Sunday, 27 March 2016

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాల్మీకి సంపూర్ణ రామాయణం - అయోధ్య కాండ 10 దినం Sampoorna Valmeeki Ramayanam By Brahma Sree Chaganti Koteswara Rao Garu Ayodha Kanda 10th Day




అయోధ్య కాండ

పదవ రోజు ప్రవచనము



నేను నిన్న చెప్పినటువంటి కథా భాగంలో మూడు నిర్ణయములు కనపడుతాయి మీకు, ఒకటి దశరథ మహారాజుగారు రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడానికి అంగీకరించినటువంటి నిర్ణయము, రాముడు అరణ్యవాసం చెయ్యడానికి తీసుకున్న నిర్ణయం, కైకమ్మ ఇతః పూర్వం తనకిచ్చిన రెండు వరాల్ని దశరథుడి దగ్గర పుచ్చుకొని తీరాలి అని చేసుకొన్న నిర్ణయము నిన్నటి రోజున ఆ మూడు నిర్ణయాలు కనపడ్డాయి. ఇందులో కైకమ్మ తన రెండు వరాల్ని అడ్డుపెట్టుకొని రాజ్యం సంపాదించాలనే కోరికతో వరాల్నివాడుకుంది తప్పా... కేవలం భరతుడికి రాజ్యం తీసుకోవడం అనేటటువంటికాంక్ష కూడా దోషభూయిష్టమే ఎందుచేతనంటే, పెద్దవాడికి రాజ్యంరావడం అనేటటువంటిది సాప్రదాయం న్యాయం కూడా కానీ ఎప్పుడో తనకు వరమిచ్చాడనేమిషని అడ్డుపెట్టుకొని ఇప్పుడు రాజ్యాన్ని తీసుకొనే ప్రయత్నం ఆవిడచేసింది, కాబట్టి ఆవిడ చేసుకొన్నటువంటి నిర్ణయంలో సత్యాన్ని ఆధారంగా చేసుకొని ధర్మాన్ని వదిలిపెట్టింది. దశరథుడు రాజ్యం ఇవ్వాలి అని నిర్ణయం చేసుకొన్నాడు ఆయన తను ఇచ్చినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో ఆ వరాలకి ఇప్పుడు కట్టుబడిపోయాడు, కైకమ్మకి ఇచ్చినటువంటి వరాలకి కట్టుబడ్డాడు, కట్టుబడ్డాడు కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇచ్చితీరాలి అనేటటువంటి ధర్మం నుంచి తాను స్థాపించలేని స్థితిలోకి వెళ్ళాడు.
రాముడు ఇటువంటి వైక్లవ్యాలేమీ లేవు ఆయనకి ఆయన నిన్నన స్పష్టంగా చెప్పాడు, అయన నిన్నన మాట్లాడినప్పుడు దశరథుడితో మాట్లాడాడు కైకతో మాట్లాడాడు కౌసల్యతో మాట్లాడాడు లక్ష్మణుడితో మాట్లాడాడు నలుగురితో మాట్లాడాడు నిన్న ప్రధానంగా నలుగురితో మాట్లాడినప్పుడు కూడా రాముడి వ్యక్తిగత అభిప్రాయమేమీ లేదు. రాజ్యం ఇవ్వనూ అన్నది చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఉత్పన్నం చేసినటువంటి నిర్ణయం అయినా దాని మీద రాముడి నిర్ణయంలో నేను వ్యక్తిగతంగా ఇలా అనుకుంటున్నాను ఇలా చేద్దాం అని రాముడు ఎక్కడా అనలేదు, మీరుదాన్ని గమనించండీ దశరథుడితో మాట్లాడినా కైకమ్మతో మాట్లాడినా ఒక్కటే మాట న అహమ్ అర్థపరో దేవి లోకమ్ ఆవస్తుమ్ ఉత్సహే ! విద్ధి మామ్ ఋషిభి స్తుల్యం కేవలం ధర్మ్ ఆస్థితమ్ !! నాకు ధర్మం కావాలి, కౌసల్యతో మాట్లాడితే భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః ! స భవత్యా న కర్తవ్యో మనసా అపి విగర్హితః !! భార్య భర్తని విడిచిపెట్టి వెళ్ళడమన్నది ధర్మం కాదు, నీవు భర్త సేవయే చేయాలి.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
ఆడదానికి వేరే తరించడానికి మార్గం ఏమైనా ఉందా... అంటే భగవంతుని యొక్క సేవలుచేయడం వ్రతములు చేయడం నోములు చేయడం చేయ్యవద్దూ అని శాస్త్రం నిషేధించలేదు, కానీ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే దేనికొరకు ఇవన్నీ చెయ్యాలి అంటే భర్త యొక్క అభ్యున్నతి కొరకు చెయ్యాలి తప్పా తనకీ అంటూ వేరే ప్రయోజనం ఏమైనా ఉంటుందా... ఏం ఉండదు భర్తని పక్కనపెట్టి తనకంటూ ఒక అభ్యున్నతినీ ఆడది కోరదు సనాతన ధర్మంలో ఆయనకిలేని అభ్యున్నతి నాకొకటి కావాలి ఆయనకు అక్కరలేదు అందుకు నేను చేసుకుంటున్నాను అన్నమాట అసలు లేదు. రాముడు నిన్ననూ అదేచెప్పాడు అసలు వేరే, అమ్మా... పూజలు చేయడం నమస్కారం చేయడంలేదు ʻభర్తని అనువర్తించడమే స్త్రీ యొక్క ధర్మముʼ అంతే. భర్త యోగ్యతా ఇప్పడు అక్కడ ఒకప్రశ్న వస్తూంది. భర్త భక్తుడు కాడు, భర్త యోగ్యుడు కాడు, భర్త చేసిన నిర్ణయం ధర్మబద్ధం కాదు, భర్త చేసింది న్యాయం కాదు అప్పుడూ అనువర్తించడమే..? నీ ధర్మం నీకైపోయింది. నీ ధర్మం ఇతరుల అధర్మాన్ని బట్టి మారక్కరలేదు, నీ ధర్మం నీవు చేసేయడమే... కాబట్టి నీ భర్త ధార్మికమైన నిర్ణయం చేశాడా... నీ భర్త చేసింది న్యాయమా అన్యాయమా నీకు అనవసరము నీవు నీ భర్తని అనుగమించాలి అంతే, అలా అనుగమించడానికి నీవు ఏ కారణాలు వెతుక్కుని నీవు దానియందు వైక్లవ్యాలుపొందినా అప్పుడు నీవు అధర్మంలోకి వెడతావు, కాబట్టీ నీ ధర్మాన్ని నీవు కాపాడుకోవాలి అంటే నీవు దశరథుని అనుగమించాలి.
నా ధర్మం పుత్ర ధర్మం నేను తండ్రిని అనుగమించాలి తండ్రి చెప్పిన మాట నేను చెయ్యాలి, అదొక్కటి వదిలిపెట్టేసి నేను ఏం చేసినా కూడా ఎలా ఉంటుందీ అంటే? పునాది లేని భవనంలా ఉంటుంది, అసలు ప్రారంభమే అధర్మం నేను రాజ్యాన్ని పుచ్చుకోగలను దశరథున్ని నిగ్రహించి కానీ అధర్మంతో పుచ్చుకున్న రాజ్యాన్ని నేని ఏ ధర్మంతో పరిపాలన చెయ్యను ఎవరికి ఏ ధర్మం చెప్పను, అందుకని రాజ్యమా స్వర్గమా అభ్యున్నతా అధికారమా లేకపోతే భోగమా ధర్మమా... అంటే ధర్మ బద్దమైన స్వర్గము, ధర్మబద్దమైన అధికారము, ధర్మబద్ధమైన భోగము, ధర్మబద్ధమైన రాజ్యము, ధర్మముతో ముడిపడనవి ఏవీ నాకొద్దు అందుకని నా ధర్మం పుత్ర ధర్మం కాబట్టి నేను అడవికే వెడుతాను. కాబట్టి నీవు ఆశీర్వచనం చేయి కాబట్టి ఇప్పుడు రాముడు ఏటువైపు నుంచి ఆలోచించినా తనదీ అన్న అలోచన ఏమీ ఉండదు, రాముడు ఎప్పుడూ ఎలా ఆలోచిస్తాడంటే, దీనికి శాస్త్రం ఏం చెప్పింది, దీనికి వేదం ఏం చెప్పింది అంతే వేదం ఇలా చెప్పింది అలా చేస్తాడు.
ఇది ఎలా ఉంటుందంటే శరీరం అనారోగ్యంతో ఉంది, డాక్టరుగారి దగ్గరికివెళ్ళారు డాక్టరుగారు అన్నారు ఈమందు వేసుకో కాని పెరుగు అన్నం తినకు అన్నాడు. ఇప్పుడు పెరుగు అన్నం తినడమా పెరుగు అన్నం తినకపోవడమా..? ఇక మీ విచక్షణ ఏంలేదు పెరుగు అన్నం తినరు ఎందుకు తినరు, ఎవరో ఒకాయన ఒక పల్లెటూరి నుంచివచ్చి ఏమండీ గేదపాలు తీసుకొచ్చాము పెరుగు గట్టిగా రాయిలా తొడుకుంటుంది మా గేదె పెరుగు చాలాకమ్మగా ఉంటుంది అన్నాడు, నేను తినను ఎందుకు తినవు డాక్టరుగారు తినద్దన్నారు. వేదం ఏది వద్దందో అది నేను చేయను, వేదం ఏది చేయమందో అది నేను చేస్తాను. కాబట్టి నాకు ధర్మానికి ప్రమాణమేమి వేదమే, ఇదీ రాముడు. అందుకే మీతో మనవి చేసింది రామాయణంలో రాముడు ఏం చేశాడో మీరుగ్రహిస్తే మీకు ధర్మం వేదం తెలిసినట్లే... ఇంక మీరు నాకు ఇది తెలియలేదని బెంగపెట్టుకోవలసిందేమీ ఉండదు. కాబట్టి మీరు రామాయణాన్ని తెలుసుకోగలిగితే చాలు అందుకే రామాయణాన్ని మీరు రామాయణంగా చదువుకుంటే చాలు. మీరు అందులో కష్టపడవలసిందేమీ ఉండదు రాముడే చెప్తుంటాడు ఇది ధర్మం అంటూ ఉంటాడు వివరణచేస్తూ ఉంటాడు. చాలా చక్కగా జీవితానికి అన్వయంచేసుకొని జీవించగలిగినటువంటి సుసంపన్నమైనటువంటి వ్యవస్థ మీకు శ్రీరామాయణాన్ని అవగతం చేసుకోవడం వల్ల ఏర్పడుతుంది.



  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
కాబట్టి ఇప్పుడు ఆయన కౌసల్యా మందిరంలో ఆశీర్వచనాన్నిపొంది ఇంక అక్కడ నుంచి బయలుదేరి సీతమ్మ మందిరానికి వెళ్ళాడు, సీతమ్మకు కూడా తెలియదు యౌవ్వరాజ్య పట్టాభిషేకం ఆగిపోయిందని రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడూ అని, అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా రాముడు ఇప్పుడే అభిషేకాన్ని పొందివస్తాడూ అనేటటువంటి సంతోషంతో నిలబడి ఉన్నారు, వచ్చిన రాముడు చాలా ఖిన్నుడై, చింతాక్రాంతుడై ఉన్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం పట్టుకోవాలి ఇప్పటి వరకూ లేడుగా అభిషేక సంభారాల పక్కనుంచి వస్తున్నప్పుడు మనసు కుంగుతుంది ఎందుకో తెలుసాండీ? ఇప్పుడు వీటితో నాకేచేస్తారు అని అనుకున్నది తనకు చెయ్యట్లేదు వాటితో అని అనిపించినప్పుడు పదార్థాలని చూసినప్పుడు మొఖం వివర్ణమౌతుంది రాముడికి అలా అవ్వలేదు వాటికి ప్రదక్షిణంచేసి నమస్కారంచేశాడు. ఎవరికి ఉపయోగించినా అవిపవిత్ర పదార్థములు వాటినిచూసి నామనసు ఖుంగకూడదు. రెండు ఇది లేదన్నబెంగ నాకుంటేగా... నేను ధర్మం పాటిస్తున్నానుగా... నిన్న నాన్నగారు చెప్పిన మాటవిని పట్టాభిషేకం చేసుకుంటే ఏధర్మమో ఇవి నా నెత్తినపోసి ఉండేవారు, ఇవ్వాళ నాన్నగారు చెప్పిన మాటవినడం కోసం ఇవ్వళ నా నెత్తినపొయ్యకుండా ఉంటుంన్నారు వాటి పవిత్రత వాటిది నా పవిత్రత నాది.
కాబట్టి వాటికో ప్రదక్షణంచేసి వెళ్ళిపోయాడు మరి సీతమ్మ మందిరానికి వచ్చినప్పుడు ఎందుకా చింతా..! అంటే మహర్షి చాలా చమత్కారంగా మాట్లాడుతారు తాం దృష్ట్వా స హి ధర్మాత్మా న శాశాక మనోగతం ! తం శోకం రాఘవ స్సోఢుం తతో వివృతతాం గతః !! అక్కడదాకా వచ్చిన తరువాత కౌసల్యా మందిరానికి వెళ్ళినప్పుడూ స్థిరంగా నిలబడ్డాడు, లక్ష్మణుడితో మాట్లాడినప్పుడూ స్థిరంగా నిలబడ్డాడు సీతమ్మ గృహం దగ్గరికి వచ్చినప్పుడు సీతమ్మ వంక చూశాడు ఇలా... ఆవిడా మంచి సంతోషంగా ఉంది, వాళ్ళాయనకి యౌవ్వరాజ్య పట్టాభిషేకమై వస్తాడని ఆవిడ ఈయన్ని చూసింది చూసినప్పుడు ఆవిడకు అనుమానం వచ్చింది, ఏమిటి అలా ఉన్నాడూ ఇలా ఉండకూడదుగా యౌవ్వరాజ్య పట్టాభిషేకం జరిగితే... అన్నది చూపుల్లో కనపడింది. రాముడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు, శ్రీరామాయణం మీకు భగవంతుడిగా నడువడు రాముడు నరుడిగా నడుస్తాడు. ఇది మీరు గమనించవలసి ఉంటుంది కానీ నరుడిగా నడిచి ధర్మన్ని పట్టుకొని నశించిపోడు ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించిపోయాడనుకోండి, ధర్మాన్ని పట్టుకున్నవాడు చచ్చిపోయాడనుకోండి అప్పుడింక ఆదర్శమేముందండి అందులోంచి మీకు తీసుకోవడానికి ధర్మాన్ని పట్టుకున్నవాడు నిలబడాలి నిలబడితేనే నీకు ఆదర్శమౌతుందది.
అందుకే శ్రీరామాయణంలోకానీ సనాతన ధర్మంలోకానీ ఎవడు సత్య-ధర్మాలను పట్టుకున్నాడో వాడుపడిపోవడం ఉండదు మన కావ్యాల్లో మన పురాణాల్లో, కాబట్టి ఇప్పుడు చూడండీ ఆయన చింతాక్రాంతుడు అయ్యాడు, ఎంత చింతాక్రాంతుడయ్యాడండే ఆయన దుఃఖం ప్రకటనంగా పైకి తెలిసిపోయింది. వేరొక మాటలో చెప్పాలంటే ఆయన దుఃఖం లోపలనుంచి మాంస నేత్రములచేత దర్శించబడేటటువంటిరీతిలో పైకి పెల్లుభికింది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి రాముడు అలా ఎందుకు ఇక్కడికి వచ్చేటప్పటికి దుఃఖము ఆపుకోలేకపోయాడు ఈ దుఃఖానికి రెండు కారణాలు ఉండాలి, ఒకటి యౌవ్వరాజ్యం పోయిందన్న బాధన్నా ఉండాలి లేకపోతే సీతమ్మకి దూరమౌతున్నానన్న బాధైనా ఉండాలి. ఈ

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
రెండిటిలో ఏది సత్యం రాజ్యం పోయిందీ అని బాధపడితే అక్కడ ఏడవాలి, సీతమ్మకి దూరమౌతున్నాని బాధపడితే ఇక్కడ ఏడవాలి. అక్కడ ఏడవకుండ ఇక్కడ ఎడ్చాడంటే సీతమ్మకి దూరమవడానికి ఏడ్చాడని అర్థం. సీతమ్మకి దూరమైతే ఏడవచ్చా..? ఏడవచ్చు. తన ధర్మ పత్నకి దూరంగా ఉండలేక బాధపడితే అది ధర్మమే, అది తప్పేం కాదు మీరు అందుకే ధర్మాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
సన్యాసిలా గృహస్తు ఎప్పుడూ బ్రతకకూడదు ఏదో అక్కరలేని విషయాలన్ని తీసుకొచ్చి గృహస్తాశ్రమంలో కలగా పులగంచేసేసి ఏదో సన్నాసిలా నేను జీవిస్తానండీ అని మీరు గృహస్తాశ్రమంలో ఉండకూడదు. గృహస్తాశ్రమంలో ఉన్నట్టు సన్యాసి ఉండకూడదు, సన్యాసి ఉన్నట్టు బ్రహ్మచారి ఉండకూడదు, బ్రహ్మచారి ఉన్నట్టు గృహస్తు ఉండకూడదు, ఎవరి ధర్మం వారిదే ఎవరి ధర్మం వాడుపట్టుకోవాలి. అంతేకాని ఎక్కడికోవెళ్ళి ఏదోపట్టుకొని ఏదో విని లెదా ఏదో చూసొచ్చి ఆ ఏముందండీ ఇదంతా అని చెప్పేసి చాలా నిర్వేదంతోటి ఒక కృతక వైరాగ్యంతోటి ఇంట్లోవాళ్ళ అభ్యున్నతిని కోరకుండా, ఇంట్లోవాళ్ళకి సుఖ శాంతులు నశించిపోయేటట్లుగా గృహస్తు బ్రతుక కూడదు తప్పు అది అలా ఎప్పుడూ ఉండకూడదు. ధార్మికమైన సుఖమును గృహస్తు అనుభవించవచ్చు. అడగాలి ప్రతిరోజు ధర్మపత్ని సమేతస్యా నా కుటుంబంలో ఉన్నవారందరి అభ్యున్నతికోసం నేను ఈ పూజచేస్తున్నాను అని నీవు అడగాలి, అంతేకాని నీవు అలా కోరకుండా ఉండడానికి నీవు గృహస్తాస్త్రంలో లేకుండా లేవు, నీవు గృహస్తాశ్రమంలో ఉన్నావు. ఏ ఆశ్రమంలో నీవు ఉన్నావో దానికి తగిన ధర్మాన్ని నీవు పాటించాలి అంతేకాని నీవు గృహస్తాశ్రమంలో ఉండీ సన్యాసిలా బ్రతకడం, ఎక్కడో ఏదో వినడం, విని అలా నేను ఉంటానని అంటుండడం తప్పది అలా ఉండకూడదు. అనుష్టానమేటటువంటిది స్పష్టంగా ఉండాలి, మీరు ఒక నిర్ధిష్టమైనటువంటి అవగాహనతో బ్రతకడం నేర్చుకోవాలి శ్రీరామాయణం మీకది నేర్చుతుంది. ఆఁ... భార్యేమిటండీ బిడ్డలేమిటండీ అని నాకేమీ అలాంటివి లేవు సుమాండీ... అంటే తప్పది, లేదేమిటి నీకు గృహస్తాశ్రమంలో ఉండీ... ఉండాలి, మీ భార్యమీద మమకారం ఉండడం తప్పేం కాదు. నీభార్యకి నీవు దూరంగా ఉండలేకపోతే నీవు బాధ పడితే నీకు జ్ఞాపకానికి వస్తే బెంగపెట్టుకుంటే... అందులో ఏమీ దోషంలేదు. నీభార్యయందు కాకుండా వేరొకరి భార్యయందు నీకు అనురక్తి కలిగితే పరమ తప్పు అందుకే సుందర కాండలో సీతమ్మ కూడా నివర్తయ మనో మత్తః స్వజనే క్రియతాం మనః నీవారియందు మనసు ఉంచుకో అని చెప్పింది తప్పా నీవారియందు మాత్రం కాకుండా మనసు పెట్టవద్దు.
ఏది ఎక్కడ చెయ్యాలో అది ధర్మం ధయతేవ జనైరితి ధర్మం అని అమరకోసం ఎక్కడ ఏదిపట్టుకోవాలో అక్కడ అది పట్టుకోవాలి, ఎక్కడ ఏది వదిలెయ్యాలో అది వదిలేయాలి. అందుకే మనకు ఒకమాట ఉంటుంది “పట్టూ విడుపూ” తెలుసండీ ఆయనకీ అంటారు ఈ పట్టూవిడుపూ రాదనుకోండీ అభ్యున్నతి ఉండదు తెలియదన్నమాట జీవితంలో ధార్మికంగా ఉండడం ధర్మం తెలియడం అంటే... దానిస్థితి వేరుగా ఉంటుంది. రాముడు సీతమ్మ దగ్గరికి వెడితేమాత్రం తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఇప్పుడు ఆవిడ నోటివెంట ప్రశ్నల పరంపర వచ్చింది అదేమిటీ వెళ్ళిన మనిషి అంత సంతోషంగా వెళ్ళారు వచ్చిన మనిషి ఇంత బాధగా వచ్చారు దుఃఖితుడిగా ఉన్నారు ఆవిడకి లోపల పెల్లుభికినటువంటి అనుమాలన్నీ బయటికి ప్రశ్నల రూపకంగా బయటికి వచ్చాయి అలా ఎందుకు వచ్చాయంటే స్వాత్యంత్ర్యం, స్వాత్యంత్ర్యం ఓదార్పు ఏమి ఇబ్బంది కలిగింది మీకు అని ఇన్ని ప్రశ్నలు వేసేసింది. మీరు ఒక్క విషయాన్ని ఎప్పుడూ బాగా గుర్తుపెట్టుకోండి ఇది ప్రత్యేకించి పెళ్ళి కావలసినటువంటివాళ్ళు బాగాతెలుసుకొని ఉండాలి, గృహస్తాశ్రమంలోకి ప్రవేశించేముందు ఇది బాగా తెలుసుకోవాలి, భార్యా భర్తలలో ఒకరు కీర్తిగడించడం రెండవవారు ఆ కీర్తిని పాడుచేయలేక పోవడమన్నది ఉండదు. కీర్తి ఇద్దరికి కలిపే ఉంటుంది తప్పా కీర్తి ఒకరికుండి ఒకరికి లేకుండా పోవడమన్నది కుదరదు గృహస్తాశ్రమంలో.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
మీకొక ఉదాహరణ చెప్తాను చూడండీ! ఇప్పుడు నేను ఏదో రామాయణం గురించి మాట్లాడుతున్నాను, మీరెప్పుడైనా కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చారనుకోండి, మా ఇంటికొస్తే... అలా ఈశ్వరుడి దయవల్లజరగదు కానీ, ఒక హేయమైన ఉదాహరణ మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద నేను పెట్టుకుంటున్నాను. నా భార్య చాలా దురుసుగా మాట్లాడిందనుకోండీ మీరేమంటారు వెంటనే ఆవిడ దురుసుగా మాట్లాడిందనరు, ఆయనేమిటండీ అంతలా చెప్పాడు పాపం అన్నీనీ మాట్లాడినప్పుడు చాలా సాత్వికంగానే మాట్లాడాడు చాలా నెమ్మదస్తుడుగానే ఉన్నాడు ఏమిటో పాపం ఆయనకి ఇలాంటి భార్యా అంటారు. భర్త కీర్తి భార్యయే కాపాడుతుంది, ఇనుమడింపజేస్తుంది, భార్య కీర్తి భర్త ఇనుమడింపజేస్తాడు. భర్త మనఃశాంతి భార్య దగ్గర దొరుకుతుంది, భార్యకు మనఃశాంతి భర్త దగ్గర దొరుకుతుంది, ఆవిడ యొక్క పూజార్హత చేత ఆయన కూడా పూజార్హుడు అవుతాడు. అత్రి అనుసూయ గురించి అదే చెప్తాడు, ఆయన పూజార్హత చేత ఆమే కూడా పూజార్హత రాలు అవుతుంది.
మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థమవడానికి నా భార్య ఎప్పుడూ ఉపన్యాసం చెప్పలేదు, కానీ నేనూ నా భార్య కలిసి వస్తున్నామనుకోండీ ఇదేమిటి ఈయ్యనకి పెట్టండీ ఆవిడకేమి అక్కరలేదు ఆవిడేమి ఉపన్యాసం చెప్పలేదని ఎవ్వరు అనరు. నాకు పెడితే ఆవిడకు పెడతారు ఎందుకండీ ఆవిడకెందుకండీ ఆవిడ మీకేమైనా చెప్పిందా ఎందుకు ఆవిడకెందుకు నమస్కారం ఆయన చెప్పడానికి బలం ఆవిడ వండిపెడ్డిన అన్నం. ఆవిడ వండి పెట్టింది కాబట్టీ ఈయన రామాయణం చదివాడు, ఆవిడ మానేసి వదిలేసి నీవు నీ రామాయణం అని ఆవిడ ఎక్కడో తిరిగితే ఈయన వండుకుని తిని రామాయణం ఎప్పుడు చదివేవాడూ... ఆయన చెప్పిన రామాయణానికి ఆవిడే వెనకాల ఉంది, కాబట్టి ఆయనలోంచి ప్రకటనమైనదానికి వెనక ఆవిడ ఉంది. కాబట్టి ఆయనకి ఎంత నమస్కారమో ఆమెకు అంత నమస్కారం. ఆవిడకి ఎంతనమస్కారమో ఆయనకి అంతే నమస్కారం. దాంపత్యంలో ఈ అవగాహన ప్రధానంగా ఉండాలి, ఇది లేకపోతే ఏమౌతుంతో తెలుసాండీ ʻనేనుʼ ʻఆయనʼ అన్న భావన ఉంటే, అది నడవదు ఇంకా అది ఒక సమగ్రతలేని స్థితి వస్తుంది. మన ప్రారబ్దకర్మ ఏమిటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదో స్త్రీలకు తక్కువా పురుషులకి ఎక్కువా ఇలా విచిత్రమైనటువంటివాదన ప్రభలిపోయింది. అర్థం పర్థం లేనివాదన అలా ఎక్కడా ఏంలేదు రామాయణంలో. రామాయణం సరిగ్గా చదివితే సీతమ్మ దగ్గర రాముడు శోకాన్ని ఆపుకోలేకపోయాడు అని తెలిస్తే సీతమ్మ రాముడి హృదయంలో ఎంతగొప్ప స్థానంలో ఉందో అర్థమైతే ఆడదాని శక్తేమిటో నీకు అర్థమౌతుంది. నీవు చదివిందిలేదు నీవు అర్థం చేసుకున్నది లేదు అక్కరలేని ప్రసంగాలుచేసి ఉన్నవాళ్ళని పాడుచేస్తే, అక్కడొస్తోంది ఇబ్బందంతా... కాబట్టి ఇప్పుడు ఇది దాంపత్యంలో ఉండేటటువంటి ఒక గొప్పస్థితి సనాతన ధర్మంలో అందుకనివారు ఇద్దరుకారు వాళ్ళు ఇద్దరూ కలిసి ఒక్కటే ఒక్కటిగా అయినటువంటివారు మీకు రెండుగా కనపడుతుంటారు.
కాబట్టి ఇప్పుడు ఆవిడందీ ఏమీ కర్కాటక రాశిలో ప్రకాశిస్తున్నటువంటి పుష్యమీ నక్షత్రంలో మీకు యౌవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలే... యౌవ్వరాజ్య పట్టాభిషేకం జరిగిందని గుర్తులు కొన్ని ఉంటాయి, మీ తల మీద పెరుగు తేనే కలిపి ఉంచబడాలే... మీ ముందు నాలుగు గుఱ్ఱములను పూంచినటువంటి రథమొకటి రావాలే, మీరు భద్రగజం మీద రావాలే, మీకొక తెల్లటి గొడుగు పట్టాలే... మీ పక్కన వంది మాగదులు స్తోత్రంచేస్తూ ఉండాలే, మీవెంట ప్రముఖులు అనుసరించిరావాలి కదా, మీతో చాలా మంది నడుస్తూ మీరు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉండాలి కదా... బ్రాహ్మణోత్తములు మీవెంట వస్తూ ఎంతో ఆనందంగా ఉండాలి కదా, బంగారు తొడగులు అలంకరించబడి వేగము కలిగినటువంటి గుఱ్ఱముల యొక్క రథం మీద నీవు వచ్చివుండాలి కదా మరి ఇటువంటివాడివి ఇవేవీ లేకుండగా ఒక్కడివే చింతాక్రాంతుడవై రామ చంద్రా ఏమి ఇలా వచ్చారు మీరు ఏం జరిగింది అంటే పట్టాభిషేకం జరగలేదు అని ఆవిడ నిర్ధారించుకుంది.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
పట్టాభిషేకం జరగలేదని చింతతో ఉన్నాడా దేనికి చింతతో ఉన్నాడు, ఆవిడకి రాముడు బాగా తెలుసు పట్టాభిషేకం జరగలేదని చింతపడేవాడు నాభర్త అని ఆవిడ అందనుకోండీ, రామాయణంలో తేడా ఉంది సీతారాముల మధ్యలో ఆవిడ ఆయనకి అవగతము కాలేదు. అందుకు కాదు నీవు బాధ పడుతున్నది ఇది కాకుండా ఇంకా ఏదో అయి ఉండాలి, అదేమిటి రామా! ఇది భార్య అంటే, మీరు ప్రశ్న వేయడంలో ఆమె యొక్క స్థితిని ఆమె యొక్క పత్నీత్వాన్ని తల్లి యొక్క స్థితిని సీతారాముల దాపత్యాన్ని మీరు పట్టుకోవాలి ఇప్పుడు రాముడు అన్నాడు సీతమ్మతో
చతు ర్దశ హి వర్షాణి వస్తవ్యం దణ్డకే మయా ! పిత్రా మే భరత శ్చాపి యౌవరాజ్యే నియోజితః !!
సోహం త్వామ్ ఆగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనమ్ ! భరత స్య సమీపే తే న అహం కథ్యః కదాచన !!
బుద్ధి యుక్తా హి పురుషా న సహన్తే పర స్తవమ్ ! తస్మా న్న తే గుణాః భరత స్యాగ్రతో మమ !!
నాపి త్వం తేన భర్తవ్యా విశేషేణ కదా చన ! అనుకూలతయా శక్యం సమీపే తస్య వర్తితుమ్ !!
ఆయన ఎంత చమత్కారంగా ఎంత గంభీరంగా మాట్లాడాడంటే ఆవిడ తరువాతి ప్రశ్నవేసే అధికారాన్ని ఇవ్వకుండా మాట్లాడాడు రాముడు అంటే ఈ మాట్లాడేటటువంటి తీరులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది రాముడు చెప్పడంలో నేను 14 సంవత్సరములు అరణ్యవాసాని వెళ్ళిపోతున్నాను, ముందేం చెప్పాలండీ! రాజ్యం భరతుడికి ఇచ్చాడని చెప్పాలి, ఎప్పడు చెప్పాలి తనకి రాజ్యం మీద ప్రీతి ఉంటే, బార్యని చూసి నీకు దూరంగా ఉండడంమనేటటువంటిది భరించలేక ఏడుస్తున్నాను అంటే అది ముందు పైకి రావాలి కదా, రాజ్యం కోసం ఏడిస్తే రాజ్యం పోయిందని ముందు చెప్తాడు, భార్యని దూరంగా ఉంచడం ఇష్టంలేక భరించలేక ఏడుస్తున్నాడు అంటే ఇది ముందు చెప్తాడు. ఏది ముందు చెప్పాడు రాజ్యం ముందు పోయిందని చెప్పాడా ముందు 14 యేళ్ళు అడవికి వెళ్తున్నాని చెప్పాడా... 14 యేళ్ళు అడవికి వెళ్ళిపోతున్నాను సీతా అని చెప్పాడు. ఆ మాట ఎందుకొచ్చింది ముందు 14 యేళ్ళు అడవికి వెళ్ళిపోతే సీతమ్మకి దూరం అయిపోతానని ఏడుస్తున్నాను. ఇప్పుడు రాముడు రాజ్యం కోసం కాదు, భార్యకి దూరంగా ఉండలేక ఏడుస్తున్నాడు అలా ఏడవచ్చా? మీకు ఇందాకనే చెప్పాను ఏడవచ్చూ..! అని.
తప్పేం కాదది ధర్మంలో అంతర్భాగం భార్యయందు ప్రేమ కాబట్టీ ఇప్పుడు రెండో స్థితిలో ఆ కారణం చెప్తున్నాడు పిత్రా మే భరత శ్చాపి యౌవరాజ్యే నియోజితః నా తండ్రి భరతున్ని యౌవ్వ రాజ్యమునందు స్థాపించాడు, ఇది మీరు గమనించాలి. కైకమ్మ వరాలడిగింది నాకు ఇవ్వద్దందీ రాజ్యం భరతుడికి ఇచ్చేయమందీ మా నాన్న ఒప్పుకున్నాడు అందువల్ల రాజ్యం వెళ్ళిపోతుంది అని చెప్పలేదు భరతున్ని దశరథుడు రాజ్యమునందు స్థాపించాడు అన్నాడు. అంటే మా నాన్నగారికి

