అయోధ్య కాండ
రాముడు అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సందర్భాన్ని ఆ తమసానది తీరంలో
పడుకున్నటువంటి మొదటి రాత్రిని ఆ తరువాత ఆ తమసానదినిదాటి అరణ్యంలో
ప్రవేశించినటువంటి సందర్భాన్ని, ఆయన్ని అనుగమించినటువంటి పౌరులు జానపదులూ
బ్రాహ్మణులు తిరిగి అయోధ్యానగరానికి చేరినటువంటి విధానాన్ని వారు రామున్ని
తీసుకొనిరాకుండా వారుమాత్రమే తిరిగి వచ్చారనేటటువంటి ఖేదంతో వారిభార్యలు
పలికినటువంటి బాధతోకూడిన పలుకులు గురించినటువంటి విషయాలన్ని నిన్న నేను మీతో
ప్రస్తావన చేసియున్నాను. ఆ తరువాత రాముడు ʻవేదశ్రుతిʼ అనబడేటటువంటి ఒక నదినీ ʻగోమతిʼ అనబడేటటువంటి
నదినీ ʻస్యన్దికాంʼ అనబడేటటువంటి నదినీదాటి కోసల దేశంయొక్క సరిహద్దుల్లోకి
వచ్చాడు. అంటే అక్కడితో కోసల దేశాన్ని విడిచిపెట్టేస్తాడు, ఆ కోసల దేశాన్ని
విడిచిపెట్టేటటువంటి స్థితిదాకావచ్చినటువంటి రాముడు సుమంత్రుని యొక్క రథంలో
ప్రయాణం చేస్తున్నాడు ఇంకా సుమంత్రుడు తన రథంతోటి సీతా రామ లక్ష్మణులని
తీసుకువెడుతున్నాడు. ఆ రథం దిగి అయోధ్యా నగరంవైపు చూస్తాడు ఒక్కసారి చూసి ఆయన
ఒకమాట అంటాడు ఆపృచ్ఛే త్వాం పురి శ్రేష్ఠే కాకుస్థ పరిపాలితే ! దైవతాని చ యాని
త్వాం పాలయంత్యా వసంతి చ !! అని అంటాడు.
ఓ
అయోధ్యానగరమునకు అధిష్టానమైనటువంటి దేవతా, ఓ అయోధ్యా నగరీ స్వరూపములో ఉన్నటువంటి
దేవతా! నీకు నేను నమస్కరిస్తున్నాను నేను సంతోషంగా ఈ వనవాసాన్ని పూర్తిచేసి
క్షేమంగా తిరిగివచ్చేటట్టుగా నీవు అనుగ్రహించేదవుగాక. ఇందులో మీరు కేవలం రాముడు
నమస్కారం చేశాడూ అని భావనచేయకూడదు. మనకి ధర్మ శాస్త్రంలో ఏమిటంటే, మీరు ఒక ఊళ్ళో
ఉంటున్నారనుకోండీ ఆ ఊరికి ఒక అధిష్టాన దేవతవుంటారు, సాధారణంగా ప్రతి ఊళ్ళోను కూడాను
ఈ అధిష్టాన దేవతా స్వరూపం స్త్రీ స్వరూపంగా ఆరాధింపబడుతుంది. ఎందుచేతాంటే
అమ్మకదాండీ అన్నం పెట్టేది, నైవేద్యాలు పెట్టారు ʻయేడాదికోసారి నైవేద్యాలు పెట్టారుʼ అంటారు. మనం ఆ ఊరి అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం పొందితే ఆ
ఊళ్ళో చక్కగా వంశం తామర తంపరగా పెరుగుతూ, ఐశ్వర్యం పెరుగుతూ అన్నవస్త్రాలకు
లోటులేకుండగా జీవనంచేస్తూ మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ ఊరి యొక్క అధిష్టాన దేవత
ఆగ్రహం చెందితే ఆ ఊరి ప్రజలు ఇబ్బంది పడుతారూ అని అందుకని మనం ఒక ఊళ్ళో ఉంటున్నామూ
అంటే ఆవిడ అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం.
|
కాబట్టి
ఇప్పుడు ఆ ఊరు విడిచిపెట్టి దీర్ఘకాలం పాటు మనం ఎక్కడికైనా వెడుతుంటే... ధర్మ
శాస్త్రం ఏంచెబుతుందంటే ఊరు విడిచి ఊరి పొలిమేరలకు వెళ్ళిన తరువాత ఒకసారి ఆగి
నమస్కరించాలి, లేదా ఇలా మనసులోనైనా నమస్కరించాలి, అమ్మా నేను ఇలా బయలుదేరి
వెడుతున్నాను నేను క్షేమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసుకొని మళ్ళీ వెనక్కు
వచ్చేటట్టుగా నీవు నన్ను అనుగ్రహించు అని, అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి
క్షేమంగావెళ్ళి మళ్ళీ తిరిగి సంతోషంగా రా! అని మనసులో అంటే ఏమౌతుందంటే ప్రయాణమనేటటువంటిది ప్రమాదముతో
కూడుకుని ఉంటుంది, అన్ని వేళలా ప్రయాణము క్షేమకరమే అయివుండాలని ఏమీ లేదు.
కాబట్టి ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా తిరిగి మనం ఏ ఊరు నుంచి బయలుదేరామో ఆ ఊరు
చేరుకోగలిగేటటువంటి అదృష్టాన్ని పొందుతాం.
మీరు ఒక
విషయాన్ని గమనించండీ! ఇలా ఉంటూందా నిజంగాను అనిమీకు అనుమానంరావచ్చు. ఇక్ష్వాకు
వంశంలోనే ఒకరాజు ఒకానొకప్పుడు అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి వేరొకప్రదేశంలో
ఇంచుమించు దానిని రాజధాని అన్నధోరణినిలో అక్కడ ఉండడం మొదలుపెట్టాడు. అయోధ్య రాజధాని
- కాదు అనలేదు కానీ అక్కడ ఉంటుంన్నాడు, ఒక రాత్రివేళ అయోధ్యానగరాధిష్టాన దేవత
వచ్చిలేపింది ʻవంశంలో పరంపరాగతంగా మీవాళ్ళందరూ అయోధ్యానగరలోవుండి
పరిపాలనచేశారు నీవు ఎందుకు అయోధ్యకు దూరంగా ఉంటున్నావు నీవు అయోధ్యకు తిరిగి రా!ʼ అని, కాబట్టి ఎప్పుడూ కూడా నగరానికి అధిష్టానదేవత ఉండడం
అన్నది ఉంటుంది. ఛాందస్తము అనుకున్నటువంటివాళ్ళు దాన్నివల్ల పొందేటటువంటి ఉపయోగం
ఏమీ ఉండదు. కానీ ఒక ఈశ్వరశక్తీ అనేటటువంటిది లోకంలో ఎప్పుడూ ఉంటూంది, ఎవరైతే ఆ
ఇలాంటివన్నీ కృతకమైన మాటలండీ అంటాడో... ఒక విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది, మన
ఊపిరిని మనం తీస్తున్నామా? మన ఊపిరిని మనం తీయట్లేదు ఎవరి ఊపిరిని వారుతీసింది నిజమైతే
ఎవరి ఊపిరీ ఆగిపోదు కూడా... కదా! చచ్చిపోయ్యేవాళ్ళందరూ అమాయకులై ఓ నా ఊపిరి
ఆగిపోతే ఫరవాలేదూ లేండని ఆపేసుకుంటున్నారా... ఊపిరి ఆడాలనే కోరుకుంటున్నారు. మరి
కొరుకుంటున్నా ఎందుకు ఆగిపోతూందీ కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని
మరనమయ్యెడి వ్యాది మాన్పలేరు ఈశ్వర శాసనం ఒకటి ఉంది లోకంలో ఆ ఈశ్వర శాసనాన్ని
ఆ ఈశ్వరానుగ్రహాన్ని ఎన్నిరకాలుగా మీరు పొందవచ్చో రామ చంద్ర మూర్తి అయోధ్య కాండలో
మనకు చూపిస్తారు. అదుకనీ ఇది మనం నేర్చుకొనవలసిన ఒకమంచి అలవాటు. ఒక ఊరిలో
ప్రవేశించినా, ఒక ఊరి నుంచి వెళ్ళిపోతున్నా అంటే మనమున్న ఊరినుంచి బయలుదేరి
వెడుతున్నా ఆ ఊరి అధిష్టాన దేవతకి ఒకనమస్కారం చేయడమన్నది మంచిసాంప్రదాయం.
ఇది దృష్టిలో
పెట్టుకునే మనవాళ్ళు మనకు ఒకమంచి అలవాటుచేశారు యేడాది ఒక్కసారి ఆ ఊళ్ళో ఉన్నటువంటి
అమ్మవారికి నైవేధ్యాలుపెట్టాము అంటారు. అమ్మా మేము పిల్లాపాపలతో ఉండాలనీ ఒకవేళ
కూతురు పెళ్ళైపోయి అత్తవారి ఇంటికివెళ్ళి కొద్దిదూరంలో ఉందనుకోండీ కాస్త
ప్రయాణంచేస్తే అందుబాటులోకి ఉండేటటువంటి స్థితిలో కూతురు ఉంటే, ఆ కూతురికి
అల్లునికి మనవనికి ఈ ప్రసాదం ప్రత్యేకంగా ఆరోజున పంపిస్తారుకూడా తినమని, ఎందుకనీ
అంటే ఆ అధిష్టాన దేవతయందు అంతభక్తి ప్రవత్తులతో బ్రతకడమనేటటువంటిది ఈజాతి యొక్కలక్షణం.
|
అందుకే రామ చంద్ర మూర్తికూడా
అయోధ్యాధిష్టాన దేవతనుచూసి నమస్కారముచేసి బయలుదేరాడు. వాళ్ళు గంగానది ఒడ్డుకు
వెళ్ళారు వెళ్ళిన తరువాత సుమంత్రునితో ఒకమాట అంటాడు చీకటిపడిపోతూంది చీకటి పడిపోతున్నటువంటి
సమయంలో అవిదూరాత్ అయం నద్యా బహు పుష్ప ప్రవాళవాన్ ! సుమహాన్ ఇఙ్గదీ వృక్షో
వసామోఽత్రైవ సారథే !! ఓ సారథీ! నదికీ పెద్ద దూరంగా కాకుండా దగ్గర్లోనే అదిగో ఆ
పెద్ద ఇంగుదీ వృక్షం కనపడుతోంది అంటే గారెచెట్టు ఆ గారపిండి ముద్దలు చేసుకొని ఇంక
ఏమీలేకపోతే ఆ గారపిండి ముద్దతిని బ్రతుకుతారు. కాబట్టి రాముడు ఆ గారపిండి ముద్దలు
తినిబ్రతికాడు కొంతకాలం, ఏమీ దొరకకపోతే ఆ గారపిండే తినిబ్రతుకుతారు కొంతకాలం ఆకలి
తీర్చుకోవడానికి, అందుకనీ అదిగో ఇంగుదీ వృక్షం కనపడుతోంది చాలా పెద్దచెట్టు
ఈవాల్టి రాత్రికి మనం ఆ చెట్టుకింద పడుకుందాం కాబట్టి రథాన్ని ఆపు అన్నాడు,
రథాన్ని ఆపారు ఆయనలో అయ్యో..? నేను చెట్టుకింద పడుకుంటున్నానే ఇంత బ్రతుకు
బ్రతికినవాన్ని నేను నిన్నటి రోజున ఆ తమసా నదీ తీరంలో పడుకొన్నాను ఇవ్వాళ ఇంగుదీ
వృక్షం క్రిందపడుకోవడం ఏమిటీ..? ఈబాధ ఆయనకేం లేదు నేను ధర్మం పాటిస్తున్నాను.
సాయంకాలపు వేళ అవుతుంది ఆయన వేళ తప్పకుండా సంధ్యావందనం చేస్తాడు, ఆయన సంధ్యావందనం
చేసుకున్నాడూ అంటే... లక్ష్మణుడు కూడా సంధ్యావందనం చేశాడూ అనే గుర్తు.
కాబట్టి
ఇప్పుడు ఆ ఇంగుదీ వృక్షం క్రిందచేరి వాళ్ళు కూర్చున్నారు సుమంత్రుడు కూడా వినయంతో
వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఈలోగా ఆ ప్రాంతాన్ని శృంగిబేర పురము అని పిలుస్తారు,
దానికి గుహుడు నిషాదుడు బోయవాడు ఆయన అధిపతి తత్ర రాజా గుహో నామ రామ స్యాఽఽత్మ సమః సఖా ! నిషాద జాత్యో బలవాన్ స్థపతి శ్చేతి విశ్రుతః
!! ఆ ప్రాంతాన్నంతటిని
పరిపాలించేటటువంటి బోయవాడైనటువంటి నిషాదుడైనటువంటి గుహుడు. రాముడు అరణ్యవాసం
చెయ్యడం కోసమని బయలుదేరి ప్రయాణం చేస్తూ శృంగిబేర పురాన్ని చేరుకొని గంగానది
ఒడ్డున ఇంగుదీ వృక్షం క్రింద కూర్చున్నాడూ అని విన్నాడు. ఆయన జాతి బోయవాడు, ఆయన
చేసేటటువంటి వృత్తి వేట, వేట అనేటప్పటికి మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి
వేట రెండు రకాలుగా ఉంటుంది రాజులు వేటాడుతారు, ఎందుకు వేటాడాలి అంటే కేవలం వినోదం
కోసం కాదు, ఎందుకు వేటాడుతారు అంటే అవి క్రూరమృగముల సంఖ్య పెరిగిపోయి అవి జానపదుల
మీద పౌరుల మీదాపడి వాళ్ళను కబలించకుండా ఉండడం కోసమని వాటిసంఖ్య తగ్గించడానికి
వేటాడుతారు. తప్పా వేట అనేటటువంటిది జీవితంలో ప్రవృత్తిగా మారిపోయిందనుకోండి అదొక
వ్యాపారం కింద రోజూ అవసరం ఉన్నా లేకపోయినా ఏదో వాటినికొట్టడం, చంపడం, వాటి
చర్మాన్ని వొలవడం, ఆ మాంసం కోయడం, ఆ మాంసం అమ్మడం, ఆ చర్మాలు తీసుకురావడం ఇదీ నేను
నోటితో చెప్పినంత తేలికగా ఏమీ ఉండదు, దీనికి అనుషంగిక ప్రక్రియ ఏమైపోతుందంటే
జంతువులని ఎలా ఆకర్షించాలి, వాటిని ఎలా పట్టుకోవాలి, వాటికి ఎలాగ ఉచ్చు వేయవచ్చు,
వాటికి ఎలా వలవేయచ్చు ఏం చేస్తే మనకు బాగాదొరికిపోతాయి, వాటి బలహీనతలేమిటి వీటియందు
నిష్ణాతులై ఉంటారు బోయవాళ్ళు కాబట్టి వాటిని తీసుకొస్తారు, తీసుకొచ్చి అది చాలా
క్రూర కర్మ కిందే ఉంటుంది.
|
నేను ఒక్క పర్యాయం అటువంటి
పరిస్థితి ఒకటి చూశాను. ఒక ఉడతలు పట్టుకొనే ఉడత మాంసం అమ్ముకునేటటువంటి వ్యక్తి
యాద్రుచ్ఛికంగా నేను ఒక రోజున ట్రైనులో వెళ్ళిపోతుంటే, ప్యాసింజర్ ట్రైనులో రోజూ
తిరగవలసిన ప్రారద్భమొకటి వచ్చింది ఒకసారి జీవితంలో నాకు ట్రాస్ఫర్ అవడంవల్ల అందుకనీ
నేను ఆ ట్రైనులో వెల్తున్నప్పుడు ఒక పల్లెటూరిలో ఆగింది ఆ రైలు, ఉడతలు పట్టుకునే
వ్యక్తి ఉడతలు పడుతున్నాడు, నేను కాకతాళీయంగా చూస్తున్నాను. ఏమి చేస్తున్నాడు
ఉడతనని అతను ఏం చేశాడంటే ఆ ఉడత కాళ్ళకి తన వేళ్ళు చుట్టీ దాన్ని ఇలా లాగాడు,
లాగితే ఆ కాళ్ళని ఇలా లాగి ఆ ఉడతని పక్కన పెడితే ఆ ఉడత ఇంక కదలలేదు. అంటే ఆ నాలుగు
కాళ్ళు ఆ వేలుకు చుట్టుకుని లాగితే చచ్చుపడిపోయాయి. మీరు చెప్పితే నమ్మరూ నాకు
రెండు మూడు రోజులు అది అలా స్మృతిపథంలో ఉండిపోయి నాకసలు భోజనం సహించడం కూడా కొంచెం
ఇబ్బంది అయ్యేది. అది ఎంత ఖేదపడింటుందీ నాకు దానిమీదే దృష్టి వెల్లిపోతూండేది,
మనకీ అలా ఉంటుంది వాళ్ళకీ అది వృత్తిగా ఉంటుంది.
అయితే మీరు
ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. వాల్మీకి మహర్షి రామాయణ రచన చేసినప్పుడు
గుహుడితో రాముడికి పరిచయం ఎక్కడైనా ఏర్పడిందీ అని మనకు ఎక్కడా చెప్పలేదు, రాముడు ఈ ప్రాంతానికి
వచ్చాడని కానీ విశ్వామిత్రుడితో వెడుతున్నప్పుడు గుహుడితో ఎప్పుడైనా కలిపి
గడిపాడని కానీ గుహుడికీ రాముడికీ అంత పెద్ద ప్రేమతో కూడుకున్నటువంటి వ్యవహారాలేవో
ఉన్నాయనీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనీ కలిసి గడిపారని మనకి ఎక్కడా చెప్పలేదు.
కాని ఇక్కడ మాత్రం అకస్మాత్తుగా ఆయన అన్నారూ రామ స్యాఽఽత్మ సమః సఖా ఆత్మతో సమానమైనటువంటి స్నేహితుడు. ఎలా కుదురుతుందండీ!
అందులోనే తత్ర రాజా గుహో నామ రామ స్యాఽఽత్మ సమః సఖా ! నిషాద జాత్యో బలవాన్ బలవంతుడైనటువంటివాడు నిషాద జాతికి చెందినవాడు ప్రభువు
బోయవాడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకీ రాముడికీ స్నేహముందీ అంటే పోనీ
ఏదో ఉంది ఆత్మ సమః సఖా ఆత్మతో సమానమైనంత స్నేహము అంతగొప్ప స్నేహం ఎలా
కుదురుతుంది. రాముడు గుహున్ని అంతలా ప్రేమించేశాడు కాబట్టి అది రాముడి సౌజన్యమూ
అని చెప్పినటువంటి తేలికా అని నేను అడుగుతాను, అది నోటితో చెప్పినంత తేలిక కాదు, అక్కడ
ఏదో ఉంది అది మీరు పట్టుకోవలసి ఉంటుంది. ఏమిటి పట్టుకోవలసి ఉంటుందంటే...
ఒక్కొక్కరికి ఒక్క ధర్మం ఉంటుంది లోకంలో, ఎవరి ధర్మం వారిదే ఎవరి ధర్మాన్ని వారు
పాటించినప్పుడు ఆ ధర్మం మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ తన ధర్మాన్ని తాను
పాటిస్తున్న వ్యక్తిని మీరు నిందించడానికి అవకాశం లేదు.
నేను మీకొక ఉదాహరణ చెప్తాను ఇదే రాముడు - బాగా ఆకలేసింది,
సీతమ్మ అందీ చాలా ఆకలేస్తుందండీ అంది, లక్ష్మణుడు అన్నాడు అన్నయ్యా
ఆకలేస్తుందన్నయ్యా అన్నాడు, ఏమీ పండ్లు లేవు, కాయలు లేవు అప్పుడు రాముడు ఏం చేశాడంటే,
బాణం చేత్తో పట్టుకొని రామ లక్ష్మణులిద్దరూ వెళ్ళి ఒక లేడినీ, ఒక దుప్పినీ వేటాడి
తీసుకొచ్చి దానితోలుని ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనంచేసి ఆ మాంసం తిన్నాడు. వెంటనే
నాకు తెలుసు మీరూ అబ్బా... రాముడు అలా చేయడమేమిటండీ అంటారు, కానీ అది
క్షత్రియధర్మం, క్షత్రియుడు అలా తింటాడు మాంసం అది ఆయన చేయవలసిన పనే, మాంసాహారం
తింటారు రాజులు మృగాన్ని వేటాడుతారు తింటారు. అదీ అలా వేటాడి తినకుండా
ఉండవలసినటువంటి ఒక ఋషి ఆ పని చేశాడనుకోండీ దోషం, దోశడు నీళ్ళుతాగి పడుకోవాలి, ఒక
పండుతిని పడుకోవాలి, ఇంకా కుదరలేదనుకోండి ఆగలేకపోతే శరీరం నిలబెట్టటడం కుదరట్లేదనుకోండీ
“భవతి భిక్షాందేహి” అని నాలుగు ఇళ్ళ ముందుకి వెళ్ళాలి, తప్పా
|
మృగాన్ని వేటాడి తినటం ఒక ఋషికి ధర్మంగా
ఉండదు. ఎవరి ధర్మం వారిదని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఎవరి ధర్మంలోవారు ఉండి ఆ
ధర్మంలో తానుంటూ అందుకే గీతాచార్యుడు ఒకమాట అంటాడు, ʻఎవరి ధర్మం వారు పాటిస్తున్నవాడు ఆ ధర్మంలో తాను మరణించినా
ఉత్తమమేʼ పరధర్మో భయావవః పరధర్మాన్ని పట్టుకోవడం తప్పు.
కాబట్టి గుహుడు ఒక ఋషిలా ఉండాలని మీరు కోరుకోవడం తప్పు
గుహుడు గుహుడిలా ఉండడం ఒప్పు. ఆయన బోయవాడు కాబట్టి ఆయన వేటాడితే మీకేమిటి బాధ, ఆయన
బోయవాడు ఆయన వేటాడుతాడు అంతే కానీ ఛీ ఛీ క్రూరుడూ అలాగే వేటాడుతాడు అని అనడం తప్పు
అసలు. బోయవాడన్నాక వేటాడడాండి, కాటికాపరి ఉన్నాడండీ.. కాటికాపరి ఛీ దిక్కుమాల్నోడు
ఆ వల్లకాట్లోనే ఉంటాడు, అక్కడే అన్నం తింటాడు, నేను మా అమ్మగారి శరీరం విడిచి
పెట్టేసినప్పుడు చూశాను. ఇదేమిటీ ఆ శ్మశానానికి వేడితే హేలగా మనింట్లో పిల్లలూ
నాన్నగారూ రాగానే గబగబా కాళ్ళు కడుక్కోవడానికి ఓ చెంబుతో నీళ్ళు పెట్టేసి,
నాన్నగారండీ నాన్నగారండీ ఓ పంచ ఇదిగోనండీ అనీ, ఉత్తరీయం ఇదిగోనండీ అని తీసుకొచ్చి
ఎలా పెట్టేస్తారో, అలా వాళ్ళు కూడా అదేంటి మీరు ఫలానా కదా, మీరు శవమొస్తుందని ఫోన్
చేశారు కదా మీ శవాన్ని కాల్చుకోవడానికి ఇదిగో ఇదే స్థలం ఇక్కడ ఆ కర్రలు అవీ
పెట్టారు, అది ఇంకోళ్ళుకి ఏర్పాటు చేశారు, ఒకటనేమిటి బోలెడు వచ్చేస్తుంటాయి శ్మశానం
అన్న తరువాత అనీ... అక్కడ ఆ పిల్లలూ ఇలా నైవేద్యం పెట్టి ఏదో చేసిన క్రతువులో
అరిటి పళ్ళు అవి ఏవోవో తీసేసుకొని వాళ్ళు చక్కగా తినేస్తున్నారు. అక్కడే ఇన్ని
శవాలు కాలిపోతున్నాయి, ఇన్ని శవాలు ఖననం అయిపోతున్నాయి. ఆయన తన భార్యా బిడ్డలతో
కలిసి చక్కగా వంటచేసుకొనీ భోజనం చేస్తున్నాడు. ఎదో కబురు చేస్తే ఒక్క నిమిషం భోజనం
చేస్తున్నాను వస్తున్నానని చెప్పండీ అన్నాడు. అంటే అదేంటండీ, అలా ఎలాగండీ! అక్కడ అన్నం
ఎలా తిన్నాడని మీరు అనకూడదు. అది ఆయన వృత్తి, అది ఆయన ధర్మం, ఆయన ధర్మం ఆయన
పాటిస్తున్నాడు మీరు సంతోషించండి.
