బాల కాండ
మూడవ రోజు ప్రవచనము
శ్రీరామాయణం ఆదికావ్యం, శ్రీరామాయణ కథకీ ఒకగమ్మత్తుంది మీరు దానిగురించి
విశేషణమైనటువంటి వ్యాఖ్యానమేదో తెలుసుకోవలనే ప్రయత్నంచెయ్యడం మంచిదే, కానీ అలాతెలుసుకొనేటటువంటి ప్రయత్నంచెయ్యక పోయినప్పటికీ, కేవలం రామ కథని రామ కథగా యథాతధంగా మూలంలో వాల్మీకి మహర్షి ఏలా
చెప్పారో అలా రామ కథని చదువుకోవడ మనేటటువంటిదానికన్నా ప్రశస్తమైన విధానం
ఇంకోటి ఉందీ అని నేను అనుకోవటంలేదు. పెద్దలైనవారందరూ కూడా ఈ మాటే చెప్తారు, దానికింకా మీరు పక్కన ఏమీచెర్చక్కర్లేదు రామ
కథని రామ కథగా చదువుకుంటే చాలు. వాల్మీకిప్రమీతమైనటువంటి రామకథ ఏదుందో... శ్రీ రామాయణం ఏది
ఉందో... ఆ రామాయణాన్ని అలా ఆ మూలాన్ని, ఆ తాత్పర్యాన్ని, ఆ కథనీ, ఆ ఘట్టాల్నీ మీరు స్మరించి, మీరు దాన్నిపఠించి, మీరు కృతకృత్యులు కాగలిగితే అది ʻవేదోప బృంహ్మణముʼ కనుకా శ్రీ రామాయణం మీకుకటాక్షించవలసిన అభ్యున్నతిని
అదికృపచేస్తుంది అంతశక్తివంతమైనటువంటి కావ్యం. అటువంటి కావ్యంలో ఏ మహాపురుషుల
పేర్లు స్మరించినంత మాత్రంచేత, ఉచ్చరించినంత మాత్రంచేత అసలు జీవునికి ఉన్నటువంటి పాపరాశి దగ్ధమౌతుందో...
అటువంటి మహాపురుషుల యొక్క పేర్లు ఉచ్చరించపడుతాయి.
బాల కాండలో మొట్ట మొదటే శ్రీ రామ చంద్ర మూర్తి యొక్క అవతార ఆవిర్భావమునకు
విశేషమైనటువంటి కృషిసల్పినటువంటి వ్యక్తి, గొప్ప తపోధనుడూ ఋష్యశృంగుడు. అటువంటి ఋష్యశృంగుడు శాంతా సహితుడై అయోధ్యానగరానికి
చేరుకున్నటువంటి ఘట్టాన్ని మీకు నేను నిన్న విన్నపం చేసి ఉన్నాను. మీరొకటి గమనించండీ! ఆయన
సాక్ష్యాత్తుగా పరమశివ స్వరూపమునందు లీనమైనటువంటి వాడు. అందుకే... ఇప్పటికీ కూడా
మీరు శృంగగిరి క్షేత్రానికి వెళితే, ఆ శృంగేరిలో "కిగ్గా" అనబడేటటువంటి ఒక శిఖరం మీద ఋష్యశృంగునికి
దేవాలయం ఉంది. ఋష్యశృంగ దేవాలయంలో శివలింగం ఉంటుంది ఆయన శివ స్వరూపంగా, శాశ్వత స్వరూపంగా ఇప్పటికీ పూజలు
అందుకుంటున్నవాడు. అందుకే
శృంగేరీ ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉంటాయి.
గొప్ప తపో భూమీ అందుకే శృంగేరీ పీఠాన్ని అధిష్టించినటువంటి ప్రతి పీఠాధిపతికూడా
తనదైన ముద్రవేశారు. ఆశేతుహిమాచల పర్యంతంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న భక్తులకే
కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి, ఈ సనాతన ధర్మంలోని
భక్తులకైనా సరే...
వారు ఎన్నో విషయాలను అందించీ మన జీవితాన్ని
సార్దకతచేసిన మహాపురుషులు ఎవరికి వారే అంతంత గొప్ప స్థితిని పొందారు. ఇప్పుడు మీరు
వారి ఔన్యత్యం గురించి చేసినటువంటి స్తోత్రాన్ని మీరు వింటూంటారు గురువుగారి
గురించి విజయనగర సింహాసనా ప్రతిష్టపనాచార్యా, సకల నిగమాయసాయ హృదయా, తపశ్చక్రవర్తీ, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యా, వ్యాక్యాన సంహానాదీశనా అంటూనూ ప్రతివారూ. ఒకాయన కాకరకాయలుతిని
అష్ఠసిద్దులు సాధించారు. చంద్ర శేఖర భారతీ నిరంతరమూ బ్రాహ్మీభూత స్థితియందు
ఉండేవారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొ శైలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క విలక్షణమైనటువంటు పద్దతి
కానీ అందరూ మహానుభావులూ ఈ జాతిని ప్రచోదనం చేసినవారే. దానికంతటికి కారణం
ఎక్కటుందంటే మూలకందం ఎక్కడుందంటే... ఋష్యశృంగమహర్షి తిరుగాడిన ప్రదేశం అది కావడం.
అందుకే శృంగగిరి పీఠం అంత గొప్ప పీఠం అవడానికి కారణం, యదార్థంగా చెప్పాలంటే అది ఋష్యశృంగుడు
తిరిగినటువంటి భూమి కావడం. ఇప్పటికీ తపస్సుకి అనువైనటువంటి ప్రదేశంగా... ఆ ప్రదేశం
ఉందీ అంటే... ఆ యుగంలో ఆ మహానుభావుడు తిరిగినంత మాత్రంచేత ఆయన తపఃశ్శక్తికి వచ్చినటువంటి ప్రకంపనలు అటువంటివి అవి ఇప్పటికి
మనుష్యులని తరింపజేస్తాయి.
|
శృంగేరి మీలో అందరూ వేళ్ళి వచ్చినవారే
అనుకుంటున్నాను, నేనే ఆలస్యంగా వెళ్లానేమో శృంగేరి. అసలు
శృంగేరి వేడితేనే మనోలయం అవుతుంది. శంకర భగవత్ పాదులు యోగ రత్నావళి స్తోత్రం
చేస్తూ… “శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్సయే” అంటారు నాకు ఎప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ
గహలో కూర్చొంటే నా మనోలయం అవుతుందో అని ఆయన స్తోత్రం చేశాడు. ఆలా శృంగగిరి మీరు
ధ్యానం చేయడానికి చాలా యోగ్యమైనటువంటి ప్రదేశము. ఇంతటి యోగ్యతా సిద్దికి
కారణమైనటువంటి ఋష్యశృంగమహర్షి, ఆయన బయలుదేరి వచ్చేటప్పటికీ అంగ రాజ్యంలో వర్షాలు పడ్డాయి. అందుకే మీతో ఆ మాట
ప్రస్తావన చేశానూ... ఆయనా వర్షమూ ఒక్కేసారి వచ్చాయి అంతటి తపశ్శక్తి సంపన్నుడు,
అంతటి క్షామమూ కూడా కేవలము ఆయన అడుగు పెట్టినంత మాత్రం చేత పోయింది. దశరథ మహారాజు
గారికి ఉన్నటువంటి లోటుపూడ్చి ఆయన ఆధ్వర్యం వహించిచేయించినటువంటి యజ్ఞం సఫలీకృతమై
రామ చంద్ర మూర్తి యొక్క ఆవిర్భావానికి కారణమైంది.
అంతటి మహా పురుషుడైనటువంటి ఋష్యశృంగుడు అయోధ్యా పట్టణానికి వెళ్ళడానికి
ఉన్నటువంటి కారణాన్ని మీరు నిన్నటిరోజున విన్నారు. ఏ కారణానికి ఆయన వెళ్ళారు, ఏమయ్యా ఇంత గోప్పపని చెయ్యాలని అంటున్నావ్, అశ్వమేధ యాగం చేయ్యాలంటున్నావ్, ఒక ఇష్టి జరగాలంటున్నావ్, అప్పటికి ఆ ఇష్టి ఏదో నిర్ణయింబడలేదు కూడా... అశ్వమేధం
అయ్యాక అడిగాడు దశరథ మహారాజు గారు, ఇప్పుడు నీవు ఏ ఇష్టి చేస్తే బాగుంటుందనుకుంటున్నావో అది నాతో చేయించు
అన్నాడు. ఇంత పెద్ద కార్యం చెయ్యాలి, అశ్వమేధమంటే ఏం సామాన్యమైనటువంటి ప్రక్రియ కాదు
ఇంత గొప్ప ప్రక్రియ చేయించాలి, నేను బయలుదేరి రావడమూ అంటే... నాకేం లభిస్తుంది అని అడిగినవాడు కాడు ఆయన, నిత్యతృప్తుడు ఎంత సంతోషమంటే ఎప్పుడూ బ్రాంహీమయ
స్థితిలో ఉండే మహానుభావుడు అటువంటి మహాపురుషుడు దేనికివశుడై వచ్చాడంటే రెండే రెండు
కారణాలు ఒకటి మామగారి ఆజ్ఞ, నాయనా! నీవు వెళ్ళు అయోధ్యా పట్టణానికి అన్నాడు.
ఇవ్వాళ నేను ఎక్కడ బాధ పడుతున్నానంటే... మన సంస్కృతి బీటలు బారిపోయేటటువంటి రచనలు, మన సంస్కృతికి ఛిద్రం చేసేటటువంటి లఘు నాటికలు
ప్రసారమౌతున్నాయి. మామగారు అంటే కేవలంగా అల్లునిచేత పీడింపబడవలసినటువంటి
వ్యక్తికాడు తండ్రిగారు
ఎంతగా గౌరవింపబడుతారో... మామగారు అంతగా
గౌరవింపబడవలసినటువంటి వ్యక్తి, పితృపంచకంలో ఒకరు. మామగారికి అల్లుని నీవు వెళ్ళు అని శాశించే అధికారం ఉంది కాబట్టి
అల్లుని పంపగలిగారాయన, మామగారి మాటని అంతగొప్ప ఋష్యశృంగుడు
అవదలదాల్చాడు. రెండూ ఆయన రావడానికి ఒక్కటే కారణం – మీరు జాగ్రత్తగా శ్రీ
రామాయణాన్ని గమనించండీ... రెండు చేతులూ కలిపి దోసిలొగ్గి ప్రణిపాతం చేసి, పాదాలమీద తలపెట్టి నమస్కరించి ఇలా రెండు చేతులుపెట్టి
అర్థించాడు, నాకు స్వర్గం కావాలి, నాకు పుత్ర సంతానం కావాలి, అవి కలగాలంటే మీరు
రావాలి వచ్చి నీ ఆధ్వరంలో ఆ యజ్ఞం జరుగాలి అంతే... ఇంకాయనేమీ అడగలేదు వస్తున్నాను
అన్నారు. వస్తున్నాను శాంతా సహితుడై నేను బయలుదేరి వస్తున్నాను అంత గొప్పగా యాగం
జరిగిందీ అంటే, ఋష్యశృంగ మహర్షియొక్క రాకకారణం.
|
ఈ దేశం యొక్క పేరుప్రఖ్యాతులు దేనివల్ల
వచ్చాయంటే... భౌతికమైనటువంటి సంపదవలనకానీ, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి విలాసవంతమైన
జీవితాన్ని దృష్టిలో పేట్టుకొని చూడడానికి అసలు అటువంటి స్థితి ఇక్కడ లేదు. మరి
దేనివల్ల వచ్చిందంటే కేవలం ఆశ్రమ ధర్మంపట్ల, సనాతన ధర్మంపట్ల అనురక్తి కలిగినటువంటి
మహాపురుషులు ఇది సత్యమే... సత్యమే... సత్యమే... అని ఒకటికి పదిమార్లు తమ ఉపాసనలచేత
నిరూపించారు. శంకరభగవత్ పాదాచార్య స్వామి సాక్ష్యాత్ కైలాస శంకరుడే, కాలడి శంకరుడిగా అవతరించి భూమి నాలుగు చెరువులా
పర్యటించి సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి అద్వైతాన్ని ఆవిష్కరించారు. శంకరులు
అధ్వైత స్థాపకులు అంటుంటారు తప్పు, ఆయన స్థాపించ లేదు ʻఅద్వైతం వేదాంతర్గతంʼ వేదాంతర్గతమైన ఒక సత్యానికి శంకరులు
ప్రచారకులంతే. ఆయనేం కొత్తగా స్థాపించినదేం లేదు అందులో, ఆయన అందుకే ఒకటికి పదిమార్లు చెప్పుకున్నారు
అద్వైతమని. అటువంటి శంకరాచార్యుల వారివల్ల, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామివారివల్ల, ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారివల్ల, ఒక నృసింహభారతీ స్వామి వారివల్ల, అటువంటి మహా పురుషులవల్ల రామకృష్ణ పరమ హంసవల్ల, భగవాన్ రమణులవల్ల ఈజాతికి పేరు ప్రఖ్యాతులు
వచ్చాయి తప్పా. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇతరమైనటువంటి భౌతిక సంపత్తివల్ల ఈ దేశానికి ఆ పేరు రాలేదు. అటువంటి
జీవనాడి ఎక్కడుందో, ఈ
సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో శ్రీ రామాయణం చెపుతుంది మనం ఎలా బ్రతకాలో రామాయణం
నేర్పుతుంది. రామాయణం చదువుకుంటే, రామాయణం వింటే... మనం ఏది దిద్దుకోవాలో ఒక
మనిషి పరిపూర్ణత్వం సాధించడానికి ఏది అవసరమో మనకు జ్యోతకం అవుతుంది. కాబట్టి
ఋష్యశృంగ మహర్షి బయలుదేరి అయోధ్యా నగరానికి వచ్చారు వచ్చి అయోధ్యానగరంలో
అంతఃపురంలో ఆయన వేంచేసి ఉన్నారూ... దశరథ మహారాజు గారి యొక్క ఆతిథ్యాన్ని
స్వీకరిస్తున్నారు.
ఒకానొకనాడు రావలసినటువంటి నైమిక్తిక తిథి వచ్చింది అంటే కార్యక్రమాన్ని
ప్రారంభం చేయడానికి యోగ్యమైన కాలం ఒకటి ఉంటుంది కదా అటువంటి కాలం వచ్చింది, ఆకాలంలో తతః ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినమ్ !
యజ్ఞాయ వరయామాస సన్తానార్థం కులస్య వై !! దశరథ మహా రాజుగారు వెళ్ళి ఋష్యశృంగ మహర్షి
యొక్క పాదములకు తన తల తాకించి ప్రణమిల్లి అడిగాడు. అయ్యా! నేను సంతానార్థినై
యజ్ఞమును చెయ్యాలని నిర్ణయం చేసుకున్నాను మీరు దానికి మిమ్మల్ని ఋత్విక్కుగా వరిస్తున్నాను
మీరు ఋత్విక్కుగా నిలబడి ఈ కార్యానంతట్నినీ చేయించవలసింది. వెంటనే ఋష్యశృంగ మహర్షి
అన్నారు (తథేతి చ స రాజానమువాచ చ సుసత్కృతః !) సమ్బారా
సమ్భ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్ నాయనా! ఈ యజ్ఞానికి కావలసినటువంటి సంభారములనన్నింటినీ
తెప్పించు, వాటన్నిటినీ సిద్ధం చేయి, సిద్ధం చేసి నువ్వు ఆ యజ్ఞాశ్వాన్ని
విడిచిపెట్టు, విడిచి పెట్టినట్టైతే మనం అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చెయ్యేచ్చూ
అన్నారు. ఋష్యశృంగ మహర్షి అనుమతి ఇచ్చారు కనుక అశ్వమేధ
యాగం ప్రారంభయౌతూంది. వెంటనే దశరథ మహారాజు గారు మంత్రుల్ని పిలిచి ఇతర
పురోహితుల్ని, ఇతర ఋషుల్ని కూడా తీసుకురమ్మని సుమంత్రున్ని
ఆజ్ఞాపించారు సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్ ! పురోహితం వసిష్ఠం చ యే చాఽన్యే ద్విజసత్తమాః !! సుయజ్ఞడు వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, పురోహితుడైనటువంటి వశిష్టుడు వీళ్ళందర్నినీ
తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తరువాత వారికి తాను చెయ్యాలనుకొంటున్నవంటి
సంకల్పాన్ని ఒక్కసారి చెప్పాడు, నేను అశ్వాన్ని విడిచి పెడుతున్నాను అశ్వమేధ
యాగాన్ని ప్రారంభం చేస్తున్నాను అని ఎంతో సంతోషించారు.
|
ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించ వలసి ఉంటుంది
కథ కథగా వెళ్ళిపోతూంటుంది. ఈ యజ్ఞము అనేటటువంటి మాట సనాతన ధర్మమునకు మాత్రమే
చెందిన సొత్తు. ఈ యజ్ఞము అన్న మాట మీకు ఏ ఇతరములైనటువంటి ఏ విశ్వాసమునందు కనబడదు.
