కిష్కింధ కాండ
ఇరవైరెండవ రోజు ప్రవచనము
ఈనాడు మనం కిష్కింధ కాండలోకి ప్రవేశిస్తున్నాం, కిష్కింధ
కాండ చాలా గొప్పకాండ. శ్రీరామాయణంలో ఏ కాండైనా అంతే... ప్రత్యేకించి కిష్కింధ
కాండలో హనుమ ప్రవేశిస్తారు, హనుమత్ ప్రవేశం దగ్గర్నుంచి శ్రీరామాయణం ఒక కొత్తపుంత
తొక్కుతుంది. ఇప్పటివరకూ సీతా వియోగంచేత బాధపడుతున్నటువంటి రామ చంద్ర మూర్తికి
సంతోషాన్ని కల్పించి సీతమ్మ జాడకనిపెట్టగలిగినటువంటి ఒకగొప్ప స్వరూపాన్ని పరిచయం
చేస్తారు మహర్షి, ఆ హనుమత్ స్వరూపంయొక్క పరిచయం సుగ్రీవుడియొక్క పరిచయం, వానర
యోధులయొక్క పరిచయం, సీతాన్వేషనానికి అన్ని దిక్కులకు వానరులు బయలుదేరడం.
ప్రత్యేకించి కిష్కింధ కాండయొక్క గొప్పతనం అంతా ఎక్కడుందీ అంటే హనుమకి శాపవిమోచనం
ఈ కాండలోనే అవుతుంది, అప్పటి వరకు ఈ కాండవరకూ కూడా చెప్పక పోయినా మహర్షి హనుమ
యొక్క జన్మ వృత్తాంతం శ్రీరామాయణంలో ఉత్తర కాండలో చెప్పారు తప్పా ఈ కాండలలో ఎక్కడా
చెప్పలేదు, తిన్నగా హనుమ యొక్క పాత్రని ప్రవేశ పెట్టేస్తారు.
కానీ ఇప్పటి వరకూ కూడా అంటే కిష్కింధ కాండ చిట్ట చవరి వరకూ
కూడా ఆయన్ని శాపం వెంబడిస్తూనే ఉంది, అందువల్ల హనుమ చెయ్యగలిగినటవంటి ఉపకారం
చెయ్యలేనిస్థితిలో ఉంటాడు. కాని హనుమ యొక్క పూర్ణమైన తేజస్సు ప్రకాశించినటువంటి
కాండ కిష్కింధ కాండ. అందుకే కిష్కింధ కాండ వినడం, కిష్కింధ కాండ చదవడం, కిష్కింధ
కాండ ప్రత్యేకించి హనుమ యొక్క వైభవాన్ని బాగాప్రకాశింపజేసేటటువంటి కాండగనుకా ఈ కిష్కింధ
కాండను శ్రద్ధా భక్తులతో వినడంచేత హనుమయొక్క అనుగ్రహం కలుగుతుంది. హనుమ యొక్క
అనుగ్రహం కలగడం అంటే శివానుగ్రహం కలగడమే... శివుడు మంగళప్రదుడు శివుడు ఎక్కడ ఉంటే
అక్కడ మంగళం ఎలా జరుగుతుందో అలా హనుమ ఎక్కడ ఉంటే అక్కడ మంగళము తప్పా ఇంకొకటి జరగదు
అన్నీ మంగళములే చేస్తారాయన. అటువంటి హనుమత్ స్వరూపం యొక్క వైభవాన్ని బాగాప్రకాశింపజేసినటువంటి
కాండ కిష్కింధ కాండ. వేరొక విధంగా చెప్పాలీ అంటే, అసలు సుందర కాండ అనబడేటటువంటి ఒక
మహాద్భుతమైనటువంటి కాండకి పునాది కిష్కింధ కాండ, కిష్కింధ కాండ క్రమంగా ఎటువైపుకి
దారితీస్తుందంటే సుందర కాండవైపుకి దారితీస్తుంది, సుందర కాండలోకి ప్రవేశించాలీ
అంటే అంత కట్టుదిట్టమైన ఏర్పాటు మహర్షి చేశారు. కిష్కింధ కాండ అంతా హనుమ గురించి
ఆయన వైభవం గురించి అంతప్రకాశింపజేస్తే అప్పుడు మనం కిష్కింధ కాండలోంచి మనము సుందర
కాండలోకి ప్రవేశించగలుగుతాం.
|
అసలు అలా ఎవ్వరూ ఉండరు చాలా
కష్టం, అంత బలం ఉండీ అంత తేజస్సుండీ అంత బుద్ధిబలం ఉండీ అంత ఉత్సాహం ఉండీ మనస్సుకి
శక్తి ఉండాలి, మనస్సుకి శక్తి ఉండి, ఎందుకంటే ఒంట్లో బలం ఉంటుంది కానీ ఆయన
మనస్సుకి బలం ఉండదు అందుకనీ అమ్మో నేను వెళ్ళితే పడిపోతానంటాడు నాకేమైనా
అయిపోతుందంటాడు, ఎప్పుడూ భయమే ఎందుకాభయం అంటే మనస్సు బలహీనమైంది అలా కాకుండా
అన్నివిధాలా శక్తి కలిగినటువంటి హనుమా... అసలు నిజంగా శ్రీరామాయణంలో ఆయనేకానీ ఆయన
కొరకు అని చూసుకొని ఉంటే ఆయన ఏ స్థాయిని పొందాలో... ఆయన వైభవానికి, కాని అసలు ఆయన
తన కొరకూ అని చూసుకొన్నది ఎక్కడా లేదు, ఆయనా అంటూ ఉంటే ఉపకారం కొరకే అంతే. హనుమ
ఆధ్యంతములూ అంతే హనుమ పాత్ర యొక్క వైభవం అంతే ఇంక. అది శ్రీరామాయణంలో ఉన్నటువంటి
ఇంకొక చాలా చాలా గొప్పతనమేమిటంటే శ్రీరామాయణంలో ఉన్నటువంటి పాత్రలు సశరీరంగా
ఇప్పటికీ రావడం అనేటటువంటిది అన్ని పాత్రల యందు అది చెప్పడం కష్టం.
అంటే నేను ఒకమాట చెప్పాలి అంటే దశరథ మహారాజుగారు వస్తారాండీ
రామాయం చెప్తే అని మీరు నన్ను అడిగారనుకోండి, నేను ఏం చెప్పవలసి ఉంటుందంటే రారని
చెప్పవలసి ఉంటుంది. అంతే గదాండి దశరథుడు వస్తాడని చెప్పకూడదు, రాముడు వస్తాడాండి
అని మీరు నన్ను అడిగారనుకోండి వస్తారని చెప్పాలి. రాముడు ఎలా వస్తారండీ అని
అడిగారనుకోండి ఎలా వస్తారని చెప్పాలి హనుమ వస్తే వస్తారని చెప్పాలి, హనుమ ఎలా
వస్తారండీ అని అడిగారనుకోండి రామ నామం చెప్తే వస్తారండీ అని చెప్పాలి, అదీ రామ
నామం యొక్క బలం. హనుమని తీసుకొస్తే మంగళం జరుగుతుంది, హనుమ దేనికొస్తారు రామ
నామానికివస్తారంతే... ఆయన ఇప్పటికి అప్పటికి ఎప్పటికీ ఆయన చిరంజీవి భవిష్యత్
బ్రహ్మ. లోకంలో హనుమ యొక్క గొప్పతనమేమిటంటే..? కిష్కింధ కాండలో లేవు ఆ విషయాలు.
అవతార పరిసమాప్తి చేసేటప్పుడు రామ చంద్ర మూర్తి అడిగారు, హనుమా నేను ఈ లోకాన్ని
విడిచిపెడుతున్నాను... నాతోపాటు చాలా మంది వచ్చేస్తున్నారు నీవు కూడా వస్తున్నావా
అని అడిగారు, ఆయన అన్నారు అక్కరలేదు మీ కథ ఉన్నంతకాలం నేను ఉంటాను అన్నాడు.
|
అంటే అసలు తనకొరకే పుట్టినవాడని రామ చంద్ర మూర్తికి హనుమని చూడగానే
తెలుస్తుంది, ఇంకా చిత్రమేమిటంటే అసలు మాట్లాడంది రామ చంద్ర మూర్తి ఎవరితోనంటే
హనుమతోటే కిష్కింధ కాండ ప్రారంభంలో అసలు హనుమతో ఆయన మాట్లాడలేదు, లక్ష్మణుడితో
చెప్పి లక్ష్మణుడితో మాట్లాడించారు. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు రాముడు
అరణ్యవాసానికి బయలుదేరిన పర్యంతమూ ఆయన ఒక వాహనాన్ని ఎక్కినట్లు మీకు ఎక్కడా
కనపడదు, మొట్ట మొదటిసారి కిష్కింధ కాండలో ఆయన ఒక వాహనం ఎక్కుతారు, ఏ వాహనమో
తెలుసాండీ ʻహనుమత్ వాహనంʼ మిగిలిన వాహనాలు మనం ఊహచేత ఎక్కిస్తాం
ఈశ్వరున్ని, హంస వాహనం ఉందనుకోండి మనం చూసింది లేదు, హంసని ఎవరైనా నేను చూశాను అని
చెప్పరు లోకంలో కాని హంస వాహనాన్ని ఎక్కిస్తాం, మయూర వాహనం ఎక్కిస్తాం. అలా ఎక్కి
ఉంటాడూ అని ఊహచేసి ఎక్కిస్తాం. మయూర వాహనం మీద ఎక్కాడా ఈశ్వరుడు అంటే ఎక్కాడనే
శాస్త్రం చెప్తుంది. కానీ ఆ వాహనాల మీద ఎక్కినప్పుడు ఆయనా ఆయా వాహనములు ఎలా
ఉంటాయంటే అవి అలాగే ఉంటాయి అంతే, అవేం కొత్తతనాన్ని సంతరించుకోవు. కాని ఒక్క హనుమ
మాత్రం రామ లక్ష్మణులు ఇద్దరు తన భుజాల మీద కూర్చుంటే చేతులు రెండు ఇలా పెట్టారు.
అందుకే హనుమత్ వాహనాన్ని ఒక్కదాన్ని మాత్రం ఇంకోలా తయారు చేయడానికి వీల్లేదు.
ఒక కల్పవృక్షవాహనం ఉందనుకోండి పిండికొద్ది రొట్టె మీకున్న సొమ్మునుబట్టి
కల్పవృక్షవాహనాన్ని తయారు చేస్తుంటారు. మీరు చూస్తుంటారు దేవాలయాల్లో ఒక్కొక్క
దేవాలయంలో ఒక్కొక్కలా ఉంటుంది కల్పవృక్షవాహనం అన్ని చోట్లా అంతే వైభవం తేవాలంటే
కష్టం. వేంకటాచలం అంటే ఐశ్వర్యంతో కూడుకున్న క్షేత్రం అందుకని అక్కడ ఏదైనా బంగారమే
కాబట్టి అక్కడ అంత వైభవంగా ఉండచ్చు, మిగిలిన చోట్ల కల్పవృక్షవాహనాలు అలా ఉంటాయని
మీరు ఉహించకూడదు, కొయ్యతో కూడిన పళ్ళతో పువ్వులతో కూడిన వాహనం అయ్యిండచ్చు అయినా
అది వాహనమే ఈశ్వరుడికి కాని ఆ వాహనాలు అలాగే ఉంటాయి కల్పవృక్షవాహనం అలాగే ఉంటుంది
నెమలి అలాగే ఉంటుంది హంస అలాగే ఉంటుంది. హనుమ ఒక్కరు తాను ఎలా ఉన్నారో అలా ఉండరు,
రామ లక్ష్మణులెక్కినా సీతా రాములెక్కినా అంటే వాహనంగా సీతారాములు అధిరోహిస్తారు
లక్ష్మణ సహితులై, వాల్లెక్కితే ఆయన ఇలా అంటారు మీరు చూడండి. అందుకే హనుమత్ వాహనం
ఇంకోలా ఉండదు ఎక్కడ, ఇలాగేపెట్టి ఉంటుంది ఇలాగే చేతులు పెట్టి ఉంటారు, ఇలా చేతులు
ఎందుకు పెట్టి ఉంటారో తెలుసాండీ ఇలా పెట్టడంలో ఉద్దేశ్యం ఏమిటంటే మీరు చూడండి
లోకంలో ఒక పోకడ ఉంటుంది మీరు నాకు ఇంత ఉపకారం చేశారు ఇంక ఇంతకన్నా ఏం కావాలండీ
అంటాం ఇంక ఇంతకన్నా ఏం కావాలండీ అన్నప్పుడు ఇంకొక భంగిమ ఎవ్వడూ పెట్టడు.
|
హనుమత్ ఉపాసనలో ఉన్నగొప్పతనం ఏమిటో తెలుసాండీ ఆయనది స్వరూపం అక్కరలేదు మీరు
ఒకవేళ భయంతో ఉన్నారనుకోండి ఏదైనా
భయం వేసిందనుకోండి మీరు ఎక్కడున్నారో అక్కడ వేంటనే మధ్య పొడుగ్గా ఉన్నటువంటి
వేల్తోటి హనుమ అని రాసి మీరు మనస్కారంచేస్తే ఆయన కాపాడుతాడు, నన్ను నమ్మండి
నేను మీకొక యదార్థం చెప్తున్నాను, అంతగొప్ప స్వరూపం అది. మీరు ఎక్కడున్నాసరే మీరు
ఎక్కడో మట్టిలో ఎక్కడో తిరుగుతూ మీకు భయమేసింది మీరు ఉలిక్కిపడ్డారు, మీరు వేంటనే
పెద్దవేలితో మట్టిమీద హనుమా అని రాసి నమస్కారం చేశారనుకోండి ఉత్తర క్షణం మిమ్మల్ని
ఏవీ ఆవహించలేవు, ఆయన తక్షణం రక్షణ ప్రసరిస్తారు అంత గొప్ప స్వరూపం లోకంలో ఇంకోటి
ఉండే అవకాశం ఉండదు. ఏదో ఉదయం మా గోపాలకృష్ణగారు నేను అదే అనుకొన్నాం కూడా...
పిల్లలు సాధారణంగా ఓ కోతిని చూస్తే ముచ్చటపడుతారు, ఏదో వెటకారమాడుతారు, ఏదో హాస్యం
చేస్తారు వాళ్ళకు ఏం తెలుసో అర్థం కాదుకానీ ఆపాల గోపాలం చిన్న పిల్లలు దగ్గర్నుంచి
వయో వృద్ధుల వరకూ అందరికి ఇష్టమైన స్వరూపాలు ఈ లోకంలో రెండే ఒకటి హనుమా రెండు
వినాయకుడు. ఒకాయనది ఏనుగు ముఖం ఒకాయనది కపి ముఖం చిత్రమేమిటమటే వాళ్ళిద్దరూ
సింధూరము చేతనే అర్చింపబడుతారు. వినాయకుడు సింధూరము గండస్థలమునకు రాయకుండా
ఉండకూడదు ఆయనకు తప్పకుండా సింధూరము రాసి ఉంచాలి గండస్థలానికి. హనుమా ఎప్పుడూ
సింధూరం చేత శోభిస్తూ ఉంటాడు అందుకే ప్రాతఃస్మరామి గణనాథ మనాథ బంధుం !
సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అంటారు. అటువంటి స్వరూపం సరే నేను ఇప్పుడు
హనుమత్ వైభవమూ అని వెళ్ళిపోతుందేమో నా ఉపన్యాసము అని నాకు భయం, ఆయన విశిష్టత
అటువంటిది.
|
కాబట్టి అది వసంత ఋతువు ఆనాడు రామ చంద్ర మూర్తి
లక్ష్మణ సహితుడై పంపాతీరంలో తిరుగుతున్నప్పుడు, వసంత ఋతువు దంపతులు ఒకరి నుంచి
ఒకరు దూరంగా ఉంటే తప్పకుండా ఒండొరులకు ఒకరికొకరు జ్ఞాపకం చెయ్యగలిగినటువంటి
పరిస్థితులలో ప్రకృతి ఉంటుందీ అని అంటే అంత మనోరంజకత్వంతో ఆహ్లాదకరంగా ఉండేటటువంటి
ప్రకృతి ఆ వసంత ఋతువులో ఉండేటటువంటిది. కాబట్టి ఇప్పుడు రాముడు ఒక పుష్కరిణి
దగ్గరికి వెళ్ళాడు ఒక సరోవరం దగ్గరికి స తాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల ఝషాకులామ్
! రామః సౌమిత్రి సహితో విలలాప ఆకులేన్ద్రియః !! లక్ష్మణ సహితుడై సరోవరం
దగ్గరికి వెళ్ళినటువంటి రాముడికి పద్మములు అరవిరిసి కనపడ్డాయి. పద్మములు కలువలు
చేపలు సరోవరం అంటే ఉండేవి అవేకదాండీ! అవే కనపడ్డాయి. అవి కనపడితే రాముడు ఏడ్చాడు,
అవి కనపడితే రాముడు ఏడ్వడం ఎందుకండీ సంతోషించాలిగాని, చాలా బాగుందండీ కలువలతోటి
పద్మాలతోటీ చేపలతోటీ అనాలి. ఆయనెందుకేడ్చాడంటే ఆ మూడిటిలో ఆయనకు సీతమ్మ కనపడింది,
లక్ష్మణుడితో అంటాడూ సీతమ్మది పద్మం లాంటి ముఖం కలువలు లాంటి కళ్ళు చేపలు లాంటి
కదలికలు ఆవిడ మీనాక్షి కదా... అందుకనీ చేప ఎలా కదులుతుందో సీతమ్మ కళ్ళు అలా
కదులుతాయి కలువలు ఎలా ఉంటాయో నా భార్య యొక్క కళ్ళు అలా ఉంటాయి పద్మం ఎలా ఉంటుందో
నా భార్య ముఖం అలా ఉంటుంది నాకు ఈ సరోవరం చూస్తే సీత గుర్తొస్తుంది ఇప్పుడు ఆ సీత
ఎంత
ఖేదపడుతుందో ఆ
రాక్షసుడి యొక్క చెరలో కాబట్టి ఈ సరోవరం నాకు తృప్తినివ్వలేకపోతూంది నాకు
సంతోషాన్ని ఇవ్వలోకపోతుంది.
|
మీకు బాహ్యంలో ఋతువు కానీ బాహ్యంలో ఉండే వాతావరణం కానీ తనంతతానుగా మీకు
మనఃశాంతిని ఇవ్వలేదు, ఎప్పుడూ మనఃశాంతికి కారణం ఏమిటీ అంటే మీరు లోపల ముందు
చల్లాగా ఉంటే బయట ఉన్న అందాన్ని అనుభవించగలరు లేకపోతే అది అనుభవించడం కుదరదు.
అందుకే మీరు సమాజానికి చెయ్యగలిగిన చాలా పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇంకోడి శాంతిని పాడు చెయ్యకుండా ఉండడం.
మీరు శాంతంగా ఉండడం ఇంకోన్ని శాంతంగా ఉంచడం, వాడి శాంతి మీరు పాడుచేయకుండా ఉంటే
నూరు యజ్ఞాలు చేసినట్లే అందుకనే “ఓం శాంతి శాంతి శాంతిః”. కాబట్టి ఇప్పుడు రాముడు
వాటిని చూసి బాధపడ్డాడు, అది మనకు చెప్పవలసిన అవసరమాండీ... అంటే అది ఉత్తమ పురుష
లక్షణం, తన భార్య మాత్రమే జ్ఞాపకానికి రావడం, తన భార్యయందు మనస్సు ప్రవర్తించడం
ఉత్తమ పురుషుని యొక్క లక్షణం. అన్యమైనటువంటి స్త్రీ జ్ఞాపకం రావడం, జ్ఞాపకం రావడం
వరకు తప్పేమి లేదు ఓ అక్క గుర్తు రాదా ఓ చెల్లెలు గుర్తు రాదా ఓ అత్తగారు గుర్తు
రారా ఓ పిన్నిగారు గుర్తు రారా అలా జ్ఞాపకం తెచ్చుకోవడానికి దోషమేమీ ఉండదు, కానీ కామ మోహితమైన మనస్సుతో అన్య
స్త్రీ జ్ఞాపకానికి రాకూడదు, అలా జ్ఞాపకానికివస్తే అది దోషభూయిష్టం, అది తప్పకుండా
దాని ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది.