ఇది మీరు
రాముడి కోణంలో చూడవలసినటువంటి మాట, రాముడు ఎప్పుడూ ఏం చూస్తాడో తెలుసా... నీ
ధర్మంలో నీవు ఉన్నావా? ఆ ధర్మాన్ని తప్పితే రాముడు ఒప్పుకోడు, ఎందుకు వాలిని
చంపాడు - వాలి తన ధర్మం నుంచి పక్కకి అడుగేశాడు చంపేశాడు, అదే వాలి అధర్మంలో
ఉండకపోతే చంపడు, అదీ రాముడంటే. బోయవాడు బోయవాడిలాగా బ్రతికితే మీరు దానిని ఓ పెద్ద
వర్ణనచేసి ఏదో నిషాదుడూ, అక్కడ్నుంచి గుహుడు చాలా తప్పూ ఇలాంటివాడు అలాంటివాడు
అని, రాముడే ఉదారుడు అన్నట్లు మీరు మాట్లాడకూడదు, ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడా లేదా..!
రాముడే అంగీకరించాడు మీకెందు ఆ బాధ మీకు ఉండకూడదు. (అమ్మా ఆలస్యంగా వస్తే... మీరు
వెనక్కి కూర్చోవాలి అలా ముందు కొచ్చి కూర్చో కూడదు) కాబట్టీ నిషాదుడైనటువంటివాడు
నిషాదుడిగా బోయవాడిగా జీవితాన్ని గడపడం దోషభూయిష్టం కాదు, ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు
తప్పుకాదు కాబట్టి ఆ ధర్మాన్ని మనం ఎప్పుడూ చూడాలి, ఈదృష్టి కోణం మీరుబాగా అలవాటుచేసుకోండి.
ఇది ఏమౌతుందో తెలుసాండీ సమాజంలో అక్కడే కలగాపులగం అవుతుంటుంది. ఎవరి
ధర్మాన్నివాళ్ళు పాటించనివ్వాలి, తప్పా వాళ్ళ ధర్మంలోకి మీరు జోక్యం చేసుకొనీ
నీవ్వు ఇలా ఉండవద్దని చెప్పకూడదు, నీవు ఇలా ఉండి అభ్యున్నతిని ఎలా పొందచ్చో నీవు
చెప్పాలి. నీవు ఎలా ఉండాలో అలా ఉండాలి, నీవు అలా ఉండడం విషయంలో అలా నీ ధర్మాన్నివాడు
పాడుచేయకూడదు వాడు ఇతరుల ధర్మాన్ని పాడుచేయకూడదు, వాళ్ళ ధర్మాన్ని నీవు
పాడుచేయకూడదు ఎవరి ధర్మం వాళ్ళు చేసుకొనేటట్టుగా చేయాలి అదే నిజమైనటువంటి
ధార్మికమైనటువంటి ఆలోచన.
ఇది జాగ్రత్తగా
చూస్తే... రాముడు ఎప్పుడూ ఇదేచూస్తాడు ʻవాడి ధర్మంలో
వాడు ఉన్నాడా!ʼ నిషాదుడు ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు. ఇంక సువృత్తి ఎలా అయ్యాడు,
రాముని యందు ప్రేమ ఉందీ. బోయవాడిగా జంతువులను చంపుతాడు - రామున్ని ప్రేమిస్తాడు.
ఇంక ఎప్పుడు వీళ్ళిద్దరూ కలుసుకున్నారూ అన్నవిషయమంటారా... ఎక్కడో కలుసుకొని ఉండి
ఉంటారు? ఎప్పుడో ఏదో రామ దర్శనానికి వచ్చి ఉంటాడు, కాని అతడు రాముని మీద
చూపించినటువంటి ప్రేమకీ రాముడు కూడా పరవశుడయ్యాడు, బోయవాడు అయితే అయ్యాడు నాయందు
ఇంతప్రేమున్నవాడు కాబట్టి బాగాచేరికయ్యాడు, మీరు చూడండి సమాజంలో చూస్తుంటారు
ఒక్కొక్కసారి అందరికన్నా కూడా చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఎవరు మారిపోతారు అంటే మీరు
ఊహించడానికి వీలులేనంత రీతిలో చాల అట్టడుగున ఎక్కడో ఒక స్థాయిలో ఉన్నటువంటి
వ్యక్తి యజమానికి అంతదగ్గరవుతాడు, యజమానికి అంతదగ్గరవడానికి కారణమేమిటంటే ప్రధానం
ప్రేమ ఆ ప్రేమ దగ్గరచేస్తుంది అందుకే ఎప్పుడూ కూడా ప్రేమా అనేటటువంటి మాటకు స్నిగ్ధః
అంటుకుని ఉండేటట్లు చేస్తుంది ఆ ప్రేమ అంటుకోకుండా మీరు ఉండలేరు ప్రేమ ఉంటే. ఇదీ
వాళ్ళిద్దరి మధ్యా కలిసింది ధర్మం ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారు, రాముడు తన
ధర్మం పాటిస్తున్నాడు, నిషాదుడు తన ధర్మం పాటిస్తున్నాడు. తన ధర్మాన్ని తాను పాటించి ఇంకోడు తన ధర్మం పాటిస్తే
పెదవి విరవ వలసిన అవసరమేముంది రాముడు విరవడు మనం విరవ కూడదు. ఇదీ గుహుడి
విషయంలో చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసినటువంటి విషయం రాముడు ఎప్పుడూ ఇష్టపడేది
అదే... “నీ ధర్మంలో నీవు ఉన్నావా?” ఇది రాముడు చూస్తూ ఉంటాడు.
|
మీ ధర్మంలో మీరు ఉంటే మీరు రాముని యొక్క అంతేవాసి
అయిపోతారు, మీ ధర్మాన్ని మీరు వదిలిపెట్టేస్తే... రాముడు అంగీకరించడు. ఎవరెవరు
వాళ్ళ వాళ్ళ ధర్మాల్ని వదిలిపెట్టేశారో వాళ్ళందర్నీ ఆయన తెగ తార్చాడు, ఎవరెవరు
వాళ్ళ దర్మంలో వాళ్ళు నిలబడ్డారో వాళ్ళందరినీ ఆయన అంగీకరించాడు. అయితే
రామావతారానికి ఉన్న చాలా గొప్ప విశేషమేమిటంటే ఆయన నరుడిగా వచ్చాడు, అందుకే ఎప్పుడూ
ఈశ్వరిడిగా మీకు ప్రవర్తించి చూపించడు. నరుడు కాబట్టే ధర్మం కోణంలో చూశాడు ఆయన మారడానికి అవకాశం
ఇస్తాడు రాముడు, ఇది మీరు బాగాగుర్తుపెట్టుకోవాలి - రాముడు మారడానికి
అవకాశం ఇస్తాడు ఒకసారి కాదు నూరు మార్లు అవకాశం ఇస్తాడు, మీరు మారారనుకోండి రాముడు
కౌగలించుకుంటాడు, మీరు ఒకడుగే ముందుకేస్తే చాలు రాముడు నూరు అడుగులు ముందుకు
వేస్తాడు. మీరు ఒక్కడుగు వేయడానికి మీరు సిద్ధపడలేదు అనుకోండి అవకాశాలు ఇచ్చి ఇచ్చి
ఇచ్చి ఇచ్చి రాముడు తనవాడని అనడు పడగొడతాడు. కాబట్టి రాముడు ఇష్టపడేది ఏదీ?
“ధర్మమే”. ఇదే వేరొకసారి నిరూపణ చేస్తుంటుంది ఆయనకు లోపల ధర్మం పట్ల ఎంత అనురక్తి
ఉన్నదీ... ఎంత ధర్మావలంబకుడు అందుకే అంటాడు మారీచుడు ʻరామో విగ్రహవాన్ ధర్మఃʼ అంటాడు రామో
విగ్రహవాన్ ధర్మః అంటే రాముడు ధర్మాన్ని తన ఇష్టమొచ్చినట్లు చూడ్డం కాదు. మీరు
బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని అలా అయితే నిన్న రాత్రి దశరథ మహారాజుగారు
ఏమన్నారు, నాయనా నేను వృద్ధున్ని అయిపోయాను యుద్ధం చెయ్యలేనూ నీవు ఒకపని చెయ్యి -
నేను ఈమె యొక్క వరములు అనబడేటటువంటి వాటిచేత బంధింపబడ్డాను అందుకనీ నిగృహ్య మామ్ నన్ను నీవు నిగ్రహించు నీవు నన్ను ఓడించేసై
నన్ను కారాగారంలో పెట్టు రాజ్యం నీవు తీసేసుకో అన్నాడు.
నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను ఇప్పుడు దశరథుడు చెప్పింది చేస్తే
పితృవాక్య పరిపాలకుడు కాడా, తండ్రి చెప్పిందే కదా చేశాడు. మా నాన్నగారు ఖైదులో
పెట్టమన్నారండీ! మా నాన్నగారిని ఖైదులో పెటానూ నన్ను రాజ్యం తీసుకోమన్నాడు
తీసుకున్నానూ, రోజూ నీవోసారి కనపడు అన్నారు కనపడుతున్నానూ నేను పితృవాక్య
పరిపాలకుడను అని రాముడు అన్నాడనుకోండీ, ఏం మీకేమైనా అభ్యంతరమా అందులో... ఏమైనా
ఉందా..? ఎందుకండీ మరి తండ్రి చెప్పిందేగా చేశాడు. రాముడు ఏమన్నాడంటే వెంటనే
కాదూ... నా పుత్ర ధర్మం నన్ను నిర్వర్తించనివ్వండి, ధర్మ వ్యతిరిక్తమైన మాట నాకు బోధచేసి అలా చేద్దామని
కోరుకోవద్దు, ధర్మంలో ఇద్దరం నిలబడుదాం 14 యేళ్ళు ఒక రాత్రి నిద్రలా
గడచిపోతాయి నేను తిరిగి వస్తాను, మీరు చూస్తారు అన్నాడు. రాముడికి తనకి
అన్వయమయ్యేటట్టుగా చూసుకోవలి అనుకొంటే ఒక్కమాట చాలు రాజ్యం పుచ్చుకోవడానికి
రాముడికి అది కాదు తన ధర్మం తానుచేస్తూ వెడుతూ ఉంటాడు. ఈ ధర్మంచేస్తూ వెళ్ళడమన్న
మాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ధర్మంచేస్తూ వెళ్ళిపోవాలంటే ఎప్పుడూ ఒక్కలా ఏమీ
ఉండదు ధర్మం. నిరంతరం
మారుతుంది ప్రతి క్షణం మారిపోతూంటుంది. ఏకాదశి ఉపవాసం ధర్మం, ద్వాదశి
వచ్చింది పారణ ధర్మం. సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినేయ్యాలి
మీకు అదే ధర్మం అందుకే కదూ ద్వాదశి వచ్చింది అన్నం తింటానంటే దుర్వాస మహర్షి
వచ్చాడు అంబరీసోపాఖ్యానంలో, ద్వాదశి గడియలు మించి పోతున్నాయయ్యా ఏం చేయను మరీ
తినాలిగదా... కొన్ని మంచి నీళ్ళు పుచ్చుకోవయ్యా అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు
ఋషులందరూనూ. అంటే ద్వాదశికీనూ పారణ ధర్మం మీరు తినడం ధర్మం. ఏకాదశికి తినకుండా
ఉండడం ధర్మం, ఏకాదశి ధర్మం ద్వాదశి నాడు ఉందా..?
|
బ్రహ్మచారి తాంబూళం
వేసుకోకపోవడం ధర్మం, గృహస్తు భార్య ఇచ్చిన తాంబూళం వేసుకోవడం ధర్మం. గృహస్తు తన
భార్యపట్లా కామం కలిగివుండడం ధర్మం అన్యకాంతపట్ల కామం కలిగివుండడం పరమ అధర్మం. తను
తన తండ్రి ముందు నిల్చుంటే పుత్ర ధర్మం, తన కొడుకు ముందు నిల్చుంటే పితృ ధర్మం.
ఎక్కడికి వెళితే అక్కడ ఆఁ ధర్మం, ఆ ధర్మంలో అలా కూర్చున్నప్పుడు అలా చెప్పడంలో
భయపడకూడదు. అలా మీరు భయపడిపోయారనుకోండీ అప్పుడు మీకు అసలు ధర్మనిష్టలేదు
అనిగుర్తు. దేనికొరకు మీరు ఆ
పాత్రలో ఉన్నారో అక్కడ ఆపాత్ర పోషించడంలో మీరు ఎంత మాత్రమూ అధైర్య పడకూడదు. మీరు
ధైర్యంగా ఉండాలి అంతే... నేను
నా ధర్మంలో ఉన్నాను దానికింక వ్యక్తిగతమైన విషయాలతో సంబంధమేమీ లేదు ఆ ధర్మంలో ఆయన అంతే అలాగే ఉండాలి అదే
ధర్మమంటే. ధయతేవ పట్టుకోవాలి
ఎందులో మీరు ఉన్నారో దాన్ని పట్టుకుని నిలబడగలగాలి అంతేకాని కలగాపులగంచేసి లోపలి
ప్రయోజనం కోసమనిచెప్పి లోపల ఒకటి కోరుకుంటున్నాడు కాబట్టి ధర్మాన్ని తదానుగుణంగా
మార్చకూడదు ఇదీ కౌసల్య అంది. ధృత్యా చ నియమేన చ ధృతితో పట్టుదలతో పట్టుకో
నియమంతో పట్టుకోండి, నియమంతో పట్టుకో అంటే? నీవు ఏది కోరుతున్నావో దానికి
అనుగుణంగా చేసేయడానికి వీలుగా నీకు అవతలవారిమాట వినపడినా కూడా అది ధర్మానుగుణమేనా
అన్నది ఆలోచించు తప్పా నీకు పనికొచ్చింది కాబట్టి చేసేయవద్దు అది ధృతితో పట్టుకో
నియమంతో పట్టుకో రామా! ఇన్నాళ్ళు ఎలా పట్టుకున్నావో అలాగే పట్టుకో అదే నిన్ను
రక్షిస్తుంది. అరణ్యవాసానికి బయలుదేరాడు, పైకి రాముడు ఒకడు లోపలి రాముడు ధర్మ
మూర్తి ఎప్పుడూ ధర్మమే ఇదీ గుహుడి ఘట్టంలో మీరు చూసినప్పుడూ ఆకాశం భూమితో చెలిమి
చేసినట్లు ఉంటుంది.
ఈ రెండికి పొంతన ఎలాగా అంటే దేని ధర్మాన్ని అది ప్రకాశింపచేస్తే రాముడికి
ఎవరితో కలవడానికి అభ్యంతరం లేదు. సరికదా! రాముడితో కలవడం అన్నది ఎలా ఉంటుందో
తెలుసాండీ! మామూలుగా ఉండదని మీరు బాగాజ్ఞాపకం పెట్టుకోండి. రామానుగ్రహం మీవంశంలో
ఎవరికికైనా ఒక్కరికి కలిగిందనుకోండి, ఒక్కరు సాధించారు అనుకోండి, అది మామూలుగా ఉండదు అది ఎలా ఉంటుంది అంటే..? ఒక 500
సంవత్సరాలకి సరిపడినంత కృపా అప్పుడే వర్షించేస్తాడు ఆయన, దాన్ని నిలబెట్టుకోవడం మీ
ఇష్టం నిలబెట్టుకోవడం మీ చేతులలో ఉంటుంది రామానుగ్రహాన్ని నేను ఈ మాట
ఎందుకంటున్నానంటే వాల్మీకి రామాయణంలో లేదు, కానీ ఇతర రామాయణాలలో చెప్తుంటారు. ఒక
ఉడతా ఏదో నీళ్ళల్లో దూకి బయటకొచ్చీ మళ్ళీ ఇసుకలో దొర్లీ మల్లీ నీళ్ళల్లో పడింది ఎందుకూ
అని అడిగారు, ఎదో సేతువు కడుతున్నారు కదా నావంతు ఉపకారం చేస్తున్నాను అంది. రాముడు
ఏంచేశాడు ఓ పదిరూపాయలు ఇవ్వలేదుదానికి లేకపోతే నీ జీవితంలో ఎక్కడి వెళ్ళిపోయినా
నీకు పళ్ళుదొరుకు గాకా! అని అనలేదు. ఆ ఉడతకి ఇవ్వలేదు వరం ఉడతని చేత్తోపట్టుకొని
తన కుడిచేతి మూడు వేళ్ళతో ఇలా రాశాడు. ఉడతా అన్న ప్రతి ఉడత మీద ఆ జాతిలో పుట్టిన
ప్రతి ఉడత మీద మూడు వేళ్ళ గీతలు ఉన్నాయి అన్నారు. ఒక్క ఉడతచేస్తే మొత్తం ఉడత జాతి
అంతా రక్షింపబడింది రామానుగ్రహానికి వంశంలో ఒక్కడు రామోపాసన చేసినవాడు ఉండి
ఉంటే... ఆ వంశం అంతటినీ రామానుగ్రహం రక్షిస్తుంది మాకు అక్కరలేదని వదిలేసుకునేంత
వరకు, ప్రయత్నపూర్వకంగా నీవువదిలేసి పరమ అధర్మాత్ముడివి అయిపోయి రామానుగ్రహాన్ని
నీవు వదిలేసుకొని నీవు రావనుడవైపోయి నిలబడిపోతే అప్పుడు ఎవరేం చేయగలరు అలా కాకుండా
నీవు భక్తితో నిలబడ గలిగితే అది ఎక్కము ద్విగుణీకృతమౌతుంది. అందుకే ఒకరు
రామానుగ్రహాన్ని తెస్తే మిగిలినవాళ్ళు దాన్ని రక్షించుకుంటుండాలి ఉడతై కూర్చుంటావు
అంతే నీవు చేయగలిగింది ఒక్కటి రామునికి చేశావా... అంతే నీ వంశమంతా తరిస్తుంది ఇది
ఆయన చూసే ధర్మం, ఆ ధర్మాన్ని చూస్తూ ఉంటాడు ఆయన.
కాబట్టి ఇప్పుడు గుహుడు అన్నాడూ భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యం చేదమ్
ఉపస్థితమ్ ! శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనం చ తే !! ఇదీ ప్రేమా అన్న మాటకు
అర్థం, రామా! నీకు
తినడానికి కావలసినటువంటివి అన్నమూ మొదలైనటువంటివి, పాయసాదులు మొదలైనటువంటివి,
పానకాలు, లేహ్యాలూ అంటే తాగేవి నాకేవీ కొరికేవి తినేవి మింగేవి అన్ని వండించి
సిద్ధం చేశాను, ఎప్పుడు చేశాడు ప్రేమ ఉంది కనుకా రాముడు వచ్చాడూ అని తెలియగానే
ఏమోయ్ ఇవన్నీచేసై అన్నాడు, ఇన్ని తింటాడా
అనవసరం ప్రేమ ఇదీ ప్రేమ అన్నమాటకు పరాకాష్ఠ. అనీ పరుగెత్తుకుంటూ వచ్చాడు వనవాసానికి వచ్చాడటా ఇప్పుడు రామునికి రాజ్యం
పోయిందటా సీతా లక్ష్మణులతో కలసి తిరుగుతున్నాడటా దశరథుడు పంపించేశాడట ఇంట్లోంచి, అందుకని చెప్పేసేసి అడవికి వచ్చినవాడు
చెట్టుకింద ఉంటాడేమిటీ ఎలాగో వస్తాడు మనింటికి ఇక్కడికి వస్తాడులే బాబూ.., ఎన్నాళ్ళుంటాడో ఏమిటో? మనం.., అరణ్యంలో ఉన్నవాడు మనింట్లో కూర్చుంటాడేమో 14
యేళ్ళంటే ఓ యేడాది ఉంటానంటాడేమిటో అనేవాడైతే మొఖం చాటేస్తాడు.
రాముడు వీధి అవతల ఎందుకు కూర్చున్నాడో తెలుసాండీ ఇంగుదీ వృక్షం క్రిందా! అందుకే చంద్ర శేఖర పరమాచార్యా కంచి కామకోటి
పీఠాదిపతులు నిరంతరం సంచారం చేస్తుండేవారు, సంచారం చేస్తూంటే... తెనాలిలోనే
అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, ఒక గొప్ప బ్రాహ్మణుడు వేదం చదువుకున్నాయనా ఆ...
పరమాచార్య దగ్గరికి వెళితే మాత్రం పలకరిస్తారా... అంత జనం తీర్థానికి వెళితే మాత్రం ఆయన అనుగ్రహం మనకు
కలుగుతుందేమిట్లే అని మనల్ని పలకరిస్తారా! అని అనుకున్నాడు. ఆయన తెల్లవారు ఝామున
బయలుదేరి ఎవ్వరికీ చెప్పకుండా స్నానం చేసేసి సత్యదండం పట్టుకొని వెళ్ళి
వాళ్ళింటిముందు కూర్చున్నాడు. అసలు ఆయన వెళ్ళలేదు ఏమిలేదు ఆయన మనసులో అనుకున్నారు
అంతే, వెళ్ళి
|
వీధిలో
కూర్చున్నారు తెల్లవారిగట్ల వాళ్ళావిడా కళాపి చల్లుదామని బయటికి వచ్చింది పరమాచార్యులవారు
కూర్చుని ఉన్నారు చీకట్లో ఇంటిముందు, ఎదో అనుష్టానం చేసుకుంటున్నారు ఆయన
దక్షణామూర్తి స్తోత్రమో ఏదో పారాయణ చేస్తున్నారు, ఆవిడచూసి తెల్లబోయింది ఏమిటి
పరమాచార్యులవారేమిటీ ఇంటిముందు ఉండడమేమిటీ అని, ఆవిడ పరుగెత్తుకువెళ్ళి భర్తకు చెప్పింది
ఆయన ఏడుస్తూవచ్చి పరుగెత్తుకొచ్చి కాళ్ళమీదపడి నిన్ననే నేను నా మనసులో అన్నది
గ్రహించేశారు స్వామీ అనుగ్రహించడానికి వచ్చారా అన్నాడు. వేదమంటే నాకు
ప్రాణమయ్యా..! నీలా అనుష్టించేవారంటే నాకు ప్రాణం ఏం ఎందుకు రాననుకుంటున్నావ్?