అగ్నిహోత్రాన్ని జయిల్చీ, అగ్నిహోత్రంలో దేవతలకు అవిష్యులిచ్చి, ఆ అవిష్యులు దేవతలకు అందడం వల్ల వాళ్ళు
తృప్తిపొంది. వాళ్ళు మనకు కావలసినటువంటి సమస్త శ్రేయస్సు కొరకు సాధనములను బహూకరించ
గలిగినటువంటి స్థితినీ కల్పించగలిగినటువంటి ఆ స్థితినీ... ఒక్క సనాతన ధర్మంలో
యజ్ఞమూ, యాగమూ, హోమమూ అన్న క్రతువుల ద్వారా తీసుకొచ్చారు. తప్ప
ఈ మంత్ర భాగం కానీ, దేవతల్ని మంత్రంతో పిలవడం కానీ, అగ్నిహోత్రంలోకి హవిస్సు నివ్వడం కానీ, ఆ హవిస్సును హవ్యవాహనుడై తీసుకొని దేవతలకు
అందించడం కానీ మీకు ఇతరమైన చోట్ల కనబడదు. మీరు ఒక విషయాన్ని బాగా గమనించండీ...
ఈశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు ఒక నిర్ణయం చేశాడు ఈ లోకంలో మనకు సుఖసాధనములైనవి
ఏవి ఉంటాయో వాటిని దేవతలు మనకు అనుగ్రహించవలసి ఉంటుంది. ఆ దేవతలు మనకు అనుగ్రహించడానికి వాళ్ళపట్ల మనము
మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది.
మీరు చూడండీ, ఐహికంగా ఆలోచించినప్పటికీ లోకంలో చూస్తే...
ప్రభుత్వము అని ఒకటి ఉంటుంది. ప్రభుత్వము ఎక్కడ్నుంచి వస్తుందీ, మనం ఎన్నుకున్నదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం
కొన్ని కార్యాలు చెయ్యాలి దానికి డబ్బు ఎక్కడ్నుంచి వస్తూందీ, మీరు కట్టిన పన్నులే... మనం కట్టిన పన్నులే
ప్రభుత్వానికి ఆదాయం. మనం కట్టిన పన్నులతో ప్రభుత్వం మనకి సంక్షేమ కార్యక్రమాలు
చూసినట్లే... మీరిచ్చిన హవిస్సుచేత తృప్తిపొందిన దేవతలు మీకు కాలసినటువంటి ఉపకారం చేస్తారు. ఏమి ఇక్కడ
మీరుపెట్టుకున్న వ్యవస్థమీద మీకున్ననమ్మకం సనాతన ధర్మంలో చెప్పిన దేవతలమీద యజ్ఞ యాగాది క్రతువుల మీదా మీకు ఎందుకుండకూడదూ... విశ్వాసము
ప్రధానము. విశ్వాసమే
ఈశ్వరుడు గురు వాక్యమునందు, శాస్త్ర
వాక్యమునందూ ఆ విశ్వాసము ఉండాలి, యజ్ఞము మీకు మూడు రకములైనటువంటి ప్రయోజనమును అందిస్తుంది యజ్ఞము
వలనవచ్చే ఉపయోగమేమిటంటే
దేవతలు తృప్తిపొందుతారు. ఆయన వర్షం కురిపించాడు ఒక దేవత దానివలన పంటలు పండాయి.
మీరు ఆ పంటను మీరు తినడం కాదు కొంత పంటని అందులో వచ్చినటువంటి పంటలో కొంత భాగాన్ని
పచనం చేసి, ఆ తయారు చేసినటువంటి హవిస్సుని అగ్ని ముఖంగా
మళ్ళీ దేవతలకు ఇస్తాం దేవతలు సంతోషిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే... మనమే పన్నులు
కట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టి నడిపించి దానిచేత మనం పరిపాలన పొందుతున్నట్లే...
మనమిచ్చిన హవిస్సులతో దేవతలు ఆకలి తీరుతుంది. దేవతలు అనుగ్రహించినటువంటి వర్షంతో
మన ఆకలి తీరుతుంది. ఇది ఈశ్వరుడు చేసినటువంటి నియమం దీన్ని అతిక్రమించ కూడదు,
యజ్ఞం ఎవరు చేస్తారో వారికి మూడు ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి యజ్ఞనం జరిగినచోట
దేవతలు తృప్తి పొంది, నీకు కావలసినటువంటి కోర్కెని తీరుస్తారు. నాకొక
కోరిక ఉండిపోయింది,
"కోరికా"
అన్నప్పుడు మీరొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, కోరికా అంటే అర్థం పర్థం లేని కోరిక కాదు. ఏ
కోరిక కోరకుండా మీరు ఉండకూడదో మనుష్య జన్మలో ఏ కోరిక మీకు తీరక పోతే మీ మనుష్య
జన్మ యొక్క ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుందో... అటువంటి కోరిక కొరకు మీరు యజ్ఞం
చేయడం ఎప్పుడూ దోషం కాదు.
|
మనిషికి జన్మతః మూడు ఋణాలు ఉంటాయి పితృ ఋణము, దేవ ఋణము, ఋషి ఋణము. పితృ ఋణం ఏలా తీరుతుంది, తండ్రిగారు నాకు జన్మనిచ్చినట్లే నేను వివాహం
చేసుకొని, నేను కూడా జన్మ నివ్వాలి బిడ్డలకి. నేను ఓ
కొడుకుని కని సచేల స్నానంచేస్తే, నేను తండ్రి గారికి పడినటివంటి ఋణం తీరుతుంది
కాబట్టి నాకు ఇప్పుడు ఋణం తీరాలి. అంటే నేనొక కొడుకుని కనాలి సంతానం కావాలి నాకు
సంతానం కలగకపోతే, నేను ఏవర్నడగవలసి ఉంటుంది, ఏదో ప్రతిబంధకం ఉంది
సంతానం కలగట్లేదు ఇప్పుడు ఆ ప్రతిబంధకాన్ని తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి నాకు
సంతానం ఇవ్వండీ అని నేను ఎవ్వర్ని అడగాలి దేవతల్నే అడగాలి మీకు ప్రభుత్వం
రెండుపన్లు చేస్తుంది, మీరు చూడండీ... ప్రభుత్వం సంక్షేమం చూడడం ఒకటే
కాదు ప్రభుత్వం శిక్ష కూడా వేస్తుంది. ప్రభుత్వమే గ్రంథాలయం కడుతుంది, ప్రభుత్వమే
పాఠశాల కడుతుంది, ప్రభుత్వమే కారాగారాన్ని కూడా నిర్మిస్తుంది, కారాగాలు
బయటివాళ్లెవరూ నిర్వహించరు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఎందుకండీ ఆ కారాగారాలన్నీ
దానిబదులు ఇంకో పాఠశాలపెట్టండని మీరు అనకూడదు. కారాగారం ఉంది కాబట్టి రక్షభట వ్యవస్థ ఉంది కాబట్టి, నేరప్రవృత్తి కలిగినవారివలన ఆపదపొందకుండా, మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగన స్థితి సమాజంలో
ఉంది. శిక్షించడానికి వ్యయం చేస్తుంది. రక్షించి మిమ్మల్ని వృద్దిలోనికి తేవడానికీ
వ్యయం చేస్తుంది ఎవరిని శిక్షిస్తుందో అది దారితప్పిన వాళ్ళని సన్మార్గంలోకి తేవడం
ఒకెత్తు, ఆ శిక్ష వేయడం ద్వారా ఆ మార్గంలోకి వెళ్ళకుండా
క్రమశిక్షణతో ఉన్నవాళ్ళని రక్షించడం ఒకెత్తు, కాబట్టి ఏమండీ మీరు పాఠశాలలే
పెట్టండీ, గ్రంథాలయాలే పెట్టండీ, మీరు జైళ్ళు కట్టకండీ అని మనం అడక్కూడదు.
ఈశ్వరుడు కూడా అంతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, గత జన్మలలో మనం
చేసినటువంటి పాప పుణ్యములు మనకు తెలియకపోవచ్చు. కాని జీవుడు చేసిన పాపాన్ని
చూసేవాడు ఒకడున్నాడు వాడు ఇక్కడే కూర్చుంటాడు, చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు
రాస్తాడు వాడే చిత్రగుప్తుడంటే... వాడన్నీ రాసుకుంటూ ఉంటాడు. వాడికి
తెలియందేముందీ... వాడు దానికి ఫలితమిస్తాడు కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖదుఃఖాయోః నరాణాం పరతంత్రాణం
పుణ్యపాపాను యోగతః అంటాడు వ్యాసుడు దేవీభాగవతంలో. కాల రూపంలో కాలః కలయతాం మహం అంటాడు గీతలో గీతాచార్యుడు, ఆయనే కూడికలు
తీసివేతలు చేస్తుంటాడు ఇదిగో వీడికి గత జన్మలలో చేసుకొన్న పాప నివృత్తి కొరకు
ఇప్పుడీ కష్టాన్ని ఇస్తున్నానంటాడు. అప్పుడు మీరు ఆ కష్టాన్ని అనుభవించవలసిందే, అందుకే మీరు జాగ్రత్తగా గమనించండీ, సనాతన ధర్మంలో మీ పాపానికి ఫలితమివ్వడానికి
మిమ్మల్ని ఏడిపించడానికి ఒకడు, మిమ్మల్ని సుఖపెట్టడానికి ఒకడు, మిమ్మల్ని వాడు పట్టుకొని ఏడిపిస్తుంటే...
వాన్నుంచి విముక్తి పొందడానికి మళ్ళీ భగవతున్ని ప్రార్థించడం ఇలా ఏం ఉండవ్ భయకృత్ భయనాశనః మిమ్మల్ని
ఏవడు భయపెడుతాడో వాడే భయం పోగొడుతాడు మిమ్మల్ని ఏవడు ఏడిపిస్తాడో, వాడే మిమ్మల్ని సంతోషింపజేస్తాడు
రెండిటికి ఒకడే మీ కష్టమొచ్చినా ఈశ్వరుడే, సుఖమిచ్చినా
ఈశ్వరుడే.
|
కాబట్టి నీ వ్యక్తిగతమైన కోరవలసిన కోరిక తీరడానికి మీరు యజ్ఞ, యాగాదులు చేయాలి. యజ్ఞ, యాగాదులు చేయడం వల్ల ఇక్కడ నీ కోరికలు తీరడం
ఒకటి, రెండూ పై లోకములలో స్వర్గలోక ప్రాప్తి దీని
వలనే ఆధారపడి ఉంటుంది. కానీ స్వర్గలోక ప్రాప్తి అన్నది పుణ్యం ఉన్నన్నాళ్ళు
ఉంటుంది. పుణ్యం అయిపోయిందా క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతీ మళ్ళీ కిందబడిపోతాడు. మూడవ ప్రయోజనం ఒకటుంటుంది
అది ఏమిటంటే ʻఇష్టాపూర్తములుʼ అంటారు అంటే తనకు లోపలేం కోరికలేదు, అత్యుత్తమ మార్గమన్నమాట అది, లోపల ఏకోరికా లేదు
ఎందుకు చేస్తున్నావ్? ఏమీ కోరిక లేదు, మరెందు చేస్తున్నావ్... ఈశ్వరుడు నాకు ఇవి
ఇచ్చాడు కాబట్టి నేను ఇది చెయ్యకుండా ఉండలేక చేస్తున్నాను. అలా చెయ్యడం ఏదైతే ఉందో
అటువంటి దానివలన చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధితో కూడినటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము
చేత జ్ఞానము ఆవిర్భవిస్తుంది ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది. కాబట్టి
ఇప్పుడు మూడు ప్రయోజనములను సాధించుకొనుటకు యజ్ఞము, యాగమూ లేదా ఈ ప్రక్రియ మీకు ఆధారభూతమై ఉంది
సనాతన ధర్మంలో. ఇది మీకు ఏ ఇతర విశ్వాసమునందు ఈ యజ్ఞ యాగాది క్రతువులన్నవి కనపడవు, ఇది సనాతన ధర్మము
యొక్క సొత్తు. అలా హవిస్సును ఇవ్వడానికి కావలసినటువంటి మంత్రభాగాన్ని రూపకల్పనచేసి
మనకు అందించినటువంటి ఋషులకు మనం ఋణపడిపోయాము. వాళ్ళా మంత్రము ఇచ్చి ఉండకపోతే, యజ్ఞం చేయ్యడానికి మనకి అవకాశం లేకపోతే ఇవ్వాళ
మనం ఈ సుఖాన్ని పొందలేము. కాబట్టి నేనెప్పుడు ఋషికి అప్పుపడ్డానండీ అని
అడగడానికేంలేదు ఇక్కడ పుట్టుకతో నీకు ఋషి ఋణం ఉంది. అది తీరాలంటే ఏం చేయాలి? ఋషి రచించినది నీవు చదువుకోవాలి. నీకు నాలుగు
మాటలు చెప్పగలిగినటువంటి అదృష్టం ఈశ్వరుడు ఇచ్చి ఉంటే, నాలుగు మాటలు చెప్పాలి.
నేను మీ దగ్గర వంద రూపాయలు తీసుకొని తిరిగి వందరూపాయలు ఇచ్చేస్తే, ఎవ్వరూ దానికేం సత్కారమూ ఏం చెయ్యరుగా, కోటేశ్వరరావు గారు పుచ్చుకున్న బాకీ వందరూపాయలు
తిరిగి ఇచ్చారని సత్కారం చేస్తారా...
|
|
కాబట్టి యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ బ్రహ్మన్- ఓ బ్రహ్మమును తెలిసినవాడా... మహానుభావా వశిష్ట
మహర్షీ, మీరు ఈ యజ్ఞ కార్యాన్ని నిర్వహింపజేయండి యథోక్తం మునిపుఙ్గవ ఉప్తం ఎలా చెప్పబడిందో, ఎలా చెయ్యాలని చెప్పబడిందో అలాగే నిర్వహించండి.
అలాగే నిర్వహించండి అంటే... నేనండీ అది తెప్పించేశాను, నేనండీ ఇది తెప్పించేశాను అని నువ్వు ముందు
చెప్పడం కాదు ఎలా జరగాలో అలా జరిపించండి అని అడగండి. అప్పుడు ఆయనా ఇవన్నీ
తెప్పించాలి అప్పుడు మీరు పిలిచీ, మీ సేవకులనో, మంత్రులనో ఇవన్నీ తెప్పించండి అనాలి. నేను
ఇవన్నీ తెప్పించాను అని మీరెల్లి చెప్పారనుకోండి, అప్పుడు ఆయన ఎందుకింకా... అంటే మాటలో గౌరవం ఒక
స్థానం దగ్గరికెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో శ్రీ రామాయణం బాగా
చదువుకొంటే... మీరు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా తప్పా, మీరు ఇంకోలా మాట్లాడలేరు. కాబట్టి చూడండీ యథోక్తం మునిపుఙ్గవ యథా న విఘ్నః క్రియతే యజ్ఞాఽఙ్గేషు విధీయతామ్ యజ్ఞమునందు అంగములు ఉంటాయ్, ఈ అంగములన్నీ ఏ విజ్ఞమూ రాకుండా జరిపించి నన్ను
కృతార్తుడని చెయ్యవలసింది.
ఏమి? నేనెందుకు చేయించాలి?... నేను తపస్సు చేసుకొంటున్నాను, నేనేదో ప్రశాంతంగా కూర్చుందామనుకుంటున్నాను.
నాకెందుకయ్యా ఇవన్నీ, నీకు బిడ్డలు లేకపోతే ఒక ఆశీర్వచనం చేయించుకో
అనచ్చుగా వశిష్టుడు. అలా వశిష్టుడు అనకుండా ఎందుకురావాలో చెబుతున్నాడు దశరథ
మాహారాజుగారు భవాన్ స్నిగ్ధస్సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాన్
! ఓఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండీ! భగవాన్ స్నిగ్ధః స్నిగ్ధః అంటే ఆ ఇంగ్లీషులో అయితే... bein sticky అంటుకొని ఉంటుందంటారు చూడండి. అంటుకొని ఉండడం
అంటే ఎమిటండి? మనసులో
జ్ఞాపకంలో ఉండడం మహాత్ముల యొక్క మనస్సులో, మహాత్ముల
యొక్క స్మృతిలో మీరు ఉండడం, మీ
అదృష్టమనుకు హేతువు. ఎందుకో తెలుసాండీ... వాళ్ళు పరిచయాలు కోరుకోడానికి దూరంగా ఉంటారు. ఏదో పెద్ద
ఊరికే చాలా మందితో పరిచయాలు పెట్టేసుకొని చాలా మందితో మాట్లాడేసి చాలా మందితో
ఇన్ఫ్లూయన్స అనే దిక్కుమాలిన మాట ఉంటుంది. అలాంటి వాటి కోసం వెంపర్లాట ఉండదు. సర్వతంత్ర స్వతంత్ర అభిరాజధానీ విధ్యనగర
రాజధానీ మీరు విన్నారు ఇప్పుడు గురు స్తోత్రంలో.
