బాల కాండ
ఆరవ రోజు ప్రవచనము
నేను నిన్నటి రోజున
మీతో శణ్ముకోత్పత్తిని గురించి ప్రస్థావనచేసి ఉన్నాను, మీరు శ్రీరామాయణాన్ని
ప్రత్యేకించి బాల కాండను వినేటప్పుడు ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని వినవలసి
ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే...? ఒక మహా వృక్షము యొక్క హ్యూహం ఎక్కడ ఉంటుంది ఒక
చిన్న విత్తనంలోనే ఉంటుంది బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్న నిర్వికల్పం
పునర్మాయా కల్పిత దేశ కాలకలనా వైచిత్ర్య చిత్రీకృతమ్ ! (మాయావీవ విజృంభయాత్యపి
మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!) అంటారు
శంకరాచార్యుల వారు. చిన్న విత్తనంలోనే ఒక మహా
వృక్షమునకు సంబంధించిన హ్యూహమంతా దాగి ఉన్నట్లు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వమంతా
కూడా బాల్యంలోనే దాన్ని జాగ్రత్తగా అంకురంగా... మహావృక్షంగా పెంచి
పోషించవలసినటువంటి స్థితి దాగి ఉంటుంది. దీన్ని పైకి తీసుకురావడం, కావలసినటువంటిది
కలపడం, ఇదీ గురువుకు ఉండవలసినటువంటి చాలా గొప్ప లక్షణం. ఇది ఒక్కొక్కసారి కొంత
మంది గురువులు ఏం చేస్తారంటే... ఒక వ్యక్తి పట్ల ఆ శ్రద్ధ తీసుకొని లోకాన్ని రక్ష
చేస్తారు. కొంత మంది ఏం చేస్తారంటే... మొత్తం లోకానికి పనికొచ్చేటట్టుగా ఈ బోధ
తీసుకొస్తారు మీరు కొంచెం తేడా గమనించవలసి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే అవసరమైంది
కలపాలి, అక్కర లేనిది తీసెయ్యాలి. ఒక పంట పండాలి అంటే శశ్యాన్ని రక్షించాలి, చీడా
పీడా పట్టకుండా చూడాలి, కొన్ని తీయ్యాలి కొన్ని కలపాలి, అలా కలపడం తీయ్యడం అన్నది
లేకుంటే, పట్టూ విడుపూ
అన్నది లేకపోతే, అసలు ఎప్పుడూ జీవితంలో ఏది చేరుకోవాలో దేన్ని సాధించాలో దాన్ని
సాధించలేడు దాన్ని చేరుకోలేడు.
ఇప్పుడు రామ చంద్ర
మూర్తికి అనేకమైనటువంటి అస్త్రములను కృప చేశారు విశ్వామిత్ర మహర్షి. చాలా తేలిక -
అంటే, చాలా తేలిక అంటే ఆయన దగ్గర ఉన్నవి ఇచ్చేయడం చాలా తేలిక. ఇప్పుడు ఇచ్చేసిన
తరువాత దీనిని నీవు ఇలా ఉపయోగించ వలసి ఉంటుంది సుమా! నీవు ఇలా లోక రక్షణ కోరకు
పాటుపడాలి సుమా! ఇలా ఇలా నీవు కోప్పడకూడదు, ఇలా ఇలా నీవు వీటిని వాడేయకూడదు అని
చెప్పారను కోండి, అప్పటికి బాగానే ఉంటుంది అలాగేనండి అంటారు. కానీ నిజంగా కోపము
వచ్చేసినప్పుడు విశ్వామిత్ర మహర్షి మాటలు గుర్తు రావద్దూ, చాలా కష్టం అలాగ.
అందుకనీ తనతో పాటు శిష్యున్ని తీసుకొని వెళ్ళేటప్పుడు విశ్వామిత్రుడు ఎటువైపుగా
తీసుకు వెళ్ళాలో అటువైపుగా తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు రామ చంద్ర మూర్తి ప్రశ్న
వేస్తున్నారు విశ్వామిత్రున్ని, ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడం అనేటటువంటి ఎలా
ఉంటుంది అన్నది మీరు బాగా పరిశీలించండి! పరిశీలిస్తే మీకు ఒక విషయం అర్థం
అవుతుంది. భవిష్యత్తులో రామ చంద్ర
మూర్తి యందు
ప్రకాశించేటటువంటి సమస్త గుణములకూ కూడా, విశ్వామిత్రుని యొక్క బోధయే ప్రాతిపదికయై
ఉంటుంది ఎందుకంటే ఆయన అంత తేలికగా ఏం మాట్లాడరు. ఎక్కడ అవసరమో అక్కడ కదలికనీ,
ఎక్కడ ఆగాలో అక్కడ ఆగడాన్ని కూడా నేర్పుతుంటాడు, చాలా అందంగా మాట్లాడుతుంటాడు ఆయన.
నేను మీకు బాగా ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక ఉదాహరణ చెప్తే మీరు
పట్టుకుంటారు.
|
నేను, ఒక కారు
కావాలి - ఒక కార్లో వెడతాను అని అన్నాను అనుకోండీ !, అంటే అప్పుడు కోటేశ్వరరావు
గారు కాకినాడ వెళ్ళడానికి మీకు కారు ఏర్పాటు చేశాం. ఈ కారు కాకినాడకు మీరు
కావలసినంత వేగంగాను వెళిపోతుంది అన్నారనుకోండి. సరే బ్రేకులున్నాయాండీ ఆ
కారుకీ...! మధ్యలో ఎక్కడైనా కావాలంటే ఆగుతుందాండీ, ఎందుకండీ! మీరు కాకినాడగదా వెళ్ళడం మధ్యలో ఎందుకు ఆగడం
అందుకని బ్రేకులులేవుదానికి అని అన్నారని అనుకోండీ, ఇప్పుడు ఆ కారు ఉపయోగం ఏమైనా
ఉంటుందా? వేగము అన్నదానికి అర్థం ఏమిటంటే...? ఎక్కడ ఆగాలో అక్కడ ఆగేటటువంటి లక్షణం
కూడా ఉండాలి లేకపోతే భద్రతలేదు. ఒక కారుకి ఆక్సలరేషన్ ఎంత అవసరమో, స్పీడు ఎంత
అవసరమో, బ్రేకు కూడా అంతే అవసరం. స్వీడు ఉండి బ్రేకు లేక పోయినా, బ్రేకు ఉండి
స్పీడు లేక పోయినా అది కారు కాదు కదా!
వ్యక్తిత్వమూ అంటే అర్థమేమిటంటే...? చాలా విషయాలు తెలిసుండి చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండవలసిన
నిగ్రహం లేకపోయినా, చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండవలసిన నిగ్రహం ఉండి
తెలుసుకోవలసినవి తెలుసుకొని అనుష్టించ లేకపోయినా ఆ వ్యక్తిత్వానికి సమగ్రత ఉండదు
ఇప్పుడు బాగా మీరు పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ కోణంలో తయారు
చేస్తున్నాడు రామ చంద్ర మూర్తిని విశ్వామిత్రుడు ఏవి ఇవ్వాలో అవి ఇస్తున్నాడు,
అస్త్ర సంపదని ఇచ్చేశాడు, ఏది దేశకాలములయందు చెయ్యాలో నేర్పుతున్నాడు, ఇప్పుడు
చెయ్యకూడనివి ఏవో, అవి బాగా జ్ఞాపకం ఉండి పోయేటట్టుగా చెప్తున్నాడు. దేనియుందు
మనసు బాగా కుదురుకోవాలో దాన్ని ఉదాహరణతో చూపిస్తున్నాడు, ఇదీ విశ్వామిత్ర మహర్షి
యొక్క ప్రజ్ఞ ఇదే గురువు యొక్క ప్రజ్ఞ అంటారు. మనకు సనాతన ధర్మంలో ప్రత్యేకించి, ఈ
బోధ అన్నదానికి ఉన్నంత విలువా ఇంక మిగిలినదానికి దేనికీలేదు. భారతీ తీర్థస్వామి
ఒకసారి అనుగ్రహభాషణంచేస్తూ ఒకమాట అన్నారు. “అసలు సేవలన్నింటిలోకి ఉత్తమమైన సేవ ఏదీ అంటే బోధ” బోధ
చేయుటయే ఎందుకో తెలుసాండీ, బోధ చేస్తే వచ్చేటటువంటి మార్పు శాశ్వతం.
కాకుండా నేను ఏదో...
ఇవ్వాల్టికి నేను ఏదో పదిరూపాయలో ఇరవైరూపాయలో కర్చుపెట్టించడం తాత్కాలికం. అది
ఉపయోగపడదు అందుకే, మీరు బాగాగమనించగలిగితే మీరు ఒక రహస్యాన్ని పట్టుకుంటారు సనాతన ధర్మంలో ఇతరులకు ఉపకారం
చేయడం కానీ, ఇతరులకు సేవ చేయడం కానీ సంస్థాపరమై ఉండదు. మీరు గమనించండి!
శంకరాచార్యులవారు ఎప్పుడు చెప్పినా, స్కూల్ పెట్టండీఅని శంకరాచార్యులవారు చెప్పరు,
శంకరాచార్యులవారు హస్పటల్ కట్టండీ అనిచెప్పరు, నేను మన్నింబపడెదను గాక! నా
ఉద్దేశ్యాన్ని సక్రమంగా అర్థం చేసుకోండి, ఎందుకు చెప్పరో తెలుసాండీ! సంస్థాపరం
చెయ్యరు సనాతన ధర్మంలో సేవల్ని. ఇదీ పశ్చిమదేశ సంస్కృతి. సేవ చేయడానికి ఒకసంస్థ
ఉండాలి, మళ్ళీ ఆ సంస్థలో వాళ్ళందరూ ఒకచోట కూర్చోవాలి, అందరూ ఒకకప్పు కాఫీతాగాలి,
వాళ్ళేదో మాట్లాడు కోవాలి, మేం ఇచ్చేవాళ్ళం అవతలివాడు పుచ్చుకునేవాడు, మేం సేవచేసే
వాళ్ళం వాడు సేవించుకునేవాడు అది వాళ్ళ సిద్ధాంతం ఇక్కడ అలా కాదు. జీవితంలో అంతర్భాగం పరోపకారం.
అసలు పరోపకారం లేకుండా జీవితం ఇక్కడ లేదు. దానికి సంస్థాపరం చేయడం అన్నది ఉండదు.
“నాకుండలీ నామకుటీ నాస్రగ్వీనాల్పభోగాన్” ఏది చూడండీ మీరు అయోధ్యా పట్టణంలో
ఉండే ప్రజలయొక్క గుణములను వర్ణిస్తే “నాదాతా” అక్కడ దాత కానివాడులేడు. ఇంక
సంస్థ ఎందుకండీ! ఇంక దానికి క్లబ్బులూనూ, సొసైటీలు ఎందుకు, అంటే చారిటబుల్
ఇన్టిట్యూషన్స్లు ఎందుకు సేవచేయడానికా? అలా ఉండదు. మీ మనసుని ప్రభావితం చేస్తుంది
బోధ. ప్రతివ్యక్తి సేవ చేయడానికి ముందుంటాడు అంతే, ఎవరో ఒకాయ ఊళ్ళోకి వచ్చారు, ఆయన
కొత్తగా ఊళ్ళోకి వచ్చారు. మా ఇంట్లో భోజనం చేయండీ అంటే మా ఇంట్లో భోజనం చేయండీ
అంటారు. అంతేగాని భోజనాలు పెట్టడానికి ఒక సంస్థ ఉండడం ఎందుకు? అక్కర లేదు. ప్రతీ
ఇంటిలో ఉన్నవాడూ దానికి సిద్ధంగా ఉంటాడు.
|
విశ్వామిత్రుడు రామ చంద్ర మూర్తితో మాట్లాడితే,
మీరు కేవలం ఆయనేదో జరిగిపోయిన విషయాలు చెప్తున్నాడు, జరిగిపోయిన కథలు చెప్తున్నాడు
అని వినకండీ! ఆయన చెప్తున్నప్పుడు, మీరు వినేటప్పుడు ఈ కోణంలో వింటూవుండండి. ఇలా
వింటూవుంటే, మీరు రామ చంద్ర మూర్తిలోకి పరకాయ ప్రవేశంచేయండి. ఆయన బ్రహ్మచారి
ఇంకానూ? తండ్రిచాటున బిడ్డ. ఇప్పుడే కొత్తగా బయటికి వచ్చాడు విశ్వామిత్రుడితోటి.
విశ్వామిత్రుడు మాట్లాడేటటువంటి మాటలు యొక్క ప్రభావం రామ చంద్ర మూర్తి యొక్క
జీవితం మీద ప్రభావం ఉండి తీరుతుంది. ఎందుకో తెలుసాండీ! ఆయన ఒకటి నమ్మాడు జీవితంలో
మా నాన్నగారు చెప్పింది అంటే అది నాకు ఖచ్చితంగా ఉపయుక్తమే, ఇది నమ్మాడు. వాళ్ళ
నాన్నగారు ఏమి చెప్పాడు, విశ్వామిత్రుడితో వెళ్ళి ఆయన ఏం చెప్తే అది చెయ్యి
అన్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తే అది నమ్ముతూంటే ఆయన వ్యక్తిత్వం
మలచబడుతోంది. మలచబడుతూందీ అంటే? విశ్వామిత్రుడు మాట్లాడేటటువంటి మాటలే, వాటి యొక్క
సారాంశమే ప్రవర్తనయందు రాముడు. ఇప్పుడు రాముని యొక్క ప్రవర్తన గొప్పదైతే, కీర్తి
ఎవరిది విశ్వామిత్ర మహర్షిది, వశిష్ట మహర్షిది. ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చి పదిమందికి పనికొచ్చాడు ఎవరిది
ఆ గౌరవం గురువుగారిది. మీరు మొక్క చిన్నదై ఉన్నప్పుడు నీళ్ళు పోస్తారు,
కానీ మహా వృక్షం అయినప్పుడు దానికి నీళ్ళు పోయరు,
ఇంకా... ప్రతి కొమ్మకీ నీళ్ళు పోయడం దాని మొదట్లో నీరు పోయడం ఏమీ ఉండదు
తనంతతానే తట్టుకుంటుంది కష్టాలని తట్టుకుని నిలబడుతుంది. ఇప్పుడది మహా
వృక్షమయ్యేంత వరకూ పోషిస్తాడు వ్యక్తి. అప్పుడు మేక వచ్చి తినేయనివ్వండీ, కోతి
వచ్చి కొమ్మ విరువనీయండీ, దొంగలు వచ్చి కొమ్మలను కొట్టనివ్వండి తనని తాను మళ్ళీ
వృద్ధిలోకి తీసుకోడాని ఆ చెట్టు నేర్చేసుకుంటుంది అంతే... అంతేకాని దానికి ఇంకా
ఎవర రక్షకులు ఉండరు.
|
ఎందుకంటే మీరు
చూడండీ... పునాది అన్నది బాగాగట్టిగా లేదనుకోండీ, మీరు ఇంక ఎంత సౌధం కట్టినా అది
నిలబడదు. అందులో ఉండడం కూడా కష్టం ఎందుకంటే పునాది బాగాలేదు అది ఎప్పుడు
పడిపోతుందో తెలియదు. పునాది బాగుంటే సౌధం బాగుంటుంది. రామాయణంలో రామ చంద్ర మూర్తి
పాత్ర ఒక “మహా సౌధము” అది యుగ యుగాలకి నీడనిచ్చే సౌధము. అటువంటి సౌధం
నిర్మింపబడటానికి ఒక పునాది ఉంది ఆ పునాది బాల కాండలో ఉంది ఆ పునాది వేసిన వాళ్ళు
ఇద్దరు ఒకరు వశిష్టుడు, ఇంకొకరు విశ్వామిత్రుడు. వాళ్ళు వేసింది రామునికి కాదు,
రామున్ని అడ్డుపెట్టి నర జాతికంతటికీ వేశారు. అందుకే రామాయణం ఎంత కాలం కావలసి
ఉంటుందీ అంటే... నరత్వం కావాలి అన్నంత కాలం రామాయణం కావాలి. నువ్వు నీ బిడ్డలతో ఏం
మాట్లాడాలో తెలుసుకోవాలంటే నీవు రామాయణం చదువుకోవాలి. నీవు సమాజంలో ఎలా మాట్లాడాలో
తెలియాలంటే నీకు రామాయణం తెలిసి ఉండాలి? నీవు నీ గురువు గారిని ఎలా గౌరవించాలంటే
రామాయణం తెలియాలి. నీ పూర్వీకులను నీవు ఎలా గౌరవించాలంటే నీకు రామాయణం తెలియాలి,
నీకు రామాయణం తెలియనినాడు నీవు అసలు ఎవరి పట్ల గౌరవంతో మాట్లాడం చేతకాదు.
|
ఈయనవెళ్ళి ఇంకో
ఆయన్ని గుద్దాడు, ఏమయ్యా అలా గుద్దేశావ్? అన్నాడాయన, ఏం మీరు చూసుకోలేరా అన్నాడు.
ఆయన మీరు చూసుకోలేరా ఏమిటి?, నాది తప్పైపోయిందండీ నేను ఇలా రాకుండా ఉండాల్సిందీ...
“నాది పొరపాటే నన్ను మన్నించండి!” అయిపోయింది, అలా అనలేరు. అలా అనలేనితనం రావణుడు.
అనగలిగిన తనం రామ చంద్ర మూర్తి. మీరు ఏలా ఉంటారో..? మీ ఇష్టం. అంతే... రామాయణం.
రావణుడు ఎన్నడూ అంగీకరించడు తన తప్పుని, జీవితంలో ఈ తప్పుచేశాను నేను, నేను
మన్నింపబడెదనుగాక! అని అనడూ. మనుష్యుడు ఒక్కడే ఆ మాట అనగలడు “నన్ను క్షమించండి”
అని అనగలడు. అది ఔదార్యమండీ..! అది సంస్కారం. ఆ మాట అనడం ప్రాణం పోయినా అనడు
రావణాసురుడు, ఎప్పుడూ దభాయించి మాట్లాడుతాడు స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న
సంశయః గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమధ్య వా ఇదం తే చారు సంజాతం యౌవనం
వ్యతివర్తతే య దతీతం పున ర్నైతి స్రోతః శీఘ్ర మపామ్ ఇవ అలా ఉంటుంది రావణుడు
మాట్లాడితే.
రాముడు మాట్లాడితే అలా ఉండదు, అత్యంత వినయంతో తన వల్ల ఏమైనా అపచారము
జరిగిపోయిందేమోనని, అపచారం ఎక్కడైనా జరిగిందని తనకు అనిపించిందో... వెంటనే
చెప్తాడు. తను చేస్తానన్నది చెయ్యనని అవతల వాళ్ళు అంటే వాళ్ళఖర్మ అనడు రాముడు. “రామో
ద్విర్నాబి భాషతే” అమ్మా నాకు రెండు మాటలు రావమ్మా అంటాడు ఇది రాముడు. మీరు
ఎలా ఉండాలని అనుకుంటారో అది మీ ఇష్టం. మీరు ఎలా చెక్కబడాలనుకుంటున్నారు మీ ఇష్టం.
కానీ రామాయణం మాత్రం మీకు రెండు మార్గాలను చూపిస్తుంది. నీవు ఎలా
వెడదామనుకుంటున్నావో వెళ్ళవచ్చు, ఈ మార్గం వెంట వెళ్ళితే నీ ఫలితం ఇలా ఉంటుంది. ఈ
మార్గం వెంట వెళ్ళితే యుగాలు మారిపోవచ్చు నీకు దేవాలయాలు ఉంటాయి, నీపేరు
చిరస్మరనీయమై ఉంటుంది. నీవు ఎలా ఉండాలనుకుంటున్నావో మీవాళ్ళని
ఉద్దరించాలనుకుంటున్నావో తాము తరించిన వాళ్ళని కూడా లాగేసి నరకంలోకి తీసుకు
వెళ్ళాలనుకుంటున్నావో నీ ఇష్టం. నీ చేష్టితముల చేత నీవు ఎలాగైనా ఉండొచ్చు ఇది
రామాయణం యొక్క తీర్పు. మీరు ఆ కోణంలో చెక్కినటువంటి రామ చంద్ర మూర్తి యొక్క
శ్వరూపంలో విశ్వామిత్ర మహర్షి యొక్క వాక్ వైభవాన్ని మీరు అనుభవించండి.
|
రామ చంద్ర మూర్తితో మాట్లాడుతున్నాడు
విశ్వామిత్రుడు, నిన్నటి రోజున శణ్ముకోత్పత్తి చెప్పారు. రాముడు అన్నాడు, అసలు
నిజంగా నాకు ఆ శణ్ముకోత్పత్తి వింటూంటే... ఆ సుబ్రహ్మణ్య జననం వింటూంటే... నాకు
చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అలా అనడం వెనుక ఎన్ని రహస్యాలు ఉన్నాయో? అతని
దాపత్య జీవితం గురించి రాముడిలో ఎంత అవగాహన ఏర్పడిందో... వ్యక్తిగత జీవితాలు
ఎప్పుడు తుఫానులోకి వెళ్ళిపోతాయో, చిన్ని రామునికి ఎన్ని విషయాలు అర్థం అయ్యాయో
మీరు గమనించ వచ్చు. ఇప్పుడు అంటున్నాడు విశ్వామిత్రుడు
అయోధ్యాఽధిపతి శ్శూరః పూర్వమాసీన్నరాధిపః ! సగరో నామ
ధర్మాత్మా ప్రజాకామస్స చాపజః !!
వైదర్భదుహితా రామ కేశినీ నామ నామతః ! జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా
సత్యవాదినీ !!
అరిష్టనేమేర్దుహితా
రూపేణాప్రతిమా భువి ! ద్వితీయా నగరస్యాసీత్పత్నీ సుమతిసంజ్ఞితా !!
ఆయన ఒక మాట
చెప్తున్నాడు రామా! మీ వంశంలోనే పూర్వము సగరుడు అనేటటువంటి
చక్రవర్తి ఉండేవాడు, ఆయనకి ఇద్దరు భార్యలు ʻదక్షిణ నాయకత్వముʼ అంటారు. దక్షిణ నాయకత్వము
అంటే బహు భార్యాత్వము అని, అంటే ఒకరి కన్నా ఎక్కవ అది మహారాజులకు అంగీకరింపబడింది.
దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలుకన్నా ఎక్కువగా ఉండేవారు అని అనేవారు కాబట్టి
అయోధ్యాఽధిపతి శ్శూరః అయోధ్యాధిపతి
అయినటువంటి మహాశూరుడు అయినటువంటి సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు, ఆయన పరమ
ధర్మాత్ముడు. రాజ్యాన్ని చాలాబాగా ప్రజల మనుసు చురగొనేటటువంటిరీతిలో పరిపాలన
చేసినటువంటివాడు వైదర్భదుహితా రామ కేశినీ నామ నామతః విధర్భరాజు కుమార్తెయైనటువంటి కేశినీ ఆయన
యొక్క పెద్ద భార్య. ఆవిడ జ్యేష్ఠా
సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదినీ ఆమె చాలా ధర్మమును అనుష్టించేటటువంటి
స్వభావము కలిగినది సత్యమును మాట్లాడుతుంది అరిష్టనేమేర్దుహితా
రూపేణాప్రతిమా భువి ! ద్వితీయా సాగరస్యాసీత్పత్నీ సుమతిసంజ్ఞితా !! అరిష్టనేమీ
అను మారుపేరు కలిగినటువంటి కష్యప ప్రజాపతి కూతురూ అన్నారు వ్యాఖ్యాతలు చాలా చోట్ల.
అరిష్టనేమి యొక్క కుమార్తె అయినటువంటి సుమతి అనేటటువంటి ఆమె గొప్ప లావణ్యవతి,
సౌందర్యవతి. ఆమె సగర చక్రవర్తి యొక్క రెండవ భార్య. ఇద్దరు భార్యలతో సగర చక్రవర్తి
చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు సంతానం లేదు. ఇక్ష్వాకు వంశంలో తరచుగా ఈసమస్య
కనపడుతూ ఉంటుంది సంతానమంటూ ఉండదు. దిలీపుడు అదే సమస్య, సగర చక్రవర్తి అదే సమస్య,
దశరథ చక్రవర్తి అదే సమస్య అందుకే భగీరథుడు దీనికి ఒక శాశ్వతమైన పరిస్కారంచేసే
ప్రయత్నమును చేయుటకు ప్రయత్నించేశాడు అంటే వంశచరిత్రని అర్థం చేసుకోవడం అన్నది ఎంత
ముఖ్యమో మీరు తెలుసుకోవలసి ఉంటుంది.
|
ఇవ్వాళ మనకు
ఏమైపోయిందంటే లోకంలో... చదువు అంటే అది ఎక్కడ వరకు పరిమితమైపోయిందంటే...? కేవలం
పుస్తకం చదువుకోవడం అంతే చదువంటే, అంతే తప్పా! నీ తాతగారు ఎవరండీ అని
అడిగారనుకోండి తెలియదు, మీ గోత్రము ఏమిటండీ అని అడిగారనుకోండి తెలియదు. మీ ఋషులు
ఎవరండీ అని అడిగారనుకోండి ఏమి తెలియదు? మీ మేనత్త ఎవరు వాడికి తెలియదు? ఎందుకంటే
అసలు మనం పంపం. ఎటువంటి సిష్టం మనంతయారుచేసేసుకున్నామంటే ఇదొక ధారణమైనటువంటి
స్థితి. నాకు తరచుగా అదే జ్ఞాపకానికి వస్తూ ఉంటుందీ... పౌల్ట్రీ ఫాంలు ఉంటాయి.
కోళ్ళు పెంచేటటువంటివి, మీరు ఎప్పుడైనా చూశారో లేదో మీకు అదే పనా అనుకోకండీ!
చూశాను కాబట్టి గుర్తొస్తుంది అంతే... ఆ పౌల్ట్రీ ఫాంలో కోళ్ళను పెంచుతుంటారు, అవి
ఎక్కువ తిరగడానికి స్వేచ్ఛ ఉంచరు, కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి దగ్గర దగ్గరగా
పెరుగుతాయి, ఎందుకంటే అవి కొంచెం ఎక్కువగా కదిలితే వాటికున్నటువంటి శక్తి
క్షయమవుతుందనీ, ఎక్కువ కదలడానికి అవకాశం ఇవ్వరు వాటికి అది అక్కడే పుడుతుంది
అక్కడే పెరుగుతుంది అక్కడే తింటుంది అక్కడే విసర్జిస్తుంది అక్కడే గుడ్డు
పెడుతుంది వాడువచ్చి గుడ్డు పట్టుకుపోతాడు. ఆఖర్న దానియొక్క ఒకేఒక్క యాత్ర
ఏమిటంటే? అదేదాని అంతిమయాత్ర. వాటి కాళ్ళన్నికలిపి ఒక గుత్తికింద
కట్టిపట్టుకుపోతారు చాలా ధారుణంగా ఉంటుంది ఆ స్థితి చూస్తే ఆ తీసుకెళ్ళడం కూడా...
పాపాం తలలు రోడ్డుకు కొట్టుకు పోతుంటే తీసుకెళ్తారు తీసుకెళ్ళి పైన ఎక్కింది అంటే
కంఠం పోయిందని గుర్తు కిందుంది అంటే కంఠం పోవడానికి క్యూలో ఉంది అని గుర్తు అంతే
దానిజీవితం. ఇవ్వాళ మనం పిల్లల్ని స్కూలుకు పంపించే విధానం కూడా అంతే...!
ముప్ఫైమంది కూర్చునేటటువంటి తరగతి గదిలో పౌల్ట్రీ ఫాంలో కోళ్ళు ఎలా ఉంటాయో అలా ఓ
అరవై మంది కూర్చొని ఉంటారు. పొద్దున్న ఆరు గంట్లకు వెళితే రాత్రి ఎనిమిది గంటల
వరకూ చదువే దిక్కుమాలిన చదువు. ఆ చదువుకి అర్థమేమీ ఉండదు వాడికి ఇంకేమీ తెలియదు
వాడికి ఏం తెలుసంటే, స్టాప్ వాచ్ పెట్టి 60 నిమిషాలలో ఎన్ని బిట్లు చేసేయగలవు,
సంస్కారాన్ని పక్కన పెట్టని చదువు, ఇదే ప్రమాదమంతా తీసుకొని వచ్చేస్తుంది. అక్కడే
వచ్చింది ఇబ్బందంతా... చదువుది తప్పా అంటే సంస్కారం లేని చదువుది తప్పు సెల్ ఫోన్
ది తప్పా అంటే, సెల్ ఫోన్ ది తప్పు కాదు ప్రవచన మండపంలో సెల్ ఫోన్ మాట్లాడడం, సెల్
ఫోన్ వినడం రింగు వచ్చేటట్టుగా దగ్గర పెట్టుకోవడం తప్పు.
|
కుతూహలం ఒకటి
ఉంటుంది లోకంలో, కుతూహలం అనేది ఎందులోంచి వస్తూందో తెలుసాండీ! మీ మనసు యొక్క
స్థితిలోంచి వస్తుంది. వెంకటాచలంలో మీరు దర్శనం చేసుకొని బయటకి వస్తున్నారనుకోండీ!
ప్రసాదం ఇస్తూ ఉంటారు ఇలా ఇలా చూస్తూ ఉంటాడు ఇటూ కౌంటరు అటూ కౌంటరు రెండు
దారులుంటాయి ఇటు నుంచీ ఇస్తారు అటు నుంచి ఇస్తారు ఇటూ అటూ కూడా చూసి వెళతారు,
ఎందుకంటే చక్కర పొంగళి ఎందులో ఇస్తున్నారని చూస్తారు. అంటే తనకు ప్రసాదం మీద
కుతూహలం కన్నా చెక్కర పొంగలి మీద కుతూహలం ఎక్కువ, జిహ్వ చాపల్యం అక్కడ కూడా ఉంది
అని అనుకోవాలి. సరి ఏమో చెక్కర పొంగలిని ప్రసాదంగా తీసుకున్నాడు గదాండీ అంటే, ఏమో
కొంత వరకు ఫరవాలేదేమో? అదేమిటండీ ఎటు ఏదిస్తే అది ప్రసాదమండీ నాకు... అని
అన్నవాడికి అది మనం చూడక్కర లేదు. అక్కడి వెళ్ళి చేయి పెట్టీ చేతిలో ఏంపెడితే అది
కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకొని వెళ్ళిపోతాడు అంతే... కదా! కుతూహలం ఎక్కడుంటుందో
అంటే మనసు యొక్క స్థితిని బట్టీ ప్రశ్న వస్తూందీ ఎప్పుడూనూ? నేను అందుకే మీతో మనవి
చేశాను అదొక పెద్ద మనస్తత్వ శాస్త్రం అని. శ్రీరామాయణం బాగా జీర్ణమైతే మీతో
మాట్లాడే మనిషి యొక్క మాటని బట్టి ఆయన యొక్క సంస్కారాన్ని లెక్క కట్టేస్తారు మీకు
తెలిసిపోతుంది.
కాబట్టి ఇప్పుడు మీరు ఇద్దరు భార్యలూ అన్నారూ
మాలో ఎవరికి వంశకరుడు ఎవరికి బహు పుత్రులు, అంటే ఏదో ఇద్దరికి ఏదో కోరిక ఉంది కదా!
ఇద్దరూ ఎక్కువ సంతానమే కోరుకుంటే ఫరవాలేదు కానీ, ఇద్దరికీ ఏమో వేరు వేరు కోరికలు
ఉన్నాయోమో? అంటే భృగుమహర్షి అన్నాడు ఆ గొడవ ఎందుకు మీకు, మీకు ఎలా కావాలి అడగండీ?
అన్నాడు మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునన్దన ! పుత్రం వంశకరం రామ జగ్రాహ
నృపసన్నిధౌ !! అంటే రాజ సన్నిధిలోనే అడిగిందంటే రాజుగార్ని వీళ్ళు ఏమండీ
అడగండీ అడగండీ మాలో ఎవరికి ఎక్కువ మంది పిల్లలో, ఎవరికి ఒక్కరో మీరు అడగండి, మీరు
అడగండి అన్నారని
గుర్తు కదా! మళ్ళీ భార్యలని
తీసుకొని భృగుమహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడి అడిగాడంటే ఏమిటండీ దానర్థం?
“కుతూహలమును ప్రదర్శించిరీ” ఇప్పుడు భృగుమహర్షి మీరే అడగండీ అన్నాడు. అంటే
పెద్దావిడ అంది వచనం శ్రుత్వా కేశినీ రఘునన్దన రఘునందన అంటే ఓ రామా!
రాముడికి చెప్తున్నాడు పిలిచి ఈ కథంతానూ, ఆ ముని ఆమెను అడిగినప్పుడు, నాకు
వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలి అని అడిగింది. అందుకనీ భృగుమహర్షి అన్నాడు
తధాస్తు నీకు వంశకరుడైన కుమారుడు లభిస్తాడు. రెండవ ఆవిడ అంది షష్టిం
పుత్రసహస్రాణి సుపర్ణభగినీ తదా ! మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతిః సుతాన్ !! సుమతి
రెండవ భార్య ఈవిడ, చాలా చిత్ర విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటాయి ఒక్కొక్కరి
మనస్సు, మాటకి ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా, దాని లోతుపాతులు పరిశీలన
చేయకుండా, గబుక్కున ఉత్సాహ పడిపోతే అలాగే ఉంటుంది షష్టిం పుత్రసహస్రాణి 60వేల
మంది పిల్లలు నాకు కావాలి అంది. ఎక్కువ మంది పిల్లలు కావాలని 60 వేల మంది పిల్లలు సుపర్ణభగినీ తదా కష్యప
ప్రజాపతి కూతురు.
|
కాబట్టి గరుత్మంతుని చెల్లెలు సుమతీ మహోత్సాహాన్
కీర్తిమతో మహోత్సాహాన్ అంటే ఎటువంటిదంటే...? ఈ పని చేయ్ అన్నారనుకోండీ...
ఏమండీ అలా చేస్తే ఇబ్బంది వస్తుందేమో ఒసారి ఆలోచించండీ! అని అనడూ, ఒక వేళ ఎవరైనా
ఏమైనా చెప్తామంటే అక్కడ ఉండడు. ఏమండోయ్ అలా ఆగు దానివల్ల ఇబ్బంది వస్తుందేమోనని
మళ్ళీ చెప్తామని అనుకున్నారనుకోండీ! ఆయన అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు అంతే ఆ పని
మీద, అత్యుహాంగా అన్నమాట మహోత్సాహాన్ అంత ఉత్సాహమున్న వాళ్ళు 60 వేల మందివి
కీర్తిమతో కానీ కీర్తిని గడిస్తారు వాళ్ళపేరు మీద అలా కీర్తి
నిలబడిపోతుంది. అటువంటి వాళ్ళని నాకు కావాలి అని అడిగింది తథాస్తు. ఆయనకేముంది
మహానుభావుడు వాక్కుచేత ఇవ్వగలడు. ఇద్దరికి మీకు అలాగే కటాక్షిస్తున్నాను. అలాగే
మీకు సంతానం కలుగుతుంది? అని అన్నారు. సరే ఇద్దరూ ఇంటికి వెళ్ళారు, వెళ్ళిపోయిన
తరువాతా సగర చక్రవర్తి భార్యలలో పెద్ద భార్యకీ ఒక కుమారుడు కలిగాడు ఆయనకు
“అసమంజసుడు” అని పేరు పెట్టారు. రెండవ ఆమెకు ఒక పెద్ద పిండము ఒకటి పుట్టింది ఆ
పిండానికి తేనె పట్టుకు తేనె టీగలు ఎలా ఉంటాయో అలా 60 వేల మంది చిన్న చిన్న పిల్లల
యొక్క హ్యూహము దానికి అంటుకొని ఉంది. దాదులు వీళ్ళని నేతి కుండలలో పెట్టి పెద్ద
చేశారు. ప్రీ మెచ్యూర్యు బర్త్ అన్నది రామాయణ కాలానికే ఉన్నట్లున్నది. అందుకని ఈ
60 వేల మందినీ నేతి కుండల్లో పెట్టి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు ఈ 60 వేల మందీ
పెద్ద వాళ్ళయ్యారూ, అసమంజసుడూ పెద్దవాడయ్యాడు అసమంజసుడు ఈ 60 వేల మందీ అన్నదమ్ములు
కదాండీ అవుతారు. ఇద్దరు భార్యల బిడ్డలు కాబట్టీ బాగా జ్ఞాపంక పెట్టుకోండీ నేను
ఎందుకు మీకు బంధుత్వం చెప్తున్నానంటే ఎదర చాలా అవసరం అవుతుంది ఇవి.
ఈ అసమంజసుడు ఒక పని
చేస్తుండేవాడు, సరయూ నదిలో ఆడుకుందాం రండీ అని పిలిచేవాడు పిల్లల్ని, వాళ్లందరూ
పిల్లలు కదా! సరే ఆడుకుందాం రండీ అనీ వెళ్ళే వారు. ఆయనకు ఒక అలవాటు ఆడుతూ ఆడుతూ ఏం
చేసే వాడంటే పిల్లల్ని తీసికెళ్ళీ సరయూ నదీ తీరంలో ఉండేటటువంటి నీటిలో వాళ్ళకి
ఊపిరాడకుండా నొక్కి చంపేసేవాడు. వాళ్ళు గిల గిల తన్నుకొని చనిపోతే రాజు గారి
కొడుకు కదా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇది ఎంత కాలం ఓర్చుకుంటారు ప్రజలు చెప్పి
చూశారు రాజు గారికి చాలా తీవ్రంగా మాట్లాడాడు నీవు అలా చేయ కూడదు అని చెప్పాడు.
అది మనకు ఎందు వల్ల
తెలుస్తుందంటే ఆయనకి తరువాత
పెళ్ళైపోయి కొడుకు కూడా పుట్టాడు, కాబట్టి మారాలి కదా మారలేదనే అర్థం కొడుకు
పుట్టాడు ఆ కొడుక్కి ʻఅంశుమంతుడుʼ అని పేరు కూడా పెట్టేశాడు
సగర చక్రవర్తి అయినా అతను మారినట్లు కనపడదు. పిల్లల్ని అలా చంపుతూనే ఉన్నాడు అంటే
ఒక్కొక్కడికి ఒక్కొక్క పైశాచికమైన ఆనందం. కాబట్టి ఏవం
పాపసమాచారస్సజ్జనప్రతిబాధకః ! పౌరాణామహితే యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్ !! ధర్మమంటే
అది, ధర్మమంటే పది మంది బిడ్డలు పోయి ఏడుస్తుంటే... నా పిల్లాడు సంతోషిస్తున్నాడని
ఊరుకోవడం మంచిది కాదు. ʻధర్మము ధర్మమేʼ కాబట్టి రాజు అన్నాడు సజ్జనప్రతిబాధకః సజ్జనులను
బాధిస్తోంది నా కొడుకు ప్రవర్తన.
|
కాబట్టి వీడు ఈ ఊళ్ళో ఉండడానికి వీళ్ళేదని రాజ్య
భహిస్కారం విధించాడు, నీవు నా దగ్గర ఉండకుండా వెళ్ళిపో అన్నాడు. అసలు తండ్రికి
కొడుకు కనపడకుండా దూరంగా వెళిపోతున్నాడు అంటేనే చాలా బెంగ, అటువంటిది తండ్రి తనంతతానుగా
రాజ్య భహిస్కారం విధించాలి అంటే... చాలా కష్టమది. రాజే తలసుకొంటే దాన్ని ఎలాగైనా
సరే తిమ్మిని బమ్మిని చేసి తనకొడుకే ఒప్పు అని నిరూపించచ్చు. కాని అది ఇక్ష్వాకు
వంశంలో ఉన్నటువంటి చక్రవర్తులలో ఉన్న లక్షణం కాదు. ధర్మం కోసం అవసరమైతే తన
కొడుకుని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు రామా! సగర చక్రవర్తి జ్ఞాపకం పెట్టుకో.
ఇప్పుడు ఏం చేస్తుంది ఇది రాముడి మీద గుర్తించండి. త్యాగం చెయ్యవలసిన లక్షణాన్ని
పెంచుతుంది. ఇదే నేను మీకు చెప్పింది, ధర్మం కోసం ప్రజల కోసం అవసరమైతే కడుపున
పుట్టిన కొడుకుని విడిచిపెట్టాడు మా వంశంలో పుట్టినటువంటి పెద్దాయన పూర్వీకుల
యొక్క గౌరవం కోసం ప్రజలకు రాజా రాముడిగా తాను కూర్చునే ధర్మం కోసం, అవసరమైతే
సీతమ్మ తల్లిని దూరంగా పెట్టగలిగినటువంటి మనః స్థితిని అటువంటి వజ్ర శక్తిని రామ
చంద్ర మూర్తికి ఇచ్చినటువంటి శక్తి ప్రచోదనానికి బీజం ఎక్కడుందంటే విశ్వామిత్రుడి
వాక్కులో ఉంది. ధర్మం కోసం ఎలా నిలబడాలో నేర్పాడు మహానుభావుడు. అందుకు చెప్తాడు
ఎందుకు ఎక్కడ ఏ కథ చెప్పాలో చెప్తాడు ఎంత అందంగా మాట్లాడుతాడో చూడండీ! అనుష్టుప్
లో మాట్లాడుతాడు పెద్ద ఏం వర్ణణ చేయడు ఒక్క మాట. కానీ అది జారిపోయిందనుకోండి ఆ
మాట, అది పట్టుకోలేదు అనుకోండి రాముడు రాముడి వ్యక్తిత్వం నిలబడదు గురువు నోటివెంట వస్తున్నటువంటి
ప్రతి మాటనీ పట్టుకోవడంలోనే అభ్యున్నతి ఉంటుంది.
గురువుగారికి
పనేముంది మాట్లాడడమే పని అనుకుంటే... శిష్యుడు ఉద్దరణ పొందలేడు ఏవం
పాపసమాచారస్సజ్జనప్రతిబాధకః ! పౌరాణామహితే యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్ !! రాజ్యంలోంచి
వెళ్ళగొట్టాడు ఆయన కొడుకైనటువంటి అంశుమంతున్ని మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు.
ఎందుకు పెట్టుకోవాలీ? అంటే నీవు మీ అబ్బాయిని తీసుకొని అవతల పో అనలేదు, నీవు మీ
అబ్బాయిని తీసుకొని అవతల పో అనడానికీ అబ్బాయి చేసిన తప్పేముందీ? మనవన్ని
ఉంచుకున్నాడు, నేను కూడా మా నాన్న గారితో పోతాను అన్నాడనుకోండీ అయితే పో అంటాడు.
అలా అనలేదు వాడు అంటే వాడూ ధర్మా ధర్మ విచక్షణ ఎరిగినవాడు. పిల్లవాడి స్థాయిలో
ఉన్నాడు కాబట్టి నేను వాడు అంటున్నాను. మా నాన్నగారితో వెళ్తాననలేదు, మా తాత
గారితో ఉంటాను అన్నాడు. అంటే తాతగారు బిడ్డడ్ని విడిచి పెట్టేస్తే, మా నాన్నగారినీ
పంపించినా మా తాతగారు, మా తాత గారి ధర్మనిష్ట అంతగొప్పది అని తాతగారి దగ్గర అలా
ఉండిపోయాడు, తండ్రి ఆ స్థితి. కొడుకు ఈ స్థితి. పైన తండ్రి తాత గారిది ఏ స్థితి.
మధ్యలో ఉన్న వాడిది ఇంత విచిత్రమైన స్థితి.
|
నాకు బాల కాండ చెప్పడం అంటే ఎందుకు సంతోషం
అంటే... ఆ మహానుభావుడి పేరు పదిమార్లు ఉచ్ఛరిస్తానని సంతోషం. కాబట్టి
విశ్వామిత్రుడే కాదు లోకంలో ఎక్కడ ఏ గురు స్థానంలో ఉన్న ఏ వ్యక్తైనా ఆయన నా
దృష్టిలో విశ్వామిత్రుడే అని నేను నమ్ముతాను తస్య పుత్రోంశుమాన్నామ అసమఞ్జస్య
వీర్యవాన్ ! సమ్మత స్సర్వలోకస్య సర్వస్యాఽపి ప్రియంవదః !! ఆయన కుమారుడే అయినటువంటి అసమంజసుని
కుమారుడైనటువంటి అంశుమంతుడు మాత్రం ధర్మాత్ముడై లోకంలో ఉండేటటువంటి ప్రజలందరి చేతా
ప్రేమించబడి అందరిచేతా గౌరవింపబడ్డాడు. సగర చక్రవర్తి చాలా సంతోషించాడు అని ఆయన
అన్నారు. సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేశాడు అన్నాడు అంతే! అని తరువాత విషయానికి
వెళ్ళిపోబోతున్నారు, ఆయన పరిశీలన చేస్తున్నాడు, ఇలా చెప్పినా
వింటాడా! దానిలో వివరణ తెలుసుకోవాలని ఏమైనా కోరుకుంటాడా! అందుకని అన్నారూ, సగర
చక్రవర్తి అశ్వమేధ యాగం చేశాడయ్యా! అశ్వమేధ యాగం పూర్తైపోయింది తరువాత ఆయన వంశంలో...