కాబట్టి రాముడు తన భార్యయందు మనసున్నవాడు ఆవిడ
జ్ఞాపకానికి వస్తుంది ఆయనకు కాబట్టి ఆయన యొక్క ధర్మాన్ని చూపిస్తుంది మనకు,
ఇప్పుడు ఆయన అంటున్నాడు కేవలం భార్యే జ్ఞాపకానికి వస్తుందనుకోండి ఒక పరిపూర్ణత
లోపించినట్లు, ఎప్పుడూ భార్య జ్ఞాపకానికి రావడం తప్పా అంటే తప్పని చెప్పడం కష్టం.
కాని ఎప్పుడూ ఆవిడే జ్ఞాపకానికి వస్తే మిగిలినవాళ్ళ పరిస్థితి అప్పుడు అది కొంచెం
అసమగ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రాముడి మనసు అటువంటిది కాదు ఆయన ఏడవడం ఆయన
బాధపడ్డం అంటే కేవలం సీతమ్మ గురించే కాదు మాం తు శోక అభిసంతప్తమ్ మాధవః పీడయ
న్నివ ! భరత స్య చ దుఃఖేన వైదేహ్యా హరణేన చ !! మాధవుడు అంటే మాధవ మాసము అంటే
వైశాఖ మాసం. మధు మాసం అంటే చైత్ర మాసం, నన్ను “ఈ వసంతుడు ʻమాధవʼ అన్నపేరు
వసంతుడికి కూడా ఉంది అమరకోశంలో” కాబట్టి దీనిమీదే కృష్ణకర్ణాంమృతంలో ఒక శ్లోకం
కూడా ఉంది. కాబట్టి మాధవుడు- వసంతుడు నన్ను బాధపెడుతున్నాడు ఎందుకు
బాధపెడుతున్నాడు రెండు కారణములచేత బాధపెడుతున్నాడు ఒకటి ఇంత అందమైనటువంటి ప్రకృతి
కలిగినటువంటి ఋతువులో సీతమ్మ నాపక్కనలేదు రెండవది రాచరికం చేస్తూ సంతోషంగా ఉండి
తనభార్యతో ఆనందమును అనుభవించి అంతఃపురములో గడపవలసినటువంటి భరతుడు అలా గడపకుండా
తనంత తాను స్వచ్ఛందంగా ముని వృత్తిని స్వీకరించి ఇక్కడ నేను అడవిలో ఎంతబాధ
పడుతున్నానో నాకొరకు భరతుడు అంతబాధ పడుతున్నాడు భరతుడు నాకొరకు భాధపడుతున్నాడని
నేను భాధపడుతున్నాను.
|
మీరు మొన్న సీతారామ కళ్యాణంలో పూల బంతులాట
చూశారుగా ఆడుకునేటప్పుడు ఏమౌతుందంటే అది కిందా ఉండదు పైనా ఉండదు మధ్యలోనా ఉండదు
అలా ఉంటేనే ఆట కదాండీ... ఆ బంతీ చేతిలోకి వస్తుంది వచ్చి ఎంతసేపు ఉంటుంది మళ్ళీ
ఎగురువేస్తారు కదలికతో ఎంతసేపు ఉంటుంది మళ్ళీ చేతిలోకి వెడుతుంది. ఉంటుంది
కదులుతుంది పడుతుంది. అలా ఆడుతున్నవాడు ఒకడు ఉన్నాడు అందువల్ల కదులుతోంది చెట్లకు
పట్టుకుని ఉన్నాయి జారి గాలిలోకి ఊగుతున్నాయి ఊగి కిందపడుతున్నాయి, ఇది ఎలా ఉంది
అంటే వాయువు పూలతో ఆడుకుంటున్నాడా అన్నట్లుగా ఉందట. అసలు నిజంగా మహర్షికి
వచ్చినటువంటి ఉహలు అంటే మీకు కొన్ని శ్లోకాలు చూపిస్తున్నాను ఆయన యొక్క
ఊహవైచిత్ర్యం అంటే చూడగిలిగినటువంటి కన్నుంటే ఎంత అందంగా చూడగలరో ఆ ఋతువుని ఎంత
అందంగా ప్రకృతిని చూడగలరో అన్నదానికి వాల్మీకి మహర్షి యొక్క రచనా పతాక స్థాయిలో
ఉంటుంది. అందుకే తదనంతరము వచ్చిన కవులందరు వాల్మీకి మహర్షినే అనుసరించారు మత్త కోకిల
సన్నాదైః నర్తయ న్నివ పాదపాన్ ! శైల కందర నిష్క్రాంతః ప్రగీత ఇవ చాఽనిలః !! మహర్షి అంటున్నారు, మీరు ఎక్కడైనా నాట్యం
జరుగుతుండడం చూసి ఉంటారు, నాట్యం చూడనివాళ్ళు ఎవరూ ఉండరు ఎక్కడోక్కడ చూసి ఉంటారు
మీరు నాట్యం జరుగుతూంది అంటే మనం ఏమంటామంటే ప్రధానంగా ఎవరిని చూస్తామంటే ఎవరు
నర్తిస్తున్నారో వాళ్ళని ప్రధానంగా చూస్తాం.
ఏదో శ్రీకృష్ణ పారిజాతం జరుగుతుందనుకోండి, ఆవిడా సత్యభామగా నటిస్తోంటే,
సత్యభామగా నర్తిస్తోంటే ఆవిడ ఎంతబాగా నర్తిస్తుందో అంటాం కానీ ఆవిడ నర్తనమునకు
ప్రారంభం ఎక్కడో తెలుసాండి, ఆవిడ తిన్నగా వచ్చేసి ధిం తక ధిం అంటూ మొదలు పెట్టదు
ఆవిడ అడుగు తీసి అడుగేసి మొదలు పెట్టాలంటే ఆవిడ వచ్చి అలా నిలబడుతుంది ఓ బొమ్మలాగా
ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టాలి అంటే మొట్ట మొదట నమస్కారంతో మొదలు పెడతారు. మొట్ట
మొదట ఆవిడ నమస్కారం మొదలు పెట్టాలి అంటే వెనకాల పాడేవారు ఒకరు ఉంటారు వారు పాడితే
ఈవిడ తనే పాడుతున్నట్లుగా పెదవులు కదుపుతూ నమస్కారం చేస్తుంది. అంబాపరాకు
దేవిపరాకు అంటూ మొదలు పెడతారు మొదలు పెట్టీ ఆ నటరాజుకి నమస్కారం చెప్పినప్పుడు
ఒంగి రెండు మోకాళ్ళు దూరంగా పెట్టి రెండు చేతులు భూమికి తగల్చి నమస్కారం చేసి
ప్రారంభం చేస్తారు. ఆవిడ పాట ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా ఈవిడ నర్తిస్తుంది,
ఆవిడ పాటొక్కటే పాడదు పాటొక్కటే పాడి నర్తన చేస్తే అందముండదు పక్కవాయిద్యాలు
ఉంటాయి పక్కవాయిద్యాలు కూడా దానికి అనుగుణంగా మ్రోగుతుంటాయి అప్పుడు దానికొక
సంపూర్ణత్వం వస్తుంది మూడు ఉండాలి పాటపాడేవాళ్ళు ఉండాలి పక్కవాయిద్యాలు ఉండాలి
నటించేవాళ్ళు ఉండాలి.
|
మహర్షి అంటున్నారు పక్కవాయిధ్యాలు ఇప్పుడు ఏమిటో తెలుసా ఒక వేణువు ఒక మృదంగం ఇవన్నీ
ఎలా ఉంటాయో అలా పక్కవాయిద్యాలు అదిగో ఆ గుహలలోకి వెళ్ళివస్తున్నటువంటి గాలి
బయటినుంచి గుహలోకి వెళ్ళి గుహలోనుంచి బయటికి వస్తుంది అప్పుడు అదొక ధ్వని
చేస్తుంది గాలి అది పక్కవాద్యాలట, లేదా అది పాట పాడుతుందో అది ప్రధానంగా
వస్తున్నటువంటి పాట, మరి పక్కవాద్యాలు ఎవరు వాయించాలి అంటే వసంత మాసంలో తప్పకుండా
వచ్చేటటుంటిది ఒకటుంది పిలిచినా పిలవకపోయినా వస్తుంది కోకిల, ఆ కోయిలా పక్క వాద్యాలు
మ్రోగించేటటువంటిదిగా ఉందట. గాలి పాట పాడుతుందట గాలి పాటకు ఇప్పుడు కోయిల
పక్కవాయిధ్యాలు మోగిస్తే నృత్యం చెయ్యాలిగా ఎవరో ఒకళ్ళు మరి నాట్యమెవరుచేస్తారు
అంటే ఊగుతుల చెట్ల కొమ్మలు ఇలా ఇలా ఊగుతూ నాట్యం చేస్తున్నవిగా ఉన్నాయట పంపాసరోవర
తీరంలో అక్కడ నిలబడి చూస్తే నాట్యం జరుగుతున్నట్లుగా ఉందిట, అలా కొమ్మలు ఊగుతునే ఉంటాయా...
ఆగుతాయి ఓసారి గాలి ఆగుతుంది, ఆగితే ఆగుతాయి మళ్ళీ కసేపాగి గాలేస్తుంది మళ్ళీ అడుతాయి.
మళ్ళీ నాట్యం అలా ఆగిపోయి మళ్ళీ ప్రారంభమై ఆగిపోయి మళ్ళీ ప్రారంభమై అవుతుందా
అవ్వదుకదా... మరిదానికి ఎలా పోలిక సరిపోతుంది అంటే మహర్షి చమత్కారం చూడండీ నర్తయ
న్నివ పాదపాన్ శైల కందర నిష్క్రాంతః ప్రగీత ఇవ చాஉనిలః మత్త కోకిల సన్నాదైః ఆయన అంటున్నారు అక్కడ నాట్యం జరగడం
లేదట నాట్యం నేర్పుతున్నారన్నాయన, నాట్యం నేర్పితే ఏమౌతుంది ఏదో ధిం తత్ ధిం తక
ధిం అని అంటుందావిడా అంటే ఈవిడా ఆడింది ఆ... అలాగ కాదు అలాగ కాదు తను లేచొచ్చి అలాగ
కాదు ఇలా అని తను నర్తించి చూపిస్తుంది చెయ్యిమళ్ళీ అంటూంది.
|
అంతగొప్పస్థితిని వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో శ్రీరామాయణాంతర్గతంగా
ఆవిష్కరించి చూపిస్తారు అవి అనుభవించాలి ఆ శ్లోకాలని నిజంగా మహాద్భుతం ఆ వసంత
ఋతువు వర్ణణం. ఆయనా ఒకచో అంటారు ప్రాప్య దుఃఖం వనే శ్యామా సా మాం మన్మథ కర్శితం
! నష్ట దుఃఖేన హృష్టే వ సాధ్వీ సాధు అభ్యభాషత !! ఆయనా ఈ శ్లోకంలో అంటారు
సీతమ్మ నాతో కలిసి అరణ్యవాసానికి వచ్చింది ఆ వచ్చినటువంటి సీతమ్మ సాధ్వి ʻసాధ్విʼ అంటే ఏమిటంటే
భార్యకుండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తున్నారు. ఏ కారణం చేత పురుషుడికి
భార్య జ్ఞాపకానికి వస్తూంటుంది అంటే ఈ గుణము సంతరించుకుని ఉండాలీ అని అటువంటి
భార్య ఉన్నప్పుడు పురుషుడు కూడా స్మరించాలి తప్పా ఇంకోళ్ళని స్మరిస్తే వానికన్నా
పాతకుడు ఇంకోడులేడు కాబట్టి సాధ్వీ
అంటే తాను చాలా కష్టపడుతూ నేను కష్టపడుతున్నానండీ అన్నమాట చెప్తే ఆయన బాధపడుతాడని
చెప్పకుండా ఆయన కష్టాన్నిగమనించి తన మాటలతో ఆయన కష్టంలోంచి పైకొచ్చేటట్టుగా
ఊరడిల్లేటట్లుగా మాట్లాడగలిగేటటువంటి ప్రజ్ఞాశాలిని ʻసాధ్వీʼ అని
పిలుస్తారు. ఆయన అంటున్నారు
తన పుట్టింటివారిని విడిచిపెట్టింది మెట్టింటివారిని విడిచిపెట్టేసింది నాకోసం
అరణ్యవాసానికి వచ్చింది ఎంత క్లేషపడింది సీతమ్మ ఇంత క్లేషపడుతున్నటువంటి సీతమ్మ
నాతో ఎప్పుడూ ఏమండీ ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అని అనలేదు ఎందుకో తెలుసా... సీతమ్మ
చాలా ఇబ్బందిగా ఉందని నేను బాధపడుతుండి ఉంటాను ఇప్పుడు తను ఈ మాట అంటే బాధపడుతానని
తనబాధ కప్పేసింది తప్పా నేను
బాధపడతానని తన బాధను తెలిసేటట్టుగా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు.
|
కాబట్టి ఆయన ఈ మాట చెప్పీ అందువల్ల నాకు నాభార్య
జ్ఞాపకానికి వస్తూంటుంది లక్ష్మణా... మయూర స్య వనే నూనం రక్షసా న హృతా ప్రియా !
తస్మాన్ నృత్యతి రమ్యేషు వనేషు సహ కాంతయా !! చూశావా లక్ష్మణా ఆ పంపాసరోవర
తీరంలో గుహ ముందు ఒక మగనెమలి నాట్యం చేస్తోంది. సాధారణంగా మగనెమలిది అందం లోకంలో
చిత్రమేమిటో తెలుసాండి, మనం మనుష్య లోకంలో అయితే ఏమిటంటామంటే ఆడదాన్ని అందమంటాం
మీరేమో పెద్ద విచారణకాని పెద్ద లోతుపాతులకు కాని నేనేమి వెళ్ళను అలా అంటారు ఆడది
అందమంటారు పురుషుడిది వ్యామోహం అలా తీర్పు చెప్తుంటారు అంతేగాని ఆయన అందంగా
ఉన్నాడని ఎవరు తీర్పు చెప్పరు, ఆవిడ అందంగా ఉందంటారు అందం ఆడదానికే వాడుతారు. కాని
మీరు చూడండి మనుష్యేతర ప్రాణులయందు అందం మగవాడిది కొట్టొచ్చినట్టు కనపడుతుంది
దాన్నిబట్టి చూస్తే అందం అన్నది పురుషుడియందే ఉందేమో అనిపిస్తుంది నాకు అంటే నీవు
పక్షపాతంతో తీర్పు చెప్పావని అని అనుకోకండి నేను ఒక యాదార్థం మాట్లాడుతుంటాను,
కోడి పెట్టదందమా కోడి పుంజుదందమా..? కోడి పుంజుదే అందం, ఆ కోడి పుంజు వెనకాల పెద్ద
రంగురంగుల ఈకలతోటి దాని ముకం దానికళా ఇంత స్వరూపం అది కొక్కరోకోయని మేడ ఎత్తి
అరిస్తే దాని అందమేవేరు. సింహం అందమా సివంగి అందమా సింహమే అందము ఈంత జూలు అది
నడుస్తూంటే సన్నటి నడుముతో ఎంత అందంగా ఉంటుంది, సివంగిదేమందం దానికి అలా జూలు అవి
ఏమీ ఉండవు ఏదో అన్ని కత్తిరించేసినట్లు ఉంటుంది.
|
కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు రామ చంద్ర
మూర్తి చూశావా మయూర స్య వనే నూనం రక్షసా న హృతా ప్రియా ! తస్మాన్ నృత్యతి
రమ్యేషు వనేషు సహ కాంతయా !! ఆ మగ నెమలి గుహ ముందు ఆడుతోంది, చక్కగా అది
అడుగువేస్తూ నాట్యం చేస్తోంది అంటే మీరు తనంతతాను స్వేచ్ఛగా తిరిగే నెమలి ఆటను
చూడాలి, ఎందుకంటే మనం ఎప్పుడూ అలా చూడం మన బతుకంతా ఎలా ఉండిపోతుందంటే క్షమించండి
నేను అలా అన్నానని నెమలి కనపడితే ఏ పుల్లతోటో దాని ఈకలునొక్కేసి లాగేద్దామని
తాపత్రయమే, అసలు మీరు నెమళ్ళ అందం చూడాలండీ ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి వాళ్ళు అలా
ముట్టుకోరు, కాకులు ఎలా ఉంటాయో నెమళ్ళు అలా ఉంటాయి ఢిల్లీ ప్రాంతంలో అన్ని నెమళ్ళు
తెల్లవారి లేచేటప్పటికి మేడలమీద నెమళ్ళ క్ర్యాంకణాలు వినపడుతూనే ఉంటాయి. నేను మా
చెల్లి ఇంటికివెళ్ళి ఢిల్లీలో తెల్లవారిఝామున నెమళ్ళన్ని గుంపులు గుంపులుగా
క్ర్యాంకణం చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో అది సాయంకాలం వేళ దానికేదో
సంతోషం వస్తుంది. మీరు ఎప్పుడైనా నెమలి పురివిప్పి ఆడ్డం చూశారోలేదో నాకు తెలియదు
కాని అది పురి విప్పడం అంటే కేవలం ఏదో ఇలా పురి విప్పి ఆడుతుందని అనుకోకండి. అది
అడుగులు వేసి నృత్యం చేసేటప్పుడు మీరు చూడాలి దాన్ని ఇలా వెనక్కి నొక్కి మధ్యలో
చుట్టూ వృత్తం కింద ఏర్పాటు చేస్తుంది, ఒక్కొక్కసారి ఇలా ఊంచుతుంది ఊంచి ఇలా పెద్ద
విసనకర్రలా పెడుతుంది పెట్టి నాట్యం చేస్తుంది. అది సంతోషం కలిగి ఆ వెనకాల
ఉండేటటువంటి పింఛాన్ని ఆధారం చేసుకొని అది ఆడేటటువంటితీరు అత్యద్భుతంగా ఉంటుంది.
|
దాని అదృష్టం ఏమిటో తెలుసాండి... డాక్టర్ అన్నది
చదువుకోవలసిన అవసరంలేని జాతి కాకి జాతి ఒక్కటే, అంటే కాకికి రోగం రాదు, మీకు
కాకికి ఎప్పుడూ అనారోగ్యం వచ్చినటువంటి కాకి కానీ తనంత తాను వృద్ధాప్యం వచ్చి
చచ్చిపోయిన కాకికానీ మీకు కనపడదు. అసలు నేనైతే అంటాను మున్సిపాల్టివాళ్ళు పౌర
సన్మానం చేయవలసివస్తే రెండు ప్రాణులకు చెయ్యాలి ఒకటి కాకి రెండు పంది, ఆ రెండు వాళ్ళకి
చెసినంత సహాయం ఎవ్వరూ చెయ్యరు, మిగిలినవాళ్లందరు వాళ్ళ బాధ్యత పెంచేవాళ్ళే వీధిలో
అన్ని పోసేస్తారు వీళ్ళు తుడవడానికి వచ్చేటప్పటికే సగం పూర్తి చేసేస్తాయి ఆఖరికి
ఇలా అన్నదాన్ని కూడా కాకి పట్టుకుపోతుంది. దానికి ఇది అదీ అని ఏమీలేదు అది
తీసేయబట్టి చాలా మనకు తెల్లవారేటప్పటి రోడ్లు కాస్త ప్రశాంతంగా ఉంటున్నాయండి,
రెండోది పంది ఆ రెండు ఉండబట్టే మున్సిపాల్టివాళ్ళపని చాలామట్టుకు తగ్గిపోతుంది.