సర్వతంత్ర స్వతంత్ర అంటే ఏమిటో తెలుసాండీ... గురువుకు చెల్లుతుంది ఆ మాట. గురువుకి
కూడా అందురు ఒక్క స్థాయిలో ఉండరు సర్వతంత్ర స్వతంత్ర అంటే... మీకు ఒక ఉపకారం
చెయ్యాలి అని అనుకొంటే... మళ్ళీ ఇంకోళ్ళని పిలిచీ ఏమోయ్ ఆయనకి ఓ యాభై రూపాయలు
ఇద్దామనుకుంటున్నాను యాభై అడిగి పుచ్చుకోవడం సర్వత్యంత్ర స్వాత్యంత్రతా కాదు. సర్వత్యంత్ర
స్వాత్యంత్రతా అంటే తను సంకల్పం చేస్తే తనకు తాను సమకూరాలి, ఈశ్వరానుగ్రహముతో ఆయన ఇలా చెయ్యి చాపడు ఆయన ఇలా
అసలు ముట్టుకోడు ఆయన సంకల్పం చేస్తాడు అది వస్తుంది.
|
ముగ్దా మహుర్విదధతీ వదనే మురారేః - ప్రేమ త్రపాప్రణిహితాని గతాగతాని !
మాలా ధృశోర్మధుకరీవ మహూత్పలే యా-సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః !!
దిగ్ఘస్తిభిః కనకకుంభముభావనృష్ఠ స్వర్వాహనీవిమలచారుజలప్లుతాంగీమ్ !
ప్రాతర్నమామి
జగతాం జననీమశేష లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్ !!
ఒక్క స్తోత్రం చేశారంతే... బంగారు ఉశిరికలు
కురిశాయి వారికి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. అలా
ఈశ్వరుడు పాదములుపట్టి ఏదైనా సంకల్పం చెయ్యగలిగిన సమర్థతకి సర్వతంత్ర స్వతంత్ర. వశిష్టుడు
అటువంటివాడు అటువంటి వశిష్టుడు దేనికొరకువచ్చి, మీ కొరకువచ్చి కూర్చుంటాడు.
ఇప్పుడాయన వచ్చి కూర్చున్నాడనుకోండీ... లోపలోటి బయటోటి ఉండదు త్రికరణ శుద్ది, అది జరగాలనే వస్తాడు ఆయన. ఆయన వచ్చాడంటే
అయిపోయిందంతే... ఆ పనైపోయింది కొడుకులు పుట్టేస్తారు ఏమిచ్చి ఋణం తీర్చుకుంటావు
గురువుకి. కాబట్టి ఆయన అంటున్నాడు ఎందుకురావాలో తెలుసా భగవన్ మీరూ... ఒక్కటే కారణం భవాన్ స్నిగ్ధః మీకు మాకు ఒక అనుబంధముంది మీ మనసులో మమ్మల్ని
స్మరిస్తూ ఉంటారు పురోహితులుగా, మా హితం కోరుతారు మా వంశం బాగుండాలని కోరుతారు మా పేరు మీకు జ్ఞాపకంలో ఉంటుంది
ఎప్పుడూ మమ్మల్ని తలుచుకుంటుంటారు అలా మీ మనసులో మేముండడం మా అదృష్టహేతువు ఇంకా
అంతకన్నా ఏం కావాలి అందుకు అడుగుతున్నాను ఆ చెలిమి చేత, ఆ చనువుతో అడుగుతున్నాను భవాన్ స్నిగ్ధస్సుహృన్మహ్యం మీరు గొప్ప సృహత్ మా యందు అపారమైన కృపకలిగినవారు మాకు చాలా
దగ్గరైనటువంటివారు గురుశ్చ పరమో మహాన్ మహాన్ బ్రహ్మమును తెలుసుకొన్నటువంటి అద్భుతమైన
వ్యక్తిత్వమున్నవాడివి. మాకు గురువులు మహానుభావిడివి ఓడవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య జోద్యతః ఈ యజ్ఞ భారాన్ని స్వీకరించి మీరు ఈ యజ్ఞాన్ని
జరిపించాలి కూర్చొని.
|
ఇప్పుడు గుఱ్ఱాన్ని విడిచి పెట్టారు ఇది ఒక సంవత్సరం పాటు దేశమంతటా
తిరుగుతోంది. ఈ గుఱ్ఱం తిరిగినప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపకూడదు ఎవరైనా ఆపారనుకోండి
అప్పుడు వారు యుద్ధానికి పిలిచినట్లు అప్పుడు దశరథ మహారాజు గారు వారిని ఓడించి, ఆ గుఱ్ఱాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. అప్పటి వరకు
గుఱ్ఱం తిరిగి వచ్చేవరకు యాగశాలా ప్రవేశం చెయ్యరు దంపతులు. కానీ ఈ లోపల సంవత్సరం
పాటు కొన్ని కార్యాలు జరుగుతుంటాయి. ఈ దీక్ష జరిగిన దగ్గర్నుంచీ సాంగ్రహ నేష్టీ, ఆ మరునాడు బ్రహ్మవుదన, మేధాశ్వ బంధనా స్నాపనా ప్రోశ్చణా విమోచనాది కృత్యములూ ప్రతిరోజూ సావిత్రాది కర్మలూ, ఇవన్నీ కూడా యజ్ఞంలో అంతర్భాగంగా ఋత్విక్కుల
చేత అనుష్టించబడుతుంటాయి. ఒక సంవత్సరం గడిచిన తరువాత అప్పుడూ యజ్ఞ శాలలోకి దంపతులు
ప్రవేశిస్తారు ఆ గుఱ్ఱం తిరిగి వచ్చేసిన తరువాత. ఈ లోగా యజ్ఞం జరుగుతున్నంత కాలమూ
అన్నదానం జరుగుతుంటుంది. యజ్ఞం జరుగుతున్నంతకాలమూ అన్ని దేశాలనుంచీ అందరూ వస్తూ
ఉంటారు. ఒక యేడాది కాలంపాటు అన్నం పెట్టాడు వచ్చిన వాళ్ళందరికి తతోఽబ్రవీ ద్విజాన్వృద్ధాన్యజ్ఞకర్మసు నిష్ఠితాన్ !
స్థాపత్యే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్పరమధార్మికాన్ !! చెప్తున్నాడు మత్రుల్ని పిలిచి ఆ వశిష్టుడి
సమక్షంలోనే చెప్తున్నాడు.
|
ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలండోయ్! నటీ నటులు అన్నమాట వాడారుగదా రామాయణంలోననీ
నటులూ, నటీమనులూ వేర్వేరు కాదు, అంటే నటుడు భర్త
అనుకోండి నటి భార్యయై ఉంటుంది తప్పా, భార్యా స్థానంలో వేరొక ఆడది వచ్చి నటించడమన్నది ధర్మ విరుద్ధం దాన్ని శాస్త్రం
అంగీకరించదు అంతకన్నా ధూశ్యం ఇంకోటి లేదు. కాబట్టి అసలు వేరొకరి భార్యా స్థానంలోకి
వచ్చి నటన చేయడాన్ని అంగీకరించరు, పురుషుడు స్త్రీ పాత్ర వేయడాన్ని ధర్మశాస్త్రం
అంగీకరించరు పురుషుడు స్త్రీ పాత్ర వేయ్యడు. స్త్రీ పాత్రలోకి పర స్త్రీ వచ్చి
నటించదు కాబట్టి భార్యా భర్తలుగా నటించవలసి వస్తే... దంపతులే నటిస్తారు తప్పా, అన్యులు నటించడాన్ని ఒప్పుకోరు కాబట్టి
నటసంఘములనేవి ఉండేవి అందులో దంపతులే ఉండేవారు వేరే వాళ్ళు ఉండేవారు కాదు ఎప్పుడైనా
దంపతుల పాత్ర పోషించవలసివస్తే అటువంటి సంఘములను తీసుకొని రండి తథా శుచీన్శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్
! యజ్ఞకర్మ సమీహన్తాం భవన్తో రాజశాసనాత్ !! శుచీన్శాస్త్రవిదః శాస్త్రము తెలిసున్నవాడు, తెలిసున్న శాస్త్రమును అనుష్టించేటటువంటి వాడు పురుషాన్ సుబహుశ్రుతాన్ అనేక విషయాలు పెద్దలు దగ్గర విన్నవాళ్ళు, వీళ్ళందర్ని తీసుకురండీ ʻస్రుక్కులు స్రువాలుʼ అని ఉంటాయ్, యజ్ఞంలో నెయ్యి మొదలగు ఆజ్యధార పోయడానికి
ఉపయోగించే పరికరాలు ఈ పరికరాలన్ని తయారుచేసే వారందర్నీ తీసుకురండి.
వీళ్లందరితోపాటుగా ప్రతీ రోజూ సంవృద్ధిగా
అన్నదానం చెయ్యాలి ఎంత అన్నదాం చెయ్యాలో తెలుసా! వచ్చిన వాళ్ళందరూ అన్నం తినాలి.
వచ్చిన వాళ్ళందరూ అన్నం తినడమూ అంటే... పౌరులొస్తారు, జానపదులొస్తారు. పౌరులూ అంటే నగరాలలోనూ పట్టణాలలోనూ
ఉండేవారు కొంచెం డాంభికంగా ఉంటారు. జానపదులు పల్లెటూళ్ళ నుంచి వస్తారు. జానపదులు
అమాయకంగా ఉంటారు, కొంచెం భయం భయంగా ఉంటారు, అమ్మో వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడమే... వాళ్ళతో మనం
కూర్చోవడమే... వాళ్ళతో మనం మాట్లాడడటమే... అని వాళ్ళని చూసి కొంచెం చిన్న
బుచ్చుకొని భయ భక్తులతో పక్కకి పక్కకి జరుగుతూ ఉంటారు. పౌరులూ వస్తారు జానపదులూ
వస్తారు యజ్ఞం చూడడానికి ముందెవరి
వియషయం జాగ్రత్త
తీసుకోవాలో తెలుసా... ఇది ప్రేమంటే, ఆలోచనా అంటే ఇది. ఎంత పెద్దమాట చెప్పాడో చూడండి
దశరథ మహా రాజు గారు తథా జానపదస్యాఽపి జనస్య బహుశోభనమ్ ! దాతవ్యమన్నం
విధివత్సత్కృత్య నతు లీలయా !! మనం జానపదులేగా... అన్నం తింటున్నారుగా, వాళ్ళు చూడడండీ మనలో కొంతమంది ఒక మాట
మాట్లాడుతుంటారు వాళ్ళ భోజనానికి అవన్నీ అక్కర్లేదండీ, ఒక కూరా, పులుసు, పచ్చడీ చాలూ... వాళ్ళు ఏంటంటే
ఎక్కువ అన్నం పులుసువేసుకు తినేస్తారు అంటారు న తు లీలయా దశరథుడు అన్నాడూ... చాలా తేలికగా మాట్లాడకండీ.
|
|
అన్నం పెట్టడం ఎంత అవసరమో, అన్నం ఆదరంగా పెట్టడం అంత అవసరం ఆదరంగా
పెట్టండి పెట్టిన అన్నం, పలకరిస్తూ పెట్టండి, సంవృద్ధిగా పెట్టండి, కడుపునిండా పెట్టండి, ప్రేమతో పెట్టండి. మనం పెడుతున్నాం, వాళ్ళు తింటున్నారని వాళ్ళ మనసు గాయపడి చిన్న
బుచ్చుకొనేటట్లు అన్నం వడ్డించకండి. అలాగే సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువన్తి
సుసత్కృతాః ! న చాఽవజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి !! అనేక వర్ణముల వారు భోజనం చేయడానికి వస్తారు
వాళ్ళందరూ కొన్ని వేల మంది భోజనం చేస్తుంటారు. కామమునకు క్రోధమునకు వశపడీ, ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించేటటువంటి
సన్నివేశములు లేకుండా జాగ్రత్తపడండి కోప్పడ్డం, కేకలేయడం, దెబ్బలాడ్డం ఇలాంటివేవీ జరక్కూడదు. నాకైతే అనిపిస్తుందీ... శ్రీ రామాయణంలో బాల
కాండలో అన్నదానం ఎలా చెయ్యాలో దశరథ మహా రాజు గారు చెప్పినటువంటి ఈ అంశాల్నీ...
పెద్ద పెద్ద దేవస్థానంలో అన్నదానం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళను పిలిచీ...
వాళ్ళకి ఈ పాఠాల్ని చెపితే బాగుండననిపిస్తుంది. టోకెన్లు ఇస్తూ విసుగుకోవడం, వచ్చిన భక్తుల మీద విసుక్కోవడం, ఇంకొంచెం అన్నం పెట్టండంటే విసుక్కోవడం.
నేను అన్ని దేవస్థానంల గురించి మాట్లాడటం లేదు ఎవరు ఈ లోపంతో ఉన్నారో వాళ్ళు
దిద్దుకోవాలి మేము పెడుతున్నాం వాడుతింటున్నాడు కాదు. వాడికిపెట్టే అదృష్టం
మనకుకలిగిందని పెట్టేవాళ్ళని అక్కడపెట్టాలి ఎవడో ఒకన్ని అక్కడ పెట్టామని
పెట్టకూడదు సమర్థతని గుర్తెరిగి పెట్టాలి కాబట్టీ సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువన్తి
సుసత్కృతాః ! న చాఽవజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి !! దీంతో పాటుగా మీరు అనేక మంది రాజులని
ఆహ్వానించాలి ఆహ్వానించేటప్పుడు కొంతమందికి శుభలేఖ పంపించాలి కొంత మందిదగ్గరికి
మీరు వ్యక్తిగతంగా వెళ్ళాలి వెళ్ళి ఆహ్వానించి తీసుకురావాలి. ఎవరిదగ్గరికి
సుమంత్రుడా! నీవు వ్యక్తిగతంగా వెళ్ళి తీసుకురావాలో
తెలుసా... మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమమ్ !
నిష్ఠితం సర్వాశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితమ్ !! కొంత కొంత మందిని మహానుభావుల దగ్గరికి
ఇంటికివెళ్ళి ఆహ్వానించి వెళ్ళాలి అలా ఎందుకు పిలవాలో చెపుతున్నాడు. ఆయనకు
డబ్బులున్నాయి గదా కాబట్టి ఇంటికెళ్ళండని చెప్పడం లేదు మిథిలాధిపతి శూరం మిథిలాధి పతియైనటువంటి జనక చక్రవర్తి ఇంటికి
వెళ్ళి పిలవండి జనకం సత్యవిక్రమమ్ ఆయన రాజ్యానికి వెళ్ళి ఆహ్వానించి
రథమెక్కించుకుని తీసుకురండి నిష్ఠితం సర్వాశాస్త్రేషు అన్ని శాస్త్రములు తెలిసున్నవాడు తథా వేదేషు నిష్ఠితమ్ వేదములయందు నిష్ఠ కలిగినటువంటివాడు తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినమ్ !
వయస్యం రాజసింహస్య స్వయమేవాఽఽనయస్వ హ !! మహానుభావుడైనటువంటివాడు కాశీరాజు ఉన్నాడు స్నిగ్ధం మాకు బాగా స్నేహితుడు కాబట్టి వెళ్ళి ఆయన్ను
దగ్గరుండి తీసుకురండి తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికమ్ ! శ్వశురం
రాజసింహస్య సపుత్రం త్వమిహాఽఽనయ !! అలాగే కేకయ రాజు వృద్ధుడు మాకు మామ గారు ఆ వృద్ధుడైనటువంటి కేకయ
రాజు గారిని పుత్రులతో కలిసి తీసుకురండి రథమెక్కించి.
|
|
ఈలోగా అందరూ వస్తున్నారు, సంభారాలన్నీ వచ్చేశాయ్, యజ్ఞం జరుగుతోంది, సంవత్సరమంతా జరుగవలసిన కార్యక్రమమంతా
జరుగుతోంది. ఒక సంవత్సరం పూర్తైపోయింది యజ్ఞాశ్వం తిరిగి వచ్చేసింది అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ప్రాప్తే తురఙ్గమే !
సరయ్వాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోఽభ్యవర్తత !! సరయూ నదికి ఉత్తర దిక్కున కట్టినటువంటి
యజ్ఞశాలలో ఈ అశ్వమేధ యాగం ప్రారంభమౌతోంది, విడిచి పెట్టినటువంటి గుఱ్ఱం తిరిగి వచ్చింది న చాహుతమభూత్తత్ర స్ఖలితం వాఽపి కిఞ్చన ! దృశ్యతే బ్రహ్మవత్సర్వం
క్షేమయుక్తం హి చక్రిరే !! అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో, ఈ కార్యక్రమం చెయ్యడానికి మనదగ్గర సంభారాలు
లేవనికాని, ఈ కార్యక్రమానికి చెయ్యడానికి తగిన సమర్థులు మన
దగ్గర లేరనికాని, లేకపోతే ఈ కార్యక్రమం చెయ్యకుండా దానికి
బదులుగా ఈ కార్యక్రమం చేద్దామనికాని చెయ్యకుండా, అన్ని కార్యాలూ యధోక్తంగా యధా శాస్త్రంగా ఏ
సంభారాలతో ఎలా నిర్వహించాలో అలాగే ఆ క్రతువంతటినీ నిర్వర్తించారు. అలా
జరిగేటట్టుగా వసిష్టాది మహర్షులు ఆయా స్థానములందు కూర్చొని కార్యక్రమాన్నంతటినీ
నడిపిస్తున్నారు. వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా శాస్త్రములు చదువుకొన్నవారు అందరూ
కూడా గొప్ప ప్రావీణ్యము కలిగినటువంటివాళ్ళు, కొద్దిగా అవకాశం దొరికితేచాలు
శాస్త్రచర్చ చేసుకొంటూ తమ యొక్క అభివృద్ధికి తమకితాము పాటుపడేటటువంటి ఉత్సాహమున్నటువంటివారు
ఇటువంటి వారందరూ వచ్చారు.