అంటున్నారు. ఆగండి... ఆగండి గురువు గారూ ఒక్కసారి ఆగండి! అశ్వమేధ యాగం చేశారా! మా
వంశంలో సగర చక్రవర్తి మా పూర్వీకులు
మహానుభావుడు ఏమి అశ్వమేధ యాగమండీ! ఎంత గొప్పదండీ అశ్వమేధ యాగం అంటే శ్రోతుమిచ్ఛామి
భద్రం తే గురువుగారు నన్ను కృప చేయండి! వివరంగా చెప్పండి అని ఎలా అడుగుతాడు,
గురువుగారు నన్ను కృపచేయండి, శ్రోతుమిచ్ఛామి నాకు వివరంగా వినాలని ఉంది.
మహానుభావులు ఎంత గొప్పగా చేశారండీ మా పూర్వీకులూ విస్తరేణ కథామిమామ్ బాగా
వివరించి చెప్పరా గురువు గారూ నాకు, నామీద కృప చేత పూర్వకో మే కథం బ్రహ్మన్
యజ్ఞం వై సముపాహరత్ !! ఆ యజ్ఞం చెయ్యడం అంటే... అంత తేలిగ్గా ఏమీ ఉండదు
అశ్వమేధ యాగం. ఆ యజ్ఞాన్ని మా పూర్వీకులైనటువంటి సగర చక్రవర్తి ఎలా చేశారో నాకు
చెప్పవలిసింది అని అన్నాడు.
|
నేనొక యదార్థం చెప్తున్నాను నేను ఇక్కడికి
రావడానికి కారణం రామాయణం చెప్పడానికి కారణం ఒక్కటే, హరి ప్రసాద్ గారు నాతో
కన్నులలో నీరు పెట్టుకుని ఒక రోజున ఒక మాట చెప్పారు. రామ చంద్ర మూర్తి ఊరేగింపు
వెళ్ళిపోతుంటే మా నాన్న గారు ఇంట్లోంచి చూసి పరమ సంతోషంగా బైటికి వచ్చీ హారతిచ్చీ,
లోపలకి వెళ్లి రామ నామం చెప్పుకుంటూ శరీరం వదిలి పెట్టారండీ, మా నాన్నగారికి అంత
రామ భక్తీ కోటేశ్వర రావుగారు అని చెప్పి కళ్ళెంబడి నీరు పెట్టుకున్నారు. అంత రామ
భక్తి కలిగినటువంటి తండ్రి పట్ల ప్రీతి కలిగినటువంటి కొడుకు రామాయణం చెప్పమని
అడిగాడు, ఇంక అంత కన్నా ఏ కారణం కావాలి నీవు రామాయణం చెప్పడానికి శెలవు పెట్టి వెళ్ళవలసిందే
నీవు. నీ పితృ దేవతలపట్ల నీకు ప్రే లేక పోతే నీకు, నీ తాత మీద ప్రేమ లేదు నీ
తండ్రి మీద ప్రేమ లేదు బూడిదలో ఎందుకు నీ చదువు? ఏం ఎందుకు పనికొస్తుంది? తండ్రిని
వృద్ధాశ్రమం, తల్లిని వృద్ధాశ్రమం, నీ పిన తండ్రిని గౌరవించవు, నీ పెద్ద తండ్రిని
గౌరవించవు, గురువుని గౌరవించవు, నీకు ఎవ్వరి పట్లా గౌరవం లేదూ, నీ అంత నీవు
పుట్టావు నీ అంత నీవు పేరిగావు, నీ శుభలేఖ మీద పెద్దవాళ్ళ పేరు ఉండదూ, నీకు నీవు
పిలుచుకుంటూ శుభలేఖ వేయించుకుంటావాయ్యా! అనాధవా నీవు ఏమైనా, నీకు తల్లి దండ్రులు
లేరు, ఐ సొలిసిట్ యువర్ గ్రేషియస్ ప్రజెన్స్ (I solicit your gracias presence) ఏంటండీ! నీ పెద్ద వాళ్ళు పిలవాలా, నీవు పిలుచు
కుంటావా నా పెళ్ళికి రమ్మని, ఏం? ఎవరు లేరా నీకు? అనాధవా? ఏమా దరిద్ర్యం?, ఇవ్వాళ
మనం వింత పోకడలకి పోయి మన సంస్కృతి కాని సంస్కృతిని నెత్తికి ఎత్తుకునీ
పాడుచేస్తున్నది ఎవరైనా ఉంటే..., పెద్దవాళ్ళే, నేను క్షమింపబడెదను గాకా! రామాయణం
పిల్లలకు తెలియకపోతే తప్పు పెద్దవాళ్ళదే...? కొనలేదు రామాయణం? కోట్ల రూపాయలు
కర్చుపెట్టాశారు లేచిన దగ్గర నుంచి తిన్న ఆపిల్ పళ్ళల్లో లక్షలో ఒక వంతు డబ్బు
పెట్టి ఆరు కాండలు గోరక పూర్వవి కొని పెట్టి ఉంటే, నీ కొడుకు ఎప్పుడో ఒకప్పుడు
రామాయణం చదివి ఉండేవాడు. నీ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ లకి అంత డబ్బు కర్చు
పెట్టావు, నీ ఇంట్లో ఆరు కాండల రామాయణం లేదు, దేనికి నిన్ను మన్నించాలి?, దేనికి
నిన్ను గౌరవించాలి?, ఏం రామాయణం అంత బరువైందా ఆరు కాండల పుస్తకం కొని నీ ఇంట్లో పెట్టలేదు.
పన్నెండు స్కంధాల భాగవతం పోతన గారిది నీ ఇంట్లో లేదు, నీ ఇంటి పిల్లలు
సంస్కారవంతులు అవ్వాలని నీకున్న నైతికమైన అర్హత ఏమిటి? లేదు మనకి ఎక్కడ
కోల్పోతున్నామంటే మన సంస్కారాన్ని మనం విడిచి పెడుతున్నాం. నా ఆర్తితో కూడిన మాటలు
వ్యగ్రతతో అన్నవి మన్నింపబడుదును గాక!
|
అంటే చూడండి మనకు కోపమొచ్చేస్తే ఎందుకు
కనపడదురా...? వెతికేసెయండి అంతే శుభ్రంగా, ఎక్కడకి కక్కడే వెతకండీ అంటాం చూశారా
అలా, ఎందుకు కనపడదు గుఱ్ఱము? 60 యోజనాల భూమిని మీ 60
వేల మంది ఒక్కొక్కడూ ఒక్కక యోజనం తరపున భూమినంతటనీ గోతులు పెట్టి తవ్వేసి
వెతికేయండి, ఎక్కడో ఉంటుంది గుఱ్ఱము కనపడి తీరుతుంది అన్నాడు. ఇది వెతకడం
విషయంలోంచి ఉపయోగించినటువంటి మాట వ్యగ్రత గుఱ్ఱము పోయిందన్న తాపత్రయంలో... వాళ్ళు మహోత్సాహన్
వాళ్ళేం చేశారో తెలుసాండీ! యోజనాయామవిస్తారమేకైకో ధరణీతలమ్ ! బిభదుః
పురుషవ్యాఘ్ర వజ్రస్పర్శసమైర్నఖైః !! వజ్రాల్లాంటి గోళ్ళతో వాళ్ళు 60 యోజనముల
భూమిని వాళ్ళు గోతులు గోతులుకింద తవ్వేశారు, ఈ తవ్వేయడం ఎంత దూరం తవ్వేశారో
తెలుసాండీ? 60 వేల మంది కలిసి పెట్టిన గోతులకీ, గోళ్ళతో తవ్వేస్తే పాతాళ లోకం
దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంతింత గోతులు పెడితే ఈ మధ్యలో పన్నగములు కనపడ్డాయి,
రాక్షసులు కనపడ్డాయి, కనపడ్డవాళ్ళందర్నీ చంపుకుంటూ, మా గుఱ్ఱం పోయింది మా
గుఱ్ఱాన్ని మీరే ఎత్తుకుపోయి ఉంటారు. మా గుఱ్ఱం కనపడేదాక మేం వదిలి పెట్టం మేం
తవ్వేస్తుంటాం అని తవ్వేస్తున్నారు. తవ్వుకుంటూ వెళ్ళిపోయారూ ఎంత దూరం
వెళ్ళిపోయినా వారికి గుఱ్ఱం కనపడలేదు. వాళ్ళేం చేశారంటే మళ్ళీ తిరిగి తండ్రి
దగ్గరికి వచ్చారు నాన్నగారూ మీరు చెప్పినట్లే భూమినంతటిని తవ్వేశాం, పాతాళందాకా
వెళ్ళిపోయాం, మాకు గుఱ్ఱము కనపడలేదు నాన్నగారండీ అన్నారు.
|
ఈశ్వరుడు నాకు ఒక
సెంటు భూమి ఇవ్వలేదనుకోండీ! ఓరేయ్... నీకు భూమి ఎందుకు రా? నీకు ఇంకోలా బ్రతికే
అవకాశం నేను ఇస్తానూ అలా బ్రతుకూ అన్నాడనుకోండి ఈశ్వరుడు, ఆయన అదివ్వకుండా ఇంకోటి
ఇచ్చాడని బ్రతికి సంతోషిస్తారు కదాండీ! మీకు పది వేల ఎకరాల భూమి ఉంది మీది కాదుగా?
వాసు దేవుడిది. మరి మీ కెందుకు ఇచ్చాడు? కొన్నాళ్ళు మీరు దానిని అనుభవించీ దాని
మీద వచ్చేటటువంటి ఫలంతో, ఐశ్వర్యంతో సుఖంగా ఆయనది అన్న బుద్ధితో బ్రతకమని ఇచ్చాడు.
నాది అన్నారనుకోండి, సగరుల్లాగే ఉంటారు. ఆయనది నాకిచ్చాడు అని అన్నారనుకోండీ
ప్రసాదమవుతోంది అంతే తేడా. కాబట్టి వాసుదేవుడిది వీళ్ళదిగా తవ్వేస్తున్నారు
కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు, ఆయనే చంపేస్తాడు వాళ్ళని. మీరేం బెంగపడకండి మీరు
వెళ్ళిపోండి. ప్రస్తుతం కపిల రూపంలో ఉన్నాడు విష్ణు భగవానుడు, ఆయన చేతిలో
చచ్చిపోతారువాళ్ళు. అలా నిర్ణయింపబడిపోయిందిరా మీరు వెళ్ళిపోండి ఏం ఫర్వాలేదు
అన్నాడు ఆయన.
నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తూంది, రామ కృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక
శిష్యుడు అడిగాడట, ఈశ్వరుడు ఎప్పుడైనా పకపకపక నవ్వుతాడాండీ! అని అడిగాడు. అడిగితే
రామ కృష్ణ పరమహంస అన్నారూ అసలు ఈశ్వరుడు చేసేదే ఆపని ఎప్పుడూ పకపకపక నవ్వుతూ
ఉంటాడు అన్నారు, అంటే అయ్యో ఎందుకండీ! ఆయన పకపకపకా నవ్వుతూ ఉండటం అని అడిగారు,
అడిగితే టేపు పట్టుకుని భూమిని కొలతలు వేసుకొని ఇది నాదీ అని రిజిస్త్రేషన్
చేయించుకున్నవారు చాలా మంది నా దగ్గరికి వచ్చేశారు, మళ్ళీ ఈవ్వాళ ఎంత మంది బయలుదేరి కొలతలు వేసుకుంటున్నారో అని నవ్వుతుంటాడురా ఈశ్వరుడు
అన్నారు. నిజం కదాండీ! పెరెండ్ డీడ్, పెరెండ్ డీడ్, పెరెంట్ డీడ్ ఎంత మందికి
మారిందో...? ఎవరిది ఆఖరికిది ఈశ్వరునిది, ఏమి పిచ్చి, నాదని పిచ్చి. ఆ పిచ్చితోటి
పాడుచేసుకోవాలి. కాబట్టి యస్యేయం వసుధా కృత్స్నా వాసుదేవస్య ధీమతః ! కాపిలం
రూపమాస్థాయ ధారయత్యనిశం ధరామ్ !! తస్య కోపాఽగ్నినా దగ్ధా భవిష్యన్తి
నృపాత్మజాః !! భవిష్యత్తులో ఆయన కోపానికి
వీళ్ళు భస్మరాసి అయిపోతారు. సరే, ఈ లోగా వాళ్ళు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళారు
తండ్రి అన్నాడూ ఎందుకు వెనక్కు వచ్చారు, మీరు గుఱ్ఱము కనపడేంత వరకు మీరు అలా
తవ్వుకుంటూ వెళ్ళిపోండి భూమిని, ఎక్కడో అక్కడ ఉంటుంది తవ్వుతూ వెళ్ళండి ఎక్కడ దాచినా
కనపడుతుంది దొరుకుతుంది అన్నాడు. మళ్ళీ వెళ్ళారు 60 వేల మంది ఇప్పుడు ఎంత దూరం
వరకు వెళ్ళిపోయిందో తెలుసాండీ వాళ్ళ గొయ్యి పెట్టుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళిపోవడం
వాళ్ళలలా వెళ్ళిపోగా వెళ్ళిపోగా, తూర్పు దిక్కున తవ్వుకుంటూ కిందికి
వెళ్ళిపోతే...? వాళ్లకీ
|
శిరసా ధారయామాస విరూపాక్షో మహాగజః !! యదా పర్వణి కాకుత్స్థ విశ్రమాఽర్థం మహాగజః !
ఖేదాచ్చాలయతే శీర్షం
భూమికమ్పస్తదాభవేత్ !!
అప్పుడు వాళ్ళు
తూర్పు దిక్కుగా కిందకి వెళితే వాళ్ళకి అక్కడికి వెళితే విరూపాక్షం అనేటటువంటి ఒక
పేద్ద ఏనుగు ఒకటి కనపడిందట, అది మోస్తోంది భూమిని తన కుంభ స్థలం మీద. అది ఈశ్వరుడి
యొక్క నిర్ణయం, ఇదంతా మన ప్రజ్ఞ అంటాం మనం, ఆయన పెట్టాడు అక్కడ దిగ్గజాలని ఆ గజం
మోస్తోంది, “విరూపాక్షం” అనే గజం భూమి బరువుని మోస్తోంది. దానికి అప్పుడుప్పుడు
తలకాయ నొప్పి పెడుతుందట, కుంభస్తలం నెప్పి పెడితే నెప్పి తగ్గడానికి తల ఇలా
అంటుందట, ఇలా అన్నప్పుడు భూమి కంపిస్తుంది రామా!, విశ్వామిత్రుడు చెప్తున్నారు రామ
చంద్ర మూర్తితో. భూమి కంపించడానికి కారణం అదిగో అది, ఆ ఏనుగికి తల నెప్పి పెడితే
ఒక సారి తల ఇలా కదుపుతుంది తల కదిపిందో భూమి కంపిస్తుంది.
ఇక్కడ మీరు ఒక
విషయాన్ని బాగా గమనించాలి, ఎనుగండీ ఎప్పుడూ తల కదపకుండా ఉండదు. ఏనుగు ఏం చేస్తుందో
తెలుసాండీ ఇంకా అసలు కదులుతూ వెళ్ళడానికో కదలడానికో అవకాశం లేదనుకోండి ఇంక అవకాశం లేనిది
ఒక్క సారే ఉంటుంది. ఎప్పుడో తెలుసా మావటివాడు అంకుశాన్ని దాని రెండు కాళ్ళ ముందు
ఇలా పెడతాడు అడ్డంగా, మీరు ఎప్పుడైనా గమనించండి క్షేత్రాలకెళ్ళినప్పుడు, కర్ర ఇలా
పెట్టి తను కూర్చుంటాడు పక్కన, ఏనుగు వంక చూడడు ఇంక ఆయన, పక్కన వెళ్ళి
కూర్చుంటాడు. మావటివాడు అంకుశం కాని ముందు పెడితే ఏనుగు ఇంక తన శరీరాన్ని కదిపి
ముందుకు వెళ్ళదిక మళ్ళీ అంకుశం తీసేవరకు వెళ్ళదు. అంత పెద్ద ప్రాణి అయినా
దానికున్న క్రమ శిక్షణ అది, లొంగిపోతుంది అంతే అది వెళ్ళదిక, కాబట్టి అది ఏం
చేస్తుందేంటే కదలకుండా ఉండలేదు, అందుకని తొండాన్ని ఇలా ఊపుతుంది ఆలా ఊపుతుంది మీరు
ఎప్పుడైనా చూడండీ! తల కాయ ఇలా ఇలా ఊపుతుంటుంది. ఎందుకంటే ఇలా వెళ్ళడానికి తనకి
అవకాశం లేదు కర్ర అడ్డంగా ఉంటుంది. కర్రేమిటంటీ అది చెట్లనే విరగొట్టేస్తుంది,
వెళ్ళదా అంటే గౌరవం అంతే... ఎనుగు లొంగిపోతుంది మావటి కర్రకి. మనం మాత్రం మన
మనస్సును లొంగ దీయలేం ఇది మన బలహీనత అది ఆ ప్రాణి క్రమశిక్షణ అంతే.
కాబట్టీ, అంత కదిలే
స్వభావమున్న ఏనుగూ, కదలకుండా మోస్తోంది భూమిని. ʻఈశ్వర శాసనంʼ అది అప్పుడప్పుడు తలకాయ ఖేదపడితే కదుపుతుంది.
అప్పుడు భూమి కంపిస్తుంది రామా! తం తే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజమ్
! మానయన్తో హి తే రామ జగ్ముర్భిత్త్వా
రసాతలమ్ !! వాళ్ళు ఆ ఏనుగుకి ప్రదక్షిణంచేసి పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారు. 60
వేల మంది తూర్పు దిక్కుకే వెళ్ళరుగదా అందరూ తలో దిక్కుకీ వెళ్తారు, కొంత మంది
దక్షిణ దిక్కున తవ్వారు, దక్షిణ దిక్కున తవ్వి కిందకి వెళ్ళితే, దక్షిణ దిక్కున
ఇంకో ఏనుగు మోస్తోంది, మహాపద్మం మహాత్మానం సుమహత్పర్వతోపమమ్ ! శిరసా ధారయన్తం
తే విస్మయం జగ్మురుత్తమమ్ !! మహాపద్మము అనేటటువంటి ఏనుగు దక్షిణ దిక్కును
మోస్తోంది. ఆ ఏనుగు యొక్క పరిస్థితి కూడా అంతే... ఇంత పెద్ద భూమి కుంగిపోకుండా
ఉండాలంటే అన్ని వైపులా మోయాలి నాలుగు దిక్కులా, వాళ్ళు ఆ ఏనుగును కూడా చూశారు.
దానికీ ప్రదక్షణం చేశారు కిందకి వెళ్ళిపోయారు పాతాళ లోకంలోకి. ఇంక కొంత మంది
పశ్చిమ దిక్కున తవ్వారు, అంటే మీరు చెప్పేటప్పుడు విశ్వామిత్రుడు ఎలా
చెప్తున్నాడంటే ʻప్రదక్షిణ పుర స్వరూపంగాʼ చెప్తున్నాడు అదీ ఆయన అంతర్ముకత్వం. ఆయనకి ఎంత
జ్ఞానం ఉందో చూడండి ప్రదక్షిణ పురస్కారంగా ఏ విషయాన్నైనా ఆలోచించడం ప్రదక్షిణ
పురస్కరంగా కదలడం గౌరవానికి గుర్తు.
|
ప్రదక్షణంగా కదిలితే మీరు గౌరవాన్ని ఆవిష్కరించినట్లు, మీరు ఏక్రతువు
చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో దానియందు మీరు విపరీతమైన పవిత్రతని ఆవిష్కరించడం
ఏమిటంటే? మీరు ఆ మార్గాన్ని నిర్ణయించుకోవాలి, మీరు ఎటువెళదామనుకున్నది అది ఎవరిపట్ల
కృతజ్ఞతతో ఎవరిపట్ల గౌరవంగా వెళుతున్నారో దానికి ప్రదక్షణంగావెళ్ళాలి,
గురువుగారికి ప్రదక్షణ పురస్సరంగా తిరగాలి ఎప్పుడూను. తల్లి, దండ్రులుకు ప్రదక్షణ
పురస్సరంగా తిరగాలి అంటే, అంతేగాని ఎలాపడితే అలా పక్కనుంచి వెళ్ళిపో కూడదు
అమర్యాద. ఎంత అందంగా మాట్లాడుతారో చూడండి విశ్వామిత్రుడు, చెప్పేటప్పుడు
పశ్చిమాన్ని ముందుగా చెప్పచ్చు, కాని చెప్పడు తూర్పు చెప్పాడు, దక్షిణం చెప్పాడు,
పశ్చిమం చెప్తున్నారు. అంటే ఆయన చెప్పేది కూడ ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతుంది
ఆయన బుద్ధి. అంటే ఆయన బుద్ధి ఇప్పుడు భూ ప్రదక్షిణం చేస్తుంది. అంటే ఆ ప్రదక్షిణ
పురస్సరంగా ఆలోచించడం ప్రదక్షిణ పురస్సరంగా తిరగడం. ఇవన్ని కూడా లోపల మంగళ ప్రదమైన
ఆలోచనలతో కూడిన సంస్కారబుద్ధి కూడిఉన్నవాళ్ళు తప్ప వేరొకరు చేయలేరు. తప్పా అందుకే
ఆ కదలికకు అంత ప్రాధాన్యత ఉందండీ! సంస్కారాన్ని ఆవిస్కరిస్తుంది.
కాబట్టి దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాః సౌమనసం
అనేటటువంటి ఏనుగు పశ్చిమ దిక్కున ఆ భూ మండలాన్ని అంతటినీ మోస్తుంది. సరే పశ్చిమ
దిక్కు అయిన
తరువాత ఉత్తరం. ఉత్తర
దిక్కున వెళ్ళేటటువంటివాళ్ళు కిందకి తవ్యారు భద్రం భద్రేణ వపుషా ధారయన్తం
మహీమిమామ్ ఉత్తర దిక్కున భద్రమనేటటువంటి ఏనుగు ఆ భూ మండలాన్ని అంతట్నీ
మోస్తుంది. వాళ్ళు నాలుగు వైపులా చూసిన తరువాత, ఈశాన్య దిక్కుకు తవ్వుకుంటూ
పాతాళలోకానికి కొంత మంది వెళ్ళారు తే తు సర్వే మహాత్మానో భీమవేగా మహాబలాః భీమ
వేగం గలిగిన వాళ్ళు, మహోత్సాహం కదా వాళ్ళందరీనూ దదృశుః కపిలం తత్ర వాసుదేవం
సనాతనమ్ సనాతనుడైనటువంటివాడు వాసుదేవుడు కపిలరూపంలో అక్కడ కూర్చుని ఉన్నారు.
ఈశాన్య దిక్కున పాతాళ లోకంలో ఆయన ఒక ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు.