ఎందుకు పలకరించననుకున్నావ్ అందుకే నీ ఇంటిముందుకు వచ్చాను రా! అని అరుగెక్కి
కూర్చుని మాట్లాడాడు ఆయన.
రాముడు అంటే అంతేనండీ! మహా పురుషులైనటువంటివారి స్థితీ అలా ఉంటుంది అంత
వినయంగా ఉంటుంది, అంత గౌరవంగా ఉంటుంది. చంద్రశేఖర భారతీ తీర్థవారు సింహగిరి పీఠాధి
పత్యం వహించి ఆయన కాలడి వెళ్ళారు, శిష్యులందరూలేచి చంద్రశేఖర భారతీస్వామి వస్తుంటే
గురుస్తోత్రం చేస్తారుకదా... చేసి కాళ్ళమీద పడ్డంకోసమని లేచినిల్చున్నారు. ఆయన
అన్నారు ఆగండి! ఇక్కడ ఎవ్వరూ గురువులేడు శంకరులు ఒక్కరే గురువు ఇది జగత్ గురువులు
పుట్టిన ప్రదేశం ఇక్కడ శంకర భగవత్ పాదులు ఒక్కరే మీరైనా నేనైనా ఆయనకే నమస్కారం మీరు
నాకు చేయద్దు ఇక్కడ అన్నారు. ఇదీ వినయం ఎంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతీస్వామి
వారంటే లోపల ఆ భక్తి ఆ ప్రేమ ఉంటే అది ప్రకటనం కాకుండా ఉండదు.
కాబట్టి నేను అన్నీ వండించాను రామా! అన్నీ వండించాను అన్నమాటలో అందం చూడండీ
మీరు, ప్రేమ స్యాఽఽత్మ సమః సఖా ఆయన బోయవాడైతే నీకేంటిబాధ ఆయన ఏమంటున్నాడో
చూడండి మీ రథానికి కట్టినటువంటి గుఱ్ఱాలకి గడ్డి కూడా సిద్దంచేశాను. మీరు
తినడంకాదు మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ గుఱ్ఱాలకి కూడా గడ్డి పెట్టుకుంటాను ఇదీ
ప్రేమంటే. ఎంత గొప్ప మాటలండీ... అంటే రాముడు అన్నాడూ నాయనా! గుహమ్ ఏవం బ్రువాణం
తం రాఘవః ప్రత్యువాచ హ ! అర్చితా శ్చైవ హృష్టా శ్చ భవతా సర్వథా వయమ్ !! పద్భ్యామ్
అభిగమా చ్చైవ స్నేహ సందర్శనేన చ !!! ఇంకేం చేయాలయ్యా గుహా! నా కోసం అన్నీ
వండించావ్, నాకోసం కాలినడకన పరుగెత్తుకొచ్చావు - కాలినడకన ఎందుకు రావాలి గుహుడు
కూడా రావాలంటే ఏదో ఒకటి ఎక్కిరాగలడు ఆయన నిషాదులకు ప్రభువు అక్కడ నా స్వామి - నా
స్నేహితుడు కాలినడకన వెడుతాడట ఇక ఈ తరువాత ఆయన ఇక్కడికి రథంలో వచ్చి ఉండచ్చు,
గౌరవమంటే నేను ఆయన దగ్గరికి కాలినడకన వెళ్ళాలి అంతేకాని నేనూ ఆయన దగ్గరికి కూడా
ఎలా వాహనం మీద వెల్తాను చెట్టు దగ్గరిదాకానూ అందుకోసం నాకోసం నడిసొచ్చావు నాకోసం
గౌరవం చూపించావు ఇన్ని చేయించానంటున్నావు ఇంకేం కావాలి నాకు చేయవలసినవన్నీ
చేసేసినట్లే. నేను మీతో మనవిచేశా ఆతిథ్యం గురించి చాలాచోట్ల ఉంటుంది రామాయణంలో
ప్రేమగా పెట్టినటువంటి కబళము అమ్మచేత్తో పెట్టిన అన్నం లాంటిది ఎంత భోజనం మీరు
పెట్టినా దానిని మీరు వెనక ప్రేమలేకపోతే దానిలో ఏమీ ఉపయోగం ఉండదు. ఏదో వచ్చాడు
ఖర్మకాలి వీడొచ్చాడు ఏమిటి అని పెట్టిన అన్నము తినబుద్ధివేయదు. కౌసల్యా ఒకచోట
ఒకమాట అంటుంది, అటువంటి భోజనాన్ని పవిత్ర జీవితం గడిపేవారు అంగీకరించరు అని
అంటుంది.
|
కాబట్టీ ఇప్పుడు ఈ
మాటలు రామ చంద్ర మూర్తి అనీ ఆయన అన్నాడు అశ్వానాం ఖాదనే నాఽహమ్ అర్థీ నాఽన్యేన కేనచిత్ !
ఏతావతాఽత్ర భవతా భవిష్యామి సుపూజితః !! నీవు నన్ను బాగాపూజించినట్లే నేను ఇప్పుడు
అవన్నీ తినను, నేను ఉన్నటువంటిస్థితి, నేను ఉన్నటువంటి ధర్మము దాన్ని అంగీకరించదు
కాబట్టి నాయనా మాతండ్రిగారి గుఱ్ఱాలవి, మా తండ్రిగారికి అవి అంటే చాలా ప్రేమ ఆ
గుఱ్ఱాలకి గడ్డిపెట్టు రాముడూ ఎప్పుడూ తనగురించి ఆలోచించేటటువంటివాడు కాడు సర్వభూత
హితే రతః అందుకే రామాయణం చదివి చదివి రామానుగ్రహం పొందినటువంటివాళ్లను మీరు
గమనిస్తే... ఎప్పుడూ కూడా ఎక్కడో ఉన్నటువంటివాన్ని కూడా అయ్యా భోజనంచేశారా
సంతోషంగా ఉంటున్నారా, సుఖంగా ఉంటున్నారా అని అడుగుతాడు, మీరు చూడండీ రామాయణంలో
రాముడు ఎవర్ని కలవనీయ్యండీ ఈ ప్రశ్నవేస్తాడు. సుఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా
అంటారు. వెళ్ళిపోయేటప్పుడు రాముడు ఎప్పుడూ ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడుతాడో
తెలుసాండీ..? వాళ్ళు ఎందులో
ఉన్నారో దానికర్తవ్యాన్ని గుర్తుచేస్తారు చాలా జాగ్రత్త సుమా! తెలిక
అనుకుంటున్నావేమో... చాలాకష్టం నీవు ఉన్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా
నిర్వహించాలి నాయనా నీవు పూనికతో చేసుకో సుమా! అనిచెప్పి వెల్తాడు
అంతేకానీ, నీకేం ఫర్వాలేదు నేను ఉన్నాను అని అంటూ ఉండడు ఒక నిర్లక్ష్యధోరణివస్తూ
ఉంటుంది తెలుసాండీ..! అలా చెప్పకూడదు ఎప్పుడూ ఎప్పుడూ... చెప్పకూడదు, నీకేం ఫర్వాలేదు నేను ఉన్నాను కదా
అన్నమాట ఎప్పుడూ అనకూడదు అలా అంటే అవతలివాడు ఏం చేస్తాడో తెలుసా పురుష కారమునందు
వైక్లవ్యం పొందుతాడు నాకేమిట్లే అన్నధోరణి వస్తుంది అలా అనకూడదు.
నాయనా జాగ్రత్త! నీవు నిర్వహించే కర్తవ్యం అటువంటిది కాబట్టి నీవు పూనికతో
ఉండాలి సుమా! అని ఆయనకి చెప్పీ నీవు అప్పుడు ఈశ్వరుని ప్రార్థనచేయాలి ఆయనకీ,
ఈశ్వరా! నీవు అనుగ్రహాన్ని ప్రసరించు అని నీవు ప్రార్థనచేయాలి, అంతేకానీ నీకు నేను
ఉన్నానని చెప్పకూడదు, అలా చెప్పడమూ దోషభూయిష్టం అవుతుంది అన్ని వేళలా ఇంక అదే
పనిగా అదే మాటగా అస్తమానం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదేదో గౌరవమొచ్చేస్తుంది
కీర్తి వచ్చేస్తుందని అలా మాట్లాడ కూడదు, రామాయణం మీరుబాగా చదివితే రాముడు ఎలా
పలకరిస్తాడో వెళ్ళిపోతూ ఎలా మాట్లాడుతాడో మధ్యలో ఎలా మాట్లాడుతాడో దేనిగురించి అలా
మాట్లాడుతాడో బాగా మీకు బోధపడితే అసలు మాట తీరేమారిపోతుందండీ రామాయణంలో ప్రతి
శ్లోకమూ ఒక అమృత భాండమే... కాబట్టి భవిష్యామి సుపూజితః నీవు నాకు చాలా
గొప్ప పూజచేసినట్లే, కాబట్టి వాటికి ఆహారమును ఏర్పాటు చేయ్యి అన్నాడు.
అన్న తరువాత మరునాడు, ఆ రాత్రి అక్కడ పడుకున్నారు పడుకోవడం అనేటటువంటి ప్రసక్తి
వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది, నిషాదులైనటువంటివారు అంటే బోయవారు
అయినటువంటివారు పెద్ద సంస్కృతితో ఉన్నటువంటివారై ఉండాలి అని మీరు ఆలోచించ కూడదు,
రాముడు ఏటువంటివాడు పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ రామున్ని మగవాళ్ళే చూద్దామనుకుంటారు, సీతమ్మో
అసలు ఆవిడ్ని సూర్య చంద్రులే చూడలేదూ అనిచెప్పి మనకు అయోధ్య కాండలోనే పౌరులు
అన్నారు, అంతటిమహా సౌందర్యవతీ మహాపతివ్రత. ఇప్పుడు రాముడు హంసతూలికా తల్పాల మీద
పడుకుని వీణానాదం వినపడుతుండగా నిద్రపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు, అలా నిద్రపోయే
|
స్వభావమున్న
వ్యక్తి మనసులో బాధ అన్నది ఉందనుకోండీ ఆయన పడుకోలేడు. మీరెప్పుడూ
గుర్తుపెట్టుకోండి
|
మనసులో ఏదైనా చాలా బెంగకానీ బాధకానీ భయంకానీ ఈ
మూడు ఉంటే నిద్రపట్టదు మనసు వైపునుంచి, శరీరం వైపునుంచి రుగ్మత ఉంటే పట్టదు,
మహాభారతంలో విదురుడు నిద్రపట్టడం లేదంటే ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు.
కాబట్టి ఇప్పుడు రాముడు పడుకున్నాడు దేని మీద పడుకున్నాడు ఆహారమే తిననన్నవాడు
తల్పము ఏర్పాటుచేశాను పడుకో అంటే పడుకోడుగా..! నాకొక నియమముందీ కాబట్టి నేనీ
చెట్టుకింద ఇంగుదీ వృక్షం కింద
పడుకుంటాను అన్నాడు. చెట్టుకింద పడుకుంటానని ఆ చెట్టుకింద ఇతః పూర్వం ఏవేవి
తిరిగాయో అది ఎలా ఉందో దాన్నేం తుడిపిస్తారా కడిగిస్తారా ఇప్పుడు వీరు
అకస్మాత్తుగా, ఓ నాలుగు ఆకులు తెచ్చి అక్కడ పడేశారు పడేసి దానిమీద ఏం చేశారంటే కొంచెం
మెత్తగా ఉంటుందనీ ఆకింద కొంచెం ఏదో మెత్తగా ఉండెటటువంటి ఈనెలు వంటివి వేసి దానిమీద
ఆకులు వేశారు వేసి పడుకోమన్నారు పడుకోమంటే రాముడు పడుకున్నాడు ఎలా పడుకున్నాడని
చెప్తున్నాడు మహర్షి తన చెయ్యి తన తలకింద పెట్టుకొని పడుకున్నాడు, ఎందుకని సుఖంగా
మెత్తటి తలగడల మీద తల పెట్టుకొని పడుకునే అలవాటున్న రాముడు ఇప్పుడు తలగడ లేదు
కాబట్టి తలగడ లేదన్న భావన లేకుండా తన గుండ్రని మెత్తని చెయ్యినే తన తలకింద
పెట్టుకొని పడుకున్నాడు. పడుకుంటే సీతమ్మ ఏం చేయ్యాలి ఆవిడా పడుకోవాలిగదాండీ
మనుష్య ధర్మం ఏవరైనా రాత్రైతే, ఇప్పుడు ఆవిడ ఎక్కడ పడుకోవాలి, ఆవిడ రాముడిలా నార
చీర కట్టుకుని లేదు పట్టుబట్టలు కట్టుకుని మంచి ఆభరణములు పెట్టుకొనీ ఆవిడ ఉంది.
స్త్రీ పడుకోవడమూ అంటే భర్త పడుకున్న తరువాత భార్యా పక్కనే పడుకుంటుంది కదా
అది ధర్మం. అదీ ఇప్పుడు ఆవిడ రాముడి పక్కన పడుకోవాలి, రాముడి పక్కన పడుకుంటే ఇద్దరూ
కలసి ఎక్కడ పడుకున్నారు చెట్టుకింద పడుకున్నారు, చుట్టూ ఎవరున్నారు నిషాదులున్నారు
బోయవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు చూడచ్చా చూడకూడదా... అన్నది వాళ్ళకి తెలియదు
వాళ్ళు అమాయకులు. అదే ఒక సంస్కారమున్నవాళ్ళు అనుకోండీ, తన భార్య తప్పా అన్యకాంత నిద్రపోతూంటే చూడకూడదు కన్న
తల్లైనా సరే, అన్యకాంత నిద్రపోతూంటే ఉపనయనం అయిపోయిన తరువాత ఇంక అలాంటి ఆడదాన్ని
చూడకూడదు నిద్రపోతూంటే ఒక వేళ ఎదో పొరపాటున తలుపు తీసి ఉంటే మూయాలి మనం అయితే,
కాబట్టి ఇప్పుడు ఇది సంస్కారమూ ఆ స్థితి ఉన్నవాళ్లైతే చూడరు, బోయవాళ్లు కాబట్టి
ఏంచేస్తారు రాముడు ఎలా పడుకున్నాడో... సీతమ్మ ఎలా పడుకుందో... వాళ్ళ హృదయంలో
కల్మషం ఉండదు, కానీ మహానుభావుడు అంత గొప్పవాడు నాన్నగారు పంపించేశారట అడవిలపట్టి వచ్చి
చెట్టుకింద పడుకున్నారని అదే పనిగాచూస్తుంన్నారు. నిజంగా రాముడు ఏమిటో వీళ్లందరూ
చూడు ఎలా చుట్టుచేరారో అనుకుంటే నిద్రపోగలడా... పసి పిల్లలు వాళ్ళకు ఏంతెలుసు పాపం
నాయందు ప్రేమ నేను ఇలాపడుకుంటే నామీద బెంగపెట్టుకుచూస్తున్నారు అనుకుంటే, చుట్టూ
బిడ్డలందరూ మంచం చుట్టూ నిలబడి మాట్లాడినా నిద్రపోయిన నాన్నగారిలా... నిద్రపోయాడు,
సీతమ్మ ఏం చేసింది సీతమ్మా నిద్రపోయింది, ఇదీ సీతారాముల ధర్మమంటే.
అంటే ఆయనకు కడుపులో బెంగేమీలేదు ఇదేమిటి నేను ఇలా పడుకున్నానని బెంగేం లేదు,
నా అదృష్టం నాన్నగారి మాట వినేటటువంటి భాగ్యం నాకు కలిగింది అనుకున్నాడు. ఆయన
భాగ్యాన్ని చూసుకుంటున్నాడు మీగిలినవాళ్లు ఆయన పొందినటువంటి కష్టాన్ని
చూస్తున్నారు, కష్టం ఆయన మనసుకు పట్టలేదు వీళ్ళ మనసుకు పట్టింది ఆయన కష్టం, ఆయన
కష్టం వీళ్ళ మనసుకు పట్టడం ఆయనపట్ల వీరికున్నభక్తి, ఆయన కష్టం ఆయన మనసుకు
పట్టకపోవడం ఆయనకు తండ్రిపట్ల ఉన్నభక్తి ఇది ఆ పడుకోవడంలో ఉన్నటువంటి రహస్యం.
కాబట్టి ఇప్పుడూ లక్ష్మణుని దగ్గరికి వచ్చాడు మరి ముగ్గురిలో ఇద్దరు పడుకున్నారు
మరి మూడోవాన్ని పడుకోనివ్వరాండీ, కాబట్టి గుహుడు వచ్చి అన్నాడు నాయనా! నీకు కూడా
పక్కవేశాను నీవు కుడాపడుకో అన్నాడు అంటే వెంటనే లక్ష్మణుడు అన్నాడు కథం దాశరథౌ
భూమౌ శయానే సహ సీతయా ! శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా !! నిద్రేమిటయ్యా
కథం ఎలావస్తుందనుకుంటున్నావ్? నిద్రపోనా ఇంక నిద్రకాదు ఇంక నా జీవితానికి
సుఖం లేదు అన్నాడు.
|
నిద్రా - సుఖము
మీరు బాగాగుర్తుపెట్టుకోండీ! “నిద్రని నిద్రాకాలికా సుఖము అని పిలుస్తుంది
శాస్త్రం” ఎందుకంటే బాగా నిద్రపట్టిందా అని అడిగారనుకోండీ అబ్బాహ్ చాలాబాగా
నిద్రపట్టిందండీ అంటారు. అంతే కానీ ఏహ్... ఏం దిక్కుమాలిన నిద్ర అబ్బాహ్ ఎంత విసిగిపోయాను అనుకుంటారా నిద్రపట్టేసీ
అనేవాడు ఉండడు, విసిగిపోవడమేమిటీ నిద్రపోతే నిద్రపట్టేస్తే హాయిగా ఉందంటాడు నిద్రాసుఖము
అందుకే “నిద్రా సుఖము నిద్రాకాలిక సుఖము స్వల్పకాలిక లయము, స్వల్పకాలికా లయము
లయకారుడైన శివుని అనుగ్రహము” కాబట్టి రాముడు పడుకున్నాడు నాకు సుఖమూ లేదు
నిద్రాలేదు అన్నాడు ఆయన. అదేమిటయ్యా ఆయన పడుకుంటే నీకు సుఖము నిద్రలేదంటావు ఆయనకే
లేదుగా బాధ నీకెందుకు మధ్యలో, కారణం చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకు లేదో తెలుసా? యో
న దేవాఽసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి ! తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయా !! దేవతలు రాక్షసులు కలిపి యుద్ధానికి వస్తే
వాళ్ళని నిగ్రహించగలిగినటువంటి మొనగాడు నా అన్నగారు అంతటి మహానుభావుడు దాశరథిగా
వచ్చాడు, మా నాన్న 60 వేల సంవత్సరములు వయస్సు వచ్చేంత వరకూ బిడ్డలు లేకపోతే
అశ్వమేధంచేసి పుత్రకామేష్టిచేస్తే, యజ్ఞంచేస్తే యజ్ఞ పురుషుడు పాయపాత్రనిస్తే ఆ
పాయసాన్ని అనురూపులైన భార్యలకి పంచిపెడితే కౌసల్యయందు జన్మించినటువంటి పరమ
ధర్మాత్ముడైనటువంటి వ్యక్తి నా అన్న అటువంటివాడు ఇవ్వాళ తను ఏదోషమూ చెయ్యకపోయినా
నాన్నగారిని సత్యంలో నిలబెట్టడానికి తాను అడవికి వచ్చాడు, తను ఒక దోషంచేసి
వచ్చినవాడు కాదు అడవికి ఏ బ్రూణ హత్యోచేసి అడవికి వచ్చాడంటే అనుకోవచ్చు తప్పులేదు
మరి ఎందుకొచ్చాడు. తండ్రి వరాలిస్తే ఆ వరాల్ని నిజంచేసి తండ్రికి
కీర్తితేవడానికోసం తాను అడవికి వచ్చాడు వచ్చి ఇలా పడుకున్నాడు ఎంత ప్రారబ్ధమయ్యా
ఇదీ! ఇలా ఇవ్వాళ కాదు 14 యేళ్ళు పడుకుంటాడు, ఇదిచూస్తూ మా తల్లి సీతమ్మ కష్టం
చూస్తూవాళ్ళు ఇలాపడుకుంటున్నారూ అన్నబాధ నాకుంటే నేనెలా పడుకోగలనయ్యా! ఇది
లక్ష్మణుడి భక్తి.
ఇదీ ముగ్గురి భక్తినీ చెప్తుంది ఏక కాలంలో సీతారాములు పడుకున్న ఒక్కపడకా
ముగ్గురి భక్తినీ చెప్తూంది, అయ్యెయ్యో వీళ్ళు పడుకున్నారని గుహుడి ప్రేమ,
నాన్నగారి మాటను నిలబెట్టానని రాముడికి పట్టిననిద్ర, అయ్యో సీతారాములు
అలాపడుకున్నారు వాళ్ళు అలాపడుకోవడమా అని లక్ష్మణ మూర్తిప్రేమ. కాబట్టి ఈ మాటలు
అన్నాడూ అన్న తరువాత మరునాడు ఉదయం అయింది లేచాడు సంధ్యావందనం చేసుకున్నాడు రామ
చంద్ర మూర్తి అన్నాడు, నాయనా నీవు వెంటనేబయలుదేరి మనం ఈ గంగానదిని దాటవలసి ఉంటుంది
కాబట్టి ఆ గుహుడితోటి మనం గంగ దాటడానికి కావలసిన పడవ ఏర్పాటు చేయమని చెప్పు
అన్నాడు. సరే తప్పకుండా అలాగే ఏర్పాటు చేయమని చెప్తానన్నాడు గుహుడితో చెప్పాడు,
చెప్పిన తరువాత రామ చంద్ర మూర్తి దగ్గరి వచ్చి సుమంత్రుడు అప్పటి వరకు రథం నడిపాడు
కదాండీ, ఇప్పుడు గంగ దాటి వెళ్ళిపోతున్నారు, అయ్యా మీరు గంగ దాటి వెళ్ళిపోతున్నారు
నాకేఏమి ఆజ్ఞా! అని అడిగాడు అడిగితే ఆయన రామ చంద్ర మూర్తి అన్నారూ నీవు ఇంటికి
బయలుదేరి అయోధ్యా నగరానికి వెళ్ళిపో... తండ్రిని కుశలము అడిగానని చెప్పూ తల్లిని
కుశలము అడిగానని చెప్పూ తల్లిని జాగ్రత్తగా చూసుకొమ్మని నాన్నగారినితో చెప్పానని
చెప్పూ బాధపొందద్దని చెప్పు 14 యేళ్ళలో తిరిగి వస్తాననిచెప్పూ, భరతుడు
రాజ్యమేలుకుంటూ కౌసల్యని జాగ్రత్తగా చూడమని నేను చెప్పానని చెప్పు ప్రియమార
కౌగలించుకున్నానని భరతున్ని అనిచెప్పు అని ఆయన చెప్పవలసినటువంటి మంచిమాటలన్ని
చెప్పిన తరువాత సుమంత్రుడు అన్నాడూ...
|
అన్నీ మీరు
చెప్పారుగానీ... నాకే అయోధ్యకు వెళ్ళాలనిలేదు అన్నాడు, నాకు మీరు ఒక్కవరం ఇవ్వండి
నేను ఈ రథంతోపాటు పడవఎక్కి మీతో వచ్చేస్తాను అంటే రథం పడవ ఎక్కడమేమిటీ అని
అనుకోకండీ, మా తూర్పు గోదావరి జిల్లాలో కోటి పల్లి వెల్లాలంటే ఇప్పుడు
బ్రిడ్జిపడింది పంట్టు మీద కారెక్కుంచుకుని పంట్టు కారుని కూడా తీసుకెళ్ళిపోతే
కారుతోపాటు అటుదిక్కు వెళ్ళిపోతుండేవాళ్ళం, కాబట్టీ రథంతోసహా గంగదాటి వస్తాను,
వచ్చీ నేను రథంతో నీకు సహకరిస్తూ ఉంటాను ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్తాను నాది
ఒక్కటే కోరికా, ఏ రథం మీద నిన్ను తీసుకొచ్చానో ఆ రథం మీదే 14 సంవత్సరాలూ అయిపోయాక
అయోధ్యకు తీసుకెళ్తాను. అప్పటి వరకు రామా! నేను నీతోనే ఉంటాను నాకు స్వర్గం కూడా
అక్కరల్లేదు నీతో ఉంటే, మహాత్ములను అనుగమించేటప్పుడు ఉండేటటువంటి స్థితీ ఇలా
ఉంటుంది. ఆయనతో ఉంటే సంతోషము, అది సౌక్యమా బాహ్యంలో సుఖమేదైనా ఉందా అంటే మనం చెప్పడం కుదరదు ఆ
అనుగమించేటప్పుడు ఉండే సంతోషం అలా ఉంటుంది కాబట్టీ నేను నీతో ఉంటాను.