ఆ సోమ లతనీ బాగా అరగదీశారు దాట్లోంచి ఆ
వచ్చినటువంటి ద్రవాన్ని ఇంద్రుడికి హవిస్సుగా ఇచ్చారు. ఇంద్రుడు ప్రీతి
పొందేటట్టుగా చక్కగా ఆ కార్యానంతటిని, యజ్ఞాన్నంతటినీ నిర్వహించారు బ్రాహ్మణా భుఞ్ఙతే నిత్యం నాథవన్తశ్చ భుఞ్ఙతే ! తాపసా భుఞ్ఙతే చాఽపి శ్రమణా భుఞ్ఙతేతథా !! శ్లోకాలు మీరు గమనించాలి ఎంతందమో చూడండి బ్రాహ్మణా భుఞ్ఙతే నిత్యం బ్రాహ్మణులు భోజనం చేశారట, ఎంత మంది కొన్ని లక్షల మంది నాథవన్తశ్చ భుఞ్ఙతే అంటే నాధులున్న వాళ్ళు భోంచేశారట, నాధులున్న వాళ్ళు భోజనం చేయడమంటే... దాసులు
ఒకరి దగ్గర పని చేసేటటువంటి సేవకులు కూడా కొన్ని వేలమంది భోజనం చేస్తున్నారు తాపసా భుఞ్ఙతే చాపి తాపసులు కూడా అక్కడి వచ్చి భోజనం చేస్తున్నారు శ్రమణా భుఞ్ఙతేతథా సన్యాసులు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. ఎందుకు ఈ శ్లోకం ఇలా అంటే... ఒకరికి పెట్టేది
భిక్ష, సన్యాసులు చేసేటటువంటిదీ ఒకలా ఉంటుంది, బ్రాహ్మణులు చేసేది ఒకలా ఉంటుంది, నాగరికులందరూ
చేసేది ఒకలా ఉంటుంది, అందర్నీ ఒకచోట కూర్చో పెట్టి వడ్డించడం కుదరదు. ఎందుకంటే ఒక
సన్యాసి తీసుకునేటప్పుడు రుచి గురించి ఆయనకు ప్రమేయం ఉండదు ఆయనకు ఏది పెడితే అది
కేవలం ఆ కడుపునిండడానికి యజ్ఞ ప్రసాదంగా తినివెళ్ళిపోతారాయన.
|
ఇదీ ప్రేమకి పరాకాష్ఠ, ఇలా పెడుతూ ఉంటే ఈ అన్నం తిన్న వాళ్ళ గురించి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయన గారు ఎంత దర్శనం చేశారో
గానీ... మహానుభావుడు బాల కాండ రచన చేస్తూ... ఒక మాటన్నారు ఆయన చెయ్యి అడ్డు పెడితే
ఆపేవాడు లేడు వడ్డణ అయ్యా ఇంకొద్దండీ బూరె అంటే ఈ పక్కనుచి వేసేస్తున్నాడు. చెయ్యి
అడ్డుపెడితే ఆపరు వాళ్ళుకి ఏమనిపించిందట అంటే... చెయ్యి అడ్డుపెడితే ఆపరుకానీ, ఉన్న పదార్థాలు తినెయ్యాలంటే మన వీపు అడ్డు
పెడితే ఉపయోగమౌతుందని చెప్పి, ఒంగి వీపు అడ్డు పెట్టి ఉన్నది తినెయ్యాలనుకున్నారట. వీపు అడ్డు పెడదామంటే, ఆ పదార్థాల రుచికి కడుపు నిండిపోయి, కడుపు వీపు వంగట్లేదట. కాబట్టి వాళ్ళు పెట్టడం
వీళ్ళు తినటం వినామార్గంలేదన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎంత గొప్ప పద్య రచన
చేశారో తెలుసాండి ఆయన ఏమి అనుభవించారండీ మహానుభావుడు ఇపుడె గుండిగ దింపి యిగురబెట్టితి బొడి బొడి
పొళ్ళాడు నీ యన్నము దినుండు తెలుగులో ఉన్నటువంటి ఈ చక్కటి మాట పొడి పొడిలాడుతున్న అన్నం తినండి ఎంత బాగుందో... ముద్దైపోయింది అన్నం అంటారు.
మనవాళ్ళు చూడడండీ ఒక మాట అంటూంటారు తెలుగులో కందిగుండా వేశారు గానియండీ
ఎంతబాగుండేదో అన్నం ముద్దైపోయింది సుమా! దాని రుచు తెలియలేదూ అంటారు ఇప్పుడే గుండిగ తింపాం పొడపొడలాడుతుంది అన్నం ఎంత బాగుందో వేడుంది
తినండి తినండీ... అని పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు పూర్ణమ్ము లేకుండఁ బునుకులుగా వేసితిమి
కరకరలాడు తినుఁడు విశ్వనాథ గారి కల్పవృక్షమండీ. బూరె పూర్ణం
పెడితే ఒక లక్షణం ఉంటుంది. మూడు బూర్లులు తిన్నారనుకోండీ ఇంకా దాంట్లోకి నెయ్యి
వేసుకు తినాలి, తింటే దాహం వేసేస్తుంది దాహమేస్తే రెండు గ్లాసులు మంచి నీరు
తాగేస్తాం కడుపు నిండిపోతుంది. తినాలని ఉంటుంది కాని పొట్టకు ఒక పరిమితి ఒకటి
ఉంటుందిగా... అందుకని తినలేరు అందుకని వారు అంటున్నారంటా... ఆ బాధ లేదు పూర్ణం
లేకుండా కరకరలాడేటట్లుగా వేశాము ఇవిగో.
ఇది తెలుగు మాట స్వచ్ఛమైన తెలుగు మాట వేపుడు కరకరలాడుతోంది అంటాము జంతికలు
కరకలాడుతున్నాయంటాము ఆమాటే వేశారాయన పుర్ణం లేని బూరెలు వేశాం చిల్లెలు అంటారు
మనవాళ్ళు ఆయన అదే మాట వాడారు, బునుకులు బునుకులని పూర్ణమ్ము లేకుండఁ బునుకులుగా వేసితిమి
కరకరలాడు తినుఁడు కరకరలాడుతున్నాయి తిన్నండర్రా... మళ్ళీ
కాసేపాగితే ఆ కరకర పోతుంది. చల్లబడి మెత్తబడి పోతాయి తినండి అని వేసేస్తున్నారట
విస్తట్లో వాని గాలుచు నున్నది కాఁబోలు క్షీరాన్నమిదె దొన్నెలను
దెచ్చియిత్తు నుండుఁడి క్షీరాన్నం ముట్టుకుంటే కాలుతొందేమో ఇదిగో
దొన్నెలలో పెట్టి పట్టుకొస్తున్నాను తినండి జలువ చేయునుగండి బతిమాలి బతిమాలి యవనినాథ
సుదకులు కొల్లలుగఁ దెచ్చి చూఱయూయ ఇది గడ్డపెరుఁగు మీ రింక గొంచెము వేసికొనవలె గడ్డ పెరుగు ఈ మాట చాలా గట్టి మాట. మనం పెరుగు
వేసుకోవడం కన్నా గడ్డ పెరుగు వేసుకోవడం చాలా సంతోషం నాతో ఓ స్నేహితుడు కాశీ
వచ్చాడు. అందరూ విశ్వనాథుడు దేవాలయానికి ఎప్పుడు వెళదామంటే... ఆవులది గడ్డ పెరుగు
దొరుగుతుందట ఎక్కడ ఎక్కడ అని తిరిగాడాయన. అలా గడ్డ పెరుగు బాగా గడ్డ గట్టి ఉంటే
మనకు చాలా సంతోషం. ఇది గడ్డ పెరుగు తినండి వేడి చేస్తుందేమో... చలవ చేస్తుంది
ఇదిగో ఈ చారు పోసుకోండి. ఇదిగో వేడి చేస్తుంది. ఈ మజ్జిగ పులుసు పోసుకోండి. అని
తీసుకొచ్చి విస్తట్లో వేసేస్తున్నారన్నీను.
ఆయనేదో దోసావకాయ బాగుందని ఇంత తిన్నారనుకోండి
ఏమండోయ్ దోసావకాయ తిన్నారు వేడి చేస్తుంది పోసుకోండి కాస్త పులుసు పోసేస్తున్నారు.
వాళ్ళే వేడిచేసేవి వాళ్ళే చలవచేసేవి వాళ్ళే వైద్యంచేసేవి కూడా
పోసేస్తున్నారు విస్తట్లో, ఆ ప్రేమకి వాళ్ళు తినేసేసి అన్నమున నాదరంబునఁ దిన్న కడుపు లెన్న నెడఁదలు
నుబ్బిపోయెదరు జనులు కడుపుకి అన్నం తిన్నారటా, గుండెలకు ఆదరనా తిన్నారటా... గుండెలు ఆదరణతో నిండిపోయాయి కడుపులు అన్నంతో నిండిపోయాయి ఈ రెండు
నిండిపోతే వాళ్ళు లేచినిలబడీ పొంగిపోయీ... ఎంత ప్రేమతో పెట్టావయ్యా ఆయుశ్మాన్ భవా అని నీ కోరిక తీరుతుంది అన్నారు ఇంత మంది ఆశీర్వచనం చేస్తే దశరథ మహారాజు గారు
చిన్న బుచ్చుకున్నారట. ఏమిటో ఇన్ని లక్షల మందే తిన్నారు ఇంకా చాలా మంది రావాలి, రాలేదండీ.... అన్నాడట ఆయన ఆయనకి తృప్తి లేదట.
అంతేగాని ఎన్ని బియ్యము అయిపోయాయి, మళ్ళీ ఎసరెట్టాలా... ఏంటి ఇంత మంది వచ్చేశారు
పిలవకుండా... అనలేదు అంత మంది తింటే ఎంత ఆనందించాలో ఎంత మంది తిన్నా... తృప్తిలేని
తనం పెట్టడంలో ఎలా ఉండాలో రామాయణం మనకు నేర్పుతుంది అన్న కూటాశ్చ బహవో దృశ్యన్తే పర్వతోపమాః !
దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా !! అన్నం వండి పోసినటువంటివీ అన్న పర్వతాల్లా
ఉన్నాయట, ఆతంతంత అన్నపు రాశులు పోసేశారట. ఆ రాశుల్లోకి తీసుకెళ్ళి గబగబా బుట్టలు
నింపి తీసుకొచ్చి వడ్డన చేసేస్తున్నారు. మా అనుమత్ శాస్త్రిగారికి సంతోషము అలా
వడ్డణ చేసేయ్ మంటే... అన్నం హి విధివత్సాధు ప్రశంసన్తి ద్విజర్షభాః ! అహో తృప్తాః స్మ భద్రం ఇతి శుశ్రావ రాఘవః !! ఆ భోజనం చేసి బయటికి వచ్చినటువంటి వృద్ధులు, బ్రహ్మణులు, దాసులూ, సర్వ వర్ణముల వాళ్ళూ, స్త్రీలు, వ్యాధి గ్రస్తులు, పిల్లలూ అందరూ కూడా అంటున్నారటా...
అబ్బబ్బభ్భా... ఏమి భోజనం పెట్టారండీ ఎంత గొప్ప భోజనమండీ పరమేశ్వరుడు కడుపుకో
పరిమితి పెట్టి ఎంత దోశం చేసేశారండీ... ఎంత గొప్పగా ఉందండీ భోజనము... అని నాయనా
ఇంత గొప్ప భోజనం పెట్టావురా... ఆయుశ్మాన్ భవ నీ కోరిక తీరాలి సంకల్పసిద్ధిరస్తూ అంటున్నారట ఇంత మంది ఇంత పొంగి పోయ్యేటట్టుగా
అన్నం పెట్టడానికి వారసులైన జాతి మనది.
|
ఏమిటి అన్నం పెట్టడం అంటే ఎవడి పళ్ళెం వాడు పట్టుకొని భవతి భిక్షాందేహి అని ఒక టేబుల్ దగ్గరకి వెళితే ఆ టెబుల్ దగ్గర
బూట్లేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు, వాడు సవ్యసాచిలా రెండు
చెతులతోటీ, ఒక చేత్తో ఇంత అన్నం, ఈ చేత్తో ఇంత పప్పూ, పచ్చి ఉల్లిపాయలతో కాస్త పెరుగూ, ఓ ఇంత కూర మీరు వెళ్ళి అడుక్కోవాలి. అయ్యా
నాకింత ఆ అప్పడం వేయ్యండీ అనీ... ఆ తరువాత మీరు ఇలా నిలబడితే... బిక్కు బిక్కుమంటూ
నిలుచోవాలి ఎందుకంటే. ఎవడు ఇటునుంచి వచ్చి మీ చేతినికొడతాడో తెలియదు. మళ్ళీ
దాహమేసిందనుకోండి, ఉల్లిపొరకల్లాంటి గ్లాస్సుల్లో నీళ్ళు ఉంటాయి, మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నీళ్ళు కిందపడిపోతాయ్...
మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడపెట్టాలో తెలియదు. వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో
తెలియదు. మళ్ళీ మీకు వెక్కిల్లోస్తే... ఎవర్నడగాలో తెలియదు. మీరు ఇది తిన్నారా...
ఇది బాగుందా అని ఎవ్వరూ అడగరు. అనాధశరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు పెడితున్నారనేటప్పటికి
వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి. సామంతులు పట్టం గట్టినప్పుడు వెళ్ళి
రసీదులు పుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే... మీ పేరు రాసుకొని మీ రిచ్చిన
కవరు తీసుకుంటారు. ఎంతిచ్చారని అడుగుతారు మూడొందల యాభై ఇచ్చానండీ అంటే కవరు తీసి
ఆయన లెక్క పెట్టుకుంటాడు ఎందుకంటే మీరు 350 అని 116లు పెడితే... ఆ ఇచ్చినాయన
కట్టుకోవాలి. ఆయన తినేశాడనుకుంటారు అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు 350ని 350 అని
వేసుకుని మీ పేరు రాసుకుంటాడు రశీదు ఇవ్వట్లేదు అదో అదృష్టం. ఇది ఇవ్వాళ మనం చేసేటటువంటి
వివాహం ఇది ఇవ్వాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం ఇది మనం పెట్టేటటువంటి అన్నం. ఎంత
ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో... ఎటువంటి రామాయణానికి మనం వారసులమో... గుండెలు
మీద చెయ్యేసుకు చెప్పండీ... వచ్చిన వాళ్ళని క్రింద కూర్చోబెట్టి అన్నం పెట్టడానికి
ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా, లేము. మనం పెట్టగలం.
మనం ఆ పెట్టడానికి ఆ సంకల్పం లేదు అంతే... శుభ లేక మీరు యధావిధిగా ఎలా వేశారో
అలాగే మదర్పిత చందన తాబూలాది అన్నప్పుడు ఒక నలుగురుని పెట్టి శుమూర్తమునకు
ముందు చేతికి గంధం రాయించడం కష్టమా, మనం చెయ్యం అంతే
కార్డులో ఉంటుంది. మనం చెయ్యం అంటే... నిష్ఠ లేదు, శ్రద్ధ లేదు శ్రద్ధకి
పరాకాష్ట శ్రీ రామాయణం, రామాయణానికి వారసులం అన్నవాళ్ళం, ఏ కార్యక్రం చేసినా ఎంత శ్రద్ధగా చెయ్యవలసి
ఉంటుందో మనం చూసుకోవాలి.
|
ఇష్టకాశ్చ యథాన్యాయం కారితాశ్చ ప్రమాణతః ! చితోఽగ్నిర్బ్రాహ్మణైస్తత్ర
కుశలైశ్శుల్బకర్మణి !!
సచిత్యో రాజసింహస్య సఞ్చితః కుశలైర్ద్విజైః ! గరుడో రుక్మపక్షో వై
త్రిగుణోష్టాదశాత్మకః !!
నియుక్తాస్తత్ర పశవస్తత్తదుద్దిశ్య దైవతమ్ ! ఉరగాః పక్షిణశ్చైవ
యథాశాస్త్రం ప్రజోదితాః !!
అక్కడా దశరథ మహారాజు
గారు ఆరాధన చేసేటటువంటి అగ్ని గుండం పెట్టడం కోసమని ఒక వేదిని నిర్మాణం చేశారు.