కపిల రూపంలో కపిలగీతా అని చెప్పాడు భాగవతంలో మహానుభావుడు ఎంత గొప్పగా ఉంటుందో,
కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయన్ని చూశారు. ఇంద్రుడు ఏం చేశాడంటే, ఎత్తుకు పోయిన
గుఱ్ఱాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ దాన్ని చూడగానే హయం
చ తస్య దేవస్య చరన్తమవిదూరతః ! ప్రహర్షమతులం ప్రాప్తాస్సర్వే తే రఘునన్దన !! తే తం
హయవరం జ్ఞాత్వా క్రోధపర్యాకులేక్షణా ! ఖనిత్రలాఙ్గలధరా నానావృక్ష శిలాధరాః !! వాళ్ళూ
ఆ గుఱ్ఱాన్ని చూశారు కపిల మహర్షిని చూశారు వెంటనే వాళ్ళకి క్రోధం వచ్చేసింది.
|
ఇదే మహోత్సాహన్ యుక్తా యుక్త విచక్షణ లేదు, వినదగు నెవ్వరు జెప్పిన,
వినినంతనె వేగ పడక వివరింప దగున్ ! కని కల్ల నిజము దెలిసిన, మనుజుడె పో నీత పరుడు
మహిలో సుమతీ !! వీళ్ళు కపిల మహర్షిని చూశారు గుఱ్ఱాన్ని చూశారు సంతోషం
వచ్చేసింది, ఎందుకంటే గుఱ్ఱం కనపడింది. చాలా క్రోధం వచ్చేసింది ఎందుకనీ, ఇయ్యనే
ఎత్తుకు పోయాడు. ఎంత కష్టపడ్డామురా మనం, భూమినంతా తవ్వాం, ఇంతసేపు యాగం
ఆగిపోయింది? మన గుఱ్ఱాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ కట్టుకుంటాడా? అంతే నాగళ్ళు,
గుణపాలూ, తవ్వుతున్న పారలూ, చెట్లూ, కొమ్మలూ అన్ని పట్టుకొని పట్టండీ, కొట్టండీ,
చంపండీ అని కపిల మహర్షి మీదకి పరుగెత్తారు. ఆయన కళ్ళు తెరిచి చూశాడు ఇలాగా!
వీళ్ళందరూవచ్చి మీదపడిపోతున్నారు ʻమహాత్ములకు వేరు
ఆయుధాలు ఉండవు వాళ్ళ వాక్కే వాళ్ళ ఆయుధంʼ, శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునన్దన ! రోపేణ మహతావిష్టో
హుజ్కారమకరోత్తదా !! తతస్తేనా ప్రమేయేన కపిలేన మహాత్మనా ! భస్మరాశీకృతాః సర్వే
కాకుత్స సగరాఽఽత్మజాః !! “కాకుత్సా” కాకుత్స వంశంలో పుట్టిన వాడా! కాకుత్స వంశంలో
జన్మించిన ఓ రామా! ఏమైందో తెలుసా... వీళ్ళందరూ మీద పడిపోతుంటే...? అన్ని దిక్కుల
నుంచి వచ్చిన 60 వేల మంది కపిల మహర్షిపై పడబోయారు, ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి
చూసీ, ఏమిరా మీ అందరూ ఇలా మీద పడుతున్నారని హుఙ్కారమకరోత్తదా “హుం” అని ఒక
హూంకారం చేశాడు. ఆయన కోపం తోటి కళ్ళు పెద్దవిచేసి ఇలా చూశాడు కోపంతో... అంతే భస్మరాశీకృతాః
సర్వే కాకుత్స సగరాఽఽత్మజాః 60 వేల మంది బూది కుప్పలై కింద పడిపోయారు.
|
ఇప్పుడు ఈ పీఠల మీద ఉండిపోయినటువంటి సగర
చక్రవర్తి చాలా కాలం చూసి చూసి నీ పినతండ్రులు తిరిగి రాలేదయా ఎందుచేతనో అని
మనుమడైన అంశుమంతున్ని పిలిచాడు. నాయనా అంశుమంతుడా! నీవు వెళ్లి చూసిరా ఎక్కడ
ఏమైందో అన్నాడు. ఈయనా బయలు దేరాడు అన్ని వైపుల నుంచి కిందికి దిగాడు, ఆ ఏనుగులు
కనపడ్డాయి, ప్రదక్షణము చేశాడు, నమస్కారము చేశాడు, కుశలము అడిగాడు, నాకు మార్గం
చెప్పండీ అని ప్రాధేయపడ్డాడు. అవి సంతోషించాయి, సంతోషించి నాయనా నీకు మార్గం
తొరుకుతుందీ అన్నాయి. అంటే పెద్దలు
కనపడినప్పుడు వాళ్ళను ఆశ్రయించి అభ్యర్తించవలసినటువంటి విధానంలో మాట్లాడిన మాటలచేత
తృప్తి పొంది దిగ్గజములు ఆయనకి సహాయం చేశాయి.
ఇప్పుడు ఆయనకి
కపిలాశ్రమము కనపడింది. ఆ కపిలాశ్రమం దగ్గరకి వెళ్లాడు వెళ్ళేటప్పటికి గుఱ్ఱము
కనపడింది. 60 వేల బూడిద కుప్పలు కనపడ్డాయి, బూడిద కుప్పలు అంటే బూడిద కుప్పలు,
పుర్రెలు, ఎముకలు కూడా ఉంటాయి కదాండీ! కాబట్టి 60 వేల బూడిద కుప్పలు అంటే
ఖచ్చితంగా మా పినతండ్రులవే, తెలిసిపోయింది. అరేరే...! 60 వేల మందీ బూడిదైపోయారు,
ఎందుకు అయిపోయారో తెలియదు. ఇప్పుడు మీరు బాగా గుర్తించుకోవాలి, ఒక గొప్ప విషయాన్ని
గురించుకోవాలి, ఇది గుర్తు పెట్టుకోవలి, ఇది పట్టుకున్నాడు రాముడు. ఇది సారం.
గుఱ్ఱాన్ని తీసుకొని వెళ్ళిపోవడమా! బూడిద కుప్పలు కనపడ్డాయని ఏడుస్తూ కూర్చోవడమా!
ఏం చెయ్యాలండీ! గుఱ్ఱాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి, అశ్వమేధ యాగం ముందు పూర్తవ్వాలి కాబట్టి, అదే చేయలేదు
అంశుమంతుడు. ఆయన ఏం చేశాడో తెలుసాండీ! 60 వేల మంది బూడిద కుప్పలై పడిపోయారు,
ఎప్పుడు పడిపోయారో తెలియదు. కాబట్టి వీళ్ళ ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయి ఇంకా...
వీళ్ళకి జల తర్పణం అవలేదు, కాబట్టి దాహంతో ఉంటారు పితృ దేవతలు, వాళ్ళు తాగేది
నీళ్ళు మాత్రమే పాపం. అందుకని ఆ నీళ్ళు ఇచ్చినవాడు లేడు వీళ్ళకి, నేను కొడుకును
అవుతాను, ఎందుకంటే పినతండ్రులే కదా! అందుకని చెప్పి “ నేను ఇప్పుడు తండ్రులు
కాబట్టీ వీళ్ళకి జల తర్పణం ముందు చెయ్యాలి ఇది విహిత కర్తవ్యం,” ఇంకో రెండు రోజులు
కూర్చుంటాడు ఇన్నాళ్ళు కూర్చున్నాయన పీఠల మీద. ముందు నేను పట్టుకెళ్ళి జల తర్పణం
ఇవ్వాలి, అందుకని ఆయన గబగబా నీళ్ళు ఎక్కడున్నాయని వెతికాడు ఎక్కడా కనపడ లేదు.
ఆఖరుకి ఎక్కడో నీళ్ళు కనపడ్డాయి, ఇప్పుడు ఆయన నీళ్ళు తేవడం కోసమని చెప్పి
పరుగెత్తాడు, పరుగెడితే గరుత్మంతుడు వచ్చాడు మేనమామ వచ్చి ఆయన అన్నాడూ
కపిలేనాప్రమేయేన దగ్ధా హీమే మహాబలాః ! సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి
లౌకికమ్ !!
గఙ్గా హిమవతో జ్యేష్ఠా దుహితా పురుషర్షభ ! తస్యాం కురు మహాబాహో ! పితృధాంతు
జలక్రియామ్ !!
భస్మరాశీకృతానేతాన్ ప్లావయేల్లోకపావనీ !
తయా క్లిన్నమిదం భస్మ గఙ్గయా లోకకాన్తయా ! షష్టిం పుత్రసహస్రాణి స్వర్గలోకం చ
నేష్యతి !!
సువర్ణవచనం శ్రుత్వా
సోంశుమానతివీర్యవాన్ ! త్వరితం హయమాదాయ పునరాయాన్మహాయశాః !!
ఆ వచ్చినటువంటి గరుత్మంతుడు అన్నాడూ, నాయనా మేనల్లుడా! నీవు
తొందరపడి పరుగెత్తుకెళ్ళి నీళ్ళు
తీసుకొచ్చి జలతర్పణం చేద్దావనుకుంటూన్నామేమో, నీ పితృ దేవతలకీ అంటే ఈ
చనిపోయినటువంటి పినతండ్రులకీ, ఈ భూమిలో ఉండే నీళ్ళు తీసుకెళ్ళి పితృతర్పణం చేసి
నీళ్ళు విడిచిపెట్టినా వాళ్ళకి ఆ నీళ్ళు ముట్టవూ, ఎందుకంటే ఈ నీళ్ళు
ఊర్ధ్వలోకాల్లోకి పితృదేవతల దగ్గరికి వెళ్ళేలోపలే ఈ నీళ్ళు ఆవిరైపోతాయి కారణం
ఏమిటో తెలుసా? మహాత్ముని యొక్క కోపాగ్ని జ్వాలలకి మరణించారు. అలాంటి వారికి ఈ
లోకంలో జలతర్పణం కూడా ఇవ్వడం కుదరదు. వాళ్ళు దాహపడుతూ అలా పడుండమే, వాళ్ళకి
ప్రేతత్వం పోవాలంటే...? వాళ్ళకి జలతర్పణం చేయాలి అంటే...? హిమవంతుని యొక్క పెద్ద
కుమార్తె అయినటువంటి గంగానది స్వర్గలోకంలో ఉంది ప్రవహిస్తూ, ఆమెను భూలోకం మీదకు
తీసుకరావాలి, భూలోకం నుంచి పాతాళ లోకానికి తీసుకురావాలి, పాతాళలోకంలో ఉన్న ఈ
భస్మరాశుల మీద గంగ ప్రవహించాలి, అప్పుడు వాళ్ళకి దహం తీరి వారికి విముక్తి పొంది
ఊర్ధ్వలోకానికి వెళ్ళుతారు అలా పట్టుకు రాగలవా? ముందు గుఱ్ఱము పట్టుకెళ్ళు ఈ
నీళ్ళు వాళ్ళకు అందదు అని చెప్పాడు.
అంటే
బాగాగమనించండి! తొందరపడిపోవడం చాలా తేలిక Think, tries before you leave అని ఇంగ్లీషులో ఒక సామెత, రెండు మార్లు ఆలోచించు
దూకేముందు Marry
impairs can repeatedly అంటారు తొందరపడి
పెళ్ళిచేసుకొని జీవితాంతం విచారించకు. అలా తొందరపడి
పనిచేసేసి, తన వాళ్ళకి కూడా ఇబ్బంది చేసేపని చేయకూడదు. పాపం చేయడం చాలా చాలా
తేలికా జ్ఞాపకం పెట్టుకోండి, అప్పటి సుఖం కోసం ఒక పాపకర్మ చేసేయడం చాలా తేలిక, ఒక్కొక్కసారి ఆ పాప
కర్మ ఎంత పట్టి కుదుపుతుందో తెలుసాండీ, ఒక్కసారి శరీరం వదిలి పెట్టిన తరువాత ఇక
మిమ్మల్ని ఉద్దరించడం ఎవ్వరికీ చేత కానంత స్థాయిలోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది అది
ఇక ఎవ్వరూ ఉద్దరించలేరు, ఈ చేసినపని చిన్నది, కానీ వీడు మాత్రం
దాహంతీర్చే వారులేక
పడిఉంటాడు అలాగ. ఎందుకా స్థితి?, ఎందుకంత అత్సుహాం ఇదీ జ్ఞాపకంలోకి వెళ్ళుతుంది
రామ చంద్ర మూర్తికి, అన్నిటి కన్నా దేనికి పెద్ద పీఠ వేశారంటే గుఱ్ఱాన్ని
తీసుకెళ్ళడం కన్నా పితృ దేవతలకి జల తర్పణం చేయడానికి ఎక్కువ శ్రద్ధపెట్టాడు, పితృ
దేవతలకు శ్రాద్ధ కర్మచేయడం అన్నది ఎంతముఖ్యమైనటువంటి విషయమో మనకు అర్థమవుతుంది.
|
ఏమండీ నేను ఒక్క మాట అడుగుతాను మీరు మరోలా అనుకోకుండా ఆలోచించండీ, నేను తక్కువ
చేసి మాట్లాడటం లేదూ, ఆగష్టు 15 వస్తే అంత సంతోషంగా మనం జాతీయ పథాకాన్ని
ఆవిష్కరించి ఒక శాల్యూట్ చేసి నమస్కరిస్తాము, నమస్కారం చేసి వస్తాము అది చాలా మంచిదే.
జన్మనిచ్చినటువంటి తండ్రి కష్టపడి పెంచి పెద్దచేసి శరీరము విడిచి పెట్టినరోజు గుర్తుపెట్టుకొని,
ఒక్క ఇరవై రూపాయలు పెట్టి స్వయంపాకం ఇప్పించుకునేటటువంటిస్థాయి తండ్రికిలేదాండీ!
అంత పనికిమాలినవాడా తండ్రి, జన్మనిచ్చాడే, పెంచి పెద్దచేశాడే, ముద్దులాడాడే, భుజం
మీద ఎక్కించుకున్నాడే, గుండెల మీద పడుకోబెట్టుకున్నాడే, కొడకా కొడకా అని అంత తాపత్రయపడ్డాడే,
నీకోసం అహర్నిషలు పరిశ్రమించాడే, అటువంటి తండ్రి చచ్చిపోయిన రోజు నీకు జ్ఞాపకం
లేదు, ఆరోజున పదినిమిషాలు పోనీ నీవేంచేయద్దు బియ్యం ఓ బెల్లంగడ్డ, ఒక్క పదకొండు
రూపాయలు నాన్నగారి పేరుచెప్పి నీకు ఇవ్వడానికి ఖాలీ లేకపోతే ఏంచెప్పాలి ఆ
సంస్కారాన్ని ఇంక. ఆపాటిది చేయలేడాండీ తండ్రీ.
కానీ అది
అన్నిటికన్నా గొప్పదంటున్నాడు విశ్వామిత్రుడు, గుఱ్ఱాన్ని తీసుకెళ్ళలేదయ్యా
అశ్వమేధం పూర్తవడానకి, పితృ దేవతలకి జలతర్పణం చేయడానికి పరుగెత్తాడు తెలుసా? మీ
వంశంలో ఉన్నవాడు, ఇలా చెప్పాడా నేను చెప్పినట్లు, చెప్పలేదు, పరిగెత్తాడాయ్యా అని
చెప్పాడు అంతే, సుపర్ణుడు అడ్డుపడ్డాడయ్యా అని కూడా చెప్పాడు. అంటే... తొందరపడి తప్పుచేసేయ్యడం
తేలిక, కాని ఇందులో ఎప్పుడూ ఉండిపోవుగా, ఇందులోంచి వెళ్ళాక నిన్ను ఇక ఏవీ
ఉద్దరించలేవు, భూమి మీద ఉన్నవి ఏవీ ఉద్దరించవు కాబట్టి నీ కొడుకు మాత్రం ఏం
చేస్తాడు? భూమి మీద ఉన్న వాటితోటే చెయ్యాలి? ఈ భూమి మీద ఉన్నవేవీ ఉద్దరించబడలేని
స్థితికి నీవు వెళ్ళీ, ఇందులోంచి విడిపోయిన తరువాతా దాహమో దాహమో అని పడి
కొక్కుకుంటూంటే... ఉద్దరించడం అంటే ఎంతకష్టం అవుతుందో చూడండీ! ఏక కాలమునందు
శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామ చంద్ర మూర్తిని ఏన్ని రకాలుగా
దిద్దేస్తున్నారో చూడండీ...! కనపడుతుందా అలా దిద్దుతున్నట్లు ఏమైనా... కానీ
వింటున్నటువంటి రాముని యొక్క మేధస్సులోకి వెళ్ళుతున్నాయి ఈ విషయాలన్నీ, ఓ పితృ
కార్యం అంటే ఇలా ఉంటుంది, ఇంత శ్రద్ధతోచేయాలి తండ్రిగారి శ్రాద్ధం అంటే...
తల్లిగారి శ్రాద్ధం అంటే గౌరవంగా అంత మర్యాదతో పెట్టవలసినటువంటి రోజు చూశావా మా
పెద్ద వాళ్ళు ఏలా బతికారో...? చూశావా తొందరపడితే ఎంత ఇబ్బందులొచ్చాయో?
తెలుసుకుంటున్నాడు పిల్లాడు. ఏది నేర్పాలో ఆ సంస్కారం నేర్పుతున్నాడు. ఏది ఇవ్వాలో
అది నేను ఇచ్చేశాను. నిన్నను ఆక్సిలేటర్ బిగించాడు, ఇవ్వాళ బ్రేకులు
బిగిస్తున్నాడు ఇప్పుడు ఆ కారు లోకానికి ఉపయుక్తమౌతుంది ఇదే మీకు నేను మనవి చేసిన
ఉపోత్ఘాతం.
|
మా నాన్నగారి శరీరం
పడిపోయిందండీ అని అనడం ఒకెత్తు, మా నాన్నగారు చచ్చిపోయారండీ అని అనడం ఒకెత్తు.
చాలా గౌరవం ఉంటే మీరు అన్ని ఒక్కలా మాడ్లాడరు. ఆయన కులాసాగున్నారాండీ అని అడగడం
ఒకెత్తు, ఏమండీ నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే ఆయనకి తొంభై సంవత్సరాలు వారిప్పుడు
కులాసాగా ఉన్నారా అని అడగండం ఒకెత్తు, నేను ఆ ఉళ్లో ఉండేటప్పటికే ఆయనకి 90 ఏళ్ళు
ఇంకా బతికున్నారా అని అనడం ఇంకో ఎత్తు కదాండీ! మాటల చేత దేవతలు మన్నన జేసి
వరంబు లిత్తురు మీ మాట మీ సంస్కారాన్ని ఆవిస్కరిస్తుంది.
కాబట్టి రామా! కాలధర్మం గతే రామ సగరే
ప్రకృతీజనాః కాలధర్మం చెందాడయ్యా! కాలంలో అందరూ ఏ ధర్మానికి చెందుతారో
పంచభూతాలలో సగర చక్రవర్తి కూడా అలా కలిసిపోయాడు. తరువాత ఆయన కుమాడైనటువంటి
దిలీపుడు రాజ్యానికి వచ్చాడు, అంత ఖ్యాతి గడించినటువంటి దిలీపుడు కొన్ని
వేలసంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించాడు, పరిపాలించినంత కాలం ఇదే బెంగ, అయ్యో
నా పితృ దేవతలని ఎలా తరింపజేయాలీ, ఎలా ఆకాశంలోంచి ఆ గంగ వస్తుంది, ఏలా తీసుకురావడం
దీని గురించే చింతించి చింతించి చెయ్యగలిగింది లేక దిలీపుడు కూడా శరీరాన్ని వదిలి
పెట్టేశాడు. దిలీపుడు మరణించిన తరువాత ఆయన కుమారుడు భగీరథుడు రాజైనాడు, భగీరథుడు
కొన్ని సంవత్సరములు పరిపాలన చేసిన తరువాత, మంత్రులు చెప్పారు నీ ముందు వాళ్ళు
పరిపాలన చేసినప్పుడు ఈ బెంగతోనే ఉన్నారు, ఇప్పటికీ మీ వంశంలో కొంత మంది పితృ
దేవతలు ప్రేతత్వం నుంచి విడుదల పొందలేదు, అలాగే ఉన్నారు దాహంతో... మీ వంశంలో
వాళ్ళు ఎవ్వరూ చేయలేకపోయారు ఈ పని, ఆయన విన్నాడు తప్పకుండా నేను ఈపని చేస్తాను
అన్నాడు.
మీరు ఒకమాట
బాగాగుర్తుపెట్టుకోండి, తండ్రి అంటేనే మర్యాద లేనివాడు, ఎక్కడో ముత్తాతల మీద
గౌరవంతో అలా చేస్తాడా! వాడుచేసేది ఏమీ ఉండదు, ఇప్పుడు రాజ్యానికి వచ్చినవాడు
హాయిగా రాజ్య సుఖాలను అనుభవించాలా! వాళ్ళ ఖర్మండీ, అప్పుడు వాళ్ళు అక్కరలేని
పన్లన్నీ చేశారూ పోన్లేండీ ఆ ఊసెందుకు ఎత్తాలి ఇప్పుడు పరిపాలన చేసుకుందాం
మనమిప్పుడు ధర్మంగా... అనచ్చు. త్యాగమంటే ఇది ʻతన కొరకు తాను బ్రతకడం కాదు,ʼ తను ఎందులో పుట్టాడో ఆవంశంలోని వాళ్ళను
ఉద్దరించడం గొప్ప అనుకున్నాడు, రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయాడు
రామా!, ఆ భగీరథుడు మీ వంశంలోవాడు చెప్తున్నాడు విశ్వామిత్రుడు, వింటున్నాడు రామ
చంద్ర మూర్తి. ఓహ్, తన వంశ కర్తలని ఉద్దరించడం కోసం రాజ్యాన్నే విడిచిపెట్టి
తపస్సు చేశారు మావాళ్ళు, ఇదే రామ చంద్ర
మూర్తిని భరతునికి రాజ్యం కావాలంటే తీసేసుకొమ్మను ఇటునుంచి అరణ్యాలకు వెళ్ళిపోతాను
అన్నాడు. మీకు శ్రీరామాయణంలో తరవాత రామ చంద్ర మూర్తి సత్య, ధర్మ నిష్టంతా
విశ్వామిత్ర, వశిష్ట మహర్షుల మాట్లాడిన మాటలలోంచి వచ్చినదే. ʻగురువు అంటే అది,ʼ గురు వాక్ అంటే అలా ఉంటుంది వినేవాడు ఉంటే,
కాబట్టీ ఇప్పుడు ఆయన గోకర్ణ క్షేత్రాన్ని చేరాడు.
|
ఆయన అక్కడికి
వెళ్ళి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తపస్సుచేశాడు, ఎటువంటి తపస్సట ఊర్ధ్వబాహుః
పఞ్చతపా మాసాహారో జితేన్ద్రియః ! తస్య వర్షసహస్రాణి ఘోరే తపసి తిష్ఠతః !! ఎవరో
చేసినటువంటి పొరపాటుకు వంశంలో ఈయన ఎంత కష్టపడుతున్నాడో చూడండీ! ఊర్ధ్వ బాహుః
రెండు చేతులు పైకెత్తాడు, పఞ్చతపా నాలుగు వైపులా గ్రీష్మ ఋతువులా
అగ్నిహోత్రాన్ని పెట్టుకుని కన్నులు మూయకుండా సూర్యునివంక అలాచూస్తూ ఉన్నాడు.