కాబట్టి ఇప్పుడు ఆ కాకికి అంత గొప్పతనం ఎక్కడిదండీ అంటే యమధర్మరాజుగారి వరం నిన్ను
రోగం పీడించదు లోకంలో అన్నిజాతులను పీడిస్తుంది కాని నీకు రోగం రాదు మరి
చచ్చిపోవడం ఎలాగ నియంత నీవు ఏదో ప్రమాదం వల్ల చచ్చిపోవాల్సిందే తప్ప నీయంత నీవు
చచ్చిపోవడం అన్నది లేదు అవతలకి పొమ్మనాడు ఆయన అందుకే అన్ని కాకులున్నా నాలుగు కాకులు
చచ్చిపోయాయని ఎప్పుడు కనపడదు, కాకి చచ్చిపోతే శాక్ కొట్టి చచ్చిపోవడమో ఎవరో కాటిల్
బార్ పెట్టి కొడితే ఎదో గుండు తగిలి చచ్చిపోవడమో అలా చచ్చిపోవాలి తప్పా కాకి
సహజంగా చచ్చిపోయింది అని చెప్పడం చాలా కష్టం. రెండు ఓ కాకిని గుర్తు పెట్టుకోవడం
కూడా చాలా కష్టం వెయ్యి కాకులు వాలాయనుకోండి ఓ కాకిని గుర్తు పెట్టుకుని ఎగురుతూ
దాన్నిగుర్తుపెట్టుకుంటారేమో ఎప్పుడైనా చూడండి.
రామాయణం చదివితే మీకు ఇటువంటి పరిశీనలు అలవాటౌతాయి, మీరు కాకిని
గుర్తుపట్టుకోలేరు ఎందుకంటే అన్ని ఒకేలా ఏది యవౌనంలో ఉందో ఏది చిన్నదో ఏది
వృద్ధురాలో ఏది మధ్యవయస్సులో ఉందో ఏది వానప్రస్థానికి వెళ్ళాలో మీరు నిర్ణయించలేరు
అన్ని ఒక్కలా ఉంటాయి, అది యమధర్మరాజు గారి వరం ఆ జాతికి. ఆ కాకి సంతోషంగా అరిచింది
అంటాడు రాముడు ఎలా తెలుస్తుందండి సంతోషంగా తెలుస్తుందని. అంటే వాల్మీకి రామాయణం
చాలా అద్భుతం ఆయన అంటారు ఏష వై తత్ర వైదేహ్యా విహగః ప్రతిహరకః ! పక్షీ మాం
తు విశాలాஉక్ష్యాః సమీపన్ ఉపనేష్యతి !! కాకి వెళ్ళిపోతూ తన తల నుంచి వెళ్ళిపోతూ కావ్
కావ్ అని అరిచిందనుకోండి అమంగళం వస్తూందని గుర్తు, కాకి తను కూర్చుని ఉంటే తన
పక్కకి వచ్చి అరిచిందనుకోండి మంగళం జరుగుతుందని గుర్తు అందుకే మనవాళ్ళు కాకి వచ్చి
కూర్చుని అరిచిందనుకోండి, ఇంటికి ఎవరో బంధువులొస్తారే కాకి అరిచింది అంటారు అంటే మంగళం అన్నమాట, మన సనాతన ధర్మంలో
గొప్పతనమేమిటంటే ఇంటికి బంధువులు రావాలి వాళ్ళతో కలిసి అన్నం తినాలి వాళ్ళకు అన్నం పెట్టాలని
కోరుకున్న జాతి అందుకే నేను పొద్దున్నే అంటున్నాను మాకిచ్చిన విడిదిలో
భోజనం చేసినప్పుడు చెయ్యి కడుక్కుంటుంటే ఇక్కడ అంటుకోలేదనుకోండి వాడి జన్మలో వాడు
ఎవ్వరికి అన్నం పెట్టలేడని గుర్తు, వాడు తను తినడం కష్టం, తను మాత్రమే తింటాడు
తప్పా తన వలన నలుగురు భోజనం చేయడం కానీ తనతో నలుగురు భోజనం చేయడం కానీ ఉండదు.
ఎవ్వడు వెళ్ళడు ఆ ఇంటికి ఓ వాడిండికి మనమెందుకండీ అంటారు, ఆయన ఉన్నచోటికి వద్దనాలి
తప్పా మీరు రమ్మన్నారో ఎడాతెరిపి ఉండదు అలా వస్తారు అది ఎక్కడిదో తెలుసాండి... అన్నాన్ని
అమృతంగా తినమని అరచేతియందు అమృతం ఉంటుందని చేతితో అన్నం తినగలిగినటువంటి ప్రాణులలో
సర్వోత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు, అన్నం తింటే కలుపుకు తినాలి తింటే అరచేయి అంతా
అంటుకుపోయి ఇక్కడ వరకు కడుక్కోవలసి రావాలీ అని ఇక్కడ వరకు కడుక్కోవలసి వచ్చేటట్టుగా
అరచేతిని ఎవడు కడుక్కునేటట్టు అన్నం తింటాడో వాడు తాను తిని నలుగురికి పెడతాడూ
అని, అందుకనీ ఈతరంలో బహుషా చెప్పేవాళ్ళు ఉండరేమో టీవీ చూడమనేవారే తప్పా...
సీరియల్స్ గుర్తుంటాయి కాని అవి గుర్తుంటాయా..? నాకు అనుమానం, ఆ ముందు తరాలవరకు ఒక
విషయం ఉండేది మునివేళ్ళ తిండి తినకండిరా అనేవారు, మునివేళ్ళ తిండి అంటే ఇలా వేళ్ళతో
కలుపుకుతినడం. ఇలా చెయ్యంతా తగిలేటట్టుకలపరా..? కలుపుకుతిను అనేవారు, అద్దుకు
తినడం లేకపోతే ఎడం చేత్తో పట్టుకుతినడం అలాంటివి ఉండేవికావు ఒక్క కుడిచేతితోనే సరే
ఇప్పుడు మళ్ళీ ఒకదాంట్లోంచి ఒకదాంట్లోకి.
కాబట్టి ఇప్పుడు కాకి
కూర్చొని అరిస్తే మంగళ ప్రదం, కాకి తల నుంచి ఎగురుతూ అరుస్తే అమంగళ కరం,
రాముడు అంటున్నాడు నేను మారీచున్ని చంపివచ్చినప్పుడు నా తల నుంచి ఎగురుతూ అరిచింది,
సీతమ్మ కనపడలేదు ఇప్పుడు లక్ష్మణా చెట్లమీద కూర్చుని అరుస్తుంది, కాబట్టి తొందరలో
సీతమ్మ దర్శనం మనకు అవుతుంది సీతమ్మతో కలుస్తాం. చూశావా ఆ పక్షి అప్పుడూ చెప్పింది
ఇప్పుడు చెప్తూంది, అప్పుడు అమంగళం చెప్పింది ఇప్పుడు మంగళం చెప్తూంది అన్నాడు.
మీతో నేను శకున శాస్త్రం అన్నాను కదాండీ! రామాయణం శకున శాస్త్రం కాబట్టి ఒక
మంగళాన్ని మంగళంగా స్వీకరించగలిగి ఉండాలి కాబట్టి పూర్వం ఏదైనా తింటూ ఏం
చేసేవారంటే ఓనాలుగు తీసుకెళ్ళి అలా పడేసేవారు కాకికో దేనికో
అయితే నేను మీతో ఒక
సూక్ష్మం చెప్పవలసి ఉంటుంది, ఎప్పుడైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి
పిడచకట్టి విస్తర పక్కన పెట్టకూడదు, పిడచకట్టిమాత్రం పెట్టకూడదు మీరు మీ కొడుక్కి
పెట్టాలనిపించిందనుకోండి మీరు తింటూ పిడచకట్టి పెట్టకూడదు, కొత్తావకాయ
కలుపుకున్నారండి ఈ ఋతువులో అవి చాలా ఎక్కువ కొత్తావకాయ తనుమాత్రమే కలుపుకుని
తిన్నటువంటి తల్లి లోకంలో ఉండదు, కలుపుకోగానే ముందు ఏం చేస్తుందంటే ఎంత
ధర్మాత్ముడవనీయండీ ఎంత అనుష్టాన తత్పరుడవనీయండి ఏమండీ ఇదిగో కొంచెం రుచి చూడండి
అంటుంది, తిని చూడాలి లేకుంటే అంతకన్నా ఘోరం ఇంకోటిలేదు గృహస్తాశ్రమంలో తినాలి
ఓసారి ఓ ముద్ద. కాని పిడచకట్టి పెట్టకూడదు ఓ ముద్ద విడిగా పెట్టాలి, మీరు భూత బలి
కొరకు పెట్టినా మీరు అన్నాన్ని పిడచకట్టిపెడితే అదిలేదు మనదాంట్లో, మనదాంట్లో
పిడచలు కడ్డడం అన్నది ఇంకొకప్పుడు, ఎప్పుడుపడితే అప్పుడు ఇంట్లో ప్రతిరోజు పిడచలు పెట్టడం పిడచలు తీసుకెళ్ళి
వీధిలో పడేయడం ఇది ఈశ్వరుడు మంగళప్రదం ఇచ్చినా నిత్య తద్దినం ఇంట్లో
పెట్టుకున్నవాడితో సమానమౌతారు కాబట్టి అలా పిడచలజోలికి వెళ్ళరాదు.
|
కాబట్టి ఇప్పుడు రాముడు ఇలా బాధపడుతూంటే సీతమ్మ
గురించి లక్ష్మణ స్వామి అన్నారూ ఉత్సాహో బలవాన్ ఆర్య నా౽స్తి ఉత్సాహాత్ పరం
బలం ! స త్సాహస్యాఽస్తి లోకే౽స్మిన్ న కించిత్ ఆపి దుర్లభం !! అన్నయ్యా! నీవు ఇప్పుడు సీతమ్మ పక్కనలేదూ అని
ఇంతబాధ పడుతున్నావ్ నీకు ఈ శోకము ఎంత కలిగితే నీవు అంత కృంగిపోతున్నావు శోకము మనిషిని పాడుచేస్తుంది శోక
స్థానంలో నీవు దేన్ని పెట్టుకోవలసి ఉంటుందో తెలుసా..? ఉత్సాహమును పుంజుకోవలసి
ఉంటుంది ఉత్సాహమును నింపుకోవలసి ఉంటుంది, అది తనంత తాను వచ్చేది కాదు నీయంత నీవు
పెంచుకోవలసింది, నీయంత నీవు పెంచుకుంటే ఉత్సాహంగా ఉంటావు, ఉత్సాహంగా
ఉండేటటువంటివాడు బంతిలాంటివాడు శోకంతో ఉండేటటువంటివాడు మట్టిముద్దలాంటివాడు,
మట్టిముద్దని ఇలా అన్నామనుకోండి అంతే నేలపాలౌతుంది ఇంక మళ్ళీ పైకిలేవదు, బంతి
కిందపడుతుంది కాని పైకి లేస్తుంది ఉద్ధాన-పతనములు అందరికీ ఉంటాయి కాని పడడం లేవడం
ఉంటుంది జీవితంలో కాని పడి ఉండిపోకూడదు లేవాలి ఉత్సాహంతో, లేవడానికి ఉత్సాహం
ఉండాలి మళ్ళీ కాబట్టి అన్నయ్యా నీవు ఉత్సాహాన్ని పుంజుకో ఉత్సాహో బలవాన్ ఆర్య
నా౽స్తి ఉత్సాహాత్ పరం బలం ! స త్సాహస్యాఽస్తి లోకే౽స్మిన్ న కించిత్ ఆపి దుర్లభం !! ఉత్సాహమును ఎవరు పుంజుకుంటాడో ఎవడు మనసులో
భీతిని విడిచిపెట్టేస్తాడో వాడు ఈ లోకంలో సాధించలేనిదంటూ లేదు ఏదైనా సాధిస్తాడు.
రామాయణంలో శ్లోకాల్ని రవీంద్రనాథ్ ఠాకూర్ గారు గీతాంజలిలోకి తీసుకెళ్ళాడు where the mind is
without fear and head is held high where the world has not been broken up into
frog mach by narrow domestic walls to thee my country అని ప్రార్థన చేస్తారు ఆయన. ఎక్కడ భయమన్నమాట
లేదో ఎక్కడ ప్రజలు తలెత్తుక తిరుగుతారో ఎక్కడ దేశము ముక్కముక్కలుగా కాక కారణములవలన
సంకుచిత్వమును పెంచుకోదో అటువంటి స్థితికి తండ్రి నా దేశాన్ని తీసుకెళ్ళు అని
ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఉత్సాహో బలవాన్ ఆర్య నా౽స్తి ఉత్సాహాత్ పరం
బలం ! స
త్సాహస్యాఽస్తి లోకే౽స్మిన్ న కించిత్ ఆపి దుర్లభం !! ఆ ఉత్సాహమున్నవాడు పొందలేనిదన్నది లేదు తప్పా
ఏదో ఒక చిన్న కారణానికి కలిసి రాకపోతే నిరుత్సాహము మనిషికి పనికిరాదు. ఉత్సాహాన్ని
పుంజుకొని నీవు సాధించుకునేదానివైపుకి వెళ్ళవలసి ఉంటుంది ఉత్సాహవంతః పురుషా న
అవసీదంతి కర్మసు ! ఉత్సాహమ్ అత్ర ఆశ్రిత్య సీతాం ప్రతి లభేమహి !! కాబట్టి
అన్నయ్యా నీవు ఉత్సాహన్నిపొందు మనం సీతమ్మతల్లిని తప్పకుండా చూడగలుగుతాం
కనిపెట్టగలుగుతాం అంటే ఇద్దరూ లేచి ఆ పంపాసరోవర తీరంలో ఋష్యమూక పర్వతం వైపుకి
అడుగులు వేస్తున్నారు తం ఆశ్రమం పుణ్య సుఖం శరణ్యం సదైవ శాఖా మృగ సేవితాంతం
త్రస్తా శ్చ దృష్ట్వా హరయో బభూవుః మహౌజసౌ రాఘవ లక్ష్మణౌ తౌ !! మహాతేజోమూర్తులైనటువంటి
ఆ రామ లక్ష్మణులు ఆ పంపాసరోవర తీరంలో నడుస్తూంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి
వానరములు మృగములు సింహములు ఇవన్నీ కూడా వాళ్ళ తేజస్సును చూసి భీతి చెందినవై
పరుగులుపెట్టి పారిపోతున్నాయట.
|
అలా పరుగుపెట్టి పారుపోతున్న సమయంలోనే ఋష్యమూక
పర్వతము మీద సుగ్రీవుడు కూర్చుని ఉన్నాడు, ఆయన చుట్టూ నలుగురు అమాత్యులు అంటే
మంత్రులు కూర్చుని ఉన్నారు, అంటే అమాత్యులు కూర్చుని ఉన్నారంటే ఆయనకి అధికారమేదీ
రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయాడుగా అంటే వాళ్ళు రాజుగానే చూస్తారు అది వాళ్ళమర్యాద
వాళ్ళు ఆయన్ని హే రాజన్ అంటారు, రాజుగానే గౌరవిస్తారు ఆయన కూడా వాళ్ళని
మంత్రులుగానే గౌరవిస్తాడు అది ఎప్పటికీ ఉండిపోయే పదవి ఇవ్వాళ రాచరికం లేదని వాళ్ళు
మంత్రులు కానివారు కారు. ఎప్పుడూ మంత్రాంగమును నెరపుతూ ఉంటారు అంటే సలహాలిచ్చి
నడిపిస్తారు కాబట్టి వాళ్ళు సచివులే మంత్రులే తప్పా ఆయనకు పదవిలేదు కాబట్టి ఈయన
మంత్రి కాదండి అనడానికేమి ఉండదు. అసలు లోకంలో ఊడిపోని మంత్రిపదవి అంటే ఒక్కటే
భార్యదే... కార్యేషు దాసి కరుణేషు మంత్రి ఎప్పుడు మంత్రాంగం భార్య చెప్తుంది, మంత్రాంగం
చెప్పడమూ అంటే ఆలోచన చెప్తుంది, భర్త వినాలీ అని దాని అర్థం. భార్యని సంప్రదించాలి
భార్యని సంప్రదించకుండా లోకంలో ఏదీ చెయ్యరాదు అది మర్యాద చెప్పాలి భార్యకి.
ఇవన్నీ సొంతంగా చెప్పేస్తున్నాడు ఇయ్యనా ఏదో కొంచెం బాగుండదని అలా అంటూంటాడు అనేమి
అనుకోకండి నేను మీకు ఒక ఋజువు చూపించనా..! మీకు లోకంలో ఏది రావాలన్నా పరమేశ్వరుడే
చెప్తాడు, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలో అని అడిగారనుకోండి
మీరు నేను అడగము పార్వతిదేవి పరమేశ్వరున్ని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఓ
పార్వతీ! లోకంలో అందరూ సుభిక్షంగా ఉండడానికి ఒకానొక వ్రతంబు కలదు దానిని తొల్లి
చారుమతిచేసేను ఆ విధానమును నీకు చెప్తాను విను నీవు ఇలా చెయ్యాలి లోకంలో అని
ఇప్పుడు మనమందరం అలా చేస్తాం.
అలా చెయ్యం ఇంకోలా చేస్తాం అలా చేశామని చెప్తాం అది వేరుమాట ఎందుకంటే చారుమతి
ఎలా చేసిందో మీరు ఎలా చేశారో చూసుకోండి ఓసారి, ఏమీ చెయ్యం బ్రాహ్మణున్ని పిలిచి
దానమిమ్మని ఉంటుంది ఎవ్వరూ ఇవ్వరు అలా చేశామని చెప్తారు అంతే. వ్రతము కాదు
వ్రతభంగం చేస్తుంటాం మనం కాబట్టి పరమ శివుడు చెప్తాడు కేయోపాయేన లఘునా అని
ఆవిడ అడుగుతుంది, నాథా ఏ ఉపాయంచేత నరుడికి విష్ణుసహస్ర నామం చెప్పిన ఫలితం
వస్తుంది అంటూంది శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్ర నామ తత్యుల్యం
రామనామ వరాననే !! అంటాడు. కాబట్టి రామాయణం
చెప్పాలనుకున్నా
అసలు యదార్థమేమిటో తెలుసాండి ఆవిడ వినడానికి ఆవిడకి కాళీ ఏదండీ అనకూడదు, నీవు
సంతోషంగా నీకు నచ్చిన శ్లోకం ఒకటి పట్టుకుని ఆవిడ వంటచేసుకుంటుంటే ఏమోయ్..
విన్నావా మయూర స్య వనే నూనం రక్షసా న హృతా ప్రియా ! ఎంత గొప్పగా వర్ణించాడో
చూశావా వాల్మీకి అని రామాయణమందు ఓ శ్లోకమో రెండు శ్లోకాలో ఆందమో ఆనందమో అన్నం
తింటున్నప్పుడో ఎప్పుడో భార్యతో పంచుకుని నీవేచెప్తే తప్పేం లేదు అది ధర్మం, ఆవిడ
మంత్రి ఆవిడకి తెలియాలి ఆవిడతో అన్ని తెలిసి ఉండాలి జీవితంలో తప్పా... లోకంలో ఒకపోకడ
ఉంటుంది, దానికెందుకండీ ఇవన్నీ అంటాడు చాలా తప్పది అలా ఉండకూడదు ఆవిడ మంత్రిని అది
పోయేపదవి కాదు అది ఎప్పటికి ఉండేపదవి ఒకసారి ప్రమాణస్వీకారంచేస్తే శరీరం
పడిపోయేంతవరకు ఉండిపోయే వరకు ఉండగలిగే మంత్రిపదవిలో ఉండేవాళ్ళు ఎవరంటే ఒక్క
ఆడవాళ్ళే. మిగిలినవాళ్ళవి పోయేమంత్రిపదవులు ఇదొక్కటే పోనిమంత్రిపదవి. కాబట్టి
ఆయనకి ఆవిడా ఆవిడకి ఆయనా ఇద్దరూ లేదా భర్త రాజు ఎందుకంటే పెద్దవాడై ఉంటాడు కదా..!