అది గరుత్మంతుడూ భూమి మీదకి దిగుతున్నప్పుడు శిరస్సు కిందకి వంచి రెక్కలు ఇలా
పైకెత్తి తోక నిఠారుగా పెడితే ఎలా ఉంటుందో అలా అటువంటి ఆకృతి వచ్చేటట్టుగా బంగారు
ఇటుకలతో నిర్మాణం చేశారు. దాని మీద దశరథ మహారాజు గారి యొక్క అగ్ని గుండాన్ని
ఉంచారు. శుక్లయజుర్వైదానికి చెందినటువంటి వాడు కనుక, అటువంటి వేదికని
నిర్మాణం చేసి అటువంటి అగ్ని గుండాన్ని ఉంచారు.
|
అప్పుడు మహారాజు ఏం
చేయాలి అంటే తన భార్యలని దానం చేసేయ్యాలి ఋత్వికులకి వారు రాజు భార్యల్ని
స్వీకరించరు కనుక దానమిచ్చి మళ్ళీ తతుల్యమైన ధనం కొంత ఇచ్చి తన భార్యల్ని తను
మళ్ళీ పుచ్చేసుకుంటాడు. కాబట్టీ ఈ కార్యక్రమాన్ని అంతటనీ కూడా దశరథ మహారాజుగారు
పూర్తిచేశారు ఇలా అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు. ఇంత గొప్ప హోమాన్ని, ఇంత గొప్ప యజ్ఞాన్ని, ఇంత గొప్ప మంత్ర భాగాన్ని అనుషంగికమైన
క్రతువుల్నీ ఇన్నిటినీ యథా శాస్త్రంగా నిర్వహించినందుకు సంతోషించి ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధనః ! అధ్వర్యవే ప్రతీచీం తు
బ్రహ్మణే దక్షిణాం దిశమ్ ! ! ఉద్గాత్రే చ తథోదీచీం దక్షిణైషా వినిర్మితా ! అశ్వమేధే మహాయజ్ఞే
స్వయంభూవిహితే పురా !! అంతయజ్ఞమూ పూర్తై
పోయింతర్వాత తన వంశాభి వృద్ధి కొరకు ఇంత గొప్ప యజ్ఞం చేశాడు గనుక, ఇంత గొప్ప యజ్ఞం చేసినటువంటి "హోతా" అనే బడేటటువంటి ఋత్విక్కుకి తన సామ్రాజ్యాం
తూర్పు దిక్కు నంతటిని ధార పోసేశాడు. అలాగే "ఆధర్వవూ" అనే బడేటటువంటి ఋత్విక్కుకి పడమర ఉన్న
రాజ్యాన్నంతటినీ ధార పోసేశాడు. బ్రహ్మ స్థానంలో కూర్చున్నటువంటి ఋత్విక్కికి దక్షిణాన్న
ఉన్న భూమినినంతటినీ దానం చేశాడు. "ఉద్గాత" అనే ఋత్విక్కికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి భూమి
నంతటినీ దానం చేశాడు. ఇంత గొప్ప దానం చెయ్యగలిగితేనే అశ్వమేధ యాగం చెయ్యాలని
స్వయంగా సృష్టి చేసిన చతుర్ముఖ బ్రహ్మగారు నియమనం చేశారు.
|
దానం చేసి దరిద్రాయ ద్విజాయాథ
హస్తాఽఽభరణముత్తమమ్ ! కస్మైచిద్యాచమానాయ దదౌ
రాఘవనన్దనః !! ఆ దానమంతా చేసేశాడూ... దగ్గరవున్న బంగారు
నాణ్యాలు, వెండి నాణ్యాలు, గోవులు అన్నీ ఇచ్చేశాడు. అప్పుడు ఒక దరిద్ర బ్రహ్మణుడు వచ్చాడు వచ్చి మహారాజా
నాకేమైనా దానం ఇప్పించండీ అన్నాడు చూశాడు పళ్ళాల వంక, అప్పటికే అన్ని దానమిచ్చేశాడు వెంటనే పరమ
ప్రీతితో నా అదృష్టం కొద్దీ వచ్చారని తన చేతికున్న కడియాన్ని దానంచేసేశాడు. అంతటి
భక్తి కలిగినవాడు అంతటి బ్రాహ్మణ భక్తి, అంతటి వైదిక నిష్టా, అంతటి వేదమునందు నమ్మకమూ కలిగినటువంటి మహానుభావుడు
దశరథ మహారాజంటే.
అప్పుడు ఋష్యశృంగుడి
వంక తిరిగి ఒక మాట అన్నాడు తతోఽబ్రవీదృశ్యశృఙ్గం రాజా దశరథస్తదా !
కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి సువ్రత !! నాతో మీరు ఇప్పటిదాకా
అశ్వమేధ యాగాన్ని చేయించి పూర్తి చేయించారు ఇప్పుడు నాకు సంతానం కలగడానికి ప్రతిబంధకమైనటువంటి
పాపము నశించినది ఇప్పుడు సంతానం కలగడం కొరకు మీరు ఏ ఇష్టి చేయిస్తే బాగుంటుందో ఆ
ఇస్టిని నాచేతచేయించవలసిందీ అని అడిగాడు తథేతి చ స రాజానమువాచ
ద్విజసత్తమః ! భవిష్యన్తి సుతా
రాజంశ్చత్వారస్తే కులోద్వహాః !! ఋష్యశృంగ మహర్షి అన్నారూ... అశ్వమేధం చేశావు.
ఇష్టి చేస్తానంటున్నావు, తప్పకుండా నీ చేత ఇష్టి చేయిస్తాను. కాని దశరథా
నీకు ఇదే చెప్తున్నాను నీకు తప్పకుండా పరమ ధర్మాతులైనటువంటి వారు, నీ వంశ కీర్తిని ఇనుమడింపజేసేటటువంటి వాళ్ళు, మహా పురుషులైనటువంటి వాళ్ళు నలుగురు కుమారులు
నీకు జన్మిస్తారు అన్నాడట. ఋష్యశృంగ మహర్షి ఆశీర్వచనం అంటే ఉత్తిగనే పోతుందాండీ...
ఇప్పుడు నీవు ఏ ఇష్టి చెయ్యాలో నేను ఆలోచించి నిర్ణయం చేశాను, ఈ ఇష్టి నీవు చేయవలసిందీ అని చెప్పి, ఆ ఇష్టిని సంకల్పం చేయించి, దాన్ని చేయిస్తున్నారు. అందులో ఆయన అంటారూ... ఇష్టిం తేఽహం కరిష్యామి పుత్రీయాం
పుత్రకారణాత్ ! అథర్వశిరసి
ప్రోక్తైర్మన్త్రైస్పిద్ధాం విధానతః !! అధర్వ శిరస్సు అనబడేదాంట్లో చెప్పబడినటువంటి
ఇష్టిని నేను నీతో చేయిస్తాను ఆ ఇష్టిని చేయవలసింది.
ఇష్టి అంటే అది కూడ ఒక హోమం లాంటి కార్యక్రమం అది కూడ ఒక యాగంలో అంతర్భాగం, ఒక యాగం.
|
|
అఖిలాండేశ్వరి అమ్మవారు ఉంది
జంబుకేశ్వరంలో, అమ్మగారి
వారియొక్క స్వరూపంలో ఉన్న తేజస్సు ముందు నిలబడలేకపోయాడు. ఇప్పటికీ అర్చకులు అక్కడ
మధ్యాహ్నం అమ్మవారికి నివేదన చెయ్యాలంటే చీరలుకట్టుకొని వెళ్ళాలి, ఆడవారిగా
అలంకారం చేసుకొని లోపలికెల్లి నైవేద్యం పెడుతారు. కాబట్టి ఇప్పుడు
అమ్మవారిలో ఉన్న అదనపు తేజస్సుని, అదనపు తేజస్సు అంటే మనం
భరించలేని తేజస్సునీ, శంకరులు తీసేశారు. తీసేసి అమ్మవారి వజ్ర
తాటంకంలోకి పెట్టి ఆ తాటంకములను పొదిగారు అమ్మవారికి. అలాగే కంచిలో కామాక్షి
అమ్మవారి తేజస్సునితీసి పృథ్విలో శ్రీచక్రం వేసి, శ్రీచక్రంలోకి
ప్రవేశపెట్టారు. అందుకే
శంకరభగవత్ పాదులు ఈ జాతికి చేసినటువంటి ఉపకారం న
భూతో న భవిష్యతే... ఇక ఎవ్వరూ చెయ్యలేరు అంతటి మహాత్ముడు
శంకరభగవత్ పాదులంటే, ఆయన పేరుస్మరిస్తేచాలు
పాపరాశి దగ్ధమౌతుంది, అంతటి
మహానుభావుడు. కాబట్టీ... ఈ రోజులలోవచ్చి హవిస్సు
స్వీకరిస్తున్నటువంటి దేవతలూ నీకంటికి కనపడరు ఎందుకు కనపడరు అంటే... నీ కంటికి
వారుకనపడితే నీకు తట్టుకోగలిగినశక్తి నీకులేదు. మీరు చూడగలిగినటువంటి ఉపాసన బలం
మీకుంటే... మీకు ఆ దేవతలు కనబడుతారు అలాచూసిన మహాపురుషులు ఉన్నారు. అలాచూసి ఫలానా
ఫలానా దేవతలు వచ్చారు, వారువచ్చీ తిరుగుతున్నారు అని దర్శనం
చేసినటువంటివారు ఉన్నారు. కనుకా... తతో
దేవాస్సగన్ధర్వాస్సిద్ధాశ్చ పరమర్షయః ! భాగప్రతిగ్రహాఽర్థం వై సమవేతా యథావిధి !! ఆనాడు దశరథుడు ఇష్టి
చేస్తుంటే... పుత్రకామేష్టి దానిపేరు. కొడుకుల కొరకు చేసిన ఇష్టి కాబట్టి, ఆ యజ్ఞంలో అవిస్సును పుచ్చుకోవడానికి
వచ్చినటువంటి దేవతలందరూ కూడా, ఇప్పుడు మీరు ఉపన్యాసం
వినడానికివచ్చి ఎలాకూర్చున్నారో... అలా వాళ్ళందరూ నన్ను పిలిచినప్పుడు వెళ్ళి హవిస్సును
పుచ్చుకుందామని వాళ్ళందరు అక్కడ సభలో కూర్చున్నారు.
|
అయ్యా!, భగవస్త్వత్ప్రసాదేన రావణో నామ రాక్షసః ! సర్వాన్నో బాధతే
వీర్యాచ్ఛాసితుం తం న శక్నుమః !! మీరు వరాలిచ్చేశారు రావణాసురుడికి, ఇప్పుడాయనకి అద్దూ అదుపూ లేదు, అందర్నీ బాధపెట్టేస్తున్నాడు. ఎంత బాధపెడుతున్నాడో
తెలుసా... ఒకరో ఇద్దరో కాదు, అందరూ ఒక్కొక్కరూ లేచి
ఆ బాధలన్నీ చెప్తున్నారు ఋషీన్యక్షాన్సగన్ధర్వా
నసురాన్బ్రాహ్మణాంస్తథా ! అతిక్రామతి దుర్థర్షో వరదానేన మోహితః !! ఋషుల్నీ, యక్షుల్ని, గధర్వుల్ని, అసురుల్నీ, బ్రాహ్మణుల్ని అందర్నీ
బాధ పెట్టేస్తున్నాడు. ఎందుకు బాధపెట్టేస్తున్నాడూ అంటే ఒక్కటే కారణం వరదానేన మోహితః మీరు వరమిచ్చారు. నీకు వాడివల్ల చావులేదు
వీడివల్ల చావులేదు, వాడివల్ల చావులేదని వరమిచ్చేశారూ, వాళ్ళెవ్వరూ చంపలేరూ... చంపలేరు కాబట్టి ఆయనకు
అహంకారమొచ్చేసింది. అహంకారమొచ్చేసింది కాబట్టి అందర్నీ బాధించేస్తున్నాడు నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః ! చలోర్మిమాలీ తం
దృష్ట్వా సముద్రోఽపి న కమ్పతే !! మా సంగతి అలా వదిలి
పెట్టండి... చాలా ధారుణమైన విషయం ఏమిటో తెలుసా... సృష్టిని
తారుమారు చేస్తున్నాడు, సృష్టిని తల క్రిందుల చేశాడు. ఏది జరగ కూడదో
అది జరుగుతోంది ఈశ్వరుడు తప్పా ఇతరులు ఎవరిని శాసించకూడదో, ఆ శాశనము ఇవ్వాల రావణునుడు చేస్తున్నాడు ఏం
చేస్తున్నాడు నైనం సూర్యః సూర్యుడు ప్రకాశించకూడదు.
|
అవ్రురా నాయనా నిజమే, వరాలు ఇచ్చేశాను మీరందరూ చాలా బాధపడిపోతున్నారు, నేనూ వింటున్నాను ఆ విషయం, చాలా బాధపెట్టేస్తున్నాడు గంధర్వుల్ని, యక్షుల్ని, ఋషుల్ని, కిన్నెర్లుల్నీ, కింపురుషుల్ని, నాగులుల్నీ వాడు విడిచిపెట్టింది ఎవ్వర్నీలేదు
అందర్నీ బాధపెడుతున్నాడు. నిజమే ఎవ్వరిచేత మరణం ఉండకూడదని అడిగాడు, మరీ తపస్సుచేసేశాడు వరమిచ్చేశాను ఆరోజున. ఆ
నాకొక విషయం జ్ఞాపం వచ్చేసిందిరా... అబ్బాయ్ అన్నాడు అకస్మాత్తుగా... అనగానే
హమ్మయ్యా, ఏదో ఇప్పుడు చెప్తాడన్నమాట ఏదో చచ్చిపోయ్యే
మార్గం ఆయన చచ్చిపోయ్యే మార్గం ఈయన చెప్తాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి పురాణాలలో
ఉన్న పాత్ర ఏమిటో తెలుసాండీ... ఆయన ఎప్పుడూ కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటివాడు. ఒక
ఫ్యామస్ ఫిజిషియన్ ఉన్నాడనుకోండీ... ముందసలు రోగం ఏమిటో తెలియకపోతే ఆయన దగ్గరకు
వెళతాము ఆయనేం చేస్తారంటే సర్జన్ కో, ఆర్థి పిడిషియన్ కో ఆయన
రిఫర్ చేస్తారు. అలా ముందందరూ ఎవరి దగ్గరి వెళుతారంటే బ్రహ్మగారి దగ్గరికి
వెళుతారు ఆయన మార్గం చెప్పాక ఆయన దగ్గరి వెడుతుంటారు అందుకనీ బ్రహ్మగారిని
స్తోత్రం చేశారు చేసి ఆయనన్నారు నిజమే, నిజమే, ఆఁ... నాకో విషయం గుర్తొంచిందిరా అబ్బాయ్, వాడు అడగని వాళ్ళలలో ఒకరున్నారు వాళ్ళువస్తే
మాత్రం ఆయన చచ్చిపోతాడన్నారు. ఎక్కడంటున్నారు ఈ మాటలు దశరథ మహారాజు గారు యజ్ఞం
జరుగుతున్నటువంటి సభలో కూర్చున్నారు వీళ్ళందరూ, ఇప్పుడు అక్కడ
ఎవరుంటారు వీళ్ళంటే దేవతలు కానీ, మిగిలిన వారందరు ఎవరు? మనుష్యులు, మనుష్యులున్నారక్కడ. అక్కడ ఆయన అన్నారూ... నకీర్తయదవజ్ఞానాత్తద్రక్షో మానుషాన్ ప్రతి ! తస్మాత్స మానుషాద్వధ్యో
మృత్యుర్నాఽన్యోస్య విద్యతే !! అనాదరముచేత మనుష్యులను ఎందుకు అడగలేదంటే మరిచిపోయికాదు యక్ష, గధర్వ, కిన్నెర, కింపురుషాది అందర్నీ అడిగాడు. ఆరోజున నేను వారి
చేతులో చచ్చిపోనని, కాని మనుష్యులపేరు మాత్రం ఆయన ఎత్తలేదు ఎందుకో
తెలుసా మనుష్యుల విషయం మరిచిపోయికాదు అనాదరముచేత ఇంతమంది చేయలేనిది
దిక్కుమాల్నోళ్ళు మనుషులేం చేస్తారండీ... అని అది.
|
బ్రాహ్మణా చ సమాగమ్య తత్ర తస్థౌ సమాహితః ! తమబ్రువస్సురాస్సర్వే
సమభిష్టూయ సన్నతాః !!
త్వాన్నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా ! రాఙ్ఞో దశరథస్య
త్వమయోధ్యాఽధిపతేః ప్రభోః !!
ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షిసమతేజసః ! తస్య భార్యాసు తిసృషు
హ్రీశ్రీకీర్త్యుపమాసు చ !!
విష్ణో పుత్రత్వమాగచ్ఛ కృత్వాఽఽత్మానం చతుర్విధమ్ !
|
|
స హి దేవాంశ్చ గన్ధర్వాన్సిద్ధాంశ్చ
మునిసత్తమాన్ ! రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన
బాధతే !!
ఋషయశ్చ తతస్తేన గన్ధర్వాఽప్సరసస్తథా ! క్రీడన్తో నన్దనవనే
క్రూరేణ కిల హింసితాః !!
వధాఽర్థం వయమాఽఽయాతాస్తస్య వై
మునిభిస్సహ ! సిద్ధగన్ధర్వయక్షాశ్చ
తతస్త్వాం శరణం గతాః !!
అక్కడ ఉన్నటువంటి దేవతలూ, ఋషులూ అందరూకూడా ఆయనకి
సాష్టాంగ నమస్కారంచేసి, శరణాగతిచేస్తూ ఒకమాట చెప్పారు, మహానుభావా నీవు
లోకరక్షకుడవు మాకు ఎప్పుడెప్పుడు ఆపదకలిగితే అప్పుడప్పుడు అవతారమును స్వీకరించి
మమ్మల్ని కాపాడుతుంటావు. నీవు మనుష్యుడుగా ఈలోకంలో అవతరించాలి, మహానుభావుడు రాజర్షీ, వేదమును నమ్మినటువంటివాడు, తేజస్సు కలిగినటువంటివాడు, అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ
మహారాజుగారు కొడుకులుపుట్టాలన్న కోరికతో పుత్రకామేష్టి చేయ్యబోతున్నాడు. ఆయన
కడుపున అక్కడ ఉన్నటువంటి ఆయన ముగ్గురు భార్యలున్నరే హ్రీ శ్రీ కీర్తి ఎలాంటివారో
దక్షప్రజాపతియొక్క కుమార్తెలు అటువంటివాళ్ళు కౌశల్యా, సుమిత్రా, కైకెయి వాళ్ళ
ముగ్గురికడుపునా నీవు మనుష్యులుగా జన్మించాలి, జన్మించి రావణాసురున్ని
సంహరించాలి. అప్సరసలూ దేవతలూ ఎవ్వరూ ఇవ్వాళ నందనవనంలో స్వేచ్ఛగా విహరించడానికికూడా
స్వాత్యంత్రం లేనటువంటిస్థితి ఈ కష్టంనుంచి మమ్మల్ని ఉద్ధరించాలి కాబట్టి మీరు
అవతారాన్ని స్వీకరించవలసిందీ అని ప్రార్థనచేశారు.
