అయోధ్య కాండ
దొమ్మిదవ రోజు ప్రవచనము
నేను మీతో తరచుగా
ఒకమాట ప్రస్తావన చేస్తూవస్తున్నాను, ʻశ్రీరామాయణము వేదోపబృహ్మణముʼ అని శ్రీరామాయణం ప్రధానంగా నరునియొక్క
జీవితాన్ని ఉద్దరించడానికి నరునియొక్క జీవితం ఎలా ఉండాలో నేర్పడానికి వచ్చినటువంటి
కావ్యం. నేను మీతో మనవి చేస్తూవస్తున్నాను నరునికి ఉన్నటువంటి ప్రత్యేకమైన వరం ʻవాక్కుʼ ఈశ్వరుడు ఇచ్చినటువంటి అత్యద్భుతమైన కానుక అది, ఈవాక్కు అత్యంత శక్తివంతము
అగ్నిహోత్రము ఎంత శక్తివంతమో... అంతకన్నా ఎక్కువ శక్తివంతము, అగ్నిహోత్రానికి
కాల్చడం ఒకటే తెలుసు వాక్కు కాల్చగలదు ఉపశాంతిని ఇవ్వగలదు “కడుపుల్ రంపపుకోత
కోయునదియే గాయాలు కాకుండినన్” అంటాడు బలిజేపల్లి వారు, రంపం పట్టుకుని ఒక
మనిషిని పడుకోబెట్టి కడుపుని అటూ ఇటూ పట్టుకుని కోస్తే కలిగేటటువంటి బాధకన్నా
అనకూడనటువంటి మాట ఒకటి అంటే కలిగే బాధ
అంతగా ఉంటుంది కాబట్టీ మాట అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనది.
దానివల్ల ఏమైపోతుందంటే... నేను
మీకు నిజం చెప్తున్నాను మీరా ప్రయత్నం చేసిచూడండీ... మీరు ఒక రెండు మూడు రోజులు
అలా చేయగలిగితే... నాలుగో రోజున మీకు ఏమౌతుందో తెలుసాండీ... మీరు పరకాయ ప్రవేశం
చేసేస్తారు, మీరు అయోధ్య నగరంలోకి వెళ్ళిపోయీ... మీకు ఎలా ఉంటుందంటే... తెలిసిన
రామ కథైనా... ఎవరైనా వస్తే మీకు చికాకొస్తుంది, మీకు మళ్ళీ ఎంత తొందరగా
శ్రీరామాయణాన్నితీసి ఆలా శ్లోకం శ్లోకం ప్రతి విషయాన్ని చదువుతూ... అందులో
మమేకమైపోదామా అనేటటువంటి ఆకర్షణ మిమ్మల్ని లాగేస్తుంది. లాగేసి శ్రీరామాయణం
మిమ్మల్ని అలా తరింపజేసేస్తుంది అంతగొప్ప రచనచేశారు. అందుకే ఆ ఋషిఋణం మనం
తీర్చుకోలేము, రామ కథని రామ కథగా చదివితే చాలు ఇంక దానికి ఏమీ అక్కరలేదు ఎలా ఉందో
అలా యథాతథంగా... రామ కథని చదువుకుంటే చాలు. అలా మీకు మీగిలిన వాటిల్లో పసుగుతుందా
అంటే... అలా హామీ ఇవ్వడం కొంచెం కష్టం. నేను ఎందుకంటున్నాను అంటే మనస్సనేటటువంటిది
ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందా అని అనుమానం వచ్చేలా ఉంటుంది. మనుష్య ప్రవృత్తికి చాలా
దగ్గరగా ఉంటుంది రామాయణం కొంచెం కాస్త అలా దూరంగా మీరు పట్టుకోవడానికి వీలు లేని
రీతిలో ఉంటాయి మిగిలినవి.
కాబట్టి ఇప్పుడు మంధర
అన్నపాత్ర ఒకటి ప్రవేశించింది, అయితే ఈ మంధర అన్నపాత్ర అసలు ఎవరు? ఎక్కడ్నుంచి
వచ్చింది? అన్నదాని మీద చర్చ ఉంది కానీ, మహాభారతంలో మాత్రం శ్రీరామాయణంలో ఆవిషయం
లేదుకానీ, మహాభారతంలో మాత్రం దీనిగురించి ఒకమాట చెప్తారు. ఏమనీ అంటే ఆమె దుందుభి
అనేటటుంటి ఒక గంధర్వకాంత. ఆమె రావణాసురినిచేత బాధింపబడిందని అనేక మంది కాంతలు
బాధింపబడినట్లే బాధింపబడిందని, బాధింపబడి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయిస్తే... ఆయన
నీవే... రావణాసురుని యొక్క భంగపాటుకు శ్రీరామాయణంలో ప్రధానపాత్ర పోషించేటటువంటి
కుబ్జగా జన్మిస్తావని అనుగ్రహింపబడిందని అందుచేత ఈ జన్మలో ఆమె కుబ్జగా వచ్చిందని,
ఆమె పుట్టుక నుంచీ కైకమ్మతోనే కలిసి ఉంది, ఆమె పుట్టిన దాదిగా కైకతోనే కలిసి ఉంది.
కాబట్టి ఆమె ఎవరూ ఏమిటీ అన్నదానికి అంత పెద్ద ప్రాధాన్యతలేదు. ఆమే ఏ పాత్ర
పోషించింది శ్రీరామాయణంలో ఆమె సాధించగలిగినటువంటి విషయమేమీ అన్నదానిమీదే ప్రధానం.
ఇచ్చేస్తానని వరమిచ్చాడు
ఇప్పుడేమైందంటే కౌసల్య కడుపున పుట్టిన రాముడి మీద మమకారం ఎక్కువ, ఎందుకంటే రాముడు
సుగుణాభి రాముడు, కౌసల్య కొడుకని కాదు రాముడు గుణములచేత తండ్రిని వశం
చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రామునికి రాజ్యం ఇవ్వకుండా ఉండలేడు, నిజంగా
ఇవ్వకుండా ఉండడానికి కారణం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు రామునికి రాజ్యం ఇవ్వాలి,
ఒకవేళ కైకమ్మకి ఏ కారణం చేతనైనా... పుత్ర ప్రీతితో భరతుడికి రాజ్యం ఇవ్వూ అంటే...
ఇవ్వనూ అనే అధికారం లేకుండా తానే అడ్డుపెట్టుకున్నాడు. కాబట్టి అసలు చెప్పకుండా
ఉంటే గొడవేమిటీ...? కాబట్టి ఆయన ఊహ ఎంత దూరం వెడుతుందో అంత దూరం జాగ్రత్త
తీసుకున్నాడు, కాని ఆయన యందు ఒక అసత్య దోషమంటూ ఒకటి ఉందిగా... అది కట్టి
కుదుపకుండా ఎలా ఉంటుంది? కుదుపుతుంది అది దైవము యొక్క నిర్ణయం అది అంతే... కాబట్టి
అది ఏం చేసిందంటే మంధర రూపంలో ప్రకాశించింది రాజు ఊహించలేదు.
అందుకే మూడో కంటికి తెలియకుండా చేయండీ అంటారు,
మూడో కన్ను ఉన్నవాడికి తెలియకుండా చేయండి అనకూడదు. మూడో కంటివాడికి తెలియకుండా
మీరు ఏమీ చేయలేరు, మూడు కన్నులున్నవాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు ఈశ్వరుడు. మూడో
కంటికి తెలియకుండా చేయగలరేమో ఏదైనా... మూడో కన్ను అంటే నా రెండు కళ్ళు కాకుండా...
పక్కవాడి రెండు కళ్ళల్లో ఒక్క కన్నుకి కూడా తెలియకుండా ఏమైనా చేస్తానేమోగానీ... మూడో కంటివాడికి తెలియకుండా చేయడం
అసంభవం. ఇది బాగా నాటుకుందనుకోండి మీకు మనసులో మూడో కంటివాడికి తెలియకుండా నేను
ఏదీ చేయలేనూ... కాబట్టి మీరు ఇప్పుడు తప్పు చెయ్యలేరూ... ఈశ్వరుడు
చూస్తున్నాడు గమనిస్తున్నాడు అన్నారనుకోండీ... ఏం ముఖం పెట్టుకుని తప్పు చేస్తారు,
ఏం ముఖం పెట్టుకుని మల్ళీ రేప్పొద్దున పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చుంటారు ఆయన
దగ్గరా కుదరదు కదా..! చేయలేరు అందుకే... నీ అభ్యున్నతి మీ విశ్వాసం మీదే ఉంటుంది. రామాయణం
ఇది మీకు బాగా ప్రోదిచేస్తుంది. ఈశ్వరుడి యొక్క సంకల్పములు అంటే ఎలా ఉంటాయో
తెలుసా..? అయోధ్య కాండ మొత్తం మీద దీన్ని పట్టుకున్నవాడు ఎవడో తెలుసాండీ... రాముడు
ఒక్కడే... ఇంక ఏ పాత్రా ఇది మాట్లాడదు. అన్నీ ఏడుస్తాయి, రాముడొక్కడే ఏడవకుండా ఇది
చెప్తాడు, అందుకే ఇది రామాయణం అయింది.
ఒకమాట అనవసరంగా
మాట్లాడినవాడు ఇంకొకమాట మాట్లాడకుండా ఎలా ఆపుచేయాలో ఈ మాటతో మీకు తెలుస్తుంది. ఇది
శ్రీరామాయణం బాగా అర్థమైతే మీకువచ్చే ప్రజ్ఞ తెలుసాండీ! ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది
మీరు మావటివాడు అంకుశాన్ని కాళ్ళముందు పెట్టాడనుకోండీ అది దాటదింక. అలాగే మాటయందు
ప్రజ్ఞ ఉంటే... ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసాండీ! మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసమని
ఏదోమాట్లాడుదామనివస్తే ఒక్కమాటతో మీరు అలా నిలబెట్టేయగలరు? ఆ ప్రజ్ఞ భాషిస్తుంది
శ్రీరామాయణం చదివిన వాళ్ళుకి, శ్రీరామాయణం జీర్ణమైనవాళ్ళకి ఉండేటటువంటితీరు
వాళ్ళమాట స్వభావం వేరుగావుంటుంది. అందుకే శ్రీరామాయణం జీర్ణమైతే... వాడు రాముడే
అవుతాడు అంటారు. చాలా మంది పెద్దలు లోకంలో... ఏమంటారంటే రామాయణం జీర్ణమైతే... ఆయన
రామానుగ్రహం పొంది రామునిగా రామునియొక్క
యశస్సుని, రాముడియొక్క తేజస్సుని, రామునియొక్క ధార్మికతని, రామునిలా వాక్
శుద్ధిని పొందుతాడు శ్రీరామాయణానికి ఆ శక్తి
ఉంది.
ఒక్క శ్లోకమండీ
శ్రీరామాయణంలో ఒక్క శ్లోకమే అయోధ్య కాండలో, మంధర ఇంకా ఏం మాట్లాడలేదు, దాదితో
మాట్లాడుతూంది అంతే... ఒక్క శ్లోకం నీకు ఎన్ని నేర్పుతూంటూందో చూడండి, చాలా
జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలో... ఎలా ఉండాలో ఏది ప్రమాదకరమో... ఎక్కడ అపకీర్తి
పాలైపోతాడో... ఏది నీలోపల ఉండకూడదో... దేన్ని మీరు ప్రయత్న పూర్వకంగా
తొలగించేయవలసి ఉంటుందో... అది తొలగించకపోతే ఎంత విషవృక్షమై కూర్చుంటుందో... లోపల
అది ఎన్నిప్రమాదాలు తెస్తుందో అది వాక్ రూపంలోబయటకు వస్తుంది అసూయ, చాలా జాగ్రత్తసుమా... మనకి
నేర్పుతుంది. కాబట్టి ఇప్పుడు అడిగితే దాది చెప్పకుండా ఉండలేకపోయింది ప్రశ్నవేసిన
తరువాత ఎందుకని అంటే... ఎందుకంటే ఆవిడ రామున్ని పెంచిన దాది, రామున్ని పెంచిన
దాదికి రాముని లక్షణాలే వస్తాయి కదా!, రోజూ ఒక్క అపద్దమాడడు, అంత మంచివాడు అలా
ఉంటాడు, రోజూ ఆయనకు సేవచేసిన వాళ్ళకు ఆ లక్షణాలే వస్తాయి. ఇప్పుడు యజమాని అటువంటి
యజమాని అనుకోండీ, హరిప్రసాదుగారి దగ్గర పనిచేసే వానిని శారదాదేవి పీఠానికిరాకుండా
ఉండమనండీ నేను చూస్తాను, ఆయన రాకపోతే ఆయన బస్సేసి శృంగేరికి పంపిస్తారు రేపు,
ఎప్పుడో ఒకప్పుడు శృంగేరి వెళ్ళిపోతాడు హరిప్రసాద్ గారి దగ్గర పనిచేసేవాడు. ఎందుకు
పనిచేస్తాడంటే... యజమాని లక్షణమది. మీరు ఎక్కడున్నారో దానిఫలితం మీ మీదపడిపోతుంది.
ఇప్పటికీ కైకమ్మ మనసులో
పూర్తిమార్పు రాలేదు, ఆవిడ దిగ్గున లేచింది ఆ పడుకున్నటువంటి పర్యంకం నుంచి అతీవ
సా తు సంతుష్టా కైకేయీ విస్మయాఽన్వితా ! ఏకమ్ ఆభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ
శుభమ్ !! ఒక మంచి ఆభరణం ఒకటి ఒంటి
నుంచి తీసీ ఓ కుబ్జా ʻకుబ్జాʼ అంటే ఆవిడకి గూన ఉంది. పొట్టిది గూనిది
అంటూంటాం తెలుగులో, ఆవిడ గూనితో కూడినటువంటి వ్యక్తి ఇలా ఎత్తి చూసి మాట్లాడాలి
తప్పా, ఇలా నిలబడి మాట్లాడలేదు, అందరికి వెన్నుపాము నిలువుగా ఉంటుంది, ఆవిడ
వెన్నుపాము ఇలా లేవబోయి వంగిపోయి ఉంటుంది. అందుకని అంబోతుకి ఉన్నట్టుగా ఉంటుంది,
పైన ఓ చిన్న ఎత్తుగా ఉంటుంది. అంటే మనిషి అంటేనే అడ్డంగా పుట్టి నిలువుగా ఉండాలి
వెన్నుముక, ఈవిడికి అడ్డంగానే పుట్టి అడ్డంగానే బతుకుతోంది, తప్పా నిలువుగవున్న బతుకు
కాదు, అసుయాగ్రస్తమైన బ్రతుకు అది చెప్పడానికి కుబ్జా. అందుకని కుబ్జగా పుట్టింది
అంటే నా ఉద్దేశంలో కుబ్జలందరూ అలా ఉంటారు అని కాదు సుమాండీ! నా ఉద్దేశం. నేను
అటువంటి సిద్ధాంతం చేయటంలేదు, ఈవిడ స్వభావాన్ని ఆవిడ స్వరూపాన్ని బాగా
సమర్థించింది ఇక్కడ.
ధర్మజ్ఞో గురుభి
ర్దాన్తః కృతజ్ఞః సత్యవాక్ శుచిః ! రామో రాజ్ఞః సుతో జ్యోష్ఠో యౌవ రాజ్యమ్ అతోఽర్హతి !!
నీవెంత పిచ్చిదానివి బాల
ఏవ హి మాతుల్యం భరతో నాయిత స్త్వయా ! సన్నికర్షా చ్ఛ సౌహార్దం జాయతే స్థావరే ష్వపి
!! మీ ఆయనంటే... కుట్ర చేశాడు పగ పట్టాడు, రాముడికి రాజ్యం ఇవ్వడం కోసం నీ
కొడుకుని బలి పెట్టాడు, నీకు తెలివి తేటలు ఉన్నాయా? మీ ఆయన్ని నమ్మేశావు? నమ్మేసి
ఏం చేశావు? మీ అబ్బాయిని మేనమామ ఇంటికి పంపావు, out of sight, out of mind అని ఇంగ్లీషులో ఒక ప్రవర్బ్, ఎప్పుడూ కూడా ఒకే
చోట ఉన్నామనుకోండీ కొంత కాలం ఆ ప్రదేశం పట్ల ఒక ప్రేమ కలుగుతుంది.
కనపడీ మాట్లాడేటప్పటికి
వెంటనే కైకమ్మందీ అద్య రామమ్ ఇతః క్షిప్రం వనం ప్రస్థాపయా మ్యఽహమ్ ! యౌవ రాజ్యేన భరతం
క్షిప్రమ్ ఏవాఽభి షేచయే !! ఈ క్షణంలోనే మంధరా నేను రామున్ని అడవికి
వెళ్ళేటట్టు, భరతుడు యౌవ్వ రాజ్యానికి వచ్చేటట్టు నేను చేస్తాను అని ఇప్పుడు నా
కొడుక్కి రాజ్యధికారం రావాలి, రాముడు వెళ్ళిపోవాలి, ఇది ఎలా సంభవిస్తుంది, ఎలా
చెయ్యాలే కుబ్జా! నీకేమైనా ఆలోచన ఉంటే చెప్పు అంది, నీకు తెలియక అడుగుతున్నావా..?
లేకపోతే నేను ఏం చెప్తానో అని అడుగుతున్నావా? అసలు నీకే జ్ఞాపకం ఉండాలి? కానీ...
అడిగావు కాబట్టి చెప్తున్నాను, నీ యందు అనురక్తి కలిగిన దానిని, ఎప్పుడూ నీ క్షేమం
కోరేదానిని కాబట్టి ఎందుకైనా మంచిదని నీ క్షేమానికి సంబంధించిన విషయాలన్నీ నేను
జ్ఞాపకం పెట్టుకుంటూంటాను... అంది. ఇదీ ఇంకా బాగా మంధరని విశ్వశించడానికి కారణమైనది,
అంటే అవతల వాళ్ళ జీవితంలో చిచ్చుపెట్టాలన్న అసూయ కడుపులో పెట్టుకున్నవాళ్ళు అవకాశం
చూసుకొని మాట్లాడితే... ఆ ఉపద్రవాన్ని బాహ్యంలో శత్రువులందరూ కలిసి వచ్చినా
దశరథుడు గెలవగలడేమో కానీ మంధరని గెలవలేడు, కాబట్టీ అసూయా గ్రస్తమైన మనసు ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళు అన్న
వారితో అసలు సంఘమము మంచిది కాదు.
మనం గబుక్కినా కైకమ్మా
అనగానే అన్నీ తప్పుల కింద మాట్లాడేయకూడదు, అలా అయితే మనం అసుయాగ్రస్తం అయిపోతాము.
ఆవిడని రెండు వరాలు తీసుకో అని దశరథుడు అడిగితే, నాకేదో లేదన్నభావన ఉంటే వెంటనే
అడగాలి, అవిడకేంటంటే నాకేం లేదన్న భావన ఉంది అంటే అంత తృప్తిగా ఉంది ఆవిడ. కాబట్టి
నాకెందుకండీ వరాలు అంది ఆవిడ, అంటే దశరథుడే పట్టుపట్టాడు కాదు నా ప్రీతి కొరకు
రెండు కోరికలు కోరుకో అన్నాడు, అంటే ఆవిడందీ నాకేం కావాలి భర్త ఓ... ఏదో కోరుకో
కోరుకో అంటే కోరడానికి ఆవిడకి ఏమీ తట్టలేదు, ఎప్పుడు తడుతుంది మనసులో నాకిది
లేదన్న భావన ఉంటే, నాకిది లేదన్న భావన లేనిస్థితిలో పూర్ణ తృప్తితో ఉంది కైక.
అప్పటికి భర్త కాసేపటికి ఆ గొడవ వదిలేయాలంటే ఏం చేయాలి, అబ్బా నేను అడుగుతానులేండీ
అప్పుడు మీరు ఇద్దురుగానీ! చాలా మంచి సంతోషంలో ఉన్నప్పుడు ఏమోయ్ నీకు వడ్డాణం
చేయిద్దామనుకుంటున్నాను లక్షరూపాయలది వెడదాము జ్వాలరీ షాప్ కి అన్నాడనుకోండీ,
ఇప్పుడెందుకండీ ఇప్పుడు బోలెడు చేయించారు చాలు, వడ్డాణం ఒక్కటి లేకపోతే నాకు
వచ్చిన నష్టమేమీ లేదు, అయినా నాకు పాత వడ్డాణం ఉంది సన్నది ఇప్పుడు మీరు దానికి
ఏదో అష్టలక్ష్ములు వేయించీ గజ్జలేయించేసి చేయిస్తానన్నారు కానీ అక్కరలేదు ఇప్పుడు
ఆ మాట ఎత్తకండీ అందీ, అలా కాదులేవోయ్ ఇప్పుడు నేను కొందామనుకున్నాను తీసుకోవలసిందే
అంటే, అలా కాదుకానీ నేను నాకు కావలసినప్పుడు ఒకటి కొనుక్కుందాము అనుకొన్నాను
కావలసినప్పుడు కొందాంలేడీ అంటే ఆయనేమనుకొంటాడు ఆ... ఏదో మనసులో ఉంది ఎప్పుడో
కొనుకుంటుందిలే అప్పుడు కొందాం లే అని ఉరుకున్నాడు. ఇల్లు ఫినిషింగ్ వచ్చినప్పుడు
చేతిలో ఏమీ లేనప్పుడు వడ్డాణం కొంటానన్నారు లక్ష రూపాయలు ఇవ్వండీ అంటే ఆయన
పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది దశరథ మహారాజుగారి పరిస్థితి.
అభిషేక సమారమ్భో
రాఘవ స్యోపకల్పితం ! అనే నైవాఽభిషేకేణ భరతో మేఽభిషిచ్యతామ్ !!
కాబట్టీ సదా తే జననీ
తుల్యాం వృత్తిం వహతి రాఘవః ! తస్యైవ త్వమ్ అనర్థాయ కిం నిమిత్తమ్ ఇహోద్యతా !! రాముడు
నిన్నెప్పుడూ తల్లిగానే చూశాడు, అసలు నిన్ను ఒక పినతల్లిగా భావించలేదు, తల్లీ
బ్రతికున్నతకాలం కూడా చచ్చిపోయోటప్పుడు కూడా అభ్యున్నతే కోరుతుంది, అందుకే
కట్టుకున్నవాడు తల కొరివి పెట్టినా ఉపశాంతి ఉండదు, కట్టుకున్నవాడివల్ల పుట్టిన
కొడుకు పెడితే ప్రశాంతంగా కాలిపోతుంది ఆ కట్టె, అమ్మ అంటే ప్రాణం పోయేటప్పుడు కూడా కడుపున పుట్టినటువంటి
బిడ్డల యొక్క అభ్యున్నతిని కోరేటటువంటి అమృత మూర్తి. కౌసల్యకన్నా నిన్ను
అమ్మగా చూశాడు గదే..! నీ నోటెంట ఈ మాట ఎలా వచ్చింది, రాముడు అడవులకి వెళ్ళిపోవాలని
ఈ మాట ఎలా అనగలుగుతున్నావు నీవు, ఇంత ఘోరమైన మాట అంటావా? కౌసల్యాం వా సుమిత్రాం
వా త్యజేయమ్ అపి వా శ్రియమ్ ! జీవితం వాఽఽత్మనో రామం న త్వేవ పితృ
వత్సలమ్ !! కౌసల్యని వదిలేయ్ అను
వదిలేస్తాను, సుమిత్రను వదిలేయను వదిలిపెట్టేస్తాను దూరంగా నీ ఐశ్వర్యాన్ని
అంతటినీ వదిలిపెట్టేయ్ అను వదిలిపెట్టేస్తాను, నాజీవితాన్ని వదిలిపెట్టేస్తాను,
రామున్ని వదిలేయ్ అని అనకే నేను తట్టుకోలేను వాన్ని చూడకపోతే నేను ఉండలేను అని
ఆవిడ వంకచూసి ప్రార్థనచేశారు.
ఆవిడ అంటూందా! ఆవిడ అనలేదు శుశ్రూషాం గౌరవం
చైవ ప్రమాణం వచన క్రియాం ! క స్తే భూయస్తరం కుర్యాత్ అన్యత్ర మనుజర్షభాత్ !! నీ
అంతఃపురంలో ఎందరో ఉన్నారు నీకు శుశ్రూష చేసే వాళ్ళు నిజంగా చెప్పు నీకు శుశ్రూష
చేసేవాళ్ళల్లలో అగ్రగణ్యుడు, కౌసల్య కన్నా నీకు ఎక్కువగా శుశ్రూష చేసేవాడు రామ
చంద్ర మూర్తి, అంత శుశ్రూష చేస్తాడే..? ఎందుకు అతని మీద అంత కోపం
పెట్టుకున్నావే... ఎందుకంత కక్ష పెట్టుకొని ఈ మాట అడుగుతున్నావు బహూనాం స్త్రీ
సహస్రాణాం బహూనాం చోప జీవినాం ! పరివాదోప వాదో వా రాఘవే నోపపద్యతే !! ఆయన తప్పు
చెయ్యకుండ చేశాడూ అంటే అది నింద, ఆయన తప్పు చేసిన తరువాత అంటే పరివారం, రాముడి మీద
అదీ లేదు ఇదీ లేదు తప్పు చేసింది లేదూ తప్పు చేశాడేమో అని అనుమానంతో చేసిన
నిందాలేదు మరి నీవెందుకు రామున్ని అరణ్యవాసాలకు వెళ్ళిపోవాలంటున్నావు? సాన్త్వయన్
సర్వ భూతాని రామః శుద్ధేన చేతసా ! గృహ్ణాతి మనుజ వ్యాఘ్రః ప్రియైః విషయ వాసినః !!
రాముడు సర్వలోక భూతములచేత ప్రేమింపబడినటువంటివాడు శుద్ధమైన మనసున్నవాడు,
మనుజులయందు వ్యాగ్రమువంటివాడు, సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః ! గురూన్
శుశ్రూషయా వీరో ధనుషా యుధి శాత్రవాన్ !! రాముడు ఈ లోకములన్నిటినీ కూడా తన
సత్యముచే జయించాడు, దీనులను దానములతో జయించాడు, గురువులను శుశ్రూషలచే జయించాడు,
వీరులను ధనుస్సు మొదలైన మరియు ఇతరములైన ఆయుధాలతో జయించాడు అటువంటి రాముడు అంతటి
అద్భుత పరాక్రముడు అంత మంచివాడు, లోకమంతా కోరుకుంటున్నటువంటివాడు, ప్రియాతి
ప్రియమైన రాముడు.
అన్నగారు బయటికి వస్తాడేమో నని అన్నయ్యని
చూడకుండా ఉండలేనివాడు ఒకడున్నాడు లక్ష్మణుడు, అన్నయ్య బయటికి వస్తాడు అన్నయ్యతో
పాటు కలిసి వెళ్దామని నిల్చున్నాడట లక్ష్మణుడు, ఎలా నిల్చున్నాడట... ఏదో ఇలా
నిలబడలేదటా అన్నయ్య బయటికి వస్తాడనీ... ఏమి రచనండీ వాల్మీకి మహర్షిదీ పర్వతా
దివ నిష్క్రమ్య సింహో గిరి గుహా యశః ! లక్ష్మణం ద్వారి సోఽపశ్యత్ ప్రహ్వాంజలి పుటం
స్థితం !! అన్నయ్య బయటికి వస్తూంటే
సింహలాగా... ఇలా ఒంగి అంజలి ఘటించి ఉన్నాడట అన్నయ్యేగా ఆయన భక్తి అటువంటిది రామ
చంద్ర మూర్తి అంటే లక్ష్మణుడంటే బహిప్రాణం.
అహం హి వచనాత్
రాజ్ఞః పతేయమ్ అపి పావకే ! భక్షయేయం విషం తీక్ష్ణం మజ్జేయమ్ అపి చాఽఽర్ణవే !!