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
అధికారముంది ఆయనిష్టం ఆయన ఎవ్వరికైనా ఇవ్వవచ్చు అంతేకాని నాకు ఇవ్వలేదూ మా అమ్మ అలా అడిగింది అసలు ఆ ధోరణిలో మాట్లాడే నైజమే రామునిలో లేదు అంటే అటువంటి స్థితి అయనలోకి వెళ్ళదు కదలని స్థితి అంటే అది కదలని స్థితి వాక్కుల చేత తెలుస్తుంది లేకితనం వాక్కుల చేతనే తెలుస్తుంది ఇది రాముడంటే తెలుస్తుంది. అందుకే కదాండీ యుగాలు మారిపోయినా మనం పూజ చేస్తూనే ఉన్నాం రామాయణం చెప్పుకుంటూ... ఇది రాముడంటే. రామాయణం చదివితే... మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడోలో బాగ దిద్దబడుతుంది రామాయణానికి ఆ శక్తి ఉంది.
కాబట్టి ఆయన అంటున్నాడు ఈ రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేశాడు ఇప్పుడు భరతుడు యువరాజు అవుతాడు, సీతా! నీవు భరతుడితో చాలా ఆదరంగా ప్రవర్తించవలసి ఉంటుంది, ఎందుకో తెలుసా? ఇంతకు ముందున్న స్థితివేరు ఇప్పుడున్న స్థితివేరు ఇతఃపూర్వం నీవు వదినవి, సహజంగా నేను యువరాజును అవుతాను అనేటటువంటిస్థితి లోకంలోవుంది కాబట్టి నీవు చనువుగా ఒక కొడుకుతో మాట్లాడినట్లు మాట్లాడేదానివి భరతుడితో ఇప్పుడు అలా మాట్లాడకూడదు ఎందుకో తెలుసా భరతుడు యువరాజు, యువరాజుతో మాట్లాడేటప్పు ఎలా ఉండాలో అలా మాట్లాడాలి, రెండు రాజు రాజ్యంలో ఉన్నప్పుడు లేదా రాజు రాజ్యం చేసేటప్పుడు ఆయనే పోషించినట్లు ఎవ్వర్నైనా సరే ఆయనే పోషించినట్లు ఆ రాజ్యంలో ఉంటే, నిన్ను విశేషంగా పోషించవలసిన అవసరం భరతునికి లేదు. కాబట్టి చాలా ఎక్కువ నీవు ఇక్కడ కోరుకోకు ఇంక అన్నాడు అంటే ఆయన సీతమ్మ ఇక్కడ ఉండాలని మాట్లాడుతున్నాడు మీరు ఈ కోణం గమనించారా నిన్ను వదలి నేను ఉండలేను కాబట్టి ముందు బయటపడ్డాడు, కాబట్టి ఇప్పుడేమనచ్చు రాముడు భర్తగా వదిలి ఉండలేకపోతే భర్తగా ఏమనచ్చండీ... నీవ్వు వచ్చేయ్య్ వెళ్ళదాం అనచ్చు, ఇప్పుడు దీన్ని ఎవరు అడ్డుపెట్టలేరు కదాండీ, సీతా నీవు కూడా నాతో వచ్చేయ్ అంటే మీ ఆవిడ్ని నీతో తీసుకెళ్ళకు అని దశరథుడు అనలేడు. వచ్చేయ్ అనచ్చు కాని వచ్చేయ్ అనడంలేదు ఇక్కడ ఉండిపో అంటున్నాడు అంటే ఏమి రాముని ఉద్దేశ్యం మరి వాళ్ళ అమ్మగారినైతే ఏమన్నాడు భర్తని సేవించడం భార్య ధర్మం నీవు భర్తని అనుగమించమ్మా అన్నాడు మరి సీతమ్మనైతే నీవు నతో రా అనడంలేదు ఉండిపో అంటున్నాడు.
మరి అదేమిటి వాళ్ళమ్మగారికి చెప్పితే ఓ ధర్మమూ వాళ్ళావిడకు చెప్తే ఓ ధర్మమూనా మరి ఇప్పడు రాముడి విషయంలో రాముడు మాట్లాడినదాంట్లో అంతా బాగున్నా ఇది కొంచెం అదోలా లేదు అదేమిటండీ మరీ సీతమ్మ దగ్గరికొస్తే ఓ ధర్మం చెప్తున్నాడు కౌసల్య దగ్గరేమో ఓ ధర్మం చెప్తున్నాడు మరి ఇక్కడ  ఓ చిన్న తేడా వచ్చిందే అని మీకు అనిపిస్తుందిగా రామాయణం చదివేటప్పుడు ఎందుకు బెంగపెట్టుకుంటారు రాముడే చెప్తాడు. నేను చెప్పానుగా రామాయణం స్పష్టంగా ఉంటుంది మీరేం బెంగ పెట్టుకోనవసరం లేదు అన్ని మీకు కనపడతాయి మీకు అనుమానం వస్తే ఓ పుస్తకం తీసుకోవడం ఎర్ర సిరాతో రాసుకోవడం మళ్ళీ మీకు వివరణ రామాయణంలో కనపడుతుంది ఆ అది ఇక్కడ కనపడిందని దీన్ని కొట్టేయడమే.
కాబట్టి ఇప్పుడన్నాడు నీవు ఏం చేస్తుండాలో తెలుసా సీతమ్మ నీవు ఇక్కడుండి ఇక్కడ ఉండడం అంటే ఏదో బెంగపెట్టుకోవడం మా ఆయన వెళ్ళిపోయాడు కదా అని చెప్పి నాకేం పెద్ద పని అని చెప్పేసి ఎనిమిదింటికి లేస్తాను తొమ్మిదింటికి లేస్తాను ఆ వెమ్మట టిఫిను తింటాను మళ్ళీ వెంటనే పడుకుంటాను కాదు. నీవు ఏంచేస్తుంటావో తెలుసా? కాల్యమ్ ఉత్థాయ దేవానాం కృత్వా పూజాం యథా విధి ! వన్దితవ్యో దశరథః పితా మమ నరేశ్వరః !! నీవు వేళకి లేవవలసినదానివి వేళకిలేవాలి ఇన్నాళ్ళు నేను కూడా ఇక్కడ ఉన్నాను నేను ప్రాతః కాలంలో లేచి సంధ్యావందనం చేస్తాను నేను లేస్తాను గనుకా నేను లేచేటప్పటికి భార్య ఏం చేయాలి, భార్య ముందు లేచి భర్త పూజా మందిరంలోకి వెళ్ళేటప్పటికి పూజా మందిరాన్ని సిద్ధం చెయ్యాలి భార్య ప్రధాన భాద్యత అదే... ఆవిడకి ఆ బాధ తెలుసు ధర్మం ఉంది అని మీకు గుర్తు ఎక్కడంటే, ఆవిడ అమర్చిన తరువాత ఆయన పూజచేస్తే ఆయన మధ్యలో చిటిక వేయ్యక్కరలేదు ఇంక అంటే అర్థమేమిటంటే, ఆవిడ అమర్చేచేస్తుంది ఆవిడకి తెలుసు ఆయన ఎలా పూజ చేసుకుంటారో ఆయనకి ఏవి అవసరమో ఆవిడకి తెలుసు ఆవిడ అమస్తుంది. ఇంట్లో అయితే ఎలా అమర్చాలో బయటికి వెళ్తే ఎలా అమర్చాలో ఆయనో విశేష పూజచేస్తే ఎలా అమర్చాలో అన్ని తెలుసు, కాబట్టి నేను చేస్తున్నాను నీవు అమరుస్తావు ఇప్పుడు చేయడానికి నేను ఉండను అరణ్యానికి వెడతాను కాబట్టి అమర్చడానికి నీకు అవసరమేముంది అని వదిలేయకు సుమా! నీవు ఏం చేయాలి వేళ పట్టున లేవాలి దైవ పూజ చేయాలి.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
సాధారణంగా మనం మొదటి నింద ఎవరిని చేస్తామంటే మనం అనుకున్నది కలిసి రాకపోతే మనకి త్వరగా దొరికే పాలేరెవరంటే పరమేశ్వరుడే... ఏమిటో ఇంతపూజ చేశాను ఏం చేశాడండీ నాకు అంటాడు, ఏమో నీవేంత పాపం చేశావో వాడికి తెలుసు నీకు చెప్పితే తెలుస్తుంది నీవు ఎంత తప్పు చేశావో ఎటుతిరిగి ఆయనేంటంటే మళ్ళీ చెప్పి బాధపెట్టడమెందుకని చెప్పడు అంతే. కాబట్టి మళ్ళి ఇంకో తప్పు ఆయన్ని నిందిస్తూండడం ఏదో తప్పు చేసుంటాను ఈశ్వరా... నాకీ ఫలితాన్ని ఇచ్చావు కాబట్టి నేను ఓర్చుకోగల శక్తినీయ్యి అనడు అలా అనడం భక్తి, రాముడైతే అలా అనడు లేచి దైవపూజ చేయ్యి అంటాడు ఇది పరిణితి అన్నమాట ఒక వ్యక్తి యొక్క స్థితిని మీకు చెప్తుంది. ఇది మనం నేర్చుకోవలసి ఉంటుంది రామాయణంలో అందుకే రాముడు మాట్లాడినా వశిష్టుడు మాట్లాడినా శ్రీరామాయణంలో సుమిత్ర మాట్లాడినా మీరు చాలా చాలా జాగ్రత్తగా చదవాలి ఆ శ్లోకాలని చాలా జాగ్రత్తగా చదవాలి ఆ శ్లోకాలని ఎందుకో తెలుసాండీ! ఈ పాత్రలు మాటలు మాట్లడితే ప్రతి మాటా వేదం చెప్పిన మాటలై ఉంటాయి, అంతే తప్పా ఏదో మాట్లాడేద్దాం అని చెప్పి వాళ్ళు మాట్లాడరు అందులో మీకు ఒక అక్షరం అనవసరం ఉండదు. ప్రతి శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి కొన్ని కొన్ని పాత్రలు మాట్లాడితే దశరథ మహారాజుగారు అంతఃపురం మొత్తం మీద అలా మాట్లాడగలిగినటువంటి ఆడది సుమిత్ర ఒక్కతే.
కాబట్టి ఇప్పుడు ఈ మాట అని ఆయన అన్నాడూ కృత్వా పూజాం యథా విధి వన్దితవ్యో దశరథః రోజూ మా నాన్నగారికి నమస్కారం చేసివెళ్ళు, సాధరణంగా ఈయనే మా ఆయన్ని అడవులకి పంపించాడని అనుకుంటారు కాదు మా నాన్న అంటే ఎవరో తెలుసా సత్య ధర్మములకు కట్టుబడిన మహానుభావుడు ఆయనా వందనమునకు యోగ్యుడు నా తండ్రి కాబట్టి నీవు ఆయనకు రోజూ నమస్కారం చేయాలి. అంటే ఆయనకు ఎంత గొప్ప పూజ్యభావన హృదయంలో ఉందో తండ్రంటే ఇదీ ఆర్ష సంస్కృతి. ఇది మానేసి నాన్నగారిని పేరు పెట్టి పిలవడం, నాన్నగారిని తిట్టడం, నీకేం తెలుసు అనడం, మీరు నాకు చెప్పవలసినవాడా అనడం, నేను ఎవరిని పెళ్ళి చేసుకోవాలో నీకు చెప్పడం ఏమిటీ అనడం ఇది మన సంస్కృతీ కాదు ఇది మనకు సంబంధించిన అల్లరీ కాదు. చిత్రమేమిటంటే ఇప్పుడు రామాయణాన్ని కట్టకట్టి పక్కనెట్టి రాసేవాళ్ళందరూ ఇటువంటి చౌకబారు రాతలు రాసేవారు వచ్చారు. వాళ్ళు యువతరాన్ని ఎంత నాశనం చేసేస్తున్నారో జీవితాలతో ఎంత ఆడుకుంటున్నారో వారికి తెలియదు నిజంగా వాళ్ళుచేసిన పాపమేమిటో, వాళ్ళుచేస్తున్న పాపమేమిటో వాళ్ళు రాసిన మాటలవల్ల ఎన్ని కుటుంబాలు క్షోభ పడిపోతున్నాయో ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో ఎంత అవ్యవస్థ తయారౌతుందో ఆ రాసినవాళ్ళు వస్తే నేను నాలుగిళ్ళకు వెళ్ళి చూపిస్తాను ఆ డైలాగులువిని పిల్లలు పాడై ఏ స్థితిలో ఉన్నారో నైతిక బాధ్యతతో సిగ్గుతో బ్రతికున్నాన్నాళ్ళు కలం పట్టుకోడు.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
ఇంత పొరపాటు చేశానా నేను డబ్బుకోసం అవసరమైతే నాలుగు ఇళ్ళముందుకువెళ్ళి బిక్షాటనచేసి బ్రతకవచ్చు యువతరాన్ని పాడుచేసే తప్పుడు డైలాగులు రాయకూడదు నీకు వచ్చుకదానిఏదో... ఇవ్వాళ జరుగుతున్నది అదే, మనం రామాయణానికి వారసులమని కుటుంబాలు సంతోషంగా ఉండాలని మాటలు రాయాలని ఆలోచన ఉండివుంటే మంచింది. ప్రత్యేకించి పాల పొంగులాంటి పొంగు ఉన్న యువతరాన్ని నాశనంచేసే మాటలన్నీ రాసేస్తున్నారు అవే చూపిస్తున్నారు, అవే రాస్తున్నారు పిల్లల తప్పు ఏముందండీ అవే చదువుతున్నారు వాళ్ళు అంతకు తప్పా వాళ్ళకి అవకాశం లేదు. ఓ రామాయణం ఎక్కడా వినపడ్డానికి వీల్లేదు, ఎక్కడా కనపడ్డానికి వీల్లేదు రామా అనడానికి వీల్లేదు ఎందుకంటే ʻరామాʼ అంటే అదోక పెద్ద దోషం అల అనకూడదు ఒక మతం గురించి చెప్పినట్టు రాముడి ధార్మికత మాట్లాడుతున్నాడనేమీ ఉండదు ఒక మతం గురించి మాట్లాడారు ఏమౌతుందీ జాతిబ్రష్టు పడుతూంది. ఇదీ ఎప్పటికైనా పూడ్చబడాలి, కావలసింది ఏమిటంటే నాలుగు మంచి మాటలు అందరికీ అందాలి అందరి జీవితాలు సుసంపన్నంగా ఉండాలి, దానికి అందరూ బాధ్యత వహించవలసి ఉంటుంది తప్పా ఏదో 24 గంటల్లో సూర్యోదయానికి అరగంట ముందు మాత్రం భక్తి సంగీతం ప్రచారంచేసి 23 గంటలు విషతుల్యమైన విషయాలు ప్రచారంచేసి మేము చాలా మంచి పనులు చేస్తున్నాం అనుకోవడం ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి శ్రీరామాయణం అనేటటువంటిది ఎందుకు చెప్పబడాలో మనం శ్రీరామాయణాన్ని ఎందుకు అర్థం చేసుకొని అనుష్టించాలో మీరు తెలుసుకుంటే మీరు రామున్ని తెలుసుకొని అనుష్టిస్తే రాముడికి ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు కొత్తగా మన జీవితాలు సుసంపన్నం అవుతాయి, మన పక్కన ఉన్నవాళ్ళు శాంతిగా ఉంటారు అందరూ శాంతిగా ఉంటారు.
కాబట్టి నీవు మా తండ్రి గారికి ప్రతిరోజూ నమస్కరించు మాతా చ మమ కౌసల్యా వృద్ధా సంతాప కర్శితా ! ధర్మమ్ ఏవాగ్రతః కృత్వా త్వత్తః సమ్మానమ్ అర్హతి !! మా తల్లి కౌసల్యా చాలా వృద్ధురాలైపోయింది నేను అరణ్యములకు వెళ్ళిపోతాను అని విశేషమైన సంతాపముతో ఉన్నది, కాబట్టి ఆవిడ బెంగపెట్టుకోకుండా ప్రతిరోజూ నీవువెళ్ళి అనునయ వాక్యములతో ఆవిడ సేద తీరేటట్లుగా ప్రవర్తించు త్వయా భరత శత్రుఘ్నౌ ప్రాణైః ప్రియతరౌ మమ బాగాజ్ఞాపకంపెట్టుకో భరత శత్రుజ్ఞులు ఇద్దరూ కూడా నా ప్రాణతుల్యమైనటువంటి సహోదరులు ఈ విషయాన్ని నీవు కూడా జ్ఞాపకం పెట్టుకొనీ వాళ్ళపట్ల నీవు కూడా అలా ప్రవర్తించవలసి ఉంటుంది లేకపోతే నాకు ప్రేమ ఉన్నా నీవు ప్రవర్తించకపోతే నాకిష్టమైన విషయాన్ని నీవు నా కష్టానికివాళ్ళు కారకులు అని ఊహ చేసినవాళ్ళని క్షోభపెడితే నేను క్షోభపడుతాను అని నీవు తెలుసుకో ఎంత గంభీరంగా మాట్లాడుతాడండీ రాముడు కాబట్టి విప్రియం న చ కర్తవ్యం భరత స్య కదా చన ! స హి రాజా ప్రభు శ్చైవ దేశ స్య చ కుల స్యచ !!  భరతుడు యువరాజు అవుతాడు రేపు ఒక యువరాజుని మనం గౌరవించవలసి ఉంటుంది ఆయన దేశానికి కానీ కుటుంబానికి కానీ సర్వాధికారి, నేను అతని కన్నా ముందు పుట్టినవాడినే కావచ్చు కానీ యౌవ్వరాజ్య పట్టాభిషేకం జరిగిన తరువాత అతనే అధికారి కాబట్టి అతన్ని గౌరవించవలసి ఉంటుంది. ఇంట్లోనే గౌరవం లేకపోతే వీధిలో ఏంగౌరవం ఉంటుంది కాబట్టి మరొక రకంగా అతనితో ప్రవర్తించవద్దు అతనిపై కోపం మనసులో పెట్టుకొని మాట్లాడవద్దు నీవు చాలా ప్రేమతో భరతుడిపట్ల గౌరవంతో మర్యాదతో అణకువతో ప్రవర్తించు. అంటే ఇప్పుడు మాట్లాడేది ఎలా మాట్లాడుతున్నాడు సీతమ్మ అక్కడుంటుందీ అని  లేదా నీవు ఇక్కడ ఉండూ అని మాట్లాడుతున్నాడు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ ఉండు అంతకు తప్పా నీవు నాతో వస్తే అన్న కోణం అందులో ఏమీ లేదు.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
సీతమ్మ ఏం పట్టుకుందంటే రామా నీకు రాజ్యం పోయిందా అని ఆవిడ మాట్లాడటం లేదు అంటే ఇప్పుడు ఆవిడకి కూడా ఏం కావాలి రాజ్యం కాదు ఆవిడికి కావలసింది ఏం కావాలి రాముడు కావాలి రాముడి సేవ కావాలి, అందుకని అసలు ఆవిడ రాజ్యం ప్రసక్తి ఆవిడ తీసుకరాలేదు యవ్వరాజ్య పట్టాభిషేకం నీకు జరగలేదా... మళ్ళీ ఎప్పుడొస్తుంది పోనీ వెళ్ళిపోతారనుకోండీ 14 యేళ్ళు అట్నుంచి వచ్చాక ఇచ్చేస్తారా మళ్ళీనూ... మరి ఈలోగా భరతుడికి పట్టంగడితే మీరొచ్చిన తరువాత ఈలోగా మామగారికి ఏమైనా అయిపోయిందనుకోండీ రాజైపోతాడు గదా అప్పుడు మీరు వచ్చిన తరువాత మీకు స్థానం ఖాలీచేస్తాడా... మీకు పట్టాభిషేకం జరుగుతుందా... రాజ్యం పోదుగదా మనకి మనం ఇలా అడవులు పట్టుకతిరగడం కాదు కదా... అలా మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని మాట్లాడాలి కదాండీ, ఆవిడకీ కాంక్ష ఉంటే ఆవిడా ఆవిడ ధర్మం పాటిస్తుందని గుర్తేమిటీ, ఆవిడకి ఇవన్నీ ఏమీ అక్కరలేదు ఆవిడ పతి ఆవిడకి కావాలి కదా ఆవిడ ధర్మం ఆవిడకి కావాలి. ఆవిడ ధర్మం ఆవిడ పాటించాలి కానీ ఆవిడ ధర్మం తనచేత పాలింపజేస్తే తానునియంతగా వ్యవహరించినట్లులెక్క ఇది తెలిసి నేను మీవెంట వస్తాను అని సీతమ్మ అనాలిగానీ, ఇవన్నీ ఎందుకండీ నేను మీ వెంటవస్తాను అనాలి, అంతేకాని రాజ్యం గురించి మాట్లాడటం మొదలెట్టిందనుకోండీ, అసలు రాముడు తీసుకెళ్ళక్కరలేదు. నేను మీ వెంటవస్తానండీ అది నాధర్మం అని అందనుకోండీ రాముడెవరు కాదనడానికీ ఆ మాట అంటూందా ఇది చూస్తాడు రాముడు రాముడు ధర్మైక తత్పరుడు, రాముడికి కావలసింది ధర్మం. నీ ధర్మం నీవు పాటిస్తావా... ఇప్పుడు ఆవిడ తన ధర్మాన్ని తాను పాటిస్తాను అని చెప్పిందనుకోండీ... రాముడు బాగా పరిశీనం చేస్తాడు తప్పా ఆవిడ ధర్మం నుంచి ఆవిడని విముఖురాలుని చేయడు వద్దు నీవు రావద్దు అని చంఢశాసనుడుగా నిలబడిపోయి ఏమి అక్కడ అట్టే పెట్టేసి వెళ్ళిపోడు ఆయన, ఇది మీరు గమనించవలసి ఉంటుంది రామ పాత్రలో ఇక్కడ నేను ఒక మాట ప్రస్తావన చేయవలసి ఉంటుంది.
ఇది రామాయణం నేను ప్రత్యేకంగా పెళ్ళి కావలసినవాళ్ళు చదవాలి అని ఎందుకంటున్నానో తెలుసాండీ! ఒక పిచ్చి ధోరణి ఉండకూడదు భార్య అంటే నాచేత శాశింపబడవలసినదీ అన్న భావన ఉండకూడదు, నా చేత విషయములు భోధింపబడి నాచేత ఆ విషయములు తెలుసుకొనే స్థితిలో ఉన్న నాకన్న చిన్నపిల్ల ఈశ్వరుడిచేత నాకీయబడినటువంటి స్నేహితురాలు. అంతకన్నా ఏమిటండీ ఈశ్వరుడు ఇచ్చినటువంటి జీవితాంత స్నేహము అది, జీవితాంత స్నేహము. కాబట్టి దాన్ని ఎప్పుడు ఒక మర్యాదతో ఒక గౌరవ ప్రదమైనటువంటి స్థితిలో దాన్ని మీరు అట్టే పెట్టాలి. అంతే కానీ భార్యని నేను అన్నీ శాశిస్తాను అని చెప్పి నేను ఏం చెప్పానో అది నీవు చేయి అనకూడదు ఆవిడ ధర్మం ఆవిడని చేయనీయ్యాలి, ఆవిడ ధర్మమేమిటో మీరు ఆడవిడకు చెప్పాలి. ఇదీ రామాయణం అంటే అందుకే రాముడు శాశించడు భార్యని, నిజంగా రాముడు అర్థమైతే ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉంటారని చెప్పీ రామున్ని ఆదర్శంగా తీసుకోండీ అని చెప్పాలి. ఎక్కడో ఏదో ఒక్క సంఘటనని సరిగా అర్థం చేసుకోకుండా దాన్నిపట్టుకుని అగ్నిప్రవేశం చేయించినటువంటి రాముడు భార్యని చాలా అనుమానించేవాడు అన్న ధోరణిలో రాముని గురించి మాట్లాడేస్తుంటారు, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
రాముకి భార్య మీద ప్రేమ ఏమిటో నీవు ఎప్పుడైనా చదివావా రామాయణం, నీవు ఎప్పుడైనా ఒక్క శ్లోకం చదివావా అందులోంచి ఒక్క శ్లోకం నీవు మాట్లాడావా ఏదో అంటువ్యాధి వస్తే ఊరంతా అంటుకున్నట్లూ ఒక్కడెవడో పనికి మాలినవాడు రామాయణం చదవకుండా ఓమాట అన్నాడు అంటే అది పట్టుకొని అదాప్రచారంచేయడం ఇది మనజీవితాలు ఇలా తయారయ్యాయి. కాబట్టీ సీతమ్మ అందీ ఆర్య పుత్ర పితా మాతా భ్రాతా పుత్ర స్తథా స్నుషా ! స్వాని పుణ్యాని భుంజానాః స్వం స్వం భాగ్యమ్ ఉపాసతే !! ఆవిడ కూడా వేదం వైపు నుంచి మాట్లాడుతుంది స్మృతి వైపు నుంచి మాట్లాడుతుంది, ఆవిడా ధర్మాన్నే మాట్లాడుతుంది అందుకే కొత్తగా పెళ్ళైందంటే ఆదర్శమేమిటంటే సీతారాములులా పది కాలాలు బ్రతకండీ అంటారు. “జానక్యాః కమలాంజలి పుటేః యా పద్మ రాగాయితాః” అని రాస్తారు. అందుకే అసలు శుభలేక మీద సీతారాములు లేకుండా శుభలేక వేయకూడదు, సీతా రాములు ఉండితీరాలి శుభలేక మీద కాబట్టి ఆర్య పుత్రా ఆవిడందీ ఓ ఆర్య పూత్రా! ఈ మాట అనడంలో గమనించండి మీరు ఏంటండీ చేతగానితనం మీరూనూ రాజ్యం భరతుడికి ఇచ్చి వచ్చారా అని మొదలెట్టలేదు, అలా మొదలు పెట్టిందీ కైక. కైక అంత భర్తనీ నిన్ననీ కౌసల్యతో కలిసి రమిద్దామనుకుంటున్నావా..! రాజ్యం రాముడికిచ్చీ దుష్ట చరిత్రుడా అంది, అలా మాట్లాడదు సీతమ్మ. ఆవిడంది ఆర్య పుత్ర పితా మాతా భ్రాతా పుత్ర స్తథా స్నుషా తల్లికానీ తండ్రికానీ తోడ పుట్టినవాళ్ళుకానీ కడుపున పుట్టిన వాళ్ళుకానీ స్తథా కోడలుకానీ కోడలు అన్న మాట ఎందుకందో తెలుసాండీ! బయటనుంచి ఈ ఇంట్లోకొచ్చి ఈ ఇంట్లో ఉన్న అందరి వాళ్ళ కన్నా కూడా ఇక్కడ స్థితినీ ఇక్కడ ఉన్న యజమాని పైలోకాల స్థితిని నిర్ణయం చేయగలిగిన ఏకైక వ్యక్తి కోడలు ఈ ఇంటి ఐశ్వర్యము ఎవరి వల్ల నిలబడుతుందో తెలుసాండీ కోడలువల్లే నిలబడుతుంది.
ఎందుకంటే ఇంటికో మహాత్ముడు వచ్చాడనుకోండీ ఆవిడ పట్టుకొచ్చి ప్రీతితో కాసిన్ని పాలిచ్చి అయ్యా తాగండీ అని ఓ మనస్కారం చేసిందనుకోండీ, ఏమి ఈ ఇంటి సంస్కారమండీ అని ఆయన సంతోషించీ ఆశీర్వచనం చేస్తాడు అది అంగ రక్ష. కోడలికి తెలియాలి సేవించడం ఇంటి ఆచారమేమిటీ ఇంట్లో పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో మనం ఎలా ప్రవర్తించాలో తెలియాలి. కాబట్టి స్తథా స్నుషా ఆవిడందీ తండ్రి కాని, తల్లి కాని తోడబుట్టిన వాళ్ళు కానీ కోడుకులు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ వీళ్లెవ్వరూ కూడా భర్త చేసినటువంటి భాగంలో లేదా ఇంటి యజమాని పురుషుడు చేసిన పుణ్యంలోంచి కానీ పాపంలోంచి కానీ భాగాన్ని పుచ్చుకోరు. పాపాన్ని వదిలేసేయండి స్వాని పుణ్యాని భుంజానాః స్వం స్వం భాగ్యమ్ ఉపాసతే ఎవరి పుణ్యాన్ని వాళ్లే అనుభవిస్తారు.
ఇంటి కోడలుంది మామగారు ఉన్నారు, మామగారు ఓ పూజచేశాడు మామాగారి పుణ్యం మామగారిదే కోడలు పుణ్యం కోడలుదే, మామగారి పుణ్యం కోడలికి వెళ్ళదు. కొడుకున్నాడు తండ్రి గొప్ప భక్తుడు, తండ్రి పుణ్యం కొడుక్కు వెళ్ళదు, అదే అన్నదమ్ములున్నారు ఈయన చేసిన పుణ్యం అన్నదమ్ములకు వెళ్ళదు. తండ్రి ఉన్నాడు కొడుకు మహాభక్తుడు కొడుకు పుణ్యం తండ్రికి వెళ్ళదు. భార్య ఏమీ తెలియదు కానీ భర్తచేసిన పుణ్యంలో సగభాగం ఆవిడిదే... ఆవిడ ఏమైనా చెయ్యాలా అంటే చెయ్యక్కరలేదు ఆవిడ ఆయన భార్యా అని అంతే. కాబట్టీ ఆయన చేసిన ప్రతిపుణ్యకార్యం సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు తీసుకెళ్ళి. కాబట్టి రామా! వేదాన్ని అనుసరించి మీరు చేసిన దేంట్లోనైనా నాకు సమానభాగం ఉంది నేను పుచ్చుకుంటాను. కాబట్టి మీరు ఇంక అరణ్యవాసానికి వెళితే నేను రాకపోవడమేమిటీ నేనూ సగం పుచ్చుకుంటానంటే నేనూ మీతో పాటేవుంటాను, అదేమీటి నేనిక్కడుంటాను మీరక్కడుంటాను అంటారు అనే మాట మాట్లాడుతున్నారు. మీ పుణ్యం పుచ్చుకునేదాన్ని మీ కష్టాన్ని పంచుకుంటాను, మీ పుణ్యమే పుచ్చుకుంటాననుకోకండీ..! మీ కష్టాన్ని పుచ్చుకుంటాను భర్తు ర్భాగ్యం తు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ ! అత శ్చైవాహమ్ ఆదిష్టా వనే వస్తవ్యమ్ ఇత్యపి !! రాజు మీమ్మల్ని పిలిచి నువ్వు వనంలోవుండు అని చెప్పినటువంటి ఆదేశముందే అది మీకే కాదు నాకు కూడా చెప్పేసినట్లే, భార్యా భర్తా అని ఇద్దరు ఉండరు ఒక్కటే మీకు చెప్పింది నాకూ చెప్పినట్లే, అందుకనీ మీరు నన్ను ఇక్కడుండూ అని చెప్పకూడదు నేనూ మీతో వచ్చేస్తున్నాను అంతే.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి పరివేదనంతా దేనికొరకు రాముడితో ఉండడం కొరకు అంతేకానీ, రాజ్యమున్న రాముడితోటా రాజ్యంలేని రాముడితోటా అసలీ విభాగం లేదు ఇదీ స్త్రీ ధర్మం అందుకే రామాయణం ప్రత్యేకించి అయోధ్య కాండా ధర్మాల యొక్క ఆలవాలమై ఉంటుంది. ఎవరి ధర్మమేమిటో చెప్తూ ఉంటుంది అయోధ్య కాండ న పితా నాఽఽత్మజో నాఽఽత్మా న మాతా న సఖీజనః ! ఇహ ప్రేత్య చ నారీణాం పతిః ఏకో గతిః సదా !! తండ్రి కానీ కడుపున పుట్టినటువంటి కొడుకులు కానీ తల్లి కానీ స్నేహితురాళ్ళు కానీ వీళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ కానీ ఇక్కడ తరువాత పైలోకాల్లో కానీ ఒక ఆడదాని యొక్క గతిని అంటే వెళ్ళే మార్గాన్ని నిర్ణయించరు ఒక్క భర్తయే నిర్ణయిస్తాడు. అంటే ఆయన ధర్మాత్ముడు పరమ భక్తుడు ఎప్పుడూ ఈశ్వరున్ని ఆరాధించేవాడు అనుకోండీ ఆవిడేం చేసింది ఆయనకి పొద్దున ఫలహారంచేసి పెట్టింది, ఆవిడేం చేసింది ఆయనకి కాఫీ ఇచ్చింది ఇప్పుడు ఆవిడేమయ్యింది ఆయన పుణ్యంలో సగం ఈవిడకొచ్చింది.
అసలు మీకు ఒక పెద్ద రహస్యం చెప్పానాండీ! పరమ భక్తుడైనటువంటి వ్యక్తికి భార్య ఎవరై ఉంటారో ఆవిడ భర్తా భార్యా ఒకేసారి శరీరం వదిలి పెట్టేశారనుకోండీ అలా ఊహించండి మీరు, ఒక్క క్షణంలోనే శరీరం వదిలితే ఇద్దరిలోకి పుణ్యం ఎవరికి ఎక్కువుంటుందో తెలుసాండీ భార్యకే ఎక్కువుంటుంది ఎందుకో తెలుసా ఆయన పుణ్యం ఈవిడికి వస్తుంది. ఈవిడ రామా రామా రామా అందనుకోండీ ఈవిడ పుణ్యం ఈవిడకే ఉంటుంది భర్తకి వేయరు. ఈవిడ పుణ్యంలో భాగం భర్తకు లేదు ఆయన పుణ్యంలో భాగం భార్యకు ఉంది ఎందుకంటే ఆయనకు కావలసింది ఈవిడ వండిపెట్టింది ఆయన పడుకుంటే కాళ్ళు పట్టింది ఆయన స్నానానికి నీళ్ళు పెట్టింది ఆయన సంధ్యావందనానికి మడినీళ్ళు పెట్టింది ఆయన ధర్మాన్ని ఈవిడ ఆలంబనంగా నిలబడింది ఆయన అసలు ధర్మమే చేయకపోతే ఆయనని ఈవిడ అనుగమించింది అది చాలు ఈవిడ ఉత్తమ గతులు పొందడానికి. కాబట్టి ఈవిడ ఉత్తమ గతులువైపు వెళ్ళిపోతుంది అంతే... ఇందులో మళ్ళీ ఈ పాతివ్రత్యంలో మళ్ళీ బాగా తెలుసుకోవలసి ఉంటుంది. రెండు రకాలుగా ఉంటుంది ఇందులో ఒకటీ ఇంకసలు భర్త ఏం చెప్తే అది చేసేయడం అందులో ఇంకా ఏముటుంది అనే ఆలోచనవుండదు అది అలా చెస్తారు కొంతమంది.
మీరు ఒక కథ విని ఉంటారు సతీ సుమతి అని అనుకుంటా... ఆవిడ భర్తా కోరరాని ఒక కోరిక కోరాడు. ఆవిడ భర్తని తలమీద పెట్టుకొని తీసుకెళ్ళింది అదీ అటువంటి పాతివ్రత్యం అది పాతివ్రత్యం కాదంటంలేదు నేను అది ఎటువంటిదంటే ఇంక భర్త ఏంచెప్తే అది చేసేయ్యడమే అంతే. రెండో రకమైనటువంటి పాతివ్రత్యం ఉంటుంది అంటే పాతివ్రత్యములందు రెండురకములని నా ఉద్దేశ్యం కాదు. పాతివ్రత్యము అవలంభించే ఉత్తమ స్త్రీలలలో ఉండే స్థితిని నేను చెప్తున్నాను. రెండవది ధర్మవిచారణతో ఉంటుంది, మీరు ఇలా ఉండాలి నేనూ ఇలా ధర్మంతో అనువర్తిస్తాను అని వాళ్ళు కూడా చెప్తారు. అంటే వాళ్ళకు కూడా శాస్త్రమునుందు ప్రవేశముండి ఆ ధర్మ నిష్టతో ఉంటారు సీతమ్మ ఆకోవకి చెందిన తల్లి. కాబట్టి ఆవిడందీ ఇతరులెవ్వరూ ఆడదాని గతిని నిర్ణయించరు కానీ ఒక్క పురుషుడు మాత్రం పతి భర్త మాత్రం స్త్రీ యొక్క గతిని నిర్ణయిస్తాడు ఊర్ధ్వలోకాల వైపు వెళ్ళడాన్ని ఇక్కడ సుఖాన్ని కూడా ఆయనే నిర్ణయిస్తాడు. ఆయన చేతనే కీర్తి ఆయన చేతనే పూజార్హత ఆయన చేతనే భద్రత ఆయన చేతనే అపకీర్తి ఆయన వలననే ఇహమునందు అభద్రత ఆయన వలనే కంట నీరు ఆయన వలనే ఆక్రోశం ఇహము నందు ఏదైనా ఆయనవల్లే పరమును పొందడం ఆయన వలలనే.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
కాబట్టి గతీ భర్తవలన నిర్ణయింపబడుతుంది. గతిని నిర్ణయించే భర్తని వదిలిపెట్టి నేను వేరొక వ్యక్తిని ఎంచుకోవడం ఎలా కుదురుతుంది అది కుదిరే విషయం కాదు, నీవు నీతండ్రికి శుశ్రూష చేయవచ్చు. నిన్ను వదిలి నేను మామగారికి శుశ్రూష చేయకూడదు నీవు నీ తల్లికి శుశ్రూష చేస్తే నేను కూడా చేయవచ్చు కానీ నీవు అరణ్యాలకి వెళ్ళిపోతే నేను మీ అమ్మగారికి నేను శుశ్రూష చేయకూడదు. నీకు నేను శుశ్రూషచేయాలి కాబట్టీ 14 యేళ్ళంటే అదేం నెల కాదు పదిహేను రోజులు కాదు 20 రోజులు కాదు రామా! 14 సంవత్సరములు మీరు అరణ్యంలో కష్టపడుతుంటే మీరు నన్నిక్కడ దశరథుడికి సేవ చేయ్యి, కౌసల్యకి సేవ చెయ్యి అని చెప్పకూడదు అది నా ధర్మానికి వ్యతిరేకం. నా ధర్మం నన్ను చేసుకొనే అవకాశం మీరు నాకివ్వాలి, కాబట్టి నేను మీతో రావడమా రాకపోవడమా అన్న విషయంలో వస్తానంటే కాదనే అధికారం మీకు కూడా లేదు ఇది పరోక్షంగా చెప్తుంది ఆవిడ. ఆవిడకి రాజ్యం కాదు ఆయనని అనువర్తించడం ప్రధానం ఇది కదాండీ సీతారాములంటే... అందుకనీ సీతా రాముల్లా బ్రతకండిరా అంటారు యది త్వం ప్రస్థితో దుర్గం వనమ్ అద్యైవ  రాఘవ ! అగ్రతి స్తే గమిష్యామి మృద్నన్తీ కుశ కణ్టకాన్ !! రామా! మీరు దుర్గమారణ్యములలోకి వెళ్ళుతారు ఇప్పుడు 14 యేళ్ళు నేను మీతో వచ్చి నేనేం చేస్తానో తెలుసా! నేను ముందు నడుస్తాను నేను ముందు నడిస్తే మృద్నన్తీ ఆ కుశలు దర్భలు కోసేసి విడిచి పెట్టినవి సూదుల్లా ఉంటాయి వాటిని నేను తొక్కుతాను తొక్కితే అవి మెత్తగా అవుతాయి అవి వంగిపోతాయి అప్పుడు మీరు మెత్తగా నడిచి రావచ్చు.
కాని మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండీ, అసలలా నడవ కూడదు. ఆడది ముందు పురుషుడు వెనకా ఎప్పుడూ నడవ కూడదు మంగళ కార్యం మీద వెడితే ఎప్పుడైనా వచ్చారనుకోండి దంపతులు అమంగళ కార్యం మీద వస్తున్నారని గుర్తు ఇంట్లో బయలుదేరేటప్పుడు భార్య ముందు నడుస్తూ భర్త వెనక నడుస్తున్నాడనుకోండీ ఏ తద్దినం పెట్టడానికో ధర్మోదకాలు ఇవ్వడానికో వెళ్ళుతున్నారని గుర్తు. భర్త ముందు నడిచి భార్య వెనక నడుస్తుందనుకోండీ మంగళకార్యం మీద వెడుతున్నారని గుర్తు. పిల్ల పెళ్ళిపిలుపుకి వెళ్ళుతుంటే ఆయన తాళం వేసుకుంటుంటే ఆవిడ ముందు మెట్లు దిగిపోయిందనుకోండీ ఆ పెళ్ళి రసాభాస అవుతుందని గుర్తు. ఆయన ముందు నడవాలి ఆవిడ వెనకాల నడవాలి, నడకకి మంగళ ప్రదమైన నడక ఉంది ధర్మం ఉంది. రాముడు ఇది ఒప్పుకుంటాడా ఇలాగా! ఆవిడ ముందు నడవడం ఏమిటీ ఈయన వెనక నడవడం ఏమిటీ అది కాదు దానర్థం, అర్థమేమిటో తెలుసాండీ! నేను మెత్తన చేస్తాను మీరు నడుస్తారు అంటే... ఏది క్లేష భూయిస్టంగా ఉంటుందో మీకు అదీ ప్రసన్నంగా ఉంటుంది నేను పక్కన చేరడం వలన చాలా కష్టమైనటువంటి విషమండీ నిజంగా కానీ ఆవిడందు మీరు లోకంలో చూడండీ నిజంగా వినపడుతుంటుంది.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
చాలా దూరంగా ట్రాన్ఫర్ అయిందండీ అక్కడేం దొరకదూ ఉండడం కూడా కష్టం అందుకని పిల్లాన్ని హాస్టల్లో పెట్టి మాఆవిడని తీసుకెళ్లిపోతున్నాను అంటారు. రెండేళ్ళువుండి వెనక్కొచ్చేస్తాడు ఎందుకుండగలిగాడో తెలుసాండీ, ఆవిడుంది ఫరవాలేదులే ఇంటికివెళ్ళితే అది ఉందిగదా రాత్రి ఇంటికివెళ్ళి అన్ని మరిచిపోతాడు ఆవిడ దగ్గర సేదతీరిపోతాడు నేను అన్నది ఇదే... శాంతి స్థానం భార్యది. ఎంత కష్టపడి రానివ్వండీ ఆవిడ ప్రసన్నంగా మాట్లాడి ఆవిడ ఎంత పాండిత్యం ఉండాలని నన్ను అడగద్దు ఆవిడ ప్రసన్నంగా భర్తని పలకరించీ సంతోషంగా మాట్లాడి ఏమండీ వచ్చారా ఇదిగో కాఫీ తాగండీ అని ఏదో ప్రసన్నంగా సంతోషంగా నాలుగు మాటలు మాట్లాడిందనుకోండీ ఆయన అసలటంతా ఆయనా అందరినీ భార్యలోనే చూసుకొనీ ఉపశాంతిపొంది గాఢనిద్రలోపోతాడు. ఆవిడ తేడాగా మాట్లాడుతుందనుకోండీ ఆయన అప్రసన్నుడుగానూ అశాంతినీ పొందుతాడు. ఆవిడ ఆయన దగ్గరా ఆయన ఆవిడ దగ్గరా ఉపశమనం పొందుతాడు అంటే శాంతి స్థానములు శాంతి స్థానములుగా ఉండడం నేర్చుకోవాలి అశాంతి స్థానంములు కాకూడదు అశాంతి స్తానములు అంటే ఆయనకీ మనఃశాంతి ఉండదు ఆవిడకీ మనఃశాంతి ఉండదు అలా ఉండకుండా ఉండాలంటే నేర్చుకోవాలి అసలా స్థానము విలువేమిటో తెలుసుకోవాలి కాబట్టి రామా నేను మీ కన్నా ముందు నడిస్తే అంటే దానర్థమేమిటంటే..?
నేను మీతో ఉంటే అడవిలో సంధ్యావందనం చేయండీ నేను తీసుకొచ్చి నీళ్ళూ అవీ పెడుతూ ఉంటే నీకు అయోధ్యలో ఉన్నట్టే ఉంటుంది. అడవిలో ఉండనీవ్వండి దొరికిన వాటితో నేను పులుసు పెట్టికొని తీసుకొస్తే మీకు ఇంట్లో తిన్నట్లే ఉంటుంది. నేను ముందు అన్న మాటలో అర్థమేమిటంటే భార్య పక్కన ఉండడం వల్ల భర్త భౌతికంగా దేశం విషయంలో ఆ భౌగోళికంగా ఎంత క్లేషభూయిస్టమైన ప్రదేశంలో ఉన్నా... ఆమె ఆయన పక్కన ఉంటే ఆయన ఏ ఇంట్లో ఉంటే శాంతిగా ఉంటాడో అక్కడే ఉన్నట్లు భావిస్తాడు అందుకే ʻగృహిణీ గృహముచ్యతేʼ గృహము అంటే రాళ్ళు పెడ్డలూ సిమెంటూ ఇల్లూ ఫ్యాన్లు కావు ఇల్లు అంటే అర్థమేమిటంటే భార్యయే ఇల్లు అని అర్థం. గృహిణీ గృహముచ్యతే గృహిణియే గృహమని పిలవబడుతుంది ఆవిడ ఉంటే ఇల్లు ఆవిడ లేకపోతే అది ఇల్లు కాదూ తాత్కాలిక నివాస స్థలమూ. నీవు కొంత కాలము ఉండడానికి వచ్చావు అది ఎప్పటికీ ఇల్లుకాదు ఆవిడ నీ పక్కన ఉన్నంత సేపే ఇల్లు తను కోట్లకి పడగలెత్తినవాడు కానివ్వండీ తనభార్య జారిపోయిందా ఇక తన ఇల్లులా ఉండదు అంతే ఇంట్లో. ఇంట్లో వెళ్ళినప్పుడు ఆ స్వాత్యంత్రం పోతుంది. ఆవిడ ఉన్నన్నాళ్లే ఆ స్వాత్యంత్రం అది పురుషుడి జీవితంలో అత్యంత దౌర్భాగ్యం భార్యజారిపోవడం. అన్ని పోతాయికదా దేనికి కూర్చుంటాడు పీఠల మీద ఇంకేం లేదు ఆవిడ ఎంత అనారోగ్యంగానైనా ఉండనీ ఒక జాకెట్టు బట్ట వడిలో పెట్టుకు కూర్చుంటాడు అది, అదికారముంది ఆవిడ జారిందా అధికారం పోయింది.
కాబట్టి ఎంతపెద్ద మాట మాట్లాడుతుందో చూడండీ తల్లి మాట్లాడిందంటే అలా ఉంటుంది ప్రాసాదాగ్రై ర్విమానై ర్వా వైహాయస గతేన వా ! సర్వావస్థా గతా భర్తుః పాద చ్ఛాయా విశిష్యతే !! రామా! ఒక పెద్ద ప్రాసాదములో ఉంటే సంతోషంగా ఉంటుందా... విమానంలో ఉంటే సంతోషంగా ఉంటుందా అంటే ప్రాసాదము కన్నా విమానం గొప్పది, విమానం అంటే ఇప్పుడు తిరిగే విమానాలని మీరు అనుకోకండీ విమానం అంటే మేడ అన్న భాషలో అర్థం చేసుకోండీ, ఒకదానికన్నా ఒకటి ఎత్తైనదీ సౌఖ్యమైనది. ప్రాసాదంలో ఉంటే సుఖంగా ఉంటుందా, విమానంలో ఉంటే సుఖంగా ఉంటుందా స్వేచ్ఛగా ఆకాశంలో తిరగగలిగితే సంతోషంగా ఉంటుందా ఆడదానికి అని అడిగితే రామా! మీరు ఒక విషయాన్ని తెలుసుకోండీ ఇవన్నీ కావు భర్త యొక్క పాదముల నీడలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. కాబట్టి నాకు ఆ నీడ కావాలి ఈ నీడలో ఉండమని అనరేమిటీ, ఈ