మీరు ఒకటి బాగా జ్ఞాపకంపెట్టుకోండీ... అవతారం స్వీకరించి
చంపేయ్యండీ అని అడిగితే ఈశ్వరుడేమి అలావచ్చేయడు, ఆయన కొన్నికారణాలు చెప్తాడు ఈ
కారణాలు ఉంటేమాత్రం నేనుచంపుతాను అని చెప్తాడు. ఎందుకో తెలుసాండీ...? ఇలా
చంపడంకూడా ధర్మమునందు అంతర్భాగము. ఒక వైద్యుడున్నాడనుకోండీ ఒక వ్రణంపుట్టింది, ఒక పుండు. ఇప్పుడు ఆపుండుని వైద్యుడు
కోసేస్తాడు వైద్యుడు పుండు కోసేశాడుకదానిచెప్పి, ఇప్పుడాయన మిమ్మల్ని
చాలా బాధపెట్టాడు, చాలా నెప్పిపుట్టింది, చాలా రక్తంపోయింది కట్టు కట్టాడు వారంరోజులు
ఆఫీసుకి శెలవుపెట్టేసి ఇంట్లోపడుకోండి అన్నాడు. ఇప్పుడు డాక్టరుగారు నన్నూ చాలా
బాధపెట్టేశాడండీ... అని క్రోధంపెట్టుకుంటారా, మిమ్మల్ని బాధపెడుతున్న
వ్రణాన్ని తీసేశాడు కనుక మీరుసంతోషిస్తారా... నా పుండు నాకిచ్చెయ్యండి
పట్టుకెళ్ళిపోతారంటారెంటీ ఎవరైనా, ఎవడూ అనడు పుండు
పోయిందని సంతోషిస్తారు. పుండు తీసేసినటువంటి వైద్యుడిది ఎంత ఉపకారమో... ధర్మాన్ని
కభళిస్తున్నటువంటి వాళ్ళని అంతరింపజేసి, ఆ శరీరంతో వాడువుండి
ఇంకా అధర్మం, ఇంకా మహాపాపంచేసి లోకకంఠకుడై అందరిచేత
నిందింపబడేటటువంటి స్థితినుండి ఆ శరీరాన్ని వినిర్ముక్తంచేసినటువంటి దయ
పరమేశ్వరుడిది కాబట్టి అదికూడా ధర్మ సంస్థాపనయందు అంతర్భాగము.
కాబట్టి ధర్మానికి హానికలిగేటటువంటిరీతిలో ఆయన
ప్రవర్తించాడు అంతే... తప్పా ఆయన అవతారస్వీకారం చేసిచంపడు అందుకే ఒక మాటచెప్తాడు
భాగవతంలో... శుద్ధ సాధులందు సురలందు
శ్రుతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు దలిగి నాయందు వాఁడెన్నఁగలుగు
నాఁడె హింసఁ జెందు.ʻశుద్ధ సాధులందుʼనన్నే నమ్ముకొని
బతుకుతున్నటువంటి మహాభక్తులైనటువంటివారి జోలికివెళ్తే మాత్రం చంపేస్తాను, ʻశ్రుతులందు’ వేదాన్ని తిరస్కరించి బ్రతకడం, వేదాన్ని విమర్షించడం ఎక్కువైపోతే అవతారం
తీసుకొని చంపేస్తాను, ʻగోవులందుʼ ఆవుల జోలికివెళితే
చంపేస్తాను, ʻవిప్రకోటియందుʼ వేదంచదువుకొని, వేదాన్నినమ్మకొని
బ్రతుకుతున్నవాళ్ళ జోలికెళ్తే చంపేస్తాను, ʻధర్మపదవియందుʼ ధర్మం జోలికెళ్తే చంపేస్తాను, ʻదలిగి నాయందుʼ చిట్టచివరిగా తనగురించి చెప్పాడు, అదేపనిగా నన్నునిందిస్తే చంపేస్తాను. తప్పా
అన్యథా నేను ప్రతీ చిన్నవిషయానికీ అవతారం స్వీకరించిచంపను కాబట్టి ఇప్పుడాయన
చంపడానికి కారణం చెప్తున్నాడు ఎందుకు చంపుతానో తెలుసా రావణాసురున్ని
|
హత్వా క్రూరం దురాఽఽత్మానం దేవర్షీణాం
భయావహమ్ !
దశవర్షసహస్రాణి ధశవర్షశతాని చ ! వత్స్యామి మానుషే లోకే పాలయన్పృథివీమిమామ్ !!
నేను రావణాసురున్ని
చంపడానికి కారణం మిమ్మలందర్నీ భయపెట్టడం, భయంకన్నా మృత్యువు ఈ లోకంలో
ఇంకోటిలేదండీ... మీ మానాన మీరు వేదాన్నినమ్ముకొని బ్రతుకుతూంటే, మిమ్మల్ని భయపడేలాచేస్తున్నాడు అందుకు
చంపేస్తాను మీ అందరి హితంకోసం చంపేస్తాను చంపడం కూడా ఎలాచంపుతానో తెలుసా...
విషవృక్షాలన్నికలిసి ఒక పేద్ద వనం పెరిగినట్లుగా పెరిగాయి రావణాసురిడితో పాటు. అందుకని సపుత్రం కొడుకులందరినీ
చంపేస్తాను సైన్యాన్ని చంపేస్తాను తమ్ముళ్ళని చంపేస్తాను
ఆయనవారన్నవారు ఎవడూ బ్రతకడానికి వీలు లేకుండగా అందర్నీ చంపేస్తాను అంత అధర్మంతో
ఉన్నాడు రావణాసురుడు, రావణాసురుడితో అనుబంధమున్నవాడు అన్నవాడు
ఈలోకంలో ఉండడు, వాళ్ళందర్నీ చంపుతాను దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ పదకొండువేల సంవత్సరములు ఈ భూ మండలాన్ని పరిపాలన
చేస్తాను. మనిషి గొప్పతనమేమిటో నిరూపిస్తాను మనిషి అంటే రావణాసురుడు చెప్పినంత చులకనకాదూ, “మనిషి అంటే ఇంత గొప్పవాడని” చెప్పడానికి నేను ఒకమనుష్యుడిగా
ప్రవర్తించి మనిషి యొక్క గొప్పతనాన్ని నిరూపిస్తాను, అందుకు “మనందరం
ఋణపడ్డాము రామ చంద్ర మూర్తికి.” అందుకని దశవర్షసహస్రాణి
దశవర్షశతాని చ వత్స్యామి మానుషే లోకే ఈ మనుష్య లోకంలో
తిరుగుతాను పాలయన్పృథివీమిమామ్ నేనూ ఈ భూమండలాన్ని అంతటినీ కూడా పరిపాలన
చేస్తాను తతః పద్మఫలాశాక్షః
కృత్వాత్మానం చతుర్విధమ్ ! పితరం రోచయామాస తథ
దశరథన్నృపమ్ !! ఆయన తనని తాను నాలుగుగా
విభాగించుకున్నాడు, విభాగించుకున్నాడు అంటే ముక్కలై పోయాడు అని మీరు భావన
చేయకూడదు. ఒక విష్ణువు నలుగురిగా జన్మించడానికి నిర్ణయం చేసుకున్నాడు నేను
నలుగురిగా వస్తాను, నలుగురు మనుషులుగా వస్తాను. ఇప్పుడు నలుగురు
మనుషులుగా రావాలంటే మనిషి ఏమవ్వాలి ఒక పురుషుడు యొక్క వీర్యము కదిలి ఒక స్త్రీ
యందు ప్రవేసించి ఈ రేతస్సు వీర్యమూ కలసి శుక్ర శోణితములు కలిసి ఒక బుడగయై ఒక తల్లి
కడుపులో తల కిందకీ కాళ్ళు పైకీ పెట్టి ఆ చీకటిలో, కడుపులో అమ్మ
నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తూ... పన్నెండు నెలలు మలమూత్రముల
మధ్యలో పురుగులు కుడుతుండగా పడుకుని అత్యంత హేయమైన తల్లి యోనిద్వారములో నుంచి నేను
బయటికివచ్చి పుడితేతప్ప నన్ను మనుష్యుడూ అని పిలవరు.
|
కాబట్టి అలా ఆయన ఒక మనుష్యుడుగా జన్మించడానికి అంగీకరించాడు తమేవ హత్వా సబలం సబాన్ధవం విరావణం
రావణమగ్ర్యపౌరుషమ్ ! స్వర్లోకమాగచ్ఛ
గతజ్వరశ్చిరం సురేన్ద్రగుప్తం గతదోషకల్మషమ్ !! రావణాసురున్ని అతని బంధుపరివారాన్ని సంహరించిన
తర్వాత మహానుభావా మళ్ళీ మీరు మీ అవతార పరిసమాప్తి చేసి స్వర్గలోకానికి
విచ్చేయవలసిందీ అని అక్కడ ఉన్న దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు, తప్పకుండా అలాగే వస్తాను అని ఆయన అంగీకరించారు, పుత్రకామేష్టి ప్రారంభం చేశాడు దశరథ మహారాజు
గారు, ఇష్ఠి జరుగుతోంది, దేవతలందరికీ కూడా హవిస్సులిచ్చారు, ఆ ఇష్టి పూర్తవుబోతోంది, అక్మాత్తుగా ఆ అగ్ని గుండలోంచి ఒక గొప్ప
స్వరూపము ఒకటి బయటికి వచ్చింది ఆ బయటికి వచ్చిన స్వరూపాన్ని వాల్మీకి మహర్షి ఇలా వర్ణణ
చేస్తున్నారు.
తతోవై యజమానస్య పావకాదతులప్రభమ్ ! ప్రాదుర్భూతం మహద్భూతం
మహావీర్యం మహాబలమ్ !!
కృష్ణం రక్తాఽమ్బరధరం రక్తాఽఽస్యం దున్దుభిస్వనమ్ ! స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రుప్రవరమూర్ధజమ్ !!
శుభలక్షణసమ్పన్నం దివ్యాఽఽభరణభూషితమ్ ! శైలశృఙ్గసముత్సేథం
దృప్తశార్దూలవిక్రమమ్ !!
దివాకరసమాఽఽకారం దీప్తాఽనలశిఖోపమమ్ ! తప్తజామ్బూనదమయీం రాజతాఽన్తపరిచ్ఛదామ్ !!
దివ్యపాయససమ్పూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియామ్ ! ప్రగృహ్య విపులాం
దోర్భ్యాం స్వయం మాయామయీమివ !!
ఆ పుట్టినటువంటి మహాపురుషుడు యజ్ఞ గుండంలోంచి వచ్చినటువంటి
ఆ పురుషుడూ... ఒక పేద్ద పర్వతం ఎంతుంటుందో అంత ఆకృతితో ఉన్నాడు, ఎర్రటి ముఖంతో ఉన్నాడు, నల్లటి, ఎర్రటి బట్టలు
కట్టుకున్నాడు, ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలూ, ఆయనకు ఉన్నటువంటి మీసాలూ సింహపు జూలు ఎలా
ఉంటుందో అలా ఉన్నాయి. పెద్ద పెద్ద కన్నులతో ఉన్నాడు, రెండు చేతులతోటి ఒక
బంగారు పాయస పాత్ర పట్టుకున్నాడు, దానికి వెండి మూత ఒకటి
పెట్టబడి ఉంది, ఒక్కసారి ఆ అగ్ని గుండంలోంచి ప్రభవించాడు. ఆయన
మాట్లాడుతూంటే దుంధుభీ స్వరం ఏలా ఉందో అలా ఉంది మాట,
మధించినటువంటి ఒక పెద్ద పులి యొక్క విక్రమం ఎలా ఉంటుందో అడుగులు వేస్తుంటే అలా
ఉంది, సభా అంతా విద్విగ్నులైపోయి ఆలా ఆయన వంక
చూస్తున్నారు, ఆయన ఆ పాయస పాత్ర పట్టుకుని అగ్ని గుండంలోంచి
బయటికి వచ్చారు వచ్చి నిలబడి దశరథ మహారాజు వంక చూసి, మహా రాజా నీ కొరకే
ఆవిర్భవించాను అన్నాడు.
|
నేను ఏం చెయ్యాలో చెప్పండీ అన్నాడు! దశరథుడు ఇదం తు నృపశార్దూల! పాయసం దేవనిర్మితమ్ ! ప్రజాకరం గృహాణ త్వం
ధన్యమారోగ్యవర్ధనమ్ !! ఓ నృపశార్దూల ఓ దశరథ మహారాజా... ఇది పాయసం దేవనిర్మితమ్ ఇది దేవతల చేత నిర్మించబడినటువంటి పాయసం, ఇది ప్రజాకరం గృహాణ త్వం ఇది నీవు స్వీకరించు, ఇది నీ భార్యలు తీసుకుంటే నీకు సంతానం
కలుగుతుంది, ధన్యం నీకు ధనం కలుగుతుంది, ఆరోగ్యవర్ధనమ్ ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ పాయసాన్ని
స్వీకరించు భార్యాణామనురూపాణామశ్నీతేతి
ప్రయచ్ఛ వై ! తాసు త్వం ప్రాప్స్యసే
పుత్రాన్యదర్థం యదఽర్థం యజసే నృప! ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని నీ కత్యంత
ప్రియమైనటువంటి అనురూపవతులైనటువంటి భార్యలెవరైతే ఉన్నారో... వాళ్ళకి ఈ పాయసాన్ని
ఇవ్వు, వాళ్ళు ఈ పాయసాన్ని తిన్న తర్వాత గర్భాన్ని
ధరిస్తారు, నీకు చక్కటి సంతానం కలుగుతుంది అన్నారు. చాలా
సంతోషించాడు ఆ పాయస పాత్ర తీసుకున్నాడు, ఆ వచ్చినటువంటి ఆ
పురుషుడికి ప్రదక్షణం చేశాడు, నమస్కారం చేశాడు, ఆవచ్చిన పురుషుడు పాయస పాత్రనిచ్చి
అంతర్ధానమయ్యాడు. ఆ పయస పాత్ర తీసుకొని వెళ్ళి ముగ్గురి భార్యల వంక చూశాడు
కౌసల్యాయై నరపతిః పాయసాఽర్ధం దదౌ తదా ! అర్ధాదర్ధం దదౌ చాఽపి సుమిత్రాయై నరాధిపః !!
కైకేయ్యై చావశిష్టార్ధం దదౌ పుత్రాఽర్ధకారణాత్ ! ప్రదదౌ చావశిష్టాఽర్ధం పాయసస్యామృతోపమమ్ !!
అనుచిన్త్య సుమిత్రాయై పునరేవ మహీపతిః ! ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్ !!
ఆ పాయస పాత్రలో ఉన్న పాయసాన్ని ముందు సగం చేశాడు, రెండు భాగములు చేసి ఒక భాగం పట్టమహిషి గనుక
కౌసల్యా దేవికి ఇచ్చాడు, సగం పాయసం కౌసల్య తిన్నది. మిగిలినటువంటి ఆ సగం
పాయసాన్ని రెండు భాగాలు చేశాడు, ఒక భాగాన్ని సుమిత్రకి
ఇచ్చాడు, ఇప్పుడు ఇంకొక పావు వంతు ఉంది, దీని కైకమ్మ వంక చూశాడు, కౌశల్యకి అర్ధ భాగము ఇచ్చాడు, సుమిత్రకి పావు భాగం ఇచ్చాడు, కైకమ్మకి పావు వంతు ఇవ్వలేదు, కైకమ్మ వంక చూసి ఆ పావు భాగాన్ని మళ్ళీ రెండు
భాగాలు చేశాడు, రెండు ఏనిమిది వంతులు అయింది, ఒక ఎనిమిది వంతు కైకమ్మకు ఇచ్చాడు, మళ్ళీ అందులో ఎనిమిదో వంతు తీసుకొచ్చి సుమిత్రకిచ్చాడు.
ఇప్పుడు కౌశల్యకి అర్ధ భాగం ఇచ్చాడు, సుమిత్రకీ మూడు భై
ఎనిమిదవ భాగము ఇచ్చాడు, కైకమ్మకీ ఒకటీ భై ఎనిమిదో
భాగము ఇచ్చాడు, ముగ్గురికీ కలిపీ అలా పాయసాన్ని పంచి పెట్టాడు.