అంటే అమ్మా నేను
అరణ్యవాసానికి చేయడానికి వరం అడగడం ఎందుకమ్మా నీవు పిలిచీ వరం అక్కరలేదు కారణం
అక్కరలేదమ్మా... రామా! 14 యేళ్ళు కాదు
జీవిత పర్యంతమూ అడవులకి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతానమ్మా... అమ్మా నేను ఎందుకనీ
కూడా అడగను భరతుడు సంతోషంగా రాజ్యం చెయ్యాలి, అఖంటకంగా చెయ్యాలి అమ్మా నాకు రాజ్యం
మీద కోరిక లేదు. కానీ నేను నీకు సరిగ్గా అర్థమవలేదూ అమ్మకి అర్థమయ్యేటట్టు నేను
ప్రవర్తించలేక పోయానా అని ఏడుస్తున్నాను అని అన్నాడు. ఇది రాముడంటే. ఇది రామ చంద్ర
ప్రభువు. ఇది ఆయన ధర్మం. అందుకే రామాయణం కాలం ఉన్నంత కాలం ఉంటుంది. న వనం గన్తు
కామస్య త్యజత శ్చ వసుంధరామ్ ! సర్వ లోకాఽతిగ స్యేవ లక్ష్యతే చిత్త
విక్రియా !! అమ్మా! నేను ఈ భూమిని
విడిచిపెట్టవలసి వచ్చినా... నాకు ఏమీ బెంగలేదన్న రాముడి మాట పరమ నిజం ఎందుకో
తెలుసా... రాముడి మనసులో ఏ కోరికా లేకుండా... నిజంగానే ఆ అభిషేక సామాగ్రికంతటికీ
కూడానూ ఒక్కసారి ప్రదక్షణ పురస్కరంగా తిరిగి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు.
పెద్దలేమంటారో తెలుసాండీ ఈ
శ్లోకం గురించి కౌసల్య 14 యేళ్ళ కోసం రాముడికి కట్టించినటువంటి చద్దన్నపు మూటా
అంటారు ఈ శ్లోకాన్ని. ఎందుకంటే అమ్మా పిల్లాడు ఏదైనా ఊరు వెళ్తున్నాడంటే,
నాన్నగారు డబ్బిస్తాడు అమ్మ అలా ఇవ్వదు. అమ్మేం చేస్తుందంటే నాన్నా మధ్యాహ్నం
ఆకలేస్తుంది తినే అని ఓ రొట్టె ఇస్తుంది, ఎందుకైనా మంచిది రాత్రి అక్కడ దొరుగుతాయో
దొరకవో రెండు యాపిల్ పండ్లు పడేశాను తినే అని అంటుంది. అమ్మా పోషణ చూస్తుంది. 14
యేళ్ళు రాముడు ఇప్పుడున్నవాడు అలాగే ఉండాలంటే, రాముడు అరాముడు కావాలని ఏ మంధర
కోరుకుందో, ఆ రాముడు అరాముడు కాకుండా ఉండాలంటే, రాముడు లోకాభిరాముడుగా తిరిగి
రావాలంటే జగత్ వందితుడైనటువంటి రాముడిగా కీర్తి శోభిల్లాలంటే, రామా నేను నీకు
చెప్తున్నాను గుర్తుపెట్టుకో యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ ! స వై
రాఘవ శార్దూల ధర్మః త్వాం అభిరక్షతు !! ఏ ధర్మాన్ని రామా ఇప్పుడు పట్టుకున్నావో,
ఏ ధర్మాన్ని నమ్మావో, ఏ ధర్మం కన్నా లోపల కోరుకున్న భోగాలు కూడా గొప్పవి కావని
ధర్మాన్నే అనుష్టిస్తున్నావో ఆ ధర్మాన్ని అలాగే పట్టుకొని ఉండు రామా... అది నిన్ను
అభిరక్షతు అది నిన్ను రక్షించి తీరుతుంది.
అంబరీసుని పూజలకు
కైవల్యమొసగిన రామ నామము !! రామ !!
శ్రీరామాయణంలో ఒక
మాటని ఎంతవరకూ కథని మార్చగలదూ ఎంత తిప్పగలదూ చూపిస్తూ ఉంటుంది, శ్రీరామాయణంలోనే
ఉన్నటువంటి అత్యంత గమనించదగ్గ విషయం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రామాయణం ఎప్పుడు
అయిపోతుందో అని మనం అనుకుంటామో... అప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని
కోనసాగిస్తూటుంది, యదార్థానికి బాల కాండ చివర ఆయోధ్య కాండ ప్రారంభ సర్గలతో
శ్రీరామాయణం అయిపోయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే రామునికి వివాహం అయిపోయింది
సంతోషంగా ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు కాబట్టి అయిపోయింది రామాయణం, కానీ మంధర
పాత్ర ప్రవేశించింది మంధర ప్రవేశంచేత శ్రీరామాయణం ముందుకు వెళ్ళింది, ముందుకు
వెళ్ళిన తరువాత ఒక స్థితిలో అరణ్యవాసంలో సీతా రాములు సంతోషంగా ఉన్నారు చాలా
సంవత్సరాలు అయిపోయింది ఇంక వెనక్కు వచ్చేస్తారు, శూర్పణఖ ప్రవేశించి సీతమ్మ తల్లి
యొక్క అపహరణమునకు కారణం అవుతుంది, సీతమ్మ తల్లి అశోకవనంలో ఉండగా... ఉరి
పోసేసుకుంటాను ఉరి పోసేసుకుంటాను అని అన్నప్పుడు త్రిజట తన స్వప్నం చెప్పింది
శ్రీరామాయణం ముందుకి వెళ్ళింది, అంతక ముందు రావణుడు సీతమ్మని చంపెస్తాను అని కత్తి
ఎత్తాడు, ఏమో ఎలా ఉండునో రామాయణం ధాన్యమాలిని అన్న రావణాసుని భార్య అడ్డుపడి
రామాయణాన్ని కొనసాగించింది, సీతమ్మ తల్లి ఒకప్పుడు యుద్ధ కాండలో రావణుడు
సృష్టించినటువంటి మాయా రాముడు యొక్క శరీరాన్ని ఆయొక్క తలకాయని చూసి ఖిన్నురాలై
శరీరాన్ని విడిచి పెట్టినంత పనిలోకి వెళ్ళింది. మళ్ళీ త్రిజటా పుష్పక విమానం
రహస్యం చెప్పి ఆవిడ జీవితాన్ని కొనసాగింపు చేసింది.
కథా పరంగా
సీతమ్మ తల్లీ జగ్నమాత అని
మీరు మాట్లాడినప్పుడు ఉండే కోణం వేరు, కథా పరంగా ఆలోచించినప్పుడు ఉండే కోణం వేరు కాబట్టి
శ్రీరామాయణంలో అదో గమ్మత్తైన విషయం, ఒక ఆడది కొనసాగిస్తూ ఉంటుంది కథని. ఇక్కడ కూడా ఒక గమ్మత్తైన విషయం జరిగింది, నేను
నిన్న ఒక రాత్రి గురించి ప్రస్తావన చేస్తున్నాను మీతో... ఒక రాత్రి అంటే దశరథ
మహారాజుగారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామ చంద్ర మూర్తికి యౌవ్వరాజ్య పట్టాభిషేకం
చెయ్యాలి అని సంకల్పం చేసినటువంటి రోజు రాత్రి. దశరథుడికి ఉద్వేగంతో నడుస్తోంది
రాత్రి వరకూ... ఇంకా రాత్రి దశరథుడికి గడవలేదు నిన్న, ఎందుచేత అంటే ఆయన ఏదో తొట్రు
పాటు పడుతున్నాడు మనసులో సీతా రాములకు సంబంధించినంత వరకూ వాళ్ళు యధా శాస్త్రంగా
ఉపవాస దీక్షచేసి ఆ రాత్రి పూర్తిచేశారు. కౌసల్యా మాతకి సంబంధించినంత వరకూ సుమిత్రా
లక్ష్మణుల్ని, సీతమ్మనీ దగ్గర పెట్టుకునీ ఆవిడ దైవారాధనయందు ఆరాత్రి గడిపింది,
పౌరులూ, జానపదలూ అత్యంత ఉత్సాహంతో గడిపారు, దశరథ మహారాజు గారికి ఎలా గడిచింది ఆ
రాత్రి.
|
దశరథ మహారాజుగారికి
గడవలసిన రాత్రిని అప్పటి వరకూ రామాయణంలో అసలు ఏ ప్రాధాన్యతా లేనటువంటి ఒక పాత్రని
నిర్ణయించారు, దశరథ మహారాజుగారికేమీ రామాయణ కావ్యాన్నే ఆవిడ ఒక మలుపు తిప్పేసింది
అంతే... చాలా ఆశ్చర్యకరమైనటువంటి పాత్ర ఆవిడ పోషించింది, ఇందులో ఇలా పోషించడానికి
మహర్షి చాలా అందమైనటువంటి స్థితిలో కథని ఆవిష్కరిస్తారు నిజంగా... వాల్మీకి మహర్షి
రచనా అంటే ఎలా ఉంటుంది అంటే... మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలనంచేసి శ్లోకాలను
మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి వాతావరణంలో మీరు ఆ శ్రీరామాయణాన్ని చదువుకుంటుంటే...
మీకు యథాతథంగా జరిగినటువంటి రామాయణం మీ కళ్ళకి కనపడుతుంది. నేను యదార్థం
చెప్తున్నాను మీతో... మీరు కొంచెం ప్రశాంతంగా గాని చదవ గలిగితే... మీకు ఆ పాత్రలు
కళ్ళముందు కనపడుతాయి, కనపడ్డంలో ఏమౌతుందంటే... మీ ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి మీ
కన్నులవెంట నీరు కారిపోయి మీకు గ్రంధం కనపడదు. కనపడనప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో
నా కళ్ళంబడ నీళ్ళు కారుతుండడంలో నాకు పుస్తకం కనపడడంలేదు అనిపిస్తుంది మీకు అంత
ఉదాత్తంగా మీ కళ్ళ ముందు ఆ పాత్రలు కనపడేటట్టుగా అంతగా మీరు మమేకమైపోయి, మీరు
ధ్యానం చేస్తే ఎంత ఏకీకృతమైపోతారో... అలా శ్రీరామాయణ కావ్య పఠనమునందు మీకు ఆ
పాత్రలు దుర్గోచరమైయ్యేటట్టుగా... వాల్మీకి మహర్షి రచనచేశారు. నేను అందుకే మీతో
మనవి చేస్తుంటాను, రామాయణానికి పెద్ద చిలవలు పలవలు చేసికూడా ఏమీ చదవక్కరలేదు,
రామాయణాన్ని రామాయణంగా చదవండి చాలు, అది అమృత ఫలం, అలా చదువుకుంటే చాలు, రామ కథని
రామ కథగా మీరు చదివితే... మీకసలు ఎంత గొప్పగా వర్ణిస్తారు అంటే...
ఎన్ని
కక్ష్యలున్నాయి, ఎన్ని కక్ష్యలుదాటితే రథం అక్కడి వరకూ వెళ్ళుతూందీ, అంతఃపురం
ఎక్కడుంది, అంతఃపురంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పక్కన ఎవరున్నారు, అక్కడ వేసిన
ఆసనాలు ఎలా ఉన్నాయి, వచ్చినాయన ఏం చేశాడు, కూర్చోమన్నారా, కూర్చున్నాడా,
నిల్చున్నాడా, లేచాడా, మాట్లాడారా... తిన్నారా తినలేదా, తాగారా, పడుకున్నారా
స్పష్టంగా ఇది మీకు ఎలా ఉంటుందంటే... మీరు అలా చదువుతూ వెళ్ళుతూ ఉంటే... కానీ మీదృష్టిలో
మాత్రం ఏకాగ్రత ఉండాలి, మీరు చదువూతు వెళ్తూంటే... మీకు జరిగినటువంటి శ్రీరామాయణం
ఇప్పటికీ ఇక్కడ దర్శనమయ్యేటట్టుగా మహర్షి ఇచ్చారు. లోకంలో సాధరణంగా ఏమిటంటే...
ఏదైనా ఒక వస్తువు మీద ధ్యానం చెయ్యాలి అంటే... నేత్రములు మూతపడ్డ తరువాత మీకు
ధ్యాన నిష్టకలిగిన తరువాత అది మనః పలకం మీద దుర్గోచరమౌతుంది. శ్రీరామాయణం అలాగ
కాదు, కావ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే... సామాన్యులైనటువంటి వారికి కూడా... మీరు
దాన్ని తదేక నిష్టతో చదివితే... మీకు అసలు సమయమన్నదేం తెలియదు, మీకు శ్రీరామాయణం
అలా కళ్ళముందు జోతకమౌతుంటుంది.
|
నేనొక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణుడు ఏడు
రాత్రుళ్ళు, ఏడు పగళ్ళు తన చిటికెన వేళి మీద కొండ ఎత్తిపట్టుకున్నాడు, అని భాగవతం
చదివారు అనుకోండీ! నేనది తప్పని అనడంలేదు, నాకు భాగవతం అంటే పరమ భక్తి ఉంది. కానీ
సామాన్య పాఠకుడికి ఏమౌతుందంటే... అంతరార్థం తెలియనప్పుడు భక్తితో చదువుతారు నేను
కాదనటంలేదు, అలా పట్టుకుంటారా..? కృష్ణుడు కాబట్టి పట్టుకున్నాడుగానీ అలా
పట్టుకోవడం కుదురుతుందా... అలా కొండ ఎత్తి చిటికన వేలు మీద పెట్టుకుంటారా..! అని
ఒకటి ఉంటుంది లోపల. కాబట్టి అది మీరు అంత తేలికగా దర్శనం చేయలేరు, కొండ
చిటికెనవేలి మీద ఎత్తి పట్టుకోవడాన్ని మీ మనసెప్పుడూ చూడలేదు, కాబట్టి మీరు అలా
దర్శనం చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది.
శ్రీరామాయణం
అలాగకాదు, అందుకే ఇప్పటికీ శ్రీరామాయణంలో పాత్రలు సామెతలుగా లోకంలో బ్రతికున్నాయి,
ఈవిడెక్కడరా మంధరలాగా వచ్చి అగ్నిహోత్రం రగిల్చేసింది అంటారు. సూర్పణకలాగ ఓ ఎంత
అసూయో అంటారు. రావణాసురిడి కాష్టంలా రగులుతూనే ఉందంటారు. ఏంటి ఆ కుంభకర్ణుడిలా
నిద్ర అంటారు. విభీషణుడిలా ఇంటిగుట్టు రట్టు చేశారు అంటారు. రామ చంద్ర మూర్తిలా
వీడికి రెండు మాటలు లేవు వీడికి ఒక్కటే మాట, ఏమిటా లక్ష్మణ మూర్తిలా ఆ కోపమేమిటి
వీడికి, అబ్బా ఏమి ఓర్పు సీతమ్మ తల్లి అంటారు. రామాయణంలోని పాత్రలు
లోకజీవనంలోకివచ్చి ఇమిడిపోయాయి, కారణం ఏమిటంటే... ఆ పాత్రలు మీకు అర్థమై మనసు మీద
ముద్రవేయడానికి మీరేం పెద్ద సాధనేం చేయక్కరలేదు, చాలా సామాన్యంగా మీతో మమేకమౌతాయి
అటువంటి పాత్రలు.
|
కాబట్టి మహర్షి అంటారు జ్ఞాతి దాసీ యతో జాతా
కైకేయ్యా స్తు సహోషితా ! ప్రాసాదం చన్ద్ర సంకాశమ్ ఆరురోహ యదృచ్ఛయా !! ఆ మాటలలో
ఉంది అందం యదృచ్చయా ఈశ్వరుని సంకల్పముచేత మంధర చాలాచిన్న పాత్రండీ! ఒకదాసి
ఆమె ఆరోజున మేడ ఎక్కడమనేటటువంటిదే రామాయణానాన్ని మార్చింది, మేడ ఎందుకు ఎక్కింది?
ఏదో పనుండాలి కదా! రాత్రి మేడెక్కడానికి ఏదో పనుండాలి, అంటే మహర్షి అన్నారు యదృచ్ఛయా
ʻదైవము యొక్క నిర్ణయము చేతʼ అంటే ఇప్పుడు మంధర మేడ ఎక్కడమే రామాయణానికి
గొప్ప మలుపు తీసుకురాబోతూంది. ఇప్పుడు మంధరని మేడెక్కించింది అన్నమాట ఎందుకు
రావాలి, అంటే ఇప్పుడు మంధర గుండెల్లో ఏదో ఉంది, దాన్ని వేరొక పాత్ర ద్వారా
సాధిస్తుంది, సాధించినదానివలన మంధరపొందిన తృప్తి ఏమీ అని మీరు అడిగితే... చెప్పడం
చాలా కష్టంగా ఉంటుంది, అంటే మనుషుల యొక్క ప్రవృత్తి అలా ఉంటుంది.
అది ఎందుకు కోపం
అని మీరు అడిగారనుకోండీ... దానికేం కారణం ఉండదు కొంత మంది చూడండీ ఒకరంటే చాలా అభిమానం
ఉంటుంది, అందుకని రెండోవారి యొక్క సమర్ధతని అంగీకరించలేరు, ఇది తరచుగా
కనపడుతుంటుంది, ఎవరో నాకు ఫలానా ఆయన అంటే ఇష్టం, కాబట్టి రెండో ఆయన యొక్క ఉన్నతినీ
ఇది ప్రత్యేకించి నేను యువతరంలో నటీ నటీమణుల విషయంలోను, క్రికెట్ ప్లేయర్సలోనూ
నేను బాగాగమనిస్తాను, ఒక ఆట చూసేటప్పుడు ఆయన ఆటని ఆరోజు మీరు మెచ్చుకోగలిగి
ఉండాలి, ఈవ్వాళ ఆయన చాలాబాగా ఆడగలిగాడు, ఆ ఆటయందు ఉన్నటువంటి పరిణతిని మీరు
శ్లాగించగలగాలి మీరు అది ఆటచూడ్డం అంటే... ఆయన ఇంకో దేశంవాడా ఈ దేశంవాడా... ఆట
దేనికీ అంటే మనోరంజకత్వము కొరకూ అలా కాకుండా అదేవళ్ళనో ఒకళ్ళని ఆరాధిస్తారు, ఈ
ఆరాధన ఎలా ఉంటుందంటే ఆయన ఎప్పుడూ రెండు వందలు కొట్టేయ్యాలని అలా ఎలా
కొట్టేస్తాడండీ... ఆయనో 23 కొట్టేశరనుకోండీ ఈయన ఆరోజు అన్నంతినడు, ఇంకొకాయన
కొట్టాడు 150 ఈయ్యన శ్లాగించలేడు, చ్... ఈయన కొట్టింటే బాగుండేది అంటాడు,
అందేంటది, అలా ఎందుకు అని మీరు అడిగారనుకోండీ ఆయన దగ్గర ఏం స్పష్టమైన జవాబేం
ఉండదు.
అంటే ప్రవృత్తిలో
ఉన్నటువంటి దోషమన్నమాట, అంటే మనస్సు
దేన్నిసరిగ్గా అభినందించవలసి ఉంటుంది అన్నదానిమీద ఒకపరిపక్వతకు చేరుకునే స్థితికి
ఆ మనసు తగినటువంటి శిక్షణ ఇవ్వబడలేదు. మనసుకి శిక్షణ వేరొకరు ఇవ్వరు ఇది
బాగా గుర్తు పెట్టుకోండి. మనసుకు శిక్షణ మీకు మీరే ఇవ్వవలసి ఉంటుంది. మీ మనసుకు శిక్షణ మీరే ఇవ్వాలి,
మీ మనసుకి శిక్షణ ఇంకొకరు ఇవ్వడమన్నది ఎట్టి పరిస్థితిల్లో సాధ్యకాదు,
గురువుకైనా... ఎందుకంటే... గురువేం చేయగలడంటే... బోధ చేయగలడు అంతే...
తప్పించి మీ మనసుని ఆయనేం చేస్తాడు, గురువుగారు ఎదురుగుండా కూర్చొని
మీరు వేరొక మిషయం మీద
తాదాత్మకతతో ఉన్నారనుకోండీ...? గురువుగారు ఏమైనా చేస్తాడా..! ఆయన ఏమైనా చేయగలడా...
నీ మనసుని ఆయన తేలేడు, మీ మనసుని అక్కడ పెట్టడం
మీదే పూచి అంతే... అందుకే రామ కృష్ట పరమ హంస చాలా పెద్ద మాట ఒకటి అంటారు, అసలు
గోడకి కొంత గుల్లతనం ఉంటే మేకు దిగుతుంది, అసలు గోడే ఇనుప ఊచలా ఉంటే, మేకు
వంకరౌతుంది తప్పా అందులోకి మేకు ఎందుకు దిగుతుంది. కొంత మీ మనస్సులో ఆర్ధత ఉంటే..?
గురు వాక్యము శోభిస్తుంది, ఆర్ధత లేని మనసుకి గురువు బోధ చేసినా కూడా... దానివల్ల
పెద్ద ప్రయోజనం ఏమీ కలగదు.
|
కాబట్టి జ్ఞాతి
దాసీ యతో జాతా పుట్టినప్పటి నుంచీ కైకమ్మ దగ్గర దాసిగా ఉన్నటువంటి ఆ మంధర కైకేయ్యా
స్తు సహోషితా ప్రాసాదం చన్ద్ర సంకాశమ్ చంద్రుని యొక్క కాంతి ఎలా ఉంటుందో ఎంత
తెల్లగా ఉంటుందో అంత తెల్లని మేడని అధిరోహించి పైభాగమునకు వెళ్ళింది. వెళ్ళితే
అక్కడ ఆవిడకీ అయోధ్య నగరం అంతాకూడా మంచి ఉత్సవం జరుగుతున్నట్లు, ప్రజలందరూ
చాలాసంతోషంగా ఉన్నట్లు, ఎక్కడ చూసినా జనం నిలబడి ఉన్నట్లు, ఉన్నట్లు ఏమీ ఉన్నారు
కదా నిన్న చెప్పాము కదా...! అంత సంతోషంగా ఉండడాన్ని ఆవిడ గమనించింది ఇప్పుడు
ఆవిడకి తెలియలేదు, ఎందుకు సంతోషించింది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఈ విషయం
కైకకు కూడా తెలియదు. రామ పట్టాభిషేక వార్తా కైకకి కూడా ఇంకా తెలియదు చెప్పలేదు
దశరథుడు కైక దగ్గరికి రాలేదు, లేదా కైకేయి మందిరం కూడా హర్షంతో నిండుతుంది ఎందుకో
తెలుసాండీ... కైకకి రాముడంటే ఉండే సంతోషం అటువంటిది ఆయనంటే... ఉన్న సహృదయం
అటువంటిది.
అంటే దశరథుడు కైకకి చెప్పలేదు కదా ఇదే...
బలపడింది కథ నిలబడడానికి, కైకంటే అంత ఇష్టమున్న దశరథుడు నిజంగా కైకకి ముందు చెప్పి
ఉండి ఉండింటే... కైకా రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పింటే...
తప్పకుండా చెయ్యండీ అంటుందు కైకమ్మ, ఎందుకో తెలుసా మంధర మాట్లాడక ముందు కైక వేరు,
మంధర మాట్లాడిన తరువాత కైక వేరు. కాబట్టి దశరథుడు కైకకి చెప్పలేదు. దశరథుడు ఎందుకు
చెప్పలేదు అప్రీతి కారణమా.., ఆయనకి ప్రీతిలేకనా, కాదు చాలా ప్రీతి కైకమ్మ అంటే...
ఆయన కౌసల్యా మందిరానికి సుమిత్రా మందిరానికీ ఎక్కవ వెళ్ళడూ అని రామాయణం చదివితే
తెలుస్తుంది. ఆయనకి ఎంతభయం అంటే... కౌసల్య పరమ ప్రతివతయై ఏదైనా గొప్ప వ్రతంచేసి
ప్రభువుచేత అభినందింపబడవలసిన రీతిలో పట్టమహీషి కనుకా... ఆయన అభ్యున్నతి కొరకు
ఏదైనా వ్రతంచేసీ... ఆయనకు నమస్కరించి ఆశీర్వచనం కోసంవస్తే, నాకోసం నా అభ్యున్నతి
కోసం ఇంత గొప్ప వ్రతంచేశావా కౌసల్యా...! అని అభినందించలేడు, ఎందుకభినందించలేడో
తెలుసా..? కౌసల్యయందు ఆయనకి ఆ ప్రీతి ఉన్నా, అలా అభినందించాలని ఉన్నా... అలా తాను
అభినందిస్తే, కైకమ్మ ఏమైనా అనుకొని తనకి కొంచెం దూరమౌతుందేమోనని బెంగ అతనికి, అతనే
చెప్పుకున్నాడు కైకమ్మతో ఈ విషయం.
కాబట్టి కైక అంటే
చాలా ఇష్టం కౌసల్యకి చెప్పనివి కూడా కైకకి చెప్తాడు, కానీ కైకకి ఇది చెప్పలేదు,
చెప్పలేదు ఒక్కటే కారణం, కైకమ్మకి చెప్తే ఒకవేళ భరతుడికి రాజ్యం ఇమ్మంటుందేమో..?
భరతుడికి రాజ్యం ఇమ్మంటే... భయమేమిటండీ..! అలా ఎలా ఇస్తాను పెద్దవాడు రామ చంద్ర
మూర్తి ఉన్నాడు కదా! రాముడికిస్తానా భరతుడికి ఇస్తానా నీకు బుద్ధుందా అడగడానికి
అని తను అనగలిగి ఉండాలి, అంటే తన భయమేమిటీ కౌసల్యని వివాహం చేసుకున్నాడు సంతానం
కలగలేదు వృద్ధుడైపోయాడు, సుమిత్రని వివాహం చేసుకున్నాడు సంతానం కలగలేదు, మంచి
యవ్వనంలో ఉండి అనేక విద్యలు తెలిసున్నటువంటి కైకయందు వ్యామోహపడ్డాడు ఒకప్పుడు,
కేకయ రాజును అడిగాడు నాకు నీ పిల్లని ఇమ్మని అడిగాడు, నీవు బహువృద్దుడవు నా పిల్ల
యవ్వనంలో ఉంది ఈ పిల్లని నీకు ఇవ్వాలంటే నాకు ఒక అనురక్తి ఉండాలి కదా..! ఈ పిల్లకి
సంతానం కలిగితే పట్టాభిషేకం చేస్తావా? అని అడిగాడు కేకయ రాజు. అప్పటికి దశరథుని
మనస్తత్వం ఎలా ఉందో తెలుసాండీ! ఇది మనుష్యులకుంటేటటువంటి ప్రవృత్తి, ఛ్.. అది
జరుగ్గుద్దేమిట్లే ఇది కానియండీ అంటాడు. ఆఁ... ఇంత వయసు వచ్చింది కౌసల్యకు
పుట్టలేదు, ఇంత వయసు వచ్చిది సుమిత్రకు పుట్టలేదు, ఇప్పుడు కైకకు పుడితే
వాళ్ళిద్దరు వద్దంటారా..? పుట్టడం కదా ప్రధానం కొడుకు పుడితే ఇవ్వనా ఏమిటీ?
ఇస్తానూ... కాబట్టి కైకమ్మకి నిజంగా కొడుకే పుడుతే ఇంక అంతకన్నా కావలసింది ఏముంది?
