటాడు. అందుకని ఆవిడ శ్రీదేవి, ఇప్పుడు ఐశ్వర్యంగా ఎందుకు మారదంటే పంట పండుతుంది తుఫానొస్తుంది పంట  విరగ పండింటుంది గాలివాన వస్తుంది, అరటిచెట్లన్నీ మంచి గెలలతో ఉంటాయి పెద్ద గాలివాన వచ్చి గెలలన్నీ నేలమీద పడిపోతాయి.
అంటే మీరు పండించినది మీ నోటికి అందదు, దీన్నే ఇంగ్లీషులో ప్రవర్బ్ లో అంటూంటారు దేర్ మే బి ఎ స్లీప్ బిట్వీన్ కంపెడ్బల్లీప్ అని అది మీ చేతిలో ఉన్నది మీ అనుభవంలోకి మారదు, అందుకే రుద్రంలో అభిషేకం చేస్తే ఒక మాట అంటూంటారు ద్రాపే అంధస్పతే దరిద్రన్ నీలలోహిత అంటారు, ఈశ్వరా ఐశ్వర్యమన్నమాటకు అర్థమేమిటంటే ఉన్నది అనుభవించుట అనుభవించగలిగినటువంటి శక్తి శరీరమునందు ఉంటే దానికి ఐశ్వర్యమనిపేరు శ్రీ అని పేరు. ఇప్పుడు ఇవ్వాలన్నా ఈవిడే ఇచ్చింది అనుభవించాలన్నా ఈవిడే, ఈవిడ అనుభవింపజేసే శక్తి ఇవ్వాలన్నా అనుభవించడానికి కావలసినవి ఈవిడ ఇవ్వాలన్నా ఈయన అనుగ్రహాన్ని బట్టే వాళ్ళిద్దరు ఇస్తారు. ఈయ్యన కాళ్ళు మీరు పట్టుకుంటే వాళ్ళిద్దరూ కూడా సంతోషిస్తారు. అందుకే మనకు లోకంలో ఆచారమేమిటంటే భర్తకాళ్ళు పట్టుకుంటే భార్య సంతోషిస్తుంది. శంకర భగవత్పాదు సౌందర్యలహరి చేశారు సౌందర్యలహరి అమ్మవారి యొక్క వైభవానికి సంబంధించిన స్తోత్రం. కాని శంకరులు అమ్మవారి స్తోత్రం చేస్తున్నానుగదాని ʻశివాʼ అని మొదలు పెట్టారా?, ʻశివాʼ అని దీర్ఘమిచ్చారనుకోండి అమ్మవారు, అమ్మవారిని స్తోత్రమని అమ్మవారిని స్తోత్రం చేస్తే అమ్మవారు ఖేదం పడుతుంది, అమ్మవారు సంతోషించాలంటే ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఆవిడ భర్తని స్తోత్రం చెయ్యాలి కాబట్టి శంకరులు అందుకే లోకానికి మర్యాద నేర్పడంకోసం శివా అని మొదలెట్టలేదు సౌందర్యలహరిలో శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం అని మొదలెట్టారు, శివ అంటే శివుడు, శివ అని మొదలెడితే ఆవిడ సంతోషిస్తుంది అందుకే అసలు శివానందలహరి చెప్పి సౌందర్యలహరి చెప్తే అమ్మవారు చాలా ప్రీతి పొందుతుంది. ఇదీ ప్రత్యక్షంగా పెద్దలైనటువంటివారు అనేక పర్యాయాలు అనుభవించారు జీవితంలో అమ్మవారి అనుగ్రహానికి శివానందలహరి చెప్పి సౌందర్యలహరి చెప్తే అమ్మవారు ఎంత అనుగ్రహిస్తుందో స్ఫుటంగా కనపడుతుంది.

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
కాబట్టి నీవు యావ దాఽఽవర్తతే చక్రం యావతీ చ వసుంధరా ! తావత్ త్వమ్ ఇహ సర్వస్య స్వామిత్వమ్ అభివర్తయ !! అన్నయ్యా! నీవు స్వామివి అంటే పైకి రాజువంటున్నాడు ఆంతరమునందు ఇది నీది ఈశ్వరునిది... రాముడు ఈశ్వరుడు అందుకనే భరతవాక్యం పలికేశాడండీ అంటారు, అంటే భరతుడు చెప్పవలసిన మాట చెప్పేశాడు. ఈశ్వరా ఇవన్నీ నీవి నీవైనవి నాకెందుకిచ్చావుమరి, ఈ పట్టుపంచ నాకెందుకిచ్చావు అంటే మంచి పట్టుపంచె కట్టుకున్నానని నేను సంతోషపడిపోతే నా సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు, నాకో పట్టులాల్చీ ఎందుకిచ్చాడు ఈ లాల్చీ నేను వేసుకుంటే నా సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. అమ్మ కొడుక్కి పాయసం పెడుతుంది కొడుకు పాయసంతింటే అమ్మా ఎంత బాగుందో అని చెప్పి ఆ వేళ్ళతో చిన్న చిన్న వేళ్ళతో పాయసం తీసి అడుగుది కూడా నాకేస్తున్నాడనుకోండి అమ్మ ఎంత సంతోషపడిపోతూందో... వండింది అమ్మ తెచ్చింది తండ్రి తిన్నవాడు పిల్లాడు, పిల్లవాడు తింటే అమ్మానాన్న సంతోషపడ్డమేమిటీ తల్లీ తండ్రీ కాబట్టి, కాబట్టీ వాళ్ళిద్దరెవరు లోకానికి సీతారాములు వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వరులు అందుకే వాగర్ధా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ రమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీ నారాయణులనండీ... పార్వతీ పరమేశ్వరులనండీ వాళ్ళే కాబట్టీ ఈశ్వరా నీదైనది నాకిస్తున్నావు అది నేను పుచ్చుకుని సంతోషిస్తే నా సంతోషాన్ని చూసి నీవు సంతోషిస్తావు అటువంటివాడివి ఇది ఆంతర ప్రతిపాదన బాహ్యమునందు రామా ఇది నీది పట్టణం.
ఈ రాజ్యం నీది నీదైనదాన్ని నీవు పరిపాలించమన్నావు పరిపాలించాను కాబట్టి ఇప్పుడు నీవు దాన్ని మళ్ళీ స్వీకరించు భరతస్య వచః శ్రుత్వా రామః పరపురంజయః ! తథేతి ప్రతిజగ్రాహ నిషసాదాఽఽసనే శుభే !! ఆయన అన్నాడు స్వీకరించాను ఒక్క సంకల్పం చేశాడు ఆయన ఒక్క మాట అన్నాడు, ʻభరతా! నేను స్వీకరించానుʼ అని ఒక్క సంకల్పం చేశాడు ఆయన సంతోషించాను అని ఒక ఉచితమైనటువంటి ఆసనంలో ఆయన కూర్చున్నాడు పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహా బలే ! సుగ్రీవే వానరేన్ద్రే చ రాక్షసేన్ద్రే విభీషణే !! ఆయనా మఱ్ఱిపాలు పోసుకుని జఠలు కట్టేసుకున్నాడు జుట్టునంతట్నీ ఆయోధ్యకాండలో విన్నారుగా మీరు, ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకోవాలి పట్టాభిషేకం చేసుకోవాలంటే రామ చంద్ర మూర్తి నిత్యాగ్నిహోత్రి మహానుభావుడు నిత్యాగ్నిహోత్రి అంటే అసలు ఆ వర్చస్సు ఆ వినయమూ మొన్నన ఇక్కడికి మే 11 తారిఖున సాయంకాలం విజయవాడనుంచి హరిప్రసాదుగారు తీసుకొస్తే వాళ్ళ దర్శనం చేత పునీతులమయ్యాం మనం ఇక్కడ. వాళ్ళు సాయంకాలం అగ్నిహోత్రం చేసుకుని ఇక్కడికి వచ్చారు, ఎంత వినయమో ఎంత విధేయతో చదువుకోవడం వేరు వినయం ఉండడం వేరు ఏదో తెలుసనుకోవడం వేరు దానిచేత ధూర్తతనం ప్రభలడం వేరు ఆ ధూర్తతనం ఉన్నప్పుడు ఏదీ రాణించలేదు అసలు ఆ వినయం లేకపోతే.