అంటే రాముడు మాట్లాడితేనండీ! ఇంక ఎదుటివాడు
జవాబు చెప్పడానికి ఉండదు, నీవు ఇందుకు రావద్దన్లేదు ఆయన ఏమన్నాడో తెలుసా..? నేను
నీకు ఏమని చెప్పాను అయోధ్యకు వెళ్ళమని చెప్పాను నీవు ఏమంటున్నావ్ నాతో
వస్తానంటున్నావు, నేను నిన్నునాతో రావద్దూ అయోధ్యకువెళ్ళూ అంటూన్నాను ఎందుకో
తెలుసా..? నీవు నాతో వచ్చి 14 యేళ్ళవున్న ప్రయోజనంకన్నా నీవు అయోధ్యకు ఖాలీరథాన్ని
పట్టుకొని వెళ్ళిపోతే నీవు నాకుచేసేటటువంటి ఉపకారం మహోత్కృష్టమైన ఉపకారము అన్నాడు,
ఖాలీరథం పట్టుకుని అయోధ్యకు వెళ్ళిపోతే నీకు ఉపకారం ఎలా జరుగుతుంది అని అడిగాడు
సుమంత్రుడు, అంటే ఆయన అన్నాడూ నగరీం త్వాం గతం దృష్ట్వా జననీ మే యవీయసీ !
కైకేయీ ప్రత్యయం గచ్ఛేత్ ఇతి రామో వనం గతః !! పరితుష్టా హి సా దేవి వన వాసం గతే
మయి ! రాజానం నాఽతిశఙ్కేత మిథ్యా వాదీతి ధార్మికమ్ !! నీవు కానీ ఖాలీరథంతో తిరిగివెళ్ళిపోగానే కైకమ్మ
అడుగుతుంది వెళ్ళిపోయాడా రాముడు అరణ్యానికని, అరణ్యానికి వెళ్ళడమేమిటమ్మా ఇన్ని
నదులు కూడా దాటేశాడు గంగా నదిని కూడా పడవలో దాటివెళ్ళిపోయాడు, గంగానదిని కూడా దాటి
అరణ్యంలోకి వెళ్లిపోయిన తరువాత నేను తిరిగివచ్చేశాను అనిచెప్తావు నీవు, అప్పుడు
కైకమ్మకి సంతోషం కలుగుతుంది. ఆ... ఇక్కడే ఎక్కడో దగ్గరిలో ఉన్నాడేమో, ఏమైనా కుట్ర
చేస్తున్నాడేమో, దారికాచి భరతుడు వస్తూంటే ఏమైనా చేస్తాడేమో ఇన్ని అనుమానాలు
ఉంటాయి, కాబట్టి లేదు అడవికే వెళ్ళిపోయాడు రాముడు అని నీవు చెప్పగానే ఆవిడ
సంతోషాన్ని పొందుతుంది మా అమ్మ సంతోషించాలి కైకమ్మ. కాబట్టి నీవు వెళ్ళి చెబితే మా
అమ్మ సంతోషిస్తుంది కాబట్టి నీవు వెళ్ళు.
|
రెండోదేమిటో
తెలుసా..? నీవు వెళ్ళిచెబితే మా అమ్మ దశరథుడిపట్ల అభిప్రాయాన్ని మార్చుకుంటుంది,
మా అమ్మ ఏమనుకుంటూందంటే కౌసల్యతోకలిసి మా నాన్నగారు కుట్రచేశారు నాకు రాజ్యం
ఇవ్వడానికనే కదా అనుకోంటోంది. మాట ఇవ్వడం అంటే ఏమిటో భరతుడికి రాజ్యం
ఇచ్చేస్తానన్న దశరథుడు రామున్ని ఏమీ అలా అక్కడ అట్టే పెట్టి ఇక్కడ ఇట్టేపెట్టి
అటువంటి పనులేవీ చెయ్యలేదూ పంపడమంటే త్రికరణశుద్ధిగా పంపేశాడు నాభర్తా, పెద్ద
కొడుకుని పంపించేయమంటే మాటకు కట్టుబడి పంపించేశాడు, ఓ..! ఆయనా అటువంటి వాడుకాడు
అని నాభర్త ʻమిత్యవాదీʼ అంటే పైకి ఒకలా మాట్లాడుతూ లోపల అధరం చేసేవాడని అనేటటువంటి భావన దశరథుడు పట్ల
ఉన్నటువంటి భావన కైకమ్మలో మారుతుంది. ఈ రెండు ఉపకారాలు జరగాలంటే నీవు ఖాలీరథం
పట్టుకుని వెళ్ళాలి, నాతోవస్తే ఎలాజరుగుతుంది జరగదు మా అమ్మ అనుమానంతో ఉంటుంది మా
నాన్నగారితో దెబ్బలాడుతుంటుంది కాబట్టి నీవు వెళ్ళిపోవాలి.
ఏమంటాడండీ! రెండు చేతులెత్తి నమస్కారంచేసి
తప్పకుండా అలాగే వెళ్తాను అంటాడు, రాముడు గంగా నదినిదాటి వెళ్ళడంకోసం పడవ
సిద్ధంచేశారు ఆ ఒడ్డుకువెళ్ళి కూర్చున్నాడు, కూర్చుని ఆ గుహిన్నిపిలిచి
ఒకమాటచెప్తాడు. తత్ క్షీరం రాజ పుత్రాయ గుహః క్షిప్రమ్ ఉపాహరత్ ! లక్ష్మణ స్యాఽఽత్మన శ్చైవ రామ
స్తేనాఽఽకరో జ్జటాః !! గుహున్ని పిలిచి నాయనా! నేను ఇంక ఇక్కడ నుంచి ఒక తాపసి ఎలా ఉంటాడో అలా
ఉండాలి, కాబట్టి నీవు నాకు మఱ్ఱపాలు పట్టుకురా ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి, అంటే
మఱ్ఱి చెట్టు నుండి శ్రవించేటటువంటి పాలు అవి చాలా జిగురుగా ఉంటాయి దేని మీదన్నా
ఒక్క చుక్క పడ్డాయనుకోండి మఱ్ఱిపాలు అంటుకుపోతాయి, కాబట్టి నీవు ఆ మఱ్ఱి పాలు
పట్టుకురా అన్నాడు. అంటే ఒక దోనెలో మఱ్ఱిపాలు పట్టుకుని వచ్చాడు గుహుడు, రాముడు
లక్ష్మణుని పక్కన కూర్చుని అన్నాడు ఆ మఱ్ఱిపాలు నా తల మీద లక్ష్మణుని తల మీదపోయి
అన్నాడు, ఏ రాముడు యౌవ్వరాజ్య పట్టాభిషేకం జరిగితే నదీ జలాలూ ఫేలాలూ తేనె పెరుగు
చేత అభిషేకింపబడవలసినటువంటి తలమీదా తన ధర్మాన్నితాను చెయ్యడం కోసం గుహుడిచేత
తెప్పించుకొని మఱ్ఱిపాలు పోసుకొని ఆ జిగురుతో ఉన్నటువంటి జుట్టుని జఠల కింద
కట్టేసుకున్నాడు అంటే ఇప్పుడు ఆ జటలు ఇంక ఊడవు అది జటా జూటం కింద జుట్టంతా కలిసి
ఒక ముద్దైపోయిందన్నమాట మఱ్ఱిపాలతోటి, అక్కడ ఉన్నవాళ్ళందరూ నిషాదులైనా వాళ్ళు రాముని
యొక్క ధర్మ నిరతికి ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు గుహుడితో చెప్తున్నాడు అంటే ఇలా జటాజూటం కట్టుకున్నాడుకదా తాపసిలా
ఉండడం మునిలా ఉండడం అంటే... ఇంక ఒక బ్రహ్మదండము పట్టుకుని జపం చేసుకుంటూ రాముడు
కూర్చుంటాడులే... అని అనుకోకుండా నేను ఏ కులంలో పుట్టానో ఆఁ ధర్మాన్ని నేను
విడిచిపెట్టను మీరు పట్టుకున్నారో లేదో బోయవాడిగా ఆయన ధర్మాన్ని రక్షించాడు, తన
ధర్మాని తాను విస్మరించడు రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ! రక్షితా
స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా !! అంటారు రాముడి గురించి, ఇతరుల ధర్మాన్ని
రక్షిస్తాడు తన ధర్మాన్ని రక్షించుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడూ తతో
వైఖానసం మార్గం ఆస్థితః సహ లక్ష్మణః ! వ్రతమ్ ఆదిష్టవాన్ రామః సహాయం గుహమ్ అబ్రవీత్
!! నాయనా నేను ఇప్పుడు వైఖానస మార్గ వ్రతాచరణమును చేస్తాను వికనస మహర్షి
చెప్పినటువంటి స్థితిలో నేను ఈ 14 సంవత్సరములు నా క్షాత్ర ధర్మాన్ని నేను పాటిస్తూ
బ్రహ్మ చర్యంతో కూడుకున్నటువంటి అరణ్యవాసం చేస్తాను 14 యేళ్ళు కాబట్టి ఇప్పుడు
రాముడు శత్రుసంహారం చేస్తాడా..! చేస్తాడు, వేటాడుతాడా అవసరమైతే చంపుతాడు
వేటాడుతాడు, రాముడు రాక్షసుల మీదకు వెడుతాడా వెడుతాడు, సజ్జనులను రక్షిస్తాడా
రక్షిస్తాడు, కానీ అరణ్యంలో ఉంటాడు, బ్రహ్మచర్యం పాటిస్తాడు గృహస్తుగా భార్యతో
|
కలిసి దాంపత్య జీవితాన్ని
మాత్రం సాగించడు. భార్యా తను కలిసే ఉన్నా పక్క పక్కనే పడుకున్నా ఆంతరమునందు మాత్రం
నిష్టయైనటువంటి బ్రహ్మచర్య వ్రతంతో ఉంటాడు అదీ రాముడంటే అదీ రాముడి ధర్మం అంటే,
కాబట్టి నేను అటువంటి స్థితిలో వెడుతున్నాను, గుహున్ని అడ్డుపెట్టి బహుషహా మన
అనుమానాలను కూడా తీర్చేశాడేమో!
ఇప్పుడు పడవ ఎక్కబోతూ గుహుడితో అంటున్నాడూ అప్రమత్తో బలే కోశే దుర్గే జనపదే
తథా ! భవేథా గుహ రాజ్యం హి దురా రక్షతమం మతమ్ !! నాయనా గుహా! నీవు చాలా
అప్రమత్తుడవై ఉండాలి, నీ బలం విషయంలో కోషం విషయంలో దుర్గే నీవు
నివశించేటటువంటి దుర్గం విషయంలో జనపదే తథా నీవు పరిపాలించేటటువంటి ఈ
జానపదులు ఉన్నారే ఈ పల్లెటూల్లో ఉండేటటువంటి గూడెంలో ఉండేవాళ్ళు వీళ్ళందరి విషయంలో
కూడా దురా రక్షతమం మతమ్ చాలా అప్రమత్తుడవై చాలా జాగ్రత్తగా పరిపాలన
చెయ్యాలి సుమా! అంటే నాకేమిటండీ
రాముడొచ్చాడూ, రాముడు నాకు అంత స్నేహితుడూ రామానుగ్రహం నాకుందీ అని నీవు
ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తావేమో..? అలా కుదరదు నీ ధర్మం నీవుచేస్తూ ఉండాలి.
నీ ధర్మంలో నీవు జాగరూకుడవై ఉండాలి రక్షించుకోవడం అంత కష్టం సుమా! చాలా జాగ్రత్తగా
ఉండు. నేను మీతో మనవి చేసింది అదే... ఎప్పుడు రాముడు మాట్లాడినా అలాగే ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు ఆ నావను తీసుకొచ్చి అక్కడ పెట్టారు, మనకి ఇతర రామాయణాల్లో
గుహుడే నడిపినట్టూ నీవు అడుగుపెట్టద్దూ ఏదో పాదం అహల్యకు తగిలితే స్త్రీ
అయిపోయింది, ఇప్పుడు నా పడవకి తగిలితే నావ ఏమైపోతుందో అన్నాడనీ వర్ణిస్తారు కానీ
వాల్మీకి అలా ఏమీ వర్ణించలేదు అంత మాత్రంచేత నేనావర్ణనను అందమైంది కాదూ అని మాత్రం
అనను అది ఒకగొప్ప ప్రేమలోంచి వచ్చినటువంటి కవిత్వం దాన్ని కూడా హర్షించవలసిందే,
కానీ వాల్మీకి చేసినదే యదార్థము.
కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడూ లక్ష్మణున్ని పిలిచి లక్ష్మణా ముందు మీ ఒదినెను
పడవ ఎక్కించు తరువాత నీవు ఎక్కు. ఏం అలా ఎందుకూ వీళ్ళెక్కి సీతమ్మను ఎక్కించకూడదా
ఏమిటీ? ప్రయాణం చేసేటప్పుడు ధర్మమేమిటో తెలుసాండీ! ఆడదాన్ని ముందు ఎక్కించి తాను
ఎక్కాలి ఎందుకంటే ఆడదానికి ఒక లక్షణం ఉంటుంది తనని తాను రక్షించుకోలేదు ఆమె
భర్తచేత రక్షింపబడుతుంది ఈయన ఎక్కాక వాహనం వెళ్ళిపోతే, కాబట్టీ ఈయన ముందే రైలెక్కి
కూర్చుని ఏమోయ్ వాటర్ బాటిల్ పట్టుకురా అన్నాడు అనుకుందాం ఆవిడ వాటర్ బాటిల్ కోసం
వెల్తే రైలు వెళ్ళిపోతే..? ఆవిడ వెళ్ళిపోయి ఈయనుంటే ఏదో చేస్తాడు గబగబా ఏ స్టేషన్
మాస్టరు దగ్గరికో వెళ్తాడు ఏదో మిసేజ్ ఇప్పిస్తాడు ఆపుతాడు చేస్తాడు, పాపం ఆవిడకేం
తెలుస్తుంది ఆవిడని వదిలేసి నీవెక్కి కూర్చొని ఆవిడని వాటర్ బాటిల్ తెమ్మనడమేమిటీ,
కాబట్టి ధర్మం ధర్మమే... ప్రతి చిన్న విషయంలో అయోధ్య కాండలో ధర్మం చెప్తుంది వాహనం
ఎక్కితే ముందు స్త్రీ ఎక్కాలి, బయలు దేరితే ముందు పురుషుడు బయలుదేరాలి.
కాబట్టి సీతమ్మని ఎక్కించి నీవు ఎక్కు మరి రాముడూ ఆ తరువాత ఎక్కుతాడు
వాళ్ళిద్దరికీ కూడా ఆయన రక్షకుడు కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కాక రాముడు ఎక్కుతాడు
తప్పా ఇప్పుడు నేను ఎక్కేసి మీ ఇద్దరు ఎక్కండి అనడు, కాబట్టి స భ్రాతుః శాసనం
శ్రుత్వా సర్వమ్ అప్రతికూలయన్ ! ఆరోప్య మైథిలీం పూర్వమ్ ఆరురోహాఽఽత్మవాం స్తతః !! లక్ష్మణుడు రామ చంద్ర మూర్తి చెప్పినట్లే
సీతమ్మని ముందు నావ ఎక్కించి తరువాత తానెక్కాడు తరువాత రామ చంద్ర మూర్తి కూడా నావ
ఎక్కారు. ఎక్కి ఏం చేశారు అంటే నీటిలో వెళ్ళేటప్పుడు పడవా - గండకాలము అని ఒకటి
ఉంటుంది, నీరు ఎప్పుడూ ప్రమాదకరమే భూమి మీద తిరగవలసినవాడు నీటిలో తిరిగితే ఇబ్బంది
ఎక్కడొస్తుందో తెలుసాండి రాముడికి ఈత వచ్చండీ అనకూడదు, సీతమ్మా..? కాబట్టీ ఆ నీరు
ఆ నీటికి ఖేదం కదా నీటి మీద పడవ పెట్టి పడవలో మీరు కూర్చుని దాట్లో తెడ్డేసి
నీటిని కొడతారు తెడ్డుపెట్టి ఎందుకంటే జలానికి మోదక దోషం అని ఒకటి ఉంటుంది. నీటిని
మీరు ఎప్పుడైనా కొట్టారనుకోండీ, అది పగపడుతుంది ఎందుకంటే దానియందు ఈశ్వర చైతన్యం
ఉంటుంది. అందుకే నాకా ఊళ్ళో నీళ్ళు పడలేదండీ అంటాడు కానీ నాకా ఊళ్ళో సమోసాలు
పడలేదండీ అనడు ఎవడూనూ... నీరు పడలేదండీ అంటారు.
|
అందుకే మా చిన్న
తనంలో నూతిలో ఛాద వేసేటప్పుడు చప్పుడైతే దెబ్బలాడేవారు ఎందుకలా ఛాద కొడతావ్ అని,
నీటిలోకి ఛాద మునిగిన తరువాత తోడమనేవారు తప్పా ఓ ఇలా ఇలా అనీ ఆ ఛాదపెట్టి
నీటినికొట్టద్దు అనేవారు, నీటిని కొట్టడాన్ని అంగీకరించరు కానీ పడవ నీటిలో
వెళ్ళాలంటే నీటినికొట్టాలి, ఎందుకంటే తెడ్డూ ఇలా ఎత్తి నీటికేసి ఇలా అంటారు అంటే
నీటిని ఇలా కొట్టీ ఇలా వెనక్కి తోస్తే ఈ నీటిని తోస్తుంది పడవ ముందుకు వెళ్ళుతుంది.
నీటిమీద దెబ్బవేస్తూ వెళ్ళుతుంది పడవ రెండువైపులా ఇలా దెబ్బేసి అంటూ ఉంటారు పడవ
వెల్తూవుంటుంది. మరి ఇది దోషం కదా! కాబట్టి ఇప్పుడు ఎవరి కోసం కొడుతున్నారు,
ఎవరెక్కి పోతున్నారో వారికోసం కొడుతున్నారు ఇప్పుడు ఆగ్రహం చెందితే నీరు, అందుకనీ
దోష పరిహారార్థం కొన్ని మంత్రాలని జపం చెయ్యాలి పడవలో కూర్చునివెడితే నీటి మీద
వెళ్ళేటప్పుడు బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ ఆ మంత్రాన్ని లోపలా బాగా మననం
చేసుకుంటూ వెళ్ళాలి. రాముడు ధర్మాత్ముడు తాను క్షత్రియుడు తను మంత్రం చదువుకుంటూ
వెళ్ళాలి తప్పా ఉత్తిగనే కూర్చుని అహా ఎంతబాగుంది అని అదిగో ఆ గంగ చూడండీ ఆ నీళ్ళు
చూడండీ ఇలా నీళ్ళెట్టి నిప్పులెట్టి పిచ్చి అల్లరంతా చేస్తూవెళ్ళకూడదు, కాబట్టీ రాఘవోఽపి మహా తేజా నావ
మారుహ్యా తాం తతః ! బ్రహ్మవత్ క్షత్రవ చ్చైవ జాజాప హిత మాత్మనః !! అందులో ఎక్కి కూర్చున్న తరువాత దైవీం నావం అని
ప్రారంభమౌతుందట ఆ మంత్రం ఆ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చున్నాడు రాముడు కూర్చుంటే ఆ
నావ ఆవలి ఒడ్డుకు చేరింది. అయోధ్య కాండ అన్నీ ధర్మాలేనండీ నావ ఎలా ఎక్కాలో
కూర్చుంటే ఎలా ఉండాలో ఎవరు ముందు ఎక్కాలో ఎవరు ముందు నడవాలో ఎవరు ఏం చెయ్యాలో ఎలా
ఉండాలో అన్నీ రామాయణంలో కనపడుతూ ఉంటాయి ఇప్పుడు సీతమ్మ ఆ గంగకి నమస్కారం చేసింది
తత స్త్వాం దేవి సుభగే క్షేమేణ పునర్ ఆగతా ! యక్ష్యే ప్రముదితా గఙ్గే సర్వ కామ
సమృద్ధయే !!
త్వం హి త్రిపథగా దేవి బ్రహ్మ లోకం సమీక్షసే ! భార్యా చ ఉదధి రాజ స్య లోకేఽస్మిన్
సంప్రదృశ్యసే !!
సా త్వాం దేవి నమస్యామి ప్రశంసామి చ శోభనే ! ప్రాప్త రాజ్యే నర వ్యాఘ్ర శివేన
పునర్ ఆగతే !!
గవాం శత సహస్రాణి వస్త్రా ణ్యఽన్నం చ పేశలమ్ ! బ్రాహ్మణేభ్యః ప్రదాస్యామి తవ
ప్రియ చికీర్షయా !!
సురా ఘట సహస్రేణ మాంస భూతౌదనేన చ ! యక్ష్యే త్వా ప్రయతా దేవి దైవతాని వసంతి చ
!!
తాని సర్వాణి
యక్ష్యామి తీర్థాన్ ఆయతనాని చ !!!
ఆమే సీతమ్మ తల్లి గంగకు నమస్కారం చేస్తూ కొన్ని మాటలు చెప్పింది, నాకూ బాగా
జ్ఞాపకం ఇప్పటికీ ఉంది ఆ సాంప్రదాయం, ఆ గోదావరి దాటివెళ్తూంటే రైల్లో ప్రత్యేకంగా
గోదావరి వచ్చేవరకూ కూర్చొనీ ఓ ఐదు పైసలో పది పైసలో పావలాయో అర్ధరూపాయోయిచ్చి
అందులో వేసినమస్కారం చేయండిరా! అని పిల్లలకిచ్చీ కిటికీలోంచి వేయించేవారు ఇప్పుడూ మనకు
అవన్నీ ఏమీ అక్కరలేదు, ఆ నీటి మీద వెళ్ళుతూ రైల్లో చేయకూడని పనిచేస్తే ఆ
శరీరంలోంచి విడవబడిన పదార్థాలు ఆ నీటిలో పడుతున్నాయి, ఇవ్వాల దుస్తుతి అలా ఉంది.