ఇప్పుడు రెండు సార్లు సుమిత్రకి ఇచ్చాడు, ఒక పర్యాయం కౌశల్యకి
ఇచ్చాడు, ఒక పర్యాయం కైకమ్మకి ఇచ్చాడు, ముగ్గురు భార్యలూ ఆ పాయసాన్ని తీసుకున్నారు, చాలా సంతోషించారు. మనం గర్భవతులమౌతాం, సత్ సంతానం మన కడుపున కలుగుతుంది, మన జన్మ ధన్యమైందీ అనీ ఎంతో సంతోషిస్తున్నారు.
|
|
ఈలోగా బ్రహ్మగారు దేవతలందర్నీ
పిలిచారు, రావణాసురిడితో పాటుగా కొన్ని కోట్లమంది రాక్షసులు
ఉన్నారు. సామాన్యమైన వాళ్ళేంకాదు వాళ్ళందరూ, వాళ్ళందరూ
తెగతార్చబడాలి అంటే... రామ చంద్ర మూర్తికి సాయం చేయడానికి, అవతారం స్వీకరిస్తున్నటువంటి విష్ణువుకి సాయంచేయడానికి
మీ అందరూ కూడా, మీ మీ అంశలతో, మీ మీ తేజస్సులతో
ప్రాణులను సృష్టించాలి, నర వానరులచేత భంగపాటు రావణాసురుడికి ఉంది, పైగా వానరులచేత అవమానింపబడుతాడు అని
నందీశ్వరుడు శపించివున్నాడు. కాబట్టి వానర ముఖాలతో వానరులుగా సృష్టిచెయ్యండి. మీ
భార్యలయందు సృష్టించడం కుదరదు కాబట్టి. ఎందుకంటే పార్వతీ దేవి యొక్క శాపం ఉంది
దేవతలకి ఇంక సంతానంకలగదు అదిఎందుకొచ్చిందన్నది రామాయణంలోనే ఎదర శణ్ముకోత్పత్తిలో
వస్తోంది. శణ్ముకోత్పత్తి ఎక్కడిదో తెలుసాండీ... కుంభసంభవం
కాళిదాసకృత చదవరు ఎందు చేతనంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండీ, ఒక గర్భం ధరించినటువంటి స్త్రీ కడుపులోకి ఒక
జీవుడు ప్రవేశించినప్పుడూ ఆ తల్లి కడుపున పుట్టేటటువంటి పిల్లవాడు, కేవలం ఉద్దరిస్తాడని నమ్మకం ఉండదు. ఎందుకో
తెలుసా... కొడుకులు చాలా రకాలుగా వస్తారు, ఒకడు శత్రుపుత్రుడుగా
వస్తాడు, శత్రువు, వీడునన్ను ఇంత
బాధపెట్టాడు, ఇంత బాధ పెట్టాడు అని తలుచుకు తలుచుకు తలుచుకు
తలుచుకు ప్రాణం విడిచిపెడతాడు అదీ చాలా కోపంతో... ఆ లలితా సహస్త్ర నామ స్తోత్రంలో
అమ్మవారి ఒక నామానికి ఒక ఈ పునర్జన్మ గురించి వ్యాఖ్యానం కూడా ఉంది.
కాబట్టీ వాడు అలా క్రోధం పెట్టుకు పెట్టుకు మరణిస్తే...
ఈయనకి కొడుకుగా వస్తాడు, నాన్నగారు వాడ్నీ ఓరేయ్ నీవు ఇంజినీరింగు చదువు
అన్నాడనుకోండీ... అదే నేను చదవను అంటాడు. ఒరే నీవు వ్యాపారం చేయ్, అదే నేను చెయ్యను అంటాడు, ఒరే నీవు అన్నం తిను
నేను తినను అంటాడు, ఒరే ఆయనకి నమస్కారం చేయి అంటాడు, నేను చేయను అంటాడు
వాడికి ఒకే ఒక లక్ష్యము ఎమిటంటే తండ్రి ఏడవాలి... తండ్రిని ఏడిపించడమే ప్రయోజము.
మీరు చూడండి కొంత మంది కొడుకులు ఉంటారు, ఊళ్ళోవాళ్ళకి మంచివాళ్ళు తండ్రికి అన్నం
కూడా పెట్టరు మా నాన్న పేరుమాత్రం ఎత్తకండీ అంటారు. ఎందుకో తెలుసాండీ..?
వాన్నివదల్లేడు ఈయన “పుత్రేషా” ఎలా వదులుతారు వదల్లేరు, ఇంతకుముందు జన్మలో ఏడిపించిన ఏడుపు వాడు
ఇప్పుడు ఏడిపిస్తాడు శత్రువు కొడుకుగా వస్తాడు. ఒక్కొక్కసారి అప్పు తీసుకొని
తీర్చకపోతే... వాడు కొడుకుగా వస్తాడు. వాడేంచేస్తాడంటే అప్పైపోయేవరకు వీడిదగ్గర
అన్నంతిని వెళ్ళిపోతాడు శరీరమొదిలేస్తాడు అప్పుడు వాడుచచ్చిపోయాడని వీడు ఏడుస్తూ
కూర్చుంటాడు కాబట్టీ ఋణ పుత్రుడు శత్రు పుత్రుడు, సేవక పుత్రుడు మన్ని సేవించడంలో బాగా
దగ్గరైపోయాడనుకోండీ సేవకుడు సేవించి సేవించి సేవించి యజమానినే తలచుకుంటూ ప్రేమతో
మరణించాడనుకోండీ, ఆ సేవకుడు కొడుకుగా వస్తాడు వాడికి ఏ అలవాటు
వస్తుందంటే...
|
|
కాబట్టీ ఇప్పుడు
ముగ్గురికీ పాయసం పంచిపెట్టిన తరువాత బ్రహ్మగారు పిలిచి, పార్వతీదేవి శాపకారణంచేత మీ భార్యలయందు మీకు
సంతానంకలగరు. కాబట్టి మీరు వానరకాంతలయందు మీరు మీ తేజస్సుని నిక్షేపించి, అప్సరసలయందు మీ తేజస్సుని నిక్షేపించి
బలవంతులైనటువంటి పుత్రులు కలిగేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోండీ అని చెప్పాడు (అసంహార్యాను పాయాజ్ఞాన్ దివ్వయసంహన నాఽన్వితాన్!) సర్వాఽస్త్రగుణసమ్పన్నా
నమృతప్రాశనానివ !! అంమృతం తాగినవారు ఎంత బలాడ్యులై ఉంటారో... సర్వ
శాస్త్రవిశారుదులై ఉన్నటువంటివాళ్ళు ఎలా ఉంటారో అలాంటి బిడ్డల్ని మీరుకనండి. రామ
చంద్ర మూర్తికి సాయం చేయవలసి ఉంటుంది అన్నారు అప్సరస్సు చ ముఖ్యాసు గన్ధర్వాణాం తనూషు చ ! యక్ష పన్నగ కన్యాసు ఋక్ష విద్యాధరీషు చ !!
కిన్నరీణాం చ గాత్రేషు వానరీణాం తనూషు చ ! సృజధ్వం హరిరూపేణ
పుత్రాంస్తుల్యపరాక్రమాన్ !! పూర్వమేవ మయా సృష్టో జామ్బవానృక్షపుఙ్గవః ! జృమ్భమాణస్య సహసా మమ
వక్తద్రజాయత !! ఆయనన్నాడు
మీ భార్యలవలన సంతానంకలగదు కాబట్టి, గధర్వ కాంతలు, యక్ష కాంతలు, పన్నగ కాంతలు, నాగ కాంతలు, వృక్ష కాంతలు, విద్యాధర కాంతలు, వానర కాంతలు వీరియందు
మీ తేజస్సును నిక్షేపించి, మీతో
సమానమైన బలం గలిగినటువంటి వీరులు సమానులైన వానర వీరుల్ని సృష్టించండి. నేను
ఇతః పూర్వమే, నేను ఒకా నొకప్పుడు నా సభలో కూర్చొని
ఆవులించాను, ఆవులించినప్పుడు నానోటిలోంచి వానరం ఒకటి
బయటిదూకింది ఆయనకు జాంబవంతుడు
అని పేరు అందుకే, అన్ని విషయాలను బ్రహ్మగారిని ఎలా సంప్రదిస్తారో, శ్రీ రామాయణంలో వానరులందరు జాంబవంతున్ని
సంప్రదిస్తుంటారు అది అక్కడ పెద్దతలకాయి, ఆయన కొడుకు ఇక్కడ
పెద్దతలకాయి అందుకని జాంబవంతుడు పెద్దవాడు, మహా బలపరాక్రమాలు
కలిగినటువంటివాడు.
|
|
ఒకానొకనాడు శ్రీ
మహావిష్ణువు త్రివిక్రమ స్వరూపంతో భూమిని దానంపట్టి ఆయన ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపైనంతై అనీ అంత పెద్దవాడైపోయి, భూమండలాన్ని ఆ స్వర్గలోకాన్ని అంతటినీ
ఆక్రమణంచేసినప్పుడు 21 పర్యాయములు ప్రదక్షణచేశాడు జాంబవంతుడు అంతటిబలశాలి. కాబట్టి
నా నోటివెంట జాంబవంతుడుపుట్టాడు మీరుకూడా సృష్టించండి అన్నాడు వానరేన్ద్రం మహేన్ద్రాభమిన్ద్రో వాలినమూర్జితమ్ ! సుగ్రీవం జనయామాస
తపనస్తపతాం వరః !! ఇంద్రుని యొక్క అంశతో “వాలి” పుట్టాడు, అలాగే “సుగ్రీవుడు” అనబడేటటువంటి వానరుడు సూర్యుని యొక్క అంశతో
జన్మించాడు అలాగే బృహస్పతిస్త్వ
జనయత్తారం నామ మహాహరిమ్ ! “బృహస్పతి” తన అంశతో “తారుడు” అనే టటువంటి వానరున్ని సృష్టించాడు సర్వవానరముఖ్యానాం బుద్ధిమన్తమనుత్తమమ్ !! బృహస్పతి ఎటువంటి
బుద్ధి కలిగినటువంటి వాడో... ఈ తారుడు అను బడేటటువంటి వానరుడు కూడా
అంతబుద్ధికలిగినటువంటి హరి వీరుడు ధనదస్య సుత్రశ్శీమాన్
వానరో గన్ధమాదనః కుబేరుని యొక్క అంశతో “కుబేర” పుత్రునిగా వానర రూపంలో “గన్ధమాధనుడు” పుట్టాడు విశ్వకర్మాత్వజనయన్నలం నామ మహాహరిమ్ “విశ్వకర్మ” యొక్క అంశలో “నలుడు” అనే టటువంటి వానరుడు జన్మించాడు. (వింటున్నారా
గోపాల క్రిష్ణగారు, విశ్వకర్మ అంశలో నలుడు జన్మించాడు) పావకస్య సుత్రశ్శ్రీమాన్ నీలోఽగ్నిసదృశప్రభః అలాగే “అగ్ని హోత్రుని” యొక్క అంశతో “నీలుడు” అనేబడేటటువంటి వానరుడు జన్మించాడు.
తేజసా యశసా వీర్యాదత్యరిచ్యత వానరాన్ అలా రమ్యమైనటువంటి తేజస్సులైనటువంటి
వీర్యవంతులైనట్టి వానరుల్ని సృజించారు రూపద్రవిణసమ్పన్నావశ్వినౌ
రూపసమ్మతౌ ! మైన్దం చ ద్వివిదం చైవ
జనయామాసతుస్స్వయమ్ !! చాల రూపవంతులైనటువంటి
తేజస్సు కలిగినటువంటి అశ్వినీ దేవతలు మైందుడు, ద్వివిదుడు అనేటటువంటి ఇద్దరు
వానరుల్ని సృష్టించారు వరుణో జనయామాస సుషేణం
వానరర్షభమ్ ! “వరుణుడు సుషేణుడు” అనేబడేటటువంటి వానరున్ని
సృష్టించాడు శరభం జనయామాస
పర్జన్యస్తు మహాబలమ్ !! అలాగే పర్జన్యుడు ఒక వానరకాంతయందు తనతేజస్సుని
నిక్షేపించి శరభుడు అనేటటువంటి వానరున్ని సృష్టించాడు మారుతస్యాఽఽత్మజశ్శ్రీమాన్హనుమాన్నామ
వీర్యవాన్ ! వజ్రసంహననోపేతో
వైనతేయసమో జవే !! సర్వవానరముఖ్యేసు
బుద్ధివాన్ బలవాన్పీ !! వాయు దేవుని యొక్క అంశతో అందరు వానరరులలోనూ
కూడా బలాడ్యుడైనటువంటి వాడు, గొప్ప బుద్ధి బలం
కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, రామ చంద్ర మూర్తి యందు అపారమైనటువంటి భక్తి
కలిగినవాడు ఎవర్ని స్మరించినంత మాత్రము చేత బుద్ధి, వాక్భలమూ, ఆరోగ్యమూ కలుగుతాయో అంతటి
తేజస్సంపన్నుడైనటువంటి శ్రీ హనుమా జనించారు. కాబట్టి వాయు దేవుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు “హనుమంతుడు” ఇలా ఈ వానర వీరులందరూ సృజింపబడ్డారు.
|
పాయస పాత్రని తీసుకొని, తనభార్యలకి ఆ పాయసాన్ని
పంచిపెట్టిన దశరథ మాహారాజు గారు యజ్ఞం పూర్తైపోయింతరువాత, ఎప్పుడెప్పుడు ఇంక తన భార్యలవలన తనకు పుత్రోదయం
జరుగుతుందాని ఎదురు చూస్తున్నారు శ్రీమతాం గచ్ఛతాం తేషాం
స్వపురాణి పురాత్తతః ! బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాశిరే !! దశరథ మాహారాజు గారు
యజ్ఞానికి వచ్చిన వాళ్లదరికీ ఇచ్చిన విలువైనటువంటి వస్త్రాలను తాము ధరించి, ఆ హారములును వేసుకొని సంతోషంగా వచ్చినటువంటి అతిథులందరూ, తిరిగి రథాలెక్కి వెళ్ళిపోతున్నారు గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా ! ప్రవివేశ పురీం
శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్ !! బ్రహ్మణులను ముందుంచుకొని దశరథ మహారాజు
గారుకూడా యజ్ఞం పూర్తిచేసి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు తనతో పాటు శాంతా
ఋష్యశృంగుల్నీ తీసుకెళ్ళాడు, ఆయన దగ్గర అంతఃపురంలో
కొంతకాలం ఉన్నారు శాన్తయా ప్రయయౌ
సార్ధమృశ్యశృఙ్గస్సుపూజితః ! అన్వీయమానో రాజ్ఞాఽథ సాఽనుయాత్రేణ ధీమతా !! శాంతతో కలిసి అంతఃపురంలో
కొంతకాలమున్న ఋష్యశృంగుడు, తన మామగారైనటువంటి రోమపాదుడుతో కలిసి తరువాతి
కాలంలో దశరథుడిచేత పూజలందుకొని ఆయనకూడా వెళ్ళిపోయాడు
తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః ! తతశ్చ ద్వాదశే మాసే
చైత్రే నావమికే తిథౌ !!
నక్షత్రేఽదితిదైవత్యే
స్వోచ్చసంస్థేషు పఙ్చసు ! గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిన్దునా సహా!!
ప్రోద్యమానే జగన్నాథం సర్వలోకనమస్కృతమ్ !
చైత్రమాసంలో పన్నెండు ఋతువులు పూర్తైన తరువాత ఒక సంవత్సరకాలం పూర్తైనతరువాత ఆరు ఋతువులూ పూర్తైయ్యాక చంద్రుడు బృహస్పతితో ఉండగా, కర్కాటక లగ్నంలో పునర్వసూ నక్షత్రంలో నవమీ తిథినాడు ఐదు
గ్రహములు కుజుడు, సూర్యుడు, చంద్రుడు
మొదలైనటువంటివారు ఉచ్ఛ స్థితిలో ఉండగా... సర్వలోకనమస్కృతమ్ అన్నిలోకములచేత నమస్కరించబడేటటువంటి
జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు, సాక్ష్యాత్తు
శ్రీమహావిష్ణువు, కౌసల్యానంద వర్ధనుడై, రామ చంద్ర మూర్తిగా ఈ లోకంలో ఆవిర్భవించారు.