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
ప్రాసాదాలు విమానాలు నాకు అక్కరలేదు నాకు కావలసిన ఛాయ మీ పాద ఛాయ కావాలి. అక్కడ నాకు విశ్రాంతి కోటి మందికి అన్నం పెట్టనివ్వండీ నాకు ఆ తృప్తి ఉండదు, ఆయనకు ఇంత చారు అన్నం పెట్టనీవ్వండి ఆ తృప్తి వేరు. వంద మంది కొడుకులకు కావలసినట్లు వండి పెట్టుకోండీ అది వేరు ఆయనకీ ఓ కప్పు కాఫీ ఇవ్వండీ ఆయన స్నానం చేసొచ్చి అమ్మయ్యా నీచేతి కాఫీ తాగితే బడలికపోతుందే అన్నాడనుకోండీ ఆ తృప్తి వేరు.
ఎవరన్నారోగాని మహాను భావుడు “మగడు మెచ్చినచాలు కాపురంలోన మొగలిపువ్వులా గాలి ముత్యాల వాన”  కాబట్టీ సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితుః ! అచిన్తయన్తీ త్రీన్ లోకాం శ్చిన్తయన్తీ పతివ్రతమ్ !! నేను అరణ్యానికి వస్తే అక్కడ పులులుంటాయ్ సింహాలుంటాయ్ ఇలా ఏదో మీరు మనసులో భావన ఏమీ పెట్టుకోకండీ, నాకు వాటిగురించి ఏవిధమైనా బాధాలేదు మీరు ఉండగా నాకు వాటివల్ల వచ్చేటటువంటి ఇబ్బందీ కూడా ఏమీ ఉండదు ఫల మూలాశనా నిత్యం భవిష్యామి న సంశయః ! న తే దుఃఖం కరిష్యామి నివసన్తీ సహ త్వయా !! నాకూ మీరు తెచ్చినటువంటి పళ్ళు అరణ్యంలోంచి తృప్తి, మీరు తెచ్చినటువంటి దుంపలు నాకు తృప్తి మీరు ఏది తెస్తే అది తృప్తి తప్పా మీరు త్యానిదీ మీకు వండిపెట్టనిదీ మీకు తినగా మిగిలినదీ మీతో కలిసి తిననిదీ మీరెక్కడో ఉండి నేను ఇక్కడ తిన్నదీ పరమాన్నమైనా నాకు సహించదు. కాబట్టి రామా నేను అలా తింటానికి బాధపడుతానేమోనని మీరు అనుకోవద్దు నేను చాలా సంతోషంగా మీతో కలిసి తింటాను, నన్ను ఆ భాగ్యానికి దూరం చేయకండీ హంస కారణ్డవా కీర్ణాః పద్మినీః సాధు పుష్పితాః ! ఇచ్ఛేయం సుఖినీ ద్రష్టుం త్వయా వీరేణ సంగతా !! మీతో కలిసి అలా తిరుగుతున్నప్పుడు హంస కారణ్డవా కీర్ణాః హంసలు కారండవములూ ఆ పక్షులన్నీ ఎగురూతూంటే చూస్తూంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా... పక్షులన్న తరువాత ఎగరవాండీ ఎగురుతాయి, అంతఃపురంలో నెమళ్ళుంటాయి, హంసలుంటాయి, చక్కచక్కటి పెంపుడు చిలకలు ఉంటాయి అన్ని ఉంటాయి అవి ఇష్టమా అరణ్యమంలో ఎగిరిపోతున్నటువంటి పక్షులు ఇష్టమా అరణ్యంలో ఎగురుతున్న పక్షులే ఇష్టం ఎందుకో తెలుసా పురివిప్పి ఆడిన నెమలి కూడా నాకు ఇక్కడ సంతోషంగా ఉండదు ఎందుకంటే మీరులేరు మీరు పక్కనలేని నెమలి నాట్యం నాకు ఇచ్చగించదు, మీరు పక్కనుండగా ఎగురుతున్నపక్షి నాకు అందంగా కనపడుతుంది నా మనసుకి రంజకత్వం నా మనసుకి సంతోషం మీరు పక్కనుండడంవల్ల వస్తుంది తప్పా, వస్తువు వల్ల సంతోషం రాదు. మీరు పక్కనుండగా కంద తృప్తి, మీరు పక్కనుండగా పండూ తృప్తి, మీరు పక్కనుండగా ఎగిరిన పక్షీ తృప్తి, మీరు పక్కనుండగా తిరిగిన పులి భయరహితం, మీరు పక్కన లేరు అలా ఎవరో వెళ్ళారు నాకు భయం, మీరు పక్కన లేరు ఎవరితోనో మాట్లాడినా భయం, మీరు పక్కనలేరు నెమలి పురి విప్పి ఆడింది నాకు సంతోషం ఉండదు రామా! ఇది గుర్తు పెట్టుకోండి.
మీతో కలిసి ఉంటే సుఖం, మీతో కలిసిలేనిదీ ఏవస్తువుచేత నాకు సుఖమన్నది ఉండదు. కాట్టి సుఖమన్న మీపక్కన ఉండడంవల్ల అనుభవించాలి తప్పా మీ పక్కనలేకుండగా సుఖమన్నమాట లేనేలేదు. అంటే ఆవిడ ఎంతగా రాముడితో మమేకమైపోయిందో దాపత్యమన్నమాట ఇది గదాండీ అర్థం ఇది స్ఫష్టమైన అవగాహన కలిగి ఉండడం దాంపత్యం కాబట్టి ఈమాట చెప్పి తల్లీ స్వర్గేపి చ వినా వాసో భవితా యది రాఘవ ! త్వయా మమ నరవ్యాఘ్ర నాహం తమపి రోచయే !! ఒకవేళ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలున్నాయి ఇక్కడ వాళ్ళుపొందే సుఖాలు కాదూ ఆ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలు నీకు ఇస్తాను కావాలా..! అని నన్నేవరన్నా అడిగితే నీ వెంటవుండడం కన్నా... నాకు ఆ సుఖాలు కూడా పనికిమాలినవే రామా! నాకు నీ వెంటవుండడం ప్రధానం అంటే తన ధర్మంపట్ల తనకు అంతపూనిక ఉంది అహం