నా చిన్నతనంలో ప్రయాణంచేసిన రోజుల్లో కూడా గోదావరి దాటుతూంటే గోదావరికి
నమస్కరించకుండా ఉండేవాళ్ళు ఎవ్వళ్ళు ఉండేవారు కాదు. డోర్లు దగ్గరికెళ్ళీ కిటికీల
దగ్గరికెళ్ళీ ఇటుపక్కనున్నవాళ్ళు అటు పక్కనున్నవాళ్ళూ అందరూ కిటికీ దగ్గర నిలబడి
ఇలా చెప్పులిప్పీ నమస్కారం చేస్తుండేవారు, ఇది ఆర్ష సంస్కృతిలో సనాతన ధర్మంలో ఒక
గొప్ప శిష్య లక్షణం. మనం నీటిని చూడ్డం నీటిలో చైతన్యాన్ని చూస్తాం ఆ నీరు ఉద్భవించినటువంటి
స్థితిని చూస్తాం, ఒక గౌతమీ ఒక గోదావరి, అంటే ఒక గౌతమి మహర్షి తపః ఫలం, ఒక గంగా
భగీరథుని యొక్క తపః ఫలం. కాబట్టి ఆ నీటివల్ల మనం బతుకుతున్నాం మనని
బ్రతికిస్తున్నటువంటి దైవీశక్తి మాంస నేత్రమునకు కనపడుతుందీ అని మనం భావన చేస్తాం,
కాబట్టి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం నది కనపడితే తప్పా కృతజ్ఞతా లేకుండగా నదిని దాటి
వెళ్ళడమన్నది మనం చేయ్యము ఎప్పుడూనూ నది దాటేటప్పుడు కృతజ్ఞత చూపించి నదిని
దాటాలి.
|
అందుకే నదీపరివాహక
ప్రాంతములయందు దేవతలు కొండల మీద వెలసి ఉంటారు కూడా కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంది
సీతమ్మా అమ్మా! క్షేమంగా మళ్ళీ తిరిగివచ్చేటట్టుగా గంగా! మమ్మల్ని అనుగ్రహించు గంగ
యందు ఉన్నటువంటి చైతన్య రూపమైన ఈశ్వర శక్తి ఆ కృపవహించగలదు. రామాయణం
మనకినేర్పుతుంది నదికి నమస్కారంచేయ్యాలి తప్పకుండా, నీవు తల్లీ త్రిపదగా మూడుగా
మూడులోకములలో ప్రవహిస్తున్నటువంటి తల్లివి సముద్రునకు భార్యవి, తల్లీ నీకు నేను
నమస్కరించి చెప్తున్నాను నరవ్యాగ్రమైనటువంటి రాముడు క్షేమంగా లక్ష్మణ సహితుడై సీతా
సహితుడై అంటే నాతోకలిసి తిరిగివచ్చేటట్టుగా అనుగ్రహించు, నేను క్షేమంగా తిరిగి
వచ్చిన తరువాత నీ ప్రీతి కొరకు లక్ష గోవులను బ్రాహ్మణులకు దానంచేస్తాను, వస్త్రములను
దానంచేస్తాను, అంమృతంతో సమానమైనటువంటి అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టిస్తాను
అందరికీ భోజనంతో తృప్తికలిగిస్తాను తల్లీ వేయ్యికడవల కల్లు నీకుసమర్పిస్తాను,
మాంసముతో కూడినటువంటి అన్నాన్ని నీకు నివేదనచేస్తాను కాబట్టి తల్లీ నీ తీరంలో
ఉన్నటువంటి దేవాలయములు ఏవేవి ఉన్నాయో ఆ దేవాలయములు అన్నింటినీ దర్శనంచేసి
అక్కడక్కడ నీకు చెల్లించవలసిన మొక్కుబడులు చెల్లిస్తాను కాబట్టి తల్లీ మేము
క్షేమంగా వచ్చేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని గంగా దేవికి సీతమ్మ తల్లి
నమస్కారం చేసింది.
నమస్కారంచేసి వాళ్ళు ఆ గంగదాటారు ఆ గంగ ఆవలి ఒడ్డున దిగారు, దిగిన తరువాత
లక్ష్మణుడూ రాముడూ సీతమ్మా కలిసి అరణ్య ప్రవేశంచేశారు. ఇక ఇక్కడ నుంచి
ప్రవేశించినటువంటి అరణ్యం ఎక్కువగా జనపదాలు కనపడవు, ఎక్కువగా మనుష్యులు కనపడేటటువంటి
అరణ్యంకాదు, చాలా క్రూర మృగాలతో వాటితో నిండి ఉండేటటువంటి అరణ్యం అటువంటి అరణ్యంలో
బయలుదేరిన తరువాత రాముడు అంటాడు
ధ్రువమ్ అద్య మహా రాజో దుఃఖం స్వపితి లక్ష్మణ ! కృత కామా తు కైకేయీ తుష్టా
భవితుమ్ అర్హతి !!
అనాథ శ్చైవ వృద్ధ శ్చ మయా చైవ వినా కృతః ! కిం కరిష్యతి కామాఽఽత్మా కైకేయ్యా వశమ్
ఆగతః !!
కో హ్యఽవిద్వాన్ అపి పుమాన్ ప్రమదాయాః కృతే త్యజేత్ ! ఛన్దాఽనువర్తినం పుత్రం
తాతో మామ్ ఇవ లక్ష్మణ !!
అపి ఇదానీం న కైకేయీ సౌభాగ్య మద మోహితా ! కౌసల్యాం చ సుమిత్రాం చ సంప్రబాధేత మ
త్కృతే !!
అహమ్ ఏకో గమిష్యామి
సీతయా సహ దణ్డకాన్ ! అనాథాయా హి నాథ స్త్వం కౌసల్యాయా భవిష్యసి !!
నాయనా లక్ష్మణా! చీకటి పడిపోతూంది అందుకని ఇవ్వాళ రాత్రి మనం ఈ అరణ్యంలోనే
ఎక్కడైనా ఎత్తు పల్లాలూ ముళ్ళూ లేనటువంటి ఒకప్రదేశంలో పడుకుందాం అని ఒకప్రదేశంలో
పడుకోవడానికి సిద్ధపడుతున్నారు, అంతకు ముందే ఒక రురుమ్ మృగాన్ని, ఒక జింకనీ
సంహరించి తీసుకొచ్చి కాల్చుకొని ఆ మాంసాన్ని పచనం చేసుకొని తింటారు ముగ్గురూనూ,
నేను మీకు చెప్పాను ధర్మం అంటే ధర్మమేనని ఇప్పుడు పడుకుంటున్నారు, రాముడు అన్నాడు
లక్ష్మణుడితో ఇది చాలా దుర్గమమైనటువంటి అరణ్యం ఇక్కడ రాక్షసులు తిరిగుతూ ఉంటారూ
క్రూర మృగములు తిరుగుతూంటాయి కాబట్టి ముగ్గురం నిద్రపోవడం కుదరదు సీత పడుకుంటుంది
మనిద్దరం జాగరూకులమై రాత్రంతా కూడా తెలివిగా ఉందాం మనం నిద్రపోవడానికి వీల్లేదు.
|
అంటే కష్టం అన్నది
ఇక్కడ ప్రారంభమౌతుంది నిద్రపోగలిగి ఉండి నిద్రపోక పోవడం తినగలిగి ఉండి తినకపోవడం ఈ
రెండింటంతకష్టం లోకంలోయింకోటిలేదు, ఒకగొప్ప మాటేమి చెప్తారంటే... సనాతన ధర్మంలో
మృత్యువుకి దగ్గరయ్యేటప్పుడు వచ్చేటటువంటి పెద్దబాధయిది అనిచెప్తారు. నిద్రపోగలిగి
నిద్రపోలేడు ఎందుకో తెలుసాండీ! తీసుకెళ్ళి ఏ బల్లమీదో ఎక్కడ పడుకోబెడుతారో
ఎటువంటిచోట పడుకోబెడుతారో పడుకోబెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఉంటారు
ఉంటే, నేను ఒకసారి ఒక గవర్నమెంటు హాస్పటల్లో ఒక కార్డియాక్ట్ డిపార్టుమెంటులోకి
వెళ్ళాను, మా బంధువు ఒకాయనికి సీరియస్ ఉందంటే వెళ్ళాను, పెటిడ్రిన్ ఇంజెక్షన్
ఇచ్చారు ఆయన పడుకున్నారు. ఈలోగా పక్కాయనకి ఎగశ్వాస వచ్చింది, ఎగస్వాస వస్తే
డాక్టర్లువచ్చారు ఏదో గుండెలు నొక్కారు ఆయన చనిపోయారు గొల్లుమన్నారు ఆపక్కవాళ్లు.
వాళ్ళన్నారు ఇది కార్డియా డిపార్టుమెంటు మీరు ఏడిస్తే మిగిలినవాళ్ళ హార్టు ఫేయిల్
అవుతుంది బయట ఏడవండీ తీసుకెళ్ళిపోండీ అన్నారు. గబగబా ఆయన్ను ఓ ఆకుపచ్చ గుడ్డ ఉన్న
స్టిచ్చర్లాంటి దాంట్లో ఇలా మడిచేసినట్టుగా చేసేసి బయటికి తీసుకెళ్ళిపోయారు. ఈయనకి
తెలివొచ్చి ఇయ్యనేడీ అని అడిగారు, వాళ్ళిద్దరూ పక్కపక్కనే ఉండి ఎదో ఒకళ్ళనొకరూ
చూసుకుంటూన్నారూ ఎదో మాట్లాడుకోకపోయినా అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు, ఈయనా
వెళ్ళిపోయాడు అనుకోండి మర్నాడు.
కాబట్టి నిద్రపోదామంటే నిద్రపోలేనిస్థితి తిందామంటే తినలేనిస్థితి, తినద్దని
ఉంటుందా ఏమిటబ్బా ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అలా హాయిగా మళ్ళీ ఇంట్లో భోజనం ఎప్పుడు
చేస్తానో..? ఏమిటో ఈ గొట్టాలేమిటో ఈ ఎక్కించడాలేమిటో అని ఉంటుంది కదా ఎవడికైనా, నిద్రపోగలిగి
నిద్రపోలేక పోవడం తినగలిగి తినలేకపోవడం మృత్యువుకి ముందుండేటటువంటి పెద్ద వేదన ఈ
వేదనలో ఈశ్వరున్ని స్మరించడం అలవాటైతే... ప్రయత్న పూర్వకంగా అప్పుడు నీకేమైనా
ఉపయోగ పడుతుందని ఉపవాసం చేయిస్తారు అందుకనీ ఉపవాసం జాగరణ. తినగలిగి తినకుండా
ఉండడం, పడుకోగలిగి పడుకోకుండా ఉండడం దానిలోబాధని ఈశ్వరనామస్మరణతో ఆ అమృతాన్ని
త్రాగుతూ ఈబాధను తట్టుకోవడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఈశ్వరనామ స్మరణచేస్తాడేమో
కనీసం అప్పడువాడు ఉన్నతిని పొందుతాడని పాపం ఉపవాసం చేయండంటారు అంతే కానీ పనికిమాలినతనంతోటీనీ
అవతలివాడిని పాడుచేయడానికి ఉపవాసాలు చేయండి ఉపవాసాలు చేయండి అని ఎవ్వరు చెప్పరు,
ఉదాత్తమైన బుద్ధితోచెప్తారు అందుకే ఉపవాసం చేయండి ఉపవాసం చేయండి వారానికోసారి
చేయండి అని ఎవ్వరు చెప్పరు. ఒక్క ఏకాదశి అంతే పదిరోజులు దాటిన తరువాత పదుకొండో
రోజున ఐదు జ్ఞానేంద్రియములను ఐదు కర్మేంద్రియములను పదకొండవదైనటువంటి మనస్సుని
పదుకొండింటిని ఈశ్వరాభిముఖం ఏకాదశినాడు చేయమంటారు, ఒక్క ఏకాదశినాడే ఉపవాసం తప్పా,
ఇకొంక రోజు ఉపవాసం చేయమని శాస్త్రం ఏమీ చెప్పదు. ఏదో నైమిక్తిత తిథి అయితే తప్పా
సనాతన ధర్మంలో ఏది చేయించినా మన అభ్యున్నతి కొరకే చేయిస్తారు.
కాబట్టి ఇప్పుడు రాముడు నిద్రపోగలిగి నిద్రపోవడానికి అవకాశం లేదు, సీతమ్మ
రక్షణకొరకు రామ లక్ష్మణులు ఇద్దరూ మేల్కొనివున్నారు. మేల్కొని ఉన్నవాడికి
ఏమౌతుందండీ చీకట్లో రాత్రీ నిద్రపోతే ఇబ్బంది లేదు, రాత్రి నిద్రపోకపోతే
ఏమౌతుందంటే ఇబ్బందితో కూడుకున్న విషయాలు అవి ఇవీ జ్ఞాపకానికి వస్తాయి అందులో
రాజ్యాం విడిచిపెట్టేసి ఇక్కడికొచ్చీ పడుకోకుండా కావాలనిలేచివుండి సీతమ్మ అలా
నిద్రపోతుంటే ఇద్దరూ కలిసి రక్షిస్తుంటే రాముడికి లోపల జ్ఞాపకమొచ్చి మాట్లాడే
మాటలు ఏముంటాయి అవే మాట్లాడాడు ఆయన. నాయనా లక్ష్మణా! కైకమ్మ సంతోషంగా ఉంటుందయ్యా...
దశరథ మహారాజుగారు ఎంతపొరపాటు పనిచేశాడయ్యా నన్ను అడవికి పంపించేశాడూ
అనాధుడైపోయాడయ్యా ఇప్పుడు ఆయన్ను రక్షించేవారులేరు ఆయన్ను ఊరడించేవారులేరు ఆ
కైకమ్మా ఇంకా స్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంచేసి రాజును ఏమి
వేధిస్తోందో... నేను కనపడలేదని కౌసల్య ఎంత ఏడుస్తోందో..? ఇద్దరు కొడుకులున్న
సుమిత్ర ఒక కొడుకు శత్రుఘ్నుడు అక్కడున్నాడు
ఒక్క కొడుకు లక్ష్మణుడు నీవు నాతో వచ్చావు, అసలు కౌసల్యా సుమిత్రని
ఊరడించేవారు లేరయా ఒక్కకొడుకూ ఇప్పుడూ భరత శత్రుఘ్నులు రావాలి కైకమ్మ భరతుడి మనసు
మార్చకుండా ఉండాలి ఉంటే భరతుడు కౌసల్యా సుమిత్రల్ని ఓదారుస్తాడేమో ఎంత
దుస్థితియ్యా... దశరథుడు బాధలోవున్నాడా... కౌసల్య బాధలోవుందా... సుమిత్ర బాధలోవుందా...
నిన్ను నేను తీసుకొచ్చేశానా... నువ్వు ఉంటే కనీసం మన అమ్మలిద్దర్నీ ఓదార్చుదువేమో
నిన్ను నేను అనవసరంగా తీసుకొచ్చానయ్యా... ఈ మాట్లాడేటటువంటి మాటా... సహజంగా ఆ
పరిస్థితితులలో ఉన్నటువంటి ఒక మనుష్యుని నోటివెంట వచ్చేటటువంటి స్థితిలోనే
మాట్లాడాడు, ఎందుకంటే రాముడు నరుడిగా కదాండీ తిరిగాడు, కాబట్టి ఈశ్వరిడిలా ఏమవ్వదు
నాకు తెలుసు 14 యేళ్ళు అయిపోతాయి, భరతుడు వచ్చేస్తాడు రాజ్యం తీసుకోడు అని
చెప్పేస్తాడాఏమిటీ, అలాచెప్తే ఈశ్వరుడు, ఏమౌతుందోని తెలియనివాడిలా
మాట్లాడితేనేనరుడు రాముడు ఎక్కడా దైవంలా ప్రవర్తించలేదు అందుకే నేను తరచూ మీతో
మనవి చేస్తుంటాను. రాముడి కథా నరుడి కథా అని మీరు చదవండీ మీకు ఉపయోగం. రాముడి కథా
ఈశ్వరుడి కథా అని చదవండీ మీకు ఏమీ ఉపయోగం ఉండదు. ఆ... ఈశ్వరుడు కాబట్టి
సంధ్యావందనం చేశాడండీ, ఈశ్వరుడు కాబట్టి చెట్టుకింద పడుకున్నాడండీ మనవల్ల
అవుతుందేమిటండీ, అంటే ఒక్కనాటికి అవ్వదు ఆఁనిష్ట ధర్మమునందు ఆఁనిష్ట ఉన్నటువంటి
మహాత్మలు సాధించనిది ఏదీ లేదూ.
నేను అయ్యప్ప స్వామి దేవాలయం కాకినాడలో క్యాసెట్ ఒకటి ప్లేచేసి ధర్మం గురించి
ఎలా ఉంటుంది అన్నదానిని చూపించాం, కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్యుల
స్వామివారు వాహనం ఎక్కివెళ్ళరు ఆయన సన్యాసి ధర్మం అంటే సన్యాసి ధర్మమే, వెడితే
నడిచి లేకపోతే పల్లకి ఆయన రామేశ్వరం వెళ్ళవలసి వచ్చింది సముద్రం దాటాలి సముద్రం దాటాలి
అంటే సముద్రం దాటరు ఆయన సముద్రం పాయనిదాటాలి, ఇప్పుడు అలా వెళ్ళాలి అంటే దానికి
రైల్ బ్రిడ్జి ఉంది ఆరోజుల్లో రోడ్డు బ్రిడ్జిలేదు, ఇప్పుడు రైల్ బ్రిడ్జినుంచి
వెళ్ళాలంటే రైళ్ళు వస్తాయి ఇటునుంచో అటునుంచో పైగా రైలుబ్రిడ్జి నుంచి వెళ్ళడానికి
మధ్యలో ఉంటాయి దుంగలు, ఆ దుంగ నుంచి కాలుతీసి దుంగమీదకు వేసేటప్పుడువచ్చే ఇబ్బంది
ఎక్కడుంటుంది అంటే..? రైలు పెట్టెల్లోంచి ఇంజన్ లోనుంచి కారినటువంటి నూనే దానిమీద
పడుతుంది. కాలు జారిందనుకోండి సముద్రంలో పడిపోతారు. ఇప్పుడు ఆయన రైలుఎక్కి
దాటేసేయమని చెప్పారు, ʻధర్మాకృతీʼ అనిపేరు పరమాచార్యులవారికి
అందుకే ఒక్కనాటికి ఎక్కను దీనిమీద నడిచి ఆవలి ఒడ్డుకు వెడతాను అన్నాడు. మీరు ఆ
క్యాసెట్ లో చూడాలి ఆయన్ను, ఇలా ఉంటారు ఆయన అసలే సముద్రం నుంచిగాలి ఆ మూల నుంచి ఈ
మూలకి విసిరేస్తుంటే సత్యదండాన్ని ఇలాగే పట్టుకునీ ఒక్కొక్కదుంగ నుంచి కాలుతీసి
ఇంకొక్క దుంగమీద వేస్తూంటే... వేస్తుంటే మన ప్రభుత్వంకాని బ్రటీష్ ప్రభుత్వం
తనధర్మాన్ని తానుపాటించి ప్రపంచమంతటిచేతా నిజమైన సన్యాసీ అని ఈ మతానికి చెందని
దలైలామాచేత కూడా స్తోత్రంచేయబడిన మహాపురుషుడు పారమాచార్య అంటే ఆయన నడుస్తున్నారని
రైళ్ళు ఆపుచేసింది బ్రిటీష్ గవర్నమెంటు. ఆయన దానిమీద నడుస్తున్నప్పుడు చూడలి మీరు
మహానుభావుడు ఎవరు రికార్డు చేశారోకానీ ఆ రోజుల్లో కింద సముద్రఘోష ఉత్తుంగ తరంగాలు
కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి ఇలా చూడ్డానికేమీలేదు ఆకాశం ఇటునుంచి అటు
విసురుతున్న గాలి ఆధారమేమీ ఆయనకులేదు వదిలిపెట్టడానికి వీల్లేదు సత్యదండం అలాగే
ఆయన ఆ రైల్ బ్రిడ్జి అంతాదాటి రామేశ్వరం వెళ్ళిపోయాడు. మహాత్ములు ధర్మాన్ని అలా
పట్టుకున్నవారు ఉన్నారు రాముడే అని మీరు అనుకోకండీ, రాముడిలా ధర్మాన్ని రామునిలా
ధర్మం కోసమే ప్రాణం విడిచిపెట్టిన మహాపురుషులు ఎందరో ఉన్నారు ఈ దేశంలో. నేను
నిన్ననే నాకిచ్చిన విడిదిలో భోజనం చేస్తున్నప్పుడు మాగోపాల కృష్ణగారితో ఇప్పటికీ
ఎక్కడున్నారో అలాంటి మహాత్ములు, మా ఇంటికి వచ్చినటువంటి ఒక మహాత్ముడి జీవితం
గురించి చెప్పితే ఎంత సంతోషించారో ఆయన. ఉన్నారు ధర్మనిష్ట కలిగినటువంటివారు
లేకపోలేదు మనం గుర్తించడంలో తేడా, వాళ్ళకీ గుర్తింపు అక్కరలేదు వాళ్ళకి వాళ్ళ
ధర్మంనడిస్తేచాలు ఇంకేమీ అక్కర లేదు.
|
కాబట్టి ఇప్పుడు
రాముడు అంటాడు కౌసల్యా సుమిత్రలని రక్షించడానికి నీవు వెంటనే బయలుదేరీ ఇంటికి
వెళ్ళిపోతే బాగుంటుందీ అని నేను అనుకుంటున్నాను కాబట్టి నీవు బయలుదేరూ అన్నాడు,
అంటే లక్ష్మణుడు అన్నాడు అన్నయ్యా! నీవు చెప్పిన విషయం గొప్పదే నేను కాదనను కానీ
నాకొక బలహీనత ఉంది అన్నయ్యా అన్నాడు, ఏమిరా నాయనా అన్నాడు న చ సీతా త్వయా హీనా
న చాఽహమ్ అపి రాఘవ ! ముహూర్తమ్ అపి జీవావో జలాన్ మత్స్యావి వోద్ధృతౌ !! అన్నయ్యా! నా జన్మకు ఉన్న బలహీనత ఏమిటో
తెలుసా... నేను నిన్ను చూస్తే బతుకుతాను నిన్ను చూడకపోతే చచ్చిపోతాను, అన్నయ్యా బాగా
నీరు నిండినటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేప పిల్లని పట్టుకుందామని
ప్రయత్నంచేసిన వ్యక్తి చెయ్యిపెట్టి చేపని పట్టుకుని తీసిపైకి ఒడ్డుకి విసిరేస్తే
ఒంటికి తడివున్నంతసేపు పైకి గిలగిలా కొట్టుకుని ఎగిరి ఎగిరి ఒంటితడి ఆరిపోయిన
తరువాత ప్రాణం విడిచి పెట్టేసినటువంటి చేప పిల్లలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ
చూస్తూనంత సేపు నీవు లీలా మాత్రంగా ఎంత సేపు కనపడుతావో అంతసేపు బ్రతికీ నీవు
కనపడడం ఆగిపోగానే నేను చచ్చిపోతాను అన్నయ్యా నేను ఉండలేనూ అందుకే నీతో
తిరిగుతున్నాను అన్నయ్యా నా బలహీనత నా బలం కూడా ఇవే నన్ను వెళ్ళమని అనకు అన్నయ్యా
సీతమ్మ నిన్ను విడిచి ఎలా ఉండలేదో నేనూ అంతే అన్నయ్యా ఉండలేనూ అన్నాడు.