దీన్ని ʻపంచాగ్ని హోత్ర తపస్సుʼ అంటారు. పఞ్చతపా మాసాహారో నెలకు
ఒక్కరోజే అన్నం తిన్నాడు జితేన్ద్రియః ఇంద్రియములను గెలిచి నిలబడ్డాడు తస్య
వర్షసహస్రాణి వేయ్యేళ్ళు అలా తపస్సు చేశాడు ఘోరే తపసి తిష్టతః ఘోరమైన
తపస్సులో బ్రహ్మగారి గురించి అలానిలబడ్డాడు ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు
ప్రీతిచెందారు. అభ్బా! ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడురా! అని ఆయన దిగొచ్చారు భగీరథ
మహాభాగ! ప్రీతస్తేఽహం జనేశ్వర ! తపసా చ సుతప్తేన వరం వరయ సువ్రత !! నాయనా నీకేం కావాలి, నీ తపస్సు చేత
ప్రీతిచెందాను, నీకు ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. ఆయన అన్నాడు గఙ్గాయాస్సలిలక్లిన్నే
భస్మన్యేషాం మహాత్మనామ్ ! స్వర్గం గచ్ఛేయురత్యన్తం మే ప్రపితామహాః !! దేయా చ
సన్తతిర్దేవ! నావసీదేత్కులం చనః ! ఇక్ష్వాకూణాం కులే దేవ! ఏష మేస్తు వరఃపరః !! మా
ప్రపితామహులైనటువంటి వారు, పితృ, పితామహ, ప్రపితామహా ప్రపితామహాః అంటే
ముత్తాతలు దాహం కూడా తీరకుండా ప్రేతత్వం విడవడానికి వీలులేకుండగా పడివున్నారు,
కపిల మహర్షి యొక్క అగ్ని జ్వాలలకు భస్మరాశులై. వాళ్ళమీద నుంచి గంగ పయనించాలి,
అందుకని స్వర్గలోకం నుంచి గంగను విడిచి పెట్టండీ, ఇది నా మొదటి కోరిక, రెండుది ఏమి
ప్రారబ్దమో తెలియదు కానీ, మా ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడు సంతానం కొరకు ఇబ్బందులు
పడుతున్నారు, మా ఇక్ష్వాకు వంశం సంతానానికి ఇబ్బంది పడకుండా, మా వంశము ఎప్పుడూ
సంతోషంగా పుత్ర పౌత్రాభి వృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించ వలసింది.
అయితే చతుర్ముఖ
బ్రహ్మగారు చూసి అన్నారు తప్పకుండా, ఇందులో నేను ఒక వరం నీకు ఇచ్చేస్తున్నాను,
ఇక్ష్వాకు వంశంలో ఇక సంతానానికి ఇబ్బంది లేకుండగా తప్పకుండా వంశం కొనసాగుతుంది,
బిడ్డలు పుడుతారు. కానీ నాయనా! గంగ ఆకాశంలోంచి పాతాళానికి రావాలంటే ఆ కోరిక నేను
తీర్చలేను, ఎందుకో తెలుసా! గఙ్గాయాః పతనం రాజన్!
పృథివీ న సహిష్యతి
! తాం వై ధారయితుం వీర! నాన్యం పశ్యామి శూలినః !! గంగ ఆకాశంలోంచిగాని భూమి మీద పడిందా...! పాతాళ లోకాని
వెళ్ళాలంటే ముందు భూమి మీదపడాలి, భూమి మీదగాని పడిందా ఈ భూమి తట్టుకోలేదు
కదిలిపోతుంది భూమి కాబట్టి భూమి యొక్క స్వరూపం పాడవకూడదు కాబట్టి, గంగని
ఆకాశంలోంచి భూమి మీదపడు అని చెప్పడంకుదరదు. కానీ నేను నీకొక మార్గం చెప్తాను, అలాపడాలి
అంటే భూమి మీద నిలబడి గంగ పడుతున్నప్పుడు తల మీద పట్టి విడిచిపెట్టగలిగినవాడు ఒకడు ఉండాలి, అలా పట్టి
విడిచిపెట్టగలిగినవాడు ఒక్కడే ఉన్నాడు సమస్త బ్రహ్మాండములో వీర నాణ్యం
ఇంకెవ్వరూ లేరు పశ్యామి ఉన్నాడు చూస్తున్నాడు, ఎవడో తెలుసా శూలినః త్రిశూలం
పట్టుకున్న మహాదేవుడు, త్రయంబకుడు, సదాశివుడు, పరమేశ్వరుడు, పరమ శివుడు ఉన్నాడే
ఆయన పట్టుకుంటాడు. ఆయన కాని వచ్చి నిలబడ్డాడా....! గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది.
ఆయన తల మీదపడితే ఆయన తట్టుకోగలడు, భూమి కూడా తట్టుకోగలదు, ఆయన తల నుంచి కింద
పడుతుంది. అందుకని పరమశివుడువస్తే విడిచిపెట్టడం కుదురుతుంది. అంతకన్నా నేను ఏం
చెప్పను శ్వస్తి అని లేచిపోయాడు.
|
అంటే ఇప్పుడు ఏం
చేయాలి పరమ శివున్ని అడగాలి కదా! ఎక్కడవుతుందిలే మనవల్ల ఇప్పటికే వేయ్యేళ్ళు
కూర్చున్నాను ఊర్ధ్వబాహుః పఞ్చతపా మాసాహారో చితేన్ద్రియః ఇంత తపస్సు చేశాం.
మళ్ళీ ఇప్పుడు పరమ శివుని గురించి తపస్సుచేస్తే ఆయనేమంటాడో మళ్ళీ, ఎందుకొచ్చిన
ప్రారబ్దం వెళ్ళిపోదాం రా... రాజ్యానికి, ఏదో ఒకటి సాధించానుగా! అని
వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేదు “ఇది భగీరథ ప్రతిజ్ఞ” అంటారు. నేను సాధించి తీరుతాను,
పట్టుదల అంటే ఎలా ఉంటుందో రామా! చూడు. వెయ్యేళ్ళు తపస్సుచేసి మళ్ళీ శివుని గురించి
తపస్సుచేస్తున్నాడు మీ వంశంలోవాడే, చెప్తున్నాడు రామ చంద్ర మూర్తికి ఓహో...!
పట్టుదల అంటే ఇలా ఉండాలి అన్నమాట, మొక్కవోని సాహసంతో ఉండాలన్నమాట, రాముడు
నేర్చుకుంటున్నాడు, చెక్కుతున్నాడు విశ్వామిత్రుడు. మీరు రెండో కోణాన్ని కూడా
చూస్తూ ఉండాలి, కేవలం రామాయణ కథ కింద వినేసి వదిలేయకండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ
వెళ్ళి పరమ శివుడి గురించి తపస్సు మొదలు పెట్టాడు ఊర్ధ్వబాహుః నిరాలమ్బో వాయు
భక్షో నిరాశ్రయః ! అచలస్థానువర్తీ రాత్రిన్ దివరిందమా !! రాత్రి లేదూ పగలు
లేదూ రెండు చేతులు పైకి పెట్టీ, మాసాహారో బ్రహ్మగారి గురించి తపస్సు
చేసినప్పుడు నెలకు ఒకసారి తిన్నాడు, ఇప్పుడు అది కూడా లేదు వాయు భక్షో
కేవలం గాలి తింటుంన్నాడు నిరాశ్రయః ఏమి ఆశ్రయం కూడా లేదు అచలహాః కదలటం
లేదు స్థానువర్త్ బిగిసి పోయినటువంటి విగ్రహం ఎలా ఉంటుందో...? అలా
నిలబడ్డాడు అంతే...!
నిలబడి రెండు
చేతులు పైకెత్తీ తదేకంగా... పరమ శివుడి గురించి తపస్సు చేశాడు చేస్తే అలాంటి
తపస్సు ఒక సంవత్సరం కాలం పాటు చేశాడట చేస్తే పరమేశ్వరుడు ప్రీతి చెందాడు ప్రీతస్తేఽహం నరశ్రేష్ఠ! కరిష్యామి తవ
ప్రియమ్ ! శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహమ్ !! ఇది శంకరుడంటే తండ్రి తనం మహానుభావుడిది ఆయన
అన్నాడు నీకేం కావాలి అని అడగలేదు. నాయనా ప్రీతస్తేఽహం నరశ్రేష్ఠ! కరిష్యామి తవ
ప్రియమ్ నీకు ఏది ప్రియమైనదో అది
నేను చేస్తాను, నీ తపస్సుకు మెచ్చుకున్నాను శిరసా ధారయిష్యామి నెత్తిమీద
పట్టుకుంటాను, ఏమిటీ? శైలరాజసుతామహమ్ శైలరాజ పుత్రి గంగను పట్టుకుంటాను.
ఏమండీ పురాణం చెప్పండీ అంటే చెప్తారు, ఏమండీ కొంచెం ఊరేగింపుకు ముందు నడవండి అంటే
నడుస్తారు,
ఏమండీ మీరంటే మాకు ఎంతోసంతోషంగా ఉందీ ఒకసారి
కింద నిల్చోండి ఫస్ట్ ఫ్లోర్ నుండి నీళ్ళు పోస్తాం అంటే నిల్చుంటారా! పరమ శివుడు
అంటే అది. ఆయన అంత పితృ హృదయంతో ఉన్నవాడు మహానుభావుడు. కాబట్టి తప్పకుండా నేను
పట్టుకుంటాను అన్నాడు అడగకుండా శైలరాజసుతామహమ్ అని అన్నాడు సరే వెళ్ళాడు,
అసలు ఆ నిలబడినటువంటి భంగిమా ఆశ్చర్యంగా ఉంటుందండీ! ఆ భంగిమ ఉపాసన యోగ్యం. అద్భుతం
రెండు కాళ్ళు పక్కకి పెట్టీ, రెండు చేతులు ఇలా నడుం మీద వేసుకొని, ఇలా తల కొద్దిగా
పైకెత్తి ఇలా జటజూటాన్ని కాస్త విస్తరించీ, రా! పడు జటాజూటంలో అన్నట్లుగా ఇలా
నిలబడి ఉంటారు విజయవాడ కనక దుర్గమ్మ దేవాలంలో ఉంటుంది అటువంటి మూర్తి. ఇలా చూస్తూ
ఉంటాడు ఇలా ఆయన వెళ్ళి నిలబడ్డాడు వచ్చిపడు చూసిందట పైనుంచి గంగమ్మ చూసి
|
అచిన్తయచ్చ సా దేవీ గఙ్గా పరమదుర్ధరా ! విశామ్యహం హి పాతాలం స్రోతసా గృహ్య
శఙ్కరమ్ !!
తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు బగవాన్ హరః ! తిరోభావయితుం బుద్ధిం చక్రే
త్రినయనస్తదా !!
సా తస్మిన్ పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్ధవి ! హిమవత్ప్రతిమే రామ!
జటామణ్డలగహ్వరే !!
సా కథఞ్చిన్మహీం గన్తుం
నాశక్నోద్యత్నమాఽఽస్థితా ! నైవ నిర్గమనం లేభే జటామణ్డలమోహితా !!
ఆయన అలా నిలబడి పైకి చూస్తున్నాడూ గంగమ్మ
పైనుంచి చూసిందట, శంకరుడు నిల్చున్నాడు, శంకరుని తపస్సు చేసి నిల్చున్నాడు వెళ్ళు
అన్నారు, ఇప్పుడు ఆమె ఒక విచిత్రమైన నవ్వు నవ్విందట, నవ్వి అనుకుంది పిచ్చోడు!
ఏమిటో...? నన్ను పట్టుకుంటానని నిల్చున్నాడు? ఎదో బ్రహ్మగారు అన్నారని, వచ్చి
నిల్చుండిపోయారు ఏమిటో అనుకుంటున్నాడు? మొసళ్ళతో, ఎండ్రకాయలతో, తాబేళ్ళతో, పెద్ద
పెద్ద పాములతో ఆకాశం నుంచి నేను పెద్ద ధారగా వెళ్ళి ఆయన జటామణ్డలం మీదపడితే, తల
మీద పడితే...? తల దిమ్మెక్కి కిందపడిపోతాడు, పంపించేస్తాను పాతాళ లోకానికి,
ఎమిటో...? నన్ను పట్టగలిగిన మెనగాన్ని అనుకుని నిల్చుని చూస్తున్నాడు, ఇంకోటి
జటామణ్డలం విప్పాడు అనుకోంది. ఆయన అనుకొన్నాడట చూశాడట పరమేశ్వరుడు, హరకృద్ధః ఆయనకి
తెలియదాండీ ఎవరి మనసులో ఏముందో...? ఓహో నేను పట్టలేదనుకొంటూంది అనుకుని, ఒక్కసారి
తన జటజూటాన్ని పెంచి నిల్చున్నాడు. ఆవిడ సా కథఞ్చిన్మహీం గన్తుం నాశక్నోద్యత్నమాఽఽస్థితా ! నైవ నిర్గమనం లేభే
జటామణ్డలమోహితా !! కొన్ని సంవత్సరాల
పాటు ఆకాశంలోంచి పడిన గంగ శివుని యొక్క జటజూటంలోనే తిరుగుతూనే ఉంది, చుక్కనీరు
కింద పడలేదు.
అలా
కట్టేశాడంతే...! ఇప్పుడు అనుకుందట గంగ, గంగతో పాటు మొసళ్ళు, ఎండ్రకాయలు, తాబేళ్ళు,
చాపలు, పాములు, రాక్షసులు ఇన్నీ అందులో పట్టేస్తున్నాయి. దీన్నండీ స్తోత్రం చేశాడూ
రావణాసురుడు. నేను గంగా నది సైకతంలో కూర్చుని విశ్వనాథుడి వంక చూస్తే కజటాటవీ
గలజ్జల ప్రవాహపావిత స్థలే ! గలేవలంబ్య లంబితాం భజంగ తుంగ మాలికామ్ ! డ మడ్డ మడ్డ
మడ్డ మన్నినాద వడ్డ మర్వయం ! చకార చండ తాండ వంత నోతున శ్శివ శ్శివమ్ ! జటాకటా
హసంభ్ర మభ్ర
మన్ని లింపనిర్ ఝరీ
! విలోలలవీ చివల్లరీ విరాజమాన మూర్ధవి ! దఘద్ద గద్ధ గజ్జ్వలల్ల లాటపట్ట పావకే !
కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ ! అఖర్వ సర్వమంగళాక ళాక దంబ మంజరీ !
రసప్రవాహమాధురీ విజ్రుంభణా మధువ్రతమ్ ! స్మరాంతకం పురాంత కంభ వాంతకం మఖాంతకం !
గజాంత కాంధ కాంత కంత మంత కాంతకం భజే ! అంటూ, అందులో చెప్తాడు పరమశివుడు తాండం చేస్తుంటే...? ఆ జటాజూటం ఇలా తిరుగుతూ ఉంటే, ఆ గంగా నది కూడా
తిరుగుతూంటే, బిందెలో నీళ్ళు తిరుగుతున్నట్లుగా తిప్పేటటువంటి ఓ పరమ శివా! గంగతో
నిండినటువంటి ఆ జటజూటంతో ఉన్నటువంటి నీ శ్వరూపాన్ని, నేను ఈ గంగా నది సైకతంలో
కూర్చుని ఆలయశిఖరం వంక చూస్తే కదా నిలింప నిర్జరీ నికుంజ కోటరే వస ! న్వివిక్త
దుర్మతి స్సదా శిరః స్థ మంజలిం వహ ! అంటాడు.
|
|
నేను ఇక్కడ ఈ సైకతంలోంచి చూస్తూ ఉంటే...? నాకు
సాకార రూపుడవై ఎప్పుడు కనపడుతావో విశ్వనాధా అన్నాడు. అటువంటి గంగనిపట్టి తాండవం
చేసేటటువంటి పరమ శివుని రూపం యొక్క గొప్పతనం ఏమిటో చూసింది గంగా. పడుతూనేవుంది
సంవత్సరాల పాటు, దేవతలందరూ వచ్చి, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు
అంతఃపురం లాంటి విమానాలతో వచ్చి ఆకాశమంతా నిండిపోయారట, ఏమాశ్చర్యం, అక్కడ భగీరథుడు
ఇక్కడ పరమ శివుడూ పడుతున్న గంగా చుక్క నీరు కింద పడటం లేదు. అలా పట్టేశాడు
మహానుభావుడు! ʻఅహంకరించింది గంగాʼ అని చూశాడట, చూశాడు చూశాడు చూశాడు భగీరథుడు
మళ్ళీ తపస్సు చేశాడు. ఇంక మనమేం చేస్తాములే అని భగీరథుడు వెళ్ళిపోలేదు, ఇది భగీరథ
ప్రయత్నం అంటారు. మళ్ళీ తపస్సు చేశాడయ్యా! ఆవిడ అహంకరాము బాగుంది, మీ కోపమూ
బాగుంది, కట్టేశారు మా పితృ దేవతలు ఎప్పుడు తరిస్తారు “అయ్యా!, విడిచి పెట్టండి
గంగను” అన్నాడు. గంగమ్మ కూడా చిన్న బుచ్చుకుంది, ఏమో అనుకున్నాను శంకరుడంటే...?
మహానుభావుడు తెలియక, ఈయన జటామణ్డలంలో ఇలా ఉండిపోవలసిందే అని అనుకుందట అప్పుడు ఆయన
విడిచిపెట్టేశాడు గంగని జటజూటంలోంచి.
అంత నీరు ఎంత
నీరండీ ఆ ఓవర్ హెడ్ ట్యాంకు, ఎన్నేళ్ళనుంచి పడినటువంటి గంగను పట్టినటువంటి స్టోర్
నిల్వ ఉండే నీరు దాన్ని ఒక్కసారి విడిచిపెట్టాడట జటమణ్డలంలోంచి అన్నివైపులకు,
విడిచి పెడితే హ్లాదినీ పావనీ చైవ నలినీ చ తథాపరా తూర్పు దిక్కుగా హ్లాదినీ,
పావనీ, నలినీ అనేటటువంటి మూడు పాయలు కింద గంగ ప్రవహించి వెళ్ళిపోయింది. అదే గంగా సుచక్షుశ్చైవ
సీతా చ సిన్ధుశ్చైవ మహానదీ పశ్చిమ దిక్కుకి సుచక్షువు, సీతా, సింధువు, మహానది
అనేటటువంటి సింధు అనేటటువంటి పేర్లతో పశ్చిమ దిక్కుకు పడింది, పడి అటువైపుకు
ప్రవహించింది. ఏడవ పాయ భగీరథున్ని అనుసరించి పాతాళ లోకం వైపుకి ప్రయాణం చేస్తోంది.
అంటే ఆయనకి తెలుసు ఎక్కడున్నాయో సగర పుత్రుల యొక్క భస్మరాశులు
అందుకని ముందు భగీరథుడు
వెడుతున్నాడు వెనక గంగ ప్రవహించి వెళ్ళిపోతోంది, ముందు భగీరథుడు వెనక గంగా,
వెళిపోతూంటే... చూశారట అక్కన్నుంచి పడుతున్న గంగా, పరమశివుడి జటజూటం ఆయన ఒళ్ళంతా
తడిసి పోయి పడుతున్న గంగా, గంగా ప్రవాహం, ఆ గంగలో వెళ్ళిపోతున్నటువంటి మొసళ్ళు, పాములు,
ఎండ్రకాయలు, తాబేళ్ళు ముందు భగీరథుడు ఆయన వెనక వెళిపోతున్న గంగా, కొన్ని చోట్ల
కింద పడుచూ, కొన్ని చోట్ల పైకి లేస్తూ, కొన్ని చోట్ల తుంపర్లు కక్కుచూ, కొన్ని
చోట్ల గుద్దుకుంటూ, కొన్ని చోట్ల చప్పళ్ళు చేస్తూ, కొన్ని చోట్ల సుడులు తిరిగుతూ
అది వెళిపోతుంటే గగనాత్ శంకర శిరస్తతో ధరణిమాశ్రితా వ్యసర్పత జలం తత్ర తీవ్ర
శబ్ద పురస్కృతం బ్రహ్మాండమైనటువంటి చప్పుడు, ఘోస రంగ తుంగ తరంగ సంఘములతో
రంజిల్లు ఘోశంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాటలతో తుంపర్లతో భంగుల్ సల్పుతు
జంగలీ శంభోభాగమునుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అంటాడు
అలాంటి గంగావతరణం.
|
ఆ గంగమ్మని పట్టి విడిచి పెడుతుంటే చూశారట
అందరూనూ, మత్స్యకచ్ఛపసఙ్ఘైశ్చ శింశుమారగణైస్తదా ! పతద్భిః
పతితైశ్చాన్యైర్వ్యరోచత వసున్ధరా !! ఆ దేవతలు యక్ష, గంధర్వ, కిన్నెర,
కింపురుషాది సమస్థ జాతులూ ఆకాశంలో నిలబడిపోయారు, ఆ నిలబడిపోతే వాళ్ళ విమానాల
కాంతులుతో కలిసిపోయి పడుతున్నటువంటి గంగ కాంతులు హంసల గంపులు పడిపోతున్నట్లు
ఉన్నాయట, అందులో మెరిసి పోతున్నటువంటి చాపలు, మెరిసి పోతున్న మోసళ్ళు, మెరిసి
పోతున్న పాములు వీటి మెరుపులతో ఆకాశం నిండిపోయిందట, కిందపడిన గంగ వెళ్ళిపోతూంటే ఆ
ప్రవాహపు కాంతుల నురుగు, శబ్ధం కొన్నిచోట్ల వంకర్లు తిరుగుతోంది, పైకెక్కుతోంది,
కింద పడుతోంది, ముచ్చెత్తుతూ వెళ్ళిపోతుంటే చూశారట, ఏమి అదృష్టం రా! నిజంగానని గగనాత్
శంకర శిరస్తతో ధరణిమాశ్రితా అప్పుడు వీళ్ళందరూ చూసి సామాన్యమైనటువంటి
గంగావతరణమా అని తత్ర దేవర్షిగన్ధర్వా వసుధాతలవాసినః ! భవాఙ్గపతితం తోయం
పవిత్రమితి పస్పృశుః !! ఆ పాపాలు చేసి స్వర్గలోకం నుంచి కింద పడిపోయినటువంటి
వాళ్ళు పాపంతో ఉన్నటువంటి వాళ్ళందరు సాక్షాత్ పరమ శివుని యొక్క జటజూటాన్ని ఆయన
శరీరాన్ని తాకి కిందపడుతున్న గంగా అని, అంత వేగంతో పడుతున్నటువంటి గంగలో తల
పెట్టడం సాధ్యం కాదు కాబట్టీ, తల వ్రక్కలై పోతుంది.