తప్పకుండా ఇచ్చేస్తాను అన్నాడు.
|
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు జనకుడు రాకూడదు
అన్నాడు ఎందుకని, జనకుడు మహాజ్ఞాని, జనకుడు వచ్చాడనుకోండి తన అల్లుడా... ఇంకోడా
ఇదేం చూడడు ధర్మం చెప్తాడు, ఏమయ్యా నీవు వరం ఇచ్చిన తరువాత నీవు కైకేయి కొడుక్కి
ఇవ్వాలి గానీ, రాముడికి ఎలా ఇస్తావు భరతుడికిచేయి పట్టాభిషేకం అంటాడు. అందుకని
మాహాజ్ఞానియైనటువంటి జనకుడువస్తే... తీర్పు సక్రమంగా చెప్తాడు అందుకనీ జనకుడు
రావద్దు అన్నాడు, జనకుడికి చెప్పకండీ అన్నాడు. కేకయ రాజుకు చెప్పకండీ అన్నాడు
ఎందుకు చెప్పకూడదూ, కేకయ రాజువస్తే నీవునాకు వరమిచ్చావుగాదా అంటాడు, భరతుడు
రాకముందే అయిపోవాలి అన్నాడు, ఎందుకంటే భరతుడు వచ్చిన తరువాత యౌవరాజ్య పట్టాభిషేకం
అంటే ఈవార్త భరతుడి మేనమామకేమైనా తెలుస్తుందేమోనని, అందుకని భరతుడికి కూడా
తెలియకుండా అయిపోవాలి, మరి తెలియకుండా అయిపోతే తనది తప్పైపోలేదా... నేను తప్పు
చేయలేదు అనుపించుకోవడానికి సభా అమోదము పొందాడు, ప్రజలు కోరుకున్నారయ్యా రాముడు
రాజుకావాలని, నేను ఎవరిని కాదనడానికి ప్రజలు కోరుకున్నవాన్ని పెద్దవాన్ని కాబట్టి
ధర్మం చేశాను, రాజును చేశాను.
నేనేంచేయను
వాళ్ళుందరూ కోరుకున్నప్పుడు, నేను అడిగాను మీకు ఎందుకిష్టం రాముడంటేని అడిగాను,
వాళ్ళు ఒక్కకారణం చెప్పి ఈ ఒక్కటి ఇబ్బంది ఉందండీ రాముడితో అంటే తరువాత భరతుడి
గురించి చూసిండేవాడిని, అసలు ఎవ్వరూ అన్నవాడే లేడు అందరూ సుగుణాభి రాముడు అన్నారు.
రాముడే కావాలి అన్నారు అందుకని నిర్ణయం చేశాను అనిచెప్పి తప్పుకోవచ్చు
అనుకున్నాడు. కైకకీ ఇంత జాగ్రత్త తీసుకొని చెప్పనటువంటి దశరథుని యొక్క జాగ్రత్తా
మంధరకీ అవకాశమిచ్చి బెడిసికొట్టింది. ఇది యదృచ్ఛయా ఇది దైవం. దైవం
అనేటటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే...? మీరు చేసిన దోషం నుంచి ఎంత తప్పుకుందామని
ప్రయత్నించినా ఈశ్వరుడి కంటిలోంచి మాత్రం జారడం కుదరదు.
|
కాబట్టి ఇప్పుడు
చూడండీ ఆవిడ మేడ ఎక్కీ పక్కకి వచ్చి నిలబడినటువంటి దాది, ʻదాదిʼ అంటే పిల్లల్ని తల్లిలా పెంచేవాళ్ళని దాదులంటారు. అంతఃపురంలో సాధారణంగా
పట్టమహిషికి ఇతర కార్యక్రమాలు చాలా ఉంటాయి, అందుకని వాళ్ళు పూర్తిగా పిల్లల యొక్క
పోషణభారాన్నివహించరు, దాదులు వహిస్తారు. కాబట్టి దాదిని తల్లిపట్ల ఎంత ప్రేమ
ఉంటుందో... ఆ రాజ కుమారులకు ఆ దాదిపట్ల కూడా అంత ప్రేమా ఉంటుంది. అటువంటి దాది
ఒకామె అక్కడ నిలబడింది. రాముని పెంచిన దాది, ఇది ʻయదృచ్ఛయాʼ. ఆవిడ ఇక్కడకి ఎందుకు రావాలి? ప్రారబ్దం ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మేడ
మీద నుంచి చూసిన కుబ్జ కింద నున్న దాదిని అడిగింది ఏమని అడిగిందో తెలుసాండీ!
అడిగిన దానిని బట్టి మీకు తెలిసిపోతుంది.
ఎమండీ అంత గొప్పవాడయ్యాడేంటి ఆయనా!
అన్నారనుకోండీ ఆయన, మీరేం సంతోషించట్లేదు ఆయన గొప్పవారయ్యారని, మళ్లీ వేరే
చెప్పాలా..? ఎంత గొప్ప విశేషమండీ అసలు ఎవరూ ఊహించలేదు మహానుభావుడు ఎంత సాధనచేశాడండీ
ఇవ్వాల అంతలోక పూజితుడయ్యాడు అన్నారనుకోండీ మీరు అభినందిస్తున్నారని గుర్తు కదా!
మాటబట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వం తెలిసిపోతుంది. ఎలా ఉంది ఈ పట్టాభిషేకం పట్లా...
ఇప్పటి వరకూ మీరు యౌవ్వరాజ్య పట్టాభిషేకం రాముడికి సంకల్పం చెయ్యబడితే... దానిపట్ల
విముఖత కలిగినటువంటివారు ఉన్నారు అనడానికి మీకు ఒక్కరూ కనపడలేదు, తనని
సంప్రదించకుండా ముహూర్తం పెట్టినా వశిష్టుడు కూడా ఏమీ అనలేదు. అసలనడు ఆయన
బ్రహ్మజ్ఞాని ఆయనకేం పని. ఇప్పుడు మంధర ఎలా మాట్లాడుతుందో చూడండీ... అంటే మీకు
రామాయణం జీర్ణం అయిందనుకోండీ... ఒకమాట మాట్లాడిన వ్యక్తితో మీరు ఎంత సమాచారం ఇచ్చి
మాట్లాడవచ్చు అన్నది మీకు తెలిసిపోతుంది.
|
అది మీరు అయస్కాంత
ముక్క మీద ఇనుపముక్క పెట్టి తోమితే ఇనుపముక్క కొంతకానికి అయస్కాంతంముక్క
అయిపోయినట్లే శ్రీరామాయణాన్ని మీరు చదవగా చదవగా మీరువెళ్ళి రామపాత్రను పట్టుకోవడం
అలవాటైపోయిందనుకోండీ అన్నికోణాలనుంచీ కొన్నాళ్ళకు ఏమైపోతుందో తెలుసాండీ...? మీరు
ఏంచేస్తున్నా మీకు రాముడు జ్ఞాపకానికి వస్తుంటాడు, ఇలా రాముడిలా
చేద్దామనిపిస్తుంది అది జ్ఞాపకానికి వచ్చేస్తే ఏమౌతుందంటే, క్రమంగా రాముడైపోతారు.
నాకూ పేర్లుచెప్పడం ఇష్టం లేదుగానీ కొంత కొంత మంది పెద్దలు నాకు తెలుసు, అసలు ఏంచేస్తున్నా
శ్రీరామాయణాన్నే ఉటంకిస్తారు వాళ్ళు, శ్రీరామాయణాన్ని అసలు వారిజీవితంలో రామాయణం
అంతర్భాగం, రామాయణంలోంచి ఏదో ఒకటి చెప్పకుండా... రామాయణంలోంచి ఏదో ఒకటి
చూపించకుండా... మాట్లాడటం కుదరదు. ఎందుకంటే రామాయణం సప్తధాతువుల్లోకి
జీర్ణమైపోయిందన్నమాట రామాయణం అలా వెళ్ళిపోతుందన్నమాట అంటే వాళ్ళశరీరమే రామాయణంగా
మారిపోతుంది అంతగా ఉపాసన చేసినటువంటి స్థితినిపొందుతారు.
కాబట్టి ఇప్పుడు
ఆవిడ అందీ... ఉత్తమే నాఽభిసంయుక్తా హర్షేణాఽర్థ పరా సతీ ! రామ మాతా ధనం
కిం ను జనేభ్యః సంప్రయచ్ఛతి !! ఆవిడా ఈ ఉత్సవాన్ని చూసింది, చూసి రామున్ని పెంచిన దాదిని అడుగుతోంది, ఏమిటీ?
కౌసల్యా దేవి నివసిచేటటువంటి మందిరం దగ్గర హర్షం ఎక్కువ కనపడుతోంది? సహజం కదాండీ!
మరి ఆవిడ కొడుక్కికదా పట్టాభిషేకం, ఆవిడకి కౌసల్యా అన్నపేరు ఎత్తడం ఇష్టంలేదు. ఇలా
కొంతమంది ఉంటారు... వశిష్టుడి కొడుకులు అనడానికి ఇష్టం లేక వాసిష్ఠా ఇవ జాతిషు
అన్నాడు విశ్వామిత్రుడు ఒకప్పుడు బ్రహ్మర్షి కాకముందు. అలా ఆవిడందీ రామమాతా అని,
రాముడి తల్లి అని, కౌసల్యా అనదు ఆవిడనోటితో, ఎందుకు కౌసల్యా అంటే అంతకోపం, మంధరకి
కౌసల్యకీ ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏంలేవు, అప్పుడు ఇంకో కారణం ఏం ఉండాలి? ఎవరికి
తనుదాసియో ఆవిడకి కౌసల్యకీ ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమీలేవు మరి ఈవిడకెందుకు
కౌసల్యతో గొడవ ఉండాలి తెలియదు.
నేను ఇందాక మీతో
చెప్పానే... ఒకడు రెండు వందలు కొడితే అభినందించలేక పోవడమూ ఎప్పుడూ ఒకడే కొట్టాలని
అనుకొనే మనః ప్రవృత్తి అలాగే ఉంటుంది. అది మార్చుకోవాలీ అని గుర్తు ఈ బయాస్ ఈ
ప్రిజిడ్డీస్ ఈ అదేంటి un supportable attachment అది అర్థం పర్థం లేనటువంటి ఒకపిచ్చి ఆరాధనకి దారితీసేస్తుంది. కాబట్టి ఇప్పుడు
ఆవిడ ఏమందంటే... రామ మాతా..! అందునా ఎటువంటిదటా... అర్థ పరా సతీ డబ్బులయందు
పిచ్చి వ్యామోహమున్న రామమాతా... కౌలస్యకి డబ్బంటే పిచ్చుందీ అని ఆధారం ఒక్కటి
రామాయణంలో లేదు, ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బుంది. కౌసల్య దగ్గర డబ్బుంది, కౌసల్య
దగ్గర డబ్బుంటే మనమెందుకు బాధపడడడం, ఆవిడ మహారాజు భార్య పట్టమహిషి ఆవిడ దగ్గర ఉన్న
డబ్బు ఏం
చేసిందన్నది మీరు
ఆలోచించండి, ఆవిడ మూట కట్టలేదు. ఆవిడ బ్రాహ్మణులకు నిరంతరం దానం చేసింది. హోమం
చేసింది అగ్నిహోత్రం చేసింది. నువ్వు అభినందించడానికి నీకళ్ళ ముందు జరుగుతున్నది
చాలదా... నీకంటితో చూడనిది నీవు చూడనిది నీకు స్పష్టంగా తెలియనిదాని గురించి
నువ్వు వ్యక్తిని ఎందుకు అనవసరంగా హింసపెట్టి హింసజేస్తావ్? నీకంటికి
కనపడుతున్నదేదో ప్రత్యక్షంగా దానివల్ల నీవు వ్యక్తిని అభినందించలేవా..! ఇది
సంస్కారానికి సంబంధించిన విషయం.
|
ఇప్పుడు మంధర కౌసల్య చేసేటటువంటి దానాలు
తెలుసుకుంటే కౌసల్యని అభినందించచ్చు, కౌసల్య చేసేటటువంటి పూజలు తెలుసుకుంటే
కౌసల్యని అభినందించవచ్చు, కౌసల్య పట్టే వ్రతాలు తెలుసుకుంటే నోములు తెలుసుకుంటే
అభినందించవచ్చు ఆవిడ డబ్బు దాచేసుకుందనీ, డబ్బు ఎవ్వరికీ ఇవ్వదనీ ఇవ్వద్దనీ
అంటూందనీ రామాయణంలో ఎక్కడా లేదు, మరి ఈవిడ ఎలా అంది. కేవలం అసూయచేత అలా
మాట్లాడుతుంది. అంటే లోపల కౌసల్య అన్నపేరు కూడా ఎత్తదు. ఎందుకా అసూయా? యదృచ్ఛయా.
రామ కార్యము అవతార ప్రయోజనం నెరవేరాలి, రాముడు అడవులకు వెళ్ళాలి, కాబట్టి ఇప్పుడు
అసూయ తప్పా రామున్ని అడవులకు పంపగలిగినది లేదు. అంటే పంపడానికి రామునియందు దోషం
లేదు. ఏపాత్రా పంపలేదు, ఏపాత్ర పంపగలదు అసూయా గ్రస్తమైతే... వాళ్ళుచేసే పనులకు
అర్థముండదు కాబట్టి వాళ్ళు ఎంతైనా చేసైగలరు.
కంటికి ఎదురుగుండా
కత్తిపట్టుకు నిలబడగలిగిన వాళ్ళకన్నా కడుపులో అసూయ పెట్టుకున్నవాడు ఎప్పుడు ఏదిచేసి
ఎంతప్రమాదం తెచ్చుకుంటాడో నీవు ఊహించలేవు. కత్తిపట్టుకున్నవాడు నీకు తెలిసిపోతాడు
వాడుమహా అయితే నిన్ను కత్తిపెట్టి చేయిమీద కొడతాడు, కాలుమీద కొడతాడు. అసూయా గ్రస్తమైనవాడువాడు చేసేపని
నుంచి తప్పుకోవడం నీకసలు సాధ్యంకాదు మీకు దొరకదు రక్షణ. ఇది చిట్ట చివరకు నీవు ఏస్థితికి
వెళ్ళిపోతావో కూడా నీవు ఊహించలేవు అందుకే ఒకరు అసూయా గ్రస్తము అవుతున్నారూ అంటే
మీరు ఏం చెయ్యాలీ అన్నది మీకు తెలియదు బాగా గుర్తు పెట్టుకోండి, బాగా గుర్తుపెట్టకోండి
ఈ విషయాన్ని.
మీరు బాగాగమనించండి
నేను అన్నమాటని, నామీద మీరు వైరం పెంచుకొని కర్రపట్టుకుని చాటుని నిల్చుంటున్నారు
నేను చీకట్లో వెళ్తున్నప్పుడు కొడదామని అనినాకు తెలిసుందనుకోండీ... నేను మీకు
కబురుచేసి నీకు ఎందుకు నామీద కోపం వచ్చింది, నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడానా...
మీగురించి ఒకవేళ నామాట ఏదైనా మీమ్మల్ని బాధించిందా... నన్ను మన్నించండి తప్పా మీరు
నామీద వైరంపెంచుకోకండి అంటే ఆయన ఏదో నీవు ఇది చేశావు అన్నాడనుకోండి ఆ నిజమే...
నేను తప్పు చేశాను మిమ్మల్ని నేను ఖేదపెట్టాను నన్ను క్షమించండి అని మీరు ఒకమాట అన్నారనుకోండి
ఆయన కర్ర అవతల పాడేస్తాడు అసూయ పెంచుకుంటున్నాడని మీకు ఎలా తెలుస్తుంది మీకు
తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే మీ పక్కనే ఉంటాడు అన్నీ చూస్తుంటాడు, ఎప్పుడు వీడు
పడిపోతాడా అని కోరుతుంటాడు. ఎలాగ మీరు అసూయ ఉన్నవాన్ని ఎలా దిద్దుతారు మీరు
చెప్పండీ అందుకే అసూయ
ఉన్నవాడు వాడువాన్ని దిద్దుకోవాలి తప్పా వాడు ఎవరిమీద అసూయ పెంచుకున్నాడో
వాడుదిద్దే అవకాశం ఉంటుందని చెప్పడం కష్టం. అంటే ఇప్పుడు దశరథుడు అందరి రక్షణ చూసేవాడు
తనరక్షణ చూసుకోగలిగిన స్థితిలోలేడు ప్రభువు, అంత గొప్పగా వస్తుంది ఉపద్రవము.
|
కాబట్టి దాది ఉన్నమాట చెప్పింది. రాముడికి
యౌవ్వరాజ్య పట్టాభిషేకం అందుకని లోకమంతా చాలా సంతోషం అని అంతే... ఆవిడ గబగభా
కిందకి దిగివచ్చేసింది. ఎక్కడికి వెళ్ళింది, కైకమ్మ మందిరంలోకి వెళ్ళింది, కైకమ్మ
ఏం చేస్తుంది చాలా హాయిగా ఉంది, అంటే అకర్ధమమిదం అంటారే వాల్మీకి మహర్షి
అలా బురదలేని నదీ నీళ్ళెలా ఉంటాయో నదీ జలాలు అలా ప్రసన్నమైన మనస్సుతో చక్కగా ఒక్క
తల్పం మీద పడుకుని ఉంది హాయిగా... ఇప్పుడు ఈదాసి లోపలికివెళ్ళింది. ఆమెదాసి మీరు
గుర్తుపెట్టుకోండి, ఆమిడేమందో తెలుసాండీ! ఉత్తిష్ఠ మూఢే కిం శేషే భయం త్వామ్
అభివర్తతే ! మూఢే మూఢా అని పిలిచింది. మూఢే ఓ మూఢురాలా! పడుకున్నావా ఉత్తిష్ఠ
లే... అవతల ఎంత భయమొచ్చి మీదపడిపోతుందో తెలుసా..? ఉపద్రవం వచ్చేస్తుంది, ఇక నువ్వు
నేను ఇలా ఉండే పరిస్థితి లేదు, హడిలిపోవలసిన స్థితి వస్తూంది, పడుకున్నావా
మూఢురాలా లే..? వెంటనే మీరు ఆలోచించండి, నేను అన్నది ఇదే...! మహర్షి సర్టిఫికెట్లు
ఇవ్వరు, ఇలా అనచ్చా మంధర ఆయనేం అనరు, ఆయనొక సత్యం రాసి వదిలేస్తాడు, ఒక దాసి
కైకేయిని ఇలా అంది. దాసికి ఓ పరిమితి ఉంటుంది లోకంలో దేనికైనా ఒక పరిమితి ఉంటుంది.
పటకారని మీరే
పట్టుకోవాలి ఎప్పుడూ, పటకార మిమ్మల్ని పట్టుకోకూడదు అంతే లోకంలో కదా... ఎప్పుడూ
మీరే పట్టుకోవడం ఏంటండీ, ఓసారి నేను పట్టుకుంటాను మిమ్మల్ని అందనుకోండీ పటకార చాలా
ప్రమాదం వస్తుంది కదా, పటకారని ఎప్పుడూ మీరేపట్టుకోవాలి అంతేకాని దానిపరిమితి
అంతే... అదేమిటండీ మేం చాలా కాలం నుంచి చూస్తున్నాం, పటకారని మనుషులే
పట్టుకుంటారు. ఇక నుంచి పటకారలు మనిషులని పట్టుకోవాలని పటకారలన్నీ విప్లవంచేస్తే
పటకారని అవతల పాడేస్తారు అంతే... తప్పా మీరు వాడరిక కదా! ఎందుకంటే ఆవస్తువు మీకు
ప్రయోజనం చేకూరాలి అంటే ఆ వస్తువు ఆ పరిమితిలోనే వాడాలి తప్పా... అంతకన్నా
వాడ్డానికి వీల్లేదు. ఇప్పుడూ నేను మాట్లాడుతుంటే ఒక స్థాయిలో గట్టిగా చేసి
గట్టిగా మాట్లాడటానికి ప్రయత్నిస్తోందంటే ఈ మైకు చాలా బాగుంది ఎంత ఉపకారం
చేస్తున్నావే మైకా అని నేను దీన్ని ఇలాగే పట్టుకొని ఇంక ఇంట్లోనూ నాకిచ్చిన
విడిదిలోనూ దీంట్లోనే మాట్లాడనుకోండీ నన్ను పిచ్చాడు అంటారా అనరా... దీని పరిమితి
ఏమిటంటే... ఇది ఇక్కడే
తప్పా నేను దీన్ని ఇంటికి పట్టుకెళ్ళను ఏది ఎక్కడ వరకో అక్కడ వరకు, అది అక్కడ వరకు
లేకుండా దాటిందీ అంటే ఎవడు దాన్ని వాడుకుంటున్నాడో... ఆ వాడుకుంటున్నవాడికి ఎక్కడ
వరకు వాడుకోవాలో తెలియనివాడని గుర్తు కదా...
|
ఒక దాసి మహారాజు యొక్క భార్య ప్రియపత్ని
ఆవిడ్నివచ్చీ మూఢే - ఉత్తిష్ఠ అనగలిగిందంటే... ఎంత చనువు ఇచ్చేసిందో చూడండి
కైక, హద్దుమీరినటువంటి చనువు తన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోగలిగిన చనువు,
ఇంటిపనిమనుషులకు ఎవరిచ్చినా అలాగే ఉంటుంది నాకేమీ అందులో అభ్యంతరమేమీ లేదు నేను ఈ
మాట చెప్తున్నానంటే, మీ ఇంటపని చేసినటువంటివాళ్ళని మీ బిడ్డల్లా ప్రేమించు, నేను
కాదనను నేనూ ప్రేమిస్తాను. నేను నా ఇంటపని చేసేటటువంటి దాసిని నా స్వంత కూతురులా
చూస్తాను. నేను ఎప్పుడైనా రుక్మిణీ కల్యాణం చేయిస్తే నేను చేసే మొదటిపని
ఏమిటంటే... నా ఇంట్లో పనిచేసేటటువంటి దాసికీ మా ఆవిడతోటి మా ఇంట్లో ఆవిడకి అభ్యంగన
స్నానం చేయించి, బట్టలుకొని దానికా ఆ కొత్త బట్టలు కట్టించి సెలవిచ్చీ నేను ఉపన్యాసానికి
వెళ్ళేటప్పుడు కారులో నా భార్య పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్ళి రుక్మిణీ కళ్యాణంలో
కూర్చోబెట్టాను, గోపాల కిష్ణగారికి తెలుసు. ఒక్కటే కారణం నా కడుపున పుట్టిన
కూతురుకి యోగ్యుడైన వరుడొచ్చి దానిజీవితం ఎలా శోభిల్లాల్లో నా ఇంట పనిచేసినటువంటి
దాసి జీవితం కూడా అలాగే వర్ధిల్లాలి అంత వరకూ ఉంచండి చాలు. తప్పా నీవు నా
కూతుర్లాంటిదానివన్న ప్రేమ కడుపులో ఉంటే చాలు దానికి తెలియదు ఇంకా దానికి ఆ
పరిణితిలేదు. పరిణితిలేని దాని దగ్గర నీవు చనువు ఎక్కువిస్తే... అది రేపు నీ భార్య
గురించి తెలియక ఏదైనా మాట్లాడితే ఇబ్బంది వస్తుంది.
కాబట్టి వస్తువుని
ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి, తప్పించి నీవు ప్రేమించు తప్పులేదు బిడ్డలైనా అంతే. నీ బిడ్డల్ని నీవు ప్రేమించు అంతే, మనసులో
శ్లాగించవద్దు నీ బిడ్డల దగ్గర శ్లాగించవద్దు, అది నేనొక దాసి గురించే మాట్లాడుట
లేదు బిడ్డలైనా భార్యయమైన భర్తయైన గురువున్నారు గురువు గారిదగ్గర నీవు
మాట్లాడొద్దు గురువుగారిని మాట్లాడనీ నీవు విను ఎందుకంటే నీవు గురువుగారి దగ్గరికి
వెడితే నీవు మాట్లాడటం ఏమిటీ? ఇంకెందుకు గురువుగారి దగ్గరికి వెళ్ళడం. గురువుగారి
దగ్గర గురువుగారు మాట్లాడాలి నీవువినాలి, కాబట్టి ఎంత మాట్లాడాలో అంతవరకే
గురువుగారి దగ్గర మాట్లాడటం అంటే... కాబట్టీ ఇదీ ఈ పరిమితి తెలియకపోతే ప్రమాదం
వచ్చితీరుతుంది.
ఏదీ మీరు లోకంలో
చూస్తూంటారు సాధారణంగా ఎప్పుడైనా ఇంకా కొత్తగా కనెక్షన్ ఇద్దామనిచెప్పి కొత్తగా
ఇల్లు కట్టుకున్నప్పుడు పాజిటివ్ నెగిటిమ్ ఉన్న ఓ రెండు వైర్లు అలా వదిలేస్తారు.
మీరు అలా వదిలేస్తారా ఆ వైర్లనీ వాటికి టేపు చుట్టి వదిలేస్తారు. ఎందుకో ఏమో ఏ
బూజును దులుపుకుంటున్నప్పుడో ఎప్పుడో అది మీకే తగలచ్చు అది, లెదా ఏ పిల్లలో
దాక్కునే ఆట ఆడుతూ దానిమీద పాకుతూ ఏ తలకో తలగలచ్చు ఆ వైరు, దానికి టేపు
చుట్టేస్తారు. మీకో మనమడు పుట్టాడు ఇంట్లో ప్లగ్ పాయింట్ని మూసేస్తారు. వాడు
సన్నటి వేళ్ళు అందులో పెట్టేస్తాడు తీసుకెళ్ళి, పరిమితి ఉందాలేదా జాగ్రత్త
తీసుకున్నారా లేదా? జాగ్రత్తన్నది ఉండాలి జీవితంలో... ఈ పరాకు లేకపోతే ఏమైపోతుందో
తెలుసాండీ తరువాత మీరు బాధ
పడుతారు. అప్పుడు వైషమ్యాలు
పెంచుకొని శత్రుత్వాలు పెంచుకొని ఎందుకుండాలి, నీ ఔనత్యాన్ని సేవకుడు గమనించాలి,
సేవకుడి యొక్క అభ్యున్నతిని మీరు కోరి ప్రవర్తించాలి అంతే. అంతే తప్పా అతి చనువు ప్రమాద కరం చాలా
విషయాలలో.
|
కాబట్టీ ఉత్తిష్ఠ మూఢే కిం శేషే భయం త్వామ్
అభివర్తతే అని అనిష్టే సుభగాకారే సౌభాగ్నేన వికత్థసే ! చలం హి తవ సౌభాగ్యం
నద్యః స్రోత ఇవోష్ణగే !! ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి అది చెప్పేటప్పుడు,
నది ప్రవహిస్తుంది గ్రీష్మ ఋతువు వస్తుంది, గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు నదీ జలములు
కనపడవు ఆవిరైపోతాయి, నది వెళ్ళింది అని మీకు ఏమిటండి అంటే అది గోదావరండీ అంటాం.
అప్పుడూ గోదావరీ అనే అంటాం మరి నీళ్ళేవండీ అంటే ఇప్పుడు లేవండీ అంటాం, మరి
ఎప్పుడుంటాయండీ అంటే వర్షాకాలంలో ఉంటాయి అంటాం, మరి ఇప్పుడెందుకు లేదాండీ
గోదావరిలో నీళ్ళు అంటే... ఎందుకుండవు అంటే గ్రీష్మ ఋతువు కదాండీ అంటారు
నీళ్ళెక్కడుంటాయి ఆవిరైపోయాయి, నీ సౌభాగ్యం అలా అయిపోతుంది అంటారు. ఇది ఉలిక్కి
పడతారా పడరా ఎవరైనా..? ఎలా మాట్లాడిందో చూడండి మంధర ఇది ఆవిడ చాకచక్యము అంటే.
ఇన్నాళ్లు ఉలికిపాటుతో ఉన్నావు సంతోషంగా నా అంత గొప్పదెక్కడుందీ నా భర్త నన్ను
ప్రేమిస్తాడన్నావ్ అనిష్టే సుభగాకారే చాలా అందమైన దానా... సౌభాగ్యేన
వికత్థసే చలం హి తవ సౌభాగ్యం నీ సౌభాగ్యం నీ సుఖం నీ సంతోషం కదిలిపోతున్నాయి
వెళ్ళిపోతున్నాయి, గ్రీష్మ ఋతువులోని నదిలా అయిపోతావు నీవు.