ఒక్క మాట మాట్లాడలేదు రాముడు అలాగే నాన్నా నాతోనే వద్దవుకానీ... రామలక్ష్మణులు
అంటే అటువంటి బ్రాత్తు భక్తి, అంతగా అనుగమించినవాడు ప్రయత్నపూర్వకంగా అనుగమించడం
కాదు అనుగమించకుండా ఉండలేక అనుగమించినవాడు అసలు అలా ఉండకపోతే బతకలేనివాడు, అంత
ప్రేమ కలిగినవాడు లక్ష్మణమూర్తి అంటే రామ చంద్ర మూర్తి మీద కాబట్టీ ఇప్పుడూ
అరణ్యంలో ఆరోజు రాత్రి పడుకున్నారు, మరునాడు సౌచసిద్ధి కలిగిన తరువాత అంటే
స్నానాదులు పూర్తి చేసుకున్న తరువాత బయలుదేరి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి
వెళ్ళారు, వెళ్ళిన తరువాత భరద్వాజ మహర్షి కూర్చుని ఉన్నారు. రాముడు తనని మహర్షికి
పరిచయం చేసుకుంటున్నాడు, నేను మీతో చెప్పాను నరుడి కథా... అంతేకానీ రాముడు వస్తే
భరధ్వాజుడికి తెలుసా అంటే భరధ్వాజుడికి తెలుసు రాముడు విష్ణువే అని రాముడు అరణ్యవాసానికివచ్చాడు రావణవధ కోసమే ఇదంతా జరుగుతూందనీ కానీ భరద్వాజుడు లేచివెళ్ళి
పాద్యమిచ్చి తీసుకురాడు, ఎందుకంటే నరుడిగా ఉన్నాడు ఆయన ధర్మం తనని గౌరవించడం.
గురువునితాను గౌరవించాలి అంతేకానీ ఎదురెళ్ళి తీసుకోరాకూడదు, ఇప్పుడూ రాముడు
అన్నాడూ న్యవేదయత చ ఆత్మానం తస్నై లక్ష్మణ పూర్వజః ! పుత్రౌ దశరథ స్యాఽఽవాం భగవన్ రామ
లక్ష్మణౌ !! మేము దశరథ
పుత్రులము మమ్మల్ని రామ లక్ష్మణులు అంటారు భార్యా మమేయం వైదేహీ కల్యాణీ జనకాఽఽత్మజా ! మాం చాఽనుయాతా విజనం
తపోవనమ్ అనిన్దితా !! అనిన్దితా అంటే చాలా స్వచ్ఛమైనటువంటి శీలం కలిగిన ఈ సీతామ్మా! తన ధర్మాన్ని తాను
రక్షించుకోవడం కోసం భర్తయైన నన్ను అనుగమించి తానుకూడా అరణ్యవాసానికి వచ్చింది,
మేము ముగ్గురం తండ్రి శాసనం మేరకు అడవికి వచ్చాము అన్నాడు.
|
తప్పా... మా
నాన్నగారినండీ...! వరాలడిగిందండీ వచ్చానండీ ఇప్పుడు క్షత్రియులలో రాజులులలో ఏమిటో తెలుసాండీ...
తండ్రి అడవులకు పంపడం అంటే పెద్ద అవమానమన్నమాట, ఎందుకంటే పెద్ద కొడుకునీ
రాజ్యాధికారం ఉన్నవాన్ని తండ్రి ఎందుకు పంపించేస్తాడు, ఏదో మహాపాతకంచేశాడు కాబట్టి
పంపించేసి ఉంటాడు కాబట్టీ ముందేం చెప్పాలంటే నేను అలాంటివాన్ని కాదండోయ్ బాబూ అని
చెప్పుకోవాలంటే... మా నాన్నగారికి ముగ్గురు భార్యలండీ మూడో ఆవిడ ఓ రాత్రికి రాత్రి
వరాలు అడిగిందండీ ఆమెకి వరాలు ఇచ్చారండీ ఆయన్ని సంత్యంలో పెట్టడానికి నేను
వచ్చానండీ తప్పా నా తప్పేంలేదండీ అని చెప్పాలి కానీ అలా చెప్పలేదు. ఋషి - మహర్షి ఆయనకు తెలుసు నేను ఎంత చెప్పాలో అంత
చెప్తేచాలు ఆయన నన్ను అలా అపార్థం చేసుకోడు ఇంతే చెప్పాడు అంతే.
అయన ఏమన్నాడో తెలుసాండీ! నీవు అరణ్యానికి వచ్చావనీ ఎందుకొచ్చావో కూడా నాకు
తెలుసు, తండ్రి ఇచ్చిన వరాలచేత తండ్రిని సత్యంలో నిలబెట్టడానికి వచ్చావు రామా!
స్వాగతం. ఆ కూర్చున్న భారద్వాజ మహర్షి ఎలా ఉన్నారో తెలుసా... మృగ పక్షిభిః
ఆసీనో మునిభి శ్చ సమన్తతః ! రామమ్ ఆగతమ్ అభ్యర్చ్య స్వాగతే నాహ తం మునిః !! ఆయన
చుట్టూ మృగములూ పక్షులూ అన్నీకూడా ఆయన చుట్టూ కూర్చున్నాయట, శిష్యులు కాదు,
శిష్యులు ఎలాగో కూర్చుంటారు. శిష్యులూ కూర్చున్నారూ ఆ పక్కనో
పెద్దపులీ ఆ పక్కనో సింహమూ ఆ పక్కనో తోడేలు ఆ పక్కనో ఎలుగు బంటి ఆ పక్కనో రెండు
కోతులూ ఓ మూడు పిల్లిల్లూ నాలుగు కుక్కలూ ఐదు జింకలూ ఆరు లేళ్ళూ ఏడు దుప్పులు
అన్నీ కూర్చున్నాయి ఆయన చుట్టూ వీటితో పాటు ఏడు పావురాళ్ళు ఆరు భాష పక్షులు నాలుగు
వాన కోయిళ్ళు ఇన్నీనూ రాముడు చూశాడు ఇది మీరు చూడాలి అది దానివుద్దేశ్యం. అలా ఉంటుందాండీ..! ఉంటుంది. ఎందుకో తెలుసా!
తపస్సు చేసేటటువంటి మహర్షి యొక్క శక్తితరంగములు ఎన్ని భూతముల మీదపడుతాయో ఆ భూతములు
అన్నింటికీ కూడా... ఒకదానియందు ఒకదానికి ప్రేమ అంకురిస్తుంది, సహజమైనటువంటి
వైరాన్ని మరచిపోతారు. పులికి వేటాడూ అని ఎవరూ నేర్పక్కరలేదు వేటాడేస్తుంది కానీ
వేటాడేపులి వేటమరిచిపోయి ప్రశాంతంగా ఋషి దగ్గర అలా కూర్చుంటుంది. అది పక్కనే అది
చంపగలిగన ఆవులు అలా తిరుగుతున్నా చంపదు.
నేను ఈ మధ్య కాకినాడ వచ్చేముందు ఏదో ప్రత్యేకమైన కార్యం కోసం ఒక చోటుకివెళ్ళా
పొలం గట్టుకెళ్ళా చంటి బాబుగారి పొలం దగ్గరికి వెడితే అక్కడ నేనొక దృష్యం చూశాను, కోడి కోడి పిల్లలు
ఓ కోడి పుంజు ఓ కుక్క ఓ పిల్లీ మూడూ పడుకుని ఉన్నాయి కోడి పిల్లల తిరుగుతున్నాయి
కుక్క అక్కడే పడుకుని ఉంది రెండు కాళ్ళూ ముందుకు చాపి, నాకు వెంటనే చాలా సంతోషం
కలిగింది ఇలాంటివి జ్ఞాపకానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడిగా ఏమయ్యా
కుక్క కోడిపిల్లని
|
తినేయ్యాలిగా...
పిల్లి కోడిని ఎత్తుక పోవాలిగా, కుక్కా ఆవుని కరవడం ఇలాంటివి ఉంటాయిగా... ఇవేవి
ఒకదాన్ని ఒకటి చెలకవా అన్నాను అంటే ఆయన అన్నాడూ కుక్క కోడి పిల్లని ఎత్తుకపోదు
పిల్లి కోడిని కొరకదండీ ఒక వేళ రాత్రీ నక్కొస్తే మాత్రం ఈ కుక్కలన్నీ అరచి వీటిని
రక్షిస్తాయండీ అన్నాడు. నేను అన్నాను అలా ఎలా కుదురుతుంది అన్నాను దానికేముందండీ
మనందరం అదిగో ఈ యజమానికి సంబంధించిన వాళ్ళమని వాటికి తెలుసండీ అన్నాడు. జంతువుకి
అంత చిత్రమైన లక్షణం ఉంటుందండీ... మనందరం యజమానికి సంబంధించిన వాళ్ళం, ఈ కోడి
యజమాని సొత్తు దీనిని రక్షించాలి తప్పా నేను దీనిని తినేయకూడదని కోడిని
రక్షిస్తుంది అదే కుక్కా అదే కోడి వీధిలో ఉన్నాయనుకోండి, ఎవరికోడో ఎవరి కుక్కో
అయితే ఈ కుక్క కోడిని ఎత్తుక పోతుంది. ఒక
యజమానివైతే రక్షించుకొంటుంది అది గమ్మత్తు.
అలాంటిది ఒక మహర్షి పక్కన ఉన్నటువంటివి జాతివైరం మరిచిపోయాయి అంటే మీరు ఎందుకు
ముక్కున వేలేసుకోవాలి, మీరు వేసుకున్నారని కాదూ... ప్రాజ్ఞులు మీకు అన్నీ
తెలుసూ... కాబట్టి అన్నీ ప్రేమగా కూర్చున్నాయి ఆయన తేజస్సు అటువంటిది. ఇప్పుడు
రాముడు వెళ్ళిన తరువాత 14 సంవత్సరములు అరణ్యంలో గడపాలనుకుంటున్నానూ, తాపసిగా
ఉంటానూ నాకు అనుకూలమైన ప్రదేశం చెప్పండి. అంటే భారద్వాజుడు అన్నాడు 14 యేళ్ళు నీవు
ఎక్కడికో వెళ్ళక్కరలేదు ఇక్కడే ఉండచ్చు నాతోపాటు ఉండి తపస్సుచేసుకోవచ్చు 14 యేళ్ళు
పూర్తి చేసుకొనివెళ్ళిపో. అవతార ప్రయోనం ఒకటి ఉందికదాండీ అది మాట్లాడిస్తుంది, రాముడు
అన్నాడు ఇక్కడికి కొద్ది దగ్గర్లోనే జనపదాలు ఉన్నాయి వాళ్ళకి ఏమిటంటే నామీద ప్రీతి
అందులో ఇది ఎలా ఉంటుంది అంటే... రాముడు అంటేనే వాళ్ళందరు చాలా గొప్పగా
చెప్పుకునేవారు అందులో ఇప్పుడు రాముడు పితృవాక్య పరిపాలన కొరకు బయటికి వచ్చేశాడంటే
రాముడు ఎక్కడికి వెళ్ళినా చూడ్డానికి ఎగబడుతారు, ఈ చూడ్డానికి ఎగబడ్డం అనేటటువంటి
లక్షణం, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉన్నదే కాబట్టి దానిగురించి నేను కొత్తగా
చెప్పక్కరలేదు. కాకపోతే అప్పుడు ధర్మాత్ములను చూసేవారు రెండో విషయాన్ని నేను
పూర్తిచేయను.
కాబట్టి ఆ జనపదాలల్లో ఉండేటటువంటి వాళ్ళందరు కూడా చూడ్డానికి వస్తారు, వస్తే
వాళ్ళందరూ మాట్లాడుతారు ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని నిర్మానుష్యంగా ఉండే
ప్రదేశం ఏదైనా మాకు చెప్పండి అని అడిగాడు. అంటే ఆయన అన్నాడూ, వాళ్ళకి అరణ్యం మీద ఎంత పట్టో
చూడండి ఋషులకి, నేను చాలామార్లు తిరిగాను అక్కడ దావాగ్ని ఉండదు అటువంటి ప్రదేశం
చెప్తాను రామా!
దశ క్రోశ ఇత స్తాత గిరి ర్యత్ర నివత్స్యసి ! మహర్షి సేవితః పుణ్యః సర్వతః సుఖ
దర్శనః !!
గో లాఙ్గూలాఽను చరితో వానరర్ష నిషేవితః ! చిత్రకూట ఇతి
ఖ్యాతో గన్ధమాదన సన్నిభః !!
యావతా చిత్రకూట స్య నరః శృంగాణ్యఽవేక్షతే !
కల్యాణాని సమాధత్తే న పాపే కురుతే మనః !!
ఋషయ స్తత్ర బహవో
విహృత్య శరదాం శతమ్ ! తపసా దివమ్ ఆరూఢాః కపాల శిరసా సహ !!
నాయనా! ఇక్కడ నుంచి పది క్రోసుల దూరం వెడితే చిత్రకూటమనేటటువంటి ఒక పర్వతం
ఉంది, ఆ చిత్ర కూట పర్వతంలో భల్లూకములు, కోతులు ఎక్కువగా తిరిగుతూ ఉంటాయి, అది
గంధమాదన పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది యావతా చిత్ర కూట స్య నరః శృంగాణ్యఽవేక్షతే నరుడు ఆ చిత్రకూట పర్వత శిఖరాల్ని ఎంతకాలం
చూస్తుంటాడో అంతకాలం అసలు అమంగళమైనపని చేద్దామన్న ఆలోచనరాదు. ఆ పర్వతానికి ఆ శక్తి
ఉంది, కాబట్టి రామా! నీవు అక్కడికి వెళ్ళు, వెళ్ళితే అక్కడ అనేక మంది ఋషులు
ఉంటారు, ఆ ఋషులందరు కూడా కొన్ని వందల సంవత్సరములు తపస్సు చేసి కపాల భేదనమైపోయి
వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. అటువంటి ఋషులతో కూడినటువంటి ప్రాంతం తేజో
మయంగా ఉంటుంది. అక్కడ అనేకమైన తేనెపట్లు, మంచి పళ్ళు, లేళ్ళు, ఏనుగుల యొక్క మందలు
సంచరిస్తూ ఉంటాయి, అక్కడ క్రూర మృగాలు తిరగవు, కాబట్టి పక్షులు కూతలు కూస్తుంటాయి,
సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, లోయలతో శిఖరాలతో తోటలతో పళ్ళతో పువ్వులతో కడు
రమ్యంగా ఉంటుంది సీతమ్మ సంతోషిస్తుంది అవన్నీచూసి కాబట్టి రామా! నీవు ఆ చిత్ర కూట
పర్వతం మీద ఉండు. అలాగే అన్నారు మధుపర్కము ఇచ్చారు, ఆరోజు రాత్రి అలసట
తీరిపోయేటట్టుగా హాయిగా నిద్రపోయారు మరునాడు పొద్దున్నేలేచి ఇంక మేము బయలు
దేరుతామనిచెప్పి భారద్వాజ మహర్షి దగ్గర వీడ్కోలు పుచ్చుకున్నారు.
|
అయన అన్నారూ... మీరు
యమునా నదిని దాటవలసి ఉంటుంది ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు, యమునానది దాటేటప్పుడు అక్కడ
మిమ్మల్ని గుహుడు దాటించినట్లు దాటించడానికి పడవలు పెట్టుకున్నవాళ్ళెవ్వరూ ఉండరు,
ఎందుకుండరూ అంటే అక్కడేమీ జనపదాలులేవు అక్కడ దాటించడానికి మనషులెవరుదాటరు కాబట్టి
మీరిప్పుడు అక్కడ దాటివెళ్ళాలి కాబట్టి మీపడవ మీరేనిర్మించుకోండి అక్కడ నిర్మించుకుని
దాటండి అన్నాడు. దాటి ఆవలి ఒడ్డుకు కొంత దూరము వెళ్ళితే తతో న్యగ్రోధమ్ ఆసాద్య
మహాన్తం హరిత చ్ఛదమ్ ! వివృద్ధం బహుభి ర్వృక్షైః శ్యామం సిద్ధో పసేవితమ్ !! తస్మై
సీతాంఽజలిం కృత్వా ప్రయుంజీతాఽఽశిష శ్శివా !!! అక్కడా నదినిదాటి ముందుకు వెళ్ళుతున్నప్పుడు
శ్యామము అనుపేరు కలిగినటువంటి ఒక పెద్ద మఱ్ఱిచెట్టు ఉంటుంది. అది దేవతలచేత కూడా
సేవింపబడుతూంటుంది, ఆ చెట్టు దగ్గరికివెళ్ళి ఎవరైనా మనస్కారంచేసి ఏదైనా కోరిక
కోరుకుంటే ఆ చెట్టు అటువంటి స్థితిని ఇవ్వగలదు, ఆ చెట్టు అలా రక్షించగలదు.
మీరూ ఇదిచెప్తే కాకతాలీయం అనుకోకండీ ఆ... ఎక్కడ జరిగింది మీకు తరువాత
చెప్తాను, సభా ముఖంగా చెప్పే విషయంకాదు పేర్లు ఒక మహావృక్షం ఉన్నచోట ఆ
మహావృక్షాన్ని తీసేసేటప్పుడు యథాలాపంగా తీసేస్తే ఇబ్బందులు వస్తాయి అది చాలాకాలం
కొన్ని వందల సంవత్సరములు వేల సంవత్సరములు ఉండిపోయినటువంటిచెట్టు నమో హరికేశాయోపవీతినే
పుష్టానాం పతయే నమో నమః వృక్షోభో అంటాము రుద్రాధ్యాయంలో, చెట్టు చెట్టు ఆకులూ,
ఆకుపచ్చతనం శివ శ్వరూపము. కాబట్టి ఆ న్యగ్రోధము ఉందే ఆ మఱ్ఱిచెట్టు అదీ దేవతలలా అనుగ్రహాన్ని
ఇవ్వగలదు. అక్కడికి వెళ్ళి సీతమ్మని నమస్కరించమని చెప్పండి, ఎందుకని నమస్కరించాలి,
సీతమ్మ రాముడి గురించి లక్ష్మణుడి గురించి, జనకుడి గురించి రెండు వంశాల గురించి
రాజ్యం గురించి అన్ని నమస్కారాలు ఆవిడే చేసేస్తుంది, పురుషుడికి ఒక సౌలభ్యం ఉందండి
లోకంలో నేను వందేళ్ళు బతికుండాలని నాకు నేను ఆశీర్వచనం చేసేసుకోకూడదు నేను
వందేళ్ళు బాగుండాలని నాకునేను ఆశీర్వచనం చేసుకోకూడదు కాబట్టి తేలిక మార్గం ఏమిటంటే
మా ఆవిడనీ దీర్ఘసుమంగళీభవ అని ఆశీర్వచనం చేయడమే కదా!... మా ఆవిడకి నేను ఆలా
ఆశీర్వచనం చేసేస్తే నేను బాగుంటాను నాకు నేను చేసుకోకూడదు, మా ఆవిడకి చేసేస్తే
ఆశీర్వచనం నేను బాగుంటా. కాబట్టీ మగవాడికి అదెంతసులభమో ఆడదీ ఎప్పుడూ మగవాడి
గురించి నమస్కారం చేస్తుంది తనగురించి తాను మగవాడు నమస్కారం చేసుకున్నా
చేసుకోకపోయినా ఆడదిచేస్తుంది అదే ఈ జాతిలో గొప్పదనం, ఆడది తన కొరకు చేసుకోదు
తనభర్త కోసం బిడ్డల కోసం చేసుకుంటుంది కాబట్టి సీతమ్మని అక్కడ నమస్కారం చెయ్యమనీ
చెప్పు.
|
సరే భరద్వాజ
ఆశ్రమంలో చెప్పినట్టుగా యమునా నది ఒడ్డుకు వెళ్ళారు ఒక చిన్న పడవలాంటిదాన్ని
నిర్మించుకున్నారు దానిమీదికి ఎక్కారు సుడులతో ఉన్న ఆ సూర్యపుత్రీ అయినటువంటి
యమునని దాటారు ఆవలి ఒడ్డునకెళ్ళారు వెళ్ళిన తరువాత ఆక్కడ ఒక కడురమ్యమైనటువంటి
ప్రదేశాన్ని చూశారు, చక్కటి సెలఏరు ప్రవహిస్తోంది, వాన కోయిలలు కూస్తున్నాయి
దానిప్రతిగా నెమళ్ళు కూస్తున్నాయి, ఎక్కడ చూసినా మంచి ఫలాలు పెద్ద పెద్ద తేనెపట్లు
చిలకలు పక్షులు వాటి అరుపులు మంచి రమ్యంగా ఉంది. లక్ష్మణుని పిలిచి నీవు ఇక్కడ ఒక
పర్ణశాలను నిర్మించు అన్నాడు. ధృడమైన కర్రలు తెచ్చి ఎక్కడెక్కడ అగ్ని వేదిలు
ఉండాలో, ఎక్కడ దేవతార్చన పీఠాలు ఉండాలో ఎక్కడ ఏ గధి ఉండాలో దానికి తగినట్లుగా ఒక
పర్ణశాలను నిర్మించాడు నిర్మించి అన్నయ్యా పర్ణశాల నిర్మాం చేశాను అన్నాడు. రాముడు
అన్నాడు కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిర జీవిభిః నాయనా లక్ష్మనా! వేదం
చెప్తూంది, రాముడు ఏది చెప్పినా వేదం చెప్పిందే చెప్తాడు, శాస్త్రం చెప్పిందే
చెప్తాడు కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చి జీవిభిః వాస్తు శమనం చెయ్యకుండా
ఇంట్లోకి వెళ్ళకూడదు, గృహప్రవేశంచేస్తే వాస్తుపూజ చెయ్యాలి వాస్తుపూజ చెయ్యకుండా
ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఉన్నవారు చిరకాలం బ్రతకరు.
కాబట్టి లక్ష్మణా మనం వాస్తుపూజ చేద్దాం అని అన్ని మంత్రములూ రాముడికి తెలుసు
వేదం చదువుకున్నాడు అందుకని అయనే ఆ వాస్తు హోమం చేసుకున్నాడు. చేసుకుని అన్నాడు
మనం క్షత్రియులం కాబట్టి ఒక కృష్ణ జింకని ఏ అవయవ లోపం లేనిదాన్ని నీవు పట్టి చంపి
కాల్చి పచనంచేసి మాంసం పట్టుకురా దేవతలకు నివేదన చేస్తాను అన్నాడు, వెళ్ళి లక్ష్మణుడు
తీసుకొచ్చాడు దాన్ని నివేదన చేశారు, నివేదన చేసిన తరువాత చక్కగా వాళ్ళు ఆ ఇంట్లో
సంతోషంగా ముగ్గురూ అన్ని కష్టాలు మరిచిపోయి, ఆ ఋషులను చూస్తూ ప్రతిరోజు అలా ఆ
పక్షుల కలకూజితాలు వింటూ చక్కగా ఆ నదులలో స్నానంచేస్తూ ఎంతో సంతోషంగా కందమూలాలు
భక్షిస్తూ ఆనందంగా జీవితాన్ని గడిపేస్తున్నారు.