కాబట్టి నీళ్ళు
ముట్టుకుని ఇలా చల్లుకుంటున్నారట, చల్లుకోగానే పాపరాశి అంతా దగ్ధమై మళ్ళీ వాళ్ళు
విమానాలెక్కి ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళిపోతున్నారట, ఊర్ధ్వ లోకాల్లో ఉన్న వాళ్ళు ఇది
చూసి అమ్మ బాబోయ్, ఇటువంటి గంగ మనకు దొరుకుతుందా, ఇటువంటి సన్నివేశం దొరుకుతుందా
వెళ్ళిస్నానం చేద్దామని విమానాలు దిగిపోతున్నాయి స్నానం చేస్తున్నారు, మళ్ళీ
విమానాలు పైకి వెళుతున్నాయి. ఏమి గంగావతరణం, ఏమి ప్రవాహం ముందు భగీరథుడు, వెనక
గంగా చూసి తీరాలని గంగా ప్రవాహానికి రెండు పక్కల ఒడ్ల నుంచి వేల రథాలు
వెళ్ళిపోతున్నాయి, ఇన్ని తరథాల సవ్వడి, ఇంత గంగా ప్రవాహం ముందు భగీరథుడు వెనక్కి
చూస్తూ, వచ్చేస్తున్న గంగని చూస్తూ సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నారు. ఇలా
వెళ్ళిపోతుండగా వెళ్ళిపోతుండగా మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి జహ్ను మహర్షి యజ్ఞ
కవాటంలో యజ్ఞం చేసుకుంటున్నాడు, అనుకోలేదు ఈ గంగా ప్రవాహం ఒక్కసారి వచ్చి ఆయన
చేస్తున్నటువంటి యజ్ఞ వాటాన్నంతటినీ, అంటే యజ్ఞ ప్రదేశాన్ని, యజ్ఞ ప్రదేశంలో
ఉన్నటువంటి ఆ కుటీరాల్నీ, అగ్నిగుండాల్నీ అన్నిటినీ ముంచెత్తి తనతో పాటు
తీసుకెళ్ళిపోతుందని తీసుకు పోయేటప్పటికి
|
తతో దేవాస్సగన్ధర్వా ఋషయశ్చ సువిస్మితాః
పూజయన్తి మహాత్మానం జహ్నుం
పురుషసత్తమమ్ ! గఙ్గాం చాఽపి నయన్తి స్మ దుహితృత్వే మహాత్మనః
ఆయన... గంగ ఇంత ప్రవాహంతో వచ్చి యజ్ఞ వాటాన్ని
ముంచెత్తడంతో ఒక్కసారి కోపంవచ్చి గంగ నంతటిని “ఆచమనం” చేసి లోపలికి తాగేశాడు.
ఇప్పటి వరకూ ఆకాశం వంక చూస్తున్నవాళ్ళు, గంగ వంక పరుగెత్తుకుంటూ వస్తున్నవాళ్ళూ
ఇలా చూసేటప్పటికి గంగలేదు ఎండిపోయింది మొత్తం భూమే. అయ్య బాబోయ్! ఏమిటి? జహ్ను
మహర్షి ఇలా తాగేశాడేమిటి? చప్పుడు ఆగిపోయింది, వెనక ప్రవాహం లేదు, భగీరతుడు వెనక తిరిగి చూసేసరికి ఏమీ లేదు మొత్తం భూమి హిమాలయాల వరకు ఏమైపోయింది
గంగా అని చూశారు, జహ్ను మహర్షి గంగను లోపలికి పుచ్చేసుకున్నాడు అన్నారు. అప్పుడు
దేవతలూ, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, భగీరథుడూ అందరూ వెళ్ళి
జహ్ము మహర్షి కాళ్ళ మీదపడ్డారు. మహానుభావా
ఎంత కష్టపడి తీసుకొచ్చానో తెలుసా? నా పితృ దేవతల కోసం, పాతాళానికి తీసుకెళ్తున్నాను
నీవు తాగేశావు, మహానుభావా నా మీద కారుణ్యముంచి విడిచిపెట్టవయ్యా? ప్రవాహానికి
లక్షణం కదా ముంచెత్తడం, నన్ను క్షమించి విడిచిపెట్టు అన్నాడు, తప్పకుండా విడిచి
పెట్టేస్తానని చెప్పి తన కుడి చెవిలోంచి గంగను విడిచి పెట్టాడట.
జహ్ను మహర్షి యొక్క
కుడి చెవులోంచి పుట్టింది కాబట్టి తస్మాజ్జహ్నుసుతా గఙ్గా ప్రోచ్యతే హాహ్నవీతిచ
! జగామ చ పునర్గఙ్గా భగీరథరథాఽనుగా !! అంతే ఇప్పుడు పరమ శివుడి తల నుంచి పడి ఇలా
వచ్చి ఆయన నోట్లోకి తాగబడి అయన కుడి చెవిలోంచి విడిచి పెట్టబడి మళ్ళీ భగీరథుని
వెంట వెళ్ళిపోతూంది, మళ్ళీ ఇంకో అద్భుతం చూడండి, చూడండి, ఆయన చెవిలోంచి ఎలా
వచ్చేస్తుందో...? ఆయన చెవిలోంచి పుట్టింది కాబట్టి ఆయనకు ʻజాహ్నవీʼ అని పిలుద్దాం అన్నారట. జాహ్నవీ, జాహ్నవీ అని అందరూ పూవ్వులు వేసి పూజ
చేశారు. ముందు భగీరథుడు సంతోషంగా వెళ్తున్నాడు, మళ్ళీ గంగా వెళ్ళిపోతూంది. మళ్ళీ
గంగా పరుగెత్తింది మళ్ళీ దేవతలు ఆశ్చర్యపోయారు? మళ్ళీ రథాలు, మళ్ళీ స్నానాలు,
రథాలు పైకి వెళ్తున్నాయి, మళ్ళీ పైకి వెళ్లేవాళ్ళు, కిందకి వెళ్లేవాళ్ళు గంగావతరణం
అంటే అదో పెద్ద హడావిడీతో కూడుకున్న విశేషమండీ!
ఆఖరికి అందరూ కలిసి
వెళ్ళారు, వెళ్ళి పాతాళలోకంలో పితృదేవతల యొక్క భస్మ రాశులు పడివున్నటువంటి ప్రదేశం
దగ్గరికెళ్ళి రథాన్ని పక్కకి పెట్టాడు. ఒక్కసారి ఈ గంగా నది వచ్చి బూది పైకి
రేగిపోయేటట్టుగా ఈ బూడిద కుప్పలన్నిటి మీద ప్రవహించింది భస్మన్యథాప్లుతే రామ
గఙ్గాయాస్సలిలేన వై ! సర్వలోకప్రభుర్బ్రహ్మా రాజానమిదమబ్రవీత్ !!
ఎప్పుడైతే ఈ బూడిద
కుప్పల నుంచి ఒక్కసారి గంగ ప్రవహించిందో వాళ్ళందరికి దాహం తీరిపోయి, వాళ్ళ
ప్రేతత్వం పోయి, వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు 60 వేల మంది. అప్పుడు
పరుగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం
ఎక్కివచ్చారు. నాయనా లోకంలో దుర్లభం ఎవ్వరూ
సాధించలేనటువంటిది అత్యద్భుతమైనటువంటి కర్మ చేశావు, గంగను స్వర్గలోకంలోంచి భూమికి
దింపి, పాతాళ లోకానికి తీసుకెళ్ళావు, నీ పితృ దేవతలు తరించారు, ఇది ఎవ్వరూ
సాధించలేని ప్రజ్ఞ. నీకష్టంతో నీ తపస్సుతో ఆకాశంలో ఉన్న గంగ భూమి మీదకు వచ్చింది
గనుక ఇక నుంచి గంగ నీ కుమార్తెగా పరిగణించబడుతుంది గంగని ʻభాగీరథీʼ అని పిలుస్తాం మేము అని గఙ్గా త్రిపథగా రాజన్ దివ్వా భాగీరథీతి చ ! త్రీన్
పథో భావయన్తీతి తతస్త్రిపథగా స్మృతా !! ఆకాశం నుంచి భూమి మీదపడి భూమి నుంచి
పాతాళ లోకానికి వెళ్ళింది గనుక గంగకి “త్రిపథగ” అని పేరు. గంగ భగీరథుని ప్రయత్నంతో
వచ్చింది కాబట్టి “భాగీరథీ” అని పేరు. జహ్నువి తాగి విడిచి పెట్టాడు కాబట్టి
“జాహ్నవి” అని పేరు. ఇన్ని పేర్లు మార్చుకుంటూ ఆఖరుకి ఇక్ష్వాకు వంశంలో ప్రవహించి
మహోత్సాహంతో ప్రవర్తించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి ఆ సగరులు 60 వేల
మందిని తరింపజేసింది.
|
|
అటువంటి గంగా ఈ భూ
లోకంలోకి వచ్చినటువంటి కథా వృత్తాంతం ఏదైతే ఉందో... ఏష తే రామ గఙ్గాయా
విస్తరోభిహితో మయా ! స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సంధ్యాకాలోతివర్తతే !! అని, నోరు
తెరుచుకు వింటున్నాడు రామ చంద్ర మూర్తి రామా! ఇది గంగావతరణం, విన్నావా! సంధ్యా
కాలం దాటిపోతోంది లే... సంధ్యావందనం చేద్దాం అన్నాడు. లేచాడు కానీ రామ చంద్ర
మూర్తి మనస్సంతా నిండిపోయింది. అబ్బా! ఏమి మా పితృ దేవత లూ ఏమి ప్రయత్నం ఏమి గంగావతరణం ఇంతటి కీర్తి సాధించిన మహాపురుషులు, ఇంతటి
స్థితిని పొందినవారు, ఇటువంటివారు నా పితృ దేవతలై ఉన్నారు నేను ఎంత గౌరవంగా
ప్రవర్తించాలి, వాళ్ళ కీర్తిని నేను ఎంత నిలబెట్టాలి, చిన్న పిల్లాడు ఆ వంశం
గురించివిని, నాకు ఎంత బాధ్యత ఉందో అనుకుంటున్నాడు, చెక్కాడు విశ్వామిత్రుడు.
ఇన్ని చెప్పాడు కదా... అని, విని విని అలసి పోయావని ఇంకా చెప్పలేదు. ʻసంధ్యా కాలం దాటి పోతూందిʼ నాయనా లే... విహిత కర్మాచరణం మాత్రం
విడిచిపెట్టడు, సంధ్యావందనానికి వెళ్ళవలసిందే పదా సంధ్యావందనం చేసుకొద్దాం కాలం
దాటిపోతోంది అన్నాడు.
ఇప్పుడు వాల్మీకి
మహర్షి అంటాడు, ఆయన ఎప్పుడూ ఫలశృతి చెప్పరాయన, ఆయన అన్నారూ
ధన్యం యశస్యమాయుష్యం పుత్ర్యం స్వర్గ్యమతీవ చ ! యశ్శ్రావయతి విష్రేషు
క్షత్రియేష్వితరేషు చ !!
ప్రీయన్తే పితరస్తస్య ప్రీయన్తే దైవతాని చ ! ఇదమ్ ఆఖ్యానమ్ అవ్యగ్రో గఙ్గా
అవతరణం శుభం !!
య శ్శృణోతి చ కాకుస్థ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ ! సర్వే పాపాః ప్రణశ్యన్తి
ఆయుః కీర్తి శ్చ వర్థతే !!
వాల్మీకి మహర్షి
ఇన్ని చెప్పాలి అంటే...? అది ఎంత పవిత్రమైన వ్యాఖ్యామై ఉంటుందో మీరు ఆలోచించండి.
రామా! ఎవరైతే ఈ గంగావతరణాన్ని ప్రశస్తమైన మనస్సుతో, నమ్మకంతో కూర్చుని నమస్కరించి
విని సంతోషిస్తున్నారో...! వాళ్ళకి ధన్యం ధన్యులు అవుతారు యశస్యం కీర్తిమంతులు
అవుతారు ఆయుష్యం వాళ్ళకి ఆయుర్ధాయం కలుగుతుంది పుత్ర్యం స్వర్గ్యమతీవ చ ఈ
శరీరం పడిపోయిన తరువాత స్వర్గలోకాన్ని పొందుతారు యశ్శ్రావయతి విప్రేషు
క్షత్రియేష్వితరేషు చ ఇది విన్నటువంటి సమస్త మనుష్యులు, ఎవరు విన్నారో
వాళ్ళందరూ, ఏఏ సంప్రదాయాలకి, ఏఏ కులములకు చెందిన వారైనా సరే... అందరూ కూడా ప్రీయన్తే
పితరస్తస్య గంగావతరణం కథ జీవితంలో విన్నరోజున వాళ్ళ పితృ దేవతలందరూ ఎంతో
సంతోషిస్తారు వాళ్ళు ఇవ్వాళ గంగావతరణం విన్నారు అని ప్రీయన్తే పితరస్తస్య
ప్రీయన్తే దైవతాని చ అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ సంతోషిస్తారు గంగావతరణం
చెప్పినా, గంగావతరణం విన్నా ఆ ప్రాంగణంలో ఉన్న దేవతలు మురిసిపోయేది ఎప్పుడంటే
గంగావతరణం చెప్పిన రోజున మురిసిపోతారట. కాబట్టి ప్రీయన్తే దైవతాని చ !
ఇదమాఖ్యానమవ్యగ్రో గఙ్గావతరణం శుభమ్ !! అటువంటి ఈ గంగావతరణం శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని
విశ్వామిత్రునిచేత వివరింపబడిన దానిని వినిధన్యులౌతారు యశ్శృణోతి చ కాకుత్స్థ
సర్వాన్ కామానవాప్ను యాత గంగావతరణ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి ఏవి అభున్యతి
కల్పిస్తాయో అటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి సర్వే పాపాః ప్రణశ్యన్తి చేసిన
పాపములు ఏవైనా ఉంటే...? గంగావతరణం వినడం చేత ఆ పాపాలు పోతాయి ఆయుః కీర్తిశ్చ
వర్థతే ఆయువు కీర్తి వర్ధిల్లుతాయి.
|
అక్కడ ఉన్నటువంటి
నగరం ఒకటి ఉంది, దాని పేరు విశాల. ఈ నగరమేమిటీ? ఇక్కడ ఎవరుంటారూ? అని అడిగాడు ఆయన,
అడిగితే మహర్షి దానిగురించి చెప్తున్నారు. చెప్తూ ఒకానొకప్పుడు దేవతలూ దానవులూ
కలిసి అంమృతం కోసం, అంమృతాన్ని ఉత్పాదించడం కోసమనీ చెప్పి క్షీరసాగర మధనం చేశారు,
ఆ క్షీర సాగర మధనం చేసినప్పుడు అంమృతం రాలేదు గాని... మొట్టమొదట హాలాహలము
వచ్చింది. ఆ హాలాహలం వస్తే అది ఏం చేసిందంటే... ఉత్పపాతాగ్నిసఙ్కాశం హాలాహలమహావిషమ్
! తేన దగ్ధం జగత్సర్వం సదేవాసురమానుషమ్ !! అది దేవతల్నీ, అసురుల్నీ అందర్నీ
కూడా ఇబ్బంది పెడుతూ అది వెళ్ళిన దారికూడా అది సముద్రాలు కూడా ఇంకి పోయేటట్లుగా ఈ
లోకాన్ని దగ్ధంచేస్తూ... ప్రయాణం చేసింది. అప్పుడు ఎలా తట్టుకోవాలో తెలియక
సమస్తమైనటువంటి వాళ్ళు దేవ దానవ యక్ష కిన్నెర కింపురుషాదులందరూ... కైలాస
పర్వతంచేరి పరమ శివున్ని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీమహా విష్ణువువచ్చి ఒక చమత్కారమైనటువంటి మాట ఒకటి అన్నారు ఆయన అన్నారు త్వదీయంహి
సురశ్రేష్ఠ సురాణామగ్రజోసి యత్ ! అగ్రపూజామిమాం మత్వా గృహాణేదం విషం ప్రభో !! ఆయన
అన్నారూ ʻపరమ శివా ఇది నీకు అగ్ర పూజʼ పుచ్చుకోండి అన్నారు. అగ్ర పూజా అంటే
అందరికన్నా గొప్పవాడు ఎవరున్నారో వారికి సభలో పూజ చేస్తారు, మొదటి తాంబూళం
ఇస్తారు, దానికి అగ్రపూజా అని పేరు. అందుకని నీవు దేవతలల్లో పెద్దవాడివి,
మహానుభావిడివి, భగవంతుడివి కాబట్టి అగ్ర పూజ నీకు. కాబట్టి మొదటి వచ్చింది కాబట్టి
నీవు ఈ విషం పుచ్చేసుకో అన్నాడు. నేనెలా పుచ్చేసుకోను అని అన్నవాడు భగవంతుడు ఎలా
అవుతాడు? ద్వంద్వాతీతుడు అయినందువలనే ఆయన పరమ శివుడు అయ్యాడు ఆయన. కాబట్టి ఆయనకు
హాలాహలం అంమృతం ఒకటే, మీగిలిన వాళ్ళకైతే అది హాలాహలం పరమ శివుడికి హాలాహం
ఏమిటదీ... ఆయన దేన్నైనా నిగ్రహించగలడు. అందుకని అగ్రపూజ అయింది అది మాహనుభావుడికి,
పరమ శివుడి యొక్క శక్తి ఏమిటో... చూపించారు విష్ణు భగవానుడు హాలాహలవిషం ఘోరం స
జగ్రాహామృతోపమమ్ ! దేవాన్విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరః !! ఎందుకురా భయపడతారు
దాన్నిచూసి, అని అంమృతం తాగేసినట్టుగా ఆ హాలాహలాన్ని తీసుకొని నోట్లో పారేసుకొని
మింగేశారాయన. అప్పుడు దేవతలందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ఒక్క
శ్లోకాన్నే రచనచేసి హాలాహల భక్షణ అని చెప్పారు కానీ, పోతనగారైతే భాగవతంలో
పొంగిపోయారు.
|
ఘనగంభీరరవంబుతో శివుడు లోకద్రోహి హుం పోకు ర
మ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ
ఫలం
బని సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్ !
కదలంబారవు పాపపేరులొడలన్ ఘర్మాంబు జాలంబు వు
ట్టదు నేద్రంబు లెఱ్ఱగావు నిజజూటాచంద్రుడున్
గందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో జాయుచో
పదిలుండై కడి సేయుచో, తిరుగుచో, భక్షించుచో, మ్రింగుచోన్
అందరూ భయపడిపోతుంటే
ఈయన ఎదురెళ్ళి హాలాహలం దగ్గరికెళ్ళి ఎక్కడికి పోతావ్ అని చెప్పి రా! అని చేత్తో
పట్టుకొని నలిపి ముద్దచేసి నోట్లో పెట్టుకొని పైగా పార్వతీదేవి వంకచూసి ఇది తింటే
నాకేమైన అయిపోతుందను కుంటున్నావా! శిక్షింతు హాలాహలమును భక్షింతును మధురసూక్ష్మ
ఫలరసము క్రియన్ రక్షింతు బ్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికదాబ్జముఖీ ! పార్వతీ
నీవేమీ బెంగపెట్టుకోకు ఇది నన్నేమైనా చేస్తుందనుకొంటున్నావా! కిస్మిస్ పండు
తినేసినట్లు తినేస్తా... చూడు ఈ హాలాహలాన్ని, ఆవిడ అందటా... నాకు భయమేమిటయ్యో! నీ
ఇష్టమోచ్చినట్లు చేయ్ అందట. ఆశ్చర్యపోయాడు విశ్వబ్రహ్మ అదేమిటండీ అలా అంటున్నారని,
ఆవిడ ఎలా అందండీ హాలహలము తినమని అని మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళ
మనియు మేలని ప్రజకున్ మ్రింగమనె సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో...!
అని అన్నారు. ఆ తల్లి మెడలో మంగళ సూత్రముంది కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత
కందరా ఆయన మాంగళ్యం కడుతూ మాంగళ్యం తంతునామో మమ జీవన హేతునాం కంఠే బద్నాయ
సుభగే త్వం జీవ శరదాం శతం అన్నాడు. నీవు నూరేళ్ళు అంటే అనంతంమైన కాలము ఈ మంగళ
సూత్రం నీ మెడలో కడుతున్నాను ఇది ఉన్నంత కాలం నేను ఉంటాను అన్నాడు. ఆవిడ మెడలో
మంగళ సూత్రం ఉండగా నీవు విషం తాగితే ఏమవుతుంది పుచ్చుకో అందట ఆవిడ.
సౌందర్యలహరిలో
శంకరాచార్యులవారు ఒక అడుగు ముందుకువేశారు, ఆయన అన్నారు సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషధః ! కరాళం యత్ క్ష్వేళం కబలితవతః కాలకలనా న
శంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా !! అన్నారు. అమ్మా! పరమ శివుడు హాలాహలం
తిన్నాడంటే పెద్ద గొప్పేముందంమ్మా ఇది నీ తాటంకముల మహిమా నీ ఐదోతనం గొప్పది, విషం
తిన్నా బతికాడమ్మా! అన్నాడట. కాబట్టి మహానుభావుడు నోట్లో పెట్టుకున్నాడట
మింగుదామని ఉదరము లోకంబులకును సదనంబగుటెరిగి శివుడు చటులవిషాగ్నిన్ గుదురుకొని
గంఠబిలమున బదిలంబుగ
నిలిపె సుక్ష్మఫలరసముక్రియన్ ! మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు దగ్ధమైపోతాయని కంఠములో
పెట్టుకొని ఊరుకున్నాడట.
ఇక్కడ పెట్టుకుంటే... ఈ కంఠ మంతా నీలంగా అయిపోయిందంట, పార్వతీ దేవి చాలా
సంతోషించిందట ఎందుకు ఆవిడకు సంతోషం, మా ఆయన ఇంత తెల్లగా ఉంటాడు “స్పటికమణి విభం”
ఇంత తెల్లగా ఉంటాడు ఏదైన చక్కటి నీల మణి హారం వేసుకుంటే ఆయనకు ఎంత బాగుంటుందో
గుండెల మీద అనుకునేదట, ఆయనేమో నాకెందుకని ఓ పాము వేసుకుంటాడు. మా ఆయన ఏదైనా
వేసుకుంటే బాగుండని ఎప్పటినుంచో అనుకుందట నీలమణి పతాకం వేసుకుంటే కంఠం మీద కాంతి
కొడితే ఎలా ఉంటుందో ఇప్పడు మా ఆయన కంఠం అలా ఉందని ఆవిడ మురిసిపోయిందట.