ఉలిక్కిపడింది
ఎందుకు అలా మాట్లాడుతున్నావు నీవు, ఏం జరిగిందసలు అంటే అక్షేమం సుమహత్ దేవి
ప్రవృత్తం త్వ ద్వినాశనమ్ ! రామం దశరథో రాజా యౌవ రాజ్యేఽభిషేక్ష్యతి !! ఈ ఇంత గొప్ప విశాలవంతమైనటువంటి ఈసామ్రాజ్యాన్ని
నీ వినాశనమునుకోరి రాముడికి యౌవ్వ రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు అనలేదు మీరు
బాగాగుర్తుపెట్టుకోవాలి, రాజ్యానికి యువ రాజు కావాలి కాబట్టి చేస్తున్నాడు అని
అనలేదు, పెద్ద కొడుకు కాబట్టి చేస్తున్నాడు అనలేదు, దశరథుడు వృద్దుడైపోయాడు
కాబట్టి అనలేదు, ఇన్ని కారణాలు ఉన్నాయి యౌవ్వ రాజ్య పట్టాభిషేకానికి కానీ ఆవిడ ఇవన్నీ
అనలేదు, నీ నాశనాన్ని కోరేచేస్తున్నాడు. అంటే ఇప్పుడు అలా ఏం జరిగింది అన్న
అనుమానం ఉత్కంఠ, మనసు కదిలిపోవడం అన్నది వచ్చేస్తుంది కదా విషపు బీజం పడిపోయింది,
ఏం జరిగింది? రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు ఆవిడ ఆపలేరు, ఆవిడ యొక్క ఆ వాక్
ధారనీ ఆపకుండా అంది ధర్మ వాదీ శఠో భర్తా శ్లక్ష్ణ వాదీ చ దారుణః ! శుద్ధ భావే
జానీషే తే నైవమ్ అతి సంధితా !! ఈ ముందు శ్లోకాలు చెప్ప కుండా ఈ శ్లోకాన్ని
ముందు చెప్పినా, ముందు శ్లోకాలు చెప్పి ఈ శ్లోకం చెప్పినా... పిరిణితి కలిగినదైతే
కైకమ్మ ఈ ఒక్క శ్లోకం చాలు మంధర తలకాయ తన కత్తితో కోయవచ్చు, ఎందుకంటే కైకమ్మ
చంపేస్తే హత్యానేరమేమీ ఉండదు, మహారాణి తన ఎదురుగుండా... రాజ ధిక్కారం రాజును
నిందించి మాట్లాడుతుంది.
ఎలా మాట్లాడిందో తెలుసాండీ...
దశరథుని గురించి బహుషహ ఇంత ఆరోపణ పరిపాలనలో ఉన్నటువంటి అఖండ సామ్రాంజ్యమైనటువంటి కొశలాధీసుడైనటువంటి
దశరథ చక్రవర్తి గురించి అనడం అంటే..? దానికి ధైర్యం ఉండాలి, అందునా ఎవరితో
మాట్లడుతుంది మహారాణితో మాట్లాడుతుంది. ఆవిడ ఎంత తెగించి మాట్లాడుతోందో ఆవిడ మాటకి
హద్దు ఆపు లేనితనం ఎంతుందో ఇవ్వాళ బయటికి వస్తుంది ధర్మ వాదీ శఠో భర్త ధర్మం
మాట్లాడుతాడు నీ భర్త, కానీ నీదగ్గర ధర్మం మాట్లాడుతాడు ఎందుకు మాట్లాడుతాడో
తెలుసా? నాభర్త ధర్మాత్ముడు అని నీకో నమ్మకం కలిగి నీవు ఏమరుపాటు చెందుతావు, నీవు
ఏమరపాటు చెందాకా... నిన్ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ధర్మ వాదీ శఠో
భర్తా లోకానికి కాదు, మీరు ఈమాట గుర్తుపట్టాలి, లోకానికి కాదు దశరథుడు ఇలా...
నీ దగ్గరే... నీ దగ్గరే నీ యందు చాలా ప్రేమ కలిగినవాడిలా మాట్లాడుతాడు,
కానీ నీకే అపకారం చెయ్యాలి
అంటే నిన్ను నమ్మించాలి, అందుకని నీతో ధర్మవాదిలా మాట్లాడుతున్నాడు, శక్ష్ణ
వాదీ చ దారుణః చాలా వృదువుగా మాట్లాడేవాడిలా మాట్లాడుతాడు నీదగ్గర, కాని లోపల
మాత్రం చాలా
దారుణమైనటువంటి సంకల్పం
ఒకటి చేశాడు, కాబట్టి ఇదీ శుద్ధ భావే న జానీషే తే నైవమ్ అతి సంధితా అట్టివాన్ని,
పిచ్చిదానివి నీకేం తెలుసు నీవు అమాయకురాలివి, నీకేం తెలియదు, నీవు చాలా
అమాయకరాలివి, పరిశుద్ధమైనటువంటి హృదయం చాలా నిర్మలమైనటువంటి మనస్సు, ఆ కారణంచేత
నివ్వేంచేస్తున్నావంటే... వెర్రి తల్లీ ఆ దశరథున్ని నమ్మేస్తున్నావు.
|
|
ఇప్పుడు ఎక్కడ
పెట్టింది తీసుకొచ్చి కలహం భార్యా భర్తల మధ్యకు తీసుకొస్తుంది చిచ్చు ఒక రాజుకి ఒక
రాణికి మధ్యలోకి తీసుకోస్తుంది, ఇది చెయ్యోచ్చా... ఎట్టి పరిస్థితుల్లో ఒక భార్యకీ భర్తకి మధ్య అవగాహనలో
ఇబ్బంది వచ్చేట్టు, వాళ్ళిద్దరూ దెబ్బలాడకోవడానికి కారణంగా నీవు నిలబడడం కన్నా...
నీకు ఎంత అమర్యాద జరిగినా నీవు రాజీపడిపోవడమే గొప్పది, తప్పా నీవలన ఒక భార్యకీ
భర్తకీ మధ్య మాత్రం తగువు రావడానికి వీల్లేదు, ధర్మమంటే ధర్మమే... లోకంలో
అత్యంత గొప్ప ధర్మం ఏమిటో తెలుసాండీ! ఏ భార్యా భర్త నలుగుడు రావడానికి మనం కారణం
కాకూడదు, భార్య దగ్గర భర్తని తక్కువ చేసిగాని, భర్త దగ్గర భార్యని తక్కువ చేసిగానీ
ఎన్నడూ మాట్లాడ కూడదు. అంతకన్నా ఒకవేళ వాళ్ళు నీ యెడల అపచారము చేసినవాళ్ళైనా ఆ
అధర్మం ఇలా నావల్ల వాళ్ళు ఇద్దరిమధ్యా అభిప్రాయభేదం వస్తుందీ అని అనుమానం వస్తే...
నీకు జరిగిన అవమానాన్ని నీలో నీవు జీర్ణంచేసేసుకుని రాజీపడిపోయి వాళ్ళిద్దరూ
సుఖంగా ఉండడాన్నికోరాలి తప్పా... నీవు మాత్రం నీకు జరిగిన ఖేదం తీరడానికి
వాళ్ళిద్దరు దెబ్బలాడుకొనే పరిస్థితి మాత్రం కల్పించవద్దు అంతే ధర్మం.
రామాయణం అంటే
రామాయణమే... మీకు ఆ ధర్మం తెలిస్తే నీవు అలా మాట్లాడుతావు, నీవు ఆధర్మం
తెలిసినప్పుడు నీవు అనుష్టించనప్పుడు నీవు రామాయణం చెప్పడం అనవసరం రామాయణం
చదువుకోవడం అనవసరం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈపని చేస్తుంది, నీ భర్త ఇటువంటివాడు,
ఇప్పుడు ఆవిడకు సాక్ష్యం కావాలిగా... ఈమాటచెప్తే సరిపోతుందా ఇలా అంటే అంటూ అందీ...
అపవాహ్య స దుష్టాత్మా భరతం తవ బన్ధుషు ! కాల్యే స్థాపయితా రామం రాజ్యే నిహత
కంటకే !! ఎంత ధారుణమైన మాట అందంటే... దుష్టాత్ముడై నీ భర్త ఆవిడ ఎదురుగుండానే
తిడుతూంది భర్తని, అయినా కైకమ్మ ఏమాధారం ఉందని అడగట్లేదు, అంటే అంత అతిచనువు
ఇచ్చేసింది మంధరకి ఎంత ప్రమాదం వచ్చేసిందో చూడండీ..? ఆవిడకు పరిణతిలేదు అని తెలిసికూడా...
ఇంత చనువు ఇవ్వడం ఎంతప్రమాదం వచ్చిందో చూడండి. నీ భర్త దుష్టాత్ముడు, అదునుచూసి
అవకాశంకోసమే పెద్ద కుట్రచేశాడు, నీ కొడుకుని మాత్రం మేనమామ ఇంటికిపంపాడు, మేనమామ
ఇంట్లోవున్న నీకొడుకు రాకపూర్వం రామునికి పట్టాభిషేకం సంకల్పంచేశాడు, సంకల్పంచేసి
రాముడికి యౌవ్వరాజ్య పట్టాభిషేకం చేసేస్తాను అనిచెప్పీ అసత్యవాదీ, పాపచింతన
కలిగినటువంటివాడు, నిన్ను దుఃఖానికి గురిచెయ్యాలానుకుంటున్నవాడూ, అటువంటివాడు
రాముడికి యౌవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు, నువ్వో పిచ్చిదానివి పామూ అని
తెలియనటువంటి వ్యక్తి ఎంత నాజూగ్గా ఉందో, ఎంత బాగుందో, ఎంత మెత్తగా ఉందో.. అని
త్రాచు పాముని తీసుకొని ఒడిలోపెట్టుకుంటే... అయ్యో పాపం నన్నేంచెయ్యడానికి కాదూ,
నాపట్ల మృదుస్వభావంతో పెట్టుకుంది అనికూడా చూడకుండా, ఒంటిమీద కాట్లువేసే
త్రాచుపాములా... నువ్వు నీ ఒడి చేర్చుకున్నటువంటి దశరథుడు నిన్ను కాట్లు వేయబోతున్నాడు
నీ నాశనాన్ని కోరుతున్నాడుగుర్తించు.
|
ఆభరణం తీసిచ్చిన కైకమ్మంది ఎంత ప్రియమైనవార్త
చెప్పావే మంధరా...! నీ జీవితంలో నీవు బ్రతి ఉండగా ఇటువంటి శుభవార్త ఇంకొకసారి
ఇంకొకటి తత్యుల్యమైన శుభవార్త నాకు చెప్పలేదు, రామాభిషేకంకన్నా ప్రియమైన శుభవార్త
నా జీవితంలో ఇంకొకటి లేదు, కాబట్టి నేను ఉన్న పలంగా విన్నాను కాబట్టి నేను ఇది
నీకు ఇచ్చేస్తున్నాను, కాదు ఇదొక్కటే ఇచ్చాననుకుంటున్నావా? ఇంత గొప్ప వార్త
చెప్తితే, ఏ వరం కావాలో కోరుకో ఇచ్చేస్తాను. ఆ ఇచ్చిన ఆభరణాన్ని పక్కన పారేసింది,
పక్కన పారేసి మూర్ఖురాలా! నీకసలు బుద్ధుందా..? బాలిసే చంటిపిల్లల్లా
మూర్ఖురాలివై, ఏవిషయానికి దుఃఖించాలో ఆ విషయానికి సంతోషిస్తావా..? ఎవరికి
పట్టాభిషేకమో తెలుసా..! రాముడికి పట్టాభిషేకం, ఎందుకు పట్టాభిషేకమో తెలుసా? పక్కన
లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి, అదేమిటంటావా? సుమిత్ర కొడుకుల్లో ఒక కొడుకు
లక్ష్మణుడు రాముని పక్కన ఉంటాడు, రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కాని ఒక హృదయంలా
ఉంటారు. ఆ సుమిత్ర యొక్క ఇంకొక కొడుకు శత్రుఘ్నడు భరతుని పక్కన ఉంటాడు, ఆ శత్రుఘ్నడు
ఇక్కడ ఉంటే..? ఇక్కడ ఉన్నటువంటి శత్రుఘ్నడు భరతునికి వ్యతిరేకంగా భరతుడికి జరగరాని
యౌవ్వరాజ పట్టాభిషేకం రాముడికి చేస్తే... అడ్డుకుంటాడేమోననీ, భరతుడి మేనమామ ఇంటికి
శత్రుఘ్నన్ని కూడా పంపించాడు నీ భర్త. పంపించి ఇది ఎప్పుడో ఆలోచన చేశారు ఇద్దరూ
కలిసి ఎవరెవరు?, నీ వెర్రితనం మీ ఆయన నీమాట వింటాడనుకుంటున్నావు, కౌసల్యా దశరథుడు
కలిసి ఎప్పుడో కుట్రపన్నారు, నీకెందుకు రాముడికి పట్టాభిషేకం చేస్తానూ, భరత శత్రుఘ్నల్ని
మేనమామ ఇంటికి పంపించేస్తాను, కబురందనంత దూరం వెళ్ళిపోతారు. లక్ష్మణున్ని ఇక్కడ
ఉంచుతాను రామునికి సహాయుకుడిగా ఉంటాడు, రామున్ని రక్షిస్తాడు, ఎవ్వరికీ తెలియకుండా
పట్టాభిషేకం ముహూర్తం పెట్టి చేసేస్తాను అని చెప్పాడు.
కాబట్టీ ఇప్పుడు
రామునికి అందుకు పట్టాభిషేకం చేస్తున్నాడు, అంటే కైకమ్మందీ, అవుని నిజమే రాముడంటే
లక్ష్మణునికి ఇష్టం, భరతుడంటే శత్రుఘ్నడికి ఇష్టం, ఇష్టం కాబట్టి వెళ్ళాడు శత్రుఘ్నడు
భరతుని తోటి, నీవెందుకు అంత నాలుకు పీక్కుంటావు దానికి మంధరా! రాముడంటే ఎవరో
తెలుసా? రాముడికి పట్టాభిషేకం చేస్తే భరతునికి బాధేమిటే..? రాముడంటే ఎవరో తెలుసా?
నాకు తెలుసు, చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేశానే... రామున్ని
|
భ్రాతృన్ భృత్యాం శ్చ దీర్ఘాయుః పితృవత్
పాలయిష్యతి ! సంతప్యసే కథం కుబ్జే శ్రుత్వా రామాఽభిషేకనమ్ !!
భరత శ్చాపి రామ స్య ధ్రువం వర్ష శతాత్ పరమ్ ! పితృపైతామహం రాజ్యమ్ అవాప్స్యతి
నరర్షభః !!
అంత బాధ పడిపోతావెందుకే? రాముడు అంటే ఎవరో
తెలుసా... ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, గురువుల యెడలా, పెద్దల యెడలా, అత్యంత వినయం
కలిగినటువంటివాడు, సత్యవాక్ సత్యవాన్, ఎప్పుడూ సత్యవాక్కు కలిగినటువంటివాడు,
ఆంతరమునందు బాహ్యమునందు సౌచమున్నవాడు, అటువంటి రాముడు జేష్టుడు కనుకా...
యవ్వరాజ్యాభిషేకం పొందాలి, అతను యౌవ్వరాజ్యాభిషేకం పొందితే... నేను ఎంత
సంతోషిస్తున్నానో తెలుసా? మంధరా! పైగా, ఒకరోజు రెండురోజులు కాదే..? నిండు నూరేళ్ళు
నా రాముడు రాజ్యం చెయ్యాలి, నిండు నూరేళ్ళు నా రాముడు రాజ్యం చేసిన తరువాత
తమ్ముడైన భరతుడు రాజ్యం చేస్తాడు, వృద్ధుడైన దశరథుడు అది చూసి పొంగిపోవాలి? నా
కొడుకికి పట్టాభిషేకం జరిగితే... కాబట్టీ నీవు ఎందుకంత భయపడిపోతావు? నీకు ఇంకొక
విషయం చెప్పనా? అసలు నీవు కౌసల్య కొడుకుని రాముడు అంటున్నావు? కౌసల్య కొడుకు
రాముడని నీవు అంటున్నావు కానీ, రాముని దృష్టిలో నాకూ కౌసల్యకు బేధంలేదు, కౌసల్యని
ఎలా చూస్తాడో నన్ను అలానే చూస్తాడే... రాముడూ? యధా మే భరతో మాన్య స్తథా భూయోఽపి రాఘవః ! కౌసల్యా తోఽతిరిక్తం చ స తు శుశ్రూషతే
హి మామ్ !! చూడ్డం కాదు, లోపల ప్రేమ ఉంటే అది లోపల పట్టక
పైకి పొంగి ప్రవహిస్తే శుశ్రూష రూపాన్ని పొందుతుంది, ఆ ప్రేమ శుశ్రూషగా మారుతుంది,
కాబట్టి ఇంత ప్రేమ కలిగినటువంటివాడు కాబట్టీ నా రాముడు కౌసల్యకి ఎలా శుశ్రూష
చేస్తాడో...? అంతకన్నా ఎక్కువ శుశ్రూష నాకు చేస్తున్నాడే అలాంటి రాముడు రాజైతే
నీకెందుకంత భయం, అంటే మంధరా ఎంత గొప్పగా వచ్చిందో చూడండీ! అక్కడనే వెర్రిదానా
ఆలోచన చేయలేకపోతున్నావు, రాముడూ భరతుడూ పుట్టడంలో ఎంత తేడా... ఎదో కొద్ది సమయం
తేడా... కొద్ది సమయం తేడాకి భరతుడు కూడా అడగచ్చు నాకిమ్మని, అలా ఒక్కనాటికి అడగడు
అలా కుదరుదు కూడా... అని ఈవిడ సృష్టిస్తూందీ..?
ఇప్పుడు రాముడు
రాజౌతాడు, రాముడు రాజయ్యాక రాముని తరువాత రాజెవరౌతారు, రాముని కొడుకు రాజౌతాడు,
భరతుడు ఏమౌతాడు, ఎప్పటికీ రాజుకాడు, భరతుడి కొడుకేమౌతాడు ఎప్పటికీ రాజుకాడు,
కాబట్టి భరతుడు ఏం చేస్తుంటాడు, రాముడి దగ్గర చేతులు కట్టుకుని ఒంగి సేవలు
చేస్తుంటాడు, భరతుని కొడుకులు ఏం చేస్తుంటారు, రాముని కొడుకులకి సేవ చేస్తుంటారు,
నీ వంశం ఏమైందీ దాసీ వంశం అయ్యింది, రాముడి వంశం ఏమైంది పాలక వంశం అయ్యింది.
రాముడు పరిపాలకుడు తన బిడ్డలతో సహా..! నీ కొడుకు ఎప్పటికీ దాసుడు తప్పా ఎన్నటికీ
రాజు కాలేడు, పైగా నేనింకొక మాట చెప్పనా ధ్రువం తు భరతం రామః ప్రాప్య రాజ్యమ్
అకంటకమ్ ! దేశాఽన్తరం వా నయితా లోకాఽన్తరమ్ అథాఽపివా !! రాముడు కాని ఒక్కసారి కనుక రాజు అయ్యాడా...!
రాజైన వాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? తన తరువాత పక్కన సింహాసనం ఎక్కడానికి
అధికారం ఉన్నవాడెవడో వాడులేకుండా చేస్తాడు, ఎందుకంటే సింహాసనం మీద ఆసక్తి అలా
ఉంటుంది కాబట్టి, రాముడి తరువాత అధికారం భరతుడిది, కాబట్టి భరతుడు లేకుండా చేశాడు
మీ ఆయన అంత తెలివితేటలతో భరతున్ని మేనమామ ఇంటిపంపాడు, ఇప్పుడు రాముడు ఏం చేస్తాడో
తెలుసా..! ఒకసారి యువరాజయ్యాక, ఇక భరతుడు అంతఃపురానికిరాడు, గ్రామాంతరంలోనైనా
ఉంచుతాడు, లేదా వనాలకైనా పంపుతాడు, లేదా లోకాంతాలకైనా పంపిస్తాడు, చంపేస్తాడు
ఇంకా, తప్పా ఒక్కనాటికి నీ కొడుకు తిరిగిరావడం అన్నది ఉండదు.
|
ఇప్పుడూ నేను
ఇక్కడొక్క నలభై రెండు రోజులు ఉండి, మళ్ళి కాకినాడ వెళ్ళిపోతాను, కాకినాడ
వెళ్ళిపోయిన తరువాత నాకు వెంటనే ఏం గుర్తొస్తుంది, సాయంకాలం అయ్యేటప్పటికి ఈ
ప్రాంగణం నేను చెప్పుకున్న ఈ శ్రీరామాయణం, మీ అందరూ జ్ఞాపకానికి వస్తారు. నేను
పొద్దున్న అనుష్టానానికి కూర్చున్నాను అనుకోండీ! ఇన్నాళ్ళు నేను అనుష్టానం
చేసుకోవడం కోసం నాకు హరిప్రసాదుగారు ఏర్పాటు చేసినటువంటి అనుష్టాన మందిరం, నాకు
వారు ఏర్పాటు చేసినటువంటి సంభారములు, నాకు శుశ్రూష చేస్తున్నటువంటి గోపాల
కృష్ణగారు ఇవన్నీ నాకు జ్ఞాపకానికి వస్తాయి. ఎందుకంటే ఒక చోట సంఘం ఆ వస్తువు మనసు
చేత స్మరింపబడేటట్లు చేస్తుంది కదా! నీవేం చేశావ్ ఇక్కడవాళ్ళు భరతునికి
గుర్తులేకుండగా, భరతుడు ఇక్కడ వాళ్ళకు గుర్తులేకుండగా... మేనమామ ఇంటికి పంపావు.
కాబట్టి వీళ్ళకెవ్వరికీ అసలు భరతుడు గుర్తేలేడు, కాబట్టి ఇప్పుడు భరతునికి అపకారం
జరిగినా అసలు ఉన్నాడా భరతుడు ఏమైపోయారు అన్నది కూడా ఎవరూ ఆలోచించరు, ఇది మీ ఆయన
ముందుగా చేసినటువంటి కుట్ర అందుకే మేనమామ ఇంటికి పంపాడు. నీకైనా ఉండాలా దూరదృష్టి,
తగుదునమ్మాఅని వెళ్ళు వెళ్ళు అని మేనమామ ఇంటికి పంపించావు, చూడు ఇప్పుడు ఎంత
ప్రమాదం వచ్చిందో చూడు, ఇప్పుడు మీ ఆయనా రాముడూ కలిసి భరతున్ని చంపించకముందే...
భరతున్ని నా మాటవిని ఇప్పటికైనా ఏదైనా అడవిని పట్టి వెళ్ళిపొమ్మని చెప్పు ఇక
రావద్దని చెప్పు.
దర్పాత్ నిరాకృతా
పూర్వం త్వయా సౌభాగ్యవత్తయా ! రామ మాతా సపత్నీ తే కథం వైరం న యాతయేత్ !! ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ కొట్టింది, నీవు
యవ్వనంలో ఉన్నావనీ, దశరథ మహారాజుగారు ఎప్పుడూ నీ మందిరానికే వస్తాడనీ ఇంత కాలం
అహంకరించి పట్టమహిషీ అయితే లెక్కేమిటీ రాజు నా చేతిలో ఉన్నాడని కౌసల్యపట్ల అనాధర
భావంతో ప్రవర్తించావు, ఇప్పుడు ఆమె రాజమాత, రాజమాత కాబట్టే ఆవిడ నిన్ను
శాసిస్తుంది, నీవు దాసుని యొక్క మాత, భరతుడు రాముని దాసుడు నీవు దాసుని మాతవి,
వాళ్ళు పెట్టినటువంటి అన్నం తిని బ్రతుకుతున్న దానివి, కాబట్టి నీవేం చేయాలి,
చేసిన దోశాలు గుర్తు తెచ్చుకున్న కౌసల్యా... నీతో ఎలా మాట్లాడాలో అలా
మాట్లాడుతుంది, తోడి కోడలు వైపు నుంచి వచ్చేటటువంటి మాట ఆడదాన్ని కొంచెం తొందరగా
కదుపుతుంది, నేను మన్నింపబడెదను గాక, కాబట్టి ఇదీ... కైకమ్మ మనసుకి తొందరగా
ఎక్కుతుంది, కాబట్టి నువ్వు చేతులు కట్టుకుని నిల్చోవాలి, నీవు నిల్చున్నాక మేము
నిల్చోవాలి, చూశావా! నిన్ను నమ్ముకుని సేవించినందుకు మాకు దొరికిన భాగ్యం అందుకు
ఏడుస్తున్నాను అంది.
నిజంగా ఈ ఏడుపంతటకి
కారణం ఏమైనా ఉందా..? కౌసల్య మీద పగకి రాముని మీద ఇన్ని మాట్లాడడానికి, ఏమైనా ఉందా
కారణం, ఏమీ లేదు, ఏమీలేకపోయినా ఆవిడ అలాగే మాట్లాడుతుంది అంతే... ఇది విన్న తరువాత
కైక హృదయంలో మార్పు వచ్చింది, ఈ
చెప్పుతున్నటువంటిది ఏదో చాలా గట్టిగా ఉన్నట్లు, (మీరు రామాయణం చదవండి ఆవిడి ఇంకా
గట్టిగా మాట్లాడుతుంది) చెట్లు చుట్టూ పొదలు పెరిగితే చెట్టుని కొట్టడం అంత తేలిక
కాదు, ముళ్ళ పొదలు చెట్టుచుట్టూ ఉన్నాయనుకోండీ, చెట్టు దగ్గరికి వెళ్ళలేరు, అలా
భరతుడి దగ్గర శత్రుజ్ఞుడు ఉంటే, భరతుడి జోలికి వెళ్ళలేరు, శత్రుజ్ఞుడు ఇక్కడ ఉండి
ఉంటే మీ ఆయన కుట్ర ఫలించదు, అందుకే శత్రుజ్ఞున్ని పంపేశాడు, ఇప్పుడు ఆవిడకీ ఇదంతా
ఏదో నిజంగా దశరథుడు చేసిన కుట్రలాగే కనపడింది.
|
అసూయ అన్నది తనది
కాదు, బాగాజ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడూ ఒక వ్యక్తి తాను విషం తినేశాడనుకోండీ
తెలీకా ఆ వ్యక్తి చచ్చిపోతాడు, ఒక వ్యక్తి తెలియక చాలా గుల్లగా ఉన్న చెట్టు
ఎక్కాడనుకోండీ, కిందపడి వానికాళ్ళు చేతులు విరుగుతాయి, ఒక సరోవరంలో ఒక చెరువులో,
విషం కలిసిందనుకోండీ ఆ నీరు త్రీగిన వారు చచ్చిపోతారు, ఒక్కడు అసూయా గ్రస్తము
అయ్యిపోయాడనుకోండీ! వాడివల్ల మొత్తం దేశం దేశమే... ఏడవాల్చి వస్తొంది. చెప్పలేము
అటువంటి స్థితి ఉంటుంది, కాబట్టి అసూయ అంత ప్రమాదకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు.
అదే మనుష్యులని తొందరగా పట్టుకుంటుంది, కాబట్టి దగ్గరికి రానీయవద్దు అసూయని అత్యంత
ప్రమాదం దానిని మొదట్లోనే గిల్లి పడెయ్యాలి, వద్దు మనం ఇలా అసూయ పెంచుకోకూడదు అన్న
భావన లోపల బాగా ఉండాలి, వాడే పవిత్రచిత్తుడు. ఆ అసూయ పెంచుకోకుండా ఎవడు ఉంటాడో? వాడికన్నా పవిత్రాత్మ
ఇంకోడు ఉండడు. ఆయన వలనే లోకమంతా క్షేమంగా సంతోషంగా ఉంటుంది. అసూయ ఉన్నవాడు
పండితుడు కానీయ్యండీ, ఎంత గొప్పవాడు కానీయ్యండీ, అసూయ అన్నది ఉందా... ఎప్పటికైనా
అది ప్రమాదమే... తనకీ ఇతరులకీ కూడా శాశ్వతమైన అపకీర్తిని పొందుతాడు.