ఇక్కడ బయలుదేరినటువంటి సుమంత్రుడు రాముడు కంటికి లీలగా కనపడినంత సేపుచూసి రాముడు
కనపడడం మానేసిన తరువాత రథాన్ని తీసుకొని అయోధ్యచేరాడు, అయోధ్యా పట్టణం అంతాకూడా
భర్త మరణించినటువంటి భార్య ఎలా ఉంటుందో అలా ఉందట, ఎవ్వరి ముఖంలోనూ కాంతిలేదు
కళలేదు సంతోషంలేదు లోపలికి వెళ్ళాడు దశరథ మహారాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాముడు ఎలా ఉన్నాడు అని అడిగాడు, పాపం చెప్పవలసినటువంటి
మంచి మాటలు చెప్పాడు కౌసల్యకి చెప్పాడు కానీ ఇద్దరికీ చెప్పేటప్పుడు ఎవరికి ఎలా
చెప్పాలో అలా చెప్తాడు, ఎందుకంటే కౌసల్యకి చెప్పేటప్పుడు ఆడది బెంగ ఎక్కువ
పెట్టుకుంటుందని బాలేవ రమతే సీతా బాల చన్ద్ర విభాఽఽననా అంటాడు. సీతమ్మ చాలా సంతోషంగా ఉంది, అరణ్యంలో
చక్కగా చిన్నపిల్ల ఆడుకున్నట్టు ఆడుకుంటోంది రాముడితోటి ఏమీ ఇబ్బందిలేదు అని
చెప్పాడు, కోడలి గురించే ఎక్కువ బెంగ అత్తగారికి మామగారికిని కాబట్టి ఈమాటలు చెప్పాడు
ఉపశమనం కల్పించాడు, కానీ నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడా అడవుల్లో తిరుగుతున్నాడా
చెట్లకింద పడుకున్నాడా లక్ష్మణుడు ఇంతబాధ పడుతున్నాడా అని ఎంత ధారుణమైన
నిర్ణయంచేశాను అని వెడుతున్నప్పుడు ఎక్కడచూసినా ప్రజలందరు నన్నే విమర్షిస్తూ
మాట్లాడుకుంటున్నారా అని దశరథుడు బాధపడి బాధపడి ఏడ్చి ఏడ్చి స్పృహతప్పి పోయాడు.
|
సరె ఆ తరువాత
అక్కడనుంచి సుమంత్రుడు బయలుదేరిపోయి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తరువాత దశరథ
మహారాజుగారికి స్పృహకలిగింది ఆయన కూర్చున్నాడు కానీ తనకొడుకు అరణ్యవాసానికి
వెళ్ళిన తరువాత బాధపడినటువంటి కష్టాలు విన్నటువంటి తల్లి మనసుతో ఉన్నటువంటి
కౌసల్యా తట్టుకోలేకపోయింది. ఆవిడ అందీ న పరేణాఽఽహృతం భక్ష్యం
వ్యాఘ్రః ఖాదితుమ్ ఇచ్ఛతి ! ఏవమ్ ఏవ నర వ్యాఘ్రః పర లీఢం న మన్యతే !! నీవు నా కొడుకుని అరణ్యవాసానికి పంపించావు రాజా!
14 సంవత్సరములు తరువాత రాముడు తిరిగివస్తాడు పట్టం కట్టుకుంటాడు అంటున్నావు, కానీ
ఈలోగా భరతుడు వస్తాడూ రాజ్యం ఇచ్చేస్తావు కాబట్టి పట్టాభిషేకం అయిపోతుంది, రాముడు
పెద్దపులి లాంటివాడు, పెద్దపులి తానువేటాడినది తింటూంది తప్పా ఇంకో మృగం
ముట్టుకొంది తానుతినదు, రాముడు ఒక్కసారి భరతుడు సింహాసనం మీదకూర్చుని పరిపాలించేసిన
తరువాత అన్నయ్యా నీవు వచ్చావు కాబట్టి మళ్ళీ నీకు ఇస్తున్నానంటే
పుచ్చుకునేటటువంటివాడుకాడు కాబట్టి నాకొడుకు ఎప్పటికి ఇంక అరణ్యాలలోనే ఉండిపోతాడు,
అలా అరణ్యాలలో ఉండిపోయేటటువంటిస్థితినీ అటువంటి నిర్ణయంచేసి నువ్వేకల్పించావు,
పైగా సుమంత్రుడు ఒకమాట అన్నాడు అంతకు ముందే నిన్ను నీభార్య వరాలు కోరగానే
ఇచ్చేశావు తప్పా మంత్రులు ఉన్నారు వాళ్ళతో పాటు మాట్లాడుదామని ఆలోచించలేదు,
ఇచ్చావు దానివల్ల ధర్మాత్ముడైన కొడుకు వెళ్ళిపోయాడు. అది శూలంలా గుచ్చుకుంది
దశరథుడికి, నన్ను తీసుకెళ్ళి చూపిస్తావా నీకు నేను చేసిన ఉపకారమేమైనా ఉంటే, నా మీద
నీకు కృతజ్ఞత ఉంటే నన్ను రథం ఎక్కించి తీసుకెళ్ళి రాముని దగ్గర విడిచిపెట్టేయ్
నేను అక్కడే అరణ్యంలో బ్రతుకుతాను నాకు వద్దు ఈ అంతఃపురం అన్నాడు.
అంతబాధలో ఉన్నాడు ఇప్పుడు కౌసల్యా ఈ మాట అంది, ఇప్పుడు దశరథుడికి ఎలా ఉంటుందో
ఎంతమంది ఎన్నివైపులనుంచి శూలాలుపెట్టి పొడిచేస్తున్నారో చూడండి, అనీ ఆవిడందీ స తాదృశః
సింహ బలో వృషభాఽక్షో నరర్షభః ! స్వయమ్ ఏవ హతః పిత్రా జలజేనాఽఽత్మజో యథా !! సింహం ఎటువంటి బలం కలిగి ఉంటుందో అటువంటి
పరాక్రమం ఉన్నవాడూ వృషభ సదృషమైనటువంటి గొప్ప పరాక్రమం ఉన్నవాడూ నా కొడుకుని ఎంత
తేలికగా నీవు మట్టుపెట్టేశావో తెలుసా... దశరథా..! ఒక చాప ఇంకో చాపని మింగేయడము
దాని జాతిలక్షణం అలా ఒక తండ్రే తన కొడుకుని కబళించేసినటువంటి అపకీర్తి నీది, ఇంత
పరాక్రమం ఉన్నా చేతకాని వాన్నిచేసి నా కొడుకుని అడవులకు పంపించావు, రాజ్యం ఏలకుండా
చేశావు, దీనికి అంతటికీ నివ్వేకారణం నువ్వు చేసిన నిర్ణయమే కారణం అని గతిః ఏకా
పతిః నార్యాః ద్వితీయా గతిః ఆత్మజః ! తృతీయా జ్ఞాతయో రాజన్ శ్చతుర్థీ నేహ విద్యతే
!! రాజా! నేను ధర్మ శాస్త్రాలు చదివాను నాకు కూడా శాస్త్రప్రవేశం ఉంది.
ఆడదానికి మూడే గతులు ఉన్నాయి నాల్గవ గతి ఇంక లేదు, ఒకటి భర్త యొక్క రక్షణలో ఉండడం
అత్యుత్తమైన గతి, రెండవది భర్త యొక్క రక్షణ పోయినప్పుడు కొడుకు యొక్క రక్షణలో
ఉండడం కొంత మంచి గతి మూడవది ఆ రెండు రక్షణలు లేనప్పుడు జ్ఞాతి దగ్గర ఉండడం తప్పని
సరి అయినటువంటి గతి నాల్గవ గతి ఇక ఆడదానికి లేదు రక్షణ స్థానం లేదు.
|
కానీ నీవ్వేం
చేశావో తెలుసా దశరథా! తత్ర త్వం చైవ మే నాస్తి నీవు ఉండి నాకు లేనివాడివి, ʻచాలా పెద్ద మాటʼ ఈ మాట, భర్త
ఉన్నాడు కానీ లేనివాడి కిందేలెక్క నీవు నాకు సంబంధించినంత వరకు నా కొడుకునే
కబలించినటువంటివాడివి కాబట్టి నీవలన నాకు రక్షణ ఉంటుంది అనడానికి ఏమీలేదు నీవు
నాకు దుఃఖ స్థానమైనటువంటివాడివి కాబట్టి నీవు ఉండి లేనట్లే రామ శ్చ వనమ్
ఆశ్రితః ! కడుపున పుట్టినకొడుకునో నీవు ఉండిలేనివాడివిగా నీవు అయిపోతే
ఫరవాలేదు నీవు ఉండిలేనివాడివై నాకొడుకుని ఉండీ లేనివానినిచేశావు కొడుకుని
అరణ్యానికి పంపించేశావు ఇప్పుడు నాకు రెండోగతి తీసేశావు, మూడవగతి నేను జ్ఞాతుల
దగ్గర ఉండాలంటే ఏలక్ష్మణుడిలాంటి వాడిదగ్గరో ఉండాలి భరతుని దగ్గర ఉండడానికి నన్ను
చూడడుగా రాజ్యాం పుచ్చుకుంటాడుగా కౌసల్యామాత హృదయం కూడా అది, కాబట్టి ఆ లక్ష్మణుడు
కూడా అడవులకు వెళ్ళిపోయాడు నేనో అడవికి వెళ్ళకూడదు ఎందుకనీ రాముడు ఒప్పుకోడు ధర్మం
నిన్నే సేవించాలి. ఉండీ లేనివాడివైన నిన్ను సేవిస్తూ మూడుగతులు నాకు మూసుకుపోయాయి
ఎప్పుడైనా ఇది ఆలోచించావా..? నీ పట్టమహిసిని అయినందుకు నన్ను ఇంత క్షోభ పెట్టావు
ఇది నీవు ఒక పతిగా నాకు ఇచ్చినటువంటి గౌరవం.
ఈ మాటలన్న తరువాత ఇంకా ఏడ్చాడంట దశరథుడూ రెండు
కనుగుడ్లు ఊడికిందపడిపోతాయేమో అన్నంత బాధపడ్డాట. ఎందుకంటే ఒకటీ రాముడు
వెళ్ళిపోయాడు రాజ్యమా పోయింది లోపల తానా రామున్ని చూడకుండా ఉండలేకపోతున్నాడు ఎవరు
చూసినా నీవల్లే నీవల్లే నీవల్లే అంటున్నవాళ్ళే... తాను తనవల్లకాదూ తాను ధర్మపాశానికి సత్యపాశానికి కట్టుబడిపోయానని
తనకుతెలిసి ఆ మాట అన్నవాళ్ళు రాముడు తప్పా ఎవ్వరూలేరు, ఆ అన్న రాముడు పక్కనలేడు
తనకు ఉపశాంతి కలుగుతుందీ అని కైక దగ్గరి నుంచి కౌసల్య దగ్గరికి వచ్చాడు కౌసల్య
శూలలుపెట్టి పొడిచినట్లు ఈ మాట అంది అని పైగా చివర అందీ హతం త్వయా రాజ్యమ్ ఇదం స
రాష్ట్రం ! హత స్తథాఽత్మా సహ మన్త్రిభి శ్చ !! హతా సపుత్రాఽస్మి హతా శ్చ పౌరాః
! సుత శ్చ భార్యా చ తవ ప్రహృష్టౌ !! నువ్వు ఎవ్వర్నీ సంప్రదించకుండా నీయంత నీవు
నిర్ణయంచేసుకొని ఈ రాజ్యాన్నే చంపేశావు, ఈ రాష్ట్రాన్ని చంపేశావు, నీవారైన వారినందర్నీ
నిన్ను నమ్ముకువాళ్ళందర్నీ చంపేసినట్టు నిన్ను నమ్ముకున్న మంత్రుల్ని కనీసం
సంప్రదించకుండా నిర్ణయంచేశావు కాబట్టి ఆ మంత్రులూ చనిపోయినట్లే నీ కొడుకులు నిన్ను
నమ్ముకున్నందుకు వాళ్ళని అరణ్యాలకు పంపించావు కాబట్టి వాళ్ళూ మరణించినట్లే, నిన్ను
నమ్ముకుని నీపాలన గొప్పదనుకొన్నందుకు గొప్పపరిపాలన తెచ్చి వాళ్ళకిస్తున్నావు
పౌరులను చంపేశావు, ఎవరు బతికిసంతోషంగా ఉన్నారంటే నీవు, కైకా, భరతుడు మీ ముగ్గురే
బాగున్నారు ఇది నీయొక్క గొప్పదనం దశరథా..! నీలాంటి భర్తని పొందినందుకు నేను ఇలా
ఉన్నాను.
ఆయనటా ఏడ్చి ఏడ్చి ఏడ్చీ... ఇంక ఏడవడానికి కూడా కన్నులలో నీరులేకా ఏం
మాట్లాడాలో అర్థంకాకా భార్యవంక తిరిగి మూర్ఛపడిపైకి లేచీ రెండు చేతులెత్తి
కౌసల్యకు నమస్కారం చేశాడట, ప్రతి భార్యకీ నమస్కారం చేసుకోవడమే పెద్దాయన
దహ్యమాన స్తు శోకాభ్యాం కౌసల్యామ్ ఆహ భూపతిః ! వేపమానః అంజలిం కృత్వా ప్రసాదాఽర్థ మఽవాఙ్మఖః !!
ప్రసాదయే త్వాం కౌసల్యే రచితోఽయం మయా అంజలిః ! వత్సలా చానృశంసా చ త్వం హి
నిత్యం పరేష్వఽపి !!
భర్తా తు ఖలు నారీణాం గుణవాన్ నిర్గుణోఽపి వా ! ధర్మం
విమృశమానానాం ప్రత్యక్షం దేవి దైవతమ్ !!
సా త్వం ధర్మపరా
నిత్యం దృష్ట లోక పరావర ! నాఽర్హసే విప్రియం వక్తుం దుఃఖితాఽపి సుదుఃఖితమ్ !!
|
ఇలా రెండు చేతులు
పెట్టి నమస్కరించి అన్నాడట, నేను నమస్కరించి మాట్లాడుతున్నాను కౌసల్యా నీవు ధర్మము
తెలిసున్నదానివి నీకు అపకారం చేసినవాళ్ళని కూడా ప్రేమచేత చూసేటటువంటి
స్వభావమున్నదానివి నేను శోకాగ్నిచేత దహింపబడిపోతున్నాను నేను లోపల స్వస్థ చిత్తుడునైలేను
అటువంటి నీవు ఇంత కష్టంలో ఉన్న నన్నూ వాత్సల్యంతోచూసి నన్ను అనునయిస్తావని
ఇక్కడికివచ్చాను, ఒకవేళ గుణములు
ఉన్నవాడైనా గుణములు లేనివాడైనా భర్త దైవంకదా కౌసల్యా!.. నీకు ఈ ధర్మం కూడా
తెలుసుకదా... మరి ఇంత కష్టంలో ఉన్న నన్ను ఎందుకు ఇంత బాధపెడుతున్నారు మీ అందరూ
ఎందుకు ఇంత ధారుణమైన మాటలు మాట్లాడుతున్నారు.
నీవు తెల్లవారినప్పుడులేస్తే లోకాన్నంతటినిచూసి
ధర్మా-ధర్మములను తెలిసి మాట్లాడేదానివి నీవు ఇలా తూలనాడి మాట్లాడడం న్యాయమా
చెప్పూ... అన్నాడు. ఈ మాటలని నిన్నూ తప్పు చేశాను అనుకుంటే క్షమించమని రెండు
చేతులతో నమస్కరించి ప్రార్థన చేస్తున్నానూ అన్నాడు, వెంటనే కౌసల్యా
కూర్చున్నదిలేచి గబగబా లేచివచ్చి దశరథ మహారాజుగారి యొక్క పాదములమీద పడిపోయింది.
పడిపోయి ప్రసీద శిరసా యే భూమౌ నిపతితాఽస్మి తే ! యాచితాఽస్మి హతా దేవ
హన్తవ్యాఽహం న హి త్వయా !! రాజా! నన్ను మీరు క్షమించండి, ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను భూమి మీదపడి నా తల
మీ పాదములకు తాకించి నమస్కరించి క్షమాపన చెప్తున్నాను, నేను చనిపోయాను ఎప్పుడు చనిపోయాను
తెలుసా? ఏనాడు మీరు నాకు రెండు చేతులెత్తి నమస్కరించేటట్టు నేను మాట్లాడానో ఆనాడే
నేను చనిపోయాను, చాలా పెద్ద తప్పుచేశాను ఇలా నేను మాట్లాడ కూడదు భర్తతో మీరు
ఎంతబాధలో ఉండి నా దగ్గరకు వచ్చారో... నేను మీకు ఉపశమనం కలిగేటట్లుమాట్లాడకపోగా
మీరు అంజలి ఘటించేటట్లుగా మాట్లాడాను నాయొక్క దోషము మన్నింపబడుగాక అని ఆయన పాదముల
మీద తలపెట్టి బాధపడి జానామి ధర్మం ధర్మజ్ఞ త్వాం జానే సత్య వాదినమ్ ! పుత్ర
శోకాఽఽర్తయా తత్తు మయా కిమ్ అపి భాషితమ్ !! మీరు పరమ ధర్మజ్ఞులు సత్య సంధులు ఈ విషయం నాకు
తెలుసు, కానీ ఒక తల్లిగా కొడుకు యొక్క కష్టాలు విని తట్టుకోలేక ఇలా మాట్లాడాను
తప్పా నాకు నిజంగా అంతరంగంలో నీయందు కించిత్ కూడా అన్యమైన అభిప్రాయం లేదు నన్ను
మీరు క్షమించండి శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్ ! శోకో నాశయతే సర్వం
నాస్తి శోక సమో రిపుః !! రామాయణంలో కొన్ని శ్లోకాలండీ...! కరిగించిన బంగారంతో
రాయాలి అలా ఉంటాయి శోకో నాశయతే ధైర్యం అకస్మాత్తుగా వచ్చిపడిపోయిన శోకముందే అది ధైర్యాన్ని
పోగొట్టేస్తుంది శోకో నాశయతే శ్రుతమ్ విన్నవన్నీ మరిచిపోతాడు
శోకానికి శోకో నాశయతే సర్వం శోకం సర్వాన్ని నాశనం చేస్తుంది నాస్తి శోక
సమో రిపుః శోకంతో సమానమైన శత్రువులేరు, ఈ శోకమే నన్ను మీపట్ల ఇంత పెద్దమాట
అనిపించింది కాబట్టి నన్ను క్షమించండి అనిచెప్పింది.
బాగా చీకటిపడిపోయింది ఇంకొక్క గంటలో అర్దరాత్రి సమీపించేటటువంటిస్థితి అటువంటి
సమయంలో దశరథ మహారాజుగారికి పడుకొని నిద్రపోతున్నవానికి తెలివొచ్చింది, అప్పటికే
కౌసల్యాదులకు కూడా కునుకు పడుతూంది ఎవ్వరులేరు లోపల అంతఃపురంలో ప్రభువు నిద్రిస్తున్నప్పుడు
ఎవరుంటారు ఒక్క కౌసల్యా సుమిత్రే ఉన్నారు. ఆయన ఒకమాట అన్నాడు ఆఁ... ఎందుకింత పెద్ద
కష్టం నాకు వచ్చింది, ఏ పాపం చేశాను నేను ఏ తప్పు తీర్పిచ్చీ ఏతల్లి నుంచి ఏ బిడ్డనివేరు
చేశాను, ఏ ఆవుపొదుగు దూడతాగుతుండగా కోసేశానో ఎందుకు ఇంత కష్టపడుతున్నానూ అని
ఆలోచించాను
|
జ్ఞాపకం వచ్చింది కౌసల్యా అన్నాడు, నాకు ఇంకా అప్పటికి పెళ్ళికాలేదు అరవైవేల
సంవత్సరాలున్న దశరథుడు చెప్పుకుంటున్నాడు నిండు యవ్వనంలో ఉన్నాను, మంచి వర్షాకాలం
అరణ్యాలన్నీ కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి పక్షులు రెక్కలు తడిసిపోయి అతి కష్టం మీద
తడిసి ఒంగివున్న చిటారు కొమ్మలను చేరుకొంటున్నాయి అటువంటప్పుడు నాకు వేటాడలని
కోరిక పుట్టింది నేను వేటకు బయలుదేరి వెళ్ళాను, బాగ చీకటి పడింది సరయూనది తీరంలో
ఒక పొదచాటున దాక్కొని ఉన్నాను ఆ పొదచాటున దాక్కొని ఉండగా నాకు శబ్ధభేది విద్యవచ్చు
ఎక్కడైనా శబ్దంవస్తే ఆశద్దాన్ని బట్టి నేను బాణప్రయోగం చేస్తాను ప్రాణిని
చంపడానికి రాత్రి ఏనుగులు నీటిని త్రాగటానికి వస్తాయి కాబట్టి ఒక దున్నపోతుకానీ
ఏనుగుకానీ నీరు త్రాగుచుంటే గురిచూసి కొడదాం చప్పుడును బట్టి ఎందుకంటే ఏనుగులు
నీరు త్రాగితే బాగా చప్పుడు వస్తుంది ఎందుకంటే తొండంతో లాగుతుంది నీటిని అందుకనీ ఆ
శబ్దం కోసం ఎదురు చూస్తున్నాను, ఇంక కొంచెం సేపట్లో తెల్లవారి పోతుందనగా బాగా
చీకటి ఉండగా నాకు ఏనుగు నీరు త్రాగుచున్న చప్పుడు వినపడింది, నేను వెంటనే బాణాన్ని
విడిచిపెట్టాను ఈ లోగా “హతోస్మీ” ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటూ తల్లి
తండ్రుల్నీ అంధులైన వాళ్ళని సేవిస్తున్నటువంటి ఒక ముని బాలుని మీద బాణమేసి
చంపినటువంటివాడెవరూ అన్నకేక వినపడింది.
కాబట్టి నేను గబగబా అక్కడికి పరుగెత్తాను, కౌసల్యా నాకు ఇప్పుడు జ్ఞాపకం
వస్తూంది యదాఽఽచరతి కల్యాణి శుభం వా యది వాఽశుభమ్ ! తత్ ఏవ
లభతే భద్రే కర్తా కర్మజమ్ ఆత్మనః !! గురు లాఘవమ్ అర్థానామ్ ఆరమ్భే కర్మణాం ఫలమ్ !
దోషం వా యో న జానతి స బాల ఇతి హోచ్యతే !! పురుషుడు
తెలిసిచేసినా తెలియకచేసినా చేసిన పనియొక్క ఫలితాన్ని మాత్రం అనుభవించి తీరవలసిందే లేకపోతే
ఇంకొక మార్గంలేదు, నేను చేసినపని
నాకు అనుభవంలోకి వస్తోంది, అలా యుక్తా యుక్తములు దీర్ఘ దృష్టితో ఆలోచించకుండా చేసినవాన్నేకదా మూఢుడు అని
పిలుస్తుంది శాస్త్రం, నేను కూడా అలాగే చేశాను, ఆనాడు వేసిన బాణానికి ఏనుగుపడింది
అనుకున్నాను, కానీ ఒక మునిబాలున్ని పడగొట్టాను. ఇప్పుడు నేను అది అక్కడికి
వెళ్ళిచూసిన తరువాత తస్మిన్ నిపతితే బాణే వాగఽభూ త్తత్ర మానుషీ !