రుద్రాధ్యాయంలో వేదం రెండు చేతులెత్తి నమస్కారం చేసింది ఆ స్వరూపానికి అసౌ యో
వసర్పతి నీల గ్రీవోవిలో హితః ! ఉతైనం గోపా అ దృశన్-నదృశన్- నుదహార్యః ! అభిషేకంలో
రోజూ అంటాం కదాండీ...! ఆ నీల లోహిత స్వరూపాన్ని మహర్షులు కాదు, ఏమీ తెలియనటువంటి
గోప కాంతలు తలల మీద నీళ్ళు పెట్టుకుని వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఆకాశంలో
సూర్యోదయంలో నిలలోహిత రుద్రుడు కనపడుతాడని వేదం నమస్కార చేసింది. అంతటి
మహానుభావుడయ్యా పరమ శివుడు హాలాహల భక్షణం చేశాడు అన్నారు. లోకాన్ని రక్షించడానికి
ఎంతెంత కష్టాలుపడ్డారో అంమృతంలా ఎలా స్వీకరించారో బాధపడుతూ పుచ్చుకోలేదు, అంమృతంలా
పుచ్చుకున్నారు లోకంకోసం ఆ జాతికి వారసుడు రామా! నీవు.
|
|
ఏమి చెక్కుతున్నాడండీ విశ్వామిత్రుడు ఒక్కొక్క
కథతో...? అప్పుడూ మళ్ళీ క్షీరసాగర మధనం చేశారు. ఆదికూర్మం సముద్రలోకి జారిపోతోంది,
విష్ణువుని ప్రార్థన చేశారు, మందర పర్వతం జారి పోతోంది, ఆయన ఆదికూర్మమై దానికింద
పడుకున్నాడు, పడుకుంటే ఈ పర్వతం ఆయన విపు మీద తిరుగుతోంది, తిరుగుతూంటే వీపు
రక్కుక పోదాండీ! అంటే మహర్షి అన్నారూ, చంటి బిడ్డని తన పక్కన పడుకోబెట్టుకుని వీపు
మీద చెయ్యివేసి ఇలా నిమురుతుంటే ఆ పిల్లాడు, అమ్మ అలా నిమురుతుంటే పిల్లాడు ఎంతో
సంతోషాన్ని పొందినంతగా తన పిల్లలైనటువంటి దేవ దానవులు అంమృతం కోసమని మందర
పర్వతాన్ని తిప్పుతుంటే అది జారి పడిపోకుండా నేను ఆదికూర్మంగా కింద ఉండి నేను
రక్షింపగలుగుతున్నాన్న తృప్తితో, తల్లి వీపు నిమురుతున్న పిల్లాడిలా
పడుకున్నాడయ్యా విష్ణువు, అది కష్టము అనుకోలేదూ అన్నారు. అంటే భరించడంలో ఎంత అమృత
హృదయంతో భరించాలో ఆ కష్టాన్ని చూపిస్తారు మహర్షి, నాయనా అలా జరిగినటువంటి హాలాహల
భక్షణం, అమృత ఉత్పాదనం ఆ తరువాత మోహినీ స్వరూపం, ఆ మోహినీ స్వరూపం రావడం ఆ తరువాత
ఇక్కడ ఈ విశాలా నగరము అనేటటువంటిది నిర్మింపబడింది ఇప్పుడు మనం ఆ విశాలా నగరంలో
ఉన్నాం అని చెప్పిన తరువాత మనం మిథిలానగరానికి కదా వెళ్ళాలి, కాబట్టి వెళదామని
చెప్పి వాళ్ళు మిథిలా నగరం దగ్గరి దాకా వెడుతున్నారు.
వెళ్తూ, వెళ్తూ
మధ్యలో ఇంకొక విషయాన్ని చెప్పారాయన ఇక్కడే అంమృతాన్ని దేవతలకే విష్ణవు
పంచిపెట్టారు మోహినీ వేషంతో అన్న కోపంతో రాక్షసుల తల్లియైనటువంటి దితి, భర్తయైన కష్యప
ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇంద్రున్ని చంపేసే కొడుకు కావాలని అడిగింది. అయన అన్నారు
ఆవిడ ఒళ్ళంతా నిమిరారు, వేయ్యేళ్ళు వ్రతం పాటించి గర్భంతో ఉన్నటువంటి కొడుకు
పుడతాడు అన్నాడు ఉంటానని ఉంది. చిత్రమేమిటో తెలుసాండీ! ఇంద్రుడు శుశ్రూష చేయడానికి
వచ్చాడు, ధర్మము ధర్మమే, వచ్చినవాడు శుశ్రూష చేయడానికి వచ్చాడు, కాబట్టి చంపేవాడు
తన కడుపులో ఉన్నాడు, చంపబడేవాడు శుశ్రూష చేస్తున్నాడు, అవిడ ఒప్పుకుంది. ధర్మము
ధర్మమే! ఇది గదాండీ విభీషణుడు ఒప్పుకునేటట్టు చేసింది. ధర్మం అంతే! కాబట్టి
ఇప్పుడు ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు, 999 సంవత్సరాలు అయిపోయాయి, ఆవిడ
ఇంద్రున్ని పిలిచి అంది నాన్నా ఇంకో పదేళ్ళు నీకో తమ్ముడు పుడతాడు అంది, ఎందుకు
పుడతాడో ఇంద్రునికి తెలుసు ఆయన అన్నాడు సంతోషమమ్మా అన్నాడు. ఆవిడ ఒక రోజున ఏం
చేసిందంటే పొరపాటు చేసింది, తల ఒక వైపు కాళ్ళెప్పుడు ఒక వైపు పెట్టి కదా పడుకుంటాం.
కాళ్ళు పెట్టుకునే వైపుకి తల పెట్టిపడుకుంది, వ్రతం అపవిత్రమైపోయింది, అలా
పడుకోకూడదు, అది దీక్ష భంగపాటు అయిపోతుంది, వెంటనే ఆవిడ శరీరం ఎప్పుడైతే...
అపవిత్రమైయిందో... ఇంద్రుడు లోపలికి వెళ్ళిపోయాడు.
|
మా రుదో మా రుదశ్చేతి గర్భం శక్రోభ్యభాషత ! బిభేద చ మహాతేజా రుదన్తమపి వాసవః
!!
న హన్తవ్యో హన్తవ్య ఇత్యేవం దితిరబ్రవీత్ ! నిష్పపాత
తతశ్శక్రో మారుర్వచనగౌరవాత్ !!
ఇంద్రుడు ఆమె శరీరంలో వెళ్ళిపోయి తన వజ్రాయుధం
పెట్టి లోపల ఉన్న పిండాన్ని ఏడు ముక్కలు కింద నరికేశాడు. నరికేస్తే ఆ పిండం
ఏడ్చింది మా రుదో మారుదశ్చేతి చంపకూ చంపకూ అంది అప్పుడు ఆమెకు
తెలివొచ్చింది, అయ్యో పిల్లాల్ని చంపేస్తున్నావా బయటికి రా అంది. ఆయన బయటికి
వచ్చాడు ఇంద్రుడు, అమ్మా నమస్కారం ఏమీ అనుకోకు, నీవు అపవిత్రంగా ప్రవర్తించావు,
లోపలున్న పిల్లలని ఏడు ముక్కలు చేశానమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడందీ నాదే తప్పు,
నేను మీతో మనవి చేశాను, నా తప్పు అనడం చాలా కష్టం, ధూర్తుడా 999 సంవత్సరాలు
చేశాను, దీనికోసం కాచుకు కూర్చుని చంపావా అనలేదు. నాయనా తప్పు నాదే...! వ్రతంలో
నియమం తప్పానూ నీవు చంపగలిగావు. నిన్ను రంక్షించుకోవడానికి నీవు ప్రయత్నించావు,
నిన్ను చంపేవాన్ని కనాలని నేను అనుకున్నాను, దైవం ఇంకోలా ఉంది. నేను అనుష్టించ
లేకపోయాను, పాడయ్యాను. పోనిలే ఈ ఏడుగురు పిల్లలకీ “సప్త మరుత్తులు”గా అంటే? 7
స్కందములలో దేవతలుగా ఉంటారు. మరుత్తులుగా అధికారం ఇవ్వండి, అమ్మా తప్పకుండా నమ్మా!
నీ మాటను ఎందుకు కాదనంటాను, అలాగే ఇస్తాను అప్పుడు వాళ్ళకి మరుత్తులుగా ఇచ్చాడు.
అలా ఆ మరుత్తులుగా ఏర్పడ్డారయ్యా లోకంలో అని, ఆ విశాలా నగరం గురించి చేప్తూ,
మరుత్తులు వచ్చినటువంటి వృతాంతాన్ని విశ్లేషించి మిథిలా నగరానికి దగ్గరిగా
వెడుతూంటే... ఒక శూన్యమైన ఆశ్రమం కనపడింది.
ఏమిటి ఈ ఆశ్రమం ఇంత
శూన్యంగా ఉంది? ఇక్కడ ఎవ్వరూ కనపడటలేదు, అని రాముడు ప్రశ్న అడిగాడు. రాముడు ప్రశ్న
అడిగితే ఎలా ఉంటుందో తెలుసాండీ? గురువు గారు చెప్పకుండా ఉండలేరు మిథిలోపవనే
తత్ర శూన్యమాశ్రమం దృశ్య రాఘవః ! పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ మునిపుఙ్గవమ్ !! ఇంత
నిర్జనంగా ఉంది ఆశ్రమం, ఇంత రమ్యంగా ఉంది! ఎందుకిలా ఉంది అని అడిగాడు? అడిగితే
విశ్వామిత్రుడు అన్నాడు గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసన్మహాత్మనః ! ఆశ్రమో
దివ్యసఙ్కాశస్సురైరపి సుపూజితః !! ఒకానొకప్పుడు ఈ ఆశ్రమంలో గౌతమ మహర్షి ఉండేవాడు, అక్కడికి
దేవతలు కూడావచ్చి గౌతమున్ని పూచింజి వెళ్ళేవాళ్ళు అంతటి మహాత్ముడు. అటువంటి గౌతమ
మహర్షి ఈ ఆశ్రమంలో ఉన్నకాలంలో... ఆయనతో పాటు ఆయన భార్యయైన అహల్య కూడా ఈ ఆశ్రమంలోనే
ఉంది. ఈ ఆశ్రమంలో ఉన్న కాలంలో “మీరు తొందరపడి నిర్ణయాలకి రాకండీ! నేను
విశ్లేషిస్తాను విషయాన్ని, తొందరపడి నిర్ణయానికి వచ్చేసి మహాత్ములపట్ల భిన్నాభి
ప్రాయంతో ఆలోచన చేయకండీ!” సఙ్గమం త్వహమిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే ! మునివేషం
సహస్రాక్షం విజ్ఞాయ రఘునన్దన !! మతిం చకార దుర్మేధా దేవరాజకుతూహలాత్ ! ఒకానొక
రోజున దేవేంద్రుడు గౌతముని వేశంలో అహల్య ఆశ్రమానికి వచ్చాడు, గౌతముడు స్నానం చేయడానికి వెళ్ళాడు, ఇంద్రుడు
గౌతముని వేశంలో వచ్చి, నాకు కామతురత కలిగింది నీతో సంగమాన్ని కోరుతున్నాను
అన్నాడు. ఆవిడ మహా పతివ్రత ఆవిడకి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడు గౌతముడుకాదు అని
తెలుసుకుంది, తెలుసుకొని కూడా... విజ్ఞాయ రఘునన్దన తెలుసుకొని మతిం చకార
దుర్మేధా దేవరాజకుతూహలాత్ ఆవిడకి ఇంద్రుడి మీద మనసుంది అందుకని ఆవిడ
ఇంద్రుడితో సంభోగాన్ని అంగీకరించింది. ఇద్దరూ సంతోషంగా కాలాన్ని గడిపేశారు కృతార్థోఽస్మి సురశ్రేష్ఠ గచ్ఛ
శీఘ్రమితః ప్రభో ! ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్ష గౌతమాత్ !! అంత స్పష్టంగానూ ఆవిడి చెప్పింది కృతార్థాస్మి
సురశ్రేష్ఠ సురశ్రేష్ఠ ఓ ఇంద్రుడా...! గుర్తు పట్లేదు అనడానికి ఏమీ లేదు,
ఇంద్రుడా నేను కృతార్థురాలిని అయ్యాను, ఇవ్వాళ నేను ఈ సంఘమ సుఖాన్ని అనుభవించాను,
నీవు తొందరగా వెళ్ళిపో ఇక్కడ నుంచి గచ్ఛ శ్రీఘమితః ప్రభో తోందరగా
వెళ్ళిపో... ఎందుకో తెలుసా? ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్ష మానదా నా భర్త
వచ్చి, నీవు వచ్చావనీ, మనం తప్పు చేశావనీ, తెలుసుకోక ముందే వెళ్ళిపో... అంది.
ఇంద్రుడు అన్నాడూ... అటువంటి తప్పు చేసినవాడు ఎలా సంభోధిస్తాడో, ఎలా ఉచ్ఛరిస్తాడో
అలా సంభోదించాడు దాన్నివివరించడం నాకు ఇష్టం లేదు సుశ్రోణి పరితుష్టోస్మి
గమిష్యామి యథాగతమ్ నేను ఎలా వచ్చానో ఆలా నేను కూడా సంతోషాన్ని పొందాను అలానే
వెళ్ళిపోతున్ను అని పర్ణశాలలోంచి బయటికి బయలుదేరాడు. అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా
తడిసిన బట్టతోటి గౌతమ మహర్షి వచ్చాడు, ఆయన ఒక్కసారి ఇంద్రుడి వంక ఆహల్య వంక చూశాడు
గుర్తు పట్టారు జరిగిన తప్పుని, ఆయన వెంటనే అన్నాడు నీకు పురుషత్వం ఉంది కాబట్టి
ఇటువంటి తప్పుపని చేయగలిగావు, నీకీ పురుషత్వం ఉంది కాబట్టి నీవు ఇవ్వాళ ఈ తప్పు చేశావు, రేపు ఎన్ని
సార్లైనా చేస్తావు ఇటువంటి తప్పులు, కాబట్టి నీవు పురుషుడవు కాకుండా తేషేషు
పురుషుడుగా కనపడితే... లోకంలో నవ్వుల పాలవుతావు? నీకి అదే శాపం పేతతుర్వృషణై
భూమౌ సహస్రాక్షస్య తత్క్షణాత్ నీ వృషణములురాలి నేల పడిపోవుగాక! ఇంద్రుడు తన పుఃస్తవాన్ని
పోగొట్టుకున్నాడు, అహల్య వంక చూశాడు.
తథాశప్త్వా స వై శక్రమహల్యామపి శప్తవాన్ ! ఇహ వర్షసహస్రాణి బహూని త్వం
నివత్స్యసి !!
వాయుభక్షా నిరాఽఽహారా తప్యన్తీ భస్మశాయినీ ! అదృశ్యా సర్వభూతానాం
ఆశ్రమేఽస్మిన్నివత్స్యసి !!
యదా చైతద్వనం ఘోరం రామో దశరథాఽఽత్మజః ! ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యసి
!!
తస్యాతిథ్యేన దుర్వుత్తే
లోభమోహవివర్జితా ! మత్సకాశే ముదా యుక్తా స్వం వపుర్ధారయిష్యసి !!
|
|
నేను మీతో ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా
వివరణచేయవలసి ఉంటుంది ఈసర్గ చెప్పేటప్పుడు, అహల్య జననం చాలా ఆశ్చర్యకరమైనది అందుకే
ఆయన హాలాహల భక్షం చెప్పి ఇది చెప్పారు. మోహినీ అవతారాన్ని విష్ణుమూర్తి
స్వీకరించీ, అంమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు ఇచ్చాడు. ఆ మోహిని
అందచందాలని చూసి లోకాలన్ని ఆశ్చర్యపోయాయి, ఆశ్చర్యపోయి ఏమి అందగత్తే, ఏమి అందగత్తే
అని, అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చింది. విష్ణువు మోహినిగా మారారు
తప్పా, అంత అంద గత్తెను నేను ఇప్పటిదాగా సృష్టించలేదు, సృష్టిలో ఇదో లోపం.
విష్ణువు అయ్యాడు అంత అందగత్తెగా, నేను అటువంటి అందగత్తెను సృష్టించలేదు, నేను
ఎందుకు సృష్టించలేను అంత అందగత్తెను సృష్టిస్తాను అని సృష్టించారు అహల్యని, ఆవిడ
బ్రహ్మమానస పుత్రిక ఆవిడ పుట్టడమే అందంకోసం పుట్టింది, అంత అందంగా పుట్టింది.
ఆయనేం చేశాడంటే... జితేంద్రియుడైనటువంటి వాడిసంరక్షణలో ఈ పిల్లనిపెట్టి
పెంచుదామని, పిల్లని గౌతమ మహర్షికి ఇచ్చారు ఈ పిల్లని పెంచవయ్యా అన్నాడు, ఆ
పిల్లని గౌతముడే ఆశ్రమంలో పెంచాడు. ఇప్పుడు ఆ పిల్ల పెద్దదైంది యవ్వనవతి అయింది.
గొప్ప అంద గత్తె, ఇంద్రుడితోసహా అందరి కన్నూ అమె మీదే ఉంది, ఆమెకు కూడా కన్ను ఇంద్రుడి
మీద ఉంది.
పిల్లమనసు తండ్రి గుర్తెరగలేదు, బ్రహ్మగారికి
ఏమి ఇష్టం అంటే తపస్సు ఇష్టం. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి గౌతముడు ఏం చేశారంటే...
పిల్లని తీసుకెళ్ళి విడిచిపెట్టేశాడు, అయ్యా! ఈ పిల్లకి వయసువచ్చింది యోగ్యుడైన
వరున్నిచూసి వివాహం చేయండి అని అన్నాడు. ఆయన అన్నాడు, నీ కన్నా యోగ్యుడు ఎవరు?
నీవే చేసుకో అన్నాడు ఇంద్రాది దేవతలు పెళ్ళికి వచ్చారు, పెళ్ళి అయిపోయింది గౌతమ
మహర్షి ఈమెను తీసుకెళ్ళిపోయారు. పిల్లమనసులో మాట తెలుసుకోలేక పోవడం తండ్రి
చేసినటువంటి చిన్న లోపం, ఇప్పుడు పెళ్ళైపోయింది, పెళ్ళి అయిపోయినా కూడా ఇంద్రుడి
మీద మనసు అహల్యకు ఉండిపోయింది. గౌతముడు ఉన్నతి పొందకుండా ఆయన తపస్సు కోపంచేత
మాత్రమే భంగంచెయ్యాలి కాబట్టి అహల్య తన మీద అనురక్తి ఉంది కాబట్టీ, అహల్యని
ఇబ్బంది పెట్టీ, తద్వారా గౌతముడు శాపవాక్కు విడిచిపెట్టి తపస్సు
పోగొట్టుకునేదానికి ఇంద్రుడు వచ్చాడు ఇప్పుడు ఇంద్రుడు అహల్యా చెయ్యకూడని
తప్పుచేసేశారు.
ఒక భార్యను
విడిచిపెట్టేయడానికి పురుషుడికి ఇంతకన్నా బలమైనటువంటి ఆధారం అక్కరలేదు మీరు
బాగాగమనించండి. వదిలి పెట్టేశాడా గౌతముడు నేను నిన్ను వదిలిపెట్టేస్తున్నానన్న మాట
అన్నాడా...? కోపమేమైనా పడ్డాడా? లేదు ఏమన్నాడో తెలుసాండీ...! ఇహ వర్షసహస్రాణి
బహూని త్వం నివత్స్యసి ఇక్కడే ఉండు వాయుభక్షా గాలితిను, నిరాహారా అన్నం
తినొద్దన్నాడు ఎందుకనీ, నీవు తిన్న అన్నం నీ మనసు వెరొకరి మీద లగ్నమై ఉండగా తినగా
6వ వంతు నీ మనసుగా మారుతూ, నీ మనసులో రజోగుణ, తమోగుణ ప్రభావాలను పెంచి పెద్దచేసింది.
అన్నం తినేటప్పుడు ఏవిపడితే అవిచూస్తూ అన్నం తినకూడదు. పిల్లల్నీ కూడా టీవీ
సీరియల్స దగ్గర కూర్చోబెట్టి పాలిస్తే...? పిల్లల్ని కూడా టీవీ సిరియల్స దగ్గర
కూర్చోబెట్టుకొని అన్నం పెడితే...? ఆ పాత్రలకున్న వ్యగ్రత పిల్లలకీ వస్తుంది. వాడు
ఉగ్రవాది అవుతాడు పనికొచ్చేవాడు అవడు, కాబట్టి వాయుభక్షా నిరాహారా అన్నం
తినకు తప్యన్తీ తపస్సు చేయ్యి, ఇక్కడే చేయ్యి భస్మశాయినీ భస్మం
కప్పేస్తుంది నిన్ను బూది కప్పేస్తుంది అలా ఉండిపో, నీవు చేసిన పాపం, కడగబడుతుంది
నీవు చేసిన పాపం తపస్సుకి, నీ తపస్సుచేత నీ పాపం కడగబడిందనిగుర్తు... పరంధాముడు ఈ
లోకంలో నరుడిగావచ్చి నీ ఆశ్రమానికివస్తాడు ఇక్కడికి, నీవు పైకిలేస్తావు, లేచిన
తరువాత అప్పుడు నీకు ఇక పాపంలేదు. నేను వచ్చి నిన్ను ఏలుకొని తీసుకు వెళ్తాను.
మళ్ళీ మనిద్దరం చక్కగా ఆశ్రమవాసం చేద్దాం. అప్పుడు నిన్ను వేలుపెట్టి చూపించగలిగిన
ధైర్యం ఎవ్వరికీ ఉండదు, నీ పాపం కడగబడి నీవు అగ్నిశిఖగా నిలబడుతావు.
|
నా కూతురు వివాహ
చేస్తుంటే... ఆ మంత్ర భాగాన్ని చూసి అర్థం చేసుకొని పొంగి పోవడానికి ఫ్రెంచ్
దేశస్తులు ఇద్దరు దంపతులు ప్రత్యేకంగా అనుమతి తీసుకొనివచ్చి వీడియో తీసుకున్నారు ఆ
మంత్ర భాగమంతాను. హరిప్రసాదుగారు ఉన్నారు. వాళ్ళు బొట్టు పెట్టుకొని వచ్చిన నన్ను
ప్రార్థించారు, మేము మురిసి పోతున్నాం ఈ సంస్కృతి చూసి, మేము అక్షంతలు వేసి
ఆశీర్వదించమా! మీ అల్లున్ని, అమ్మాయినీ అన్నారు అది ఈ జాతి సంస్కారం అంటే...?
దానికి మనం వారసులం.
మీరు...