అందుకని.
|
కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు తౌ తు దృష్ట్వా
మహాత్మానౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ ! వర ఆయుధ ధరౌ వీరౌ సుగ్రీవః శంకితోఽభవత్ !! ఆ సుగ్రీవుడు శిఖరం మీద కూర్చుని ఉన్నటువంటివాడు
మీగిలినటువంటి వానరములన్ని కదిలిపోయి మృగాలన్నీ పారిపోతుంటే ఆయనకూడా ఎందుకిలా
పారిపోతున్నాయని ఇలా చూశాడు, రామ లక్ష్మణులు అలా వెళ్ళిపోతూ కనపడ్డారు వాళ్ళ
తేజస్సువంక చూశాడు శంకితో వెంటనే ఆయనకు శంక వచ్చింది, శంక వచ్చింది అంటే మీరు
గుర్తుపెట్టుకోండి ముప్పావువంతు చచ్చిపోయాడూ అని గుర్తు శంకకాని అంటే భయముతో కూడిన
అనుమానం వస్తే... ఉత్తర క్షణం మీ బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అందుకే భయంతో కూడిన
అనుమానం రాకూడదు ఎప్పుడు. మీరు ఎప్పుడైనా చూడండి నేను చెప్పింది యదార్థమో
కాదో భయం లేకుండా ఒక అనుమానం రావడం వేరు అది అదేమిటి అలా కదులుతోంది అనడం వేరు,
అది పామేమో... అనడం వేరు భయంతో కూడిన అనుమానం శంక. ఈ శంకకాని ఎవరికైనా పట్టుకుందో వాడు సగం చచ్చిపోతాడు
అంతే ముప్పావు వంతు చచ్చిపోతాడు పావు వంతే బతికుంటాడు, ఒక ఊపిరివలన బతికుంటాడు
అంతే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడికి శంకకలిగింది శంక అంటే ఏమిటి అనుమానం
వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారేమోనని అనుమానం వచ్చింది అది మహర్షి యొక్క హృదయం.
ఈ అనుమానం రాగానే ఉద్విగ్న హృదయః ఉద్విగ్నత కలిగింది హృదయంలో అంటే
తత్తరపాటు కలిగింది ఒక్కసారి భయమేసింది, ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు కాబట్టి తననే
వెతుకుతున్నారు కాబట్టి తను వెంటనే ఏం చెయ్యాలంటే కంటపడకూడదు పారిపోవాలి కాబట్టి
ఏం చేశారంటే ఉద్విగ్న హృదయః సర్వా దిశః సమఽవలోకయన్ ! న
వ్యతిష్ఠత కస్మింశ్చి ద్దేశే వానర పుంగవః !! అక్కడ కూర్చోకుండా వేంటనే లేచి ఒక్క గంతు గెంతి
ఇంకో శిఖరం మీదకి వెళ్ళిపోయాడు, ఎప్పుడైతే ఈయ్యన వెళ్ళిపోయాడో రాజుగారే
వెళ్ళిపోయాడంటే ఏదో ప్రమాదం వచ్చేసిందని మిగిలినవాళ్ళు నలుగురు ఎగిరిపోయారు అందరూ
తలకోదిక్కు ఎగిరిపోయారు, ఎగిరిపోయి వీళ్ళు ఎగిరిపోయినవాళ్ళు ఇక్కడ్నుంచి ఎగిరిపోయి
అక్కడ కూర్చుంటాడా ఏమిటి... అమ్మో వాళ్ళ నలుగురూ దూరంగా కూడా ఎగిరిపోయారా ఏమిటి
అమ్మబాబోయ్ వాళ్ళుకాని మళ్ళి ఇటువచ్చేస్తారేమోనని మళ్ళి ఇటునుంచి దూకేశాడు.
వీళ్ళేం సామాన్యమైన బలమున్నవాళ్ళు కాదు సుగ్రీవాదులు వీళ్ళు ఇలా గెంతుతుంటే...
సింహాలవంటి మృగాలుకూడా భయపడిపోయి విపరీతమైన వేగంతో అవి పారిపోతున్నాయి ఆ శిఖరాల
మీదకి ఒక్కసారి అంతా కూడా ఎలా ఉందంటే ప్రశాంతమైన సరస్సులో చెయ్యిపెట్టి తిప్పితే
ఎలా ఉంటుందో అలా అతలా కుతలం అయిపోయింది. ఆయన మళ్ళీ ఏం చేశాడంటే నలుగురి మంత్రుల్ని
దగ్గరికి పిలిచాడు కూర్చున్నాడు, కూర్చుని ఏతౌ వనమ్ ఇదం దుర్గం వాలి ప్రణిహితా
ధ్రువమ్ ! ఛద్మనా చీర వసనౌ ప్రచరన్తౌ ఇహ ఆగతౌ !! సుగ్రీవుడు చెప్తున్నాడు వాలి
చాలా కపటి అంటే అనుమానం ఎటువైపునుంచి వెళ్ళిందో చూడండి, వాలి సుగ్రీవున్ని
చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, సుగ్రీవుడి అన్నగారు వాలి, వాలికి సుగ్రీవుడి మీద
పగ కాబట్టి ఇప్పుడు వాలి నన్ను చంపడానికి చూస్తున్నాడు పరమ కాకక్షం ఉన్నవాడు నేను
ఈ పర్వతం మీద ఉన్నంత వరకు వాలి వచ్చి నన్ను చంపలేడు కారణం ఏమిటంటే వాలి ఈ శిఖరం
మీదకు వస్తే ఆయన మరణిస్తాడు మతంగ మహర్షి శాపం ఉంది.
|
మొదలు పెడుతూనే ఆయన సాధించినటువంటి విజయమేమిటంటే భయంతో శంకతో
పరిగెడుతున్నటువంటి రాజు యొక్క శంకని భయాన్ని తీరుస్తున్నారు. రాజు భయపడితే మంత్రీ
భయపడి పరిగెత్తాడనుకోండి ఇంకెందుకామంత్రీ... ఆయన ఆలోచించాడు, ఆలోచించి వివేచనతో
కూడిన తననిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు నీవు ఇలా పరుగెత్త కూడదు ఇక్కడికిరాడు వాలి,
వాలి రాడూ వాలి అనుచరులురారు ఆ వచ్చినవాళ్ళు ఎందుకొచ్చారో మనకు తెలియదు అసలు
తెలియకుండా వాలే పంపాడని ఎలా అనుకుంటున్నావు అనుకుని ఇలా గెంతులెందుకేస్తున్నావు
నీవు అలా గంతులేయకూడదు తప్పు నీ యొక్క పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తుందో
తెలుసా... అహో శాఖామృగత్వం తే వ్యక్తమ్ ఏవ ప్లవంగమ ! లఘు చిత్తతయాఽఽత్మానం న స్థాపయసి
యో మతౌ !! ఇంత బలహీనమైన
మనస్సున్నవాడివి ఒక వానరుడివి ఒక రాజుగా ప్రవర్తించలేనివాడివి ఇటువంటివాడివి
నువ్వు రేప్పొద్దున రాజరికం ఏంచేస్తావు, రేప్పొద్దున ఒకవేళ రాజరికమే వస్తే నీవు
ఎలా కూర్చుంటావ్ రాజుగా లఘు చిత్తతయాఽఽత్మానం నీది చాలా తేలికైన మనసు కదిలిపోతోంది
చెంచలత్వమైన మనస్సు అన్నింటికీ భయమే నీకు బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితైః సర్వమ్
ఆచర ! న హ్యఽబుద్ధిం గతో రాజా సర్వ భూతాని శాస్తి హి !! వాళ్ళు చెట్లవంక అలా చూస్తు వెళ్ళుతున్నారు అలా
వెడుతూ.
|
హనుమ యొక్క అవతారం రావడం వెనుకా చాలా గొప్పస్థితి ఒకటి ఉంది ఒకానొకప్పుడు,
అంజనాదేవి గర్భంతో ఉండగా ఒకసారి ఒక పర్వత గుహలోకి ప్రవేశించింది ఆవిడా శాలిసూక
నిభాభాసం ప్రసూతేమం తదాంగనా ష్కిన్యాహర్తు కామావై నిష్క్రాంతా గహనే వనే !
కిష్కింధ కాండ కాదు నేను ఉత్తర కాండలోంచి కలిపి చెప్తున్నాను మీకు ఇప్పుడు శాలిసూక
నిభాభాసం వడ్లగింజ యొక్క ఫైభాగం పచ్ఛగా ఎలా బంగారంలా మెరిసిపోతుందో అలా
మెరిసిపోయేటటువంటి కాంతి కలిగినటువంటి అంజనాదేవి. ఒక బిడ్డని ప్రసవించింది అందుకే
హనుమకి ఆకుపచ్చ రంగేస్తుంటారు అసలు హనుమ ఎప్పుడూ అలా ఉండరు ఆయనా కాంచనాద్రి
కమనీయ విగ్రహం కరిగించి పోతపోసిన బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటారు హనుమ.
కాబట్టి శాలిసూక నిభాభాసం ప్రసూతేమం తదాంగనా ఫలన్యా హంతునిష్కామావై
నిష్క్రాంతా గహనే వనే ! ఒక
పిల్లవాన్ని ప్రసవించింది ఆ గుహలో. ఆ పిల్లవాడు పుట్టగానే చాలా బలవంతుడుగా
కనపడ్డాడు వాడికి పళ్ళు పెట్టాలి అందుకని పళ్ళు పట్టుకొస్తాను అనీ ఆవిడ వనంలోకి
వెళ్ళింది.
ఈ పిల్లవానికి చాలా ఆకలేసింది ఆయనా రెల్లు
పొదల్లోపడుకొని సుబ్రహ్మణ్యుడు ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు ఆకలేసి అమ్మ కనపడలేదు ఆయన
లేచి బయటికి వచ్చాడు గుహలోంచి అంటే పుట్టగానే నడిచాడు ఆయన, నడిచి బయటికి వచ్చి
ఆయనకు పుట్టుకతోటే తినాలనిపించినప్పుడు పండే తినాలనిపించింది అంటే పుట్టుకతో
శాకాహారి, కాబట్టి ఆయన మంచి పండేమైనా ఉంటే బాగుండేది. అని ఇలా చూశాడు సూర్యబింబం
కనపడింది అబ్బ ఎంతబాగుందో ఈ పండు చక్కగా మెరుస్తోంది దీన్ని తిందామనుకున్నాడు,
కాబట్టి
బాలార్కాభి ముఖో బాలో బాలార్క ఇవ మూర్తిమాన్ గ్రహీతుకామో బాలార్కం ప్రవతీం పరమధ్యగ
ఈ పండు బాగుంది ఈ
పండు తిందామని ఆయన ఒక్కసారి సూర్యమండలం వైపు ఎగిరి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతే
సూర్యుడు చూశాడు చూసి అరేరే ఇంత దగ్గరిగా వచ్చేస్తున్నాడు ఈ పిల్లాడు నా తేజస్సుకి
కాలిపోతాడు ఎందుకంటే ప్రతి క్షణం తేజస్సును గ్రహించేసుకుంటారు సూర్యభగవానుడు. ఆయన
అనుకున్నాడట రాబోయేటటువంటి కాలంలో ఈయన వలన మహత్తరమైన ప్రయోజనం జరగాలి కాబట్టి ఈ
పిల్లవాన్ని నేను చెలకకూడదని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. ఈ పిల్లవాడు సూర్యుని
దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇది పండు తిందామని చేత్తో పట్టుకుంటున్నాడు ఆయన
సూర్య బింబాన్ని పట్టుకుంటుంటే ఆ సూర్యుడు చూశాడు శిశురేషత్ ప్రదోషజ్ఞా ఇతి
మత్వాదివాకరః కార్యం చాస్మిన్ సమాయత్తా ఇచ్చేవం నదదాః సహ 42 కాల్చలేదు
పిల్లాన్ని ఊరుకున్నాడు.
|
సూర్యబింబాన్ని పట్టుకుని బ్రతకడమంటే మాట్లాండి
ఆయన పట్టుకుని ఎటునుంచి కొరుకుదామని చూస్తున్నాడు అది గ్రహణ కాలం కాబట్టి రాహువు వచ్చాడు
తన వాహనం మీద వచ్చి సూర్య బింబాన్ని గ్రహించాలి ఆయన, ఆయన వస్తే, ఎటునుంచి కొరకాలి
ఈ సూర్యబింబాన్ని అని చూస్తుంటే రాహువు కనపడ్డాడు ఈ పండుకన్నా వీడేదో బాగున్నాడని
ఇటుఎగిరి ఆయనమీదకు వెళ్ళాడు ఆ రాహువు హడలిపోయాడు ఈ పిల్లాన్ని చూసి హడలిపోయి ఆయన
ఇంద్రలోకానికి పారిపోయాడు, వీడెవడో పారిపోయాడు ఈ పండేమిటీ ఇలా పోతుందీ అని ఈ పండే
బాగుంది దీన్నే పట్టుకుందామని ఆయన తిరిగి సూర్యుని దగ్గరికే వచ్చాడు, ఈలోగా ఆయన
ఇంద్రుని దగ్గరకు వెళ్ళాడు, నీవు మాట తప్పావు పర్వదినాలలో అంటే గ్రహణ దినంలో నేను
సూర్యున్ని గ్రసించవచ్చు ఇవ్వాళ నేను వెళ్ళేటప్పటికి ఇంకోడు అప్పటికే
గ్రసిస్తున్నాడు, నీవు ఇద్దరికి ఎలా ఇచ్చావు అవకాశం అన్నాడు నేను ఇవ్వలేదే అన్నాడు
ఇంద్రుడు, లేదు ఇంకోడు పట్టుకుని ఉన్నాడు సూర్యబింబాన్ని అన్నాడు చూస్తాను పదా
అన్నాడు ముందు రాహువు వెడుతున్నాడు వెనక ఇంద్రుడు వస్తున్నాడు దారి చూపించమన్నప్పుడు
చూపించవలసినవాడే కదాండి ముందు వెళ్ళాలి రాహువు వెళ్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు
సూర్యబింబాన్ని ఎటు కొరుకుదామనుకునేలోపల వీళ్ళిద్దరు వచ్చారు ఆయన కొరుకుదామని
చూస్తుంటే మళ్ళీ వచ్చాడు రాహువు వీడేదో బాగే ఉన్నాడు అని చెప్పి మళ్ళీ రాహువుమీద
పడ్డాడు పడితే ఆ రాహువు ఈయన్ని చూసి ఆ ఇంద్రుడి వెనక దాక్కున్నాడు. ఆయన ఇప్పుడు
ఐరావతాన్ని చూశాడు తెల్లటి ఎనుగు బాగుంది ఇదేదో బాగుందని ఇంకా గొప్పగా ఉంది ఈ పండు
అని ఈ పండును తిందామని ఐరావతాన్ని పట్టుకున్నాడు.
ఇంద్రుడు చూసి ఆశ్చర్యపోయి ఇదేమిటిది ప్రాణి ఇంతకు ముందు చూడలేదు ఏమిటిది ఇంత
బలంగా ఉంది, సూర్యబింబాన్ని ముట్టుకుంటుంది ఈ ప్రాణిని విడిచిపెట్టకూడదని తన
వజ్రాయుధాన్ని తీసి కొట్టాడు కొడితే చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టాడు ఇంకాను ఆయన,
ఆ ఎడమ దవడ సొట్టబడిపోయి అక్కడ్నుంచి పర్వత గుహదగ్గరకి పడిపోయాడు కిందపడిపోవడంలో
దవడ విరిగిపోయింది. ఈలోగా వాయువు చూశాడు ఆయన వాయు పుత్రుడు కాబట్టి ఇప్పుడు ఆ
వాయువుకి కోపం వచ్చింది, చిన్న పిల్లాడు ఇంతటి తేజోమూర్తి సూర్య భగవానుడంతటివాడు
తన తేజస్సును వెనక్కి తీసుకుంటే ఈ ఇంద్రుడొచ్చి వజ్రాయుధం పెట్టి కొట్టేశాడేమిటి ఎవరి పిల్లాడాని
కూడా కనీసం అడుగలేదు కోపమొచ్చి ఆయనేం చేశాడు ఒక్కసారి ప్రసరణని ఆపుచేశాడు.
ప్రసరణము అంటే మీ బయట అనుకోకండి, లోపల కూడా వాయువు తిరుగుతుంది, గాలి
తిరుగుతుంటుంది లోపలికెళ్ళి వాయువు బయటికి రావడం లేదాండీ అలాగే శరీరమంతా తిరుగుతుంది.
లోపల గాలి తిరగడం ఆగిపోయిందనుకోండి. కాష్టమైపోతుంది శరీరం అంటే కర్రలా అయిపోతుంది
అంటే బిగిసిపోతుంది. కాలు పట్టుకొనిలేపితే శరీరమంతా లేచిపోతుంది ఓ ఇనుప ఊచలేచిపోయినట్లు
అదే బిగిసిపోయింది శవం అంటాం కదా..? అంటే లోపల వాయు ప్రసరణం ఆగిపోయిందని గుర్తు
పూర్తిగా ఆగిపోతే బిర్రబిగిసిపోతుంది.
కాబట్టి ఇప్పుడు ప్రాణులన్నీ ఏమైపోయాయంటే బిర్ర బిగిసిపోయాయి ఎక్కడ వక్కడే ఇక
ఎవ్వరూ కదలికలేదు, అన్ని ప్రాణులు ఆగిపోయాయి, అన్ని ప్రాణులు ఆగిపోతే
సంధ్యావందనాలు ఆగిపోయాయి, సంధ్యావందనాలు ఆగిపోతే యజ్ఞాలు ఆగిపోయాయి, యజ్ఞాలు
ఆగిపోతే యాగాలు ఆగిపోయాయి హోమాలు ఆగిపోయాయి కాబట్టి ఇప్పుడు హవిస్సులు లేవు
కాబట్టి ఇప్పుడు హవిస్సులు ఎవ్వరు తినాలి దేవతలు తినాలి, వాళ్ళకి హవిస్సులేదు
ఏమిటీ ఎవ్వరూ హోమం చేయడం మానేశారని చూశారు అంతే ఎక్కడివారు అక్కడ స్టిల్
ఫోటోగ్రాఫ్ అంటారే అలా ఉంది లోకం. ఆసలు హనుమ పుట్టినప్పుడు ఈ లోకం చాలా
చిత్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది స్థంభీభూతమైంది అసలు ఓ కుక్కా నక్కా
పిల్లీ పందీ చీమా దోమా ఏవీ అన్నీ స్థంభీభూతమైపోయాయి ఎందుకంటే వాయువే అన్నిటికి
ఆధారం. ఇప్పుడు మనుషులు కదిలే పరిస్థితిలేదుగా స్థంభీభూతమయ్యారు కాబట్టి దేవతలు
వెళ్ళారు బ్రహ్మగారిదగ్గరికి. అయ్యా నీవు వాయువు వల్లే ప్రాణులు ఉంటాయి, వాయువువల్లే
భూతములు మిగులుతాయి అన్నావు ఇప్పుడు వాయువు జడీభూతం చేసింది ప్రాణులు కదలటం లేదు
లోపల ఏం చేయమంటావు ఎందుకు ఆగిపోయిందన్నారు. ఆయన ఒకసారి కళ్ళు మూసుకొని చూశారు,
చూసి అన్నారు ఏమిలేదురా అబ్బాయ్ అకస్మాత్తుగా స్ట్రైక్ లోకి వెళ్ళాడు, ఎందుచేతా
అంటే ఆయనకు ఒక ఇబ్బంది వచ్చింది, వాళ్ళబ్బాయిని కొట్టేశాడు ఇంద్రుడు కాబట్టి రండి
వెళ్దాము మనందరం అన్నాడు.