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
గమిష్యామి వనం సుదుర్గమం ! మృగా యుతం వానర వారణై ర్యుతమ్ !! వనే నివత్స్యామి యథా పితు ర్గృహే ! తవైవ పాదా వుపగృహ్య సంయతా !! నేనూ అహం గమిష్యామి వనం సుదుర్గమం దుర్గమమైన అరణ్యంలోకి రామా నేను ప్రవేశిస్తాను మృగములతో, వానరములతో ఉండేటటువంటి ఆ వనంలో నేను తిరుగుతాను అక్కడ నేను ఎలా ఉంటానో తెలుసా పుట్టింటిలో ఉన్నట్టు ఉంటాను, ఆడపిల్ల అత్తవారింట్లో కదా అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల తన స్వంతిల్లు పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లా బందు గృహానికి వెళ్ళినట్లు కానీ పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లకి ఏమిటో తెలుసాండీ చాలా ఉల్లాసంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తన తమ్ముడు తన అన్న తన మరదలు తన వదినగారు తన తల్లి తన తండ్రి మళ్లీ కొన్నాళ్ళు వాళ్ళని వెళ్ళి చూస్తున్నా తనేమిటంటే తనిక్కడిది కాదు తను అక్కడిది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడ పుట్టినపిల్ల అక్కడికెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి పిల్లా ఇక్కడకొచ్చి అప్పుడప్పుడూ చూడ్డం మాత్రం ఇష్టపడుతుంది.
అలా రామా! నేను పుట్టినింటికి వెళ్ళినట్లు భావిస్తా... కాబట్టి నా కదేమీ కష్టంగా అనిపించదు నీతోకలిసి పుట్టింటికివెళ్ళితే ఎంతసంతోషంగా ఉంటుందో నీతోకలిసి అడవికి వెళ్ళితే అంతసంతోషంగా ఉంటుంది. ఇంక ఇంతకన్నా ఏం చెప్పను కాబట్టి నన్ను తీసుకెళ్ళండీ, కాదు ఆవిడ అవతార ప్రయోజనాన్ని గుర్తుచేసిందీ అన్నాడు. అహం గమిష్యామి వనం సుదుర్గమం రామా! నేను అడవికి రాకపోతే రామకార్యం నేరవేరదు సీతా అపహరణం జరగాలి మృగా యుతం ఒక మృగం వస్తూందీ ఇద్దరం విడిపోతాం. బంగారు జింకవల్ల వారణై ర్యుతమ్  ఒక కోతివల్ల మనం కలుసుకుంటాం. హనుమ వస్తారు వనే నివత్స్యామి యథా పితు ర్గృహే తండ్రి ఇంట్లో ఉన్నట్లుగా అంటే దానికి ఏదో మళ్ళీ వెనకాల కొంత కథా భాగం ఉంది కాబట్టీ ఆ వేద చరిత్ర ఉంది కాబట్టీ రావణుడి ఇంట వనంలో నేను తండ్రి ఇంట్లో ఉన్నట్లు ఉంటాను, నేను ఉన్నంత కాలము తవైవ పాదా వుపగృహ్య సంయతా మనస్సులో మీ పాదములను స్మరిస్తూ నేను కొంత కాలము అలా వనంలో ఉంటాను కాబట్టి రామా! ఇది జరగాలీ ఆవిడ ఇదే శ్లోకంలో రెండు భావాలు పెట్టిచెప్పింది. అవతార ప్రయోజనాన్ని గుర్తుచేసింది నరుడిగా వచ్చిన మరిచిపోయావా ఏమీ? నీవు రాకుండా అవతార ప్రయోజనం జరగదు ఏమీ రామా నేను రావాలి అంతర్లీనంగా శ్లోకంలో ఆభావమూ ఉంది నరకాంతగా కూడా పైకి మాట్లాడింది.
కాబట్టి ఇన్ని చెప్పిన తరువాత రాముడు అన్నాడూ సీతా నీకు ఏమీ తెలియదు తేలికా అనుకుంటున్నావు అక్కడ ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, భయంకరమైనటువంటి సరీస్పృపాలు ఉంటాయి, అక్కడ భూమిమీద పాకేటటువంటి పెద్ద పెద్ద పాములు ఉంటాయి, రాత్రి వేళల్లో రాక్షసులు తిరుగుతూ ఉంటారు, క్రూర మృగాలు అరుస్తూంటాయి, భయంకరమైనటువంటి విషంతో కూడినటువంటి పురుగులు ఈగలూ ఎగురుతూంటాయి, అక్కడ ఏది దొరికితే అది తినాలి తప్పా మనం కావాలని అనుకున్నది అక్కడ దొరకదు, మూడు పూటలా స్నానం చేయవలసి ఉంటుంది, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం కట్టుకున్న వీధి మీద దేవతలని ఆరాధన చేయవలసి ఉంటుంది. ఒక్కొక్క సారి చాలా భయంకరమైనగాలి దూమారం రేగుతుంది చెట్లు కదలిపోయి కొమ్మలు విరిగిపోయి పడిపోతాయి, ఒక్కొక్కసారి అడవిలో అగ్ని అంటుకుంటుందీ అప్పుడు ఆకాశమంత ఎత్తు అగ్నిహోత్రపు జ్వాలలు రేగుతాయి, ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలియదు. దూరం నుంచి చూసిన ఒక క్రూర మృగం పరుగెత్తుకొచ్చి మీద పడుతున్నప్పుడు బాణాన్ని సంధించవలసి ఉంటుంది, చాలా భయంకరంగా చాలా కష్టంగా ఉంటుందీ అంతా తీగలతో ముళ్లతో చెట్లతో అడుగుతీసి అడుగు వేయడానికి భయంకొల్పుతూ ఉంటుందీ మనుష్య సంచారం ఉండదూ రాక్షస సంచారంతో ఉంటుంది. అటువంటి గహనమైన అరణ్యంలోకి అంత తెలిగ్గా వెళ్ళడం తేలికా అని నువ్వు అనుకుంటున్నావు, ఏదో మీ పక్కన ఉంటే సంతోషంగా ఉంటుంది అని వచ్చేస్తాను వచ్చేస్తాను అంటున్నావు కాబట్టి సీతా! నేను చెబుతున్నాను నీవు రావద్దూ ఇక్కడే ఉండు.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
అంటే ఆవిడ వల వల వల వలా ఏడ్చేసింది ఏడ్చేసి పద్మములోంచి నీరు కారితే ఎలా ఉంటుందో అలా నీరు కారి పోతున్న కన్నుల చేతా ఆ కారిపోయిన కన్నీరు చేత ఆవిడ వక్షస్థలమంతా తడిసిపోయిందటా! తడిసిపోయి ఏత త్తు వచనం శ్రుత్వా సీతా రామ స్య దుఃఖితా ! ప్రసక్తాశ్రు ముఖీ మన్దమ్ ఇదం వచనమ్ అబ్రవీత్ !! ఇందాకా మాట్లాడినంత గట్టిగా మాట్లాడటం లేదు ఇప్పుడు కంఠం చాలా నెమ్మదిగా అంటే దుఃఖము యొక్క ఆవేశమును పూడ్చేసింది, నన్ను తీసుకెళ్ళనంటున్నాడు రాముడితో వెళ్ళకపోతే నేను బ్రతకలేను తనకు భాగ్యాన్ని కోల్పోయినదానిలా ఆవిడ అందీ యే త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి ! గుణాన్ ఇత్యే వ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్ !! మీరు నాకు అనేక పర్యాయములు వివరించి చెప్పారు ఒక భార్య యొక్క సంతోషం ఒక భార్య యొక్క సుఖం భర్తని అనువర్తించి భర్తతో కలిసి ఉండడంలోనే ఉంటూందీ అనీ, మీరు నాకు ఏది చెప్పారో అది నేను ఇవ్వాల అడిగితే మీరు వద్దూ అంటున్నారు, అంటే మీరు చెప్పిందొకటీ అంటే మీరు ఆచరిస్తాను అని అంటే ఆచనరణయందు ఇంకొకటీ చేయిస్తున్నారు, ఇది దోషం కాదా... అన్నట్లుగా అడిగింది. మృగా సింహా గజా శ్చైవ శార్దూలా శ్శరభ స్తథా ! పక్షిణ స్సృమరాశ్చైవ యే చాన్యే వన చారిణః !! అదృష్ట పూర్వ రూపత్వాత్ సర్వే తే తమ రాఘవ ! రూపం దృష్ట్వాపసర్పేయుః భయే సర్వే హి భిభ్యతి !! రామా! ఏనుగుంటాయి పులులుంటాయి సింహాలుంటాయి సరీస్పృహాలుంటాయి లేకపోతే ఏదో చామరీ మృగాలుంటాయి అని చెప్తున్నారే నేను ఒక మాట చెప్పనా... వాటిని చూసి మీగిలినవాళ్ళు ఎలా భయపడుతారో అవి కూడా మహాతేజో వంతుడైన వ్యక్తిని చూసి కూడా చాలా భయపడుతాయి, మీరు వాటికి కనపడగానే మీ తేజస్సు చూడగానే అవి పారిపోతాయి.
కాబట్టి మీరు పక్కనుండగా నాకు భయమేమిటీ వాటివల్లా అవి ఉంటాయంటారేమిటీ అవి ఉండడం తోపాటు మీరు నా పక్కన ఉంటారుకదా కాబట్టి నాకు భయమెందుకు నాకు భయం లేదు పతి హీనా తు యా నారీ న సా శక్ష్యతి జీవితుమ్ ! కామమ్ ఏవం విధం రామ త్వయా మమ విదర్శితమ్ !! పతి లేనటువంటి స్త్రీ యొక్క జీవితం ఎట్టి పరిస్థితితులలోనూ శోభస్కరంగా ఉండదూ... అని మీరు చెప్పినమాటయే నాకు ప్రమాణం. కాబట్టి నేను అలానే మీమ్మల్ని అనువర్తిస్తాను అథ చాపి మహా ప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శ్రుతమ్ ! పురా పితృ గృహే సత్యం వస్తవ్యం కిల మే వనే !! నేను నా పుట్టింటిలో పెళ్ళికి పూర్వం ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మణులు వచ్చీ నా జాతకం చూసి ఒక మాట చెప్పారు, ఈ అమ్మాయి కొంత కాలం వనవాసం చేస్తుందీ అని చెప్పారు ఇప్పుడు నాకు తెలుస్తూంది ఇప్పుడు నేను వనాలకి వెళ్ళవలసిందీ అని, కాబట్టి రామా నేను మీతో వనవాసాలకి వస్తాను కన్యయా చ పితు ర్గేహే వన వాసః శ్రుతో మయా ! భిక్షిణ్యాః సాధు వృత్తాయా మమ మాతు రిహాగ్రతః !! ఒకానొకప్పుడు నేను అంతఃపురంలో ఉంటే నా తల్లిగారి దగ్గరికీ ఒక భిక్షుకి అంటే భిక్ష్యాన్ని స్వీకరించేటటువంటి వనిత ఒకామే వచ్చింది ఆమే త్రికాల వేది ఆమెకి కాలజ్ఞానం ఉంది, ఆమె ఒక మాట అంది మీ కూతురు సీతమ్మ అరణ్యవాసం చేస్తుందీ అని కాబట్టి నాకు ఇప్పుడు అర్థమౌతుంది నేను ఇప్పుడు అరణ్యవాసం చెయ్యవలసిందీ అని మిమ్మల్ని అనుగమించడాని కోసం

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
కాబట్టి నేను తప్పకుండా వస్తాను యది మాం దుఃఖితామ్ ఏవం వనం నేతుం న చేచ్ఛసి ! విషమ్ అగ్నిం జలం వాహమ్ ఆస్థాస్యే మృత్య కారణాత్ !! నేను ఇన్ని చెప్పినా మీరు నన్ను తీసుకొని వెళ్ళనూ అంటే మిమ్మలని విడిచి 14 సంవత్సరములు బాధపడుతూ దుఃఖంతో శోకంతో బాధపడుతూ బ్రతకడం కన్నా... అంత శోకాన్ని అనుభవిచలేకా నేను ఈ శరీరంతో ఉండడం కుదరదు కాబట్టీ విషం తాగి కానీ అగ్నిలో ప్రవేసించి కానీ నీట దూకి కానీ ఈ శరీరాన్ని విడిచి పెట్టేస్తాను తప్పా మిమ్మల్ని విడిచిపెట్టి మాత్రం నేను ఉండలేను అంది.
అంటే రాముడు అన్నాడూ నీవు ఎన్నైనా చెప్పు మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు తప్పా కోరి కోరి నిన్ను కష్టపెట్టలేను కాబట్టి నిన్ను తీసుకొని వెళ్ళడం కుదరదూ, అంటే సీతమ్మ అందీ కిం త్వా అమన్యత వైదేహః పితా మే మిథిలాధిపః ! రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహమ్ !! ఆవిడందీ మా నాన్నగారూ కన్యాదానం చేయడం కోసం నేను ఆడపిల్లను కదా అనీ మగవాడి కోసం వెతికి వెతికి కన్యాదానం చేశాడూ అని అనుకున్నాడు ఆయనకు తెలియలేదు మగవేశం కట్టిన ఆడదానికే కన్యాదానం చేశాడు, నీవు మొగాడివైతేగా ఆడదానివి, అంటే ఇంత మాట అనచ్చా... అని మనకి అనిపిస్తుంది కానీ బాగాజ్ఞాపకం పెట్టుకోండి. దాంపత్యం అనేటటువంటి దానికి అర్థమేమిటో తెలుసాండీ! అంతబాధ కడుపులోంచి వచ్చేసింది అనుకోండీ అప్పుడు ఆపాటి స్వాత్యంత్రం భక్తుడికి భగవంతుడు దగ్గరా “ఎవడబ్బా సొమ్మాని కులుకుతువు తిరిగేవు రామ చంద్రా”  అని రామదాసుగారు అనలేదా, భక్తుడికి భగవంతుడి దగ్గరా, భార్యకి భర్త దగ్గరా ఎప్పుడూ ఉంటూంది, భార్య భర్తని కాకపోతే అలా ఎవరిని నిలదీస్తుంది అయిందానికీ కాందానికీ నిలదీసేయమని కాదు నా ఉద్దేశ్యం ధర్మం కోసం ఆయనను అనువర్తించడం కోసం ఆపాటి స్వాత్యంత్రంతో ఇంక అంత కోపం వచ్చేసిన తరువాత కడుపు ఉడికిపోయి ఎన్ని చెప్పినా తీసుకెళ్ళనూ అంటే, ఎంతకీ తీసుకెళ్ళడానికి అసలు కారణం నాకు తెలుసు పులులూ సింహాలు నాకేమైనా చేస్తే నన్ను రక్షించడం కష్టం అనుకుంటే మగతనముంటే కదా మీరే ఆడదానివి. కాబట్టి ఇదీ చాలా తప్పు మాటా ఒప్పు మాటా అన్నది భర్తని బట్టి ఉంటుంది మిమ్మల్ని బట్టికాదు. భర్తగారు ఎంత బాధపడిపోయిందో తీసుకెళ్ళకపోయాననీ ఎంత మాటందో అంటే నాతో రావడానికి ఎంతిష్టమో అని సంతోషిస్తే మీరెందుకూ ఓ బుగ్గలు నొక్కుకోవడం.
ఆయన సంతోషించాడు తీసుకెళ్ళాడు మీకెందుకు మధ్యలో బాధ, మీకెందుకు తీర్పులు దానిమీదా మీకక్కరలేని విషయానికి మీరు వెళ్ళారనిగుర్తు, వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉందా మీరుదాని మీద తీర్పుచెప్తున్నారా మీకెందుకండీ ఆ విషయం అసలూ నాభార్య నన్నేదో అందండీ, గుంటూరొస్తానండీ మళ్ళీ వారం రోజుల్లో అని, ఎందుకస్తమానం గుంటూరు వద్దు అన్నాను అంటే మీరు నన్ను విడిచిపెట్టీ మీరు వారంలోజులైనా 10 రోజులైనా ఉండగలరు నేనే వెర్రిమొహాన్ని వారానికి ఒకసారి ఉండలేక అసలు మిమ్మల్ని అడగడం అర్థం చేసుకొంటే నాకు దూరంగా ఉండడం అన్నది ఎంతిష్టమో అర్థమౌతున్నది అందుకెళ్తున్నారు కదా గుంటూరు అందనుకోండీ, అమ్మ అసాధ్యం కూలా నన్ను ఇంతమాట అనేసిందా ఇన్నాళ్ళ నుంచి నేను ఇంత ప్రేమిస్తున్నాను అనుకోకూడదు భార్య నన్ను రెండు రోజులకోసారి చూడకుండా ఉండలేక ఎలాగోలా నన్ను