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
కాబట్టి రామ చంద్ర మూర్తి దగ్గరికి ఆ క్షూర కర్ములు నిపుణులైనవారు తీసుకొచ్చారు, తీసుకొస్తే ఆయన అన్నారు నేను కాదు ముందు జఠలు తీయించుకోవలసినవాన్ని ముందు భరతునికి లక్ష్మణునికి శత్రుఘ్నునికి తీయించండి అన్నాడు. ఆయనా నిత్యాగ్నిహోత్రీకుడు, మారీచుడంతటివాడు ఆయన గురించి చెప్తూ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయా అని చెప్పాడు, ఆయనా శిఖ పెట్టుకుంటాడు, పట్టాభిషేకవేళకి యదార్థానికి ఆయన యదార్థమైనటువంటి మూర్తేమిటంటే ఆయన బోడిగుండుతో పిలకతో ఉన్నాడు ఎందుకంటే ఆయన చూర కర్మ చేయించుకున్నారు చేయించుకుని కేలవం శిఖతో మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఆయనకీ ఆచారముపట్లా సాంప్రదాయంపట్లా ఆయనకున్నా మర్యాద అటువంటిది రామ చంద్ర మూర్తికి కాబట్టి ఆయన అన్నాడు పూర్వం తు భరతే స్నాతే నేను కాదు ముందు స్నానం చేయడం తమ్ముడికి చేయించండి అన్నాడు ఆయన ప్రేమ అటువంటిది అందుకు ముందు భరతుడికి స్నానం చేయించారు లక్ష్మణే చ మహా బలే తరువాత లక్ష్మణునికి చేయించారు. సుగ్రీవే వానరేంద్రే చ ఆ తరువాత మిత్రుల్ని కూడా ఆయన అంత జ్ఞాపకం పెట్టుకుంటారు సుగ్రీవుడికి చేయించారు రాక్షసేన్ద్రే విభీషణే తరువాత రాక్షసేంద్రుడైన విభీషణునికి కూడా స్నానం చేయించారు, ఆ జఠలనన్నింటినీ కూడా విసర్జించారు మంచి వస్త్రాలను కట్టుకున్నారు.
సీతమ్మ తల్లికి ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథ స్త్రియః ! ఆత్మ నైవ తదా చక్రు ర్మనస్విన్యో మనోహరమ్ !! దశరథ రాజు గారియొక్క ముగ్గురు భార్యలు కౌసల్యా సుమిత్రా కైకేయీ, లోకంలో ఇదొక విచిత్రమైనటువంటి లక్షణం. కౌసల్యా సుమిత్రా కైకేయీ ముగ్గురు భార్యలు దశరథ మహారాజుగారికి ముగ్గురు భార్యలున్నటువంటి దశరథుడికి నలుగురు కొడుకులున్నారు కానీ కూతుళ్ళులేరు కాబట్టి వాళ్ళకి సంతోషమేమిటంటే నలుగురు కొడుకులున్నారు కానీ ఓ జడేద్దామంటేలేదు ఓ పువ్వు పెడదామంటేలేదు చక్కగా ఏదో ఓ బొట్టు కాటుకో పెడుదామంటేలేదు కూతుళ్ళు లేనటువంటి కొడుకులు మాత్రమే ఉన్న తల్లికి చాలా ముచ్చటలుంటాయి, కోడలెప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందాని ఎదురు చూస్తుందావిడా ఎదురు చూడ్డంకాదు నిజంగా ఆ అత్తగారి మనసులో అమ్మ ఉంటుంది. ఎందుకో తెలుసాండి అటువంటి అత్తగారు కోడలు అనీ కూడా చూడదు జడవేస్తుంది పువ్వులు పెడుతుంది కాటుక పెడుతుంది బొట్టు పెడుతుంది అప్పుడు ఆ అత్తగారు అమ్మే. అసలు నీజానికి గొప్పతనమేమిటో తెలుసాండీ అమ్మలో అమ్మతనం ఉండడం గొప్పకాదు అత్తగారిలో అమ్మతనముండడమే చాలా గొప్ప విషయం. అత్తగారు అమ్మగా అత్తగారిలో అమ్మని చూసుకునీ అత్తగారితో కోడలు అలా కలిసిపోవాలి కోడలిలో కోడల్నీ కూతుర్నీ చూసుకొని అత్తగారు మురిసిపోవాలి కూతురు ఉన్నాకూడా... మీరొకటి ఆలోచించండీ నాకో కూతురుంది నా కూతురికి సుఖమన్నమాటకి అర్థమేమిటీ నేను ఎంత చేసినా నా మనసులో ఒక వెలికితనం ఉంటుంది, నేను చెయ్యడం కాదు ఇవన్నీ వాళ్ళాయన చెయ్యాలి వాళ్ళత్తవారు చేస్తే బాగుంటుందనుకుంటాము వాళ్ళత్తవారివల్ల తృప్తి పొందితే నాకూతురు అందుకు నేనెంతో సంతోషిస్తాను.
ఏం నా కూతురైతే ఆ న్యాయమా..? రేపు నా కోడలొస్తే, అప్పుడు నా కోడలెక్కడ సుఖపడాలి నా దగ్గర సుఖపడాలి, మామగారినైనందుకు ఏమిటి నా పెద్దరికం నా కోడలు ఎక్కువ సంతోషించాలి ఒకసారి కూతురికి కొడుక్కీ కూడా పెళ్ళిచేశాకా కూతురూ అల్లుడు కొడుకూ కోడలు నలుగుర్నీ తీసుకొని పండక్కి బట్టలుకొనడానికి వెళ్ళాననుకోండి నేనైతే నా జీవితాంతం అంతే నా కూతురు ఎలాగైతే అత్తవారింటిలో సుఖపడాలని కోరుకుంటానో, ఒకవేళ నా కూతురూ వాళ్ళ వదినా ఇద్దరూ కలిసి

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
అంటే కూతురూ కోడలు కలిసి ఇద్దరూ పదేసివేల రూపాయలు పట్టుచీరలే కొనుక్కున్నా నేను మాత్రం నా కోడలి బిల్లు ఐదు పది ఎక్కువేసుకుని బిల్లు ఇచ్చేస్తాను. కోడలు కోడలే ఆ అమ్మాయి నా దగ్గర సుఖపడాలి నా కూతురూ అత్తవారింట్లో సుఖపడాలి. నీ కూతురైతే అత్తవారింట్లో సుఖపడాలని కోరికా నీ కోడలైతే నీ దగ్గర సుఖపడకుండా బాధపెడతావా? తప్పుగదా అది ఈ మర్యాదా మీరు గమనించగలిగితే ఎంత అందంగా ఉంటుందో, సీతమ్మ తల్లియందు కైకమ్మకి ఏ బేధమూలేదండీ అనడానికి గుర్తేమిటో తెలుసాండీ... సీతమ్మతల్లికి అలంకారము ఎవరూ చేయక్కరలే ఆవిడే చేసుకుంటుంది. కాదటా కౌసల్యా సుమిత్రా కైకేయీ ముగ్గురు కలిసి ఆవిడ యొక్క జడ దువ్వారటా... ఆవిడకి కొప్పు వేశారటా ఆవిడకి పూలు పెట్టారటా ఆవిడకి కాటుక పెట్టారటా ఎంత పొంగిపోయారో ముగ్గురత్తగార్లు ఇంత గొప్ప కోడలు మా కోడలు వంశప్రతిష్ట నిలబెట్టిందని అత్తగారు మామ గారూ అంటే కోడల్ని అంత ప్రేమిస్తారని శాస్త్రవాక్కు.
కాబట్టి వాళ్ళు ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథ స్త్రియః ! ఆత్మ నైవ తదా చక్రు ర్మనస్విన్యో మనోహరమ్ !! శ్రీరామాయణం అందుకే కేవలం వినేదికాదూని నేను మీకు మనవిచేశాను శ్రీరామాయణం విన్నవాడి బుద్దిలో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది తతో వానర పత్నీనాం సర్వాసా మేవ శోభనమ్ ! చకార యత్నా త్కౌసల్యా ప్రహృష్టా పుత్ర లాలాసా !! ఇంత కాలం తరువాత కొడుకును చూసుకున్నటువంటి కౌసల్యా నా కొడుకు ఇవ్వాళ ఈ అభ్యున్నతిని పొందడానికి కారమమైనటువంటివాడు వానర నాయకుడైన సుగ్రీవుడు రాక్షస నాయకుడైన విభీషణుడనీ పట్టు పట్టీ వానర నాయకుడైన సుగ్రీవుడి యొక్క భార్యలకి అలంకారాలు చేసిందటా... వాళ్ళు కామ రూపులు మానవ రూపంలో ఉన్నారు. ఇప్పుడు రామ చంద్ర మూర్తిని శత్రుఘ్నుడు ఒక రథాన్ని పూంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి అన్నయ్యా రథమెక్కూ అన్నాడు తతః శత్రుఘ్న వచనాత్ సుమన్త్రో నామ సారథి ! యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగ శోభనమ్ !! అర్క మండల సంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమమ్ ! ఆరురోహ మహా బాహూ రామః సత్య పరాక్రమః !! ఆ సుమంత్రుడికి చెప్పీ ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైనటువంటి గుఱ్ఱములతో పూంచినటువంటిదాన్ని సూర్యమండలంలోలా ఉన్నటువంటిదాన్ని అక్కడ పెట్టాడు. మహానుభావుడైనటువంటి రామ చంద్ర మూర్తి ఆ రథాన్ని అధిరోహించారు, సుగ్రీవుడు హనుమంతుడు మొదలైనటువంటివాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటివారై ఆ నంది గ్రామం దగ్గర్నుంచి అయోధ్యాపట్టణానికి బయలుదేరారు.
అలాగే సుగ్రీవ పత్నులు సీతమ్మతల్లితో కలిసి ఆ నగర వీధులన్నీ చూడడంకోసమనీ వాళ్ళూ బయలుదేరారు. ఇప్పుడు రామ చంద్ర మూర్తి పట్టాభిషేకం కోసం నంది గ్రామం నుంచి అయోధ్యవరకు అందరూ కలిసి బయలుదేరారు, ఈ రథం వెడుతుంటే మనం లోకంలో రెండు పన్లు చేయడానికి చాలా సిగ్గుపడిపోతాము ఒకటి నేను ఆ పదవిని కించపరచట్లేదూని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి డ్రైవర్ పోస్టు చేయడమంటే ఓ చిన్న తనము ఒక మెసెంజర్ పోస్టు చేయడమంటే ఒక చిన్నతనము. కోరి కోరి ఈశ్వరుడు చేసినవి ఈ రెండే పైగా అవి బిరుదుల కింద పెట్టుకున్నాడు ఆయనా నేను ʻపాండవ ధూత పార్థ సారథిʼ నేను పార్థునకి డ్రైవర్ని, పాండవులకి మెసెంజర్నీ అని ఆయన ఆ రెండింటినే బిరుదునామాలుగా స్వీకరించాడు.