ఇప్పుడు చర్చలకి పిలిచేంత సమయంలేదు ఎందుకంటే అవతల స్థంభీభూతములైపోయాయి ప్రాణులు
మనమే వెళ్ళిపోదామని ఆయన ఒక కమండలం పట్టుకుని ఆయన బయలుదేరాడు వెనక దేవతలందరూ బయలుదేరి
ఎక్కడ హనుమని ఒడిలోపెట్టుకుని వాయువు కూర్చున్నాడో అక్కడికి వెళ్ళారు. వెళ్ళీ
ఒక్కసారి బ్రహ్మగారు వంగీ ఆ పిల్లవాడి బుగ్గలు రెండు పునికి కమండలంలో నీళ్ళు తీసి
ఇలా అన్నాడు ఆ పిల్లవాడు వెంటనే ఉలిక్కిపడి లేచి చైతన్యాన్ని పొంది వాడు ఆడుకోవడం
మొదలుపెట్టాడు. చాలా సంతోషించాడు వాయుదేవుడు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడూ ఈ
వాయువు గొప్పతనమేమిటో తెలుసా... అశరీర శిరీరేషు వాయుశ్చరతి పాలయన్ ఈ
వాయువుకి శరీరం లేదు కానీ ఈయన అన్ని శరీరాల్లోకి వెళ్ళి శరీరాల్ని నిలబెడుతుంటాడు వాయుః
ప్రాణః సుఖంవాయుః వాయు స్సర్వవిధం జగత్ వాయు నా శుభం పరిత్యక్తం న సుఖం విందతే
జగత్ వాయువే సుఖం అందుకే కదాండి ఇది పెట్టాడు. వాయువే సుఖం వాయువే ప్రాణం
వాయువు సర్వవిధం జగత్ వాయువే ఈలోకం లేకపోతే వాయువు లేకపోతే ఏం లేవు అందుకని ఆయన
అంత గొప్పవాడయ్యా కాబట్టి ఈ పిల్లవాడు రాబోయే కాలంలో రామ చంద్ర మూర్తికి సాయంచేసి
కొన్ని కోట్లమందికి ఆర్తత్రాణ పరాయణుడై నేను ఉన్నానూ అని నిలబడ గలిగినటువంటి గొప్ప
స్వరూపంగా మారుతాడు అవిత్రూణాం భయకరో మిత్రాణాం
అభయంకరాః ఎవరెవరు ఈశ్వర ద్వేషులుంటారో వాళ్ళపాలిట ఈయన భయంకరుడు. ఎవరు ఈశ్వరున్ని
ఆరాధిస్తారో వాళ్ళపట్ల అభయంకరుడు వాళ్ళ కోరికలు తీరుస్తాడు కాబట్టి మీ మీ
తేజస్సులు ధారపోయండి అన్నాడు.
|
అంటే వెంటనే ఇంద్రుడు ఒక వజ్రాల మాల తీసి ఆయన మెడలో
వేసి ఇక ముందెప్పుడు నా వజ్రాయుధం ఇయ్యనని చెనకదు నా వజ్రాయుధానికి ఆ శక్తి ఉండదు
అన్నాడు, వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు నా బ్రహ్మాస్త్రము ఇయ్యన్నికట్టదు
అన్నాడు, వెంటనే వరుణుడు లేచి అన్నాడు ఈయనకి రోగము అన్నది రాదు ఈయన ఎంత యుద్ధం
చేసినా బడలిపోడు నీటియందు పడినా ఈ పిల్లవాడికి మృత్యువురాదు, యముడు అన్నాడూ
యమదండము ఈ పిల్లవానియందు పనిచెయ్యదు కాబట్టి నేను ఈయన ప్రాణములను ఉగ్గడించలేను,
విశ్వకర్మ అన్నాడు నేను ఈ లోకములో అస్రములను శస్రములను నేనే రూపకల్పన చేశాను ఈయన
మీద ఎన్ని బాణాలు ఎన్ని అస్త్రాలు ఎన్ని శస్త్రాలు వేసినా ఈయన్ని ఎవ్వరూ కట్టలేరు
నేను చేసినవేమీ ఈయన మీదపని చెయ్యవు అన్నాడు, కుబేరుడు ఆయన ఒంటికంటివాడు పార్వతీ
దేవియొక్క అధరము వంక చూడకూడని చూపు చూసినందుకి ఒక కన్ను మెల్లకన్ను అయిపోయిందాయనకి
కాబట్టి ఆ కుబేరుడు ఒంటికంటివాడు ఆయన కూడా ఆయనకు వరమిచ్చాడు నా యొక్క ఆయుధం నీమీద
పనిచేయదు అని. కాబట్టి ఇప్పుడు దేవతల యొక్క ఆయుధాలు కూడా ఏవీ పనిచేయవు, దేవతల
ఆయుధాలే పనిచేయవు అంటే ఇంక మనుష్యుల ఆయుధాలు అస్సలు పని చెయ్యవు.
అసలు పుట్టీ పుట్టిన రోజుననే పుట్టిన ఒక రెండు గంటలకి ఈ బ్రహ్మాండములో ఎవ్వరూ
కూడా నిగ్రహించలేనంతగా శక్తి సంపన్నుడు అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయనను
కట్టగలిగినవాడు పట్టగలిగినవాడు లోకంలో లేడు అంతటి బలపరాక్రమము అంతటి బుద్ధివైభవము
ఉన్నవాడు. సూర్య భగవానుడు అన్నాడు నాలో కొంత తేజస్సు ఈయనకి ఇచ్చేస్తున్నాను
అన్నాడు అంతటి తేజోమూర్తి. నేను ఈయనకి గురువునౌతాను గురువునై విద్యనేర్పుతాను
అన్నారు. ఎంత గొప్పగా నేర్చుకున్నారో తెలుసాండి, సూర్యునివెంట వెళ్ళి
విద్యనేర్చుకోవడం కష్టంగా ఉందని అస్తాద్రిమీద పూర్వాది మీద రెండిటిమీద రెండు
కాళ్ళువేసి సూర్యుడు తిరుగుతుంటే సూర్యుడితోపాటు ఇలా తల తిప్పుతూ విన్నారు.
స్పాండలైటీస్ ఉన్నవారు ఎక్సర్ సైజ్ చేస్తారే అలా తల తిప్పుతూ వేదం వినేశారు ఆయన
సూర్యభగవానుని దగ్గర. అసలు హనుమ స్వరూపంలాంటి స్వరూపం లోకంలో ఉండదు అంతగొప్పవాడు
అయిపోయాడు. చిన్న పిల్లవాడైనా ఆ పిల్లవాన్ని ఋష్యాశ్రమాల్లో వదిలిపెట్టేశారు
వదిలిపెడితే ఒంట్లో విపరీతమైన బలం, ఏం చేస్తాడు ఆయన ఏదో ఓ అల్లరి చెయ్యాలి స్రుక్కులు
స్రువాలు విరిచేయడం అగ్నిహోత్రం చేసుకుందామనుకున్న వేదులు తిరగేయడం తెచ్చుకున్న
పూలదండలు తెంపేసేయడం వాళ్ళు మడిబట్టలు ఆరేస్తే చింపి ముక్కలు చేసేయడం ఇలాంటి
పనులన్నీ చేస్తే ఆ చూసినటువంటి ఋషులు అన్నారు ఇప్పుడు ఈ పిల్లాడికి ఇంత బలం అవసరం
లేదు.
ఎదర ఒకానొకప్పుడు అవసరం వస్తుంది ఈ బలం అప్పటి వరకు ఈ పిల్లాడికి ఈ బలం ఉంటే
మమ్మల్ని బతకనీయటంలేదు అల్లరి చేస్తున్నాడు, కాబట్టి కోపం తెచ్చుకోలేదు వీడికి
అవసరమైనప్పుడు ఇద్దాం ఆ బలం అప్పటి వరకు సేపురేనం రఘుశ్రేష్ఠా నాతి వృద్ధాతి
మంజమహా యదా తే స్మార్యతే కీర్తిః తదాతే వర్తతే బలం అప్పటి వరకు ఈ
పిల్లవాడు బలాన్ని మరిచిపోతాడు అందుకని ఈయనకి గుర్తుండదు. కాబట్టి తను బలం
లేనివాడిలా ఉంటాడు పైకి ఒకానొకప్పుడు
ఈయన కీర్తిని
స్మరిస్తారు కీర్తిస్తారు ఒకాయన ఆ కీర్తించినప్పుడు ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది,
జ్ఞాపకానికి వచ్చిన తరువాత ఇంక ఆయన్ని పట్టుకోగలిగినవాడు ఉండడు. లోకంలో ఓ
పిచ్చిమాట ఒకటి ఉంది హనుమకి తన బలం తనకు గుర్తుండదండీ మనం గుర్తు చెయ్యాలండీ
అంటూంటారు ఎప్పటికీ కాదు ఆ శాపం, చిట్ట చివర కిష్కింధ కాండ చివర జాంబవంతుడు
స్తోత్రం చేశాడు. అక్కడితో పోయింది ఆ శాపం. ఆయన్ని స్తోత్రంచేస్తే ఆయనకు
గుర్తొచ్చింది శాపం, గుర్తొస్తే నూరు యోజనములు దాటి వెళ్ళిపోయాడు అప్పటివరకే,
అంతేకాని ఇప్పటివరకు మనం ఏదో గుర్తుచేస్తే తప్ప గుర్తురాని అమాయకుడు అనుకొని మనం
ఏదో గుర్తుచేసే ప్రయత్నంలో ఉన్నట్లు గుర్తుచేసే పిచ్చి పిచ్చి ప్రయత్నం చెయ్యకూడదు
ఆయనదగ్గర. ఇప్పుడు ఆయన పూర్తి శక్తివంతుడే, ఇప్పుడేమిటి ఎప్పుడో కిష్కింధ కాండ
చివరినాటికే ఆయనకు ఆ శక్తి వచ్చేసింది కాబట్టి అంత గొప్ప స్వరూపం కలిగిన
మహానుభావుడు హనుమ.
|
కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అన్నాడూ దీర్ఘ
బాహూ విశాలాఽక్షౌ శర చాపాఽసి ధారిణా ! కస్య న
స్యా ద్భయం దృష్ట్వా ఏతౌ సుర సుతోపమౌ !! వీళ్ళని చూస్తే దేవతల్లా ఉన్నారు, ఆసలు ఆ
చేతులు చూశావా ఎంతెంత పొడుగైన చేతులో ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం ఆ
మూర్తిని చూశావా ఎంతెంత పొడువున్నారో ఒక్కొక్కళ్ళు ఆ చేతుల్లో ధనస్సు చూశావా
వాళ్ళు పట్టుకున్నటువంటి తూణీరములు ఏదో కోరలతో బుసలు కొడుతున్న పాముల్లా ఉన్నాయి ఆ
బాణాలు అటువంటి వాళ్ళని చూస్తే ఏతౌ సుర సుతోపమౌ అటువంటి వాళ్ళని చూస్తే
ఎవరికి భయంవేయదయ్యా అందుకని భయం వేస్తూంది వాలి ప్రణిహితా ఏతౌ శంకేఽహం పురుషోత్తమౌ !
రాజానో బహు మిత్రా శ్చ విశ్వాసో నాఽత్ర హి క్షమః !! రాజుకి అనేక మంది మిత్రులు ఉంటారు ఎవరితో మిత్రత్వం
చేస్తున్నాడో మనకు తెలియదు, వాలి ఎవరితో మిత్రత్వం చేసి ఈ వీరుల్ని తీసుకొచ్చాడో
తాను ఋష్యమూకం మీదకు వెళ్ళకూడదు కానీ నన్ను వధించగలిగినటువంటి బలవంతుల్ని
తీసుకొచ్చి ఉంటాడు అందుకే అంత బలంగా ఉన్నారు వాళ్ళిద్దరు నాకోసమే వెతుకుతున్నారు,
వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడకి వచ్చేస్తారు వెతికి వెతికి నన్ను చంపేస్తారు
అయిపోయింది అందుకే నాకు భయం అన్నాడు.
అంటే ఓ నిర్ణయానికి వచ్చేశాడు శంకతోటి కృత్యేషు వాలీ మేధావీ రాజానో బహు
దర్శనాః ! భవన్తి పహన్తార స్తే జ్ఞేయాః ప్రాకృతై ర్నరైః !! చాలా మేధావి వాలి
ఏం సామాన్యుడు కాడు కాబట్టే ఇంత ప్రణాళిక రచించాడు అటువంటి రాజుల విషయంలో
సామాన్యులు భయంగా ఉండద్దూ ఇప్పటికే నా రాజ్యం అపహరించాడు నా భార్యని అపహరించాడు,
ఇప్పుడు నా ప్రాణములను అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడు అని హనుమవంక చూసి
అన్నారు, అంటే మంత్రి మీద ఉన్న నమ్మకం ఎందుకలా భయపడుతావు లఘు చిత్తతయాఽఽత్మానం అంటున్నావు కదా... ఒకపనిచేయి నీవు వెళ్ళి
అడిగిరా నీవు కనుక్కునిరా అసలు మనం భయపడవలసిన అవసరం ఉన్నవాళ్ళో భయపడనవసరం
లేనివాళ్ళో నీవువెళ్ళి విచారణచేసిరా అంటే ఆయనకీ హనుమ మీద అంత నమ్మకం రాజుకి,
నలుగురు సచివులున్నా మీగిలినవాళ్ళకి ఈ బాధ్యతలు అప్పజెప్పలేదు ఎందుకంటే అవతలి
వాళ్ళు టక్కరితనంతో సుగ్రీవుడి దగ్గరకి రావడం కోసమే తిరుగుతున్నవాళ్లైతే వెళ్ళి
అమాయకంగా మాట్లాడేవాళ్ళైతే వాళ్ళని తీసుకొచ్చేశాడనుకోండి సుగ్రీవుడు దగ్గరికి
అయిపోయింది అంతే కథా... కాబట్టి వాళ్ళ హృదయమెరింగినవాడై ఉండాలి. ఒకవేళ వాళ్ళవల్ల
ఉపయోగముందంటే తీసుకురావాలి అక్కరలేదనుకుంటే నిశ్దంగావచ్చేసి రాజుకి హెచ్చరికచేసి
రాజును తప్పించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినవాడై ఉండాలి.
|
అంటే ఏమౌతుంది ఇప్పుడు తనూ... ఆయన తనకు కనపడుతుంటారు, తను చెప్పినట్లే
మాట్లాడుతున్నారో లేదో తనకు నమ్మకం కలిగేటట్టుగా అక్కడ హనుమ ప్రవర్తిస్తున్నారో
లేదో తను చూసుకుంటుంటాడన్నమాట. అందుకని నీవు అలా నాకు ఎదురుకుండా కనపడుతుండాలి
సుమా! నాకు నీవు కనపడేటట్టుగా నిలబడి మాట్లాడు తప్పా వాళ్ళు నాకు కనపడేటట్టుగా
మాట్లాడకు ఇలా నిలబడి మాట్లాడేటప్పుడు అలా నిలబడి మాట్లాడు, ఎంత జాగ్రత్త
తీసుకున్నాడండీ ప్రాణంమీదకి వచ్చినప్పుడు ఇన్ని జాగ్రత్తలు వస్తాయిలా ఉంది మమ
ఏవ అభిముఖం స్థిత్వా పృచ్ఛ త్వం హరి పుంగవ ! ప్రయోజనం ప్రవేశ స్య వనస్యాఽస్య ధను ర్ధరౌ !! అసలు ధనస్సు పట్టుకున్నటువంటి వాళ్ళిద్దరు
తాపసుల వేషంలో ఈ అరణ్యంలోకి ఎందుకొచ్చారో నీవు కనుక్కురా అన్నాడు. మీరు ఇప్పుడు హనుమ
యొక్క ప్రజ్ఞ చూడాలి ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నారు ఒక్క ధూకు ధూకి ఆయన రామ
లక్ష్మణుల దగ్గరికి వెళ్ళిపోగలడు వెళ్ళిపోయారనుకోండి సుగ్రీవుడు భయపడిపోతాడు
ఎందుకంటే వినపడుదుగా ఏం మాట్లాడుకుంటున్నారో, దురంగా ఉంటారు ఒక గంతు గంతి
వెళ్ళిపోతారు కానీ సుగ్రీవుడి భయం ముందు తీరాలి, అంత ప్రమాదమేమీ వచ్చేయదు
ఈయనవెళ్ళి మాట్లాడగానే తన దగ్గరకొచ్చే అవకాశంలేదు హనుమను వాళ్ళు మోసగించలేరు అన్న ధైర్యం
ముందు రాజుకు కలగాలి, హనుమని వాళ్ళు మోసగించలేరు అంటే హనుమ హనుమగా వెళ్ళారనుకోండి
ఈయన భయంపోదు మావాడు ఏమైనా పొరపాటు మాట్లాడితే వాళ్ళకు తెలిస్తే తెలుసుకుని
వచ్చేయరుకదా అని దగ్గరికి వస్తే నిలబడుతాడని నమ్మకంమేం లేదు, కాబట్టి ఇప్పుడు హనుమ
వెలుతున్నటువంటి రూపం మీద రాజు నమ్మకం కలగాలి, హాఁ.. ఇప్పుడు ఇంక మనవాడు నిజం
రాబట్టేస్తాడు భయం లేదనుకోవాలి.
అందుకని హనుమ ఏం చేశారో తెలుసాండీ కపి రూపం
పరిత్యజ్య హనుమాన్ మారుతాఽఽత్మజః ! భిక్షు రూపం తతో భేజే శఠ బుద్ధితయా కపిః
!! తన రూపాన్ని
విడిచిపెట్టేసి ఒక సన్యాసి రూపాన్ని పొందాడు, పొంది రామ లక్ష్మణుల దగ్గరకి
వెళ్ళాడు ఇప్పుడు
సుగ్రీవుడు చూడగానే సంతోషించాడు. హాఁ.. ఎందుకనీ మొన్న మీతో చెప్పా... ఎవరితోనైనా
అబద్ధం చెప్తారేమో కాని సన్యాసితో మాత్రం చెప్పవలసిన అవసరం ఉండదు లోకంలో... అలా
నమ్ముతుంది. సన్యాసి అన్నవానికి లోపల ఏమీ సంకుచితత్వం ఉండదూ సన్యాసి అన్నేటటువంటివాడు
అన్నిటిని విడిచిపెట్టినవాడై ఉంటాడు అని. అన్ని విడిచిపెట్టి ఈశ్వర కార్యమందు
మాత్రమే ఈశ్వరుని ఆత్మానుసంధానమునందు ఉంటాడు అని. అందుకే అగ్నిహోత్రం కూడా చేయరు
అందుకే సన్యాసి శరీరం కాల్చరు. కారణమేమిటంటే అగ్నివిడిచిపెట్టేస్తాడు సన్యాసి తను
ఎప్పుడు ఇంక అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు అందుకే సన్యాసివల్ల లోకానికి భయం ఉండదు.