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
ఒప్పించడానికి ఎంత మాట అన్నావే... ఎంత ప్రేమే నీది అని నేను ఓ నవ్వు నవ్వి. ఎదో అన్నాను గానీ రావద్దన్నానా వారానికేంటి మూడు రోజులకోసారి రా అని నేనన్నాననుకోండీ మీరు వెంటనే తీర్పులు చెప్పకూడదు దానిమీద. అలా కోటేశ్వరరావుగారిని అనచ్చా! అని మీరేం సిదాంతాలు తీయ్యక్కరలేదు అది మా ఇద్దరి విషయం కదా... సీతా రాములది కూడా అంతే... అది వాళ్ళ స్వాత్యంత్రంగా అర్థం చేసుకోండి, స్వేచ్ఛగా అర్థం చేసుకోండి అంతవరకే.
ఆ దాంపత్యంలో ఉండేటటువంటి అందాన్ని మీరు బావనచేయ్యాలి దానిని కిం త్వా అమన్యత వైదేహః పితా మే మిథిలాధిపః ! రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహమ్ !! అనృతం బత లోకోయమ్ అజ్ఞానాత్ యత్ హి వక్ష్యతి ! తేజో నాస్తి పరం రామే తపతీవ దివాకరే !! నిజంగా సీతమ్మ తల్లి రామున్ని అంత మాట అంటే పక్కనే ఈ శ్లోకం చెప్పచ్చు, రామా! నీయందు సౌర్యము, పరాక్రము, తేజస్సు, వీర్యమూ లేదని ఎవడైనా అనుకొంటే సూర్య బింబంలో కాంతి లేదనుకున్నవాడు ఎంత వెర్రివాడో మిమ్మల్ని అన్నవాడు అంత వెర్రివాడే... ఆవిడే అందా పక్కనే... ఇంకెందుకు మీ తీర్పులు. కాబట్టి రామా మీరు అంతటి తేజో వంతులు కాబట్టి మీ పక్కన ఉండడం మీతో రావడం నాకు నిర్భయత్వం నీతో వస్తాను, ఇంకొక మాట చెప్పనా నేను కుశ కాశ శర ఇషీకా యే చ కణ్టకినో ద్రుమాః ! తూలాజిన సమ స్పర్శా మార్గే మమ సహ త్వయా !! ఒకవేళ మనం వెడుతున్నప్పుడు దర్భలూ రెల్లు గడ్డీ మొదలగు ముళ్లు దుబ్బులూ ముళ్ళ పొదలూ ముళ్ళు జిల్లేడు ముళ్ళు పెద్ద పెద్ద ముళ్ళున్నటువంటి చెట్లకి పెరిగినటువంటి ముళ్ళు ఇటువంటివి నాకు గుచ్చుకుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా, మీరు పక్కన ఉండడంవల్ల నాకు జింక చర్మం తగిలినట్లు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాదు ఇంకొక మాట చెప్తున్నాను మహా వాత సముద్ధూతం య న్మామ్ అపకరిష్యతి ! రజో రమణ తన్ మన్యే పరార్థ్యమ్ ఇవ చన్దనమ్ !! మనం అరణ్యంలో వెడుతున్నప్పుడు పెద్ద పెద్ద గాలి దుమారం రేగి మట్టంతా వచ్చి నా మీద పడిపోతే... నా ఒంటికంతటికీ చందనం రాసినట్టు ఉంటుంది మీరు పక్కనుంటే శాద్వలేషు యథా సిశ్యే వనాన్తే వన గోచర ! కుథాఽఽస్తరణ తల్పేషు కిం స్యాత్ సుఖతరం తతః !! పచ్చిక బయళ్ళమీద అక్కడ ఇళ్ళుండవూ వాకిళ్ళుండవూ అక్కడ ఏది దొరికితే దానిమీద పడుకోవాలంటున్నావు కదా ఒక వేళ చీకటి పడిపోయో పగటి పూట బడలిపోయో పశ్చికబైలు చూసుకొని దాని మీద మనమిద్దరం పడుకున్నామమనుకోండీ నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా... చాలా గొప్ప తల్పం మీద మనిద్దరం పడుకున్న దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంటుంది నీతో కలిసి పడుకుంటే అంటే ఇక్కడ చందనం రాసుకున్నా ఉండదు. ఇక్కడ తల్పం మీద పడుకున్నా ఉండదు. మీతో కలిసి ఉంటే గాలి ధూమారానికి వచ్చిన ధూళి నాకు అలా అనిపిస్తుంది. ముళ్ళు గుచ్చుకుంటే నాకు అలా సంతోషంగా ఉంటుంది.
కాబట్టి రామా! మీతో తప్పకుండా వస్తాను నన్ను మీతో తీసుకెళ్ళవలసిందే, అంటే ఇప్పుడు రాముడు అన్నాడూ... తవ సర్వమ్ అభిప్రాయమ్ అవిజ్ఞాయ శుభాఽఽననే ! వాసం న రోజయేరణ్యే శక్తిమాన్ అపి రక్షణే !! సీతా! భర్తయైనటువంటి వాడు భార్యనీ ప్రతివిషయంలోనూ శాశకత్వం చేసి, శాసనం చేసి తన వెంట తిప్పుకోవడం కాదు ఆమె తన ధర్మాన్ని పాటించడానికి తాను సిద్ధంగా ఉందాని పరి పరి విధములు చూసి ఆమెను అనుగమించమనాలి అంతేకాని భర్తని కదా అని నన్ను అనువర్తించమని నేను శాశించవచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదు. నీ ధర్మంగా నీవు గుర్తించి నా వెంటవస్తే అంత కన్నా నాకు కావలసింది ఏముందీ ఇన్ని చెప్పినా కాదు నా పక్కనే ఉంటానని నీవు అంటున్నావు ఇంత కన్నా నాకు ఏం కావాలి సీతా... తప్పకుండా పదా ఇద్దరం కలిసే బయలుదేరుదాం నేను ఒక మాట చెప్పనా నిన్ను విడిచి నాకు స్వర్గలోకం కూడా అవసరం లేదు, నిన్ను విడిచి నేను ఉండలేను సీతా... నీవు రావాలనే నాకోరిక కానీ శాశించడం నాకు ఇష్టంలేదు ఇదీ ధర్మాత్ముడైన రాముడు, ఇదీ ఒక భార్యకి భర్తగా నిలబడే రాముడంటే ఇలా ఉంటాడు. ఇప్పుడు చెప్పండీ రాముడు ఏ దోషం చేశాడు భార్య విషయంలో. ఆయన ఏమైనా శాశించాడా, ఆయన ఏమైనా అమర్యాదగా మాట్లాడాడా, ఆయన ఏమైనా బలవంతంగా నన్ను అనువర్తించు అన్నాడా ఆయన ఎన్నడూ అలా చేసేవాడు కాడు రాముడు మర్యాదా పురుషోత్తముడు. కాబట్టి ఆయన అన్నాడూ, ఇప్పుడు చెప్తున్నాడు సీతా రాజ్యం ఎందుకు వదిలేశారండీ నాన్నగారి మాట ఎందుకు విననారండీ అలాగా అసలు మామయ్యగారు ఎందుకు మిమ్మల్ని అడిగారండీ రాజ్యం వదిలేయమనీ ఒక్క మాట ఒక్క ప్రశ్న సీతమ్మ వేయలేదు అసలు, అసలు ఆవిడకు దానికి సంబంధం లేదు దానిగురించి బాధే పడలేదు. కానీ భార్యకు చెప్పడం భర్త యొక్క ధర్మం, తను చెప్పాలి భార్యకి కాబట్టి తాను చెప్తున్నాడు.
నాకు ఒక మిత్రుడుండే వాడు అతనూ ఒకసారీ నాతో పెట్రోల్ కొట్టించుకోవాలండీ మా ఆవిడని అడిగి ఓ వందరూపాయలు తీసుకోవాలి అన్నాడు, నేనూ వాళ్ళింట్లోనే ఉన్నాను ఏదో కాఫి ఇచ్చాడు తాగుతున్నాను, అన్నట్లు మరిచిపోయానండోయ్ పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు పర్సులో అని ఉండండి మా ఆవిడని అడిగి తెచ్చుకోవాలి అని లోపలికి వెళ్ళి వందరూపాయలు తెచ్చుకున్నాడు. ఏమయ్యా నీవు నీ ద్రవ్యమంతటనీ భార్యకి ఇస్తుంటావా అన్నాను నాకేం అందులో తప్పుకనపడి కాదు సుమాండీ..? అంటే ఆయన నాతో ఒక గొప్ప మాట అన్నాడు నేను ఇప్పటికీ మరిచిపోలేను, కోటేశ్వర రావుగారు నా బుద్ధియందు లౌల్యముంది నాకొక వ్యసనముంది దానివైపుకి నా బుద్ధి లాగుతుంటుంది సాయంకాలమైతే... నాకు నేనుగా పెట్టుకున్న క్రమశిక్షణ ఏమిటంటే... ఈశ్వరుడి దగ్గరా నా ఆత్మకీ నా భార్యకీ బేధం లేదు. నన్ను నమ్మి నా వెంట వచ్చినటువంటి ఆడది, నాకూ బిడ్డల్ని ఇచ్చింది, నాకోసం ఏడిచేటటువంటి వ్యక్తి, ఆమెకన్నా నాకు ఇంకెవరుంటారు ఆమెను కూడా నేను అతిక్రమం చేస్తే ఇంక నన్ను బాగు చేసేవాడు ఈ లోకంలో లేడు. నేను ఒట్టు పెట్టుకున్నాను డబ్బంటూ అడిగితే మా ఆవిడని అడిగే తీసుకుంటాను, ఖర్చు మా ఆవిడకు చెప్తాను అని నియమం పెట్టుకున్నాను అని అన్నాడు. మా ఆవిడని సాయంకాలం వ్యసనానికి డబ్బు కావాలని అడగలేనుగా... అందుకనీ అర్థమునందు ఇటువంటి క్రమశిక్షణ నా భార్యవైపు నుంచి తెచ్చుకునీ, నీవు నన్ను అడుగులెక్కా అని తనకు స్వాత్యంత్రమిచ్చీ డబ్బిచ్చి దాని దగ్గర పుచ్చుకొని ఆ వ్యసనం వైపు నుంచి తప్పుకున్నానండీ, ఇప్పుడు నాకు ఆ వ్యసనం పోయింది అన్నాడు. భార్యని అలా అనుకూలంగా చక్కగా ధర్మార్థ కామములయందు వాడుకొని తరించారు పురుషులు. వర్తమానంలో కూడా అటువంటి వాళ్ళని నేను చూశాను. నేను ఎంత సంతోషపడ్డానంటే నేను ఎంతో సంతోసించాను నిజంగా నేను ఎన్నో ఉపన్యాసాలలో చెప్పానో అతని ఎక్కడో అక్కడ విని సంతోషిస్తాడు. ఓహో పేరు చెప్పితే బాగుండదు కాబట్టి చెప్పలేను కానీ నా మిత్రుడు నేనారోజన్న మాటలు అంత స్వహృదయంతో అర్థం చేసుకున్నాడని సంతోషిస్తాడు.
కాబట్టి రాముడు అన్నాడూ ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టానో తెలుసా సీతా య త్త్రయం త త్త్రయో లోకాః పవిత్రం తత్సమం భువి ! నాన్య దస్తి శుభాపాంగే తేనేద మభిరాధ్యతే !! లోకంలో అత్యంత పూజనీయ వస్తువులు ఉన్నాయి అవి నీ కంటి ఎదుట కనపడేటటువంటి సాక్ష్యాత్ పరమేశ్వర స్వరూపములు ఈ మాంసనేత్రములకు దొరికేటటువంటి ఈశ్వర రూపాలు అవి ఒకటి తల్లి రెండు తండ్రి మూడు గురువు. ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటానంటే ఈ స్పర్శకు దొరకకపోవచ్చు,

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
అది ఎవరో మహాత్ములకు దొరుకుతుంది, మీరు చూడండీ మీకు అభిముఖంగా పార్వతీ పరమేశ్వరులు సింహాసనం మీద కూర్చుంటే, ఎడమ తొడమీద పార్వతీ దేవి ఎర్రటి బట్ట కట్టుకుని కూర్చుంటే పరమ శివుడి యొక్క ఒక పాదాన్ని నందీశ్వరుడు ఇలా చేతిలో పట్టుకుని ఉంటాడు గృహీత్వాహస్తాభ్యాం అని చేత్తో పట్టుకుని ఉన్నటువంటివాడు నందీర్వరుడు కాబట్టి పట్టుకున్నాడు, ఒక్క పాదాన్నే పట్టుకుంటాడు రెండు పాదాలు పట్టుకోడు ఎందుకంటే ఇలా మడతవేసి కూర్చుంటే ఒక్క పాదము కిందకుంటుంది రెండవ పాదం ఇలా మడతవేసి ఉంది. ఎడమ తొడ మీద అమ్మవారు ఉంది కుడిపాదాన్ని ఆయన ఇలా పట్టుకున్నాడు నందీశ్వరుడు ఆయనకి దొరికింది పరమ శివ పాద స్పర్శ, నీకు దొరుకుతుందా దొరకదని నేను అనను ఏమో ఎవరు అదృష్టవంతులున్నారో... కానీ రాముడు అంటున్నాడు దొరుకుతుంది దొరకదంటావేమిటీ అమ్మ పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే, నాన్నగారి పాదాలు పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే, గురువుగారి పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే.
ఈశ్వరుడి పాదాలు తిన్నగా ఈ చేతులతో ముట్టుకుంటే ఎంత ఫలితమో ఈ ముగ్గురి పాదాలు పట్టుకోవడం అంతే ఫలితం. వాళ్ళ ముగ్గురి మాట వినడం ఎంత గొప్పో వీళ్ళ మాట వినడం అంతే గొప్ప కనపడని ఈశ్వరుడికి సేవలు చేస్తున్నప్పుడు కనపడిన ఈశ్వర స్వరూపాల్ని విష్మరించినవానికి అభ్యున్నతి ఎలా కలుగుతుంది. కనుకా తండ్రి పరమ దైవం నాకు అందుకు రాజ్యాన్ని వదిలిపెట్టాను సీతా అన్నాడు. సంతోషించింది సీతమ్మ అహా ఏమి నా భర్త సంస్కారం అని పొంగిపోయింది స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యాః పుత్రా స్సుఖాని చ ! గురు వృత్యనురోధేన న కించి దపి దుర్లభం !! ఏది కావాలి నీకు, స్వర్గం కావాలా ధనం కావాలా, ధాన్యం కావాలా, విద్య కావాలా, పుత్రులు కావాలా, సుఖం కావాలా వీళ్ళ ముగ్గిరికీ సేవచేసి పొందలేనిది ఈ లోకంలో లేదు. వీళ్ళని వదిలిపెట్టేసి ఇంకోళ్ళని ఏదో పట్టుకుంటాను అనడం అసమంజసం కదా సీతా అందుకనీ రాజ్యాన్ని వదిలేశాను, నాన్నగారి మాటనే పట్టుకున్నాను అది నాకు అన్నీ ఇస్తుంది సీతా ఇవ్వాళ నాకు ఇవ్వనట్లు కనపడచ్చు కానీ అన్నీ ఇస్తూందీ అదీ రాముడంటే... ఇచ్చిందా లేదా కీర్తినిచ్చింది, రావణ సంహారం చేయించింది, మహానుభావుడి మళ్ళీ తిరిగి పట్టాభిషేకం చేయించుకున్నాడు, 11 వేల సంవత్సరములు రాజ్యాన్ని పాలించాడు, భరతుడు ఎంత గొప్ప తమ్ముడో నిరూపించుకోవడానికి అవకాశం దొరికింది, లక్ష్మణుడు ఎంత మహాత్ముడో లోకంలో అనుగమించడానికి తెలిసింది, రాముడు అంటే ఏమిటో తెలిసింది. కాబట్టి సీతా నా తండ్రి మాట వినడమన్నది నాకు ఎప్పటికైనా ఉపకారమే... కాబట్టి నేను తండ్రి మాట విన్నాను సీతా అన్నాడు.
చాలా సంతోషించింది తల్లీ! ఆయన అన్నాడు సీతా మనం 14 సంవత్సరములు ఇక్కడ ఉండం కాబట్టీ ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ దాచేసీ తాళాలేసి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు, మనం అన్నిటినీ దానం చేసేద్దాం, దానం చేయడమన్న మాటలో మీరు ఒక్కటి పట్టుకోవలసి ఉంటుంది. దానం చేయడం అంటే మీరు రామాయణాన్ని బాగా చదవాలి, యోగ్యతని బట్టి దానం చేయాలి, ఉందికదాని దానం చేయకూడదు, ఉంది కదాని మీ యిచ్చ వచ్చినట్లు దానం చేశారనుకోండి ప్రమాదమొకటి వచ్చి కూర్చుంటుంది తెలుసాండి! ఎందుకంటే లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది. పెట్టేటప్పుడు పెట్టేవాడు మంచివాడు అవ్వచ్చు పొందేవాడు ఒక గజదొంగకి కంటి ఆపరేషన్ చేయించారనుకోండీ ఇంకో పదిళ్ళి దోచుకుంటాడు,