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
నిజానికి ఎంత గొప్పవాడైనా వాడి భద్రత ముందు కూర్చుని నడిపేవాడిచేతులోనే కదాండీ ఉండేది, కాబట్టి ప్రేమా అన్నమాటకి అర్థం చూడండీ మనం కూడా రాజ కుమారులమేగా మనం రథం తోలడమేమిటీ అసహ్యంగాను అనుకోలేదు వాళ్ళ ప్రేమ అటువంటిది, అన్నయ్యా ఇంత కష్టపడి వచ్చాడు మా అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కళ్యాన్ని పట్టుకున్నాడు అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి భరతుడు, ʻగుఱ్ఱము యొక్క కళ్ళెములను పట్టుకుంటేʼ శత్రుఘ్నుడు, శ్రీ రాముని యొక్క శిరస్సుమీద ఛత్రమును పట్టుకున్నాడు వెనక, లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజామరము వేస్తున్నాడు, విభీషణుడు ఇంకొక వింజామర తీసుకుని వేస్తున్నాడు. భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులతో ఎంత వైభవోపేతంగా శ్రీ రామ పట్టాభిషేకం జరగాలన్నది ఆలోచన చేస్తున్నాడు.
ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములనందర్నీ చూస్తేటా... ఇద్దరి కళ్ళంబడ నీళ్ళు కారాయటా... ఒకడు సుగ్రీవుడు ఇంకొకడు విభీషణుడు. విభీషణుడనుకొన్నాడు అయ్యో మేము ముగ్గురం అన్నదమ్ములం రావణ కుంభకర్ణ విభీషణులు లోకాన్నంతట్నీ శాశించగల మొనగాళ్ళం కానీ మా అన్నయ్యలు దారితప్పారు దెబ్బలాడుకున్నాం, ఆఖరికి ఇద్దరన్నయ్యలు మరణించారు నేను ఒక్కన్నే మిగిలాను. జగజ్జట్టి మా అన్నయ్య వాలి, ఆ అన్నయ్యాపోయాడు నేనొక్కన్నే మిగిలాను, ఈ భాత్రుప్రేమ నా జీవితంలో తెలియదు, మేమెప్పుడూ దెబ్బలాడుకోవడం కొట్లాడుకోవడం చచ్చిపోవడం, ఎవడో ఒకడు మిగలడం. అన్నదమ్ములంటే వీళ్ళు పెద్దన్నగారిపట్ల ఎంత గౌరవంతో జీవించారో ఎంత మర్యాదగా జీవించారో అనీ ఈయన ఎంత సంతోషించాడో మహానుభావుడు అందుకే ఆ అన్నదమ్ములు ఆ అన్నదమ్ముల బిడ్డలు ఆ ప్రేమా అవి చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. హరిప్రసాదుగారు వాళ్ళన్నగారు వచ్చినరోజున నా దగ్గరికొచ్చి అంత గౌరవంగా వాళ్ళన్నగారి గురించి నా చెవిలో చెప్పి వాళ్ళన్నగారిని అంత వినయంగా పిలిచి నాకు దండేయించి, వాళ్ళన్నగారి కొడుకు నాకు దండేస్తున్నప్పుడు వాడొచ్చాడు అని ప్రేమగా కొడుకు కాబట్టి చెప్తూంటే నాకు ఎంత ఆనందమేసిందో అన్నదమ్ములమధ్యా అన్నదమ్ముల బిడ్డలమధ్యా సఖ్యత ఉంటే అదొక గొప్ప  బలం గొప్ప సంతోషం.
కాబట్టి ఇప్పుడు ఆ రథం బయలుదేరింది మరుద్గణములు మరుద్గేవతలు ఋషులు అందరు ఆకాశంలో నిలబడి రామ చంద్ర మూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారు. నంది గ్రామం నుంచి ఊరెరిగింపు బయలుదేరింది అయోధ్యవరకు, ఎప్పుడూ కూడా ఊరెరిగింపు ముందు పెద్దవాళ్ళు కొంతమంది వెళ్తూండాలి, తప్పా ఊరెరిగింపునకు ముందు పెద్దవాళ్ళు లేకుండా ఊరెరిగింపు వెళ్ళకూడదు. మనకది రామాయణమే నేర్పుతుంది అందుకనీ రాజైనవాడు పెద్దవాడు మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు కూర్చునేటటువంటి శత్రుంజయము అనబడేటటువంటి ఏనుగుమీద సుగ్రీవున్ని కూర్చోబెట్టారు ముందు భాగంలో ఆయన్ని నడిపించారు తూర్యవాద్యములు ఖరతాల ధ్వనులచేసేవాళ్ళు మంచి స్వస్తివాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మనోత్తములు ఆ ముందర వెడుతున్నారు. అక్షతలు పట్టుకున్నటువాళ్ళు కొందరు బంగారు పాత్రలు పట్టుకున్నవారు కొందరు ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి ఆవుల వెనకా కన్యలు నడిచారు అక్షతం జాతరూపం చ గావఋ కన్యా స్తథా ద్విజాః ! నరా మోదక హస్తా శ్చ రామస్య పురతో యయుః !! ఆ వెడుతున్నటువంటివాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు పిండిపదార్థాలు పట్టుకుని వెడుతున్నారు. ముందు కన్నెలు వెడుతున్నారు కన్నెల వెనక సువాసినీలు వెడుతున్నారు సువాసినీల వెనుక పురుషులు వెడుతున్నారు మధ్యలో రామ చంద్ర మూర్తి రథంలో కూర్చుని వెడుతున్నారు ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరి పెద్దలు ఉన్నారు.

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
ఎలా ఊరెరిగింపు వెళ్లాలన్నది కూడా మనకు రామాయణం నేర్పుతుంది ఇవ్వాళ ఊరెరిగింపు మనం అలాగే వెళ్ళాం కదాండీ... పట్టాభిషేకానికి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాం, నేను మీతో మనవిచేసింది అదే సుగ్రీవుడికి నా అంతఃపురాన్ని ఇయ్యి అని అన్నాడు. ఆయన్ని తీసుకెళ్ళి రామ చంద్ర మూర్తి యొక్క అంతఃపురాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇచ్చారు, ఎంత స్నేహ ధర్మం చూపిస్తాడో చూడండి. కానీ వెళ్ళే ముందు హంసతూలికా తల్పము అన్నీ దానం చేసేశాడుగా ఏమీ లేవు అందుకని భరతుడు గబగబా తల్పాలు పరుపులు అన్నీ తెప్పించి అప్పటికప్పుడు సిద్ధం చేశాడు. అందరు చక్కగా సుగ్రీవుడు ఆ భవనంలో చేరారు ఎన్ని కోట్ల వానరములో ఎంత మంది రాక్షసులొచ్చారో విభీషణుడొచ్చాడు దేవతలొచ్చారు రామ చంద్ర మూర్తి పట్టాభిషేకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టమేమిటో తెలుసాండి జామ్బవాం శ్చ సుషేణ శ్చ వేగదర్శీ చ వానరాః ! ఋషభశ్చైవ కలశాన్ జల పూర్ణాన్ అథానయన్ !! ఐదువందల నదుల జలములు ఉంటే పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుందీ అన్నారు, పట్టాభిషేకం వేరు ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్యా కలశపట్టుకునీ మంగళ ధ్వనితో వచ్చి కలశ ఇవ్వాలి, కన్యె తెచ్చిన కలశతో అభిషేకం చెయ్యాలి. అందుకే కదూ మనం వెదికీ మరీ మంగళ ధ్వనులతో ఒక కన్యకా మణితోటి ఇద్దరితోటీ కలశలు పట్టింపించి ఆ కలశలతోటి రామ చంద్ర మూర్తికి అభిషేకం చేశాం.
లోకంలో అభిషేకం జరిగేటప్పుడు అందునా రేపే పట్టాభిషేకం అంటే ఐదువందల నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి ఏం చేస్తారంటే మంత్ర పురస్కరంగా ఆవాహన చేస్తారు గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ! నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ నన్నిధిం కురు !! అంటే వస్తున్నాయనే కదా దానర్థం. అందుకనీ మంత్రమునకు ఆ శక్తుంది. కాబట్టి అలా ఆవాహన చేస్తారు కాని రామ చంద్ర మూర్తి పట్టాభిషేకంలో అలా చెయ్యలేదు ఎందుచేతానంటే అత్యంత బలమైన వానరులున్నారు, భరతుడు అన్నాడు మా అన్నయ్యా పట్టాభిషేకాని ఐదువందల నదుల జలాలు కావాలన్నాడు వెంటనే సుగ్రీవుడు వానరోత్తములందర్నీ పిలిచీ మీ అందరూ వెళ్ళి ఐదువందల నదుల జలాలు తీసుకురండీ అన్నాడు, వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు బ్రాహ్మీ ముహూర్తంలో అంతే చక్కగా పట్టాభిషేకం వేల్టికి మంటపంలోకి ఐదు వందల జలాల్నీ వాళ్ళు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారో తెలుసాండీ... మామూలుగా తీసుకురాలేదు పట్టాభిషేక సర్గ అందుకే శ్రీ రామ నవమినాడు పారాయణ చేస్తారు. ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు ఏ పవిత్రవస్తువు కనపడితే దాన్ని అచ్చాదించి తీసుకొచ్చారు, ఎర్ర చందనపు కొమ్మలు కనపడ్డాయనుకోండి వాళ్ళు తెస్తున్న కళశం మీద ఎర్ర చందనపు కొమ్మలని అచ్చాదించి తీసుకొచ్చారు అలా ఆ నదులు జలాలని తీసుకొచ్చారు నదీ శతానాం పంచానాం జలం కుమ్భేషు చాఽఽహరన్ ఐదు వందల నదులతో అభిషేకం జరిగినవాడు రామ చంద్ర మూర్తి ఒక్కరే.