అగ్నిహోత్రం మనం చేస్తాం తెల్లార్లు లేస్తే మనం వంటన్నా చేస్తాం, అందులో కొన్ని
ప్రాణులు పడిపోతాయి పైగా ఉడికించినప్పుడు ప్రాణులు కొన్ని కొన్ని దాంట్లో ఉన్నవి
ఉడికిపోయి చనిపోతాయి. ఓ వంకాయలో పురుగుందనుకోండి నేను చూడలేదండీ అని ఉడికించేస్తే
చచ్చిపోతుందది, బియ్యంలో పురుగులు ఉన్నవి కూడా చచ్చిపోతాయి. కాబట్టి ఆతరువాత
అన్నంలోకి వచ్చిన తరువాత తీసి పారేస్తాం, నేనే అలా తిన్నట్టు మీరు అలా తిననట్టూ
అలా మొఖం పెట్టకండి మీకూ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కానీ మీరు అలా
నటిస్తున్నారంతే... కాబట్టి మనం అగ్నిహోత్రం చేస్తే కొన్ని క్రిములు మరణిస్తాయి
సన్యాసివల్ల ఆపాటి భయం కూడా ఉండదు ఎందుకంటే అసలు ఆయన జీవితంలో అసలు అగ్నిహోత్రం
చెయ్యడు అంటే అంతగా భయరహితమైన స్థితిలో ఆయన జీవిస్తాడు అంత భయరహితమైన స్థితిని
లోకానికి ఇస్తాడు.
|
కాబట్టి ఇప్పుడు సన్యాసికి ఎవ్వరూ అబద్దం చెప్పరు, ఆ అవసరం ఎవ్వరికీ ఉండదు
కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వెడుతున్నాడు కాబట్టి ముందు సుగ్రీవుడికి ధైర్యం కపి
రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాఽఽత్మజః ! భిక్షు రూపం తతో భేజే శఠ బుద్ధితయా కపిః
!! లోపల ఒకటి
పెట్టుకుని పైకి అసలు రహస్యం బయటపెట్టడానికి కపటబుద్ధితోనే సన్యాసివేషం కట్టారు.
మహర్షికి ఏమీ అనుమానాలేమి ఉండవండీ ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు శఠ
బుద్ధితయా కపిః ఆయనా హనుమా శఠ బుద్ధితయా కపటబుద్ధితో పైకి వేష మొకటి
లోపలొకటి పెట్టుకుని వెడుతున్నారు అనే చెప్పారాయన, తతః స హనుమాన్ వాచా
శ్లక్ష్ణయా సుమనోజ్ఞయా ! వినీవత్ ఉపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ !! ఆయన రామ
లక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు ఇదే కిష్కింధ కాండలో చాలా ఆశ్చర్యకరమైన విషయం, వెళ్ళి
ఆ రామ లక్ష్మణుల్ని ఇలా చూశారు, చూసి చూడగానే ఈయన వాళ్ళ కాళ్ళమీద పడిపోయి నమస్కారం
చేశాడు, చెయ్యొచ్చా అలాగ చెయ్యకూడదు, సన్యాసి గృహస్తుకి నమస్కారం చెయ్యకూడదు ఎందుచేత అంటే శాస్త్రంలో
అంతే దుర్వృత్తోవా సువృత్తోవా మూర్ఖః పండిత ఏనావా ! కాషాయ దండమాత్రేణయతిః
పూజ్యోన సంతియః !! ఆయన మంచివాడా చెడ్డవాడా వదిలేయండి ఆయనకి ఏమైనా తెలుసా
తెలియదా వదిలేయండి కాషాయ బట్ట కట్టుకుని చేతిలో దండం పట్టుకుంటే యతి పూజ్యోన
సంతియః గృహస్తు ఆయనకే నమస్కారం చెయ్యాలి తప్పా గృహస్తుకి సన్యాసి నమస్కారం
చెయ్యకూడదు ఎందుకంటే అది తుర్యావస్థ నాలుగో ఆశ్రమం వాళ్ళు గృహస్తుకి చెయ్యకూడదు.
కానీ సన్యాసి రూపంలో ఉన్న హనుమా గృస్తాశ్రమంలో ఉన్న రామ లక్ష్మణులకి ప్రణిపాతం చేశారు, ధర్మాత్ముడైనటువంటి రాముడు ఏమనాలి... అదేమిటండీ మీరు నాకు నమస్కారం చేయడం ఏమిటండీ సన్యాసి అనాలి కదా..!
|
త్రాసయన్తౌ మృగ గణాన్ అన్యాం శ్చ వన చారిణః ! రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశిత
వ్రతౌ !!
దేశం కథమ్ ఇమం ప్రాప్తౌ భవన్తౌ వర వర్ణినౌ !
పమ్పాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమన్తతః !!
ఇమాం నదీం శుభ జలాం శోభయన్తౌ తరస్వినౌ ! ధైర్యవన్తౌ సువర్ణాభౌ కౌ యువాం చీర
వాసనౌ !!
నిశ్శ్వసంతౌ వర భుజౌ పీడయంతౌ ఇమాః ప్రజాః ! సింహ విప్రేక్షితా వీరౌ సింహాఽతి బల విక్రమౌ !!
శక్ర చాప నిభే చాపే గృహీత్వా శత్రు సూదనౌ ! శ్రీమన్తౌ రూప సంపన్నౌ వృషభ శ్రేష్ఠ
విక్రమౌ !!
హస్తి హస్తోపమ భుజౌ ద్యుతిమన్తౌ నరర్షభౌ !!!
ప్రభయా పర్వతేన్ద్రోఽయం యువయోః అవభాసితః !
రాజ్యాఽర్హౌ అమర ప్రఖ్యౌ కథం దేశమ్ ఇహ ఆగతౌ! పద్మ పత్రేక్షణౌ వీరౌ జటా మణ్డల ధారిణౌ !!
అన్యోన్య సదృశౌ వీరౌ దేవ లోకాత్ ఇవ ఆగతౌ ! యదృచ్ఛ యేవ సంప్రాప్తౌ చన్ద్ర
సూర్యౌ వసుంధరామ్ !!
విశాల వక్షసౌ వీరౌ మానుషా దేవ రూపిణౌ ! సింహ స్కన్ధౌ మహా సత్త్వౌ సమదౌ ఇవ గో
వృషౌ !!
ఆయతా శ్చ సువృత్తా శ్చ బాహవః పరిఘోపమాః ! సర్వ భూషణ భూషాఽర్హాః కిమ్ అర్థం న
విభూషితాః ? !!
ఉభౌ యోగ్యౌ అహం మన్యే రక్షితుం పృథివీమ్ ఇమామ్ ! స సాగర వనాం కృత్స్నాం
విన్ధ్య మేరు విభూషితామ్ !!
ఇమే చ ధనుషీ చిత్రే శ్లక్ష్ణే చిత్రాఽనులేపనే !
ప్రకాశేతే యథేన్ద్ర స్య వజ్రే హేమ విభూషితే !!
|
మహా ప్రమాణౌ విపులౌ
తప్త హాటక భూషితౌ ! ఖడ్గా ఏతౌ విరాజేతే నిర్ముక్తా ఇవ పన్నగౌ !!
ఇన్ని ప్రశ్నలతో కూడినటువంటి స్తోత్రాన్ని
ఒక్కసారి చేసేశారు, ఆయన అన్నారూ మీరు ఇద్దరూ రాజర్షిల్లా ఉన్నారు దేవతల్లా
ఉన్నారు, మీ ఇద్దరూ చాలా విపరీతమైన తేజస్సుతో ఉన్నారు మీరు నడిచి వస్తూంటే
మృగాలన్నీ భయపడిపోతున్నాయి, మీరు నడిచివస్తుంటే వానరములన్నీ భయపడిపోతున్నాయి మీరు
జటావల్కములు ధరించారు, ఈ పంపానది తీరమంతా మీరు నడిచివస్తూంటే శోభిల్లుతూంది కానీ
మీరు నిట్టూర్పులు విడుస్తున్నారు, మీరు ఈ చెట్లవంక పదే పదే చూస్తున్నారు మీరు ఈ
పర్వతం వంక చూస్తున్నారు, మీ నడక చూస్తే సింహంలా ఉంది, మీ యొక్క పరాక్రం చూస్తే
వృషభంలా ఉంది, మీరు చాలా విశాలమైనటువంటి వక్షస్థలంతో ఉన్నారు ఇంద్ర ధనస్సుల్లాంటి
ధనస్సులు పట్టుకున్నారు అక్షయ బాణ తూనీరములు పట్టుకున్నారు, పాములు బుసకొడితే ఎలా
ఉంటాయో మీ బాణములు చూస్తే అంత పదునుగా పాముల యొక్క తీక్ష్ణత ఎలా ఉంటుందో అలా
ఉన్నాయి ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా మీ చేతులు అలా పొడుగ్గా ఉన్నాయి ఏనుగు యొక్క
తొండాలు ఎలా బలిసి గుండ్రంగా ఉంటాయో మీ భుజములు అలా ఉన్నాయి, మీరు జటావల్కములను
ధరించి ఉన్నారు సూర్య చంద్రులు ఇద్దరు నడిచివస్తే ఎలా ఉంటారో మీ ఇద్దరు అలా
ఉన్నారు మీరు చాలా దివ్వమైన రూపాలతో ఉన్నారు సింహపరాక్రమంతో ఉన్నారు చక్కని
మూపులతో ఉన్నారు దుర్గమారణ్యంలో కాలినడకతో వెళ్తున్నారు మీరు ఆజానుబాహులై ఉన్నారు
ఇంత అందమైన మీరు మీ భుజముల యొక్క సౌంధర్యాన్ని ఆచ్ఛాదించడానికి ఆభరణములను ధరించి
ఉండాలి కాని మీరు ఆభరణములను ఎందుకు ధరించలేదు, విధ్యాద్రీ మేరు పర్వతములు మొదలగు
పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించగలిగినటువంటి తేజస్సు మీ
ఇద్దరియందు ప్రకాశిస్తుంది.
కానీ మీరు ఈ భూమి మీద కాలినడన నడిచి వెళ్తున్నారు ఇది ఒకదానికి ఒకదానికి
పొంతనలేదు మీ యొక్క ధనస్సులు చూస్తే భయమేస్తుంది, పోతపోసి కరిగించినటువంటి బంగారము
చేత అవి పైన పూతలు పూయబడి ఉన్నాయి వాటికి ఆ అల్లెత్రాడు భిగింపబడవలసినటువంటి
స్థితిలో ఉంది, మీరు ఇంత ఆశ్చర్యజనకములై చిత్రముగా కనపడుచున్న ఆ ధనస్సుల్ని చేత్తోపట్టుకున్నారు
అవి చూడ్డానికి వజ్రాయుధంలా ఉన్నాయి, బాణములతో నిండివున్నటువంటి తూనీరములను మీరు
భుజములకు కట్టుకున్నారు మీ కడ్గములు చాలా పొడుగ్గా ఉన్నాయి కుబుసం వదిలినటువంటి
పాము ఎలా ఉంటుందో బంగారము చేత అచ్ఛాదింపబడిన మీ ఖడ్గాలు అలా ఉన్నాయి. మీరు ఇంత
శోభాయమానంగా ఉన్నారు మీరు చూడ్డానికి భూమిని శాసించగలిగినవారిలా ఉన్నారు, కాని
మీరు ఎందుకో చుట్టుపక్కల చూస్తూ నిట్టూర్పు విడుస్తూ ఈ భూమి మీద నడుస్తున్నారు,
ఒకదానికి ఒకదానికి పొంతన కనపడటంలేదు నాకు మీరు అర్థం కావడం లేదు మీ తేజస్సు ఇలా
ఉంది మీరు ఇంత శోభస్కరంగా ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను మీరు నాకు
జవాబు చెప్పట్లేదు మీరెవరో నాకు చెప్పండి అన్నాడు.
|
కానీ ఆయనకు దర్శనం చెయ్యగానే ఎంత నమ్మకం
వచ్చిందంటే నేను మాట్లాడినా సత్యం చెప్పేసినా నాకు వచ్చేటటువంటి ఇబ్బందేమీ ఉండదు,
కాబట్టి సుగ్రీవుడు నన్ను పంపాడు నేను మీ దగ్గరికి వచ్చాను నేను సుగ్రీవుడి యొక్క
మంత్రిని నా పేరు “హనుమా” అంటారు యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవః
సఖ్యమ్ ఇచ్ఛతి ! తస్య మాం సచివం విత్తం వానరం పవనాఽఽత్మజమ్ !! మీరు నా ప్రభువైనటువంటి సుగ్రీవుడితో స్నేహం
చేస్తే బాగుంటుంది, మీ ఇరువురు సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలీ అని నేను
కోరుకుంటున్నాను భిక్షు రూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియ కామ్యయా ! ఋశ్యమూకాత్
ఇహ ప్రాప్తం కామగం కామ రూపిణమ్ !! మీరు నేను సన్యాసి వేషంలో ఉన్నానని మీరు
అనుకుంటున్నారు, కానీ నేను సన్యాసిని కాను ఇది వేషం కట్టాను అంతే నాకు కామ రూపం
తెలుసు కాబట్టి సన్యాసి వేషం వేసుకొని మీ దగ్గరికి సత్యం తెలుసుకోవడానికి వచ్చాను
నేను యదార్థానికి వానరాన్ని నేను ఎక్కడికైనా సరే ఎగిరి వెళ్ళగలను ఏ రూపం కావాలంటే
ఆ రూపం పొందగలను అని తను సన్యాసి వేషంలో ఉన్నాను అన్న విషయాన్ని చెప్పేశారు రామ
లక్ష్మణులతోటి అంటే ప్రభుకార్యంమీద వచ్చినా సుగ్రీవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి
సుగ్రీవుడికి అపకారం కలిగేటట్టుగా ప్రవర్తించడం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. అసలు
వారి తేజస్సులు చూడగానే ఆయనకి అంత విశ్వాసం వచ్చేసింది. ఇంక వీరి దగ్గర
దాచక్కరలేదనుకున్నారు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు. రాముడు అన్నాడూ తమ్ అభ్యభాష
సౌమిత్రే సుగ్రీవ సచివం కపిమ్ ! వాక్యజ్ఞం ముధురైః వాక్యైః స్నేహ యుక్తమ్ అరిందమ
!! రాముడు హనుమతో మాట్లాడలేదు లక్ష్మణుడి వంక చూసి అన్నారూ లక్ష్మణా! చూశావా
ఎంత అందంగా మాట్లాడాడో సుగ్రీవుని యొక్క సచివట మంత్రిట వాక్యజ్ఞం తను
మాట్లాడుతున్న మాట యొక్క అర్థాన్ని తాను బాగా తెలుసుకుని మాట్లాడినటువంటి వాడు ఆ
మాటలు మధుర మధురంగా మాట్లాడినటువంటివాడు న అన్ఋగ్వేద వినీతస్య న యజుర్వేద ధారిణః
! న సామవేద విదుషః శక్యం ఏవం ప్రభాషితుం !! ఋగ్వేదం తెలియనివాడు యజుర్వేదం
తెలియనివాడు సామవేదం తెలియనివాడు ఇలా మాట్లాడలేడు అయితే ఇక్కడొక చిత్రం.
|
ఇప్పుడు శాంతమైనటువంటి మనసువలన సౌఖ్యం పొందేట్లు
చేయగలిగినటువంటి వేదం సామవేదం న అన్ఋగ్వేద వినీతస్య న యజుర్వేద ధారిణః ! న
సామవేద వినీతస్య అని రామ చంద్ర మూర్తి అన్నారు అంటే..? దానికి కారణం ఏమిటో
తెలుసాండీ! ఈయన కనపడుతున్నటువంటి ఆ నర స్వరూపము వెనక ఉన్నటువంటి తేజస్సుతో
కూడినటువంటి అసలు రహస్యాన్ని అవతారాన్ని తెలుసుకోగలిగినటువంటివాడు, ఒక నరుడిగా
మాట్లాడినప్పుడు నా తేజస్సు సక్రమముగా అర్థమై దాన్ని స్తుతించగలిగినవాడు దీనిని
పూజించడం తెలిసున్నవాడు అందుకని భూమి మీదపడి ప్రణిపాతం చేశాడు ఆయన ప్రణిపాతస్య
అంటే మీకు గొప్ప పూజ్యభావన కలిగితే ఇక భూమి మీద మెల్లగా వంగి మోకాలు వంచి చేతులు
వంచి పడకుండా దీన్ని ఇలా పడేశాననుకోండి ఢాం అని పడిపోతుంది అంతే... అంతేగాని ఇదేం
మెల్లిగా మోకాలొంచి చేతులువంచి అలా ఏం పడదు గబుక్కున కిందపడిపోతుంది ఓ కర్ర
పడిపోయినట్లు అలా పడిపోతే అంటే అసలు చూసి చూడగానే ఆబ్భాహ్... ఏమి పూజనీయులని మీరు
పడిపోయారనుకోండి దానికి ప్రణిపాతము అంటారు, హనుమ ప్రణిపాతము చేశారు ఇంత గొప్ప
ప్రణిపాతం పూజ ఈ నమ్మకమే యజ్ఞం కాబట్టి ఇప్పుడు ఈ యజ్ఞానికో ఫలితం ఉంది. ఏమిటా
ఫలితం నాకూ సుగ్రీవుడికి స్నేహం సుగ్రీవుడికి రాజ్యం కలగడం భార్య కలగడం నాకేమిటి సౌఖ్యం
సీతమ్మ జాడ తెలియటం రావణ సంహారమునందు వానరుల యొక్క సైన్యబలం నాకు తోడుగా రావడం
కాబట్టి ఇది సాధించాడాయన ఋక్కులను యజ్ఞముగా యజ్ గా మార్చి యజుర్వేదాన్నిదాంట్లోకి
తీసుకొచ్చి కార్యసాధన చేస్తున్నాడు.
ఈయ్యన వచ్చి మాట్లాడితే నాకు మనఃశాంతి కలిగింది ఈయన యదార్థమును
ప్రతిపాధిస్తున్నాడు, నేను సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలని వెతుకుతున్నాను
సుగ్రీవుడితో స్నేహం చేసుకోండని తనే వచ్చాడు సుగ్రీవ సచివుడు కాబట్టి నా మనసుకి
సౌఖ్యము శాంతికి
కారణమయ్యాడు కాబట్టి లక్ష్మణా! ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈయ్యన మాటలలో
ఉన్నాయి, ఇది లేనివాడు ఇలా మాటలను తీసుకొచ్చి వేద ప్రయోజనాన్ని మాటలోకి తేలేడు
వేదమును బాగా తెలిసున్నవాడు కాబట్టి వేదము యొక్క ప్రయోజనమును తన మాటలలోకి తెచ్చి
వేదముల యొక్క స్వరూపంగా ఆ శ్లోకాల్ని నా దగ్గర చెప్పగలిగినటువంటి ప్రజ్ఞతో
భాషించాడు ఈయన వ్యాకరణం బాగా తెలిసున్నవాడు న్యూనం వ్యాకరణం కృత్స్నం అనేన
బహుధా శ్రుతం ! బహు వ్యాహరతా అనేన న కించిత్ అపశబ్దితం !! చక్కటి మాట
మాట్లాడాలీ అంటే వ్యాకరణం తెలిసుండాలి వ్యాకరణం తెలిసుంటే క్రియాపదాన్ని
వ్యాకరణంతో పూర్తి చేస్తూ అవతలివాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం
చేసి అపశబ్దములు రాకుండా చక్కగా ఉచ్చరించగలిగినటువంటి ప్రజ్ఞ కలుగుతుంది ఇటువంటి
ప్రజ్ఞ భాషించిందీ అంటే ఆయనకి వ్యాకరణం తెలుసు అనయా చిత్రయా వాచా త్రి స్థాన
వ్యంజనస్థ యాః ! కస్య న ఆరాధ్యతే చిత్తం ఉద్యత అసే అరేః అపి !! ఈ మహానుభావుడు
వక్షస్థలం నుంచి శబ్ధములు పుట్టిస్తున్నాడు కంఠమునందు పుట్టిస్తున్నాడు నాలుక
నుంచి పుట్టిస్తున్నాడు అంటే మూడు చోట్ల శబ్దం కట్టబడుతుంది మూడు చోట్లా శబ్దాన్ని
ఎలా పలకాలో అలా పలుకుతున్నాడు ఎంత స్వరం వాడాలో అంత స్వరం వాడుతున్నాడు ఉద్వేగంతో
లేదు అవయవాలు కదలటం లేదు అతిగా కదలకుండా చక్కగా మాట్లాడుతున్నాడు ఇన్ని తెలిసుండి
మాట్లాడుతున్నాడు అంటే..? ఇలా మాట్లాడగలిగినటువంటి వాడెవరున్నారో అటువంటివాడు
మంత్రిగా కలిగినటువంటి ప్రభువు ఏ కార్యానైనా సాధించగలడు.
|
ఇలా మాట్లాడేవాడు ఉంటే కత్తి ఎత్తినవాడు కూడా
కత్తి దించేస్తాడు అంతబాగా మాట్లాడాడు కదయ్యా అని ఏవం విధో యస్య దూతో న భవేత్
పార్థివ స్య తు ! సిద్ధ్యంతి హి కథం తస్య కార్యాణాం గతయోఽనఘ !! ఇటువంటి మహానుభావుడు సచివుడుగా ఉన్నటువంటి
కార్యం తప్పకుండా నెరవేరుతుంది మనం ఇవ్వాళ ఈ హనుమతోటి సమాగమం ఈ హనుమతోటి
కలుసుకోవటం మన అదృష్టహేతువు అని రామ చంద్ర మూర్తి సంతోషించారు. హనుమా! రాముని
ప్రశ్నవేశారు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని కిమఽర్థం త్వం వనం ఘోరం
పమ్పా కానన మణ్డితమ్ ! ఆగతః సాఽనుజో దుర్గం నానా వ్యాళ మృగా యుతమ్ !! ఈ పాములతో మృగములతో నిండిపోయినటువంటి ఈ వనంలోకి
రామా! మీరు ఎందుకొచ్చారు మీరు నాకు చెప్పవలసిందీ అని అడిగారు అప్పుడు రాముని చేత
ప్రేరితుడైనటువంటి లక్ష్మణుడు సమాధానం చెప్తున్నాడు రాజా దశరథో నామ ద్యుతిమాన్
ధర్మ వత్సలః ! చాతుర్వర్ణ్యం స్వ ధర్మేణ నిత్యం ఏవాఽభ్యపాలయత్ !! ఒకానొకప్పుడు మహానుభావుడు దశరథ మహారాజుగారు కౌసల
రాజ్యాన్ని పరిపాలించాడు చాతుర్వర్ణ్యములు కూడా తృప్తిగా ఉండేటట్టుగా చక్కటి
పరిపాలన అందించాడు న ద్వేష్టా విద్యతే తస్య న చ స ద్వేష్టి కంచన ! స చ సర్వేషు
భూతేషు పితామహ ఇవ అపరః !! అగ్నిష్టోమాదిభిః యజ్ఞైః ఇష్టవాన్ ఆప్త దక్షిణైః !!!