కౌసల్యా దశరథులకి మొట్ట మొదటి కొడుకుగా మహానుభావుడు రామ చంద్ర
మూర్తి ఆవిర్భవించాడు కౌసల్యాజనయద్రామం
సర్వలక్షణసంయుతమ్ !! విష్ణోరర్ధం మహాభాగం
పుత్రమైక్ష్వాకువర్ధనమ్ ఇక్ష్వాకు వంశమంతా
తరించి పోయేటట్టుగా ఆ రామ చంద్ర మూర్తి ఈ లోకంలో ఆవిర్భవించగానే, దేవతలందరూ కూడా దుందుభిలు మోగించారు. అదిగో
దేవదుందుభిలు మ్రోగినట్లే దేవాలయంలో దుందుభిలు
మ్రోగుతున్నాయి మంగళధ్వనులు చేశారు, ఆ కౌశల్యాదేవి ఆ పక్కన
పుట్టినటువంటి ఆ రామ చంద్ర మూర్తిని దగ్గరికి తీసుకుంటే... ఇంద్రుడుతో కలసి ఉన్నటువంటి అధితి
ఎలా ప్రకాశించిందో... అలా ప్రకాశించిందట తల్లి కౌసల్యా శుశుభే తేన
పుత్రేణామితతేజసా ! యథా వరేణ
దేవనామదితిర్వజ్రపాణినా !! భరతో నామ కైకేయ్యాం జఙ్ఞే సత్యపరాక్రమః ! సాక్షాద్విష్ణోశ్చతుర్భాగస్సర్వైస్సముదితో
గుణైః !! కైకేయీ భరతుడు
అనబడేటటువంటి పేరు ఉంచబడవలసినటువంటి కుమారున్ని, రామ చంద్ర మూర్తి
తరువాతి బిడ్డగా ప్రసవించింది, కాబట్టి రామ చంద్ర
మూర్తి తరువాత పుట్టినటువంటివాడు భరతుడు అథ లక్ష్మణశత్రుఘ్నౌ
సుమిత్రాజనయత్సుతౌ ! వీరౌ సర్వాఽస్త్రకుశలౌ
విష్ణోరర్ధసమన్వితౌ !! లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళిద్దరు ఆశ్లేషా నక్షత్రంలో
కవల పిల్లలుగా సుమిత్రా దేవికి జన్మించారు పుష్యే జాతస్తు భరతో
మీనలగ్నే ప్రసన్నధీః ! భరతుడు మీన లగ్నంలో పుష్యమీ నక్షత్రంలో
జన్మించాడు
|
గుణవన్తోఽనురూపాశ్చ రుచ్యా
ప్రోష్ఠపదోపమాః ! జగుః కలం చ గన్ధర్వా
ననృతుశ్చాఽప్సరోగణాః !!
దేవదున్దుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా ! ఉత్సవశ్చ
మహానాసీదయోధ్యాయాం జనాకులః !!
రథ్యాశ్చ జనసమ్బాధా నటనర్తకసఙ్కలాః ! గాయనైశ్చ విరావిణ్యో
వాదనైశ్చ తథాపరైః !!
ప్రదేయాంశ్చ దదౌ రాజా దూతమాగధవన్దినామ్ ! బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః !!
రామ చంద్ర మూర్తి, లక్ష్మణ మూర్తి, భరత శత్రుజ్ఞులు ఈ
లోకంలో ఆవిర్భవించగానే... ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. దేవదుంధుబిలు మోగాయి, పుష్పవృష్టి కురిసింది, దేవతలు సంతోషించారు, కోసల రాజ్యమంతటా ఉత్సవమే... వచ్చిన
యాత్రికులందరూ కూడా సంతోషాన్ని ప్రకటించారు. పౌరులందరూ కూడా తమ ఇళ్ళల్లోనే పెద్ద
పండుగ జరుగుతున్నట్టుగా పతాకాలు పైకెత్తారు, గొప్ప ఉత్సవం, ఎక్కడ చూసినా ఆనందం, దశరథ మాహారాజు గారికి సంతానం కలిగింది, అశ్వమేధం, పుత్రకామేష్ఠిచేస్తే
అపురూపమైనటువంటి కొడుకులు సాక్ష్యాత్తు విష్ణువే కొడుకులుగా పుట్టారు. సర్వ
గుణములతోటి శోభించేటటువంటి పిల్లలు, మనుష్య జాతిని కీర్తి
ప్రతిష్టలు నిలబెట్టగలిగినటువంటి ధర్మాత్ములు, ఏ మహానుభావుడి పేరు
చెప్పుకుంటే పాపరాశి ధ్వంశమైపోతుందో... అటువంటి మహా పురుషులు ప్రభవించారనీ...
వాళ్ళందరూ సంతోషంతో, నటీనటులందరూ నాట్యంచేశారట. నాటకాలు వేశాలరట, అందర్నీ వినోదింపజేశారట, నృత్యం చేసేవారు నృత్యం చేశారట, వంది మాగది, సూతులు మొదలైనవాళ్ళను
దశరథ మహారాజు గారు పిలిచి కొన్నిలక్షల గోవుల్నీ బంగారు కాసుల్ని, ద్రవ్యాన్ని
దానంచేశారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందర్నీ కానుకలతో సంతోషపెట్టారు రాజ్యమంతటా ఎక్కడ
చూసినా ఎంతో సంతోషంగా ఉంది.
|
నాకీ విషయం చెప్తూంటే ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది, ఈ రామ నామం పట్టుకుని తరించినటువంటి
పట్టణాల్లో... ఈ గుంటూరు పట్టణం ఒకటి. ఎందుకో తెలుసాండీ... ఇక్కడే ఉంది లోకంలో
రామాలయం ఉంటుంది, రామకోటి పందిరుంటుంది, రామనామ క్షేత్రమున్న ఊరు గుంటూరు. ఎందుచేతనంటే
నాకూ పేర్లూ సరిగ్గా జ్ఞాపకమున్నాయో లేదో తెలియదుకానీ, పిచ్చయ్య దాసుగారు
అనిచెప్పి మహానుభావుడు ఒకాయన వినుకొండలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆయన వినుకొండలో
ఉద్యోగం చేస్తున్నప్పుడు సంతానం కలగకపోతే... అక్కడే గుంటా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే, ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామివారిని అర్చించారు.
ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆయనకు పుట్టినటువంటి కొడుకుకి ఆంజనేయుడు అనే పేరుంచారు.
ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, వారు తరువాతి కాలంలో
శ్రీశైలం దగ్గిరా నాకు జ్ఞాపకం ఉంటే, పెద్ద చెరువు అనుకుంటాను ఆ ఊరి పేరు ఆ ఊరికి
వారు బదిలీ అయ్యారు. అక్కడ ఈ పిల్లవాడు చిన్న తనంలో మట్టి తవ్వుతూ...
ఆడుకుంటున్నప్పుడు అతడికి రామ చంద్ర మూర్తి యొక్క విగ్రహం ఒకటి దొరికింది. ఆ దారు
విగ్రహాన్నే తరువాతి కాలంలో మార్చి మార్చి ఎక్కడ తండ్రి పిచ్చయ్య దాసుగారున్నరో
అక్కడే తండ్రి ఇంట్లో గోడలో గూడు కట్టి ఆగూట్లో రామ చంద్ర మూర్తి విగ్రహాన్ని
పెట్టి ఆరాధించి తరించారు ఆంజనేయులు గారు.
ఆ మహానుభావుడు తనకి పెళ్ళవుతుంటే... నాకు పెళ్ళవుతున్నప్పుడు
మావిడి తోరణాలు కూడా కట్టద్దని చెప్పీ... రామ నామం రాసినటువంటి తోరణాలు తన పెళ్ళి
పందిరంతా కట్టించుకున్నారు. నాకు మంగళ వాయిద్యాలు వద్దూ, నేను మంగళ సూత్రం కడుతున్నప్పుడు మంగళ
వాయిద్యాలు కాదు శ్రీ రామ నీ నామమెంత రుచిరా అని రామా రామా రామా అని అరండి అదే
మంగళ ధ్వని అంటూ రామ నామం చెప్పించుకున్నారు. ఆ పిచ్చెయ్యదాసుగారు రామకోటి రాసిన
మహానుభావుడు, చిట్టచివర ఒక బండిలో ఆ రామకోటి పుస్తకాలన్నీ
పెట్టుకొని భద్రాచలం క్షేత్రంచేరి తెల్లవారితే శ్రీరామనవమి రేపిద్దువుగాని ఆ
పుస్తకాల్ని అంటే ఏమో ఏరోజుమనది, ఈవ్వాలే ఇచ్చేస్తానని
అష్టమి తిథినాడు, తనురాసిన రామకోటి పుస్తకాలన్నీ రామ చంద్ర
మూర్తికి ఇచ్చేసి కొండ కింద పెద్దగా భజన చేస్తూ... రాత్రి ఒంటిగంటవేళ రామాలయం
వంకచూస్తూ... రామా రామా రామా అని అరుస్తూ... శరీరం విడిచి పెట్టేస్తే... అవతల రామ
చంద్ర మూర్తి కళ్యాణం జరుగుతుంటే... వచ్చిన భక్తులు కొన్ని వేలమంది రామనామం
చేస్తుండగా... ఆయన పార్థివశరీరం కట్టెల్లోకాలిపోయి ఆయన తేజస్సు రామ చంద్ర మూర్తిలో
కలిసిపోయింది అంతటి మహానుభావుడి కుమారులుగా పుట్టినటువంటి ఆంజనేయులుగారు, రామ నామ క్షేత్రాన్ని ఈ పక్కనే సమీపంలోనే
ఏర్పాటు చేసి ఆయనకి దొరికిన విగ్రహాన్ని ఈ దేవాలయంలో ఉంచారు. అంత గొప్ప క్షేత్రం ఆ
వంశంలో వచ్చినటువంటి మహాపురుషుడే ఇక్కడున్నాడు నిన్న ఆయన నన్ను పుష్ప మాలాంకృతుల్ని
చేశారు అంత గొప్ప క్షేత్రం రామ నామం ఎంత గొప్పదో... చాటి చెప్పినటువంటి ఊళ్ళల్లో ఈ
గుంటూరు ఒకటి మీ గుంటూరు అని అనను ఎందుకంటే తెలుసా... నాది కూడా గుంటూరే...
|
నేను ఈ సందర్భంలో మీతో
ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. పెద్ద వాళ్ళు రామ కోటి రాస్తూ ఉంటారు
మంచిదే... కానీ మీరొకటి బాగా జ్ఞాపంకం పెట్టుకోండి, మన సంతోషం ఎవరి మీద
ఆధారపడి ఉంటుందంటే పిల్లల యొక్క అభ్యున్నతి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత సేపూ రామ
నామం మనం రాసే ప్రయత్రం చేస్తాం మంచిదే... కాని పిల్లలకి శ్రీ రామానుగ్రహం కలగాలీ
అంటే... మామూలుగా వాళ్ళు ఇంట్లో కూర్చొని శ్రీ రామా అని రాసినా చాలు, అందునా సంపూర్ణ రామాయణ ప్రవచనాలు
జరుగుతుండగా... శృంగగిరి పీఠంలో... శారదాదేవి మంటపంలో... రామ చంద్ర మూర్తి సన్ని
ధానంలో... రామ కోటి పుస్తకాలు వాళ్ళకి ఇస్తే... భధ్రాచల క్షేత్రం నుంచి రాగి మాడలు
రామ చంద్ర మూర్తివి తెప్పించి రామ చంద్ర మూర్తి పాదాల దగ్గర పెట్టి రెండు మూడు
రోజులు అక్కడ వాటిని నిద్ర చేయించీ... పూజ చేసి పిల్లలతో రామ నామం రాయించీ... ఆ
రామ నామం రాసినటువంటి పిల్లలందరికీ రామ మాడలిచ్చి మనం పంపిస్తే... తల్లి
దండ్రులుగా, పౌరులుగా, రామ భక్తులుగా మనం
పిల్లలకు అందించవలసినటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని అందించి మనం కృతార్థులవుదాం.
నేను మిమ్మల్నందర్నీ కోరేది ఒక్కటే... నేను ఎందుకు చెప్పానో చెప్పకుండా...
హరిప్రసాదుగార్ని ఒక విషయం అడిగా... అయ్యా మీరు భద్రాచలం నుంచి
రెండు వేల మాడలు తెప్పించండీ అని అడిగాను ఆయన ఎందుకయ్యా రామ మాడలు అని నన్ను
అడగలేదు ఆయన వెంటనే వాటిని తెప్పించేసే ప్రయత్నం చేస్తున్నారు, వచ్చేస్తున్నాయి ఒకటి రెండు రోజుల్లో...
|
ఒక వేళ రెండు వేల మంది
కన్నా ఎక్కువ పిల్లలోస్తే... రిక్త హస్తాలతో వాళ్ళని పంపించద్దు... ఎంత మంది
పిల్లల్నీ ఎవరెవరు తీసుకొస్తారో... ఇవ్వాల నుంచే మీరొక పుస్తకంలో ఒకరిని పెట్టి
రాయించండి... ఎంత మంది పిల్లలొస్తారో చూసుకొని పది వేల మంది అయితే పదివేల మాడలు
తెప్పించండి... అవసరమైతే... నేను లోను పెట్టైనా డబ్బిస్తాదానికి... తెలిసిందాండీ..
ఆ అవసరం రాదు నాకు తెలుసు... కాబట్టి మనం ఒక గొప్ప పని చేశామన్న తృప్తి మన జీవితంలో
మిగిలిపోతే చాలు. పెద్దలతో కాదు, పిల్లలందర్నీ, ఎక్కడ చూసినా పిల్లలే... కూర్చోబెట్టీ
చక్కగా... శ్రీ రామ నామం రాయించీ... వాళ్ళందరికీ రామ చంద్ర మూర్తి పాదాల దగ్గర
పెట్టి పూజ చేసినటువంటి, ఆ మాడలు బహూకరించి, వాళ్ళు ఇంట్లో పెట్టుకుని రోజూ కళ్ళకు
అద్దుకునేటటువంటి అలవాటు చేస్తే... వాళ్ళు రాసిన ఒక్కొక్క రామ నామం వాళ్ళని
జీవితాంతం రక్షించేస్తుంది. ఏ ఆపదలు రాకుండా కాపాడుతుంది.
|
మంగళా శాసన...
ఇప్పుడొక్క సారి రామ నామం చెప్పి రామ చంద్ర మూర్తి
ఆవిర్భవించినటువంటి రోజు ఒక్క పదకొండు పర్యాయాలు రామ నామం చెప్పి మనం బయలు
దేరుదాం...
ఎంత పొంగి పోతాడో... రామ చంద్ర మూర్తి మీ అందరి భక్తికి
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
కోరి కొలచిన వారికెల్లను కొంగుబంగరు రామ నామము
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
గోచరంబగు జగతిలోపల గోప్యమైనది రామ నామము !!రా!!
బ్రహ్మ సత్యము జగ్నమిత్యా భావమే శ్రీ రామ నామము !!రా!!
భక్తితో భజియించు వారికి ముక్తి నొసగును రామ నామము !!రా!!
భగదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీ రామ నామము !!రా!!
సకల జీవుల లోనవెలిగే సాక్షిభూతము రామ నామము !!రా!!
ఆంజనేయుని వంటి భక్తుల ఆశ్రయము శ్రీ రామ నామము !!రా!!
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామ నామము !!రా!!
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీ రామ నామము !!రా!!
కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామ నామము !!రా!!
జన్మ మృత్యు రహస్యమెరిగి జపియించవలె శ్రీ రామ నామము !!రా!!
పసితనంబున అభ్యసించిన పట్టుపడు శ్రీ రామ నామము !!రా!!
|
పాలు మీగడ పంచ ధారల తత్వమే శ్రీ రామ నామము !!రా!!
ఎందరో మహానుభావులడెందమాయను రామ నామము !!రా!!
వెంట తిరిగెడు వారికెళ్ళను కంటి పాపే రామ నామము !!రా!!
అచలమై ఆనందమై పరమాణువైనది రామ నామము !!రా!!
జానకీ హృత్ కమల మందున అలరు చున్నది శ్రీ రామ నామము !!రా!!
నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామ నామము !!రా!!
రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీ రామ నామము !!రా!!
పరమ పదవిని చేరుటకు దారిచూపుని రామ నామము !!రా!!
తల్లి వలె రక్షించు సుజనులనెల్ల కాలము రామ నామము !!రా!!
రేపటి రోజు అద్భుతమైనటువంటి సందర్భము రామ చంద్ర మూర్తి
విశ్వామిత్రుడు కలుసు కుంటారు ʻగాయిత్రీ మహా మంత్రద్రష్ట విశ్వామిత్రుడుʼ విశ్వామిత్రుడు రామ
చంద్ర మూర్తి కలుసుకున్నటువంటి ఘట్టం సామాన్యమైన ఘట్టం అనుకోకండీ... ఒక శిల్పాన్ని
శిలలోంచి శిల్పి ఎలా చెక్కుతాడో... రామ చంద్ర మూర్తిని చెక్కినటువంటి, రామున్ని అంత గొప్ప రాముడుగా తీర్చిదిద్దిన ఘనత
వశిష్ట, విశ్వామిత్రులది. అసలు విశ్వామిత్రుడు
మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో... విశ్వామిత్రుడు రాముడు మాట్లాడు కుంటున్నప్పుడు ఎలా
ఉంటుందో... అసలు విశ్వామిత్రుడు ఎంత గొప్పగా మాట్లాడుతాడో... ఆ బ్రహ్మర్షి
వ్యక్తిత్వం అంటే ఏమిటో... అసలు వాల్మీకి మహర్షి ముచ్చటపడి బాల కాండ అని
పేరుపెట్టుకున్నది, విశ్వామిత్రని దృష్టిలోపెట్టుకునే... ఆ రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞల నామ వైభవమేమిటో మిశ్వామిత్రుడుతో
రాముడు కలిసివెళ్ళిడమంటే ఎలా ఉంటుందో... ఈ విషయాలన్నిటినీ మీకు రేపూ... ఆ ప్రవచనం
చెయ్యగలిగిన భాగ్యాన్ని రామ చంద్ర మూర్తి తన నిర్హేతుక కృప నాకు కటాక్షించు గాక.
అంటే, రేపు ఎం జరుగుతుందో
మీకు ఎందుకు చెప్తున్నాను అంటే... అయ్యో... నిన్న నీవీమాట చెప్పుంటే మేం విందుంకదయ్యా...
అని ఎవరైనా అంటారేమోనని ముందుగానే ఒక మాట చెప్తూ ఉంటాను.