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
పూర్వాత్ సముద్రాత్ కలశం జల పూర్ణమ్ అథానయత్ ! సుషేణః సత్త్వ సంపన్నః సర్వ రత్న విభూషితమ్ !! సుషేణుడు పూర్వత్ అంటే పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు ఋషభో దక్షిణాత్ తూర్ణం సముద్రా జ్జలమ్ ఆహరత్ ! రక్త చన్ద నకర్పూరైః సంవృతం కాంచనం ఘటమ్ !! ఆయనా ఋషభుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు సముద్రా జ్జలమ్ ఆహరత్ అక్కడ్నుంచి ఆ దక్షిణ సముద్రంలో ఉండేటటుంటి నీళ్ళు తీసుకొస్తూ దక్షిణ దిక్కున రక్తచందన వృక్షాలు ఎర్రచందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓ కొమ్మ ఒకదానిని విరిచి ఆ కలశమీద పెట్టి తీసుకొచ్చాడు చక్కగా గవయః పశ్చిమాత్ తోయమ్ ఆజహార మహార్ణవాత్ ! రత్న కుమ్భేన మహతా శీతం మారుత విక్రమః !! గవయుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చల్లటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు ఉత్తరా చ్ఛ జలం శీఘ్రం గరుడానిల విక్రమః ! ఆజహార స ధర్మాత్మా నళః సర్వ గుణాన్వితః !! హనుమా ఐదు వందల నదుల జలాలు తీసుకొచ్చేటప్పుడు గబగబా వెళ్ళి నీళ్ళు పట్టుకొచ్చారు మళ్ళీ ఆయనే ఉత్తర దిక్కుకు వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాల్నీ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు చక్కగా నాలుగు వైపులా ఉన్నటువంటి సముద్రజలాలూ ఐదు వందల నదీ జలాలూ తీసుకొచ్చి అక్కడ పెట్టారు మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు వసిష్ఠో వామదేవ శ్చ జాబాలిః అథ కాశ్యపః ! కాత్యాయనః సుయజ్ఞ శ్చ గౌతమో విజయ స్తథా !! అక్కడికి వచ్చినటువంటివాళ్ళు వసిష్టుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు అభ్యషించన్ నర వ్యాఘ్రం ప్రసన్నేన సుగన్ధినా ! సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా !! ఆయన ఆ కలశలయందు ఓషధీ రసమును అని నింపారు.
నేను అందుకే ఓషధీ రసములు వేయండీ అని ఇవ్వాళ ఓషధీ రసములులతో అభిషేకం చేశారు, పట్టాభిషేకంలో తప్పకుండా ఓషధీ రసములను వాడాలని పట్టాభిషేకమూ అంటే యదార్థానికి ఆ అభిషేకమే, ఆ అభిషేకానికే అంత శక్తి. కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారట రామ చంద్ర మూర్తికి అంతే లోకమంతా చల్లబడిపోయిందని. ఒక్కసారి చల్లబడిపోయింది అంటే ఆ రామ చంద్ర మూర్తి యొక్క శక్తి అటువంటిది పట్టాభిషేకము జరిగితే ఆయన రాజా రాముడైనాడు కాబట్టి రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది. అందరి మనసులు ప్రసన్నమైపోయాయి బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్న శోభితమ్ ! అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్త తేజసమ్ !! అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేది మీద ఉంచారు మొట్ట మొదట ఇదే మకుటధారణ సర్గా అంటారు ఈ సర్గనే పట్టాభిషేక సర్గా మకుటధారణ సర్గా అని పిలుస్తారు. ఇదీ యదార్థంగా ఏమిటంటే శ్రీరామ నవమినాడు కళ్యాణం చెయ్యడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చెయ్యడం అంత అవసరం. ఆరోజు ఉదయమే అందరూ కలిసి దేవాలయంలో కూర్చుని రామ నామం ప్రారంభం చేస్తారు ప్రారంభం చేసి సాయంకాలం వరకూ చక్కగా రామ నామం చేసి పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గని పారాయణం చేసి స్వామివారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు కదా ఆ మకుటధారణ సర్గ చదివేటప్పుడు కేవలం మనసుతో చూడమని చెప్తారు, మనసుతో చూసి ఈ కిరీట ధారణకి సర్గకి సంబంధించి మూడు శ్లోకాలు ఉంటాయి ఈ మూడు శ్లోకాల్నీ అందరితోటీ చెప్పిస్తారు ఓసారి, మిగిలిన సర్గా ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గనంతట్నీ చెప్పేస్తారు. కానీ శ్లోకాలు మాత్రం అందరితోటీ చెప్పిస్తారు.

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
మహానుభావుడు పరమాచార్య స్వామివారు శరీరంతో ఉన్న రోజుల్లో వారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ రామ నవమినాడు ఆలా చేయిస్తుండేవారు, ఈ సంవత్సరం కాకినాడ పట్టణం అయ్యప్పస్వామి దేవాలయంలో మేము అలా చేసి సాయంత్రం మకుటధారణ సర్గ పారాయణ చేసేవాళ్ళము దాని అనుగ్రహమో ఏమో ఇతః పూర్వం పట్టాభిషేకం చెప్పడం జరిగింది కానీ ఎక్కడా కూడా నిజంగా ఆరోజు రామ చంద్ర మూర్తి లక్ష్మణ స్వామీ సీతమ్మ తల్లీ హనుమా అంటే భరతునికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు కాబట్టి భరతుడు అని చెప్పవలసి ఉంటుంది కిరీట ధారణకి ఆ నలుగురికి ధారణ చేసేటటువంటి కిరీటములు ఏవున్నాయో లేకపోతే రాముడు పెట్టుకోవలసిన ప్రధానమైన కీరీటము ఏముందో ఆ కిరీటాన్ని చూస్తూ ఆ శ్లోకాలు చెప్పడమనేటటువంటిది ఇప్పటివరకూ ఎప్పుడూ చెయ్యడం జరగలేదు ఎందుకంటే అలా కిరీటం తీసుకొచ్చి పెట్టి చేయించడం కుదరదుగనుకా, కానీ ఇవ్వాళ మొట్ట మొదటిసారిగా నిజంగా పట్టాభిషేక సర్గవేల్టికీ యాదార్థంగా అలాగే వేదిక మీదికి తీసుకొచ్చి ఆ కిరీటములను అక్కడ పెట్టీ మకుట ధారణ సర్గ చెప్తూ మీ అందరితో ఈ శ్లోకాలు చెప్పించేటటువంటి అదృష్టాన్ని రామ చంద్ర మూర్తి ఇవ్వాళ కృపచేశాడు. కాబట్టి వాల్మీకి మహర్షి అంటారు బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్న శోభితమ్ రత్నములచేత శోభించేటటువంటి ఆ కిరీటము చతుర్ముఖ బ్రహ్మగారిచేత నిర్మింపబడినటువంటి కిరీటము తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః ! సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః !! అనేకమంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదికమీద రామ చంద్ర మూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ట మహర్షి రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుసోభనైః ! నానారత్న మయే పీఠే కల్పయిత్వా యథావిధి !! అనేకమైన రత్నములు పొదగబడినటువంటి స్వర్ణకిరీటము ఆ కిరీటము కిరీటేన తతః పశ్చాద్వసిష్ఠేన మహాత్మనా ! ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః !! మిగిలినటువంటి వారందరూ ఏక కంఠంతో స్వస్తివాచకం పలుకుతూండగా వశిష్ట మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామ చంద్ర మూర్తి యొక్క శిరస్సమీద అలంకరించారు.
అదీ మకుట ధారణమూ అంటారు అటువంటి స్థితీ రామ చంద్ర మూర్తి ఆరోజున పొందారు ఈ శ్లోకాల్ని పట్టాభిషేకం చెప్పేటప్పుడు మీరు చెప్పడం కాదు ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాల్నీ అందరూ చెప్పినప్పుడు ఏమౌతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరిపట్ల రాముడు రాజా రాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడుతాడని పెద్దలవాక్కు. కాబట్టి నేనంటాను మీరు అనండి.
(సుబ్రహ్మణ్య శర్మగారూ వేదికమీదికి వచ్చి అర్చక స్వామి ఏదీ రామాలయ అర్చకస్వామి రామాలయ అర్చకస్వామి ఏదండీ, శ్రీనివాసుగారు మీరు రండి మీరు రండి... మీ ముగ్గురూనూ మీరు రండి మీరు నలుగురూ నాలుగు కిరీటాలు ఎత్తి పట్టుకోండి నేను శ్లోకాలు చెప్తాను వాళ్ళందరూ కిరీటాలు చూస్తారు, అపురూపమైన అవకాశం మళ్ళీ ఇలా వాళ్ళకి ఆ అదృష్టం కలగద్దూ... నాలుగు కిరీటాలు ఎత్తి పట్టుకోండి చూస్తూ వాళ్ళు ఆ శ్లోకాలు చెప్తారు. అయ్యా అందరూ చెప్పండీ... నేను అనుష్ఠుప్పే కాబట్టి చాలా తెలిగ్గా వుంటుంది కాబట్టి మీ అందరూ కూడా అనండి, అందరికి కనపడేటట్టుగా పట్టుకోండి ఆచార్యులుగారు