ఆయన ఎవర్ని ద్వేషించలేదు ఆయన్ని ఎవరూ ద్వేషించలేదు అలా పరిపాలించాడు దశరథ మహారాజు.
ఎంత మందికో బూరి దక్షిణలు ఇచ్చాడు ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేశాడు తస్యాఽయం పూర్వజః పుత్రో
రామో నామ జనైః శ్రుతః ! శరణ్యః సర్వ భూతానాం పితు ర్నిర్దేశ పారగః !! ఆయన జేష్టపుత్రుడు రాముడు, ఆయన తండ్రిని
సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యానికి బయలుదేరి భార్యతో సహా అడవికి వచ్చాడు.
సూర్యుని కాంతి సూర్యునితో
ఎలా అనుసరిస్తుందో
అలా మా వదినెగారైనటువంటి సీతమ్మతల్లి రామున్ని అనుగమించి అరణ్యవాసానికి వచ్చింది అహమ్
అస్య అవరో భ్రాతా గుణైః దాస్యమ్ ఉపాగతః ! కృతజ్ఞ స్య బహుజ్ఞ స్య లక్ష్మణో నామ
నామతః !! ఆయనకి నేను తమ్మున్ని కాని ఆయన గుణములు చూసి ఆయనకు నేను దాసున్ని
అన్నారు. ఆయనని గురువుగా భావన చేస్తాను ఆయన వెంట నేను కూడా అరణ్యవాసానికి వచ్చాను సుఖార్హ
స్య మహార్హ స్య సర్వ భూత హితాఽఽత్మనః ! ఐశ్వర్యేణ విహీనస్య వనవాస ఆశ్రిత స్య చ
!! ఆయన అఖండమైనటువంటి
ఐశ్వర్యాన్ని పొందడానికి అర్హుడైనటువంటివాడు సమస్త సుఖములు పొందగలిగినటువంటివాడు
కాని అన్నిటిని కాదని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని వనవాసం చేస్తున్నాడు.
|
అటువంటి రామ చంద్ర మూర్తి యొక్క భార్యని ఈయన
లేని సమయం నేను లేని సమయం చూసి ఒక రాక్షసుడు అపహరించాడు అతని వివరములు మాకు
బాగాతెలియవు కాని రావణుడు అన్న పేరు మాకు తెలుసు కబంధుడు చెప్పాడు కాబట్టి ఆ
రావణుని యొక్క జాడ కనిపెట్టి సీతమ్మ తల్లిని మళ్ళీ మేము పొందడం కోసమని ప్రయత్నం
చేస్తున్నాం. ఆ కార్యంలో ఏతత్ తే సర్వమ్ ఆఖ్యాతం యాథా తథ్యేన పృచ్ఛతః నేను
ఉన్నది ఉన్నట్లుగా ఉన్న యదార్థాన్ని చెప్పేశాను కాబట్టి ఈ విషయంలో రాముడికి సహాయం
చెయ్యవలసి ఉంటుంది అహం చైవ హి రామ శ్చ సుగ్రీవం శరణం గతౌ రాముడితో కలిసి
నేను సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాను అన్నాడు, ఎందుకనీ సుగ్రీవుడి యొక్క సహాయం
ఇప్పుడు రాముడికి కావలసి వచ్చింది ఈ భూమండలమంతా వెతకాలి అందుకని సుగ్రీవుడికి
శరణాగతి చేస్తున్నాము. ఎక్కడ రామ చంద్ర మూర్తి ఎక్కడ లక్ష్మణ మూర్తి ఈ మాట
అన్నప్పుడు లక్ష్మణుని యొక్క హృదయం కదిలిపోయింది. సమస్త భూ మండలాన్ని
శాషించగలిగినవాడు మొన్న మీరు చూశారు లయం చేయగలడు అటువంటివాడు ధర్మాన్ని
పాటిస్తున్నాడు కబంధుడు చెప్పాడని స్నేహం కోసం వచ్చాడు అటువంటి అన్నగారు
సుగ్రీవుడికి శరణాగతి చెయ్యడమా..? అని పరిస్థితి అటువంటిది కాలోహి దురతిక్రమః
ఎవ్వరికైనా ఏష దత్త్వా చ విత్తాని ప్రాప్య చాఽనుత్తమం యశః !
లోకనాథః పురా భూత్వా సుగ్రీవం నాథమ్ ఇచ్ఛతి !! ఈ జగత్తుకంతటికీ నాథుడై కోరుకున్న వారికి
కోరుకున్నంత ఐశ్వర్యం దానం చేసి ఎంతో కీర్తి గాంచిన రాముడు ఇవ్వాళ సుగ్రీవుని
శరణాగతి చేస్తున్నాడు.
పితా యస్య పురా హి ఆసీత్ శరణ్యో ధర్మ వత్సలః ! తస్య పుత్రః శరణ్య శ్చ సుగ్రీవం
శరణం గతః !! ఒకానొకప్పుడు
లోకంలో ఉన్న రాజులందరూ వచ్చి ఏ దశరథ మహారాజుగారిని శరణాగతి చేశారో ఆ దశరథ మహారాజు
కొడుకైన రాముడు ఇవ్వాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు సర్వ లోకస్య
ధర్మాత్మా శరణ్యః శరణం పురా ! గురుః మే రాఘవ సః సుగ్రీవం శరణం గతః !!
సర్వలోకములకు ధర్మాన్ని నేర్పగలిగినటువంటివాడు అన్నిలోకములు ఎవరికి శరణాగతి
చేస్తాయో అటువంటి రాముడు ఇవ్వాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు యస్య
ప్రసాదే సతతం ప్రసీదేయుః ఇమాః ప్రజాః ! స రామో వానరేంద్ర స్య ప్రసాదం అభి కాంక్షతే
!! ప్రజలందరు సుఖం కోసం ఏ రామున్ని శరణాగతి చేస్తారో ఆ రామున్ని సుగ్రీవుడికి
శరణాగతి చేసి స్నేహాన్ని కోరుకుంటున్నాడు కనుకా మీరు రామ చంద్ర మూర్తికి కాలసిన
సహాయం చేసిపెట్టి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో సుగ్రీవుడు ఉపకరిస్తే
బాగుంటుంది ఈ మాట అన్నాడట కాని కన్నుల వెంట నీరు ఆగలేదట లక్ష్మణునికి ఇంత కష్టమా
అన్నయ్యకి అనిపించింది శోకాఽభిభూతే రామే తు శోకాఽఽర్తే శరణం గతే !
కర్తుమ్ అర్హతి సుగ్రీవః ప్రసాదం సహ యూథపైః !! ఏవం బ్రువాణం సౌమిత్రిం కురుణం సాఽశ్రు లోచనమ్ !
హనూమాన్ ప్రత్యువా చేదం వాక్యం వాక్య విశారదః !!
కన్నుల వెంట నీరు
ధరలుగా కారిపోయి ఏడుస్తూ అటువంటి రాముడు నాతో కలిసి సుగ్రీవుడిని శరణాగతి
చేస్తున్నాడు మీరు మాకు ఉపకారం చేయవలసిందీ అని అడిగాడు అడిగితే హనుమా... వెంటనే
జోక్యం చేసుకుని అన్నాడు.
|
మీరు జితేంద్రియులు బుద్ధిమంతులు మీరు
విచారించవలసిన పనిలేదు మీరు మాకు లభించడం మా అదృష్టహేతువు కాబట్టి సుగ్రీవుడితో
మీరు స్నేహం చేద్దురుగాని ఇప్పుడు మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను మీ ఇద్దరు కూడా
నా భుజాలమీద కూర్చోండి అన్నారు. సన్యాసి వేశంలో కదా ఉన్నారు నేను సన్యాసి వేషంలో
వచ్చానని చెప్పారు తప్పా ఇంకా సన్యాసి వేషంలోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు తన
స్వస్వరూపాన్ని పొందాడు భిక్షు రూపం పరిత్యజ్య వానరం రూపం ఆస్థితః ! పృష్టం
ఆరోప్య తౌ వీరౌ జగామ కపి కుంజరః !! ఆ సన్యాసి వేషాన్ని విడిచిపెట్టేసి
రామున్ని ఒక భుజం మీద లక్ష్మణున్ని ఒక భుజం మీద కూర్చోబెట్టుకుని ఇందాకా చెప్పానే
ఇంతకన్నా ఏం కావాలని ఇద్దర్ని హనుమత్ వాహనమై ఇద్దర్నీ భుజాల మీద కూర్చోబెట్టుకుని
ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి వెడుతున్నారు వెళ్ళేటప్పటికి ఆ ఎదురుగుండా ఆ రామ
లక్ష్మణుల్ని తీసుకొని వెళ్ళేటప్పటికి అప్పటికే సుగ్రీవుడు భయపడిపోయి ఋష్యమూక
పర్వతం నుంచి ధూకేసి మలయ పర్వతం మీద నిల్చున్నాడట, వీళ్ళిద్దరిని తీసికెళ్ళి అక్కడ
దింపాడు ఓసారి దింపి మహర్షి దీన్ని చిట్ట చవర్లో చెప్తాడు ఈ రహస్యాన్ని, మళ్ళీ
భిక్షు రూపాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే సుగ్రీవుడు మామూలుగా వానర రూపంలో
వచ్చాడనుకోండి... హనుమా వస్తే సుగ్రీవుడు నమ్మడు నీవు ఇలా వెళ్ళి మాట్లాడేసుంటావు అని
ఇంకోచోటకి ధూకేస్తాడు అందుకని భిక్షురూపంలోనే వెళ్ళాడనుకోండి ఈ రూపంలో మోసగించడులే
ఈయన చెప్పిన మాటలు నమ్మి మళ్ళీ వస్తాడు అందుకని మళ్ళీ సన్యాసి వేషం పొందాడు.
పొంది మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయం రామో మహా
ప్రాజ్ఞః సంప్రాప్తో దృఢ విక్రమః ! లక్ష్మణేన సహ భ్రాత్రా రామోఽయం సత్య విక్రమః !!
ఇక్ష్వాకూణాం కులే జాతో రామో దశరథాఽఽత్మజః ! ధర్మే నిగదిత శ్చైవ పితు ర్నిర్దేశ
పాలకః !! మహానుభావుడు
ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటివాడు తేజోమూర్తియైనటువంటివాడు ధర్మం
తేలిసినటువంటివాడు లక్ష్మణునితో కలిసి అరణ్యవాసం కోసం వచ్చారు ఆయన భార్యని
సీతమ్మని ఒక రాక్షసుడు అపహరించిన కారణం చేత కాబట్టి నీవు ఆయనతో స్నేహం చేసుకుంటే
చాలా బాగుంటుంది, ఇక్ష్వాకు కులసంభవుడైన మహానుభావుడు రామ చంద్ర మూర్తి అంటే నీ
అదృష్టం ఎన్ని యాగాలో యజ్ఞాలో చేసినటువంటి రామ చంద్ర మూర్తి తండ్రి దశరథ
మహారాజుగారు, అటువంటివాళ్ళు ఇవ్వాళ ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు నీతో స్నేహం
చేయిస్తాను అని నేను వాళ్ళకు మాట ఇచ్చి తీసుకొచ్చాను, కాబట్టి నీవు ఎదురొచ్చి నీవు
వాళ్ళకి స్వాగతం చెప్పి వాళ్ళతో స్నేహం చేసుకో అన్నాడు. ఇప్పుడు నమ్మాడు భవతా
సఖ్య కామౌ తౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ ! ప్రతిగృహ్యాఽర్చయ స్వేమౌ
పూజనీయతమౌ ఉభౌ !! వాళ్ళ ఇద్దరన్నీ నీవు ఎదురొచ్చీ స్వాగతం చెప్పి చేతులు పట్టుకుని తీసుకొచ్చి
కూర్చోబెట్టి పూజించు అన్నాడు వారు పూజ్యులు కాబట్టి.
|
ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి రామ సుగ్రీవులిద్దరు స్నేహం చేసుకున్నారు వెంటనే తతః
స పర్ణ బహుళాం ఛిత్వా శాఖాం సుపుష్పితాం ! సాల స్యాఽఽస్తీర్య సుగ్రీవో
నిషసాద స రాఘవః !! బాగా పుష్పించినటువంటి ఒక మధ్ది చెట్టు వంచి విరిచి సుగ్రీవుడు ఆసనం కింద
వేసి అక్కడ అసనం కింద వేయడం అంటే ఒక దుంగలా తయారు చేశాడు. చిన్న చిన్నకొమ్మలన్ని
విరిచేసి వేసి రండి కూర్చోండని చెప్పి దానిమీద రామున్ని కూర్చోబెట్టి తనుకూడా రామునితో కలిసి కూర్చున్నాడు ఆ దుంగమీద
అంటే ఆయన ఉద్ధేశ్యం ఏమిటంటే ఆయనకీ రాజ్యం లేదు మనకీ రాజ్యంలేదు ఆయన భార్య రావణుడు
ఎత్తుకుపోయాడు తన భార్యను వాలి ఎత్తుకుపోయాడు. కాబట్టి ఆల్ ఈక్వల్స్ కదా! కాబట్టి
రాముడి పక్కన ఆయనా కూర్చున్నాడు ఇద్దరు సమానంగా ఓ దుంగవేసుకుని కూర్చున్నారు, పాపం
లక్ష్మణ స్వామి అలా నిల్చున్నారు, చూశారు హనుమా... తతః స పర్ణ బహుళాం ఛిత్వా
శాఖాం సుపుష్పితాం ! సాల స్యాఽఽస్తీర్య సుగ్రీవో నిషసాద స రాఘవః !! వెంటనే పూచినటువంటి చందనపు కొమ్మని ఒకదానిని
తెచ్చి ఆసనంగా వేసి లక్ష్మణా మీరు కూడా కూర్చోండి అని చెప్పి హనుమా ఆయన్ని కూడా
కూర్చోబెట్టారు. అంటే అలా సుగ్రీవుడు అహంకారంతో ఉన్నాడా... అని కూడా మీరు భావన
చేయక్కరలేదు ఒక స్నేహ ధర్మంగా అప్పటికి ఇంకా రాముని యొక్క వైభవం పూర్తిగా
తెలియదుగా ఇంకా అనుమాం ఉందండోయ్ రేపు చూద్దురుగాని ఎన్ని పరీక్షలు పెడుతాడో...
కాబట్టి ఉపకార ఫలం మిత్రం విదితం మే మహా కపే ! వాలినం తం వధిష్యామి తవ
భార్యాఽపహారిణం !! వెంటనే రామ చంద్ర మూర్తి ప్రతిజ్ఞ చేశారు నీ భార్యని రుమని అపహరించినటువంటి
వాలిని నిగ్రహిస్తాను, ఆ వాలిని సంహరిస్తాను గ్రద్ధ ఈకలు
కట్టబడినటువంటి నా
బాణములు సూర్య చంద్రులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటివి ఆ బాణాలను
ప్రయోగించి వాలి పర్వతము పడిపోయినట్లుగా కిందపడి మరణించగా నీవు చూస్తావు తొందరలో
నీకు పట్టాభిషేకం అవుతుంది, నీ భార్య రుమని నీవు పొందుతావు కాబట్టి నీవు
బెంగపెట్టుకోవద్దు అన్నాడు. చాలా సంతోషించాడు ఇంక ఇంతకన్నా ఆనందం ఏముంటుంది
సుగ్రీవుడు పొంగిపోయాడట మహర్షి అంటారు సీతా కపీంద్ర క్షణదాచరణాం రాజీవ హేమ
జ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాణి సమం స్ఫురంతి !!
వీళ్ళిద్దరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని రామ చంద్ర మూర్తి ప్రతిజ్ఞ చెయ్యగానే
ముగ్గురికి ఎడం కన్ని అదిరిందట. సీతా దేవికి లంకాపట్టణంలో ఎడం కన్ను అదిరిందిట
అంటే ఆవిడకి శుభం, వాలికి పచ్చటి బంగారు కన్ను అదిరిందట అంటే వాలికి మరణం వస్తూంది
రామ చంద్ర మూర్తి చంపేస్తాడు. పురుషుడికి ఎడమ కన్ను అదరడం అశుభం ఆడదానికి ఎడమ
కన్ను అదరడం శుభం. సీతమ్మకి ఎడమ కన్ను అదిరింది శుభం వాలికి ఎడమ కన్ను అదిరింది
మరణం, అగ్నిహోత్రం లాంటి ఎడమ కన్ను అదిరిందట రావణుడికి కాబట్టి రావణుడికి మరణం
కాబట్టి వీళ్ళిద్దరు సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే స్నేహంగా వీళ్ళిద్దరు
మాట్లాడుకుంటుంటే ఎడమ కన్నూ ఆ తరువాత అగ్నిహోత్రంలాంటి ఎర్రటి కన్ను ఉన్నటువంటి
సీతమ్మ తల్లికి వాలికి రావణుడికి ముగ్గిరికి ఎడమ కన్నులు అదిరాయట.
|
వీళ్ళిద్దరి స్నేహం రామాయణంలో అంత కీలకమైన ఘట్టం
దీన్ని సాధించినటువంటి మహాపురుషుడు స్వామి హనుమా కాబట్టి ఇప్పుడు ఈ కార్యం
పూర్తైపోయింది. సుగ్రీవుడు అన్నాడు భార్యా వియోగ జం దుఃఖం అచిరాత్ త్వం
విమోక్ష్యసే ! అహం తామ్ ఆనయిష్యామి నష్టాం వేదశ్రుతీం యథా !! ఒకానొకనాడు వేదం
కనపడుకుండా రాక్షసులు అపహరిస్తే శ్రీమహావిష్ణువు మళ్ళీ ఆ వేదాన్ని ఎలా
తీసుకొచ్చారో అలా నీ భార్యని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది నేను ఎక్కడ
ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనిపెడతాను రసా తలే వా వర్తన్తీం వర్తన్తీం వా నభ స్తలే
! అహమ్ ఆనీయ దాస్యామి తవ భార్యామ్ అరిందమ !! ఆవిడని పాతాళలోకంలో దాచినా స్వర్గ
లోకంలో దాచినా వానర సైన్యాన్ని పంపించి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తెచ్చి
పెట్టేటటువంటి పూచి నాది అని చెప్పి సుగ్రీవుడు అన్నాడు.