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
నేను కంటాపరేషన్ చేయించానండీ ఉచిత నేత్ర చికిత్సా అంటే అది ఎంతవరకూ అవసరమన్నది చూడవలసి ఉంటుంది మీరు చూసేటప్పుడు పాత్రతని గుర్తెరగాలి, పాత్రతని గుర్తెరగకుండా పెట్టరాదు పాత్రతని గుర్తెరకుండా పెట్టగలిగిన అధికారం ఒక్క ఈశ్వరుడు పొందివుంటాడంతే ఆయనే అంతా అలా పోషిస్తాడు అందుకే దేవాలయానికి ఆ అధికారం ఉంటుంది. దేవాలయం తనంత తానుగా కొన్నేచేస్తుంది అది కూడా అన్ని చేయకూడదు దేవాలం కూడా అలా చేయకూడదు.
కేరళాలో ఒక అన్నపూర్ణేశ్వరీ దేవాలంవుంది నాకు పేరు జ్ఞాపకం లేదుగానీ ఆ దేవాలయంలో ఏం చేస్తారంటే వెళ్ళినవాళ్ళందరికీ అన్నం పెడతారు. అన్నం పెట్టి రాత్రి ఏంచేస్తారంటే, మంచి అన్నం కూరలు బూరెలూ గారెలూ అన్నీ కూడా వేడి వేడిగా ఉన్నవన్నీ తీసుకెళ్ళీ పెద్ద పెద్ద ఆకులేసీ దూరంగా ఓ పెద్ద చెట్టుకింది పెట్టేసి వచ్చేస్తారు అందరూ, ఇక రాత్రి అటువైపుకి ఎవ్వరూ వెళ్ళరు ఎందుకో తెలుసాండీ గజదొంగలు అప్పుడు వచ్చి అన్నం తింటారు, వాళ్ళు మరి అందరిలోకి వస్తే పట్టుకుంటారని తినరేమోనని వాళ్ళు కూడా అమ్మవారి బిడ్డలే అన్నపూర్ణీ వాళ్ళకు కూడా అన్నం పెట్టాలి, తప్పా యోగ్యుడైన కొడుక్కి అన్నం పెడతానంటుందేమీ అమ్మ, వీడు బాగా చదువుకొన్నాడని అన్నం పెట్టింది. నీకు పది మార్కులు కూడా రాలేదు అన్నం పెట్టనంటూందా అమ్మా! దారి తప్పినా దారిలో ఉన్నా అన్నం పెట్టడం అమ్మ లక్షణం. ఎందుకంటే అన్నపూర్ణీ దేవాలయంలో అలా పెడతారు. అదీ ధర్మమూ అంటే ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి, అది ఆవిడకది ధర్మం. తల్లి అలా పెడితే ధర్మం. ఐఏయస్ చదివిన కొడుక్కీ అమ్మ అన్నం పెడుతుందీ గుమాస్తా చేసుకుంటున్న రెండో కొడుకైనా అమ్మ అలాగే అన్నం పెడుతుంది. తప్పా వీడు ఐఏయస్ చదివాడురా వీడికి గడ్డ పెరుగు వేస్తాను వీడికి నీళ్ళ మజ్జిగపోస్తాను అని అమ్మ అనదు. ఇంకా అవసరమైతే ఓరే నీకేమిటిరా ఎక్కడికి వెళ్ళినా గడ్డ పెరుగు పెడతారూ వీడికి ఇవ్వాళ పెరుగేస్తానురా పాపం తక్కువుందనీ వీడికి పెరుగేసి మజ్జిగ స్వతంత్రంగా ఐఏయస్ చదివిన వాడికి వేస్తుంది అమ్మ, అది అమ్మకి ధర్మం, అది అమ్మ లక్షణం. ఇదే మీకు చెప్పేది, మీకు పాత్రతని గుర్తెరగాలి, గుర్తెరిగి దానం చేయాలి, పాత్రతని గుర్తెరగకుండా దానం చేయకూడదు.
కాబట్టి రాముడు అన్నాడూ నీవు దానాలు చేసేటప్పుడు కొన్ని వస్తువుల్నీ మన కులగురువైనటువంటి వశిష్టమహార్షి కుమారుడున్నాడు ఆయన్ని పిలిచి ఆయనకి ఇద్దాము, కొన్నింటినీ కౌసల్యా మందిరంలో వృద్ధులైనటువంటి బ్రాహ్మణులున్నారు అమ్మకు రోజూ పూజలు చేయించి ఆశీర్వచనం చేయించేవాళ్ళు వాళ్ళకిద్దాం. కొన్ని కొన్ని బ్రహ్మచారులుగా ఉండి గాయిత్రీ అనుష్టించుకునేవాళ్లు ఉన్నారు వాళ్ళకి ఇద్దాం. కొన్ని కొన్ని నీకు చెందిన వస్తువులు ఇంటి నౌకర్లకి ఇద్దాం, కొన్ని కొన్ని నా రథాన్ని నడిపేటటువంటి సారథి ఉన్నాడు అతనికి ఇద్దాం. ఎందుకో తెలుసాండీ ఒకకారు వెడుతున్నప్పుడు డ్రైవరే గొప్ప యజమానికన్నా... ఎందుకో తెలుసాండీ డ్రైవర్ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇద్దరిపట్లా మౌనం పాటించవలసి ఉంటుంది కదా, ఇప్పుడు యజమాని ప్రాణాలు ఎవరిదగ్గర ఉన్నాయంటే డ్రైవరు చేతిలో ఉన్నాయి, ఈయన చాలా కాలం ఏమీ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నాడూ వేళకి వెళ్ళవలసిన చోటికి వెళ్ళగలిగాడూ వెళ్ళిన చోటునుంచి రాగలిగాడూ ఇన్ని చెయ్యగలిగాడంటే సారధి చాలా చాలా ప్రధాన పాత్ర కాబట్టి నన్ను నమ్ముకొని ఇన్ని రోజులు సారధ్యం చేసినటువంటి వాడికి మనం ఉపకారం చేద్దాం అన్నాడు, పాత్రతలను ఎలా లెక్కపెడతాడో చూడండి రాముడు, తప్పా అన్నీ బ్రాహ్మణులకనడు, అన్నీ ఋషి పుత్రులకనడు, అన్నీ బ్రహ్మచారులకనడు, అన్నీ మా అమ్మ ఇంటికి అనడు, అన్నీ నౌకర్లకి అనడు, అన్నీ డ్రైవర్లకి అనడు. ఎవరికి ఏవ్వి ఇవ్వాలో అలా నిర్ణయం చేస్తాడు. కాబట్టి సీతా సిద్దం చేసే గబగబా వెళ్ళిపోదాము దానాలు చేసేద్దాం సరేనంది తల్లి సిద్దం చేస్తుంది.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
ఆయనా ఇద్దరూ రమ్మన్నాడు గదూ ఇద్దరూ లోపల నుండి బయటికి వస్తున్నారు, అంతే... ఎవరో ఒకాయన కాళ్ళు గట్టిగా అమాంతంగా పట్టుకున్నట్టు అనిపించింది కాళ్ళు ముందుకు వేయకుండా, ఎవరుగా అని ఆగి చూశాడు స భ్రాతుః చరణౌ గాఢం నిపీడ్య రఘు నందనః ! సీతామ్ ఉవాచ అతిశయా రాఘవం చ మహా వ్రతం !! లక్ష్మణ మూర్తి ఇంక అక్కడ నిల్చున్నాడు మనం వెళ్ళిపోవడమేనని, సీతమ్మతో ఎంత వాదించాడో విన్నాడు, బయటికి వినిపించాయి అమ్మ నాయినోయ్ భార్యని తీసుకెళ్లడానికే ఇంత వాదించినవాడు ఇంక నన్ను తీసుకెళ్ళతాడా... ఇంక వేరు స్థితి పెట్టుకోలేదు అన్నయ్యా అన్నయ్యా నేను అన్నయ్యా అనలేదు, కిందపడి గట్టిగా పట్టేసుకున్నాడు ఇంక శరణాగతి ఇంక దానికి ఈశ్వరుడి దగ్గర రెండో మాట ఉండదు వెంటనే ఇచ్చేయాలి అంతే... గట్టిగా పట్టేసుకున్నాడు ఇలా తలెత్తి అన్నయ్య వంకే చూస్తే... అంటాడేమోననీ, వదిన వంక చూస్తూ మాట్లాడుతున్నాడు వదినా నీవు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో వెళ్ళుతున్నప్పుడు అంత సంతోషం నాక్కూడ ఉంటుంది వదినా అన్నయ్యతోవస్తే వదినా నీవు చెప్పి ఎలాగైనా నేను కూడా వచ్చేటట్టు చెయ్యాలి వదినా అని అన్నయ్య వంక చూసినా వదిన వంక చూసినా ఒకటే... అందుకని అన్నయ్యకి వదినకీ అభేదం.
కాబట్టి అన్నయ్య వంక చూడడు. ముందసలు అన్నయ్య నోట్లేంచి పెగలాలంటే అయ్య బాబోయ్ ఈయన వంకచూస్తే ఈ మాట మాత్రం నోరు పెగులుతుందా... ఆవిడ వంక చూస్తానని ఈయన కాళ్ళు పట్టుకుంటాను. గట్టిగా ఈయ్యన కాళ్ళు పట్టుకుని ఆవిడ వంకచూసి మాట్లాడుతున్నాడట ఏమనీ న దేవ లోక ఆక్రమణం న అమరత్వం అహం వృణే ! ఐశ్వర్యం వాపి లోకానాం కామయే న త్వయా వినా !! యది గంతుం కృతా బుద్ధి ర్వనం మృగ గజా యుతం ! అహం త్వా అనుగమిష్యామి వనమగ్రే ధనుర్ధరః !! నాయనా! రామ చంద్ర ప్రభో... నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అరణ్యనంలో ఎన్నో మృగాలు ఉంటాయి తిరుగుతుంటాయి, నువ్వు మా వదినమ్మ కలిసి అరణ్యంలో తిరిగుతుంటే నేను ధనుస్సు పట్టుకుని వాటినన్నిటిని నిగ్రహిస్తాను, నీ వెనకాతలే బయలుదేరుతాను నేను ఓ గునపం బుట్టా తెచ్చుకుని, ఆ దుంపలు కందమూలాలు అన్ని ఏరి తెచ్చి పట్టుకొస్తాను తవ్వి, అన్నయ్యా మీరు ఇద్దరూ హాయిగా పర్వత శిఖరాల మీద కూర్చొని సంతోషంగా అవి అన్ని తింటూ చూస్తూ ఉందురుకానీ, అన్నయ్యా ఎప్పుడూ చేయవలసిన పనులన్నీ నేను చేసిపెడతాను అన్నయ్యా అని, అన్నయ్యా నన్ను రావద్దు అని మాత్ర అనొద్దన్నయ్యా! నీకు సేవచేయకుండా ఉండలేను అన్నయ్యా నన్ను రావద్దని అన్నావా నేను బ్రతుకలేను అన్నయ్యా... నీవు లేకుండా స్వర్గం కూడా నాకు అక్కరలేదు అన్నయ్యా... దేవలోకం వెళ్ళమన్నా నేను వెళ్ళను అన్నయ్యా... నీతో ఉన్నదే నాకు దేవలోకం అన్నయ్యా నిన్ను విడచి ఉండలేను అన్నయ్యా, నన్ను నమ్ము అన్నయ్యా నా మాట నమ్ము అన్నయ్యా వద్దూ అని మాత్రం అనకు అన్నయ్యా... నేనొచ్చేస్తున్నానన్నయ్యా గునపం పారా బుట్టా సిద్దం చేసేసుకున్నానన్నయ్యా అంటున్నాడూ అటు చూసి ఇటు కాళ్ళు పట్టుకుని మాట్లాడుతున్నాడు.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
నవ్వుతున్నాడు రామ చంద్ర మూర్తి ఏమి పిచ్చిప్రేమరా వీడిదీ అని అంత తొందరగా రమ్మంటాడా! ఆయనో పరీక్ష పెట్టాడు మళ్ళీ ఆయన అన్నాడూ న స్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాం చ సు దుఖితాం ! భరతో రాజ్యం ఆసాద్య కైకేయ్యాం పర్యవస్థితః !! తాం ఆర్యాం స్వయమేవ ఇహ రాజ అనుగ్రహణే నవా ! సౌమిత్రే భర కౌసల్యామ్ ఉక్త అర్థమ్ ఇమం చర !! నాయనా! నేనూ వెళ్ళిపోతున్నాను కౌసల్య బెంగపెట్టుకుంటుంది నాకోసం ఇటువంటి పరిస్థితితుల్లో నీవుకూడా నాతో వచ్చేస్తే... అటునుంచి వచ్చిన తరువాత భరతుడు సుమిత్రను, కౌసల్యని, కైకేయినీ మాటలు కొద్దీగా మానేస్తే అప్పుడు కౌసల్యా సుమిత్రా చాలా బాధపడిపోతారు కదా! ఇక్కడ నీవు ఉన్నావనుకో మా అమ్మనీ మీ అమ్మనీ చాలా జాగ్రత్తగా చూస్తూవుంటావు కదా, అందుకనీ ఇక్కడ ఉండమంటున్నాను. నీవు ఇక్కడ ఉండి మన తల్లుల్నీ బాగాచూస్తే నన్ను అనుగమించి వచ్చిన ఆనందంకన్నా ఎక్కువ సంతోషిస్తాను కదా... నేను చెప్పింది చేయడం ధర్మం కదా కాబట్టి లక్ష్మణా నీవు ఇక్కడవుండు అన్నాడు అంటే ఆయన అన్నాడూ తవై వ తేజసా వీర భరతః పూజయిష్యతి ! కౌసల్యాం చ సుమిత్రాం చ ప్రయతో నాత్ర సంశయః !! అన్నయ్యా భరతుడు నిర్లక్ష్యంచేసి కౌసల్యనీ సుమిత్రనీ చూడకుంటే నేను ఇక్కడుంటే భరతుడు చూసేటట్టు చేయడానికి నా తేజస్సు ఏం పనికిరాదు, ఎక్కడ ఉన్నా నీతేజస్సును గుర్తుచేసుకొనివుంటాడు భరతుడు. కౌసల్యని సుమిత్రని జాగ్రత్తగా చూస్తాడు నేను ఎందుకు అన్నాయ్యా ఇక్కడ నేను అక్కర లేదు. ఈ మాటలు నాకు చెప్పద్దు అన్నయ్యా... తదా ఆత్మ భరణే చైవ మమ మాతు స్త థైవ చ ! పర్యాప్తా మద్విధానాం చ భరణాయ యశ్వస్వినీ !! అన్నయ్యా! వేయ్యి గ్రామాలు కౌసల్య చేతిలో ఉన్నాయి, నా లాంటి వాళ్ళనీ మా అమ్మ లాంటి వాళ్ళని వేయి మందిని ఆవిడ పోషిస్తుంది రోజూ అన్నం పెట్టి ఆవిడని ఒకళ్ళు చూడడం దేనికి అన్నయ్యా, అన్నయ్యా నన్ను రావద్దను అని అనకు అన్నయ్యా నీవు చెప్పిన కారణం సరిపోలేదు అన్నయ్యా... నేను నీతో వచ్చేస్తాను
ధనుః ఆదాయ సశరం ఖనిత్ర పిటకా ధరః ! అగ్రత స్తే గమిష్యామి పన్థానమ్ అను దర్శయన్ !!
ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ ! వన్యాని యాని చాన్యాని స్వాఽఽహారాణి తపస్వినామ్ !!
భవాన్ తు సహ వైదేహ్యా గిరి సానుషు రంస్యతే ! అహం స్వరం కరిష్యామి జాగ్రతః స్వపత శ్చ తే !!
అన్నయ్యా అందుకని నన్ను అనుగ్రహించు నేను ధనుర్భాణాలు పట్టుకొని బుట్ట పట్టుకొని గుణపం పట్టుకొని నీతోవచ్చి నీకూ వదినకూ సేవలుచేస్తాను, కాబట్టి నన్ను అనుగ్రహిస్తే నేను వస్తాను అన్నయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు సరే... సరే! నీవు నన్ను విడిచిపెట్టి ఉండలేవన్న విషయం నాకు బాగాతెలుసు కాబట్టి లక్ష్మణా నీవు నాతో రా... అనుమతి ఇస్తున్నాను. అయితే ఇక్కడా రాముడు ఏ ధర్మాన్ని పాటించి అలా ఒప్పుకున్నాడు అని మీకు అనుమానం రావచ్చు, ఊర్మిళని విడిచిపెట్టి లక్ష్మణుడు రామునితో వెళ్ళొచ్చా... అలా శాస్త్రం అంగీకరిస్తుందా మరి ఏ శాస్త్ర ప్రమాణాన్ని బట్టి రాముడు లక్ష్మణున్ని తనతోరమ్మంటున్నాడు లక్ష్మణున్ని భార్యని విడిచిపెట్టి ధర్మం చూస్తాడుగా రాముడు అంటే... శాస్త్రంలో ఉన్న మర్యాదా ఎక్కడుందంటే, జేష్టుడైనవాన్ని అనువర్తించి, జేష్టునికి చేసే సేవలన్నీ తపస్సు కిందకొచ్చీ, ఆయన ఉన్నతమైన మార్గాన్ని పొందడానికీ అది మార్గమౌతుందీ అనీ అది అటువంటి వ్యవస్థని చేకూరుస్తుందీ అనీ మనకు శాస్త్రాలు చెప్తున్నాయి, కాబట్టి లక్ష్మణుడు రామున్ని అనుగమించి వస్తానూ అంటే అంగీకరించడం రామునిపట్ల దోషం కాదూ, అది ధర్మ వ్యతిరేకం కాదు అందుకని రాముడు లక్ష్మణున్ని రమ్మన్నాడు.
ఆయన అన్నాడు నీవు వశిష్టుడి ఇంటికి వెళ్ళు అక్కడ మన ధనస్సులున్నాయి, అక్షయ బాణ తూనీరాలు ఉన్నాయి వాటిని తీసుకురా అని, సీతమ్మని పిలిచీ బంగారు అంగదాలు కుండలాలు మణులు కేయూరాలు వలయాలు రత్నాలు వీటన్నిటినీ కూడా మహానుభావుడు ఆ వశిష్టుని యొక్క కుమారుడు సుయజ్ఞడు ఉన్నాడు ఆయనకి ఇచ్చేసేద్దాం, అలాగే నీకు సంబంధించినటువంటి రత్నాలు వడ్డాణం సూత్రం అంగధాలు ఇవన్నీ కూడా సుయజ్ఞుని యొక్క భార్యకి ఇచ్చేసేద్దాం. ఆ సుయజ్ఞుడు వచ్చాడు ప్రదక్షణంచేసి నమస్కారంచేసి ఈ ఆభరణాలన్నీంటినీ కూడా ఆయనకు ఇచ్చేశాడు. చిత్ర రథుడు అనేటటువంటి సారథిని పిలిచి, ఆయనకీ అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు, కౌసల్యా పురోహితుడికి అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు, అలాగే బాహుపురులు రత్నాంకృతమైనటుంటి పర్యంకం ఒక శత్రుంజయమనేటటువంటి ఒక గజము, తన మేనమామ ఇచ్చినటువంటిది, వేయి ఏనుగులు వీటినన్నింటినీ కూడా సుయజ్ఞుడికి ఇచ్చేశాడు. త్రిజటుడు అనేటటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి రామా నీవు బయలుదేరుతున్నావు దానాలు చేస్తున్నావు నేను దరిద్రము అనుభవిస్తున్నాను నీవు నాకు కూడా దానంచేయి అంటే... ఆయన్ని చూసి ఓ నవ్వు నవ్వి ఇంత బక్క బ్రాహ్మణుడు ఎంత తాపత్రయంగా వచ్చాడో అని నాయనా నీ చేతి కర్ర విసురూ గోవులలో అది ఎంత దూరం వెళ్ళి పడుతుందో అన్ని గోవులు నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆయన బలమంతా కూడ గట్టుకొని గిరగిర తిప్పి కర్ర విసిరాడు పక పక పకా నవ్వి ఎంత దూరం కర్ర వెళ్ళిపడిందో అన్ని గోవులు ఇచ్చాడు, నిన్ను కష్టపెట్టాననీ కర్ర విసరమన్నాననీ మరోలా అనుకోకు నీ ఆర్తి చూసి నీవు ఎన్ని కావాలనుకున్నవో ఎన్ని ఇస్తే ఇవి నేను కోరుకున్నవి అని తృప్తి పడతావో అన్ని నీ చేత అడిగిద్దామని కర్ర విసరమన్నాను అన్నాడు.
తప్పా ఇంకోలా అనుకోకు నాకు బ్రాహ్మణులంటే పరమభక్తి ఆ గోవులన్నీ నీ ఆశ్రమానికి తీసుకెళ్ళిపోమన్నాడు. వాటన్నింటినీ ఇచ్చాడు ఇచ్చిన తరువాతా అక్కడ నుంచి బయలుదేరి అందరూ కలిసి రథమెక్కకుండా సీతారామ లక్ష్మణులు కాలి మార్గాన నడుస్తూ రాచ వీధులలో నడుస్తూ దశరథుని యొక్క మందిరానికి బయలు దేరారు. ఆ నగరంలో ఉండేటటువంటి పౌరులందరూ మేడలెక్కీ మిద్దెలెక్కీ రహదారుల మీద నిలబడి చెప్పుకుంటున్నారు, ఏమి ధర్మాత్ముడు రామ చంద్ర మూర్తి మహానుభావుడు తన ధర్మం కోసమనీ తండ్రిని సత్యవాక్యములందు నిలబెట్టడం కోసమనీ, రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ తాపసిగా వెళ్ళమని కైకమ్మ కోరింది కాబట్టీ ఇప్పుడే రథాన్ని పరిత్యజించీ కాలినడకన వెడుతున్నాడు, కనీసంలో కనీసం సూర్య చంద్రులు కూడా చూడడానికి అవకాశంలేని తల్లి వైదేహి రామ చంద్ర మూర్తిని అనుగమించి వెడుతోంది. లక్ష్మణ మూర్తి ఎంత పుణ్యాత్ముడో ఆ అన్నగారికి సేవచేయడానికి ఆ అన్నగారి వెంట నడిచి వెడుతున్నాడు, ఈ సీతారాముల్నీ లక్ష్మణున్ని అడవులకు పంపిస్తున్నటువంటి రాజు దశరథుడు మనిషికాడు ఎంతగా ఆడదాని మాటకు లొంగిపోయాడో... కన్నకొడుకు సుగుణాభి రామున్ని అడవులకు పంపిస్తున్నాడు ఆడదాని మాటకువశుడై అని వాళ్ళన్నారు. వాళ్ళదైన కోణంలో వాళ్ళు ఆలోచించారు అది రామాయణం. ఎంత చిత్రమైన మాట అనుకున్నారో తెలుసాండీ వాళ్లందరూ, ఎలా అనుకున్నారో తెలుసాండీ వాళ్ళందరూ ఎందుకడిగిందనుకున్నారో తెలుసాండీ కైకమ్మా..? ఏమడిగిందీ ఈ రాజ్యం కావాలనుకుంది, ఇంకేమనుకుందీ మనల్ని పరిపాలిస్తానంది, ఆవిడకేమి మిగల్చచ్చో మన చేతులలో ఉంది. ఎందుకు ఆవిడ మనల్ని పరిపాలించడమేమిటీ..? మనకేం కోరికుంది రాముడిచేత పరిపాలించబడాలనుంది. ఆవిడేమంటుందీ నేను పరిపాలిస్తాను రాముడు అడవులకు వెళ్ళిపోవాలంటూందీ, అంటే మనకు కావలసిన రాజుని అడవికి పంపిస్తుందటా మనకు అక్కరలేని రాజునిపెట్టి తను పరిపాలిస్తుందటా... ఆవిడెవరు మనల్ని పరిపాలించడానికి మనం ఎవరిచేత పరిపాలింపబడాలనుకుంటున్నామో ఆయన దగ్గరికివేళ్దాము. అప్పుడు ఈవిడేం పరిపాలిస్తుంది, రాముడు అడవికి వెల్తాడు అప్పుడు మనం అడవులకువెళ్దాం. మనందరం అడవులకు వెళ్ళిపోదాం ఈ ఇళ్ళన్నీ ఇక్కడే వదిలేద్దాం వదిలేస్తే ఏమౌతుంది ఎలుకలు కన్నాలు పెట్టేస్తాయి శుభ్రంగా, ఎంత గొప్ప మాటలు ఆలోచించారో తెలుసాండీ ఆరోజుల్లో

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
సముద్ధృత నిధానాని పరిధ్వ స్తాజిరాణి చ ! ఉపాత్త ధన ధాన్యాని హృత సారాణి సర్వశః !!
రజసా అభ్యవ కీర్ణాని పరిత్యక్తాని దైవతైః ! మూషకైః పరిధావద్భిః ఉద్భిలైః ఆవృతాని చ !!
అపే తోదక ధూమాని హీన సమ్మార్జనాని చ ! ప్రణష్ట బలి కర్మేజ్యా మంత్ర హోమ జపాని చ !!
దుష్కాలే నేవ భగ్నాని భిన్న భాజనవంతి చ ! అస్మ త్త్యక్తాని వేశ్మాని కైకేయీ ప్రతిపద్యతామ్ !!
మనం ఈ ఇళ్ళన్నీ విడిచిపెట్టిపోతే దేవతల్ని ఆరాధించడానికి ఎవ్వరూ ఉండరు భూజులు పట్టేస్తాయి, దుమ్ము ధూళి పట్టేస్తాయి దొంగలొచ్చి ఉన్నతమైనటువంటి విలువైనటువంటి వస్తువులను ఎత్తుకుపోతారు ఎలుకలు ఇళ్ళనిండా కన్నాలు పెట్టేస్తాయి కన్నాలు పెట్టేసి ఈ ఇళ్ళన్నీ పాడుపడిపోతాయి, ఈ వీధులు తుడిచేవాళ్ళుండరు హోమం చేసేవాళ్ళు ఉండరు బ్రాహ్మణులుండరు అగ్ని కార్యాలు ఉండవు నైవేద్యాలు ఉండవు కాబట్టి దేవతలందరూ ఇళ్ళు ఖాలీచేసి వెళ్ళిపోతారు, నిర్మానుష్యమైపోతుంది దొంగలమయమైపోతుంది, మనమందరమూ అడవులకు వెళ్ళిపోతాము మనం అడవులకు వెళ్ళిపోదాం అడవిలో ఉన్న పులులు సింహాలు పాములూ ఎనుగులు ఇవన్నీ అయ్యబాబోయ్ ఇక్కడికి ఇంత మంది మనుషులు వచ్చేశారని అయోధ్యలోకి వచ్చేస్తాయి, అవన్నీ అయోధ్యలోకి వచ్చేసి పులులు సింహాలు పాములు కుక్కలు నక్కలు ఇక్కడ ఉంటాయి, ఇళ్ళన్నీ పాడుపడిపోతాయి మనందరం అక్కడ ఇళ్ళు కట్టుకుంటాం, రాముడితో అక్కడ ఉంటాం, అడవే అయోధ్య అయిపోతుంది అయోధ్య అడవి అయిపోతుంది, అప్పుడు కైక పరిపాలించని ఇది గదా అడిగింది, ఆవిడ అలా అడిగితే మనకు ఇలా చేయడం రాదా..! వనం అయోధ్య చేద్దాం అయోధ్యని అడవి చేద్దాం ఇప్పుడు మనం ఇలా చేద్దాం కైకకి బుద్ధి వస్తుంది, అంటే రాముడి మీద వాళ్ళు ఎంత ప్రేమో చూడండి!
ఇవి మాట్లాడుకుంటున్నారట రాముడు వెళ్ళిపోతుంటే, అంటే అంత మంది యొక్క అభిమానాన్ని ఆయన చూరగొన్నాడండీ మహాను భావుడూ వనం నగరమ్ ఏవాస్తు యేన గచ్ఛతి రాఘవః ! అస్మాభి శ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనమ్ !! మనం రాముడితో పాటు ఊరు వదిలేస్తే వనం ఊరైపోతుంది ఊరు వనమైపోతుంది మనకు చేతకాదా ఏమిటి ఆవిడ కోరికలు కోరితే ఆవిడతో వెర్రివాళ్ళలా పరిపాలింపబడుతామా మనం రాముడితో వెళ్ళిపోదాం అనుకొన్నారు. అన్నతరువాత రాముడు అన్ని వింటున్నాడు కాని దాన్ని ఖండించి దాన్ని ఒక ఉపద్రవం చేయడం ఆయనకి ఇష్టం లేదు, ఇది వారియందు నాకున్న అభిమానం ఆయన ʻపొంగిపోడు ఖుంగిపోడుʼ ఆయన సీతా లక్ష్మణులతో కలసి ముందుకు వెడుతున్నారు, దశరథుని యొక్క గృహానికి వెళ్ళారు, వెడితే అక్కడ దశరథ మహారాజుగారు దగ్గరికెళ్ళి సుమంత్రుడు ఎదురొచ్చాడు ఆయనతో చెప్పారు, రాచరికపు మర్యాదా అని ఒకటి ఉంటుంది. నీవు లోపలికివెళ్ళి నేను వచ్చాను అని దశరథ మహారాజుగారి దర్శనంచేసి నమస్కారంచేసి నేను అడవులకు వెళ్ళిపోదామనుకుంటున్నాన్న విషయాన్ని దశరథ మహారాజుగారికి నివేదించవలసిందీ అన్నారు, చెప్తే ఆ సుమంత్రుడు లోపలికి వెళ్ళీ చెప్పాడు రాముడు సీతా లక్ష్మణ సహితుడై వచ్చాడు, నిన్ను సత్యమునందు నిలబెట్టడం కోసం మహానుభావుడు అంతటి పరాక్రమవంతుడు అడవులకు వెళ్ళిపోతున్నాడు, రాజా! ఆయనకు నీవు దర్శనం ఇస్తే బాగుంటుంది అన్నాడు, రాజు అన్నాడు రామున్ని దర్శనానికి పంపవద్దు కాసేపు బయటే ఆపుచేయి నా భార్యలందర్నీ లోపలికి ప్రవేశపెట్టండని అన్నాడు, ఆయనకు 350 మంది భార్యలు ఆయన దక్షణ నాయకుడు, అందుకనీ 350 మంది భార్యల్ని తీసుకురమ్మనీ కౌసల్యని పంపించారు. కౌసల్య 350 మంది భార్యల్ని తీసుకొని దశరథ మహారాజుగారు ఉన్నటువంటి గదిలోకి వచ్చింది, కైకమ్మ అక్కడే నిలబడి ఉంది. ఇప్పుడు రామున్ని గదిలోకి ప్రవేశింపజేయండి.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
ఎందుకు? అంటే... ఈ 350 మందిలో 349 మందికి రాముడు వెళ్ళడం ఇష్టం లేదు, తననైతే నిగ్రహించింది కానీ సాటి భార్యలు ఛీ అంటే కైక మారుతుందోనేమోనని ఆఖరి ప్రయత్నంగా చూశాడు, అందుకని అందరి భార్యల్ని పిలిచాడు అనీ రామున్ని ఇప్పుడు ప్రవేశపెట్టు అన్నాడు. రాముడు సీతా రామ లక్ష్మణ సహితుడై నిలబడి నాన్నగారూ రాముడు నమస్కరించుచున్నాడు అడవులకు బయలుదేరుదామనుకుంటున్నాడు మీరు ఒక్కసారి ఆశీర్వచనం చేస్తే బయలుదేరుదామని మీ సన్నిధానమునకు వచ్చాను అన్నాడు అంతే... తన ఆసనం నుంచి ఒక్కసారి చూశాడు అలా రామున్ని చూసి రాముడు వెళ్ళిపోతున్నాడన్న సత్యం జీర్ణంకాక గబగబా లేచి రామున్ని కౌగలించుకుందామని ఆసనం నుంచి లేచాడు సోభిదుద్రావ వేగేన రామం దృష్ట్వా విశాం పతిః ! తమ్ అసంప్రాప్య దుఃఖాఽఽర్తః పపాత భువి మూర్ఛితః !! ఆ రామున్ని చూడగానే ఇంక కాసేపట్లో రాముడు వెళ్ళిపోతాడు ఇక నేను చూడను 14 యేళ్ళు కనపడడు అన్న దుఃఖంతో వలవలవల ఏడుస్తూ రామున్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్ళబోయి, ఆ దుఃఖం యొక్క ఆవేశం వచ్చి నేల మీద పడి మూర్ఛపోయాడు. అలాగే నిలబడింది కైకమ్మ తం పరిష్వజ్య బాహుభ్యాం తా ఉభౌ రామ లక్ష్మణా ! పర్యజ్కే సీతయా సార్ధం రుదన్తః సమవేశయన్ !! సీతా రామ లక్ష్మణులు గబగబా ఆయనని తమ బాహువులతో పట్టుకొని ఎత్తి పట్టుకొచ్చి ఆ పర్యంకం మీద కూర్చోబెట్టారు, కూర్చోబెట్టిన కాసేపటికి సంజ్ఞకలిగింది మళ్ళీ అంటె తెలివొచ్చినట్టుగా మళ్ళీ స్మృతిని పొందాడు అథ రామో ముహూర్తేన లబ్ధ సంజ్ఞం మహీపతిమ్ ! ఉవాచ ప్రాఞ్జలి ర్భూత్వా శోకాఽఽర్ణవ పరిప్లుతమ్ !! ఆపృచ్ఛే త్వాం మహారాజ సర్వేషామ్ ఈశ్వరోసి నః ! ప్రస్థితం దణ్డకారణ్యం పశ్చ త్వం కుశలేన మామ్ !! కాసేపటికి స్ర్పుహని పొందిన తరువాత రాముడు అంజలి ఘటించి అన్నాడు మీరు ఆశీర్వచనంచేస్తే నేను అడవులకు వెళ్ళిపోదామనుకుంటున్నాను నేను, మీరు నీ చల్లని చేతులతో మమ్ములని దీవించండి అన్నాడు.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
వెంటనే దశరథుడు అన్నాడూ అహం రాఘవ కైకేయ్యా వర దానేన మోహితః ! అయోధ్యాయా స్త్వమ్ ఏవాద్య భవ రాజా నిగృహ్య మామ్ !! రామా! నేను ఈ ఆడదాని యొక్క వరములచేత కట్టబడ్డాను ఈమే నన్ను మోసగించింది, రెండు వరాలు అడుగుతానని ఇంత ధర్మ వ్యతిరిక్తమైన కోర్కెలను అడిగింది, నేను ఎంత బ్రతిమాలాడినా తన మాట తిప్పలేదు నేను కాడికీ బండికీ మధ్యలో నలిగిన ఎద్దులా నిలబడిపోతాను రామా! నిన్ను విడిచిపెట్టుకోవడం నాకు ఇష్టంలేదు, నువ్వు వెళ్ళిపోతే నేను మరణిస్తాను అందుకని రామా! నేనే నిన్ను అడుగుతున్నాను నాకు 60 వేల సంవత్సరాల వయసు వచ్చేసింది, నేను వృద్ధుడను నేను బాగా బడలిపోయాను పైగా నేను శోకంతో ఉన్నాను, కాబట్టి నేను యుద్ధం చేయలేను నా మాట నిలబడాలి అంటే నువ్వు అడవికి వెళ్ళాలి నీవు దయచేసి అడవికి వెళ్ళవద్దు, మా నాన్న ఎవడూ నన్ను అడవికి వెళ్ళమనడానికి భరతునికి రాజ్యమివ్వడానికి పెద్దవాన్ని అధికారం నాది మా నాన్న ఎవడు ఇవ్వడానికి అని నీవు నన్ను ఓడించు, నేను ఓడిపోతాను నేను పెద్దవాన్ని నీతో యుద్ధం చేయలేను నన్ను రెండు నా చేతులు బంధీచేసై చేసి నన్ను కారాగారంలో పెట్టు పెట్టేస్తే నేను కారాగారంలో ఉంటాను, నీవు రాజ్యం చేస్తూ రామా! నీదైన రాజ్యాన్ని నీకు ఇవ్వని నేరం చేసినవాన్ని కాబట్టీ నన్ను కారాగారంలో ఉంచి నీవు అలా తిరుగుతూ ఉండు నేను నిన్ను చూసి బ్రతికేస్తాను తప్పా, సింహాసనం మీద కూర్చోని నీవు వెళ్ళిపోతే నేను బ్రతుకలేను కాబట్టి భవ రాజా నీవు రాజైపో... నిగృహ్య మామ్ నన్ను నిగ్రహించు నన్ను ఖైదుచేసై రామా! అంటే ఎంత ఆర్తో కొడుకుని చూడకుండా ఉండలేని ఎంత బాధపడ్డాడో చూడండీ.
అంటే రాముడు అన్నాడు, నాన్నగారూ నేను ఎంత కాలం వెళ్ళిపోతాను అనుకుంటున్నారు నవ పంచ చ వర్షాణి వన వాసే విహృత్యతే ! పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాన్తే నరాధిప !! నేను 14 యేళ్ళు నాన్నగారూ నిద్రలో గడిచిపోయినట్టు గడిచిపోతాయి, మీరు కొన్ని వేల సంవత్సరములు పరిపాలించాలి, మీరు ఇలాగే సింహాసనం మీద కూర్చోవాలి నాన్నగారూ నేను నిన్ను ఖైదు చేసి రాజ్యం పుచ్చుకోనా నాకొద్దు నాకు పుత్ర ధర్మం కావాలి, మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టానన్న కీర్తి నీకు కలగాలి రాముడులాంటి కొడుకు నాకున్నాడు నన్ను సత్యమునందు నిలబెట్టడం కోసం తాను అడవికి వెళ్ళాడని మీరు తృప్తి చెందాలి, అంతేకాని మిమ్మల్ని నిగ్రహించి నేను రాజ్యం పుచ్చుకోనా... నాకొద్దు నాన్నగారూ అన్నాడు ఇలా మాట్లాడుతుంటే కైకకు భయం వేసింది.
ఆవిడ గబగబా దశరథుని పక్కకు వచ్చీ వంగీ ఆయన చెవిలో అందీ రుదన్ ఆర్తిః ప్రియం పుత్రం సత్య పాశేన సంయతః ! కైకేయ్యా జోద్యమాన స్తు మిథో రాజా తం అబ్రవీత్ !! అతను వచ్చింది అడవికి వెళ్ళడానికి నీవు ప్రసంగం సాగదీయకు వెళ్ళు అని మంగళా శాసనం చేయ్యి చాలు వెళ్తాడు. ఎందుకు అంత సేపు మాట్లాడుతున్నావు, వెడదామని వచ్చాడు వెళ్ళు అని చెప్పు చాలు. ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి నాయనా నీవు ఎలాగో బయలుదేరడానికి సిద్ధమయ్యావు ఇక నా మాట వినవు నీవు ధర్మమునందు అంత పూనికి ఉన్నవాడవు అందుకు కదా నేను ఏడుస్తున్నాను, నీవు ధర్మాన్ని నమ్మకుండా నీవు కారాగారంలో పెడితే నేను సంతోషించేవాన్ని నీవు ధర్మాన్ని నమ్మావు కాబట్టి నేను ఏడుస్తున్నాను. నాయనా నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది సంతోషంగా వెళ్ళిరా నీవు సుఖంగా ఏ ఇబ్బందులూ లేకుండా వనవాసం పూర్తిచేయాలి