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్న శోభితమ్ ! అభిషిక్తః పురా యేవ మనుస్తం దీప్త తేజసమ్ !!
తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః ! సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః !!
రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుసోభనైః ! నానారత్న మయే పీఠే కల్పయిత్వా యథావిధి !!
కిరీటేన తతః పశ్చాద్వసిష్ఠేన మహాత్మనా ! ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః !!
అవి అక్కడ పెట్టి అయ్యా... ఆ హారాలు తీసి చూపించండి, అనేకములైన రత్నములతో కూడిన కిరీటములు వేదికమీద ఉన్నాయి అన్నారు. పూర్ణంగా రామానుగ్రహం కలిగింది ఇవ్వాళ, అనేక వజ్రవైఢూర్యములు పచ్చలు కెంపులు మొదలైనటువంటివి పొదగబడి ఇవ్వాళ రామ లక్ష్మణులకు ఆ హనుమకు సీతమ్మకు అలంకరింపబడడానికి సిద్ధమై వచ్చినటువంటి అమూల్యమైనటువంటి నూతన ఆభరణములు వాటితో రత్నములతో కూడినటువంటి కిరీటములు యదార్థముగా ఉన్నాయి అంటే పరిపూర్ణంగా రామానుగ్రహం కలిగి వేదిక అలా సిద్ధమయ్యిందీని గుర్తు. అవి అక్కడ ఉంచి మీరు కూర్చోవచ్తు. ఇప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని క్షత్రమును పట్టుకున్నాడు, సుగ్రీవుడు తెల్లని వింజామరలతో వీస్తున్నాడు, విభీషణుడు చంద్ర కాంతులీనుతున్నటువంటి మరొక వింజామరని తీసుకున్నాడు దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి నూరు పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు, పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నం గంధర్వులు గానం చేశారు, ఇవ్వాళ మనకు కూడా గంధర్వగానమే చేశారు మధ్యాహ్నం, యదార్థమైనటువంటి పట్టాభిషేకం ఆనాడు అయోధ్యలో జరిగితే మళ్ళీ ఆ తరహా ఇవ్వాళ గుంటూరులోనే ఇవ్వాళే జరుగుతుంది. రామ చంద్ర మూర్తి ఎంతో సంతోషించారు లోకమంతా చల్లబడిపోయింది అందరి మనసులు చల్లబడిపోయాయి ఎక్కడ చూసినా ఆనందమే లక్షల సంఖ్యలో గుఱ్ఱములను పాడి ఆవులను వందల కొలది వృశభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు రామ చంద్ర మూర్తి. ముప్పైకోట్ల బంగారు నాణ్యములను అమూల్యమైనటువంటి ఆభరణములను వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాడు, సుగ్రీవునికి మణులు పొదిగినటువంటి ఒక గొప్ప హారాన్ని బహూకరించాడు వైడూర్య మణి చిత్రే చ వజ్ర రత్న విభూషితే ! వాలి పుత్రాయ ధృతిమాన్ అంగదా యాంగదే దదౌ !! మంచి రత్నములు వైడూర్యములు వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భూజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు.
అందరికీ అన్నీ ఇచ్చేశాడు, సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేసేశాడు రామ చంద్ర మూర్తి ఇంత మందీ ఇన్ని పుచ్చుకున్నాక, మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేతులో పట్టుకుని ఇలా రాముని వంక చూసింది మాట్లాడితేనే అర్థమౌతుందా ఆయన మనసు ఆవిడ దగ్గరుంది ఆవిడ మనసు ఆయన దగ్గరుంది అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం ! తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి !! ఒకరి మనసు ఒకరిదగ్గర ఉన్న దాంపత్యం ఆ దాంపత్యం. కాబట్టి వెంటనే రాముడన్నాడు సీతా నీవు ఆ హారాన్ని మెడలోంచి ఎందుకు తీశావో నాకు తెలుసు
ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని ! పౌరుషం విక్రమో బుద్ధి ర్యస్మి న్నేతాని సర్వశః !!
దదౌ సా వాయు పుత్రాయ తం హారమ్ అసితేక్షణా ! హనూమాం స్తేన హారేణ శుశుభే వానరర్షభః !!
చన్ద్రాంశు చయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః !

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
వెంటనే ఆ తల్లి తన చేతులో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది వేంటనే హనుమా ఆ హారాన్ని మెడలో వేసుకున్నారు చంద్ర కిరణములు పడినడినటువంటి మేఘమెలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదాండి ఉంటాడు కాంచనా కమనీయ విగ్రహాం ఆ హారములు వేసుకున్నటువంటి హనుమా అలా మెరిసిపోయారు కాంతితోటి ఆయనేదో కొరికారు రామ నామం లేదని అవతల పారేశారు అటువంటి పిచ్చిపనులు ఆయన చేయరు, ఆయన చక్కగా దాన్ని మెడలో ధరించారు ఇప్పుడు రామ చంద్ర మూర్తి లక్ష్మణుని వంకచూసి అతిష్ఠ ధర్మజ్ఞ మయా సహేమాం గాం పూర్వ రాజాధ్యుషితాం బలేన తుల్యం మయా త్వం పితృభి ర్ధృతా యా తాం యౌవ రాజ్యే ధుర ముద్వహస్వ ! మన పూర్వ రాజులందరూ అధిష్టించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో నాతోపాటు బాధ్యత పంచుకోవడానికి కర్తవ్యాన్ని నిర్వహించడానికి లక్ష్మణా ధర్మము తెలిసున్నవాడా..! ధర్మజ్ఞ మయా సహేమాం గాం పూర్వ రాజాధ్యుషితాం బలేన యవ్వరాజ్యం తీసుకో అన్నాడు. అంటే అన్నయ్యా నాకు నీ కైంకర్యం కావాలికానీ నా కన్నా పెద్దవాడు భరతుడు ఉండగా నాకెందుకన్నాయ్యా యవ్వరాజ్యం నాకొద్దన్నయ్యా భరతుడికివ్వమన్నాడు. ఎంత బ్రతిమాలినా తీసుకోలేదు ఏదో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు ఏదో అన్నయ్య నన్ను అడగనన్నా అడగలేదు అనుకుంటాడేమోనని ʻధర్మం తెలుసున్నవాడా!ʼ అని అడిగాడు.
ధర్మం తెలియడం అంటే అంత జాగ్రత్తాగా ఉండడం అని అర్థం, ధర్మం తెలిసుండడమంటే పెద్దలు ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ప్రవర్తించకపోతే దోషమొస్తుంది అందులో, కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నయ్యా భరతుడు పెద్దవాడు ఆయనకిమ్మన్నాడు భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు. స పర్యదేవన్ విధవా న చ వ్యాళ కృతం భయమ్ ! న వ్యాధిజం భయం వ్యాపి రామే రాజ్యం ప్రశాసతి !! మహానుభావుడైనటువంటి రామ చంద్ర మూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత పదుకొండువేల సంవత్సరములు ఈ భూమండలం మీద ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాజ్యం పరిపాలన చేశారు. పౌడ్ణరీకము అశ్వమేధము వాజపేయము ఇతరమైనటువంటి అనేక యజ్ఞ యాగాది క్రతువుల్ని చేశాడు. ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవ్వడమనేటటువంటిది లేదు ఎవరికీ కూడా క్రూర సర్పములవన కానీ క్రూర మృగాలవలన కానీ భయం కలగలేదు ఎవరికీ ఎన్నడూ ఏదీ రోగం కలగలేదు అటుంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. న చ స్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాణి కుర్వతే ఎన్నడు కూడా రామ రాజ్యంలో చిన్న పిల్లవానికి అంతకన్నా పెద్దవాడు ప్రేత కార్యం చెయ్యడం అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంతేష్టి సంస్కారం చెయ్యడమన్నది ఎన్నడూ జరగలేదు.
అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తూంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించారు ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్త్రిణః ! నిరామయా విశోకా శ్చ రామే రాజ్యం ప్రశాసతి !! అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా మూడు తలరాల్ని చూసి ఒక్కొళ్ళకి బోలేడుమంది కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్లు మళ్లీ  ఆ మనమలకి పెళ్లిలై ఆ ముని మనమలకు పెళ్లిల్లై వాళ్ళ మనమళ్ళు ఇంతగొప్ప మందితో ఒక్కొక్క కుటుంబంతో బాలసార జరిగితే వాళ్ళింటిముందు