ఒకానొకప్పుడు నేను ఈ పర్వత శిఖరం మీద కూర్చుని ఉన్నప్పుడు నలుగురు వానరులతో
కలిసి కూర్చుని ఉన్నాను ఒళ్ళో సీతమ్మతల్లిని కూర్చో బెట్టుకుని రావణాసురుడు దక్షిణ
దిక్కుగా వెళ్ళిపోతుంటే ఆ తల్లి హా రామా! హా లక్ష్మణా! అని అరుస్తూ వెళ్ళిపోయింది,
వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ కింద ఉన్నటువంటి మమ్మల్ని చూసింది, చూసి తన ఉత్తరీయ్యాని
చింపి తన నగలను కొన్ని మూట కట్టి మా ఐదుగురి మధ్యలో పడేసింది. ఆ నగల మూట నేను తీసి
దాచాను ఆత్మనా పంచమం మాం హి దృష్ట్వా శైల తటే స్థితమ్ ! ఉత్తరీయం తయా త్యక్తం
శుభాని ఆభరణాని చ !! ఆ ఆభరణములు శుభప్రదమైనవి మూటలో ఉన్నాయి అన్నారు
అనేటప్పటికి రామ చంద్ర మూర్తి అన్నారు అయితే ఓ స్నేహితుడా! ఓ సుహృత్ ఇంకా
ఆలస్యమెందుకు ఆ మూట తెప్పించు చూస్తాను అన్నాడు, సీతమ్మ ఆభరణములు చూడడం అంటే ఆయనకు
అంత సంతోషం. ఒక చిన్న అవకాశం ఒక చిన్న గుర్తుపట్టేటటువంటి సందర్భం దొరికింది
కదాండి తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఆ మూట విప్పారు పశ్య లక్ష్మణ వైదేహ్యా
సంత్యక్తం హ్రియమాణయా ! ఉత్తరీయమ్ ఇదం భూమౌ శరీరా ద్భుషణాని చ !! లక్ష్మణా! ఈ
ఉత్తరీయం మీ వదినది మూట చూడగానే చెప్పారు చీరలో అంతర్భాగం కాబట్టి ఇందులో ఉన్న
నగలుకూడా మీ వదినవే అయ్యి ఉంటాయి
కానీ మీ వదినని
స్మరించినటువంటి కారణం చేత మీ వదిన నగలు చూస్తున్నానన్న భావన కలగడం చేత అయ్యో...
ఎంత కష్టంలో తన కట్టుకున్న పట్టుపుట్టాన్ని చింపి నగలుతీసు మూటకట్టి ఎంత ఏడుస్తూ
కిందపడేసిందో...
|
పరపురుష స్పర్శచేత ఖేదం అరచినటువంటి నా భార్య సీతమ్మ అని బెంగపెట్టుకుని
గుండెల మీద ఆభరణములు పెట్టుకుని ఏడ్చిన కారణముచేత కన్నులు నీటితో నిండడం వల్లా ఆ
కన్నులు సరిగ్గా కనపడకా లక్ష్మణా నాకు సరిగ్గా కనపడ్డం లేదు ఇవి మీ వదినె నగలేనా
గుర్తు పట్టూ అని ఆ మూట ఇచ్చారు. లక్ష్మణ స్వామి అవి ఒక్కొక్కటి ఆ మూట విప్పీ
గబగబా అందులోంచి నగలు తీశారు ఇలా తీసేటప్పటికి కేయూరములు వచ్చాయి కేయూరములు అంటే
ఆడవాళ్ళు పెట్టుకునేటటువంటి భుజకీర్తులు ఏమిటంటారు దాన్ని కట్టె వంకీలు ఆ
కట్టెవంకీ పెట్టుకుంటారు దేవతా స్వరూపాలు మగవాళ్ళైతే నాగస్వరూపాన్ని
పెట్టుకుంటారు. కాబట్టి కట్టె వంకీల్లాంటివి కేయూరములు భుజ కిరీటములు కనపడ్డాయి
ఆయన అవి తీసి అన్నారు నాఽహం జానామి కేయూరే నాఽహం జానామి కుండలే !
నూపురే త్వఽభి జానామి నిత్యం పాదాఽభి వందనాత్ !! అన్నయ్యా నాకు తెలియదు ఇవి కేయూరములు ఇవి వదినె
పెట్టుకుందో లేదో నాకు తెలియదు, తరువాత ఇలా తీశారు కుండలములు వచ్చాయి కుండలములు
అంటే చెవులకు పెట్టుకునేవి నాఽహం జానామి కుండలే అన్నయ్యా ఇవి వదినె చెవులకు పెట్టుకుందో నాకు
తెలియదు మళ్ళి ఇలా తీశారు ఏవోస్తే అవి ఇప్పుడు నూపురములు వచ్చాయి అంటే ఆడవాళ్ళు
పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు హా... నూపురే త్వభి జానామి అన్నయ్యా!
నాకు ఈ నూపురములు తెలుసు ఎందుకు ఎందుకో తెలుసా... నిత్యం పాదాఽభి వందనాత్ ప్రతిరోజు వదినె పాదములకు నమస్కరించేటప్పుడు
నేను ఈ మంజీరములు చూశాను ఇవి వదినవే.
ఇదీ లక్ష్మణ భక్తికి పరాకాష్ఠని ఈ శ్లోకం చెప్తారు ఎందుకంటే గంగానదిలో
పడవనెక్కించాడు కదాండీ అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా ! పృష్ఠతస్తు
ధనుష్పాణిః లక్ష్మణః అనుజగామ హ !! అని వాల్మీకి మహర్షి అరణ్యకాండలో చెప్పారుగా
ముందు రాముడు నడిచారు మధ్యలో సీతమ్మ నడిచింది వెనుక లక్ష్మణ మూర్తి నడిచారని,
నడిచినప్పుడు సీతమ్మని చూడలా... సీతమ్మ కేయూరములు సీతమ్మ కుండలములు తెలియవు చూడడం
వేరు మనసులోకి వెళ్ళడం వేరు ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఇలా ముఖం
తిప్పుతూ మీ అందర్నీ చూస్తున్నట్లు ఉంటుంటుంది కానీ మీ అందరూ నా మనసులోకి వెళ్ళారు
అనుకుంటే పొరపాటు ఏదీ నా మనసులోకి వెళ్ళదు ఎందుకెళ్ళదో తెలుసాండీ అలా వెళ్ళిన
ఉత్తర క్షణంలో నా ప్రసంగం ఆగిపోతుంది. నేను చెప్పేటప్పుడు ఇక్కడ నాకు ఆ భావన
గోచరమౌతూ చెప్పిన శ్లోకం చేత ప్రతిపాదింపబడిన విషయం కదులుతూంటుంది కదులుతూ వాక్
రూపంగా పైకి వస్తూంటుంది వస్తున్నప్పుడు యథాలాపంగా పైకి తల తిరిగి కళ్ళు
తిరుగుతుంటాయి కాని అది ఏదో ఉపన్యాసం మధ్యలో ఆపామూ అంటే దృష్టికి భంగ కరంగా ఏదో
సభలో తప్పు జరుగుతూందన్నమాట లేకపోతే ఆ ధార అలా వెళ్ళిపోతుంది అంతే... తప్పా చూడడం
కంటికి ధర్మమైనా చూసినది మనసులోకి వెళ్ళదు వెళ్ళకుండా మధ్యలో ఆగిపోతుంటుంది
ఎందుకంటే చూడ్డం కన్ను చూస్తుంటుంది మనసు పుచ్చుకోది ఎందుకంటే మనసు అప్పటికే ఇంకొక
జ్ఞాపకంలో ఉండిపోయింది లక్ష్మణ మూర్తి రోజూ చూస్తున్నా ఆయనకు దానిమీద దృష్టిలేదు
చూడడం కంటి ధర్మం చూసింది అంతే కాని మనసులోకి వెళ్ళలేదు ఎందుకంటే వదిన యొక్క
చెవులు కాని వదిన యొక్క భుజముల దగ్గరివి అవి మనసులోకి వెళ్ళేటట్టు లక్ష్మణ మూర్తి చూడలేదు.
|
కాబట్టి నాకు అన్ని వివరాలు ఇప్పుడు తెలియవు సత్యం తు ప్రతిజానామి త్యజ
శోకమ్ అరిందమ ! కరిష్యామి తథా యత్నం యథా ప్రాప్స్యసి మైథిలీమ్ !! నీవు
శోకాన్ని విడిచిపెట్టు ఓ శత్రు సంహారకుడైన రామా! మనం త్వరలో సీతమ్మ తల్లి యొక్క
జాడ కనిపెడదాం, కనిపెట్టి ఆ సీతమ్మ తల్లి జాడ తొందరలోనే నీతో కలిసి ఉండేటట్టుగా
మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం నాఽహం తామ్ అనుసోచామి
ప్రాకృతో వానరోఽపి సన్ ! మహాత్మా చ వినీత శ్చ కిం పున
ర్ధృతిమాన్ భవాన్ !! నేను వానరున్ని నా భార్యని నా అన్నగారు వాలి అపహరించాడు నా కంటి ముందే నా
భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు అటువంటి శోకమున్నటువంటి నేను అంత
శోకించట్లేదు నీవు వసిష్ట విశ్వామిత్రాది మహర్షులచేత గొప్పగా సంస్కరింపబడినటువంటి
బుద్ధికలిగినటువంటివాడివి విషంతో కూడినటువంటి ఆహారాన్ని ఎవ్వడూ ఎలా తినడో
ఇంద్రుడంతటివాడు కూడా సీతమ్మని తాకలేడు అంతటి మహా పతివ్రత ఆతల్లి అటువంటి భార్యని
పొంది ఉండి నీవెందుకు ఇంత శోకిస్తున్నావు ఇంత శోకించచ్చా వానరున్ని నేనే ఇంత
శోకించట్లేదే కాబట్టి నీవు ఊరడిల్లు అంటూ ఆయన అంటాడూ వ్యసనే వాఽర్ధ కృచ్ఛ్రే వా
భయే వా జీవితాఽన్తకే ! విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్ న
అవసీదతి !! ఎప్పుడూ కూడా మనిషి ఆపదయందు ధనము పోయినప్పుడు
జీవితమే శంకింపబడవలసినటువంటి శంషయాత్మకమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు
ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకుని నిలబడతాడు ఈ మూడు వినగానే
విపరీత భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది. ఆపద సంభవించినప్పుడు ముందు
ఎక్కువ భయపడిపోయాడనుకోండి ఎక్కువ భయపడ్డం వల్ల ప్రాణం పోతుంది అందుకే మీరు చూడండి
రామాయణం చాలా గొప్పగా మాట్లాడుతుందండీ.
|
చాలా గొప్ప మాటలు మాట్లాడుతారండి కాబట్టి ఆయన అన్నాడు బాలిశ స్తు నరో
నిత్యం వైక్లబ్యం యోఽనువర్తతే ! స మజ్జతి అవశః శోకే భారాఽఽక్రాన్తేవ నౌ ర్జలే
!! ప్రతిరోజు దీనంగా ఉండే ప్రయత్నంతో
కూడిన ఆలోచన చేసేవాడి యొక్క జీవితం బరువెక్కువవడంవల్ల సముద్రంలో మునిగిపోయే
నౌకలాంటిది. చాలా పెద్ద మాట ఒక్కొక్కడు చూడండీ అన్నీ ఉంటాయి, కానీ ఎందుకో
ఏడుస్తుంటాడు, ఎప్పుడూ ఏడుపే ఏమండీ అన్నీ ఉన్నాయి కందాండీ అన్నారనుకోండి, నేను అమెరికా
అధ్యక్షున్ని అవ్వలేదు కదాండీ అంటాడు. దానికెందుకు ఏడుపు అంటే ఏది లేదో దానికి
ఏడుస్తాడు. ఒక్కోడ ఏమీ లేకపోయినా అసలు లోకంలో ఊహించలేని రీతిలో ఊహించుకుని
సంతోషిస్తాడు. అదొక ఎక్సట్రీమ్ ఇదొక ఎక్సట్రీమ్ రెండూ ఉంటాయి కొంతమందిలో నాకో
మిత్రుడు ఉండేవాడు అతను నాతో అంటుండేవాడు, నేను తల్చుకుంటే ప్రధానమంత్రిని కాగలను
ప్రధానమంత్రి ఎప్పుడు నా ఉద్యోగంలోకి రాలేడు అనేవాడు. నేను ఓసారి అదేమిటయ్యా
అన్నాను అవుని తొంభైయేళ్ళు వచ్చినా ప్రధానమంత్రి అవ్వచ్చు 26 యేళ్ళు దాటితే కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగం రాదు కాబట్టి నా ఉద్యోగంలోకి ప్రధానమంత్రి రాలేడు ప్రధానమంత్రిని
నేను కాగలను అనేవాడు, నీ మనోధైర్యం నీ గొప్పతనం నీ ఉద్యోగం మీద నీకున్నటువంటి
సంతోషం మెచ్చుకోవలసిందేనయ్యా దాన్ని నేనేమీ నిరుత్సాహపరచను అన్నాను కాబట్టి
ఒక్కొక్కరిది చాలా చిత్రంగా ఉంటుంది మనస్తత్వం.
కాబట్టి దీనంతో ఉండకూడదు రామా... అలా దీనంగా ఉంటే అది నౌకకి బరువెక్కువై నౌకకి
తనబరువుకి తానే సముద్రంలో మునిగిపోయినట్లు ఉంటుంది కాబట్టి శోకాన్ని దించెయ్యాలి,
దించేస్తే పడవ తేలుతుంది. కాబట్టి నీ శోకం నీలోంచి నీవు తీసేయాలి నీ శోకాన్ని మేం తీయలేం. ఒడ్డున
ఉన్నవాడు నౌక మునిగిపోకుండా చూసుకోండి నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన
బరువుకి తాను మునిగిపోతుంది, నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువుని సముద్రంలో విసిరి
పాడేయ్యాలి విసిరిపాడేస్తే నౌక పైకి తేలుతుంది, అలా నీలో ఉన్న శోకాన్ని నీవు బయటకి
విడిచిపెట్టాలి మేము ఎంత చెప్తే మీకు శోకం తీరుతుంది. అది నువ్వు చేసుకోవాలి శోకం
విడిచిపెట్టడం. రామా శోకం విడిచిపెట్టు అన్నాడు అంతే. కానీ చాలా గొప్పగా
మాట్లాడాడండీ వానరుడైనా సుగ్రీవుడి మాటలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. నిజంగా
ఇవి
బాగా ఒంటపడితే సుగ్రీవుడు రాముడి మాటలు అలా
ఉంచండి మన జీవితంలో మాత్రం అవి కొన్ని కొన్ని సమయాల్లో చాలా ఊరడింపజేస్తాయి.
మనల్ని ప్రతిదానికి కదిలిపోకుండా చేస్తాయి కదిలిపోకుండా నిలబెట్టగలిగిన స్థితిని
మనకి ఇస్తాయి.
|
కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించారు ఆ రామ చంద్ర
మూర్తి యొక్క మాటలు విన్నటువంటి సుగ్రీవుడు ఎంత సంతోషాన్ని పొంది ఉన్నాడంటే సీతమ్మ
జాడ కనిపెట్టడానికి వానరులను పంపిస్తానని మాటకి రామ చంద్ర మూర్తి సంతోషంగా
ఉన్నారు. రామ చంద్ర మూర్తి వాలి వధ చేసి మళ్ళీ తనకి రుమని రాజ్యాన్ని ఇస్తానన్నాడని
సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు, రామ చంద్ర మూర్తికి సుగ్రీవుడికి స్నేహం కలిసిందని
లక్ష్మణ మూర్తి సంతోషంగా ఉన్నాడు. అనౌసరంగా భయపడిపారిపోతున్నవాన్ని మంచి మాట
చెప్పి మంత్రినైనందుకు వీళ్ళిద్దరిని కలపగలిగినందుకు హనుమ సంతోషంగా ఉన్నారు.
ఇన్నాళ్ళనుంచి పాపం తిరుగుతున్నాడు మా రాజుకు కష్టాలు తీరాయని మిగిలిన సచివులు
సంతోషిస్తున్నారు, అవతల సీతమ్మ తల్లికి ఎడమ కన్ను అదిరి మళ్ళీ సంతోషాన్ని
ప్రకటిస్తోంది కాబట్టి తొందర్లోనే సంతోషం ఉందీ అన్న విషయాన్ని సూచిస్తున్నటువంటి
లోపల ఉన్నటువంటి పొంగు రాబోతున్నటువంటి శుభాన్ని తలచుకొని పరవశాన్ని
పొందుతున్నటువంటి హృదయంతో ఇవ్వాళ అక్కడ ఉన్నటువంటి అందరు ఉన్నారు మహానుభావ స్య
వచో నిశమ్య హరి ర్నరాణామ్ ఋషభస్య తస్య ! కృతం స మేనే హరివీర ముఖ్యః తదా స్వకార్యం
హృదయేన విద్వాన్ !! కాబట్టి సుగ్రీవుడు ఇచ్చిన మాటకు రాముడు రాముడు ఇచ్చిన
మాటకు సుగ్రీవుడు, సుగ్రీవుడు ఆనందం పొందబోతున్నాడన్న వార్తచేత సచివులు, రాముడు
ఆనందాన్ని పొందుతున్నాడన్న వార్తచేత లక్ష్మణు మూర్తి రామ సుగ్రీవులకి మైత్రి
కలిసిందని హనుమ అందరూ సంతోషముతో ఆ ఋష్యమూక పర్వతము మీద కూర్చుని ఉన్నారూ అన్న
మంగళప్రధమైన ఘట్టం దగ్గర ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని ఆపి చేసి, రేపు ఇంక
అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఆ వాలి గురించి ఆ రామ చంద్ర మూర్తిని సుగ్రీవుడు చేసే
పరీక్ష ఆ రామ చంద్ర మూర్తి యొక్క కారుణ్యం వాటిని రేపటి రోజున మనం తెలుసుకునే
ప్రయత్నాన్ని చేద్దాం.
మనం పెట్టుకున్న ఆచారం ప్రకారం కొన్నిమార్లు రామ
నామం చెప్పుకుందాం
రామ నామము రామ
నామము రమ్యమైనది రామ నామము !!రా!!
దారినొంటిగ
నడచువారికి తోడునీడే రామ నామము !!రా!!
నారదాది
మహామునీంద్రుల నమ్మినది శ్రీ రామ నామము !!రా!!
కోరి కొలిచిన
వారికెల్లను కొంగుబంగరు రామ నామము !!రా!!
గోచరంబగు జగములోపల
గోప్యమైనది రామ నామము !!రా!!
బ్రహ్మ సత్యము
జగ్నమిథ్యా భావమే శ్రీ రామ నామము !!రా!!
భక్తితో
భజియుంచువారికి ముక్తి నొసగును రామ నామము !!రా!!
|
పసితనంబున
అభ్యసించిన పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
ఎందరో
మహానుభావులుడెందమాయేను రామ నామము !!రా!!
జానకీ హృత్
కమలమందును అలరుచున్నది రామ నామము !!రా!!
రాక్షసులను
తరిమికొట్టిన నామమే శ్రీ రామ నామము !!రా!!
రామ నామ స్మరణ
చేసిన క్షేమ మొసగును రామ నామము !!రా!!
గుట్టుగా గురు సేవ
చేసిన శుభములొలసగును రామ నామము !!రా!!
మంగళా శాసన పరై.....
No comments:
Post a Comment