కాబట్టి ఇప్పుడు ఆవిడ అందీ నీకు జ్ఞాపకం ఉందో
లేదో ఒకానొకప్పుడు ఇంద్రుడు రాక్షసుల మీదకు యుద్ధానికి వెళ్తూ, నీ భర్తయైనటువంటి
దశరథ మహారాజుగారి యొక్క సహాయాన్ని అపేక్షించాడు, అప్పుడు దశరథుడు యుద్ధానికి
బయలుదేరుతూ రథ సారధ్యవిద్య నీకు బాగా తెలుసు కాబట్టీ నిన్ను కూడా తీసుకెళ్లాడు,
తీసుకెళ్ళినప్పుడు వైజయంత పురము అనబడేటటువంటి ఒక నగరం దండకారణంలో ఉంది. అక్కడ
తిమిధ్వజుడు అనబడేటటువంటి ఒక అసురుడితో నీ భర్త యుద్ధం చేస్తున్నప్పుడు రాక్షసులు
అందరూ వచ్చీ నీ భర్త మీద దాడిచేస్తే, నీ భర్త స్ప్రుహ కోల్పోయాడు, కోల్పోయినప్పుడు
నీవు నీ సామర్థ్యాన్ని చాకచక్యంతో ఉపయోగించి యుద్ధ భూమి నుంచి నీ భర్తని
రక్షించించి గుప్తమైన ప్రదేశానికి తీసుకెళ్ళావు, అక్కడికి కూడా వచ్చిపడ్డారు
అసురులు, నీవు ఆ గుప్త ప్రదేశం నుంచి కూడా తప్పించి నీ భర్తని కాపాడీ స్ప్రుహ
వచ్చి మళ్ళీ యుద్ధం చేసేవరకూ నీవు అతన్ని కాపాడావు, కాబట్టి దశరథుడు బ్రతికాడు.
బ్రతికినటువంటి దశరథుడు చాలా సంతోషించాడు నీవు చేసిన పనికి తుష్టేన తేన దత్తా
తే ద్వౌ వరౌ శుభ దర్శనే నీకు అప్పుడు రెండు వరాలు ఇచ్చాడు. నీవు అన్నావు
అప్పుడూ నా కెందుకండీ వరాలూ అంటే అలా కాదు నీకు రెండు వరాలు ఇస్తున్నాను ఏమైనా
కోరుకో అన్నాడు. నీవు అన్నావు నాకెందుకులే నా కేం కావాలి, నా కడగడానికి ఏం లేవు,
ఎప్పుడైనా అంత అవసరమైతే తీసుకుంటానులే అన్నావు ఆ విషయం నీవే నాకు చెప్పావు, ʻఇది కైకకు గుర్తులేదుʼ మీరు బాగాపట్టుకోవాలి ఇక్కడ. ఈ మాట
ఎప్పుడొచ్చిందీ భర్తను రక్షించుకోవడానికి తన ప్రాణమే అడ్డుపెట్టింది కైకమ్మ అంటే అంత
భార్యాత్వంతో అంత పాతివ్రత్యంతో ప్రవర్తించింది మహాతల్లి.
|
|
అంటే నీవు
స్వానుభవంతోటి చెప్తావా అనుకోకండీ, నేను ఉదాహరణ చెప్పానంతే, నన్నేమీ నా భార్య అలా
అడగలేదు మహాప్రభో అలాగని, అందుకనీ ఇప్పుడు ఆవిడందీ... రెండు వరాలు ఇచ్చాడు కదా
దశరథుడు నీవు మరిచిపోయావేమో నాకు జ్ఞాపకం ఉంది,
రామాఽభిషేక సంభారా న్నిగృహ్య వినివర్తయ ! తౌ వరౌ యాచ స్వ భర్తారం భరత స్యాఽభిషేచనమ్ !!
ప్రవ్రాజనం చ రామ స్య త్వం వర్షాణి చతుర్దశ ! చతుర్దశ హి వర్షాణి రామే
ప్రవ్రాజితే వనం !!
ప్రజాభావగత స్నేహ స్థిరః
పుత్రో భవిష్యతి!
ఇప్పుడు నివ్వు నీ భర్తని నిగ్రహించు, గట్టి
పట్టు పట్టు రెండు వరాలు ఇమ్మను, ఏమిటి అంటాడు... అభిషేకము కొరకు సంభారములు
తెప్పించావు కదా రాముడికి యౌవ్వ రాజ్య పట్టాభిషేకం చేస్తానని, అవే పదార్థములతో
భరతుడికి చేసై, అంటే ఆలస్యం వీల్లేదు ఇంక చేసేయ్యాలి అంతే భరతుడికి. మరి రాముడూ 14
యేళ్ళు నార చీరలు కట్టుకొని, మృగ చర్మం
కట్టుకొని ఆయన జటాజుటంతోటీ 14 సంవత్సరములు
అరణ్యవాసానికి వెళ్ళిపోవాలని కోరుకో, భరతునికి పట్టాభిషేకం అయితేచాలుగా
రాముడెందుకు వెళ్ళిపోవాలంటావేమో? రాముడు 14 యేళ్ళు అడవులుపట్టి వెళ్ళిపోతే...
రామున్ని ప్రజలు మరిచిపోతారు, భరతుడు మిత్రుల్ని పెంచుకుంటాడూ... బాగా
ఊంచుకొంటాడు, దెబ్బకుదెబ్బ ఇదే రాజుచేసిన కుట్రకు ప్రతికుట్ర ఇదే... ఇప్పుడు
భరతుడు బాగా వేళ్ళు ఊంచుకొన్న తరువాత రాముడు తిరిగివస్తాడు, కానీ అప్పటికి అందరకీ
భరతుడి మీద ప్రీతి ఉంటుంది. ఇంక రాముడేం చేయలేడు, అలా నీవు రాజ్యాన్ని భరతునికి
ఇప్పించు, కాబట్టి భరతునికి రక్షణ కలగాలంటే... ఇదొక్కటే మార్గం, ఇప్పుడెలా అందో
తెలుసాండీ దయితా త్వం సదా భర్తుః అత్ర మే నాస్తి సంశయః ! త్వత్ కృతే చ మహా రాజో
విశేత్ అపి హుతాశనమ్ !! నీ భర్తకీ నీవు అంటే ఎంత ప్రేమో తెలుసా! నీ కోసం
అగ్నినిలో దూకమంటే దూకేస్తాడు.
|
మరి ఇందాకా ఏమందీ?
లాగి లెంపకాయ్ కొట్టీ ఇందాకా ఏమన్నావ్? ఇప్పుడేమంటున్నావ్... అని కైక అనుంటే రామ
కథ ఇంకోలా ఉండేది. చెప్పుడు మాటలు అసూయా గ్రస్తమైన వాళ్ళు చెప్పడం ఒకెత్తైతే,
దానివల్ల ప్రమాదం ఎప్పుడొస్తుందంటే, వినేవాళ్ళు కూడా ఉంటే... ఇదొక్కటే దానికి
పరిమితి బాగా గుర్తు పెట్టుకోండి, అసూయ ఉన్నావాడు ఎప్పుడూ ఏమీ చేయలేడో తెలుసాండీ!
వినేవాడు లేకపోతే... వినేవాడు దొరికాడు అనుకోండీ ప్రమాదమే... అగ్గి పుల్లా బాంబు
దూరంగా ఉన్నంత సేపూ ఏం ఫరవాలేదు, కలిస్తేనే ప్రమాదం. అసూయాగ్రస్తమైనవాడూ ఆ మాటలు
వినేవాడూ కూడా కలిసారో... ప్రమాదం వచ్చేసిందని లెక్కే...? కాబట్టీ ఒకటీ అసూయ
ఉండకుండా చూసుకోవాలి, రెండు అసూయాగ్రస్తమైన మాటలు వినకుండా ఉండడం నేర్చుకోవాలి,
వారిని లోపలకి చేరనివ్వకూడదు.
కాబట్టి ఇదీ
ఇక్కడా... కైకమ్మ దెబ్బతింది, రామాయణం మన జీవితానికి ఒకపథాన్ని నేర్పుతుందండీ,
దిద్దుబాటుతనం వస్తూవుంటుంది రామాయణంవల్ల మీరు ఆ కోణంలో రామాయణాన్ని పరిశీలనం
చేయకుండా పాత్రల్ని పరిశీలనం చేయడం మొదలు పెట్టారనుకోండీ, ఏమిటీ దానివల్ల
మీరుపొందిన ప్రయోజనం పొందేది, అప్పుడు ఏమౌతుందంటే జరిగిపోయిన కథ మీద మీరో విచారణకు
కూర్చున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఏతీర్పు చెప్పినా దానివల్ల ఉపయోగం ఏమిటీ
చెప్పండి. అది “వేదోపబృహ్మణము” మీకేం పనికొస్తుంది శ్రీరామాయణం, మీరు
శ్రీరామాయణాన్ని చదివి, మీరు ఏం చేద్దామనుకుంటున్నాను, మీరు ఏం
ఉంచుకుంటుందామనుకుంటున్నారు, ఏం వదిలేద్దామనుకుంటున్నారు ఇందులో మీకొక స్పష్టత
ఉంటే మనుష్య జన్మను దిద్దుబాటు చేసుకోటానికి రామాయణం అక్కడ ఉపకరిస్తుంది, అక్కడ
ఉపకరించాలంటే మీరా కోణంలో చూడవలసి ఉంటుంది మీకు అందుకే నేను మనవిచేసేది. రామాయణం
మధుర మధురమైనటువంటి కథ. ఆ కథని కథగా చదువుతూ మిమ్మల్ని మీరు దిద్దుకో గలిగితే చాలు
రామాయణం అద్దం మీరు బింబం బాగా గుర్తు పెట్టుకోండి.
నేను అద్దం
ముందుకెళ్ళి నిల్చున్నానుకోండీ, బొట్టు అడ్డంగా పెట్టుకున్నాను, నిలువుగా
పెట్టుకున్నాను సరిగ్గా పెట్టుకోలేదు గుండ్రంగా వేలు ఇలా తగిలింది బొట్టు ఇలా
వచ్చింది సరిగ్గా రాలేదు అనుకున్నానుకోండీ, ఇప్పుడు మీరు ప్రతి బింబంలో ఉన్న
బొట్టుని దిద్దడం మొదలు పెట్టారనుకోండీ బింబం మీద ఉన్న బొట్టు మారుతుందా...
బింబాన్ని దిద్దాననుకోండీ, నా లలాటమునందున్న తిలకాన్ని దిద్దాననుకోండీ
ప్రతిబింభమేమౌతుందీ దిద్దబడుతుంది. రామాయణం అనే
అద్దంలో మీరు ఎదురుగా
నిలబడి చూసుకొనీ, ఇప్పుడు నాయందు ఏ దోషం కనపడుతుంది అంత ప్రమాదం నావల్ల రాకుండా
నేనలా బరువు కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మీరు దిద్దుకోవాలి మీరు దిద్దుకుంటే
మీరు సమాజానికి పనికివస్తారు. అందుకే రామాయణం మనుష్య జాతిని ఉద్దరించుట కొరకు
ఎల్లకాలములయందూ చెప్పబడవలసిందే... ఎందుకంటే మంచి నేర్చుకోవడానికి శిక్షణ కావాలి
కానీ చెడు నేర్చుకోవడానికి శిక్షణ అక్కరలేదు తనంత తాను లోపలకి వచ్చేస్తుంది,
దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుండాలి.
|
కాబట్టీ ఈ మాటవిని
అగ్నిలో దూకేటటువంటి లక్షణం ఉన్నవాడు నీ భర్త, నీవు కోప గృహంలోకి ప్రవేశించు,
మలినమైన చీర కట్టుకో, విలువైన ఆభరణములన్నింటినీ కూడా చిమ్మివేయి అంటే విడిచి
పెట్టేసై, నేల మీద పడు, జుట్టు విరబోసుకో, ఏడుస్తూ పడుకో, నీభర్త వచ్చి చాలా కలత
చెందుతాడు, కలత చెంది దగ్గర కూర్చొని నిన్ను లాలించే ప్రయత్నం చేస్తాడు, నీకేం
కావాలంటాడు, బంగారమిస్తానంటాడు, భూమి ఇస్తానంటాడు, రత్నాలిస్తానంటాడు వ్యామోహపడకు,
దేనికి వ్యామోహ పడద్దందో తెలుసాండీ మంధర మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి, రత్నాలకీ
బంగారానికి కాదు భర్త లాలింపుకు లొంగవద్దు అంది, ఇంతకన్నా ధారుణమైన మాట ఇంకోటి
ఉంటుందాండీ లోకంలో... నిజంగా ఒక వేళ దోషమే జరిగినా ఇద్దరి మధ్యలో వారు ఉభయులూ
ఒకరినొకరు లాలించుకొని మళ్ళీ కలిసి ఉండేటటువంటి స్థితిలో మీరు అగ్నిహోత్రం
పెట్టకూడదు, వాళ్ళిద్దరూ కలిసుండేట్టు చూడాలి, ఈవిడ ఉద్దేశం ఏమిటంటే బంగారం
ఇస్తానంటే లొంగకు, రత్నాలు ఇస్తానంటే లొంగకు, భూమినిస్తానంటే లొంగకు, అంటే దాని
ఉద్దేశ్యం ఏమిటంటే..? నీవు అవన్నీ పుచ్చుకోవద్దూ అంటే మన్ద స్వభావే బుధ్యస్వ
సౌభాగ్య బలమ్ ఆత్మనః నీవు కాని వాటికి లొంగావో అసలు ప్రయోజనం రాదు.
అంటే ఆవిడ కౌసల్య
ఏడవాలి, రాముడు వెళ్ళిపోవాలి, ఎందుకు? దానికేం ఇదేం లేదు, ఇంకొకరి యొక్క ఉన్నతిని
చూసి ఓర్చుకోలేకపోవుటా అన్న తన లక్షణం వల్ల అలా ప్రమాదం రావాలి అంతే..? అది
దేవకార్యమండీ అది మంధర తప్పు ఎలాగా అని మీరు రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాన్ని
సమర్థించే ప్రయత్నంచేయకండీ... ఆ లక్షణమువలన ఏర్పడిన ప్రమాదమును గుర్తించి
దిద్దుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది కదా. కాబట్టీ మణి ముక్తం సువర్ణాని
రత్నాని వివిధాని చ ! దద్యా ద్దశరథో రాజా మా స్మ తేషు మనః కృథాః !! ఏదిచ్చినా
ఒప్పుకోవద్దు మంకుపట్టు పట్టు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి సుమా! కొడుక్కి రాజ్యం,
కొడుక్కి రాజ్యం, కొడుక్కి రాజ్యం గుర్తు పెట్టుకోవడంలో భరతుడికి రాజ్యం అనేది
వదిలేస్తావేమో! భరతుడి రాజ్యం నిలబడదు రాముడు పక్కనుంటే, రాముడు అరణ్యాలకి
వెళ్ళిపోవడానికి నీవు గట్టిగా పట్టుపట్టి అడగాలి, రాముడు అడవికి వెళ్ళిపోతేనే
భరతుడికి రాజ్యం సుస్థిరం. అంటే భరతుడికి రాజ్యం ఇప్పించడం మంధరకి అనుషంగికం, మంధర
ప్రధాన ప్రయోజనం రాముడు అడవులకి వెళ్ళిపోవడం, ఇది దేవతా కార్యం.
మంధరవైపు నుంచీ
అసూయకు ఫలితం అదో అర్థంలేని తృప్తి, కైకమ్మ చెప్పుడు మాటలకి లొంగింది కాబట్టి
అధర్మంగా తన కొడుక్కి రాజ్యం సంపాదించుకోవడం, దీని ఉపద్రవం ఎలా ఉంటుంది అన్నది
ఇప్పుడు పట్టే పట్టుదల యొక్క ప్రయత్నం ఎంత దూరం వెడుతుందో, ఎంత ప్రమాదకరంగా
ఉంటుందో, మంధర చూసి ఉంటే లోపలా మంధర మనసు కూడా నిజంగా... కరిగిపోనో కరిగిపోతుందని
నేను అనుకోను నిజంగా అసూయ ఉన్నవాళ్ళకి అలా ఉండదు అది అవగుణం. కాబట్టి
ఇప్పుడు ఈ మాటలు చెప్పింది
అని, 14 యేళ్ళు రాముడు అడవులకి
వెళ్ళిపోవాలన్నిది బాగా గుర్తుపెట్టుకొని అడుగు,
ఎందుకో తెలుసా? 14 యేళ్ళు తరువాత రాముడు
వస్తే... అప్పుడైనా రాముడు రాముడేగా... రాముడొచ్చాడని మళ్ళీ ప్రజలు
గుర్తుపెట్టుకొని ఆదరించరా అనుకుంటున్నావేమో... ఏవం ప్రవ్రాజిత శ్చైవ రామోఽరామో భవిష్యతి ! భరత శ్చ
హతా మిత్ర స్తవ రాజా భవిష్యతి !! ఈలోగా భరతుడు తన యొక్క శత్రువుల్ని చంపేస్తాడు, రాముడు 14 యేళ్ళు జంతువుల
దగ్గరా, ఆకలితోటి కందమూలాలు తిని ఆ కష్టాలు పడీ అసలు ప్రజలతో రంజకంగా
ప్రవర్తించడం, ధర్మంతో ఉండడం ఇవన్నీ పోతాయి, పోయి ఆ అడవుల్లో తిరిగితిరిగి
వస్తాడు, రాముడు అరాముడైపోతాడు, రాముడంటే రమింపజేసేవాడు, రమింపజేసే రాముడు రమింపజేయగలిగిన రాముడు
ఇకకాడు, కాబట్టి అప్పుడు ఆ రాముడు ఏమీ చేయలేడు. కాబట్టి రామున్ని నిస్సారం చేద్దాం
ఇలాగా ఎందుకండీ ఏమిటి దానివల్ల ప్రయోజనం? రాముడో రాముడో అని లోకమేడిస్తే రాముడు
రాముడుగా ఉండ కూడదు అరాముడుగా కావాలని కోరుకున్న ఏకైక వ్యక్తి రామాయణంలో మంధర.
|
|
ఇదెక్కడి లక్షణమో
తెలుసాండీ! ఒకాయన చాలా
వృద్ధిలోకి వచ్చీ, నియబద్ధమైన జీవితం గడుపుతుంటే ఆయన ఎప్పుడు పాడైపోతాడు ఎప్పుడు
పాడైపోతాడు, ఆయనకి ఎప్పుడు అపకీర్తి వస్తుందోనని నిష్కారణంగా ఏడిచేవాడు ఎలా ఉంటాడో
అలా ఉంటుందట వాళ్ళ ప్రవర్తన, అది కేవలం అసూయవల్ల జనితం కదా! రామాయణం అద్భుత
కావ్యమండీ అద్భుత కావ్యం నిజంగాను, కాబట్టీ ఈ మాటలు చెప్తే, ఆ కైకమ్మ ఎంత
సంతోషపడిపోయిందంటే నిజంగా ఆ కుబ్జని చూసి అందీ... సన్తి దుస్సంస్థితాః కుబ్జా
వక్రాః పరమ దారుణాః ! త్వం పద్మమ్ ఇవ వాతేన సన్నతా ప్రియ దర్శనాః !! ఒసేయ్
కుబ్జా! లోకంలో నేను ఎంత మంది కుబ్జల్ని చూశానే..? అంటే గూనివాళ్ళని చాలా అసహ్యంగా
ఉంటారు, కానీ అబ్భాహ్ మంధరా! నీ గూని అలా ఉండదే.., గాలికి వంగిన పద్మంలా ఉంటుందే
నీ గూని ఎంత అందంగా ఉంటుంది, అంటే మనకి నచ్చితే... ఎంత అసహ్యమైందీ బాగుంటుంది.
మనకి నచ్చకపోతే ఎంత అసహ్యంగా ఉంటుందో..? అక్కకి పిల్లాడు పుట్టీ అక్క పిల్లాడు మల
విసర్జనచేస్తే బట్ట పట్టుకొచ్చి వాడి రెండు కాళ్ళు ఇలా పైకెత్తీ వాడి మల
విసర్జకావయవం దగ్గర కడిగేసి తుడిచేసి వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూంటే...
చెల్లెలు అంటూందీ ఏంటీ అలా తుడిచేసి అలా ఎలా ముద్దు పెట్టుకుంటున్నావే అంటుంది.
అదే చెల్లి దానికో కొడుకు పుడితే అది అంతకన్నా గొప్పగా ముద్దాడుతుంది, ఎందుకనీ తన
పుత్ర ప్రేమేమిటో తనకు తెలుస్తుంది కదా! ఎందుకు అప్పుడు అంత అసహ్యంగా కనపడింది
ఇప్పుడెందుకు సంతోషంగా కనపడింది. తన పిల్లాడు
కాబట్టి ఎంత ప్రేమో! తల్లికి ఆ ప్రేమ లేకపోతే లోకముందాండీ! మనందరం బ్రతకడం అన్నది
ఉందా... అసలు బ్రతికాం ఉన్నామంటే అమ్మవల్ల కదా... అమ్మ ప్రేమే లోకంలో అంమృతం. అమ్మ
ప్రేమే ఈశ్వర స్వరూపం.
కాబట్టి ఆ గాలికి
వంగిన పద్మంలా ఉంటావే కుబ్జా నీవు, నేనూ అగ్రతో మమ గచ్ఛన్తీ రాజ హంసీవ రాజసే
కుబ్జా నీవు నా ముందు నడుస్తూంటే రాజ హంస నడుస్తున్నట్లుందే..! అత్ర తే
ప్రతిమోక్ష్యామి మాలాం కుబ్జే హిరణ్మయూమ్ ! అభిషిక్తే చ భరతే రాఘవే చ వనం గతే !!
రాముడు అడవికి వెళ్ళిపోగానే, భరతునికి పట్టాభిషేకం అయిపోగానే కుబ్జా! నీ గూనికి
బంగారు గొలుసులు చేయిస్తాను అంది, అంటే... మనుష్యులకి అవతలి వారిపట్ల ప్రీతి
దేనివల్ల ధర్మంవల్ల కాదు, అవతల వాళ్ళు తనకు ఉపకారం చేస్తున్నాడన్న ప్రీతితో
ఉండాలని నేర్చుకుంటే ఇలాగే ఉంటుంది జీవితం. అవతలివారి ధర్మం వలన వారిని శ్లాగించడం ʻఏమి మహాపురుషులండీʼ అని
అనగలగడం నీకు అలవాటైతే నీ జీవితం ఇంకోలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలనీ కైకమ్మ కోప
గృహానికెళ్ళి ఆరోజుల్లో బహుషహా ఇలా భార్య కోపంగా ఉందని మళ్ళీ ఓ గది ఉండేదిలా
ఉంది, కాబట్టి కోపాగృహము
అని కోపంగా ఉంది కాబట్టి ఆ గదిలోకి వెళ్ళిపోయింది. అందులో వెలుతురూ గట్రా ఏమీ
ఉండదు చీకటిగా దీపాలన్నీ తీసేసి ఆ చీకట్లో ఆభరణాలన్నీ తీసేసి ఒక మలినమైన
వస్త్రాన్ని కట్టుకొని జుట్టు విరబోసుకొని వాల్మీకి మహర్షి భాషలో అయితే కిన్నెర
పడుకున్నట్టు పడుకుంది. నేల మీద పడి ఉంది.
|
పెద్దాయనకేం తెలుసు పాపం 60 వేల సంవత్సరాల
వృద్ధుడు, మంచి శుభవార్త సంతోషంలో ఉన్నాడు, చాలా మంచి కామము ప్రభలి ఉన్నాడు కైకమ్మ
పట్ల, అందుకని పరమ ప్రీతితో కామోద్రేకంతో కైకమ్మ ఉన్నటువంటి అంతఃపురంలోకి
ప్రవేశించాడు, ప్రవేశించి ఏమిటీ ఎక్కడా కైకమ్మ కనపడదూ, పెళ్ళైన పర్యంతమూ
ఇప్పటివరకూ నేను వచ్చేటప్పటికి కైక లేకపోవటం అన్నది లేదు, ఇదే మొదలు కైక లేకపోవడం
ఆశ్చర్యపోయి అక్కడ ఆంతరంగిక పరివారాన్ని అడిగాడు అక్కడ ఉండేటటువంటి పరిచారికలిని
కైకమ్మ ఏదీ అని అడిగాడు, కోప గృహంలో ఉందీ అన్నారు. కోప గృహంలో ఉందీ అనగానే 3వ
నంబరు ప్రమాద పథాకమే కదా! ఏదో కోపం వచ్చిందావిడకీ అందుకే తడబడ్డాడు ఇదేమిటీ కోపం ఎందుకొచ్చిందీ,
ఆవిడకి కోపం రావడం అంటే ఈయన తట్టుకోలేడు, అంటే ఈయన మనస్సు ఆమెవలన ఆనందాన్ని
పొందుతుంది అది. సంతోషం ఏదైనా ఒకటొచ్చిందనుకోండి ముందెళ్ళి మా ఆవిడకు చెప్పాలి
అంటుంటాడు ఒక్కొక్కాయన, ఎందుకంటే తప్పేం కాదండీ సంతోషించాలి తన భార్యయందు కామము,
తన భార్యయందు ప్రేమా ఏప్పుడూ దానిని మనం విమర్షించవలసిన అవసరం లేదూ... అది
ధర్మబద్ధం. భార్యయందు ప్రీతి ఉండడం పరమ ధార్మికమైన లక్షణం.
కాబట్టి ఆవిడకి
చెప్పి సంతోషించాలని ఆయన వచ్చాడు, ఆవిడ కనపడటం లేదు కనపడకపోతే ఆయన అడిగాడు ఏదీ
కైకమ్మ ఏదీ అని అడిగాడు, కోప గృహంలో ఉందంటే వెళ్ళాడు పాపం, వెళ్ళేటప్పటికి ఆమె
చాలా ధారుణమైన స్థితిలో నేలమీద పడుకొని ఉంది, ఆ నేల మీద పడుకొని ఉన్నటువంటి కైకమ్మ
దగ్గరికి వెళ్ళి కూర్చొని కైకా నీకేం కావాలి? (ఓహో రామాయణం అంటే వాటి అందం అలా
ఉంటుందన్నమాట,) కైకమ్మ ఏమి నేల మీద పడుకొని ఉందనీ చాలా క్షుభితమైనటువంటి అంతరంగంతో
మహానుభావుడు ఆ కైకమ్మదగ్గరికి వెళ్ళి కూర్చుని అంటున్నాడు. (ప్రవచన ప్రాంగణంలోకి
కోతులు వచ్చాయి వాటి గురించి గురువు గారు :
అయ్యా వాటి జోలికి వెళ్ళకండీ, ఎందుకంటే అవి అసలు చీకటి పడిన తరువాత
ఎక్కువగా తిరగవు. మనం హనుమకి ఆసనం వేశాం నీకెందుకయ్యా నీవు రామాయణం వినక, అదేం
చేస్తుంది దాని మానాన అది వెళ్తుంది. అది ఎందుకు ఎవరినేం చేస్తుంది ఏదో దాని గొడవ
దానిది, అసలు చీకటి పడిన తరువాత అసలు తిరగవు అవి చీకటి పడిన తరువాత రామాయణ
ప్రాంగణంలోకి వచ్చాయి అంటే మనం దానికి ఒక నమస్కారం చేసి విడిచి పెట్టేసేయ్యాలి.)
కాబట్టీ ఇహ వా
మాం మృతాం కుబ్జే నృపా యాఽఽవేదయిష్యసి ! వనం తు రాఘవే ప్రాప్తే భరతః
ప్రాప్స్యతి క్షితిమ్ !! ఆవిడ ఎంత పట్టుదల పట్టి ఉందంటే... ఆ కోపా గృహానికి వెళ్ళేముందే... మంధరతో
చెప్పింది, నేనంటూ కోప గృహంలోంచి బయటికి వస్తే... రాముడు అరణ్యవాసానికి
వెళ్ళిపోయాడూ, భరతుడుకి అభిషేకమయ్యిందని గుర్తు, నా కోరిక తీరకపోతే నా శవం బయటికి
వచ్చీ నేను చనిపోయానని చెప్పడానికి మంధర నీవు దశరథుడి దగ్గరకి వెళ్ళవలసి ఉంటుంది.