ఉద్దరించుకొన్న గౌతముడి గొప్ప తనం చూడండీ, పాపం కడుక్కున్న అహల్య గొప్పతనం చూడండీ,
అంతే కానీ, అహల్య తప్పుచేసిందని తీర్పుచెప్పకండి ఇప్పుడు అహల్యా అగ్నిశిఖ
లేచినట్లులేచింది. చూశాడు మహానుభావుడు, ఆవిడని 33 కోట్ల దేవతలు కూడా చూడలేరు అంత
తేజో మూర్తిగా ఉంది ఇప్పుడు రామ చంద్ర మూర్తి ఆవిడకు నమస్కరించారు. ఈలోగ ఇంద్రుడు
అగ్ని దేవున్ని ప్రార్థన చేశాడు అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవతాః సమాగతాః
ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేసయన్ పితృ దేవతలకీ మేక మాంసం పెట్టడం
అన్నది ఆయుగంలో అలవాటు, ఇప్పుడు గారె
తప్ప ఇప్పుడు కూడా మేకల
మాంసాలు పెడతాము అనకూడదు తద్దినం పెట్టేటప్పుడు. కాబట్టి ఆరోజుల్లో మేక మాంసం
పెట్టేవారు, పితృ దేవతలు మేక వృషణంను తీసుకొంటారు కాబట్టి వాళ్ళేమన్నారంటే,
ఇంద్రుడు పుంస్తవం పోయింది కాబట్టి గౌతమ మహర్షి శాపంవల్ల మేక వృషణములను తీసి
ఇంద్రునికి అమర్చారు. ఇప్పుడు పితృ దేవతలకి తద్దినం పెడితే త్రేతాయుగంలో వృషణములు
లేని మేక మాంసం వండి పెట్టేవారు తప్పా వృషణములను పచనంచేసి పెట్టేవారు కాదు. ఇలా
ఇంద్రుడు మళ్ళీ పుంస్తావాన్ని పొందాడు, అహల్యా మళ్ళీ గౌతముని పక్కన స్థానాన్ని
పొందిందీ... దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతితప్రభామ్ ! లోకైరపి సమాగమ్య
దుర్మిరీక్ష్యాం సురాఽసురైః !! ప్రయత్నాన్నిర్మితాం ధాత్రా దివ్యాం
మాయామయీమివ !! ప్రయత్న పూర్వకంగా...
చతుర్ముఖ బ్రహ్మగారు నిర్మించినటువంటి మాయా మానుస స్వరూపంలా... దేవతలు కూడా
చూడ్డానికి వీలు లేకుండా కాంతితో... ఆమె తన తపస్సులోంచి లేచినిలబడిందట.
|
ఆవిడ తపస్సులోంచి
బైటికి వచ్చినటువంటి స్థితీ... ఆవిడి ఆయన కాలు తగిలి మళ్ళీ నాతి అయిందీ అని
చెప్తూంటారు, తెలుగు నాట దీన్ని యథాతదంగా... వాల్మీకి హృదయాన్ని పట్టుకుని అహల్యా
శాపవిమోచనైనటువంటి విశేషాన్ని రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథసత్యనారాయణగారు తెలుగు
కవి మహానుభావుడు ఆయన అనుభవించినతీరు అసలు అనన్య సామాన్యము. ఆ అచేతనంగా... ఎందుకంటే
ఆవిడకి స్పర్శ లేదు అలా పడిపోయి ఉంది వాయుభక్షా నిరాహారా తప్యన్తీ భస్మశాయినీ ఆవిడ
భాహ్య స్మృతి ఏలా పొందిందో చేప్పారు విశ్వనాథ సత్యనారాయణగారు ప్రభుమేనిపై గాలి
పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చె ! ప్రుభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే
శిలకొక్క దానికి జెవులుగలిగె ! ప్రభు మేని నెత్తాని పరిమళించినతోన యశ్నంబు
ఘ్రాణేంద్రియంబుజెందె! ప్రభు నీలరత్నతోరణ మంజులాంగంబు గనవచ్చి ఱాతికిగనులుగలిగె !
ఆ ప్రభుండు వచ్చి యాతిథ్యమును స్వీక రించినంత నుపల హృదయవీధి ! నుపనిషద్వితాన
మొలికి శ్రీరామభ ద్రాభిరామమూర్తి యగుచుదోచె ! రామ చంద్ర మూర్తి ఆశ్రమంలోకి
నడిచి వస్తూంటే... ఆయన మీది గాలి అహల్యకి తగిలేటప్పటికీ ఆవిడకి చర్మం పని చేయడం
మొదలెట్టిందట, రామ చంద్ర మూర్తి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధ్వని ఆవిడ చెవిలో
పడితే... ఆవిడ చెవులు పని చేశాయట ప్రభు మేని నెత్తాని పరిమళించినతోన ఆయన
శరీం నుంచి వచ్చే సుమాసన తగలగానే ఆవిడ ముక్క పనిచేసిందట, అప్పటి వరకు
ఇంద్రియాలన్నీ పనిచేయయకుండా లోపలికి వెళ్ళిపోయాయి కదా ప్రభు నీలరత్నతోరణ
మంజులాంగంబు గనవచ్చి ఱాతికిగనులుగలిగె అన్నట్టుగా నీల మేఘ శ్యాముడు కదా ఆయన,
కాంతితో కూడిన రామ చంద్ర మూర్తి యొక్క శరీరం జ్యోతకం కాగానే ఆవిడ కన్నులు పనిచేయడం
మొదలెట్టాయట, ఆ ప్రభుండు వచ్చి యాతిథ్యమును స్వీక రించినంత నుపల హృదయవీధి
ఆయన ఆతిథ్యము స్వీకరిస్తున్నప్పుడు అహల్య పెడుతూంటే... సీతా రామ కళ్యాణ ఘట్టము
ఆమెకు ముందే తెలిసి, సీతా రాముడుగా శ్రీ రామ చంద్ర ప్రభువుగా... అహల్యకి దర్శనము
ఇచ్చాడట. ఈ విషయాన్ని చెప్తూ ఇప్పుడూ... రామ చంద్ర మూర్తి వస్తే అహల్యకు
శాపవిమోచనం అయ్యింది అని విశ్వామిత్ర మహర్షి చెప్పారు నీ వల్లే శాపవిమోచనం
అవుతుంది లోపలికి రా అని. శాప
విమోచనం అయింది, అహల్య
రాముడికి నమస్కారం చేయాలా, రాముడు అహల్యకి నమస్కారం చేయాలా? రాఘవౌ తు
తతస్తప్యాః పాదౌ జగృహతుస్తదా ! స్మరన్తీ గౌతమవచః ప్రతిజగ్రాహ సా చ తౌ అంతటి మహా ప్రతివ్రతా నా తల్లితో
సమానమైందీ, గౌతమ మహర్షి భార్యా, నేను బ్రహ్మచారిని, పిల్లవాన్ని, ఆ తల్లికి నేను
నమస్కరించాలని రామ చంద్ర మూర్తి నేల మీద పడి అహల్యకి నమస్కారం చేశారాట ఇది వినయం
అంటే. అప్పుడు అహల్య రామున్ని కూర్చోబెట్టుకుని లక్ష్మణున్ని కూర్చోబెట్టి ఆతిథ్యం
ఇచ్చిందట.
|
ఈవిడకి శాపవిమోచనం అయిందని తను తెలుసుకోగానే
హిమాలయాల నుండి యోగ మార్గంలోవచ్చి గౌతమ మహర్షి అహల్యని స్వీకరించి తనతో పాటుగా
మళ్ళీ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు, ఇద్దరూ సంతోషంగా
ఉన్నారు ఇది అత్యద్భుతమైన ఘట్టం. రాముడి మనసు మీద ఎంత ప్రభావం చూపించిందో
తెలుసాండీ...? వైవాహిక జీవితమంటే ఇది, భార్యని ఉద్దరించుకోవడం అంటే భర్త అలా
ఉండాలి, తప్పా అయిందానికీ కాందానికీ... భార్యని అనుమానించేవాడు పురుషుడు ఏలా
అవుతాడు. భార్య నిజంగా దూష భూయిష్ట అయినా ఉద్ధరించుకున్నవాడు భర్త. ఇది ఈ నమ్మకం
ఆయన్ని ఏకపత్నీవ్రతున్ని చేసింది, విశ్వామిత్రుడు చెక్కాడు
రామ చంద్ర మూర్తిని, మనం ఆ జ్యాతికి వారసులం. అటువంటి చోట విడాకుల
కోర్టులు, కేసులు చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం, అసలు ఈ జాతికి అది తెలియనే తెలియదు. కాబట్టి ఆ రామ చంద్ర మూర్తి అనుగ్రహం చేత
అట్లాంటి ఇబ్బందులు లేకుండా మనందరం పరమ సంతోషంగా జీవితం గడిపేటట్లుగా అటువంటి
స్థితి, అభ్యుదయము మనకు కలుగు గాకా! మన బిడ్డలు పవిత్రమైన జీవితం గడిపేటటువంటి
అనుగ్రహం ఆ సీతారాములు కృపజేయుగాక అని రామ చంద్ర మూర్తి పాదములు పట్టి ప్రార్థన
చేస్తూ... ఈ రోజు ఉపన్యాసం ఇక్కడితో పూర్తి చేస్తున్నాను.
స్వస్తి.
రేపటి రోజున
అత్యద్భుతమైన ఘట్టము, విశ్వామిత్రోప్యాఖ్యానము అంటే... విశ్వామిత్రుని యొక్క
జీవితాన్ని చెప్పి, శతానందులవారు చెప్తారు, సీతా కళ్యాణ ఘట్టం చెప్తాను. రేపు సీరా
రామ కళ్యాణ ఘట్టం అయితే ఈ సందర్భంగా మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంది
సీతా రామ కళ్యాణం నరుడిగా వచ్చిన రామ చంద్ర మూర్తి యొక్క కళ్యాణం, స్త్రీ పాత్ర
తోనే చేద్దాం, సీతా రామ కళ్యాణమని ఈ సీతా రామ కళ్యాణం చాలా గొప్పది కాబట్టీ, కార్య
నిర్వహాకులు ఒక అత్యద్భుతమైన సంకల్పం చేశారు. మామూలుగా సీతా కళ్యాణం చెయ్యడం
కాదూ... రేపు ఉదయం 7 గంటలకు సీతమ్మ తల్లిని పెళ్ళి కూతురిని చేస్తారు. రామ చంద్ర
మూర్తిని పెళ్ళి కొడుకు చేస్తారు. రాత్రి సీతా రామ కళ్యాణ ఘట్టం వివరిస్తాం.
ఎల్లుండి ఉదయం సీతా రామ కళ్యాణం జరుగుతుంది. అంటే రేపే మనం పెళ్ళి వారింట్లోకి
వెళ్ళి పోతాం. రేపు మనందరం పెళ్ళి వారమింకా... అమ్మవారిని రేపు అభ్యంగన స్నానం
చేయించి, పెళ్ళి కుమార్తెను చేసి బుగ్గన చుక్క పెట్టి, రామయ్య బుగ్గన చుక్క
పెట్టి, ఇద్దరికీ బట్ట కట్టి రాముడు నరావతారము. ఇద్దరినీ కలిపీ కూర్చో బెట్టితే
కోప్పడుతాడు. ఇంకా మాకు పెళ్ళవలేదని కలిపి ఎందుకు కూర్చోబెట్టారని, అందుకని
ఇద్దరినీ వేరు వేరు ఆసనాల మీద కూర్చో బెడుతారు.
సీతమ్మ పక్కన తోడి
పెళ్ళి కూతురుగా పార్వతీ దేవి కూర్చుంటుంది. రామ చంద్ర మూర్తి పక్కన లక్ష్మణ
మూర్తి ఉంటారు అక్కడ సన్నిధానం చేసి ఉంటారు ఇద్దరు. ఉండగా మనకి లోకంలో కొన్ని
విషయాలు చెప్తారు, సువాసినీత్వం అంటే... సవాసినీ సువాసిన్యక్షణ ప్రీత్యా అమ్మ
వారట ఎప్పుడూ ఒకటి కోరుకుంటుందట, ఐదవతనం ఏ ఆడదైనా
నిలబెట్టుకోగలిగితే...
అమ్మవారు అనుగ్రహించి ఇచ్చిందట, ఆవిడ ఎప్పుడూ ఏం కోరుకుంటందట, నేనిచ్చిన సువాసినీత్వం
కదా... నేనిచ్చిన ఐదవతనం కదా... ఆ ఐదోతనమున్నవాళ్ళు నాకు ఒక్క సారి వచ్చి సేవ
చేస్తే... నన్ను పూజిస్తే నేను పొంగి పోతానన్నదట ఎప్పటికీ చెక్కు చెదరని ఐదో
తనాన్ని ఇస్తుందట, ఈ నామాలు తెలుసుండికూడా చేయించకపోతే తప్పు కదాండీ...! అందుకే
రేపు ఒక చక్కటి ప్రయత్నంచేస్తున్నాం. కొన్ని రోళ్ళు, రోకళ్ళు తెచ్చి ఇక్కడ
పెడతారు, వాటిని అభిమంత్రిస్తారు, ఇంతకు ముందు ఏమైనా దంచిన దోషాలు పోగొట్టీ,
వాటికి పసుపు కొమ్మలు కడ్తారు, సువాసినీలు చక్కగా రేపు స్నానానంతరం చక్కటి సౌచం
కలిగిన వస్త్రం కట్టుకుని ఇక్కడికి వస్తే... చక్కటి సీతా రామ కళ్యాణానికి
సంబంధించినటువంటి పాటలు వినపడుతూండగా... మీ అందరూ కూడా ఒక వరుస క్రమంలో పసుపు
కొమ్మలు దంచుతారు. మీ ఇంటినుంచి సువాసినీలు అందరూ ఒకటో రెండో మీకు ఏన్ని వీలైతే
అన్ని పసుపు కొమ్మలు పట్టుకురండీ...! అక్కడ డబ్బా పెడుతారు అందులో వేయండి, ఆ పసుపు
కొమ్మలువేస్తే పెళ్ళి కూతురుగా సీతమ్మ అక్కడ కూర్చొని ఉంటుంది పెళ్ళి కొడుకూనూ,
పెళ్ళి కూతురైన సీతమ్మ ముందు సువాసీనులైనవాళ్ళు పసుపు దంపుతుంటే... పాటలు
వినపడుతూంటే... సీతమ్మ, శారదమ్మ, పార్వతీ దేవీ, గంగమ్మా గంగావతరణం అయింది.
విళ్ళందరూ చూస్తారు. వీళ్ళు సువాసినులు కనుక నా కోసం నా కళ్యాణం కోసం, వచ్చి
వీళ్ళు పసుపు దంపుతున్నారు. వీళ్ళ పసుపు కుంకాలు ఎప్పటికీ ఎన్ని జన్మలకీ... ఇలాగే
ఉంచుతాను అంటుంది అమ్మ వారు నాకా నమ్మకం ఉంది.
|
కాబట్టి రేపు ఆ సువాసినీలందరూ... కూడా
రోపొక్కరోజు దానివల్ల మీకేదైనా కొంచెం మీ రోజువారి కార్యక్రమంలో ఇబ్బంది కలగచ్చు.
కాని సాధ్యమైనంత వరకు ఇది మహత్తరమైనపని, కాబట్టి అందరూ కూడా విచ్చేసి, చక్కగా
పసుపు దంపండి, పసుపు దంపిన తరువాత మీ అందరూ లక్ష్మీ స్వరూపులు. ఎందుకంటే
దేవేంద్రుడు లక్ష్మీ దగ్గరికి వెడితే... కనపడింది. గృహలక్ష్మీ గృహే గృహే సితమ్మ మిమ్మల్ని రేపు ఆవహిస్తుంది. మీరొచ్చి పసుపు దంపితే...
పెళ్ళివాళ్ళు మిమ్మల్ని రిక్తహస్తాలతో ఎలా పంపిస్తారండీ...? పేరంటాలని ఎందుకనీ
రేపు మీకు సౌభాగ్య వస్తువులు ఇస్తారు, లలితా సహస్త్ర నామ స్తోత్రంలో
భాస్కరరాయులవారు వ్యాఖ్యానంచేస్తు కొన్నివస్తువులు చెప్పారు, ఆ వస్తువులని ఆడది
ముట్టుకుంటే... భర్తకు గండము వస్తుంటేపోతుంది. ఆ వస్తువుల్ని కాళ్ళతో తొక్కితే...
లేనిపోని గండము వస్తుంది. అలాంటివి కొన్ని వస్తువులు చెప్పారు, అనుములు, పెరుగు,
ఎర్రటి పువ్వులు, చెరుకు కర్రలు, చెరుకు ముక్కలు, ధనియాలు ఇలాంటివి. వీటితో పాటు
పసుపు, కుంకుమా ఈ సౌభాగ్య వస్తువుల్ని ఇలా చేత్తో పట్టుకుంటే చాలు, అది ఒక్క ఐదో
తనం ఉన్న వాళ్ళకే అర్హతది పుచ్చుకోవడనికి, అవి అమ్మవారిని పెళ్ళికూతురుని
చేసినప్పుడు, సువాసినీలు ఇలా చేత్తో పుచ్చుకుంటే... వాళ్ళ భర్త కాపాడబడుతాడు సమస్త
గండాలనుండి, నేను ఉత్తిగనే చెప్పారనుకుంటారేమో మీరు భాస్కరరాయులవారి వ్యాఖానం
చూడండి, ఆ వస్తువులలో ఉన్నాయో లేదో. రేపు మీ అందరి కోసం వాటిని సిద్ధంచేస్తారు అమ్మలగన్నయమ్మ
ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా యమ్మ కృపాబ్ద్హియిచ్చుత మహత్వ
కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలకన్న అమ్మ ఇక్కడే కొలువై ఉంది. నమ్మితి నా
మనంబున సనాతనులై న
యుమామహేశులన్ మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపెద్దమ్మ, దయాంబురాశివి
గదమ్మ, హరిం బతి జేయుమ్మ, నిన్ నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ ! అంటుంది రుక్మిణీ దేవి.
|
కార్యనిర్వాహకం
తరపున నేనే మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నాను, నాకు అదో సంతోషం నేను మైకు
పట్టుకున్నానని నేనే చెప్పేస్తుంటాను. కాబట్టి రేపువచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని
పసుపుదంపు పాటా అవన్నీ వేస్తారు రేపు. వేస్తూ ఉండగా ఆ పాటలు వింటూ ఆ పసుపు దంపి
ఇదంతా వాసనతో నిండిపోతుంది. సీతమ్మ తల్లి పొంగిపోతుంది. రేపు ఇవన్నీ తోరణాలు
కట్టేస్తారు. సాయంకాలం సీతా రామ కళ్యాణం చేప్తాను, విశ్వామిత్రోపాఖ్యానం
జరుగుతుంది. ఎల్లుండి సీతారామ కళ్యాణమే జరుగుతుంది. ఆ సీతారామ కళ్యాణం కూడా
ఎప్పుడూ జరిగే సీతారామ కళ్యాణం అనుకొంటున్నారేమో...? అత్యద్భుత కళ్యాణం. సీతమ్మ
తల్లిని బుట్టలో ధాన్యంపోసి తీసుకెళ్ళి వెళ్ళి కూర్చోబెట్టి గౌరీ తపస్సు చేయించిన
తరువాత శాస్త్రం ఒక మాట చెప్తుంది. పెళ్ళి కొడుకు ఒక పల్లకిలో వస్తాడు వరుడు,
వస్తున్నప్పుడు తుమ్ము దగ్గు ఇలాంటి అపశకునములు ఏవీ వినపడకుండా ఉండడానికి వేదంలో
కొంత మంత్రభాగం ఉంది ఆ మంత్రాలు చదువుతారు ప్రత్యేకంగా అక్కడ చదువుతాడు. కాకినాడలో
త్యాగరాజ స్వామి వారు, రామదాసు కీర్తనయందు విశేషమైన మక్కువ ఉండి, ఉపాసన
చేసేటటువంటి మహా భక్తురాలై గంధర్వగానం చేయ్యగలిగినటువంటి తల్లి ఉన్నారు పెద్దావిడ
సూర్యకుమారిగారు అని ఆ తల్లి రేపు ఉదయం బయలుదేరి గుంటూరు వస్తున్నారు. కళ్యాణం జరిగే
ముందు గంటసేపు ఆవిడ కచేరిచేస్తారు సీతా రాముల మీద, కచేరి చేసిన తరువాత ఈ వేద
మంత్రాల మధ్యలో రాములవారు పల్లకీలో పెళ్ళికి వస్తారు వచ్చి కూర్చుని పెళ్ళి
జరుగుతుంది. ముందు రోజు సీతా రామ కళ్యాణం వినడం, ఎల్లుండి సీతా రామ కళ్యాణం చూడడం,
ప్రసాదాలు పుచ్చుకోవడం, రేపు సౌభాగ్య వస్తువులు పుచ్చుకోవడం, అహో భాగ్యమే భాగ్యము
నేను ఎంతకని చెప్తాను, అనుభవించేదరు గాక కాబట్టి మనం ఇప్పుడు సంతోషంగా రామ నామం
చెప్పుకుంటే... నేను మంగళం చెప్తాను.
|
రామ నామము రామ నామము
రమ్యమైనది రామ నామము
రామ నామము రామ నామము
రమ్యమైనది రామ నామము !! రా !!
శాంతిగా ప్రార్థించు వారికి
సార్ధకమైనది రామ నామము !! రా !!
పెద్దలను ప్రేమించువారికి
ప్రేమ నిచ్చును రామ నామము !! రా !!
తల్లివలె రక్షించు
సుజనులనెల్ల కాలము రామ నామము !! రా !!
సకల జీవులలోన వేలిగెడి
సాక్షి భూతము రామ నామము !! రా !!
ఆంజనేయునివంటి భక్తుల
ఆశ్రయము శ్రీ రామ నామము !! రా !!
వాదభేదాతీతమగు వైరాగ్యమే
శ్రీ రామ నామము !! రా !!
దారినొంటిగ నడచువారికి
తోడునీడే రామ నామము !! రా !!
వేదవాఖ్య ప్రమాణములచే
అలరుచున్నది రామ నామము !! రా !!
రాక్షసులను తరిమికొట్టిన
నామమే శ్రీ రామ నామము !! రా !!
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు
ఇష్టమైనది రామ నామము !! రా !!
సోమ సూర్యాదులను మించిన స్వ
ప్రకాశము శ్రీ రామ నామము !! రా !!
రావణానుపంకజ హృదయ రాజకీరము
రామ నామము !! రా !!
ఎందు చూచిన ఏకమై తా వెలయు
చున్నది రామ నామము !! రా !!
నీల మేఘ శ్యామమలము నిర్మలము
శ్రీ రామ నామము !! రా !!
------
మంగళా శాసన...
No comments:
Post a Comment