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
కాని ఒకే ఒక్క కోరిక కోరాను ఒకే ఒక్క రోజు నీవు అంతఃపురంలో ఉండు ఈ ఒక్క రాత్రీ పగలూ నిన్ను చూసుకొని నేను కౌసల్యా మురిసిపోతాం తప్పా ఉండకుండా వెళ్ళిపోతాను అన్న మాట అనవద్దు, ఒక్కరోజు ఉండి వెళ్ళూ అని ప్రార్థన చేశాడు.
అడిగితే రాముడు అన్నాడు నాన్నగారూ నేను ఒక్క రోజు ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ సిద్ధించదు, పైగా నేను కైకమ్మకు మాటయిచ్చాను చాలా తొందరగా నేను వనవాసానికి వెళ్ళిపోతాను అన్నాను అందుకని నేను వనవాసానికి బయలుదేరుతాను అంటే సుమంత్రుడూ అని దశరథ మహారాజుగారి మంత్రి, ఆయనకు ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది ఆయన రెండు చేతులు ఇలా ఇలా నలిపేసేసి క్రోధంతో కళ్ళు ఎర్రబడిపోయి ఆయన అన్నాడూ ఏమిటి అనుకుంటున్నావో మావమంస్థా దశరథం భర్తారం వరదం ప్రతి ! భర్తుః ఇచ్ఛా హి నారీణాం పుత్ర కోట్యా విశిష్యతే !! కోటి మంది పుత్రులు కడుపున పుట్టిన వాళ్ళు ఉన్నా వాళ్ళ మాట వినడమా భర్త మాట వినడమా అంటే ఆడది భర్త మాట మాత్రమే వినవలసి ఉంటుంది. నీవు నీ కొడుక్కు మేలు చేస్తాననీ భర్తమాట వినకుండా నీవు ఆయనని ఇబ్బందులకు గురిచేసి ఆయన మాట వినకుండా ఆయనకు దుఃఖాన్ని కల్పిస్తున్నావు ఇది నీకు తగిన పనికాదు నీ బుద్ధిమార్చుకో రాజా భవతు తే పుత్రో భరత శ్శాస్తు మేదినీం ! వయం తత్ర గమిష్యామో యత్ర రామో గమిష్యతి !! నిజంగా భరతుడే రాజైతే నీవు గుర్తుపెట్టుకో మేమందరం రాముని దగ్గరకు వెళ్ళిపోతాము నీకు ఈ భూమి మిగులుతుందేమో ఈ ప్రజలు మాత్రం మిగలరు అందరం రామునివెంట అరణ్యాలకి వెళ్ళిపోతాం ఆమ్రం ఛిత్వా ఖుఠారేణ నింబం పరిచరే త్తు యః ! య శ్చైనం పయసా సించేన్నైవాస్య మథురో భవేత్ !! ఒకడు గొడ్డలి తీసుకొచ్చీ అక్కడే ఉన్నటువంటి మామిడి చెట్టును నరికేసి దూరంగా పారేసి పక్కనే ఉన్నటువంటి వేప చెట్టుకీ ప్రతిరోజూ పాలుపోశాడు అంత మాత్రంచేత వేపకాయి తీయ్యగా ఉంటుందా... మామిడి పండులా.
అంత గొప్ప కౌసల్యా అంతఃపురంలో ఉన్నా నిన్ను పాలుపోసి వేప చెట్టును పెచ్చినట్టు ప్రీతిచేశాడు దశరథుడు ఆఖరుకి నీవు నీ బుద్ధి బయట పెట్టుకుని నీవు నీ వేపకాయ చేదుని బయటపెట్టుకున్నట్టు నీవు నీ బుద్ధిని బయటపెట్టుకొని రాజుకి ఇబ్బంది తీసుకొచ్చావు అభిజాతం హి తే మన్యే యథా మాతు స్తథైవ చ ! నహి నిమ్బాత్ స్రవేత్ క్షౌద్రం లోకే నిగదితం వచః !! లోకంలో ఒక మాట ఉంది తల్లి ఎలా ఉంటుందో కూతురు అలా ఉంటుందని నీకు మీ అమ్మపోలికే వచ్చింది అన్నాడు, నీ తండ్రి కేకెయ రాజు ఆ కేకెయ రాజుకి భార్య ఉండేది ఆ కేకయ రాజుకి ఒక ఋషి వరమిచ్చాడు సమస్త ప్రాణులలో ఏ ప్రాణి మాట్లాడుకున్నా నీకు అర్థమవుతుంది కానీ అర్థమయినదానిని ఇంకొకళ్ళకి చెప్తే నీతల వేయ్యి వక్కలవుతుంది అని అన్నాడు. ఒక రోజు రాత్రి నీ తల్లీ తండ్రీ కలిసి ఒక పర్యంకం మీద పడుకొని ఉన్నారు, పక్కన ఉన్నటువంటి చీమ ఏదో మాట్లాడుతుంది అది మీ నాన్నకి అర్థమయ్యింది మీ నాన్న పక్కున నవ్వాడు మీ అమ్మ అంది నేను పక్కన ఉండగా నీవు ఎందుకు నవ్వావు అంది చీమ ఏదో మాట్లాడింది అందుకు నవ్వాను అన్నాడు కాదు నన్నుచూసే నవ్వావు ఎందుకు నవ్వావో నీకు ఏమి అర్థమయ్యిందో చెప్పు అంది చెపితే నేను చచ్చిపోతాను అన్నాడు, నీవు చనిపోయినా ఫరవాలేదు చెప్పు అంది, అంటే ఆయన అన్నాడు రేపు చెప్తాను అన్నాడు అని వేళ్ళి తనకు ఉపదేశంచేసిన మునిని అడిగాడు, చచ్చిపోతాను చచ్చిపోతాను అంటే పెళ్ళాన్ని వదిలేయ్ అలాంటిదాన్ని అంత మూర్ఖురాలైనటువంటి దానిని పట్టుకుని ఉండకు నీ మార్గం నీవు చూసుకొని ఉండవలసి ఉంటుంది తప్పా నేను మాత్రం చెప్పను అనిచెప్పు అంతమూర్ఖత్వం పనికిరాదు అన్నాడు.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
భార్యని వదిలై అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండీ, ఆమెను పోషణలో ఉంచి ఇలాంటి మూర్ఖత్వం పోయ్యేటట్టుగాచెయ్యి అని అంటే ఆయన అప్పుడు ఆయన ఇంటికి వచ్చీ ఒక్కనాటికీ చెప్పను నీవు ఏం చేద్దామనుకుంటావో అది చేసుకోవచ్చు నీకు మాత్రం నేను చెప్పను నీ మూర్ఖత్వానికి లొంగను అన్నాడు. మీ నాన్నగాబట్టి అలా తప్పుకున్నాడు ఈయన కాబట్టి తప్పుకోలేకపోయాడు, నీవు అంత మూర్ఖంగా మీ ఆయన్ని లొంగదీస్తున్నావు, నీకు తల్లిపోలికే వచ్చింది కైకా అని అన్నాడు. అన్నాకూడా ఆవిడ ఇన్నిమాటలన్నా రాజ్యం పాడైపోతుంది నీ భర్త శరీరంతో ఉంటాడో లేడోకూడా తెలియదు మేం ఎవ్వరం ఉండం ఇన్ని చెప్పినా నైవ సా క్షుభ్యతే దేవీ న చ స్మ పరిదూయతే ! న చ అస్యా ముఖ వర్ణస్య విక్రియా లక్ష్యతే తదా !! ఆవిడ ముఖం వివర్ణమవడం కానీ ఆవిడకు పట్టుదల పోవడం కానీ సిగ్గుపడ్డం కానీ ఏమీ కాలేదు. ఆవిడ అలాగే నిలబడింది నా కోరిక తీరాలని కైకా చాలా ప్రతినాయకురాలిలా కనపడుతుంది కానీ మీరొక్కటి గుర్తు పెట్టుకోండీ ఇంతశక్తి అకస్మాత్తుగా ఎలా వచ్చేసిందో తెలుసాండీ..? దేవతలు పూనారామెకు కైక అలా నిలబడకపోతే రావణసంహారం అవదు రాముడు వెళ్ళడు పట్టాభిషేకం చేసుకుంటే సీతాపహరణం జరగదు కాబట్టి పట్టాభిషేకం ఆగితే తప్ప అడవికి వెళ్ళడు.
కాబట్టి ఆగాలంటే కైకమ్మతో ఈ మాటలు మాట్లాడించాలి ఏమండీ మరి కైకమ్మతోనే ఎందుకు మాట్లాడించాలి మరి కౌసల్యా సుమిత్రతో ఎవరితోనైనా మాట్లాడించకూడదా... వాళ్ళు సత్వ గుణ సంపన్నులు నేను బయలుదేరే ముందు మా గోపాల కృష్ణగారితో దానిమీదే కాసేపు చర్చ చేసివచ్చా ఆయన ఏదో ప్రశ్నవేస్తే దానిగురించే చెప్తున్నాను. ఆ కౌసల్యా అలా తిరిగబడేదైతే రామున్ని అడవులకు పంపిస్తాను అన్నప్పుడూ ఆమె కూడా హటంచేయచ్చు నీవు అడవికి వెడితే నేను విషంతాగేస్తానని అప్పుడు ధర్మ సంక్లిష్టం వస్తుంది ఆవిడ అలాగ కాదు ధర్మాన్ని అంగీకరించి ఆశీర్వచనం చేసింది, సుమిత్ర ధర్మాన్ని అంగీకరిస్తుంది. కైకా రజో గుణ తమో గుణ ప్రవృత్తితో ఎక్కడ ఆ ప్రవృత్తిందో అక్కడ ఆ దేవతలు అటువంటి వ్యతిరేకమైనపని చేయడానికి సాధనంగా వాడుకున్నారు. అందుకే రజో గుమ తమో గుణ ప్రకంపము ఎంత అపకీర్తికి కారణం అవుతుందో అంతర్లీనంగా ఆవిడ గొప్ప పనికే నిలబడగలిగినా ఆవిడకి అపకీర్తే వచ్చింది ఆ మౌఢ్యం. కాబట్టి ఈ కోణంలో కూడా మీరు పరిశీలనం చేయవలసి ఉంటుంది కావ్యాన్ని కాబట్టి ఆవిడ ఏవిధంగానూ మారకుండా అలాగే నిలబడి ఉంటే కొంత సేపు అయిన తరువాత ఒక విత్రమైనటువంటి ఆలోచన దశరథుడిదీ ప్రేమతో కూడినటువంటి వ్యవహారం కదాండీ... అందుకని ఆయన అంటున్నాడు రాముడు అడవులకి వెళ్ళిపోతున్నాడు నాకోసం కదా అడవికి బయలుదేరాడు.
కాబట్టి రాముని సంతోషపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి వైశ్యలందరూ బయలుదేరాలి వాళ్ళందరూ ఆయన ముందు నాట్యంచేయాలి, ఆయనకి అరణ్యంలో వేటాడి పెట్టడానికి బోయవాళ్ళు గుంపులు గుంపులుగా బయలుదేరి వెళ్ళాలి, కోశాగారంలోంచి రత్నాలు వజ్రాలు వైడ్యూర్యాలు అన్నీ బళ్ళకు ఎత్తించాలి అనేక మంది సైనికులు చతురంగ బలాలు రాముని అనుసరించాలి రాముడు అడవులలో పక్షుల్నిచూస్తూ జలాశయాలను చూస్తూ సీతమ్మతో కలిసి సంతోషంగా గడిపేయ్యాలి. కాబట్టి అన్నిటినీ వీటన్నిటినీ రాముడికిచ్చి పంపించండి అన్నాడు. అడవికి పంపిస్తానన్నాను కాని ఇవన్ని ఇవ్వకుండా పంపిస్తాననలేదుగా... ఈ మాటలంటే కైకమ్మొచ్చి అందీ రాజ్యం గత జనం సాధో పీత మణ్డాం సురామ్ ఇవ ! నిరాస్వాద్యతమం శూన్యం భరతో నాభిపత్స్యతే !! సారాని ఒకడు తాగేసి మిగిలిన సురని ఇంకొకడికి ఇచ్చినట్టూ రాజ్యంలో ఉన్న డబ్బు దస్కం అన్నీ రాముడి ఇచ్చి పంపిచేస్తే ఖాలీ సింహాసనమూ, ఖాలీ కోశాగారమూ భరతుడికి ఇస్తావా నాకు అలా అక్కరలేదు అంది ఆవిడ అనీ ఆవిడ అందీ ఏమయ్యా కొడుకుని పంపించడానికి అంత బెంగ పెట్టుకుంటున్నావు నీ వంశంలో సగర చక్రవర్తి రాజ్యం నుంచి కొడుకుని బయటికి పంపించలే... అంది అంటే సిద్దార్థుడు అన్న మంత్రిలేచి ఏమన్నావ్ అసమంజసున్ని సగరుడు పంపించానంటున్నావా? అసమంజసులు రోజూ అడుకుంటున్న పిల్లల్ని నీటిలో చంపేసేవాడు, వాళ్ళువచ్చి బాధపడితే పంపించేశాడు, రాముడు ఏ దోషం చేశాడు ఒక్క దోషం రాముడు ఇది చేశాడు అని చెప్పూ రామున్ని పంపిస్తాం. ఒక్క దోషం రాముడిది చూపించగలవా..? అని అడిగాడు అడిగితే... చూపించడానికి ఆవిడ మాత్రం ఏం చూపిస్తుందండీ! మౌనం వహించింది దశరథుడు అన్నాడూ కైకా ఈ రాజ్యాన్ని నీవూ భరతుడు ఏలుకోండీ నేను రాముడితో పాటు అడవికి వెళ్ళిపోతాను నీవు రామున్ని అడవులకి వెళ్ళిపోమన్నావు కాని నీవు అడవులకు వెళ్ళద్దనలేదుగా రాజ్యాన్ని పరిత్యజించి అడవులకి వెళ్ళిపోతాను.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
రాముడు అన్నడూ నాకు ఆ సైన్యం ఎందుకూ, చతురంగా బలాలు ఎందుకూ వైశ్యలు ఎందుకు ధనమెందుకు నాన్నగారూ ఇవన్నీనా నేను మిమ్మల్ని సత్యంలో నిలబెట్టడానికా నిన్ను అడిగింది, నాకు ఇవన్నీ వద్దు నాకు మూడు కావాలి, ఒక గుణపం ఒక బుట్ట నార చీరలు ఇవి ఇవ్వండీ చాలు ఇవి కట్టుకొని నేను అడవులకు వెళ్ళిపోతాను అన్నాడు. అంటే వెంటనే కైకమ్మ సిద్ధంగా ఉంచింది బ్రాహ్మ సమారాధన జరుగుతుంటే పంచల చాపలు పెట్టినట్టు పెట్టుంది. గబగబా లోపలికి వెళ్ళి రెండు పంచల చాపలు ఒక చీరా పట్టుకొచ్చింది సీతమ్మకు కూడా ఇచ్చింది లక్ష్మణుడికి ఇచ్చింది రామునికి ఇచ్చింది కట్టుకుని బయలుదేరండి అన్నది. సీతమ్మ సిగ్గుపడిపోయింది ఆవిడకి పుట్టిన దాదిగా పట్టు బట్ట తప్పా ఆవిడకి ఆ నార చీర కట్టుకోవడం ఆవిడకు చేతకాదు. ఆవిడా ఆ నార చీరను చేతిలో పట్టుకొని ఈ నార చీరను ఎలా కట్టుకుంటారని రాముడి వంక సిగ్గుగా చూసింది గబగబా రాముడు వచ్చి ఆవిడ కట్టుకున్న పట్టు బట్టమీదే నార చీరను మునికాంతలు ఇలా కట్టుకుంటారని ఆ నార చీరను కట్టి చూపించాడు. 350 మంది పత్నులు రోధించారు, ఇంత ధారణమా ఆవిడేం తప్పు చేసింది, ఆవిడ నార చీర కట్టుకుని వెళ్ళడమేమిటని అప్పుడు వశిష్టుడు అన్నాడూ...
అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కుల పాంసని ! వంచయిత్వా చ రాజానం న ప్రమాణే అవతిష్ఠసే !! ఓ అతిగా ప్రవర్తిస్తున్నదానా దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటిదానా కులాన్ని పాడుచేస్తున్నదానా రాజుని వంచనచేసి వరాలు కోరావు రాత్రివేళ కోపాగృహ ప్రవేశంచేసి రాజుని బాగామాట ఒప్పుకుంటానని అనిపించి రెండు వరాలు అడిగావు వంచనచేశావు న గంతవ్యం వనం దేవ్యా సీతయా శీల వర్జతే ! అనుష్ఠాస్యతి రామ స్య సీతా ప్రకృత మాఽఽసనం !! అసలు సీతమ్మ అడవులకు వెళ్ళవలసిన పనిలేదు నీవు అడగలేదు సీతమ్మ వెళ్ళదు నీవేవరు సీతమ్మని అరణ్యవాసానికి వెళ్ళడానికి నార చీరలు ఇవ్వడానికి ఆత్మా హి దారా సర్వేషాం దార సంగ్రహ వర్తినాం ! ఆత్మీయ మితి రామ స్య పాలయిష్యతి మేధినీం !! నీకు తెలియదేమో నాకు తెలుసు ధర్మం. నీవు ఏమి అడిగావు రాముని అరణ్యానికి వెళ్ళమన్నాడు రాముడు అరణ్యానికి వెడుతాడు రాముడికి సీతకీ అభేదం భార్య భర్త వంటిదీ అని శాస్త్రాలు చెప్తున్నాయి నేను సీతమ్మని కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తాను సీతమ్మ పరిపాలన చేస్తుంది నీ దిక్కున్న చోట చెప్పు అన్నాడు.