ఇప్పుడంటే ఎంత పట్టుదలకు వెళ్ళాల్లో అంత పట్టుదలకు వెళ్ళింది, కైకమ్మ
వెళ్ళిపోయింది ఆస్థితిని కల్పించేసింది. పాపం ఆయనకేం తెలుసు లోపలికి వెళ్ళాడు
బ్రతిమాలాడు, రథ చక్రం ఎంత దూరం తిరుగుతుందో అంత దూరం నా రాజ్యం వశంలో ఉంది
కైకా... నీకేం కావాలి
భూమి కావాలా, ధనం కావాలా ఏం
కావాలి చెప్పు ఒకవేళ ఎవరైనా పొరపాటు చేశారా చెప్పు శిక్షిస్తాను, నీకేమైనా
అనారోగ్యంగా ఉందా చెప్పు రాజ వైద్యులున్నారు ఆ ప్రముఖ వైద్యులని పిలిపిస్తాను,
తప్ప నీవు ఇలా నా యందు విముఖంగా ఉండకు నేను తట్టుకోలేను, నాకు చాలా బాధ
కలుగుతుంది. నీకు తెలుసు నీవంటే చాలా అనురక్తి కలిగి ఉన్నవాన్ని, కాబట్టి నీవు
నాయందు ప్రీతి వహించూ అని ఆయన ఒంగి ఒడిలోకి ఆ భార్య యొక్క తల పెట్టుకొని ఎంతో
లాలించాడు, బాగా లొంగి ఉన్నాడు, కామాతురతో ఉన్నాడు, ఇప్పుడే పిడుగులాంటి వార్త
చెప్పాలి అని అనుకొంది ఆమే, అనుకొని అందీ... నేను నిన్ను ఇతః పూర్వం రెండు వరములు
అడగమని అడిగితే అడగకుండా తరువాత అడుగుతానూ అని నీకు మాటిచ్చి ఉన్నాను, ఇప్పుడు ఆ
వరాలు రెండు అడగాలనుకొంటున్నాను, ఆ రెండు వరాలు నీవు నాకు ఇస్తావా అన్నది, ఆయన
అన్నాడూ తప్పకుండా ఇస్తాను ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇస్తానని ఒట్టు పెట్టు
అడుగుతాను.
|
ఆయన ఆశ్యర్యపోయాడు ఏంటీ ఒట్టు పెట్టడం దేనికీ
కైకా దానికి సరే! నీవు అన్నావు కాబట్టి ఒట్టుపెడుతున్నాను, నా మీద ఒట్టు
పెట్టుకోవడం కాదు, తనకి ఏది అత్యంత ప్రీతి పాత్రమో దాని మీద ఒట్టు పెట్టాలి, అంటే
ఇది జరగకపోతే అది నశించిపోతుంది. అంత ఒట్టు పెడుతున్నాన్నాడు. తేనాఽజయ్యేన ముఖ్యేన రాఘవేణ
మహాత్మనా ! శపే తే జీవనాఽర్హేణ బ్రూహి య న్మనసేచ్చసి !! యం ముహూర్త
మపశ్యం స్తు న జీవేయ మహం ధృవం ! తేన రామేణ కైకేయ శపే తే వచన క్రియాం !! అజేయుడై ఈ భూభారమునంటనూ వహించగలిగినటువంటి
సమర్థుడైన రాముడి మీద నాకు ఎంత ప్రీతి ఉందో నీకు తెలుసు ఆ రామున్ని చూడ కుండా
దశరథా బ్రతుకూ అంటే ఒక్క క్షణం నేను బ్రతకలేను కైకా... అలాంటి నా రాముడి మీద ఒట్టు
పెట్టుకుని చెప్తున్నాను, నీవు అడిగిన వరాలు ఇస్తాను. ఏ మాట తాను అన్నాడో ఇప్పుడు
ఆ ఉపద్రవమో ఆయనకు రాబోతున్నది ఆవిడందీ నీవు నాకు వరమిస్తానని చేసినటువంటి ప్రతిజ్ఞ
కోప గృహంలో చేశావు ఎవ్వరూ లేరు కాబట్టీ, రాజు తలచుకుంటే ఏముందండీ ఆవిడని అలాగే
నిర్భందించి, నేను అసలు కైక దగ్గరకి వెళ్ళలేదు అని వెళ్ళి యౌవ్వ రాజ్య పట్టాభిషేకం
చేసేస్తే, నీవు ధర్మం తప్పిపోయావని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని కొందరు
సాక్షులున్నారని గుర్తు పెట్టుకో... ఇక్కడెవరూ లేరనుకుంటున్నావేమో ఇప్పుడు నేను
అడిగితే, ఒక వేళ నన్ను నీవు ఇక్కడే విడిచిపెట్టి నిర్భందించి వెళ్ళి నీ పని
చేసుకోవచ్చు అనుకుంటున్నావేమో... కొందరు సాక్షులు ఉన్నారు. నీవు నాకు వరాలు ఇచ్చి
తీరుస్తానని శపథం చేశావు, రాముని మీద ఒట్టు పెట్టావని చెప్పడానికి సాక్షులెవరో
తెలుసా?
చంద్రాఽఽదిత్యౌ నభ శ్చైవ గ్రహా రాత్ర్యహనీ దిశః ! జగ చ్చ పృథివీ చేయం స గన్ధర్వా స
రాక్షసా !!
నిశా చరాణి భూతాని గృషేషు గృహ దేవతాః ! యాని చాఽన్యాని భూతాని జానీయు
ర్భాషితం తవ !!
సత్య సంధో మహా తేజా
ధర్మజ్ఞః సు సమాహితః ! వరం మమ దదా త్యేష తన్ మే శృణ్వన్తు దేవతాః !!
నీవు
నాకిచ్చినటువంటి వరాన్ని చంద్రుడు, సూర్యుడు, ఆకాశము, భూమి, దిగ్దేవతలు,
అంతఃపురంలో ఆరాధన పొందుతున్నటువంటి దేవతలు, గృహంలో నివశించేటటువంటి దేవతలు,
రాక్షసులు, రాత్రివేళ తిరిగేటటువంటి అసురులు వీళ్ళందరూ సాక్షి నీవు మాట ఇచ్చావు
నేను వరం అడుగుతున్నాను, కాబట్టి రాజా! నీవు మాట తప్పకూడదు. నాకిప్పుడు ఆ మాట
తీర్చాలి రెండు వరాలు అడుగుతున్నాను
|
యో ద్వితీయో వరో దేవ దత్తః ప్రీతేన మే త్వయా ! తదా దైవాఽసురే యుద్ధే తస్య కాలోఽయ మాగతః !!
నవ పంచ చ వర్షాణి దణ్డకాఽరణ్యమ్ ఆశ్రితః ! చీరాఽజిన జటా ధారీ రామో భవతు
తాపసః !!
నాకిస్తానన్న రెండు వరాల్లో మొదటి వరం రామ చంద్ర
మూర్తిని యౌవ్వరాజ్య పట్టాభిషేకంలో కూర్చోబెట్టాడానికి, రామునికి పట్టాభిషేకం
చెయ్యడం కోసమని నీవు ఏ అభిషేక సంభారములను తెప్పించి సిద్ధం చేశావో వాటితోటే
భరతునికి యౌవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి, నవ పంచ చ వర్షాణి అడిగేటప్పుడు
చతుర్ధశ వర్షాణి అనలేదు ఆవిడ 14 యేళ్ళు అనలేదు. నవ పంచ తొమ్మిది ఐదు అంది, దేవతలు
ఆవిడ నాలుక మీద అలా అనిపించారు కారణం ఏమిటంటే ఆయుగంలో 14 యేళ్ళు రాజ్యానికి దూరంగా
ఉంటే ధర్మజ్ఞుడైన రాముడు అప్పుడు ఇంక వెనక్కొచ్చి పట్టం కట్టుకోరు, కాబట్టి అది 14
అయినా తొమ్మిదీ ఐదుగా వెళ్ళినట్లు లెక్క. కాబట్టి నవ పంచచా అనిపించారు. మంధర
చతుర్ధశా అన్నా ఈవిడా నవ పంచ చ అంది నవ పంచ చ వర్షాణి దణ్డకాఽరణ్యమ్ ఆశ్రితః 14 సంవత్సరాలు రాముడు దండకారణ్యంలో ఉండాలి, ఎలా
ఉండాలి చీరాఽజిన జటా ధారీ ఆయన నార చీర కట్టుకోవాలి, అజినము కట్టుకోవాలి,
జింక చర్మము కట్టుకోవాలి, జుట్టంతా కూడా జిల్లేడు పాలు పోసుకొని జఠలు
కట్టేసుకోవాలి, సంస్కారం ఉంకూడదు జుట్టుకి, రామో భవతు తాపసః రాముడు తపస్సు
చేసేవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండాలి, ఇవి రెండు నా వరాలు ఇవ్వు.
ఇవి విన్నాడట విని సంజ్ఞ కోల్పోయడట అంటే సంజ్ఞ
కోల్పోవడం అంటే ఏమిటో ఓసారి నేను జీవితంలో అనుభవించా... పొట్టి గుమ్మం ఉండేది మా ఇంట్లో ఓ చోటా నేను ఏదో మాట్లాడుతూ ఆ
గుమ్మకింద చాలా జాగ్రత్తగా ఉండేవాన్ని అకస్మాత్తుగా ఏదో ఆలోచిస్తూ ఓసారి గభాలున
లేచినిల్చున్నాను. ఖచ్చితంగా తల మధ్యలో తగిలి కిందపడిపోయాను కింద పడిపోవడం వరకే
తెలుసునాకు, ఆ తరువాత ఓ ఐది నిమిషాలు నాకు ఏమీ తెలియలేదు అసలు ఐదు నిమిషాలు తరువాత
మళ్ళీ మెమోరీ గైయిన్ చేసింది. ఏదో ఈశ్వర కృప వచ్చిందనుకోండీ అంటే సంజ్ఞకోల్పోవడం
అంటే కళ్ళు తెరిచి ఉన్నా తనకేమీ తెలియకపోవడం ఇంక మేధస్సు స్థంభీబూతం అయిపోతుంది.
అలా స్థంభీభూతం అయిపోయింది
దశరథునికి అంటే ఆయన ఊహించలేదు అసలు ఆలోచన లేదు ఏమీ, ప్రతిస్పందన లేదు. కోపం కానీ
బాధ కానీ దుఃఖం కానీ ఏమీ లేవు జడీభూతుడైపోయాడు, అయిపోయి అలా ఉండిపోయాడు, ఉండిపోయిన
తరువాత సంజ్ఞ పొందాడు, పొంది ఆస్థరణం అంటే ఆసనం లేని నేల మీద ప్రభువు కూర్చోకూడదు, బ్రాహ్మణ పుష్టం
కానీ, ప్రభు పుష్టం కానీ ఆసనం లేకుండా తగల కూడదు. కాబట్టి ఆయన అది మరిచి
పోయాడు, మరిచిపోయి ఇవ్వాల ఏ స్థితిని పొందాడంటే నేల మీద కూర్చుండిపోయాడు. కటికనేల
మీద కూర్చొని కన్నుల రెండింటినిండా భాష్పధారలు కారిపోతున్నాయట, వలవలవల
ఏడుస్తున్నాడు, ఏడుస్తూ అంతే, ఆ కైకని చూశాడు. ఇప్పటి వరకు ప్రీతి. అంతే వెంటనే
నోటివెంట ఏమని వచ్చిందంటే, మనుష్యుల యొక్క కదలికలు అంటే ఇలా ఉంటాయి నృశంసే
దుష్ట చారిత్రే కుల స్యాఽస్య వినాశని ! కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాఽపి వా !! ఇక్కడ కొంచెం దశరథుడు మాట ఇచ్చి ఉన్నాడు,
నిజంగా దశరథుడేగా చెయ్యాలీ, అంటే దశరథుడి యొక్క పుత్ర వ్యామోహం అటువంటిది, రాముడి
మీద ఉన్న ప్రేమ అటువంటిది, నృశంసే ఓసీ! క్రూరురాల, దుష్టురాలా, కులాన్ని
నాశనం చేయడానికి, వంశాన్ని నాశనం చేయడానికి వచ్చినదానా, ఏ పాపం చేశాడని రాముడి ఇంత
ఘోరమైన కోరిక కోరావే అని, అంటే ఆయన మనసు మీద దెబ్బకొట్టిందేమంటే రాముడు అరణ్యాలకి
వెళ్ళిపోవాలన్నది, మంధర ఏ పట్టు పట్టిందో అది దశరథుడికి గుండెలమీద తగిలింది.
|
ఆవిడేం మారినట్లు కనపడలేదు, రెండు చేతులెత్తి
నమస్కారం చేశాడు, చేసి అన్నాడూ తత్ అలం త్యజ్యతామ్ ఏష నిశ్చయః పాప నిశ్చయే !
అపి తే చరణౌ మూర్ధ్నా స్పృశా మ్యేష ప్రసీద మే !! అసలా శ్లోకాలు కొన్ని కొంచెం
చదవడానికే చాలా కష్టంగా ఉంటాయి, చాలా బాధ ఉంటుంది అయోధ్య కాండ చదివేటప్పుడు
కన్నీళ్ళు రాక చదవడం చాలా కష్టం చాలా కష్టం అంత కదిపేస్తుంది గుండెని, ఆయన అన్నాడు
నీకు నమస్కారం చేయడం కాదు, నా నుదురు నీ పాదములకు తాకించి ప్రార్థన చేస్తున్నాను,
నేను ఒంగి నీ పాదములకు నమస్కారం చేస్తాను, ఈ ఒక్క వరం కోరకు నేను ఉండలేను రాముడు
లేకుండా అని నీకు ఎప్పుడూ రాముడు, భరతుడు సమానులనేదానివిగా... ఆయన మాటల ధోరణికి
పొంతన లేదిక, దీని తరవాత ఇది దీని ముందు ఇదీ దీని వెనక ఇదీ తారవాత ఇది అలా ఏం
లేదు, ఏదో మాట్లాడేస్తున్నాడు అంతే... అంటే ఇంక ఒక మూర్ఛ వచ్చినటువంటివాడు ఎలా
ఉంటాడో... ఒక చిత్త చాంచల్లం వచ్చినవాడు ఎలా ఉంటాడో అలా అయిపోయాడు దాశరథుడు,
అయిపోయి ఏదేదో ఏదేదో ఒక క్రమంలేకుండా మాట్లాడేస్తున్నాడు, ఆయనకి ఇప్పుడు ఆత్రుతంతా
ఏమిటంటే నేను ఉత్తిగనే అన్నానని కైక అంటే బాగుండు, రాముడు భరతుడు నీకు
సమానులనేదానివిగా! రాముడంటే నీకు అంత ప్రీతిగా... ఆఁ!... నాకు తెలుసు కైకా... నేను
నిజంగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యి రాముడికి వద్దూ అంటే నేను ఏమంటానోనని పరీక్ష
చేయడానికి అన్నావు నిజంగా నన్ను నీవు ఆమాట అంటావా? నీవు అనవు? ఇంక చాలు ఈ పరిహాసము
ఇంక వద్దు కైకా నేను తట్టుకోలేక పోతున్నాను, పరిహాసానికే అన్నావు కదూ, ఏదీ
పరిహాసానికే అని అనూ..! అన్నాడు.
|
అటువంటి రాముడు అరణ్యవాసం చెయ్యాలని నీవు ఎందుకు
కోరుకుంటున్నావు? కైకా నీకు నేను ఒక్క మాట చెప్తాను విను నేను చెప్పాను గదా పొంతన
లేదు ఆ మాటలకి, ఏది మాట్లాడుతున్నాడో దేని తరువాత ఏది మాట్లాడుతున్నాడో తెలియదు, మమ
వృద్ధ స్య కైకేయి గతాఽన్త స్య తపస్వినః ! దీనం లాలప్యమాన స్య కారుణ్యం
కర్తు మర్హసి !! నేను దీనున్ని
అయిపోయింది నా జీవితం ఇంకెంతో కాలం ఉండను చరమాంకానికి వచ్చేశాను, బ్రతికినంత కాలం
బ్రతకను తోందరలోనే చనిపోతాను కైకా, చనిపోయే లోపలా నీవు భార్యవి కనుకా వృద్ధున్ని
అయిపోయాను కనుక నీవు నన్ను లాలించు నేను పసిపిల్లాల్లా ప్రవర్తిస్తే నన్ను
లాలించవలసిన దానివి, నీవు నన్నింత బాధ పెడతావా? చిట్ట చివర్లో నేను ఏడుస్తూ
చచ్చిపోయ్యెలా చేయ్యెద్దు కైకా నా మాటవిను, ఈ వరం అడక్కు అని, అంజలిం కుర్మి
కైకేయి పాదౌ చాఽపి స్పృశామి తే ! శరణం భవ రామ స్య మాఽధర్మో మా మిహ స్పృశేత్ !! నీ రెండు కాళ్ళు పట్టుకుంటున్నాను కైకా... నేను
అధర్మంతో రాముడికి రాజ్యం ఇవ్వలేదన్న బాధ నాకు లేకుండా చూడు అని వంగి రెండు కాళ్ళూ
పట్టుకునే ప్రయత్నం చేసి పట్టుకోలేక కన్నుల నీటి ధారలచేత కన్నులు సరిగా కనపడక తూలి
పడిపోయాడు.
ఇంత జరిగితే
ఆవిడందీ! ఎందుకలా మూర్ఛిల్లిపోతావు, ఎందుకలా స్ప్రుహతప్పిపోతావు, ఎందుకలా కన్నీరు
కారుస్తూ భూమి మీద పడిపోతావు, నాకాళ్ళ మీద పడిపోతావు నీకు బుద్ధుందా లేదా శైబ్య
శ్శ్యేన కపోతీయే స్వ మాంసం పక్షిణే దదౌ ! అలర్క శ్చక్షుషీ దత్వా జగామ గతి ముత్తమాం
!! చచ్చిపోతాను చచ్చిపోతాను అంటున్నావు? ఒకానొకప్పుడు ఒక డేగ ఒక పావురాన్ని తరుముకొస్తే, ఆ పావురానికీ డేగకీ
మధ్యలో వాగ్వివివాదం వస్తే శిభి చక్రవర్తి ఆ పావురాని రక్షించడం కోసం డేగకి
పావురమెత్తు మాంసం తన తొడలోంచి కోసి ఇచ్చాడు, అలర్కుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి
అడిగితే తన కన్నులు రెండు పీకి దానం చేశాడు ఆడిన మాటకు అలా కట్టుపడ్డారు వాళ్ళు సత్యం
ధర్మం పరిత్యజ్య రామం రాజ్యేఽభిషిచ్య చ ! సహ కౌసల్యయా నిత్యం రంతు మిచ్ఛసి
దుర్మతే !! దుర్మార్గుడా అనిందావిడా...
ఇంకా మంధర అసూయకి ఇది పరాకాష్ట, ఆవిడ ఎక్కించిన విషమేదో అది కక్కుతోంది కైక.
ఆవిడంది దుర్మతే ఓ దుర్భుద్దీ! సత్యం ధర్మం పరిత్యజ్య సత్యం ధర్మం
వదిలేద్దామనుకున్నావ్వా? రామునికి రాజ్యమిచ్చి కట్టబెడదామనుకుంటున్నావా? సహ
కౌసల్యయా నిత్యం రంతు మిచ్ఛసి రాజ్యం రాముడికిచ్చీ కౌసల్యతో కులుకుదాం
ప్రతిరోజు అనుకుంటున్నావా? దుర్మతే దుష్టబుద్దీ నాకు తెలియదనుకుంటున్నావా?
నేను అన్న వరాలకి కట్టుబడి నీవు రాజ్యం ఇవ్వవలసింది
సతతం ప్రియ కామా మే ప్రియ పుత్రా ప్రియం వదా ! న మయా సత్కృతా దేవీ సత్కారాఽర్హా కృతే తవ !!
ఇదానీం త త్తపతి మాం య న్మయా సుకృతం త్వయి ! అపథ్యం వ్యంజనో పేతం భుక్త మన్న
మివాఽఽతురం !!
విప్రకారం చ రామ స్య సంప్రయాణం వన స్య ఛ ! సుమిత్రా ప్రేక్ష్య వై భీతా కథం మే
విశ్వసిష్యతి !!
కృపణం బత వైదేహి శ్రోష్యతి ద్వయ మఽప్రియం ! మాంచ పంచత్వ
మాపన్నం రామం చ వన మాశ్రితం !!
వైదేహీ బత మే ప్రాణాన్
శోచంతీ క్షపయిష్యతి ! హీనా హిమవతః పార్శ్వీ కిన్నరేణేవ కిన్నరీ !!
నీమాట ప్రకారం నేనేకాని నిజంగా రామున్ని 14
సంవత్సరములు అరణ్యవాసం చెయ్యమని పంపించేస్తే... నేను ఏ పాపం కట్టుకున్నవాన్ని
అయిపోతానో తెలుసా? బాగా వండుకున్న కూర అనుకునీ విషంకలిసినకూర తిన్నవాడు యేతప్పుచేసి
ఎలా ప్రాణం పోగొట్టుకుంటాడో అలా ప్రియపత్నివి అని నిన్ను ఆదరించినందుకూ, నీతో
సఖ్యంగా ఉన్నందుకూ, వరాలిచ్చినందుకూ నాతలకు చుట్టుకొని విషాహారం తిన్నవాడు
చచ్చిపోయినట్టూ నీకు వరం అనుగ్రహించినందుకు నేను రామున్ని అడవులకు వెళ్ళమన్న
మరుక్షణంలో రాముడు కనపడ్డం మానేస్తే నేను చచ్చిపోతాను నా ప్రాణంపోతూంది. నేను
ప్రేతత్వాన్ని పొందుతాను, నా ప్రాణంపోతే నీవు వైధవ్యాన్ని పొందుతావు? నీవు భర్త
పోయినదానివి అవుతావు నీవు ఏమిటో అనుకుంటున్నావు, పైగా నీకింకొక మాట చెప్పనా?
రాముడు అరణ్యవాసానికి నడిచి వెళ్ళిపోతూంటే... నారచీర కట్టుకొని ఏడుస్తూ సుమిత్ర
అక్కడ నిలబడి నావంక భయంగా చూసి అమ్మో! ఇటువంటి పనులు కూడా చేయగలడా..? లేక లేక
కడుపున పుట్టినటువంటి పరమ ధర్మాత్ముడు సుగుణాభి రాముడైన పెద్ద కొడుకుని నార చీరలు
కట్టి అడవికి పంపిస్తాడా..! కైకమ్మకి వరమిచ్చానని ఇంత దుర్మార్గుడా నాభర్త అని భయం
భయంగా నావంక చూస్తూంటే నేతట్టుకోగలనా కైకా ఆలోచించు.
పరమ ధార్మికురాలు
ఎన్నడూ నన్నేమి అడగలేదు, వ్రతాలతో నోములతో పూజలతో తపస్సుతో అగ్నికార్యంతో
బ్రాహ్మణులను సమారాధనతో కాలం వెళ్ళబుచ్చింది, నా అభున్నతికోరి నా దగ్గరికివస్తే
నేను అభినందించలేదు నీవు ఏమన్నా అంటావని, అటువంటి కౌసల్యకి లేక లేక పుట్టినటువంటి
కొడుకయ్యా పెద్దవాడయ్యా రాజ్యం ఇవ్వకపోతే ఇవ్వకపోయావు నార చీరలు కట్టీ అడవికి
పంపిస్తావా? అని అడిగి ఏడుస్తూ నా ఎదురుగుండా నిలబడితే నేనేం సమాధానం చెప్పుకోను
కైకా బాధనాది నన్ను అర్థం చేసుకో నన్ను ఇంత కష్టపెడతావా నేను నీకు ఏం అపకారం
చేశాను, నిన్ను ఎంత ప్రాణ ప్రదంగా
చూసుకున్నాను పైగా రాముడు అరణ్యవాసానికి
వెళ్ళిపోతూంటే... ధర్మపత్ని ప్రాణసమానయైన సీతమ్మ కిన్నెరులు కనపడక కిన్నెర హిమవత్
పర్వత ప్రాంతం అంతా పార్శ్వమునందు పడి ఏడ్చినట్టూ నాపెద్ద కోడలు వైదేహీ జనక
మహారాజుగారి కూతురు అయోనిజ సీతమ్మ నేలపడి ఏడుస్తుంటే రాముడు వెళ్ళిపోతాడనీ నేను నా
పెద్ద కోడలి వంక చూసి ఏమని చెప్పను ఎందుకు పంపించానని చెప్పను వద్దు కైకా
నామాటవిను నేను తట్టుకోలేక పోతున్నాను అవన్నీ నాకళ్ళ ముందు కనపడుతుంటే... నాకూ తల
కదిలిపోతొంది, నా ప్రాణాలు ఇప్పుడే పోయేటట్టు ఉన్నాయి, నా మాటవిను నా బాధంతా ఏమిటో
తెలుసా... రామున్ని పిలిచి రామా! నీవు అరణ్యవాసానికి వెళ్ళిపో అంటే... నేను
వెళ్ళను నాన్నగారూ మీరెవరు రాజ్యము ఇవ్వననడానికి అని నన్ను ఖైదుచేసి పుచ్చుకొనే
కొడుకైతే... నేను సంతోషిద్దును అలా అనడు నా కొడుకు వెళ్ళిపో అంటే నాన్నగారూ అంత
కంటే నాకు ఏం కావాలి వెళ్ళిపోతానంటాడు.
|
బ్రహ్మచర్యంలో ఆ గురువుల్ని సేవిస్తూ బ్రహ్మచర్య
దీక్షతో అగ్నికార్యం చేస్తూ, మంత్ర జపం చేస్తూ రాజరికపు భోగాలు అనుభవించగలిగి ఉండి
కూడా క్రమ శిక్షణతో కష్టపడ్డాడు. గృహస్తాశ్రమంలోకి వచ్చి ఇంకా నా కొడుకు
సంతోషపడిందే లేదు, కైకా ఇంకా ఆనందంగా ఉన్నాడు అని అనుకోక ముందే ఏమి దండకారణ్యం, ఆ
నేల మీద రాలినటువంటి గింజలు ఏరుకోవడమా? దొరికిన కందమూలాలు తినడమా? పట్టు పుట్టాలు
కట్టుకోవలసిన రాముడు నార చీరలు కట్టుకోవడమా? కేశ పాశాల మీద జిల్లేడు పాలు పోసుకొనీ
అదంతా కొప్పు కట్టుకోవడమా? ధణుర్భాణాలు పట్టుకోవడమా? కాళ్ళకి చెప్పులు లేకుండగా
దండకారణ్యములలో తిరగడమా? నేల మీద పడుకోవడమా? హంసతూలికా తలపాల మీద పడుకొని వీణా
నాదానికి నిద్రలేవవలసినవాడు క్రూరమైన జంతువుల అరుపులకి ఉలిక్కి పడి లెస్తుండడమా?
ఎక్కడున్నాడో ఏం తిన్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా కంటికి కనపడకుండా
ఆక్రోషిస్తూ నేను ఇక్కడ అన్నం తిని బ్రతకగలనని అనుకుంటున్నున్నావా కైకా? వద్దు నా
మాటవిను నీకు తెలిసి అడిగావో తెలియక అడిగావో నాకు తెలియదు, ఒకవేళ నీవు తెలిసికూడా
మంకుపట్టు పట్టీ నీకు రాజ్యమే కావాలంటే... ఇదే భరతుడి హృదయం కూడా అయితే నేను
ఇప్పుడే చెప్తున్నాను ఈమాట జరగాలి అని కోరుకున్న ఉత్తర క్షణంలో నా శవమే నీకు
కనపడుతుంది, నేను బ్రతకలేను రాముడు కనపడకుండా వెళ్ళిపోగానే చచ్చిపోతాను.