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
వచ్చిన వాళ్ళ బంధువులేకాదు వీళ్ళు మళ్ళీ వాళ్ళ వియ్యాలవారు మళ్ళీ వాళ్ళ తాలూకా బంధువులు ఇంతమంది కలిసి ఎంతో సంతోషంగా ఎక్కడ చూసినా రామో రామో రామో రమ ఇతి ప్రజానా మభవన్ కథాః ! రామభూతం జగదభూ ద్రామే రాజ్యం ప్రశాసతి !! రాముడు రాజ్యం చేస్తున్న రోజులలో ఎవరినోటవిన్నా ఒక్కటే మాట రామా! రామా! రామా... ఇది తప్పా ఇంకొక మాటలేదు. అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోధెలతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాయి అన్ని వర్ణములవారు దురాశలేనివారై ఎవరెవరి ధర్మాన్ని వారు అనుష్టిస్తూ సంతృప్తితో జీవించారు దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ! భ్రాత్రుభిః సహితః శ్రీమాన్ రామో రాజ్య మకారయత్ !! 11వేల సంవత్సరములు తన యొక్క తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి రామ చంద్ర మూర్తి ఈ రాజ్యాన్ని పరిపాలన చేశారు.
ఆది కావ్య మిదం త్వాఽఽర్షం పురా వాల్మీకినా కృతం ! యః పఠే చ్ఛృణుయా ల్లోకే నరః పాపా ద్విముచ్యతే !! ఆర్షం పరమ సత్యము ఇందులో ఒక్క అక్షరము కల్పితముకాదు యదార్థముగా జరిగిన గాధ, చతుర్ముఖ బ్రహ్మగారి వరముచేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుని ఘంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు రాక్షసులు స్త్రీలు అందరూ చేసినటువటువంటి పనులతోపాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యాయి. ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నిటినీ తెలుసుకుని రచించినటువంటి కావ్యము తప్పా కేవలముగా కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు. యదార్థముగా జరిగిన కథా రామ కథా కాబట్టి ఇది ఇది కావ్యము భార్య భర్తతో మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందో అటువంటి భాషలో చెప్పబడిన కావ్యం సర్వ ధర్మములు పొదగబడినటువంటి కావ్యం ఈ కావ్యాన్ని ఎవరు వింటున్నారో పుత్ర కామ స్తు పుత్రా న్వై ధన కామో ధనా నపి ! లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం !! ఎవరు ప్రత్యేకించి రామ చంద్ర మూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారో పట్టాభిషేకంలో పాల్గొంటున్నారో రాజా రాముడిగా కూర్చున్నటువంటి రోజున జరుగుతున్నటువంటి పూజా సభలో ఉంటారో ఎవరెవరు సంపూర్ణంగా రామాయణాంతంట్నీ పరమ సంతోషంతో చెపుతున్నటువంటి వ్యక్తికన్నా కింది స్థానంలో కూర్చుని పరమ మర్యాదతో నమ్మకంతో కూడిన బుద్ధితో నమస్కరిస్తూ వింటారో అటువంటివారికి పుత్ర కామ స్తు పుత్రా న్వై అటువంటివారికి కొడుకులు కావాలంటే కొడుకులు కలుగుతారు ధన కామో ధనా నపి ధనం కావాలి అంటే ధనం కలుగుతుంది, మహీం విజయతే రాజా ఈ భూమండలాన్ని గెలవాలని రాజులు అనుకుంటే రామాయణాన్ని వింటే వాళ్ళు భూ మండలాన్ని గెలుస్తారు రిపూం శ్ఛాప్యధీ తిష్ఠతి శత్రువుల్ని గెలుస్తారు రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణే న చ ! భరతేన చ కైకేయీ జీవ పుత్రా స్తథా స్త్రియః !! (భవిష్యంతి సదా నందాః పుత్ర పౌత్ర సమన్వితాః) కౌసల్యా సుమిత్రా కైకేయీ ఎలా కొడుకులతో చక్కగా కొడుకులు బ్రతికుండగా ఆ కొడుకుల్ని చూసి సంతోషించి ప్రయోజకులైన కొడుకులని తల్లి సంతోషించిందో అలా రామాయణాన్ని పఠణం చేసిన వాల్లందరికీ కూడా బిడ్డలు ప్రయోజకులై ఆ తల్లులూ ఆనందాన్ని పొందుతారు.
శ్రుత్వా రామాయణ మిదం దీర్ఘ మాఽఽయు శ్చ విందతి ! రామస్య విజయం చైవ సర్వమక్లిష్ట కర్మణః !! ఎవరు హేలగా పనులు చేయగలిగినటువంటి రామ చంద్ర మూర్తి యొక్క వైభవంతో కూడిన ఈ రామాయణాన్ని సంపూర్ణ రామాయణాన్ని వింటున్నారో అటువంటివారు దీర్ఘాయుర్దాన్ని పొందుతారు సమాఽఽగమం ప్రవాసాన్తే లభతే చాపి బాన్ధవైః

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
! ప్రార్థితాం శ్చ న్సర్వా న్ప్రాప్ను యా దిహ రాఘవాత్ !! ఎవరు ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటివారికి దూర దేశంలో ఉన్నటువంటివారితో సమాగమం సిద్ధిస్తుంది వారు తొందరలో తమకి అత్యంత ప్రాణ ప్రియులైనవారెవరున్నారో వారందరిని కలుసుకుంటారు కలుసుకుని సంతోషాన్ని పొందుతారు శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే సంప్రశ్రుణ్వతాం ! వినాయక శ్చ శామ్యంతి గృహే తిష్ఠంతి యస్య వై !! ఎవరైతే ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటివారి యెడల దేవతలందరు ప్రసన్నులౌతారు, అటువంటివారి యెడలా ఏవైతే ఉగ్రములైన భూతములున్నాయో అవన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి అరిష్టమైనటువంటి గ్రహములు తాము ఇచ్చేటటువంటి ఫలితములు ఏముంటాయో ఆ ఫలితములు ఇవ్వకుండా ఆపుచేసి వారు అభ్యున్నతిని పొందుతారు. విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ ! స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రా న్సూయు రనుత్తమాన్ !! రజస్వలయైనటువంటి స్త్రీ ఈ రామాయణాన్ని వింటే అంటే ఇంకా బిడ్డలు పుట్టవలసినటువంటి స్త్రీ వివాహమైనటువంటి ఆమె ఈ రామాయణ కావ్యాన్ని వింటే చాలా ఉత్తమైనటువంటి సంతానాన్ని పొందుతుంది.
పూజయంశ్చ పఠంశ్చేమ మితిహాసం పురాతనం ! సర్వ పాపైః ప్రముచ్యేత దీర్ఘ మాఽఽయుః ఆవాప్ను యాత్ !! ఎవరైతే ఈ శ్రీరామాయణ కావ్యాన్ని వింటున్నారో వాళ్ళకి అన్ని కోర్కెలు నెరవేరుతాయి, ఎవరికి ఏ కోర్కె తీరాలో ఏ అభ్యున్నతిని పొందాలో ఆ అభ్యున్నతి వాళ్ళకి కలుగుతుంది. అభ్యున్నతి కలగడం కాదండి మీకు నేనొక యదార్థం చెప్తున్నాను శ్రీరామాయణం వింటూండగా చెయ్యవలసిన సంస్కారం చెయ్యబడకపోతే ఆ సంస్కారం సశాస్త్రీయముగా చేయబడినదౌతుంది. షష్టిపూర్తి చేసుకోవలసినవాడు చేసుకోలేదనుకోండి సంపూర్ణ రామాయణం వింటే వాడు షష్ఠిపూర్తి చేసుకున్నట్లే. ఎవరు ఏ సంస్కారములను పొందాలో కాలంలో ఆ సంస్కారములను పొందకపోయినా రామాయణాన్ని విన్నటువంటి వాళ్ళకి ఆ సంస్కారములను పొందినటువంటి ఫలితమును ఈశ్వరుడు వారి ఖాతాలో వేస్తాడు శ్రీరామాయణానికి అంత శక్తి ఉంది. అందుకే రామాయణం చెప్తామన్నా రామాయణం విందామన్నా అంత తేలిక కాదు. సీతా రామ చంద్ర ప్రభువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటేతప్పా రామాయణం చెప్పడమూ కుదరదు రామాయణం వినడమూ కుదరదు.
నేను మీకొక యదార్థం మనవి చేస్తున్నాను ఇవ్వాళ నేను చెప్తున్నటువంటి ఈ రామాయణం, నేను చేస్తున్నటువంటి ఈ ప్రసంగాలు ఒక పదిహేనురోజుల క్రితం నేను ఆపు చేసేసి నేను వెనక్కి వెళ్ళిపోవాలి అంత పెద్ద ప్రమాదమొకటి వచ్చేసింది, నాకూ అసౌచమే వచ్చేస్తుంది అంత పెద్ద ప్రమాదమొకటి ఏర్పడింది, కానీ రామానుగ్రహం ఉంది నా తల్లి సీతమ్మతల్లి అనుగ్రహం ఉంది ఎవరి శరీరం విడిచిపెట్టేస్తే ఎవరికి ప్రమాదం జరిగితే నాకు అసౌచమొస్తుందో నేను రామాయణం చెప్పడానికి అనర్హత పొందుతానో... నేను రామాయణం చెప్పకుండా ఆపి మళ్ళీ మొదలు పెట్టవలసి వస్తుందో అటువంటి పరిస్థితి రాకుండా తట్టుకోగలిగినంత ఓపిక అసలు ఆయనకు లేకపోయినా ఈశ్వరుడు ఆయనకి ఆయుర్ధాయమిచ్చి కాపాడి రామాయణ ప్రవచనానికి అభ్యంతరం లేకుండా ఆయన నన్నూ నాకు అసౌచం రాకుండా ఆయుర్ధాయమిచ్చి ఆయన్నీ రక్షించేశాడు అంతే. అంటే శ్రీరామాయణం ఎంత శక్తివంతమో రామాయణాన్ని నమ్మి మొదలుపెడితే రామ చంద్ర మూర్తి అనుగ్రహం ఎంత పరిపూర్ణంగా ఉంటుందనడానికి ఇదే తార్కాణం. రామాయణం మొదలు పెట్టాక మీరే ప్రత్యక్షంగా చూశారు ఎన్ని ఘట్టాలలో ఎన్నిచోట్లా రామానుగ్రహం స్పష్టంగా కనపడిందో.