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
ఆవిడ వశిష్టుడంతడివాడే ఎదురు నిలబడి ఇంతమాట అన్నాడంటే ఎంతకోపమొచ్చిందో నార చీరలిచ్చారని అని భరత శ్చ స శత్రుఘ్న శ్చీర వాసా వనే చరః ! వనే వసంతం కాకుత్స్థ మను వత్స్యతి పూర్వజం !! నేను జరగబోయేది చెప్తున్నాను కైకా జాగ్రత్తగావిను నీ మాటవినడు భరతుడు వచ్చిన భరతుడు ఛీ... అంటాడు నిన్ను, ఎందుకు కాకుండాపోతావు నీవు, భర్త శరీరం వదులుతాడు విధవవి అవుతావు కొడుకు ఛీ అంటాడు కొడుకు రాజ్యం తీసుకోడు ఏ నారచీరలు ఇచ్చావో ఆ నారచీరలు భరతుడు కట్టుకొని వెళ్ళిపోతాడు నీ కళ్ళముందు నీ కొడుకు వెళ్ళిపోతాడు నేను చెప్తున్నాను తండ్రికి కొడుకు భరతుడు నీకు కొడుకు భరతుడు కాడు, నీ పోలికలు భరతునికి లేవు కాబట్టీ నిన్నూ భరతుడు అంగీకరించడు ఆయనే కాదు మేం అందరం కూడా అడవులకి వెళ్ళిపోతాం ఎవ్వరూ ఉండరు నిర్జనమైన అరణ్యంలో నీవు ఒక్కతివే ఉండిపోతావు నీవు అడిగిన కోరికకి ఆనాడు నీ ఆర్థి తీర్చడానికి నీ భర్త శరీరంతో ఉండడు జరగబోయేది చెప్తున్నాను యద్యపి త్వం క్షితి తలాత్ గగనం చ ఉత్పతిష్యసి ! పితుర్ వంశ చరిత్రజ్ఞః సః అన్యథా న కరిష్యతి !! ఈ భూమి నుంచి ఆకాశం వరకూ నీవు పైకి ఎగిరినా సరే నేను నీకు నిజం చెప్తున్నాను ఇక్ష్వాకు వంశ చరిత్ర బాగాతెలిసిన ధర్మజ్ఞుడైన భరతుడు ఒక్క నాటికీ రాజ్యం తీసుకోడుగాక తీసుకోడు. పట్టంకట్టుకోడు నీవు అడిగిన వరాలు ఎందుకూ పనికిరాదు నీ ప్రయోజనం నెరవేరదు అనవసరంగా పాడైపోతున్నావు నేను చెప్తున్నాను నా మాటవిను విని ఇప్పటికైనా రామునికి రాజ్యం ఇచ్చేసై ద్రక్షస్య అద్యైవ కైకేయి పశు వ్యాళ మృగ ద్విజాన్ ! గచ్ఛత స్సహ రామేణ పాదపాం శ్చ తదున్ముఖాన్ !! రాముడు అంటే ఎటువంటివాడో తెలియాలి అంటే నీకు నేను ఒక విషయం చెప్తున్నాను బాగాతెలుసుకోవడానికి నీకు నేను ఈ ఆధారం ఇస్తున్నాను నిజంగా రాముడే అడవులకు వెళ్ళిపోతే రాముడు అడవులకు వెళ్తున్నప్పుడు మనుష్యులు కాదు రాముడితో పాటు ఏనుగులు జంతువులూ మృగాలతో పాటు రామునితో వెళ్ళిపోతాయి, చెట్లు నడిచి వెళ్ళలేవు కాబట్టీ రాముడు వెడుతున్నవైపుకు తిరిగిచూస్తాయి రాముడంటే అంతటి ధర్మాత్ముడు ఆయన జోలికివెళ్ళి కంటనీరు తెచ్చుకుంటావ్ శోకం తెచ్చుకుంటావ్ నీవు ఉన్నతిని పొందలేవు నా మాటవిను సీతకు నార చీరలు ఇవ్వవద్దూ, వశిష్టుడు త్రికాలవేది బ్రహ్మర్షి ఆయన చెప్పినప్పుడైనా వినాలి కైక.
అంటే వినకపోవటం అనేటటువంటి మొండితనం, మాట వినకపోవడం ఎంత ప్రమాదం తీసుకొస్తుందో... రామాయణంలో రెండు పాత్రలు ఉన్నాయి, ఒకటి కైకా రెండు రావణుడు. కైకకి ఇక్కడ ఎంతమంది చెప్పారో రావణుడికి అంత మంది చెప్తారు నా మాటవిని సీతమ్మని ఇచ్చేయ్ అని, ఇక్కడ కైకకి అంత మంది చెప్తారు నా మాటవిని రాజ్యం ఇచ్చేయ్ అని ఇక్కడ ఈవిడ విందు అక్కడ ఆయన వినడు మాటవినని తనం ఎంత ప్రమాదమో రామాయణం నిరూపిస్తుంది. కాబట్టి ఈ మాట అన్న తరువాత దశరథ మహారాజుగారు అన్నారూ నేను సీతమ్మని అడవులకి వెళ్ళమని చెప్పలేదు కాబట్టి వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ ! వర్షాణి ఏతాని సంఖ్యాయ వైదేహ్యాః క్షిప్రమ్ ఆనయ !! 14 సంవత్సరములు అరణ్యంలో ఉండడానికి ఎన్ని పట్టు పుట్టములు నగలు కావాలో అన్నింటిని కావిడ్లకెత్తి రథంలో పెట్టి సీతమ్మ వెనకాతల పంపించండి. అప్పుడు కౌసల్య సీతమ్మ తోటి పతిని అనువర్తించేటటువంటి పతివ్రత భర్తని ఇబ్బంది పెట్టకుండా గాయపడకుండా ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో కష్టంలో ఉన్నాడు కదా అని పుండు గెలికినట్టు ఎలా మాట్లాడకూడదో ఎంతగా శాంతి స్థానమై సుఖ స్థానమై భర్తని సంతోషపెట్టాలో ఆమెతో చెప్తే
సీతమ్మ తల్లి అందీ అమ్మా నాకు బాగా తెలుసు నీవు చెప్పకూడదని కాదు కానీ తల్లీ నేను పూర్తిగా తెలిసున్నదానిని న అతన్త్రీ వాద్యతే వీణా న అచక్రో వర్తతే రథః ! న అపతిః సుఖ మేధే తయా స్యాత్ అపి శత ఆత్మజా !! అమ్మా లోకంలో వీణ మోగిందీ అని అంటారు కానీ వీణ మోగదు గోటి దెబ్బలకు పెనగి పెనగి మోగుతాయి, వీణ తీగకి దెబ్బలు తిని మోగితే వీన

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
మోగిందీ అంటారు, భర్త కష్టపడుతాడు భార్యకి కీర్తి వస్తుంది, న అచక్రో వర్తతే రథః ఒక రహదారి మీద రథం వెడుతున్నప్పుడు రథ చక్రాలు ఎత్తు పళ్ళాల్లో ముళ్ళల్లో అన్నిటిమీదా నడుస్తాయి రథం నడుస్తుందంటారు దెబ్బలన్నీ రథ చక్రానికి తగులుతాయి అలా భర్త కష్టపడుతాడు భార్య కీర్తిని పొందుతుంది న అపతిః సుఖమేధే తయా తెల్లవారి నిద్రలేచి తల్లి మంచం నుంచు కిందకి దిగుతున్నప్పుడు తన అరికాళ్ళు చాపి తన రెండు చేతులూ పెట్టి అప్పుడు రమ్మని అరచేతులలో నడిపించే అత్యంత ప్రీతి పాత్రులైనటువంటి నూర్గులు కొడుకుల వలన తల్లి పొందిన సుఖము కన్నా భర్త ఉండడం వల్ల ఒక భార్య పొందేటటువంటి సుఖాన్ని చెప్పడం ఎవరికీ చేతకాదో అంత గొప్పవాడమ్మా భర్తంటే నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ రాముడి మనసు కష్టపెట్టను మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః ! అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్ !!  అమ్మా లోకంలో తండ్రి కొంతే ఇవ్వగలడు తల్లి కొంతే ఇవ్వగలదు కానీ భర్త ఇవ్వగలిగినటువంటి ఎంతా అని లెక్కకట్టగలిగినవాడు ఈ లోకంలో లేడు అందుకే భర్తా అన్నవాడు అంత గొప్పవాడమ్మా కాబట్టి నేను భర్తను ఎన్నడూ చిన్న చూపు చూడను తల్లీ అంది. రామ చంద్ర మూర్తి కౌసల్యనీ దశరథ మహారాజుగారికి అప్పగించి నేను ఇక నేను బయలుదేరుతానని ఆయన సిద్ధపడుతుండగా సుమంత్రున్ని పిలిచి ఆ రథాన్ని సిద్ధంచేసి రథంలో ఊరి చివరన ఉన్న అరణ్యంలో దిగబెట్టమని దశరథుడు ఆజ్ఞాపిస్తే ఆ రథాన్ని తీసుకొచ్చారు.
సీతా రామ లక్ష్మణులు రథం ఎక్కడం కోసమని అంతఃపురంలోంచి బయలుదేరుతున్నారు సుమిత్ర ఎక్కడ మాట్లాడినా అలాగే ఉంటుంది, సుమిత్ర కొడుకుని పిలిచి అందీ సృష్ట స్త్వం వన వాసాయ స్వనురక్తః సుహృ జ్జనే ! రామే ప్రమాదం మా కార్షీః పుత్ర భ్రాతరి గచ్ఛతి !! నాయనా నీవు వనవాసం కోసమే పుట్టానని గుర్తుపెట్టుకో రామున్ని అనుగమించేటప్పుడూ అత్యంత పరాకుగా చాలా జాగ్రత్తగా రామున్ని రక్షిస్తూ ఉండు వ్యసనీ వా సమృద్ధో వా గతిః ఏష తవానఘ ! ఏష లోకే సతాం ధర్మో యత్ జ్యేష్ఠ వశగో భవేత్ !! ఆవిడ చెప్తుంది ధర్మం ఇక్కడ అన్నగారిని అనుసరించి వెళ్ళడమనేటటువంటిది లోకంలో అత్యంత ధర్మం పెద్దవాడిని సేవించడం తండ్రిని సేవించడంతో సమానం కాబట్టి నాయనా నీవు రాముడు కష్టంలో ఉన్నాడా రాముడు ఐశ్వర్యంతో ఉన్నాడా అని ఎప్పుడూ చూడద్దు, రామున్ని సేవించడమే ఎప్పుడు నీ జీవితానికి ప్రయోజనంగా పెట్టుకో రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాఽఽత్మజామ్ ! అయోధ్యామ్ అటవీం విద్ధి గచ్ఛ తాత యథా సుఖమ్ !! వెళ్ళి ʻరాʼ అనలేదు ఆవిడ వెళ్ళు ʻపోʼ అంది రామం దశరథం విద్ధి ఇప్పుడే దశరథ మహారాజుగా భావించు మాం విద్ధి జనకాత్మజామ్ మీ వదిన సీతమ్మని నన్ను అనుకో నీకు తల్లి తండ్రులు పక్కన లేరు అనుకోవద్దు అయోధ్యామ్ అటవీం విద్ధి వాళ్ళున్న అడవి అయోధ్యా అనుకో గచ్ఛ తాత యథా సుఖమ్ వెళ్ళు నాయనా అంది.
వాళ్ళని సేవించడం కన్నా నా దగ్గరకు వచ్చేయడం ప్రయోజనం కాదు వెళ్ళిపో వాళ్ళతో అనీ ఇప్పుడు ఆ రథాన్ని మహానుభావులు ఆ సీతా రామ లక్ష్మణులు అధిరోహించారూ రథం బయలుదేరడానికి సిద్ధంగా ఉందీ ఆ చుట్టూ ఉన్నటువంటి పౌరులు రథానికి అడ్డంగానిలబడి రాముడు వెళ్ళడానికివీళ్ళేదు మేము కూడా రామునితో వచ్చేస్తామని పేద్దగా రోదనలుచేస్తూ ఏడుస్తుంటే ఎనుగులన్నీ కూడా నోళ్ళల్లో పెట్టుకున్న ఆహారాన్ని అంతటిని బయటికి కక్కేశాయట, గుర్రాలన్నీ పెద్దగా సఖిలించాయట, కోసల రాజ్యానికి నక్షత్రమైనటువంటి విశాఖా నక్షత్రాన్ని ధూమం కమ్మేసిందట రాక్షస గ్రహాలన్నీకుడా పాపపు గ్రహలు అన్నీకూడా చంద్రున్ని ఆవహించాయట ఆరోజే లేక లేక లేక కొడుకు పుట్టినటువంటి తల్లీ నాకు కొడుకు పుట్టాడని

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
అభినందించలేకపోయిందట, పసి పిల్లలకు తల్లులు పాలివ్వలేదట, నిష్ట కలిగిన బ్రాహ్మణులు కూడా అగ్నిహోత్రం చేయడం మానేశారట, ఆడవాళ్ళు భర్తలకు అన్నం వండలేదట ఎంత ప్రియపత్నియైనా ఏ పురుషుడికి స్త్రీ మీదా స్త్రీకి పురుషుడి మీదా అనురక్తి కలిగేటటువంటి చూపులు లేవటా, ఎక్కడ చూసినా శోకమే ఏ ఇంటా అన్నం వండుకున్న దాఖలాలు లేవు, ఏ వ్యక్తీ కన్నుల వెంట నీరు కారనివాడులేడు ఎక్కడ చూసినా ఏడుపులే అయోధ్య అంతా... అన్నీ మిన్నుముట్టేస్తున్నాయి హా రామా... హా రామా... హా లక్ష్మణా... హా సీతా... మళ్ళీ ఎప్పటికి చూస్తాం 14 యేళ్ళ తరువాత మీరు వచ్చేటప్పటికీ మేం ప్రాణాలతో ఉంటామా ప్రాణాలతోవుండి చూడగలిగినవాడు అదృష్టవంతుడు ఇదే ఆఖరి దర్శనమా ఇక రామున్ని చూడడమా అని ఏడ్చీ గగ్గోలు పెట్టీ నేలమీద పడీ దొర్లుతూ బ్రాహ్మణులు తాముచెయ్యవలసినకార్యాలు కూడా మరిచిపోయి వీధులలోకి వచ్చి దేవాలయాలన్నీ మూసేశారు దేవతలకి నైవేద్యాలులేవు ఎక్కడ చెయ్యవలసిన ఏ కార్యాలు అగిపోయాయి అందరూ వీధుల్లోకివచ్చి నిలబడిపోయారట అందరూ ఏడుస్తున్నారు.
వెనక నుంచీ దశరథ మహారాజుగారు రాజు రాకూడని రీతిలో జుట్టు విడగబడిపోయి రెండు చేతులు పైకెత్తీ కాలినడకనా రాకూడని రీతిలో పక్కన కౌసల్యా మాతా ఇలా ఊగిపోతున్నటువంటి చెట్టులా నాట్యంచేస్తున్న నాట్యకత్తెలా గుండెలు బాదేసుకుంటూ సీతా రామా లక్ష్మణా వెళ్ళిపోతున్నారా నేను మళ్ళీ చూస్తానా మిమ్మల్ని అని ఏడుస్తూ పెద్ద పెద్ద అరుపు అరుస్తూ దశరథుడితో కలిసి వస్తూంటే రామ మాతా రామ మాతా అని అందరూ అరుస్తూంటే చూడలేక చూడలేక ఇలా తల వెనక్కి తిప్పీ గుర్రపు పిల్ల ఎలా చూస్తుందో అలా చూశాడట రాముడు ఆ కంటికి కనపడకుండా అడ్డు కడతారు కదా చూడలేక చూడలేక ఇలా చూసేటప్పటికీ దశరథ మహారాజు శోకంతో అలా స్థానువైపోయి సంజ్ఞకోల్పోయి అలా రామునివంకే చూస్తూ మూర్ఛ చెందీ ఆ నేల మీద వంటికి పరాగమంటేటట్టుగా కిందపడిపోయి దొర్లుతున్నాడు, అసలు కౌసల్యా నేను ఒక పట్టమహిసినీ నేను ఇలా వీధిలో పౌరులు చూస్తూ ఉండగా ఉండడాన్నిల్లేకుండగా గుండెలు బాధుకుంటూ నాట్యకత్తెలా గంతులేస్తూ ఏడూస్తూ అరుస్తుంటే రాముడు చూడలేక పోయాడు.
దశరథుడు అన్నాడు సుమంత్రుడా నీవు నా కింకరుడవు నేను ఆజ్ఞాపిస్తున్నాను రథాన్ని నడపకు నేను పరుగెత్తలేక పోతున్నాను నేను పడిపోతున్నాను అని ఏడుస్తున్నాడు, కౌసల్యా ఆపండీ రథమాపండీ నాకు కొడుకు కావాలి కొడుకు కావాలి అని ఏడుస్తోంది తిష్ఠే తి రాజా చుక్రోశ యాహి యాహీ తి రాఘవః ! సుమన్త్ర స్య బభూవ ఆత్మా చక్రయోః ఇవ చాన్తరా !! రాముడు అంటున్నాడు రథాన్ని పోనీ పోనీ అంటున్నాడు రాజు అన్నాడు రథాన్ని ఆపు ఆపు అన్నాడు కాడికీ చక్రాని మధ్యలో నలిగినవాడి పరిస్థిలా ఉంది సుమంత్రుడి పరిస్థితి. రాజు ఆపమంటున్నాడు రథాన్ని ఏం చెయ్యను అంటున్నాడు పోనీ రథాన్ని నా శ్రౌషమ్ ఇతి రాజానమ్ ఉపాలబ్ధోపి వక్ష్యసి ! చిరం దుఃఖస్య పాపిష్ఠమ్ ఇతి రామః తమ్ అబ్రవీత్ !! నేను చూడలేక పోతున్నాను అలా గుండెలు బాదుకొని గెంతుతున్న మా అమ్మని గుండెలు బాదుకొని మట్టిలో

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
పడిపోయిన పొర్లుతున్న ప్రభువు దశరథ మహారాజుని నేను చూడలేను కాబట్టీ ఈ రథాన్ని తోలేసైండీ నాకు ఇవి సాధ్యం కావటం లేదు రేపు పొద్దున ఇంటికి వెళ్ళిన తరువాత ఎందుకు రథం ఆపలేదని రాజు అడిగితే రథ చక్రాల సవ్వడిలో నీ మాట నాకు వినపడలేదని చెప్పేసై మరి అపద్ధం ఆడించడం తప్పుకాదా తండ్రిని ధర్మంలో నిలబెట్టడం అన్న పెద్ద ధర్మం కోసం అటువంటి బాధలో ఉన్న వారినుంచి దూరంగా వెళ్ళిపోతే తప్పా వాళ్ళు ఉపశాంతి పొందరు కనుకా తాను వెళ్ళిపోవడం వినా మార్గం లేనప్పుడు రాముడు అలా చేయడం తప్పు కాదూ అది ధర్మమే అన్నారు ఎందుకంటే అయోధ్య కాండా అంతా ధర్మమే.
కాబట్టీ ఇప్పుడు ఆ రథం వెళ్ళిపోతూంటే ధూళి రేగినంత సేపు అలా నిలబడిపోయాడు ఆ ధూళి కనపడ్డం కూడా మానేసింది వెళ్ళిపోయింది రథం ఇంక ఆ బెంగ తట్టుకోలేక గుండెలు బాధుకుంటూ పసిపిల్లాడిలా నేల మీద పడిపోయి మట్టిలో పడి మూర్ఛపోయాడు దశరథుడు. కైక వచ్చీ, కౌసల్యా అటూ ఇటూ పట్టుకొని లేపబోయారు తెలివొచ్చినటువంటి దశరథుడు ఈ లోకంలో పై లోకాలలో కూడా నీవు నాకు భార్యగా ఉండగలిగిన స్థితి నుంచి నిన్ను వినుర్ముక్తుని చేస్తున్నాను ఇక నీవు ముట్టుకోవడానికి వీల్లేదు నీవు నాతో మాట్లాడటానికి వీలు లేదు నీ వారికి నేను వారివాడను కాను, నీ సేవకులకు నేను ప్రభువుని కాను ఇక ఒక వేళ రాజ్యాన్నే భరతుడు కోరుకుంటే నాకు ప్రేత సంస్కారం కూడా భరతుడు చేయకూడదు, ఇక నేను ఉండను వెళ్ళిపోతాను రాముడు లేకుండా నేను బ్రతకలేను, నేను మరణించడం ఖాయం 14 సంవత్సరముల తరువాత తిరిగి వచ్చే రాముని గురించి చూసే అదృష్టం నాకులేదు ఏడ్చి ఏడ్చి నా కళ్ళు పోయేటట్టు ఉన్నాయి, ఇక నా కళ్ళకు చూసేశక్తి కూడా పోయింది.
కాబట్టి నన్ను చేతులు పట్టుకొని కౌసల్యా మందిరానికి తీసుకుపోండి నేను కౌసల్య ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు, పాపం ఆ సేవకులు తీసుకెళ్ళి కౌసల్యా మందిరంలో పడుకోబెట్టారు, పుండుతో ఉన్న ఎద్దుని ఆ పుండిమీద వేసి కాడి కట్టీ వేనక తోక మెలిపెడితే... ఆ ఎద్దు ఎంత బాధ పడుతుందో దశరథుడు ఆనాడు అంత బాధ పడ్డాడు, అంత బాధతో వెళ్ళి పడుకొని నాకు ఇంకా వెళ్ళిపోతున్న రాముడే గుర్తుకు వస్తున్నాడు కౌసల్యా అని గుండెలు బాధుకొని ఏడుస్తుంటే కౌసల్య అందీ అథ స్మ నగరే రామ శ్చరన్ భైక్షం గృహే వసేత్ ! కామ కారో వరం దాతుమ్ అపి దాసం మమాఽఽత్మజమ్ !! లేక లేక పుట్టిన కొడుకు కదా మీరు ఆ వరం ఇచ్చిందేదో అడవికి వెళ్ళకుండా భరతుడికి దాసుడుగా బ్రతుకమని చెప్పవలసింది చెప్తే నా కొడుకు భరతుడికి ఊడిగం చేస్తున్నా కళ్ళముందు కదులుతున్న కొడుకుని చూసుకొని సంతోషించేవాళ్ళం నాకు ఆ అదృష్టం కూడా లేకుండా వరం ఇచ్చారు, ఇంకా బాధ పడ్డాడు కౌసల్యా నీవు కూడా నన్ను మాటలతో బాధపెడతావా ఏడ్చి ఏడ్చి ఎన్ని మార్లు సృహతప్పాడో దానికి లెక్కే లేదు పౌరులు బ్రాహ్మణులు అగ్ని కార్యాలు మానేసి రాముని వెంటపడ్డారు నీవు మేముచెప్తే కాదనవు రామా!

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
నీకు తెల్లగొడుగు లేకుండా వెళ్ళిపోతున్నావు, మేము వాజపేయయ యాగములుచేస్తే గౌరవస్పరంగా మాకుతెల్ల గొడుగులు ఇచ్చారు ఇదిగో ఈ తెల్ల గొడుగులు పట్టుకొని వస్తున్నాం, నీవు ఈతెల్ల గొడుగు కింద ఉండూ అన్నారు ఎంత చెప్పినావినలేదు రథం వెడుతుంటే పరుగులు పెట్టి ఆయనతో వెళ్ళిపోయారు తమసానది తీరంలో రాత్రి పడుకున్నాడు పౌరులూ ఆయనతోనే పడుకున్నారు పౌరులూ జానపదులు బ్రాహ్మణులూ అందరూ పడుకున్నారు.
బాగా చీకటిలో లేచి రాముడు అన్నాడూ సుమంత్రా ఈ పౌరులు నన్ను విడిచిపెట్టరు కాబట్టి ముందు రథాన్ని అయోధ్యా నగరం వైపుకు నడిపించు రథం యొక్క గాడిపడుతుంది ఆ తరువాత రథాన్ని మళ్ళీ వెనక్కు తీసుకొచ్చేసై తీసుకొచ్చేసి నీటిలోంచి తమసానదిని దాటేద్దాం నీటిలో గాడికనపడదు కాబట్టి పౌరలు నిద్రలేచీ ఆగాడి ఎటుందో అటువైపుకు వెళ్తారు కొంత దూరం వెళ్ళాక ఇక గాడికనపడదు వెనక్కు వచ్చిచూస్తారు ఎటువెళ్ళారో తెలియదు రాముడు ఎటు వెళ్ళాడోనని వాళ్ళుతిరిగి ఇంటికివెళ్ళిపోతారు ఇది మోసపుచ్చడం కాదు నా కోసం పౌరులూ జానపదులు బ్రాహ్మణులూ కష్టపడడం ఇలా చెట్లకింద పడుకోవడం నాకు ఇష్టంలేదు నేను వాళ్ళను బాధపెట్టకూడదు నేను చేయాలి అరణ్యవాసం వాళ్ళనెందుకు ఖేదపెట్టడం ఇంతకన్నా మార్గంలేదనీ రథాన్ని ఇలాతిప్పించి తాను రథమెక్కి తమసానది తీరందాటి దుర్గమమైన అరణ్యంలోకి సీతా లక్ష్మణ సహితుడైన రాముడు పౌరులను బ్రాహ్మణులను జానపదులను ఇబ్బంది పెట్టకుండా నేను ఎలా మాటిచ్చానో అలా నేను బయలుదేరుతానన్న తృప్తితో సుమంత్రుడి రథంతో కలిసి ఆ అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాడు రాముడు కనపడలేదని బాధపడి ఏడుస్తూ వీళ్ళందరూ తిరిగి అయోధ్యా నగరానికి వెళ్ళిపోయారు వాళ్ళ భార్యలందరూ నిందజేశారు అంతదాకా వెళ్ళి రాముడితో వెళ్ళకుండా వెనక్కు వచ్చేశారా రామున్ని వెనక్కుతేలేదా అని రాముడు అంటే అంత ధర్మాడై అంత మహితాత్ముడై మహానుభావుడు అరణ్యవాసానికి మరుసటి రోజు రాత్రి గడిపి ధర్మనిష్టతో ఆ తమసానదిని దాటివెళ్ళిపోయాడు అన్న ఒక మంగళకరమైన వాక్యం దగ్గర ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని పూర్తిచేస్తున్నాను.
మళ్ళీ రేపటి రోజున ʻగుహుడుʼ అత్యద్భుతమైన ఘట్టం దగ్గర అటువంటి ఘట్టాన్ని మీరు అవదరింద్దురుగానీ ఇప్పుడొక్క 11 మార్లు రామ నామం చేద్దాం గంభీరమైన ఘట్టం కనుక రామ చంద్ర మూర్తి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభిస్తుంది.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !!రా!!
పాహికృష్ణాయనుచు ప్రౌపది పలికినది శ్రీ రామ నామము !!రా!!
ఇడాపింగళమధ్యమందును ఇమిడి ఉన్నది రామ నామము !!రా!!
భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
ద్వేషరాగ లోభమోహములను త్రేంచునది ఈ రామ నామము !!రా!!

  అయోధ్య కాండ పదవ రోజు ప్రవచనము
ఆత్మసంయమ యోగసిద్ధికి ఆయుధము శ్రీ రామ నామము !!రా!!
శాంతిసత్యా అహింస సమ్మేళనమే ఈ శ్రీ రామ నామము !!రా!!
వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామ నామము !!రా!!
జన్మమృత్యు రహస్యమేరిగి జపియించవలె శ్రీ రామ నామము !!రా!!
విజ్ఞుడగు గురునాశ్రయించిన విషదమగు శ్రీ రామ నామము !!రా!!
తుంటరీకామాదులను మంటగలుపును శ్రీ రామ నామము !!రా!!
ధాతవ్రాసిన వ్రాత తుడిచెడిదైవమే శ్రీ రామ నామము !!రా!!
మంగళంబగు భక్తితోపాడిన శుభకరంబగు శ్రీ రామ నామము !!రా!!
మంగళా శాసన ....