చచ్చిపోయిన తరువాత
నాకు భరతుడు వచ్చి ప్రేత కార్యాలేం చెయ్యడం కానీ, నా శవాన్ని ముట్టుకోవడం కాని
చెయ్యటానికి విల్లేదు అనార్య ఇతి మా మార్యాః ఎంత ధారుణమైన మాట అన్నాడంటే ఆ
రోజునా, నిజంగా ఒక వేళ భరతుడికి కూడా రాజ్యం నందు అనురక్తి ఉంటే ప్రియం
చేత్ భరత స్యైత ద్రామ ప్రవ్రాజనం భవేత్ ! మా స్మ మే భరతః కార్షీత్ ప్రేత కృత్యం
గతా యుషః !! నా ఆయుర్ధాయం అయిపోయి నేను పడిపోయిన తరువాత నా ప్రేతాన్ని కూడా
భరతుడు ముట్టుకొనుకుండుగాక! కాబట్టీ నామాటవిను నీవు అనుకుంటున్నావు భరతుడు రాజ్యం
తీసుకుంటాడని అనుకుంటున్నావ్ రామ భరతులు రెండు కాదు, భరతుడు పరమ ధర్మాత్ముడు
జేష్టుడైన రామునియందు ప్రీతి కలిగినవాడు నీవు అడిగిన ఈ వరం వల్ల దక్కే ప్రయోజనం
ఒక్కటే... ఈ వరం సంగతి రామునికి తెలియగానే రాముడు అడవులకి వెళ్ళిపోతాడు, రాముడు
వెళ్ళిపోగానే నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోగానే నా శరీరాన్ని తైల ద్రోణిలో
పెడతారు, భరతుడు అంతేష్టి సంస్కారం చెయ్యాలి కాబట్టీ మేనమామగారి ఇంటినుంచి
వస్తాడు, మేనమామగారి ఇంటినుంచి వచ్చి నా శవాన్ని భరతుడు చూస్తాడు,
చూసిన భరతుడు రాజ్యం
తీసుకోడు. ధర్మాత్ముడై నిన్ను నిందచేస్తాడు నిన్ను ఎందుకు అడిగావు వరాలు అని
అడుగుతాడు అప్పుడు ఇటు భర్తా లేక అటు బిడ్డాలేక రెండిటిమధ్యా నలిగిపోయి నీతో పాటు
పెద్ద భార్యల్ని కూడా విధవల్ని చేస్తావు, రాజ్యాన్ని రాజు లేకుండా చేస్తావు,
ఏడుస్తూ భర్త మరణించినటువంటి విషయానికి కారణమౌతావు.
|
కైకా నా మాట విను, నీవు వినమేమోనని నిన్ను
ప్రాధేయపడుతున్నానని స భూమి పాలో విలపన్నఽనాథ వత్ స్త్రియా గృహీతో హృదయేఽతిమాత్రయా పపాత దేవ్యా
శ్చరణౌ ప్రసారితా ఉభౌ అసంస్పృశ్య యథాఽఽతుర స్తథా !! నీ పాదముల మీద నా తల మరొక్క మారు ఉంచి ప్రార్థన
చేస్తున్నాను కైకా, నేను కన్నీళ్ళతో కడుగుతాను కాళ్ళు ఈ వరం అడక్కూ అని వంగీ
వృద్దుడైన రాజు వణికిపోతూ ఆమె పాదముల మీద తల పెడదామని ముందుకు వంగితే ఆయన తల తన
పాదముల మీద పడితే, ఒక వేళ ఒప్పుకోవలసి వస్తుందేమోనని కనీసం ముందుకు పడిపోతున్న
భర్తని చేతులతో కూడా పట్టుకోకుండా క్రూరంగా వెనక్కి నడిచి వెళ్ళిపోతే... తల నేలకి
తగిలి స్పృహతప్పి పోయ్యేటట్టుగా దశరథుడు ముందుకు తూలి పడిపోయాడు. అంత క్రౌర్యం
అవహించింది కైకలో అంత రెచ్చగొట్టింది మంధర. అసూయ ఎంత దూరం వెడుతుందో పెద్దలు మీరు
ఆలోచించెదరు గాక! ఇంత దారుణం జరిగిన తరువాత అందరికి తెల్లవారింది, దశరథుడికి ఇలా
తెల్లవారింది.
అప్పటికి
ఎన్నిమార్లు స్పృహతప్పిపోయాడో ఎన్నిమార్లు ఏడ్చాడో... జుట్టంతా చిమ్ముకుపోయింది,
ఏడుపెరుగని రాజు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడిపోయాయి, గుడ్లు పైకి ఉబికిపోయి కన్నుల
గుడ్లు పోట్లోచ్చీ శిరోభారంతో ఉన్నాడు, శరీరమంతా వణికిపోతోంది. తెల్లవారింది
సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆ వెలుతురి వంక చూసి అన్నాడూ... “ఓ చీకటీ నీవు వెళ్ళవద్దూ
నీవు వెళ్ళితే సూర్యోదయం అయితే అభిషేకం చెయ్యమనీ వచ్చిన నా రాముడితో నేను
మాట్లాడలేను నా రాముడితో ఈ మాట చెప్పలేను అందుకనీ ఓ రాత్రీ నీవు ఇలాగే ఉండిపో...”
అని చీకటితో ప్రాధేయపడ్డాడు. అంటే ఎంత వెంపర్లాడిపోయాడొ దశరథుడు ఆరోజున. ఈలోగా
సుమంత్రుడు వచ్చాడు వచ్చీ ప్రభువు నిద్రలేచి ఉంటాడు అనుకున్నాడు అంతఃపురం
లోపలివరకూ వెళ్ళీ ప్రభువు పడుకున్న శైనాగార తలుపు దగ్గర నిలబడి ʻఇంద్రుడి యొక్క సారధియైన మాతలి ఎంత శుభ
వాఖ్యములతో నిద్రలేపుతాడోʼ అంతటి శుభ
వాఖ్యములతో మహారాజా నేను నిన్ను నిద్రలేపుతున్నాను, వేద వేదాంగాది చతుర్ధశ విద్యలు
చతుర్ముఖ బ్రహ్మగారిని ఎలా నిద్రలేపుతాయో అలా నిద్రలేపుతున్నాను, ప్రభూ నీకు
శుభమగుగాక, మంగళకరమగుగాక, సూర్యోదయం అయిపోయింది, రామ చంద్రమూర్తి యొక్క పట్టాభిషేక
క్రతువు జరుగవలసి ఉంది. ప్రభూ నీ దర్శనం కోసం జానపదులూ, పౌరులూ వేచి ఉన్నారు, లేచి
నీవు వారికి దర్శనం ఇవ్వవలసిందీ అని అన్నాడు.
ప్రభువు ఇస్సీ! ఇక
మాట్లాడ వద్దూ అన్నాడు ఆ స్తోత్రాన్ని తట్టుకోలేక పోయాడు, లోపల నుంచి కైకమ్మందీ సుమంత్ర
రాజా రజనీం రామ హర్ష సముత్సుకః ! ప్ర జాగర పరిశ్రాంతో నిద్రాయా వశమేయివాన్ !! త
ద్గచ్ఛ త్వరితం సూత రాజ పుత్రం యశస్వినం ! రామ మాఽఽనయ భద్రం తే నాఽత్ర కార్యా విచారణా !! ప్రభూవు రాత్రల్లా నిద్రపోలేదు, రాముడికి
పట్టాభిషేకం అలా జరగాలి ఇలా జరగాలి అని ఆనందోత్సాహంతో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు,
అంత సంతోషంగా ఉన్నాడేమో రాత్రంతా నిద్రపోకుండా బడలి ఇప్పుడే పడుకున్నాడు, అందుకని
ప్రభువుని ఇప్పుడు ఇబ్బంది పెట్టకు తొందరగా వెళ్ళి రామున్ని
తీసుకురా... ఇది ప్రభువు
చెప్పాలని అనుకోకు ప్రభువు చెప్పమని చెప్తేనే నేను చెప్తున్నాను ఆలస్యం చేయకు
రామున్ని తీసుకురా అన్నది. ఆయన అప్పటికే నిస్సత్తువుని పొందాడు దశరథుడు, ఆ కైక వంక
చూశాడు ఆశ్యర్యంగా ఎంత నాటకమాడుతోంది అని అనుకున్నాడు, రాత్రల్లా సంతోషంగా
ఉన్నాడన్నందుకు ఇస్సీ అన్నాడు అంత కన్నా ఇంకేం అనలేకపోయాడు.
|
సుమంత్రుడు రథం పట్టుకుని వెడుతున్నాడు రామ
చంద్ర ప్రభువు దగ్గరికి అప్పటికే పౌరులూ, జానపదులు, వశిష్టుడు, రాజర్షులు,
కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మిగిలినటువంటి ప్రముఖులు, నగర ప్రముఖులు అందరూ వచ్చి
అప్పటికే సూర్యోదయం అయిపోతోంది పుష్యమీ నక్షత్రంలో యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి,
తెల్లని పూల దండలు వచ్చేశాయ్ పాలికలొచ్చేశాయ్ ప్రమిదలు వచ్చేశాయ్
నవధ్యాన్యాలొచ్చేశాయ్ పేలాలొచ్చేశాయ్ తేనె వచ్చేసింది ఇతరమైన సంభారాలు వచ్చేశాయ్
పూర్తి పులి చర్మం తీసుకొచ్చేశారు ఆ బంగారపు తొడుగులు కలిగినటువంటి ఎత్తైనటువంటి
ఒక ఎద్దుని తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టారు భద్రగజాన్ని తీసుకొచ్చారు ఔదంభర పీఠం
అంటే మేడి కర్రతో చేసినటువంటి భద్రపీఠాన్ని తీసుకొచ్చారు అభిషేకం చేయడానికి నదీ
జలాలు తీసుకొచ్చారు అన్నీ సిద్దంగా ఉన్నాయి. పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరగాలి,
చక్రవర్తి బయటికి రాలేదు, ఎందుకు రాలేదు దశరథ మహారాజుగారు, వెళ్ళి తొందరగా ఒకసారి
కనుక్కోండీ అన్నారు. మీరు ఎవ్వరూ తొందరపవద్దూ రాజు ఎందుకు ఇంకా ఎందుకు బయటికి
రాలేదో రాజు మాట నాకెందు వినపడలేదో లోపలికి వెళ్ళివస్తానని సుమంత్రుడు కొంచెం
దగ్గరగా వచ్చాడు. తలపు నుంచి దగ్గరా వచ్చి అడ్డంగా తల్పం దగ్గర కట్టబడిన
వస్త్రానికి ఇవతలివైపుకు నిలబడి మహారాజా బైట పౌరులూ జానపదులూ ఋషులూ ఎదురు
చూస్తున్నారు నీ దర్షనంకోసం సూర్యోదయం అయిపోయింది మీరు రాకపోవడానికి కారణం ఏమీ
అన్నాడు.
విసుగించకు
చెప్పిందికదా కైక వెళ్ళి రామున్ని తీసుకురా అదే నా ఆజ్ఞా అన్నాడు. అంతకన్నా
మాట్లాడగలిగిన స్థితిలో ముఖం చూపించగలిగిన స్థితిలో దశరథుడు లేడు ఎందుకంటే ఏడ్చాడు
కైకతో... రేపు బ్రాహ్మణులు పెద్దలూ గురువులు వచ్చి ఎందుకు పంపించావ్ అడవికి రామున్ని
అని అడిగితే నేనేమని సమాధనం చెప్పను, నేను రాజ్యంలో తిరుగుతూంటే కైకమ్మ మాటకోసమనీ
ఆడదాని మాటకోసమని కామాతురతతో కన్నకొడుకినీ రాజ్యాంతరం పంపించినటువంటి తాగుబోతు బ్రాహ్మణుడికన్నా దరిద్రుడు ఈ దశరథుడు అని
చెప్పుకుంటుంటే... నేను ఏమి తిరిగి చెప్పుకోను, నా కన్నకొడుకు పెద్దవాడు అరణ్యంలో
తిరుగుతుంటే నేను ఏ సుఖ శాంతులతో బ్రతుకను కైకా నన్ను అర్థం చేసుకో తెల్లవారితే
పట్టాభిషేకమని నిర్ణయించి ప్రకటించేశాను ఊరంతా ఏమని చెప్పను. సంభారాలు
సిద్దమైపోయాయి నా మాట విను నన్ను అల్లరిపెట్టకు అన్నాడు ఆవిడ వినలేదు కాబట్టీ ఇప్పుడు
సుమంత్రుడు బయలుదేరి రామ చంద్ర మూర్తి యొక్క గృహానికి వెళ్ళాడు. వెళ్ళాడు అక్కడ
అంతా మంచి సంతోషంగా హాడావిడిగా ఉంది ఆ సంతోషంగా వెళ్ళేసరికీ పాపం పట్టాభిషేకం
జరుగుతుందన్న ఉత్సాహంతో ఉపవాసంచేసి ఆయన తెల్లవారుఝామున సంధ్యావందనం గాయిత్రీ జపం
చేసుకొని అన్నీ
అనుష్టానంచేసి ఉన్నాడు. ఆ అనుష్టానం చేసి ఉన్న సందర్భంలో సుమంత్రుడు వచ్చాడని అనేసరికి
సంతోషించాడు. సంతోషించి నేను ఇప్పుడు దశరథ మహారాజుగారి అంతఃపురానికి మీరు
కోరుకున్నట్లే తప్పకుండా బయలుదేరి వస్తున్నాను నాకు పట్టాభిషేకం జరుగుతుందీ అన్న
ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు రాముడు బయలుదేరి దశరథ మహారాజుగారి అంతఃపురానికి
వెలుతుంటే మిత్రులందరూ కూడా అంతే కోలాహలంతో సంతోషంతో తిరిగి రాముడు పట్టాభిషేకం
చేసుకొని వస్తాడూ అని అనుకున్నారు.
|
సీతమ్మ తల్లి ఆయనతో పాటు అనుగమించి ఆయనను
పంపించడం కోసమని చేప్పి ద్వారం వరకే వచ్చిందట బయటికి రాలేదట. రామాయణం ధర్మ
శాస్త్రం కదాండీ! పతి సమ్మానితా సీతా భర్తారమ్ అసితేక్షణా ! ఆద్వారమ్ అను వవ్రాజ మఙ్గళా
న్యభిదధ్యుషీ !! ఆవిడ ద్వారం వరకే
ఎందుకొచ్చిందీ అంటే శుభ కార్యం మీద కానీ ఏదైనా మంగళప్రదమైన విషయం మీద కానీ భర్త
బయలుదేరి వెళ్ళేటప్పుడు భర్తని గుమ్మందాటి బయటికొచ్చి భార్య సాగనంపకూడదు.
గుమ్మానికి లోపల ఉండి భార్య సాగనంపాలి, కాబట్టి ఆవిడ పతి సమ్మానితా సీతా. చాలా
సంతోషంగా సీతా! నేను యవ్వరాజ్య పట్టాభిషేకానికి వెడుతున్నాను అంటే మీరు యవ్వరాజ్య
పట్టాభిషేకం చేసుకొని వస్తారా! అని పరమ ప్రీతితో సీతమ్మ వంక చూసినటువంటి రాముని
యొక్క చూపుల చేత సంతోషించి ఉన్నటువంటి సీతా అసితేక్షణా నల్లని చూపులు
కలిగిన తల్లీ ఆద్వారమ్ అను వవ్రాజ అక్కడ ఆ ద్వారము యొక్క గడపవరకు వచ్చింది
మఙ్గళా న్యభిదధ్యుషీ మంగళము జరగాలన్న కోరికతో గడపవరకు వచ్చి సాగనంపింది.
రామాయణం
ధర్మశాస్త్రం మనం ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తూంటూంది కాబట్టి ఇప్పుడు ఆయనతో...
సీతమ్మ అంటుంది రామునితో దీక్షితం వ్రత సంపన్నం వరాఽజిన ధరం శుచిం ! కురంగ శృంగ
పాణిం చ పశ్యంతీ త్వాం భజామ్యఽహం !! నేను వ్రతం ఆచరించి దేవతలని ప్రార్థన చేస్తాను
నేను తొందరలో రామా మిమ్మల్ని ఎలా చూడాలో తెలుసా! దీక్షితం దీక్షలో ఉన్న
రామున్ని చూడాలి, యౌవ్వరాజ్య పట్టాభిషేకానికి వ్రత సంపన్నం వ్రతం చేస్తున్న
రామున్ని చూడాలి, వరాజిన ధరం శుచిం జింక వస్త్రం కట్టుకున్నటువంటి వాన్ని
నేను చూడాలి కృష్ణా జనం , కురంగ శృంగ పాణిం చ అటువంటి వాడు దుప్పి కొమ్ము
చేత్తో పట్టుకున్నవాన్ని చూడాలి అది నా సంతోషం. దుప్పి కొమ్ము ఎందుకు చేత్తో
పట్టుకోవాలి అంటే దీక్షా స్వీకారం చేస్తున్నానూ అని దేనికైనా సంకల్పం చేసిన తరువాత
దీక్ష పరిసమాప్తి పర్యంతం ఒంటికి దురద పెడితే చేతికి గోళ్ళతో గోక కూడదు దీక్ష
భగ్నమైపోతుంది. దుప్పి కొమ్ముతోటే శరీరాన్ని గోక్కోవాలి అందుకనీ దీక్షా స్వీకారం
చేస్తూ దుప్పి కొమ్ము చేత్తో పట్టుకుంటారు. నేను మీతో మనవి చేశాను కదూ రామాయణం
ధర్మ శాస్త్రం. ప్రతి విషయాన్ని మనకు చెప్తుంది అందుకనీ ఆ దుప్పి కొమ్మొకటీ చేత్తో
పట్టుకున్నటువంటి రామున్ని నేను చూడాలి పూర్వం దిశం వజ్ర ధరో దక్షిణాం పాతు తే
యమః ! వరుణః పశ్చిమా మాశాం ధనేశ స్తూత్తరాం దిశం !! తూర్పు దిక్కునుండి
ఇంద్రుడు, దక్షిణ దిక్కునుంచి యమ ధర్మరాజు, పశ్చిమ దిక్కునుంచి వరుణుడు, ఉత్తర
దిక్కునుంచి కుభేరుడు నిన్ను అనుగ్రహించు గాక! అని రాముడికి ఆమె మంగళ
ప్రదమైనటువంటి వాక్కు పలికి భార్య అటువంటి స్థితిలో ఆశీర్వచన పూర్వకంగా మాట్లాడ
వచ్చు క్షత్రియ కులంలో. ఆ రాముడు తలుపు తీసుకొని ఏకాంత మందిరంలోంచి బయటికి
వచ్చాడు, వచ్చేటప్పటికటా రాముడు పర్వత గుహల్లోంచి వస్తున్న సింహలా ఉన్నాడట.
|
సరే కలిసి దశరథ
మహారాజు గారి యొక్క గృహానికి వెళ్ళారు అంతః పురంలోకి రాముడు లోపలికి వెళ్ళాడు,
దశరథుడికి నమస్కారం చేశాడు. ఆ నమస్కారం చేస్తే దశరథుడు రామే త్యుక్త్వా చ వచనం
బాష్ప పర్యాకు లేక్షణః ! శశాక నృపతి ర్దీనో న ఈక్షితుం నాఽభిభాషితుమ్ !! కన్నుల వెంట ధారలగా నీళ్ళు కారిపోతున్నాయి,
రాముడు వచ్చాడూ అని చెప్పీ రామ వర్మా అహంభో అభివాదయే అని కదా అంటాడు,
క్షత్రియులు వర్మా అని కలుపుకుంటారు అందుకనీ రామ వర్మా అహంభో అభివాదయే అని
నమస్కారం చేస్తే... రాముడు వచ్చాడు రాముడి మాట వినపడింది, ఇప్పుడు దశరథుడు ఇలా
చూడాలి కదా అలా చూడలేకపోయాడట, ఇలాగే కూర్చొని వలవలవల ఏడ్చేశాడు. ఇప్పుడు నేను ఏం
మొఖం పెట్టుకొని చూడను రామునివంక నిన్న రెండుమాట్లు పిలిచి చెప్పా యవ్వరాజ్య
పట్టాభిషేకం ఇస్తానని, ఇప్పుడు ఏమని చూడని ఆయన వంక చూడలేక వలవలవల అని ఏడ్చేశాడట.
రాముడు అది చూసి
కదిలిపోయాడట, కదిలిపోయి ఇంద్రియములన్నీ విచలితమైపోయి ఒక్కసారి ఆశ్చర్యపోయి అన్నాడట
కచ్చిన్ మయా నాఽపరాధమ్ అజ్ఞానాత్ యేన మే పితా ! కుపిత స్తన్ మమాఽఽచక్ష్వ త్వం చై వైనం
ప్రసాదయ !! అమ్మా! ఎందుకమ్మా
నాన్నగారు అలా ఏడుస్తున్నారు... నావల్ల తెలిసికానీ తెలియక కానీ ఏదైనా అపరాధం
జరిగిందామ్మా... ఏదైనా అనకూడని మాట అన్నానామ్మా... కచ్చిన్ న కించిత్ భరతే
కుమారే ప్రియ దర్శనే ! శత్రుఘ్నే వా మహా సత్వ్తే మాతృణాం వా మమాఽశుభమ్ !! అమ్మా నాకు అత్యంత ప్రియమైన సోదరులు భరత
శత్రుజ్ఞులు దూరంగా ఉన్నారూ వారికి ఏమైనా జరగ కూడనిది జరిగిందా... అతోషయన్ మహా
రాజమ్ అకుర్వన్ వా పితు ర్వచః ! ముహూర్తమ్ అపి నేచ్ఛేయం జీవితుం కుపితే నృపే !! మహారాజుకి
నా వలన ఏదైనా తండ్రికి అపచారం కలగడం వల్ల తండ్రి నావల్ల నిజంగా కన్నులవెంట నీళ్ళు
పెట్టుకొని ఉంటే ఒక్క ముహూర్తం కాలం కూడా నేను ఇంక బ్రతకను. నా వలన తండ్రి
ఖేదపడితే ఆ బ్రతుకిక అర్థం లేదు. అమ్మా! నావలన ఏదైనా ఇబ్బంది కలిగిందామ్మా! అని
అడిగాడు. కైకమ్మ అందీ ఏమీ లేదయ్యా నిన్న రాత్రీ మీ నాన్ననీ రెండు వరాలు అడిగాను,
ఎప్పుడో ఇచ్చాడు. ఆ రెండు వరాలని నిజం చెయ్యాలయ్యా అని ప్రతిజ్ఞ చేయమన్నాను,
ప్రతిజ్ఞ చేశాడు ఆ రెండు వరాలు తను చేసిన ప్రతిజ్ఞలు నిలబడుతాయో నిలబడవో అని బెంగ
పెట్టుకొని ఏడుస్తున్నాడయ్యా అంది, అంటే రాముడు అన్నాడు ఏడవడం దేనికమ్మా దానికీ
|
నియుక్తః గురుణా పిత్రా నృపేణ చ హితేన చ ! తత్ బ్రూహి వచనం దేవి రాజ్ఞో యత్
అభికాంక్షితమ్ !!
కరిష్యే ప్రతిజానే చ రామో
ద్వి ర్నాఽభి భాషతే !!
అమ్మా! రాముడికి
రెండు మాటలు తెలియవమ్మా... నాన్నగారు బెంగపెట్టుకోవడం ఎందుకమ్మా... ప్రతిజ్ఞచేస్తే
నాన్నగారన్నమాట నావల్ల నిజం కావలసి వస్తే అమ్మా నేను ఇవ్వాళ చెప్తున్నాను, ఒకవేళ
నాన్నగారు నన్ను అగ్నిహోత్రంలో దూకేయ్ రామా అంటే దూకేస్తానమ్మా, కాదూ తీక్షణమైన
విషాన్ని అక్కడ పెట్టి రామా తాగూ అని అంటే ఎందుకూ అని అడగనమ్మా... తాగేస్తానమ్మా.
నాన్నగారి ఏది చెప్తే అది చెయ్యడమే అది నాకు పుత్ర ధర్మం అమ్మా... నా వలన ఏది
జరగదని నాన్నగారు బెంగ పెట్టుకుంటున్నారో, నాన్నగారు ఏ ప్రతిజ్ఞ చేశారో నీవైనా
చెప్పవమ్మా... అని అడిగారు.
ఏం లేదు నాయనా సప్త సప్త చ వర్షాణి దణ్డకాఽరణ్యమ్ ఆశ్రితః ! అభిషేకమ్
ఇమం త్యక్త్వా జటా చీర ధరో వస !! ఏం లేదయ్యా! నీవు 14 యేళ్ళు జఠలు ధరించి నార చీర కట్టుకొని అరణ్యవాసానికి
వెళ్ళాలి, భరతుడికి యౌవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి ఈ రెండు అడిగా అడిగితే ఇదిగో
నిన్న రాత్రి నుంచి ఇలా పొర్లుతున్నాడు ఇలా నేల మీదపడి మీ నాన్న. అంటే రాముడు
అన్నాడు అయ్యయ్యో అమ్మా! ఎంత మాటన్నావు తల్లీ నేను తప్పకుండా అరణ్యవాసానికి
వెళ్ళిపోతాను తల్లీ అమ్మా కానీ నా బాధ ఒక్కటే... నాన్నగారు ఒక్కసారి పన్నెత్తి
నాతో ఒక్క మాట మాట్లాడితే నేను ఎంతో సంతోషిస్తానమ్మా... నాన్నగారు మాట్లాడకపోవడమే
నాకు ఎంతో బాధగా ఉందీ, రామో ద్వి ర్నాభి భాషతే అమ్మా నాకు రెండు మాటలు
తెలియవమ్మా...! నేను ఏం చెప్పానో అది చేస్తాను తప్పకుండా చేస్తాను, నా మాట
నమ్మమ్మా అన్నాడు. అనీ ఈ మాటలు చెప్తే... ఆవిడ ఎంత చమత్కారమైన మాట అందో
తెలుసాండీ... నీతో దశరథుడు ఎందుకు మాట్లాడటం లేదో తెలుసా రామా! యావత్ త్వం న
వనం యాతః పురాత్ అస్మాత్ అభిత్వరన్ ! పితా
తావత్ న తే రామ స్నాస్యతే భోక్ష్యతేఽపి వా !! మీ నాన్నగారు పరమ ధర్మాత్ముడు, ఇప్పుడు నీవు
అరణ్యవాసానికి వెడతావు అని నాకిచ్చిన వరం నీవు వెడితేనే గదా తీరుతుంది.
నీవు అంతఃపురంలో
తిరుగుతున్నంత సేపూ తను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని స్నానం చేయటం లేదు అన్నం
తినటంలేదు, మీ నాన్న స్నానం చేసి అన్నం తినాలంటే నీవు తొందరగా వెళ్ళిపోనాయనా నీవు
అరణ్యానికి ఇంక ఇక్కడ తిరక్కూ, అమ్మా అదామ్మా కారణం నాన్నగారు నా వల్లామ్మా
నాన్నగారు స్నానం చేయలేదు అన్నం తినలేదు ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అని
కైకమ్మ వంక తిరిగి అన్నాడూ న అహమ్ అర్థపరో దేవి లోకమ్ ఆవస్తుమ్ ఉత్సహే ! విద్ధి
మామ్ ఋషిభి స్తుల్యం కేవలం ధర్మ్ ఆస్థితమ్ !! అమ్మా న అహమ్ అర్థపరో దేవి అమ్మా
నాకు ఈ రాజ్యం మీద ఐశ్వర్యం మీద భ్రాంతి ఉందనుకుంటున్నావా? నాకేం లేదు నీవిప్పుడు
ఈ వరాలను అడిగానని చెప్పినప్పుడు నా మనసులో ఏ కదలికా లేదు, నేను ఎప్పుడూ కోరలేదు,
నిన్న నాన్న గారు ఇస్తానన్నారు తీసుకుంటానన్నాను, ఇవ్వాళ నాన్నగారు అరణ్యాలకి
వెళ్ళమన్నారు వెళ్ళిపోతున్నాను, న అహమ్ అర్థపరో దేవి అమ్మా నాకు ఐశ్వర్యం
మీద బ్రాంతిలేదు, నాకు కావలసింది ధర్మం ఒక్కటే... ʻపుత్ర ధర్మముʼ కాబట్టి అమ్మా నేను తప్పకుండా వెళ్ళిపోతాను
కాని అమ్మా! నేను ఇంత శుశ్రూష చేసానే నీకు నా గుణములు నీకు తెలుసనుకున్నానే నేను
అరణ్యవాసానికి వెళ్ళడానికి నన్ను అరణ్యవాసానికి పంపడానికి నాన్నగారిని వరమడిగావా!