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
కాబట్టి పూజయంశ్చ పఠంశ్చేమ మితిహాసం పురాతనం ! సర్వ పాపైః ప్రముచ్యేత దీర్ఘ మాఽఽయుః ఆవాప్ను యాత్ !! దీర్ఘమైనటువంటి ఆయుర్ధాయాన్ని పొందుతారు సర్వపాపములు కూడా పోతాయి, ఇదీ అతి పవిత్రమైనటువంటి ఇతహాసము పురాతనమైన ఇతిహాసము ʻఇతి-హా-అసంʼ అంటే ఇది ఇలాగే జరిగినది. అందుకే రామాయణం సత్యమేమీ ఒక్క వాల్మీకి రామాయణమే సత్యము బ్రహ్మగారి వరం. ఇతి-హా-అసం ఇది ఇలా జరిగినది ఇది కల్పిత గాధ కాదు, ఇది సృష్టింపబడినది కాదు, కేవలము కల్పించి మీకు సంతోషాన్ని చేకూర్చచేదికాదు యదార్థముగా జరిగిన కథా. ఆప్పుడు జరిగిన కథా ఇప్పటికీ ఎందుకు చెప్తారంటే రామాయణ మిదం కృత్న్నం శ్రుణ్వతః పఠతః సదా ! ప్రియతే సతతం రామః స హి విష్ణుః సనాతనః !! సనాతనుడైన విష్ణువు రామాయణం చెప్పబడిన ప్రాంగణమెక్కడుంటుందో అక్కడ అపారమైన ప్రీతిని పొంది మిగిలిన దేవతలందరితో కలిసి స్వామి హనుమా రామ చంద్ర మూర్తి సీతమ్మా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ రామాయణం ప్రవచనం జరిగినటువంటి ప్రాంగణం మీద నిలబడి ఉంటారు, నిలబడి పట్టాభిషేక సర్గనాడు చూస్తూ ఉంటారు. పితృ దేవతలందరూ కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారట. పట్టాభిషేక సర్గ దగ్గరికి వచ్చేటప్పటికి రామాయణం అంత శక్తిని పొందుతుంది. కాబట్టి ఆది దేవో మహా బాహుః హరిః నారాయణః ప్రభుః ! సాక్షా ద్రామో రఘు శ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే !! ఆయన సహి విష్ణుః సనాతనః సనాతనుడైనటువంటి విష్ణువు యొక్క కథా ఆయన ఆది దేవుడు మహా బాహుః  హరి నారాయణుడు స్వయంగా ఆయన ప్రభువు సాక్షా ద్రామో రఘు శ్రేష్ఠః రఘు శ్రేష్ఠుడైనటువంటి ఆ రాముడే ఆ శ్రీ మహావిష్ణువు.
ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడ ఇప్పటికీ అక్కడికి పట్టాభిషేక సర్గనాటికి దేవతలందరూ వచ్చి నిలబడవలసిందే... ఎందుకొస్తారటో తెలుసాండీ పట్టాభిషేకం జరిగిననాడు దేవతలందరూ సంతోషిస్తారటా ఆ ప్రాంగణానికొచ్చి పిత్రుదేవతలను కూడా తీసుకొచ్చి నిలబెడుతారూ అంటారు నేను కొన్ని వ్యాఖ్యానాల్లో చూశాను. పితృదేవతలందర్నీ ఎక్కడ రామాయణం చెప్తారో ఎక్కడ రామాయణం చదువుతారో ఎక్కడ రామాయణం వింటారో శ్రద్ధతో అక్కడకి పితృదేవతలందర్నీ తీసుకొస్తారటా ఇదిగోరా మీ వాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ రామాయణాన్ని దోసి ఒగ్గి విన్నాడు వినయంతో నమస్కరించి విన్నాడు నమ్మి విన్నాడు వాడు విన్నందుకు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి మిమ్మలందర్నీ స్వర్గలోకానికి పంపిస్తున్నామని పూర్వ పితృదేవతలందర్నీ స్వర్గలోకానికి పంపిస్తారటా... నా కడుపున ఇటువంటివాడొకడు పుట్టాడు వీడివల్ల మేము స్వర్గానికి వెడుతున్నామని పితృదేవతలందరూ గొప్ప ఆనందాన్ని పొందుతారటా... అంతగొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం కుటుంబ వృద్ధిం ధన ధాన్య వృద్ధిమ్  స్త్రియ శ్చ ముఖ్యాః సుఖ ముత్తమం చ శృత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం ! ఆయుష్య మాఽఽరోగ్య కరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధి కరం శుభం చ శ్రోతవ్య మేత న్ని యమేన సద్భిః ఆఖ్యాన యోజస్కర మృద్ధికామైః !

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
శ్రీరామాయణాన్ని ఎవరు వింటారో అక్కడ కుటుంబ వృద్ధి చక్కగా ఉన్నటువంటివాళ్ళకే కాదు వాళ్ళ కుటుంబమంతా కూడా వృద్ధిలోకి వస్తుంది, ఆ కుటుంబంలో ఉన్నవాళ్లందరూ కూడా సుఖశాంతులు పొందుతారు. ఒక్కడు రామాయణం విన్నాడనుకోండి కుటుంబంలో ఆ కుటుంబంలో ఉన్నవారందరూ మంచి వార్తలు వింటారు గొప్ప గొప్ప బిడ్డలు పుడుతారు, గొప్ప గొప్ప సంతోషాన్నిపొందుతారు అన్నీ కలిసొస్తాయి ఈశ్వరానుగ్రహంతో ధన ధాన్య వృద్ధిమ్ ధన ధాన్య వృద్ధి పొందుతుంది స్త్రియ శ్చ ముఖ్యాః సుఖ ముత్తమం చ చక్కటి సుఖాన్ని పొందుతారు శృత్వా శుభం కావ్యమిదం మహార్థం ఈ రామాయణ కావ్యాన్ని వినడం చేత ఆయుష్యు ఆరోగ్యము కీర్తి వృద్ధీ సుఖము అన్నిటినీ కూడా శ్రీరామాయణము ఇవ్వగలదు ఇది సత్యం సత్యం పునః సత్యం.
అందుకే నరులు ఉన్నంతకాలం ఈలోకం ఉన్నంత కాలం రామాయణం ఉండాలి, రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలమూ నరులకు అభ్యున్నతీ నరుడు నరుడిగా బ్రతకడం చేతనౌతుందీని బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి ఆదేశించి పరమ కరుణాద్రహృదయుడు గనుక వాల్మీకి మహర్షి చేత ఈ రామాయణ కావ్యాన్ని రచింపజేసి మనకందించాడు మహానుభావుడు. కాబట్టి ఈ శ్రీరామాయణాన్ని విన్నవారు ఎవరున్నారో వాళ్ళందరూ ఒకమాట అనాలీ అంటారు ఎందుకంటే తపఃశక్తి కలిగినవాళ్ళకైతే ఖచ్చితంగా కనపడుతారు, శ్రీమన్నారాయుణుడు ఇవ్వాళ మెరిసిపోతున్నటువంటి గరుఢవాహనంమీద లక్ష్మీ సహితుడై మిగిలిన దేవతలందరితో కలిసి త్రిమూర్తులతో సహా పితృదేవతలతో సహా పట్టాభిషేక సర్గ జరుగుతున్ననాడు ఆకాశ మండలంలో వచ్చి నిలబడుతారు. రాజా రాముడికి పట్టాభిషేకం జరగడమంటే ఇప్పుటికి లోకంలో అంత శక్తి కలిగినటువంటిది రామ చంద్ర మూర్తి యొక్క పట్టాభిషేకమే అందుకే శ్రీరామాయణం చెప్తే తప్పకుండా పట్టాభిషేకం చేస్తారు. ఏ ద్రవ్యాలు లేకపోయినా అక్షతులతోనైనా కిరీటధారణచేసి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చెయ్యడమంటే ఈ భూమండలమంతట్నీ రామ చంద్ర మూర్తికి ఇవ్వడం.
కాబట్టి విష్ణువు వచ్చి నిలబడుతాడు వీళ్ళందరూ పరమ భక్తులు నాచేత పరిపాలింపబడాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మనమేం కోరుకోవాలి మనందరం కోరవలసింది రామా! మీరు బలంగా ఉండాలి మీరు ఎంత బలంగా ఉంటే అంతగా రావణాదుల్ని పడగొడుతారు, మనల్ని కాపాడుతారని మనం కోరుతాం. అందుకే రామానుగ్రహం కావాలని కోరుకున్నవాళ్ళందరు చెయ్యవలసిన పనిమాత్రం ఒకటి చెప్తారు శాస్త్రంలో మూడు మాట్లు మీ కంఠాన్ని వంచన చేసుకోకుండా మీ కంఠం పలికితే ఎంత గట్టిగా మీరు పలకగలరో అంతగట్టిగా అరిచి మూడు మాట్లు చెప్పాలి. నేను చెప్తాను మీరు చెప్పండి బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం శ్రీ మహావిష్ణువునకు బలము కలుగుగాకా... ఈమాటలు అన్నప్పుడు స్వామి ఎంతో ఆనందిస్తాడటా ఎంతో ఉల్లాసాన్ని పొందుతాడు. ఇప్పుడు మనందరం ఆయన కింకరులం. ఇంక మన బాధ్యతలు ఇంక మనం చేయ్యవలసినవి హాయిగా ఆయన క్షత్రఛాయల్లో పెట్టుకుని మనని కాపాడి ఆయన రక్షిస్తాడు. మీరు విశ్వాసాన్ని పొందండి తప్పకుండా రామానుగ్రహంతో ఆ సీతమ్మ తల్లి అనుగ్రహంతో మనందరం హాయిగా ఆనందంగా ఉండగలం కాబట్టి ఇప్పుడు యదార్థంగా చెప్పబడినటువంటి పట్టాభిషేకం క్రతువు ఏదివుందో దాన్ని కూడా పట్టాభిషేకం చేస్తారు కీరీటధారణా అన్నీ చేయిస్తారు.
స్వామి రాజా రాముడిగా పూజలందుకొంటాడు పట్టాభిశక్తుడయ్యాడు కాబట్టి ఇప్పుడు రాజా రాముడిగా పూజ, పూజ అందుకున్న తరువాత దర్భారు జరుగుతుంది, ఇవ్వాళ కొద్దిగా వేళ దాటినా దయచేసి ఎవ్వరూ వెళ్ళకుండా అందరూ కూడా ఈ పట్టాభిషేకాన్ని చూడవలసిందిగా మనవిచేస్తూ నలభైరెండు రోజులపాటు నాకేమీ చేతకాకపోయినా గట్టిగా ఒక్క శ్లోకం చదవడం నాకు రాకపోయినా మీయంతబాగా రామా రామా రామా అనడం కూడా చేతకాకపోయినా నాకేమీ తెలియకపోయినా పోల్లేపాపం ఏదో చెప్తున్నాడుకదావాడు పాపం వాడుచెప్తే మేము వింటే వాడు సంతోషిస్తాడని మీకన్నీ తెలిసున్నా ఏమీ తెలియని వాళ్ళల్లా మీ అందరూ కూర్చుని విని శ్రీరామాయణాన్ని చెప్పుకునేటటువంటి మహాత్భాగ్యాన్ని నాకిచ్చినందుకు మీ అందరికి నా యొక్క కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మీ అందరికి లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామ చంద్ర ప్రభువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశిస్సులు కలగాలనీ సాంజలిబంధకంగా సీతా రాముల యొక్క పాదారవిందములకు నమస్కరిస్తూ ఇవ్వాల్టితో ఈ శ్రీరామాయణ ప్రవచనాన్నిపూర్తిచేసి నేను ఆకాశగంగయందు అవప్రద స్నానమే ఆచరించాను. 42 రోజులు రామ చంద్ర ప్రభువు నాచేత దీక్ష చేయించాడు అంత సుదీర్ఘమైన దీక్ష నడవాలంటే మాటలు కాదు ఈశ్వరానుగ్రహం ఉండాలి, తపస్సు చేయించాడు చేయించి ఇవ్వాళ నాకు, ʻఅన్ని ఉన్నవాడికి ఇవ్వడం గొప్పకాదు ఒక చేతకానివాడికి ఇవ్వడమే గొప్పʼ ఎక్కడ పల్లముంటుందో కదా అక్కడికే నీరు వెడుతుంది, చేతకానివాడిని ఉద్దరిస్తే ఆయన ప్రభువు కాబట్టి నన్నెంచుకున్నాడు ఈ చేతకానివాడితో రామాయణం చెప్పించి వీడే చెప్పాడంటే ఎవరు చెప్పలేరు శ్రద్ధ ఉంటే ఎవరైనా చెప్పగలరు లోకానికి నిరూపించాలనుకుంటే నాచేత ఇంత కైంకర్యమందుకుని నాచేత ఇంత ఆనందాన్ని పొంది నా జీవితంలో రెండోమాట సంపూర్ణ రామాయణ ప్రవచనాన్ని పూర్తిచెయ్యగలిగానూ అని నాకు ఎంత సంతోషంగా ఉందో...
దీని ముందు నాకు నిజంగా గజారోహణం చేయించినా నాకు గండపెండేరము వేసినా నాకు సింహకవాటం వేసినా అది దిగదుడిపే నాకు కావలసింది నేను బ్రతికున్నన్నాళ్ళు నా ఆఖరి ఊపిరి విడిచిపెట్టేసేంతవరకు నాస్వామికథ నేను ఇలా చెప్పుకుంటూ నేను ఇలా భగవంతుని కథ చెప్పుకుంటుండగా నా ఊపిరి ఆగిపోతే అంతకన్నా నాకు కావలసింది జీవితంలో ఏదీలేదు. త్రికరణ శుద్ధిగా నేను ఈశ్వరున్ని కోరుకున్నదొక్కటే ఇవ్వాళ కూడా నేను రామాయణ ప్రవచనాన్ని పూర్తిచేస్తూ రామాయణ కావ్యంమీద నా రెండు చేతులుంచి స్వామి పట్టాభిషేకము ఆయన పాదాలదగ్గర నేను కోరుకున్న కోరికాంటూ ఏదైనా ఉంటే అదొక్కటే. కాబట్టి రామ చంద్ర మూర్తికి నా పరిపూర్ణమైన హృదయంతో ఆయనకి నమఃసుమాంజలినర్పిస్తూ మనం పెట్టుకున్న ఆచారాన్ని చక్కగా ఇవ్వాళ కూడా పాటించి ఒక్క పదకొండుమాట్లు రామ నామం చెప్పుదాం, ఆ తరువాత మీరు నన్ను భరించవలసిన అవసరం ఇక ఉండదు. ఎందుకంటే నేను ఇక వేదించను ఉపన్యాసమైన తరువాత మీరు కొన్నాళ్లు విశ్రాంతి పొందవచ్చు. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడో వస్తే వస్తాను.

  యుద్ధ కాండ నలభై రెండవ రోజు ప్రవచనము
కాబట్టి ఒక్క పదకొండుమాట్లు రామ నామం చెప్పుకుందాం.

రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
కోరి కొలచినవారికెల్లను కొంగుబంగరు రామ నామము !!రా!!
నీవు నేనను బేధమేమియు లేకయున్నది రామ నామము !!రా!!
అండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామ నామము !!రా!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రా!!
బ్రహ్మసత్యము జగన్మిత్యా భావమే శ్రీ రామ నామము !!రా!!
భక్తితో భజియించువారికి ముక్తి నొసగును రామ నామము !!రా!!
రాకడయు పోకడయులేనిది రమ్యమైనది రామ నామము !!రా!!
ఆత్మసంమయోగ సిద్దికి ఆయుధము శ్రీ రామ నామము !!రా!!
రావణానుజ హృదయపంకజ రాచకీరము రామ నామము !!రా!!
దాసులను రక్షించదయగల ధర్మనామము రామ నామము !!రా!!
రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీ రామ నామము !!రా!!
రామ నామ స్మరణచేసిన క్షేమమొసగును రామ నామము !!రా!!
తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామ నామము !!రా!!

మంగళా....
==========================================
అనేన శ్రీ రామాయణ పారాయణేన భగవాన్ సర్వ దేవతాత్మక:
సీతా లక్ష్మణ భరత శతృఘ్న హనుమత్సమేత  శ్రీరామచంద్ర:
సుప్రీత: సుప్రసన్నో వరదో భవతు.
======శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ======
==========================================
శ్రీ రఘు నందన పరబ్రహ్మణే నమః
శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామినే నమః
శ్రీమద్వాల్మీకి రామాయణం సంపూర్ణం
శ్రీ మద్వాల్మీకి మహర్షయే నమ:
సర్వం శ్రీ సీతా రామార్పణ మ౭స్తు