అంటే అమ్మా నా గుణములు నీకు అర్థం కాలేదనుకుంటున్నానమ్మా అన్నాడు.
|
వెళ్ళి కౌసల్యా
మందిరంలో ప్రవేశించాడు, లక్ష్మణ మూర్తి మాత్రం ఊగిపోతున్నాడు ఇది విని. కౌసల్యా
మందిరానికి వెడితే ఆ తల్లీ అక్కడ అగ్నిహోత్రం చేస్తోంది అక్కడ బ్రాహ్మణులందరూ
ఉన్నారు, వృద్ధ బ్రాహ్మణులున్నారు దాన ధర్మాలు చేస్తోంది, కొడుక్కు పట్టాభిషేకం
పొంగిపోతూంది. రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు అన్నారు, తల్లి ఏం చేస్తుంది కడుపు
తడుతుంది కదా నాన్నా రామా ఇవ్వాళ నీకు యౌవ్వరాజ్య పట్టాభిషేకం రా రారా ఈ ఆసనం మీద
కూర్చో... అని పీఠ వేసింది. పీఠ వేసి నాన్నా నీకు పదార్థం పెడతాను కడుపునిండుగా
తినరా అంది. అంటే రాముడు అన్నాడు అమ్మా!
దత్త మానస మాఽఽలభ్య భోజనేన నిమంత్రితః ! మాతరం రాఘవః కించిత్
ప్రసార్య అఞ్జలిమ్ అబ్రవీత్ !!
గమిష్యే దండకాఽరణ్యం కిం అనేన ఆసనేన మే ! విష్టరాసన యోగ్యో హి
కాలోఽయం మాముపస్థితః !!
భరతాయ మహా రాజో యౌవ రాజ్యం ప్రయచ్ఛతి ! మాం పునః దణ్డకాఽరణ్యే వివాసయతి తాపసం !!
అమ్మా! మహారాజుగారు
నన్ను 14 యేళ్ళు దండకారణ్యానికి వెళ్ళిపోమన్నారు, నేను అరణ్యవాసానికి
వెళ్ళిపోతున్నానమ్మా ఇంక నీ కొడుకు ఇటువంటి ఆసనాల మీద కూర్చో కూడదు, కేవలం నేను
దర్భాసనం మీదే కూర్చోవాలి, అందుకని అమ్మా నీవు నాకన్న తల్లివి, నీవు వేసిన
ఆసనాన్ని తిరస్కరించానని అనుకోకు నేను కూర్చున్నట్లే ఒక్కసారి ఇలా కూర్చొని
లేస్తాను అంటే పెద్ద యెడల
గౌరవానికి ఏం చేస్తారంటే ఒక్కసారి దాన్నితీసి వాసనచూడ్డమో ముట్టుకోవడమో ఏదో చేస్తే
ఆ వస్తువుని పుచ్చుకున్నట్లేలెక్క. కాబట్టి నేను అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వస్తూందీ నాన్నగారు ఆజ్ఞాపించారు
నాకు ఆజ్ఞ ఇవ్వు. వెంటనే అందండీ కౌసల్యా యది పుత్ర న జాయేథా మమ శోకాయ రాఘవ ! న
స్మ దుఃఖమ్ అతో భూయః పశ్యేయమ్ అహమ్ అప్రజాః !! రామా! అసలు నీవు పుట్టకపోతే
బాగుండేదిరా... పుట్టకపోతే... ఒక్కటే మాట ఎక్కడికెళ్ళినా గొడ్రాలు గొడ్రాలు
గొడ్రాలు అని అనేవారు ఆ మాటకే ఏడుస్తూ ఉండేదాన్ని, ఇప్పుడు రామా! పుట్టి ఎంత
ఏడుపురా నాకు, పుట్టినవాడివి సుగుణాభి రాముడివి లేక లేక పుట్టినవాడివి కష్టపడి
పెంచుకున్నాను ఒక్క శుభం ఒక్క మంగళం నేను అనుభవించింది లేదు నీ చేతిలో చచ్చిపోవాలీ
అని కోరుకుంటుంన్నాను నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగితే చూడాలి అనుకున్నాను నా
కొడుకు రాజైతే చూడాలి అనుకున్నాను ఇవి చూడలేకపోతున్నాను ఒకెత్తు ఎక్కడో అరణ్యాలకి
వెళ్ళిపోతావా అరణ్యంలో కిందపడిన గింజలు ఏరుకొని అన్నం తింటావా..? కందమూలాలు
సేవిస్తావా... ఏమిరా నా ఖర్మా ఇక్కడ కూర్చొని నిన్ను తల్చుకుంటూ ఏడుస్తూ
కూర్చోనా... ఇందుకా నీవు నాకు పుట్టింది నీవు పుట్టకపోతే
పుట్టలేదని పిల్లలు
లేరనుకునేదాన్నిరా... పుట్టినందుకు బ్రతికున్నాన్నాళ్ళు ఏడుస్తూనే ఉండాలిరా...
తలుచుకు తలుచుకు ఎన్ని తలుచుకోవాలిరా నేను ఇప్పుడు నీవు ఎక్కడున్నావోని బెంగ ఏం
తిన్నావోని బెంగ ఎక్కడ పడుకున్నావోని బెంగ ఎవరేం చేస్తున్నారోని బెంగ 14 యేళ్ళు
ఒక్కరోజా రెండు రోజులా... ఎప్పటికి చూస్తానురా నిన్నుమళ్ళీ... ఎప్పుడు నిన్ను
ముట్టుకుంటానురా... ఎప్పుడురా నాకు సంతోషం రామా ఈబాధ నేను పడలేను రా అంది ఆవిడా.
|
అంటే లక్ష్మణుడు కౌసల్యాదేవి మాటలకు తట్టుకోలేక
ఊగిపోయాడు ధనుస్సు పట్టుకొని ఆయన అన్నాడు గురో ర్ప్యవలిప్త స్య కార్య కార్య మఽజానతః ! ఉత్పథం
ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం !! తండ్రే కావచ్చు గురువే కావచ్చు ధర్మం తప్పితే యవ్వనంలో ఉన్న
కైకమ్మ మాటవిని నీకు రాజ్యం ఇవ్వనంటాడా... అన్నయ్యా ఆజ్ఞాపించు ధనస్సు నా చేతిలో
ఉండగా నీ పట్టాభిషేకం ఆపగలిగిన మొనగాడు ఇక్కడ లేడు నిగ్రహించి ముసలి దశరథున్ని
తీసుకెళ్ళి కారాగారంలో పడేసి నీకు పట్టాభిషేకం చేసేస్తాను ఇదే ముహూర్తానికి.
అన్నయ్యా ఊ అను అన్నాడు. అని కౌసల్య వంక చూసి అన్నాడు అమ్మా నీవు బెంగపెట్టుకోకు
నీవు అలా ఏడవద్దమ్మా నేను తట్టుకోలేను దీప్తమ్ అగ్నిమ్ అరణ్యం వా యది రామః
ప్రవేక్ష్యతే ! ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వమ్ అవధారయ !! అన్నయ్య
అగ్నిలో ధూకితే అన్నయ్య కన్నా ముందు నేను పడి కాలిపోయానని గుర్తు, అన్నయ్య
అరణ్యానికి వెళితే అన్నయ్యకన్నా నేను అరణ్యానికి వెళ్ళిపోయానని గుర్తు అమ్మా
అన్నయ్య ఏది అనుభవించినా ముందు నేను అనుభవిస్తాను, అమ్మా నీవు ఏడవద్దమ్మా నేను
చూడలేనమ్మా.
ఎంత భక్తో! నిజంగా
ఏవో కొన్ని శ్లోకాలు విడిచిపెట్టి చెప్పడం కానీయండీ అయోధ్య కాండండీ కన్నీరు
పెట్టుకోకుండా చదవడం చాలా చాలా కష్టం అంత క్లేశంగా ఉంటుంది ఆ కథా. అందుకే ఏకాంతంలో
ఉండి ఏకాంతంలో చదువుకొని ఎవరికి కనపడకుండా రామాయణం చదువుకొని కళ్ళు తుడుచుకోవడమే
తప్పా పదిమందిలో కూర్చొని చదివేదీ కాదు పదిమందిలో కూర్చొని అదేంటీ ఆ హృదయం
కదిలిపోయేదీ కాదు శ్రీరామాయణం అంటే శ్రీరామాయణమే... కాబట్టీ ఈ మాటలన్న తరువాత
కౌసల్యంది లక్ష్మణుడు చెప్పినమాట ఆలోచించు ఒకవేళ రాజును నిగ్రహించి నీవు రాజ్యం
తీసుకుంటే ఎలా ఉంటుంది అని, అంటే రాముడు అన్నాడు నాఽస్తి శక్తిః పితు ర్వాక్యం
సమఽతిక్రమితుం మమ ! ప్రసాదయే త్వాం శిరసా గన్తుమ్ ఇచ్ఛామి అహం వనమ్ !! అమ్మా రాజ్యాజ్ఞ తిరస్కరించరానిది, తండ్రి మాట
శిరోధార్యం తండ్రి అంటే అమ్మా ఈ కన్నులకు కనపడేటటువంటి దైవం ఈ శరీరం నా తండ్రి
ఇస్తే వచ్చింది. ఆయన ఇచ్చిన శరీరంతో ఆయనని అసత్యమునందు నిలబెట్టడమా... ఆయనకి
కీర్తి తెస్తే నాకు చాలు అమ్మా నీవు ఆ మాట అనకూడదు నేను వినకూడదు, నాన్నగారి మాట
పాటిస్తాను అమ్మా మన వంశంలో సగరులు తండ్రి మాటవిని అశ్వం కోసం వెళ్ళి బూడిద
కుప్పలు అయ్యారు పరుశురాముడు తండ్రి మాటవిని తల్లి రేణుకని చంపేశాడు, నాయనా
లక్ష్మణా అమ్మ బాధపడేటట్లు నీవు ఉద్రేకంగా మాట్లాడ కూడదు, అమ్మా లేనిపోని
ఉద్రేకాన్ని పొందుతూంది, ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితమ్ ! ధర్మ
సంశ్రితమ్ ఏతత్ చ పితు ర్వచనమ్ ఉత్తమమ్ !! పితుర్వచనాన్ని పాటించడంకన్నా ధర్మం
కొడుక్కి ఇంకోటి లోకంలో లేదూ లేదూ లేదూ కాబట్టి లక్ష్మణా నా తండ్రి దశరథ
మహారాజుగారు ఏం చెప్పాడో అది నేను చేస్తాను.
అయినా నేను ఒక మాట
అడుగుతాను నీవు ఒకటి బాగా ఆలోచించు అమ్మా కైకని తిట్టకండీ, నాన్నగారు దశరథున్ని
తిట్టకండీ ఎందుకో తెలుసా అమ్మ కైకమ్మ ఎటువంటిదో నాకు తెలుసు, అమ్మ ఎప్పుడైనా
నాపట్ల ఇంకోలా మాట్లాడిందా... ఎంత ప్రేమగా చూసింది ఎంత లాలించింది నన్ను ఎంత నీతో
సమానంగా చూసింది అటువంటి అమ్మ నిన్న రాత్రి
రెండు వరాలు అడిగింది నన్ను
అడవికి వెళ్ళమంది అంటే... పిలిచి యౌవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న తండ్రి నన్ను
చూడకుండా ఉండలేని తండ్రి నేను వెళ్ళిపోతానని రాత్రల్లా ఏడ్చి ఏడ్చి మూర్చపోయిన
తండ్రి యౌవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యలేక నన్ను అరణ్యవాసానికి పంపిస్తున్నాడంటే...
కైకమ్మలో ఇంత మార్పు వచ్చిందంటే... అమ్మా అది దశరథుడు కాదమ్మా, కైకమ్మ కాదమ్మా
దైవం. దైవం ఒకటుందమ్మా... అది ఏమనుకుంటుందో అది నెరవేరుతుంది మనమనుకున్నవన్నీ
నెరవేరిపోతే దైవమన్నది ఎక్కడుందమ్మా పురుష ప్రయత్నమే నెగ్గుతుంది అసంకల్పిత మే
వేహ యదఽకస్మాత్ ప్రవర్తతే ! నివర్త్యాఽఽరంభ మాఽఽరబ్ధం నను దైవ స్య కర్మ తత్
!! అమ్మా! లోకంలో మనం అనుకున్నది జరగలేదూ
అంటే ఈశ్వరుడు అనుకున్నది జరుగుతున్నది అని గుర్తు ఈశ్వరుడు అనుకున్నది
జరగాలంటే మనమనుకున్నది ఈశ్వరున్ని నిగ్రహించడానికి ఈశ్వరున్ని నీ కంటికి
కనపడడుగా... కాబట్టి ఈశ్వరుడు అనుకున్నది అనుకున్నట్లు జరగడం తప్పా... ఇంకోలా
ఉండదు కాబట్టి ఈశ్వర శాసనాన్ని అనువర్తించి మనుష్య ధర్మాన్ని నిలబెట్టుకోవాలి,
కాబట్టి అమ్మా నీవు ఆ మాట అనుకూడదు నేను వినకూడదు. నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు.
అంటే ఆవిడందీ నాయనా ఒక్కనాడు దశరథుడు అంతఃపురానికిరాడు ఇప్పటికే నన్ను సవతులు
చులకనగా చూస్తారు, లేక లేక పుట్టిన కొడుకివి నువ్వు కూడా అడవులకి వెళ్ళిపోయిన
తరువాత నేను ఎవరి కోసం ఇక్కడ బ్రతకాలి నేను కూడా నీతో అరణ్యానికి వచ్చేస్తాను
నన్ను తీసుకెళ్ళిపొమ్మంది.
|
రాముడు అన్నాడు భర్తుః కిల పరిత్యాగో నృశంసః
కేవలం స్త్రియాః ! స భవత్యా న కర్తవ్యో మనసా అపి విగర్హితః !! అమ్మా భర్త బ్రతికుండగా భర్తని
విడిచిపెట్టి వెడతానని ఏ స్త్రీ తన నోటివెంట అనకూడదు, యావత్ జీవతి
కాకుత్స్థః పితా మే జగతీపతిః ! శుశ్రూషా క్రియతాం తావత్ స హి ధర్మః సనాతనః !! అమ్మా
ధర్మమేమిటో తెలుసా తండ్రిగారు
బ్రతికున్నంతకాలం ఆయన మాట వినడం ఆయన్ని సేవించడం నాకు ధర్మం. భర్త
బ్రతికున్నన్నాళ్లు ఆయన్ని సేవించడం ఆయన మాట వినడం నీకు ధర్మం. వ్రతోపవాస
నిరతా యా నారీ పరమో త్తమా ! భర్తారం నాఽనువర్తేత సా చ పాపగతి
ర్భవేత్ !! ఎన్ని వ్రతాలు చేసినా
ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని పూజలు చేసినా భర్త చెప్పిన మాట వినకుండా భర్తని ధిక్కరించి భర్తని విడచి
పెట్టి బ్రతుకుతాన్నన్న కాంతకి ఏపుణ్యమూ దక్కదు భర్తు శుశ్రూషయా నారీ
లభ్యతే స్వర్గ ముత్తమం ! ఆపి యా నిర్నమస్కారా నివృత్తా దేవ పూజనాత్ !! ఆమె నమస్కరించకపోయినా దేవ పూజ
చేయకపోయినా భర్తను అనుగమించిన స్త్రీ ఎవరై ఉంటుందో..? ఆమె అన్నిపూజలూ చేసినట్టే
శుశ్రూషా మేవ కుర్వీత భర్తుః ప్రియహితే రతా ! ఏష ధర్మః పురా దృష్టో లోకే వేదే
శ్రుతః స్మృతః !! స్మృతి వేదం చెప్పినా, స్మృతి చెప్పినా లోకం చెప్పినా, ఋషులు
చెప్పినా ఇదే ధర్మం. తండ్రి
మాట కొడుకు వినాలి భర్త మాట భార్య వినాలి.
నీవు ఆయన మాట వినకా
నేను ఆయన మాట వినకా మనమే తిరగబడిపోతే నేను నాన్నగారిని నిగ్రహించి నీవు ఆయన్ని
వదిలిపెట్టేసి ఆయన మనకు ఇస్తానన్నంతకాలం తండ్రా?, నీ కోర్కెలు తీర్చినంత కాలం
భర్తా?, ఒక్కమాట ఆయన ధర్మాని కట్టుబడి వరమిస్తే ఆయన్ని ధర్మానికి నిలబెట్టడానికి
కష్టపడి కొడుకుగా నేను సిద్దపడక, భర్తని అర్థం చేసుకొని నిలబడి ఆయన్ని సేద
తీర్చడానికి నీవు సిద్ధపడకపోతే ఇంకెందుకమ్మా ఆయన భర్తృత్వం పితృత్వం. మనం అది
అర్థం చేసుకొన్ననాడు నేను కొడుకు నీవు భార్య అమ్మా నీవు ఆ మాట అనకూడదు నేను
వినకూడదు. లక్ష్మణా నేను నీకు ఇదే చెప్తున్నాను ఇది నా
నిశ్చయం నేను తండ్రి మాట పాటించటం తప్పా నాకు ఏదీ అక్కర లేదు. నాకు పుత్ర ధర్మం
కావాలి కొడుకు తన మాట నిలబెట్టాడని నా తండ్రి సంతోషిస్తే నాకది యావత్ రాజ్యం కన్నా
దేని కన్నా గొప్పది. నా తండ్రి
సంతోషించని నాడు నేను ఎన్నిపొందినా నేను ఏడుస్తూ పొందుతాను నాకు అక్కరలేదు
రాజ్యం నాకు తండ్రి మాటే కావాలి నాకు పుత్ర ధర్మమే కావాలి ఇదీ రాముడంటే...
రాముడంటే ధర్మం మహా తల్లి కౌసల్య చెప్పినటువంటి మాటా ప్రతీ తల్లి
తెలుసుకోవలసినటువంటి మాట ప్రపంచంలో ప్రతి తల్లీ ప్రతి తండ్రీ రామాయణంలో ఈ శ్లోకాన్ని
తెలుసుకోవలసిన శ్లోకం.
|
ఈ మాట నాటుకుంది
రాముడికి 14 యేళ్ళు అందుకే రాముడు ధర్మం తప్పలేదు అరణ్యంలో ఉన్నాడు. ఎన్ని
అడ్డదారులొచ్చినా తాను చేరుకోడానికి ధార్మికమైన మార్గంలో వెళ్ళాడు తప్పా ఎన్నడూ
ధర్మ పథాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వచనం చేస్తోంది. నాయనా నీకు
విశ్వామిత్ర మహర్షి ఇచ్చినటువంటి అస్త్రాలు, నీవు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు
నమస్కారం చేసేటటువంటి దేవాలయాలలో ఉన్న దేవతలు మహర్షులు సమిధలు ధర్బలు పవిత్రములు
అగ్ని వేదికలు దేవాలయాలు చిత్ర విచిత్రమైనటువంటి పూజా స్థలాలు ఫలాలు వృక్షములు
పర్వతములు జలాలు మడుగులు పక్షులు సర్పములు సింహములు సాధ్యులు విశ్వే దేవతలు మరుత్తులు
ధాతా అవిధాత పూసుడు భుగుడు అర్యముడు ఇంద్రాది సమస్త దేవతలు అన్ని ఋతువులు స్కన్ద
శ్చ భగవాన్ దేవః సోమ శ్చ సబృహస్పతిః ! సప్తర్షయో నారద శ్చ తే త్వాం రక్షన్తు
సర్వతః !! నక్షత్రాణి చ సర్వాణి గ్రహా శ్చ సహ దేవతాః ! అహో రాత్రే తథా సంధ్యే
పాంతు త్వాం వన మాఽఽశ్రితం !! సంధ్యలు సూర్యుడు చంద్రుడు స్కందుడు అనగా
సుబ్రహ్మణ్యుడు సోమ శ్చ సోముడు శివుడు సప్తర్షలు నారదడు నిన్ను నిరంతరము
రక్షించుగాక! అని అనేక మందిని ప్రార్థన చేసి తెల్లని పూల దండలు సమిదలు తెల్ల ఆవాలు
సిద్ధం చేయించి అగ్నిహోత్రం చేయించి బ్రహ్మణులచేత రాముడికి రక్ష కట్టి ఆయన
దగ్గరకొచ్చి కొన్ని శ్లోకాలతో ఆవిడ రక్ష పెట్టింది.
ఇవి పెద్దలేం చెప్తారంటే ఈ శ్లోకాల్నీ బిడ్డల్ని
కన్న తల్లులు బిడ్డలెప్పుడైనా ఎక్కడికైనా వెడుతూంటే వాళ్ళకి ఈ మూడు శ్లోకాలతో రక్ష
పెడితే వాళ్ళకి ప్రమాదములు రావు అంటారు. పిల్లలు వృద్ధిలోకి రావాలని నిజంగా
కోరుకున్నవాళ్ళమైతే తల్లి అలా కోరుకోకపోవడమేమిటీ తల్లి అలా కోరుకు తీరుతుంది.
కాబట్టీ తల్లిదండ్రులు ప్రత్యేకించి తల్లి ఏ పిల్లవాడినైనా పిల్లనైనా మూడు
మంత్రాలతోటి మూడు శ్లోకాలతోటి రక్ష పెట్టాలీ అని చెప్తారు పెద్దలు. శ్రీ రామాయణంలో
వాల్మీకి మహర్షి జాతికి ఇచ్చిన
కానుకల్లో ఈ మూడు శ్లోకాలు
ఒకటి య న్మఙ్గళం సహస్రాక్షే సర్వ దేవ నమస్కృతే ! వృత్ర నాశే సమభవ త్త త్తే భవతు
మంగళం !! వృత్రాసురున్ని సంహారం చేసినప్పుడు ఇంద్రుడికి అతిథి ఎటువంటి రక్ష
పెట్టిందో అటువంటి మంగళము నీకు కలుగు గాక! య న్మఙ్గళం సుపర్ణ స్య వినతాఽకల్పయత్ పురా ! అమృతం
ప్రార్థయానస్య త త్తే భవతు మఙ్గళమ్ !! అమృత పాత్రను తీసుకో రావడానికని గురుత్మంతుడు బయలు
దేరుతున్నప్పుడు ఆయనకు వినత ఎటువంటి మంగళం పలికిందో అటువంటి మంగళం నీకు
కల్పించబడుగాక! అమృతో త్పాదనే దైత్యాన్
ఘ్నతో వజ్ర ధరస్య యత్ ! అదితి ర్మంగళం ప్రాదా త్త త్తే భవతు మంగళం !! అమృతోత్పాదన
కాలమునందు దేవేంద్రుడికి దేవతలందరూ ఎటువంటి మంగళమును కల్పించారో అటువంటి మంగళము
నీకు కల్పించుబడుగాక! త్రీన్ విక్రమాన్
క్రమతో విష్ణో రమిత తేజసః ! య దాఽఽసీన్మంగళం రామ త్త త్తే భవతు మంగళం !! రామా! మూడు లోకములనూ కూడా ఆరోజు బలి చక్రవర్తి
మూడడుగుల రూపంలో దానం పుచ్చుకున్నప్పుడు శ్రీమహావిష్ణువు కొలుస్తున్నప్పుడు
త్రివిక్రమావతారంతో పెరిగిపోయినప్పుడు లోకమంతా ఆయనకు ఎటువంటి మంగళం చేసిందో
అటువంటి మంగళం నీకు కల్పింపబడుగాక! ఓషధీం చాఽపి సిద్ధార్థాం విశల్య కరణీం
శుభామ్ ! చకార రక్షాం కౌసల్యా మన్త్రైః అభిజజాప చ !! ఒక విశల్యకరణీ అనేటటువంటి ఓషధినీ అక్కడ పెట్టి
బ్రాహ్మణులచేత అభిమంత్రింపజేసి దాన్ని తీసుకొచ్చి రామ చంద్ర మూర్తి యొక్క
శరీరానికి ఆ ఒక్క ఓషధిని కట్టి ఆయన ఒళ్ళంతా తడిమి మనస్పూర్తిగా రామున్ని
పంపించడానికి ఇష్టం లేకపోయినా ఆయనకి ఆశీర్వచనం చేసి నాయనా రామా 14 సంవత్సరములు
ధర్మంతో అరణ్యవాసాన్ని పూర్తిచేసి నీవు తిరిగి వచ్చి పట్టాభిషక్తుడువై రాజ్యపాల
చేస్తుంటే చూసే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు కల్పించాలని ఆశీర్వచనం రామ చంద్ర మూర్తికి
కౌసల్యా మాతచేసినది అన్న మంగళప్రద ఘట్టం దగ్గర ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని పూర్తి
చేస్తున్నాను.
|
ఒక్కసారి మనం రామ
నామం చెప్పుకుని ఇంత గొప్ప రామ కథ అయోధ్య కాండ నిజంగా అంత ధర్మ పరీక్ష
మహానుభావుడికి ఇప్పుడు చేసిన రామ నామమే మనల్ని రక్షిస్తుంది నిజంగా...
నిజంగా రామాయణానికి
హనుమత్ స్వరూపం కదిలివచ్చేసింది ఆయన అంత ప్రీతి చెందుతున్నారు రామ కథ కోసమని
అనడానికి ఇంతకన్నా ప్రభలసాక్షం ఏముంది. ఎక్కడో తిరగవలసివాడు ఇక్కడకొచ్చి ఇంత
చప్పుడు చేస్తూ గంతులేస్తూ ఇక్కడే కూర్చొని ఇక్కడే ఉంటూ చూస్తూ అలా కూర్చొని
వింటూన్నాడంటే ఆయన హనుమకాక మరెవ్వరు రామ కథ రామ కథే అందుకే రామ కథ ఎక్కడ చెప్తే
అక్కడికి హనుమ వస్తారు హనుమ వస్తే మంగళం కలుగుతుందీ అంటారు.
శ్రీ రామ నామము రామ నామము
రమ్యమైనది రామ నామము !! రామ !!
గోచరంబగు జగము లోపల
గోప్యమైనది రామ నామము !! రామ !!
తల్లివలె రక్షించు సుజనుల
నెల్ల కాలము రామ నామము !! రామ !!
రామ తత్వము నెరుగు వారికి
ముక్తి తత్వము రామ నామము !! రామ !!
|
పండువెన్నెల కాంతి కలిగిన
బ్రహ్మ నాదము రామ నామము !! రామ !!
పంచభూతాతీతమగు పరమమాత్మ
తత్వము రామ నామము !! రామ !!
సిద్దమూర్తులు మాటి మాటికి
చేయునది శ్రీ రామ నామము !! రామ !!
తుంటరీకాది వాదులను
మంటగలుపును రామ నామము !! రామ !!
ఆశవిడిచిన తృప్తులకు
ఆనందమొసగును రామ నామము !! రామ !!
కోటి జన్మల పాప మెల్లను
రూపు మాపును రామ నామము !! రామ !!
రాకడయు పోకడయు లేనిది
రమ్యమైనది రామ నామము !! రామ !!
అండ పిండ బ్రహ్మాండములకు
ఆధారమైనది రామ నామము !! రామ !!
కోరి కొలిచిన వారికెల్లను
కొంగు బంగరు రామ నామము !! రామ !!
జన్మ మృత్య రహస్యమెరిగిన
జపించవలె ఈ రామ నామము !! రామ !!
తల్లి వలె రక్షించు సుజనుల
నెల్ల కాలము రామ నామము !! రామ !!
మంగళా శాసన...
No comments:
Post a Comment