కథమ్ అస్మ ద్విధే శస్త్రం నిపతే త్తు తపస్విని !! తపస్సులో ఉన్న నన్ను కొట్టినవాడు ఎవడూ అన్న
మునిబాలుని యొక్క ఆర్థనాదం వినపడింది, వెళ్ళిచూస్తే మర్మస్థానమునందు నా బాణం
గుచ్చుకోవడంవల్ల నెత్తురోడిపోతూ చిట్టచివరి ప్రాణములుపోతూ నేల మీదపడి గిలగిల
కొట్టుకుంటున్న జడలు కట్టుకున్న ఒక మునిబాలుడు కనపడ్డాడు, ఆయన నన్నుచూసి అన్నాడు
ఎందుకు ఈ బాణంవేశావు అన్నాడు, నేను నీ మీదవెయ్యాలని అనుకోలేదూ నాకు వచ్చినటువంటి
శబ్దభేద విద్యవల్ల ఏనుగుని కానీ మహిశాన్ని కానీ కొట్టాననుకొని బాణం వేశాను
అన్నాడు. నీవు కుండలో నీటిని ముంచుతున్నప్పుడు వచ్చిన గుడగుడ శబ్దం నాకు ఏనుగు
నీటిని పీల్చుతున్న శబ్దంలా అనిపించింది అందుకు వేశాను తప్పా నేను
ప్రయత్నపూర్వకంగా కొట్టలేదూ అన్నాడు.
|
ఇప్పుడు ఆ బాలుడు
నాతో అన్నాడూ... భయపడకు నేను మునిబాలుడనుకదా నన్నుచంపితే నీకు బ్రహ్మహత్యా దోషం
వస్తుందేమోనని బెంగపెట్టుకోకు, నాతండ్రి వైష్యుడు నాతండ్రి నాల్గవ స్త్రీతోకలిసి
జీవించిన కారణంగా నేను పుట్టాను, కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషంలేదు, కాబట్టి ఆ
ఇబ్బంది నీకులేదు కానీ నా తల్లి తండ్రులు అంధులు వాళ్ళజీవితం నామీదే ఆధారపడింది
దాహార్తితో ఉన్న నా తండ్రీ తల్లీ నీరుతెమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళు
దాహంతో పరితపిస్తూ ఉంటారు, కాబట్టి నీవు ఈ నీటికుండ పట్టుకుని నా తండ్రి
శపించకముందేవెళ్ళి నీ బాణానికి నేను నిహతుడైపోయాడనే మాటచెప్పి నీళ్ళు అందించు, ఈ
బాణపు ములుకు ఉన్నంత వరకు నా ప్రాణంపోదు నేను చాలా బాధపడుతున్నాను కాబట్టి
బాణాన్ని పైకిలాగు అన్నాడు. ఆయన బాణాన్ని పైకిలాగాడు మర్మస్థానంనుంచి దశరథుడు. ఆ
పిల్లవాడు కొట్టుకొని కొట్టుకొని నెత్తురోడి కారి నీటిలో కలసిపోతుండగా ఆ ఒడ్డున
పడిమరణించాడు, ఆ ప్రేతాన్ని పక్కకి పెట్టి ఆ నీటి కుండను పట్టుకొని ఆ బాలుడు
చెప్పినటువంటి కాలిబాటలో కుండ పట్టుకునివెళ్ళాడు.
అడుగులు చప్పుడు విన్నటువంటి వృద్ధులైన ఆ బాలుని తల్లిదండ్రులు నాయనా ఇంతసేపు
నీటిలో ఆడుకుంటున్నావా... మీ అమ్మ దాహంతో పరితపించిపోతూంది నాయనా నేను ఏమైనా తప్పు
చేశానా నామీద కోపం వచ్చిందా ఇంతసేపు ఎందుకు రాలేదు నాన్నా నీళ్ళుపోయ్యి, ఏమీ
చూడలేని నన్ను ప్రతిరోజు తెల్లవారుఝామునలేచి వేదపాఠాలు చదువుకొని నా దగ్గరికొచ్చి పుస్తకాలుచదివి
నాకు పళ్ళుపెట్టి, కందమూలాలుపెట్టి నీళ్ళిచ్చి కాపాడేటటువంటి నీవ్వు ఇంత సేపు
కనపడకపోతే తల్లడిల్లిపోయాను, నాయనా దగ్గరికి రా అన్నాడు ఆ తండ్రి, దశరథుడు జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ తండ్రి
కృద్ధుడై నా కొడుకు శరీరం ఎక్కడ పడిపోయిందో అక్కడికి తీసుకెళ్ళమన్నాడు, ఆ
తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్ళాడు ఆ కొడుకు యొక్క శవాన్ని పట్టుకొని దానిమీదపడి
పొర్లి పొర్లి ఏడ్చారు ఆ తల్లిదండ్రులు అంధులం మాకిప్పుడు జీవితమేదీ అని అడిగారు.
అంటే దశరథుడు అన్నాడు నన్నేం చేయమంటారు అన్నాడు. అంటే ఆ తల్లిదండ్రులు అన్నారు క్షితిపేర్చు
మాకు ఇంతసేవ చేసినటువంటి ఫలితానికి అంధులైన తల్లిదండ్రులని సేవించిన ఫలితానికి నా
కుమారుడు స్వర్గలోకాన్ని పొందుతాడు అనిచెప్పాడు.
అప్పుడు ఆ పిల్లవాని యొక్క సూక్ష్మశరీరం దివ్యమైన విమానంలో ఇంద్రలోకానికి
వెళ్ళిపోతూ, ఏమీ
చెయ్యకపోయినా తల్లిదండ్రులను సేవించినందుకు నా శరీరం పడిపోయిన తరువాత నన్ను
దేవలోకానికి తీసుకెళ్తున్నారు తండ్రీ నీకూ నాకూ బంధం విడిపోయింది ఇదే నా తుట్టతుది నమస్కారమని నమస్కారంచేసి
వెళ్ళిపోయాడు, కొడుకు లేకపోతే ఎలాగో జీవించలేం కాబట్టీ మా శరీరాలను కూడా కొడుకు
శరీరంతో పాటు క్షితిమీద పెట్టివ్రేల్చేయమని ఆ తండ్రి మరణించే సమయంలో శాపవాక్కు
విడిచిపెట్టాడు, ఏడుస్తూ కొడకా కొడకా కొడకా అని కాలిపోతూ ఏడుస్తున్న ఆ తండ్రి పుత్ర
వ్యసనజం దుఃఖం యత్ ఏతన్ మమ సామ్ప్రతమ్ ! ఏవం త్వం పుత్ర శోకేన రాజన్ కాలం కరిష్యసి
!! నేను ఎలా కొడుకా కొడుకా అని ఏడుస్తూ చచ్చిపోయానో... నీవు కూడా కుమారా
కుమారా అని ఏడుస్తూ చచ్చిపోతావు, అప్పటికి దశరథుడు ఏమనుకున్నాడో తెలుసాండీ..!
కాబట్టి నాకు పెళ్ళే అవలేదు అయితే నాకు కొడుకు ఉంటాడన్నమాట సహజం కదా అని ఆయన
అనుకున్నాడు కానీ కొడకా అని ఏడుస్తూ చచ్చిపోవడము ఎంత కష్టమో ఆ తరువాత తెలిసింది.
కాబట్టి ఆ ముని నాతో ఒకమాట అన్నాడు
|
త్వా మఽపి ఏతాతృశో భావః క్షిప్ర మేవ గమిష్యసి ! జీవితాంత కరో ఘోరో దాతార మివ దక్షిణా
!! అత్యంత పవిత్రమైన జీవనమున్నటువంటి ఒక వ్యక్తికి
ఇచ్చినటువంటి దానం, దానమిచ్చినటువంటివాని జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అది
రక్షించినట్లూ ఈ నాచేత విడవ
బడినటువంటి ఈ శాపవాక్కు నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వస్తుందన్నాడు,
అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది కౌసల్యా అన్నాడు.
నేను తెలుసుకోలేకపోయాను ఇందువల్లనే రామా రామా రామా
అని ఇంత పరివేదన చెందుతున్నాను, ఇక నాకు ఏడవడానికి కన్నుల నీరులేదు నా కనుగుడ్లు
ఊడి పడిపోతాయోమోననంత పోటువస్తోంది, కౌసల్యా నాకు మాటరావట్లేదు నా ఇంద్రియాలు తమ తమ
శక్తులను కోల్పోయాయి నాకూ వినపడడంలేదు, నాకు కన్ను విప్పి చూసినా నీవు కనపడటం
లేదు, కౌసల్యా ఒక్కసారి దగ్గరికి వచ్చి నా మీద చెయ్యివేస్తావా అని అడిగాడు. వాళ్ళు
అనుకున్నారూ ఇలాగే కొడుకు గురించి కలవరిస్తున్నాడు కదా అందుకని అలాగే
కలవరిస్తున్నాడు అని అనుకొన్నారు, నాకూ ఏమీ వినపడ్డంలేదు యమధర్మరాజు యొక్క
భటులువచ్చి పాశములువేసి నాయొక్క జీవున్ని ఉగ్గడిస్తున్నారు నేను వెళ్ళిపోయే సమయము
అసన్నమైంది. ఆ చిన్ని రామ చంద్ర మూర్తి గుండ్రని భుజములున్నవాడు చేతధనుస్సును
పట్టుకున్నవాడు కమలములవంటి కన్నులు ఉన్నవాడూ విశాలమైన నుదురున్నవాడూ జులపాల జుట్టు
ఉన్నవాడు సింహము వంటి మూపున్నవాడూ గజమువంటి నడకున్నవాడూ ఆ రామున్ని ఇంక నా
జీవితంలో నేను చూడడం కుదరదు 14 సంవత్సరముల తరువాత రామున్ని చూసేవాళ్ళు
అదృష్టవంతులు, దేవతలవంటివారు కాబట్టి కౌసల్యా నేను వెళ్ళిపోతున్నాను నారామున్ని
చూడకుండానే నేను ఇంక ఉండలేను కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను నాకు మరణము
ఆసన్నమౌతూంది, నాకు మరణము ఆసన్నమౌతూంది, కౌసల్యా సుమిత్రా దగ్గరకురండి నామీదచేయ్యివేయండి
నన్ను ఒక్కసారి ముట్టుకోండి నాకు భయంకలుగుతోంది అని పాపం కేకలు వేశాడు.
వాళ్ళనుకున్నారు నిద్రలో కలవరిస్తున్నాడు అనుకున్నారు యధా తు దీనం కథయన్
నరాధిపః ! ప్రియ స్య పుత్ర స్య వివాసనాఽఽతురః !! గతేఽర్ధరాత్రే భృశ దుఃఖ
పీడితః ! తదా జహౌ ప్రాణమ్ ఉదార దర్శనః !! అర్ధరాత్రం అయిన తరువాత బాగాచీకటి పడిపోయిన
తరువాత కౌసల్యా, సుమిత్రా కూడా కలవరిస్తున్నాడనుకుంటుండగా రామా! రామా! రామా! అని
అరుస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు దశరథుడు. దశరథుడు మరణించిన తరువాత మరునాడు
సూర్యోదయం అయింది, మరునాడు సూర్యోదయం అయింది వచ్చినటువంటి వంది మాగదులు స్తోత్రం
చేస్తున్నారు, సూతులు మంచి వాక్యాలు పలుకుతున్నారు, ఆ చపట్లు కొడుతూ స్తోత్రం
చేసేవాళ్ళు స్తోత్రం చేస్తున్నారు, భార్యలు ఎంతకీ లేవట్లేదని దగ్గరికీ వచ్చి
చూడ్డానికి అధికారమున్న స్త్రీలు దగ్గరికి వచ్చారు, ప్రభువు అలాగే పడుకొని
నిద్రపోతున్నాడు వాళ్ళకు అనుమానం వచ్చింది, వాళ్ళు మనసులో ఏ భీతి చెందారో ఆయన్ని ముట్టుకున్నప్పుడు
ఆభీతి నిజమైందీ అని అన్నారు మహర్షి. కౌసల్యా - సుమిత్రలు లేచారు పెద్ద పెద్ద కేకలు
వేశారు ఏడ్చారు, కౌసల్యా నేను కూడా దశరథ మహారాజు గారితోటే ఛితిమీద పడుకొని ప్రాణం
విడిచిపెట్టేస్తానంది, కైకమ్మ వచ్చింది ఆ కైకమ్మను చూచి నిందించనివాళ్ళు లేరు, ఆ
ప్రభువు యొక్క శరీరాన్ని కాల్చడానికి కడుపున పుట్టిన నలుగురు కొడుకులలో ఒక్కడూ
లేడు.
|
కాబట్టి ఇప్పుడు కొడుకు వస్తేతప్పా ప్రేతసంస్కారం చేయడానికిలేదు కాబట్టి తైల
ద్రోణిలోకి దింపారు, అంటే నూనె తొట్టిలోకి ఆ శరీరాన్నిదింపి అట్లే పెట్టారు,
మార్కండేయ మహర్షి మొదలైన మహర్షులందరూవచ్చి రాజు రాజ్యంలో సింహాసనం మీద కూర్చుని
ఉండకుండా శూన్యంగా ఉంటే, వర్తకం సరిగ్గా జరగదు, యువతీ యువకులు సంతోషంగా ఉద్యానవనాలకి
వెళ్ళలేరు స్త్రీలు బంగారు ఆభరణాలతో చీకటిపడిన తరువాత బయట ఎక్కడా స్వేచ్ఛగా
విహరించలేరు ఎవ్వరూ కూడా ఇంట్లో సంతోషంగా సుఖంగా భద్రతతో జీవనం చెయ్యలేరు, వాహనం
మీద స్త్రీ పురుషులు కలిసి వెళ్ళడం కూడా సాధ్యం కాదు స్త్రీలకు భద్రత ఉండదు, రాజు
లేనిచోట యజ్ఞ యాగాది క్రతువులు నడవవు దేవాలయాల నిర్మాణం ఉండదు, దేవాలయాలు
పోషింపబడవు, కాబట్టి ఇన్ని ప్రమాదాలు వస్తాయి కాబట్టి తొందరగా ఇక్ష్వాకు వంశంలో
పుట్టిన సమర్థుడైనవాడికి పట్టాభిషేకం చేసెయ్యండి అన్నారు. అంటే వశిష్టుడు అన్నాడు,
నేనేవరిని చేయడానికి? రాజూ వెళ్ళిపోయే ముందు నిర్ణయంచేసి వెళ్ళిపోయాడు భరతుడికి
పట్టాభిషేకం చేయమని, కాబట్టి ఇప్పుడు భరతున్ని పిలిపించాలి, రామ లక్ష్మణులు
అడవులకు వెళ్ళిపోయారు, రాముడు ధర్మాత్ముడు రాడు తెలుసు వశిష్టుడికి. కాబట్టి గబగబా
పిలిచాడు ఏహి సిద్ధార్థ విజయ జయన్తాఽశోకనన్దన !
శ్రూయతామ్ ఇతి కర్తవ్యం సర్వాన్ ఏవ బ్రవీమి వః !! మీ ఐదుగురూ కూడా తొందరగా బయలుదేరి సిద్ధార్థుడు,
విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనబడేటటువంటి మీ ఐదుగురు చాలా వేగంగా
ప్రయానించగలిగినటువంటి గుఱ్ఱాలమీద బయలుదేరి భరత శత్రుజ్ఞులు ఉన్నటువంటి నగరానికి
వెళ్ళి మీ ముఖంలో దుఖం కనపడకుండా, దశరథుడు మరణించాడనికాని, రామ లక్ష్మణులు అడవులకు
వెళ్ళారనికాని చెప్పకుండా, పట్టువస్త్రములు ఇతర విలువైనటువంటి కానుకలు పట్టుకెళ్ళి
కైకెయి రాజుగారికి యుధాజిత్తుకి ఇచ్చి వశిష్టిడు అత్యంత తొందరగా నిన్ను తీసుకునిరమ్మన్నాడు
అని చెప్పి నిన్ను క్షేమం అడిగానని చెప్పి ఉన్నవాడు ఉన్నట్టుగా శత్రుఘ్న సహితంగా
తీసుకొని రమ్మన్నారు.
ఆ దూతలు వెంటనే గుఱ్ఱాలెక్కి గబగబా బయలుదేరి వెల్తున్నారు, ఆ
వెళ్ళినటువంటివాళ్ళు అపరాల పర్వతము యొక్క దక్షిణ భాగమున చివరివరకు ప్రయాణంచేసి
మాలినీ నది తీరాన్నిదాటి ప్రళంబగరి ఉత్తర భాగానికిచేరి పడమటి దిక్కుగా ప్రయాణంచేసి
హస్తినా పురంచేరి గాంగానది దాటి పశ్చిమాభిముకులై కురుజంగాల దేశము మీదుగా పాంచాల
దేశం వెళ్ళి అక్కడ నుంచి శరదండానదిని వేగంగాదాటి ఒకపెద్ద దివ్యమైనటువంటి ఒక
వృక్షముంటే దానికి నమస్కారంచేసి అక్కడ నుంచి బయలుదేరి కుళింగాపురి అనేటటువంటి
ప్రదేశాన్నిచేరి అటునుంచి హరికాళము అనేగ్రామానికివెళ్ళి సుమతీ అనేటటువంటి
నదినిదాటి బోధిభయనము అనేటటువంటి పర్వతమునందు ఉన్నటువంటి ప్రదేశాన్నిచేరి అకడ్నుచి
ఇచ్చుమతీ తీరాన్నిచేరితే ఆనదిలో దోసెడు నీరుత్రాగితే తపస్సు చేసేటటువంటి
మహర్షుల్నిచూసి సుధానమనేటటువంటి పర్వతమెక్కి అక్కడ్నుంచి విష్ణుపాద
క్షేత్రానికెళ్ళి అక్కడనుంచి విపాశా అనేటటువంటి నదినిదాటి శాల్మలీ వృక్షములను అక్కడ
దర్శనంచేసి అక్కడ నుంచి గిరివ్రజాపురాన్ని చేరుకున్నారు అంటే ఇంత దూరం ఆయన యొక్క
మేనమామగారి ఊరు.
|
అక్కడికి వెళ్ళిన
తరువాత భరతుడు మిత్రులతో కలిసి సంతోషంగా గడపాలి అని అనుకున్నాడు, కానీ మిత్రుడు
హాస్యప్రసంగాలు చేసినా కథలు చెప్పినా ఏది చేసినా ఆయన ఏడుస్తూ ఉన్నాడు బాధ పడుతూ
ఉన్నాడు మిత్రులు అడిగారు ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగారు అంటే ఆయన అప్పుడు ఒక మాట
చెప్పాడు, నిన్న రాత్రి నాకొక కల వచ్చింది
స్వప్నే పితరమ్ అద్రాక్షం మలినం ముక్త మూర్ధజమ్ ! పతన్తమ్ అద్రి శిఖరాత్ కలుషే
గోమయే హ్రదే !!
ప్లవమాన శ్చ మే దృష్టః స తస్మిన్ గోమయ హ్రదే ! పిబన్ అంజలినా తైలం హసన్నివ
ముహుర్ ముహుః !!
తత స్తిలోదనం భుక్త్వా పునః పునః అధః శిరాః ! తైలే నాఽభ్యక్త సర్వాంఽగ స్తైలమ్ ఏవాన్వఽవగాహత !!
స్వప్నేఽపి సాగరం శుష్కం చన్ద్రం చ పతితం భువి ! ఉపరుద్దాం చ జగతీం తమసేవ సమా
వృతాం !!
ఔపవాహ్య స్య నాగ స్య విషాణం శకలీ కృతం ! సహసా చాఽపి సంశన్తం జ్వలితం
జాతవేదసం !!
పీఠే కార్ష్ణాయసే చైనం నిషణ్ణం కృష్ణ వాసనం ! ప్రహసన్తి స్మ రాజానం ప్రమదాః
కృష్ణ పిఙ్గళాః !!
త్వరమాణ శ్చ ధర్మాత్మా రక్త మాల్యాఽను లేపనః ! రథేన ఖర
యుక్తేన ప్రయాతో దక్షిణా ముఖః !!
ప్రహసంతీవ రాజానం ప్రమదా రక్త వాసినీ ! ప్రకర్షన్తీ మయా దృష్టా రాక్షసీ వికృతాఽఽననా !!
నరో యానేన యః
స్వప్నే ఖర యుక్తేన యాతి హి ! అచిరా త్తస్య ధూమాఽగ్రం చితాయాం
సంప్రదృశ్యతే !!
నిన్నరాత్రి నాకు ఒకకల వచ్చింది ఆకలలో ఒక పర్వత శిఖరం నుంచి దశరథ మహారాజుగారు
ఒక పెద్ద పేడ హ్రదంలో పడిపోయాడు, పడిపోయి అందులోనే తల క్రిందకి కాళ్ళుపైకి పెట్టి
అందులోనే పడుతూ పైకి లేస్తూ ఒడ్డున కూర్చొని నూనె తాగుతూ ఒళ్ళంతా నూనె
పూసుకున్నాడు నీరు ఇంకిపోయిన సముద్రము ఆకాశములోనుంచి పడిపోతున్నటువంటి చంద్రుడు
చీకట్లు కమ్ముకుని ఉన్నటువంటి భూమి నాకు కలలో కనపడ్డాయి, ప్రభువు ఎక్కినటువంటి
ఏనుగు దంతం విరిగిపోయి కిందపడిపోయినట్లుగా ఉవ్వెత్తుగా లేచినటువంటి అగ్ని ఒక్కసారి
అకస్మాత్తుగా చల్లారిపోయినట్లుగా చెట్లన్నీ ఎండిపోయినట్లుగా భూమి కృంగిపోయినట్లుగా
నా తండ్రి నూనె తాగుతున్నప్పుడు గాడిదల రథం మీద వెళ్ళుతున్నప్పుడు ఎర్రని నల్లని
వస్త్రములు కట్టుకున్న ఒక ఆడది వికటాట్టహాసం చేసి మెడలో పాశం వేసి దక్షిణ దిక్కుకు
ఈడ్చుకు పోతున్నట్లుగా నాకు కల వచ్చింది, అలా కలలో ఎవరు కనపడ్డారో వారుగాడిదల రథం
మీద వెడుతున్నట్లు కనపడితే చాలా తొందరగా ఆ వ్యక్తిని క్షితి మీద పెట్టి
కాల్చుతున్నప్పుడు లేచిన పొగ ఆకాశంలో కనపడుతుంది, కాబట్టి నా తండ్రి మరణిస్తాడు
అని నాకు భయంగా ఉంది, అందుచేత నా మనసుకు స్వస్థతలేదూ అన్నాడు.
ఈలోగా భరతుని దూతలు వచ్చారు, వశిష్ట మహర్షి పంపిన దూతలు వచ్చారు, వచ్చి నీవు
తొందరగా బయలుదేరూ అన్నారు, ఆయన వాళ్ళందరిని కూడా కుశలము అడిగాడు
కచ్చిత్ సుకుశలీ రాజా పితా దశరథో మమ ! కచ్చి చ్చాఽరోగతా రామే
లక్ష్మణే చ మహాత్మని !!
ఆర్యా చ ధర్మ నిరతా ధర్మజ్ఞా ధర్మ దర్శినీ ! అరోగా చాఽపి కౌసల్యా మాతా
రామ స్య ధీమతః !!
కచ్చిత్ సుమిత్రా
ధర్మజ్ఞా జననీ లక్ష్మణ స్య యా ! శత్రుఘ్నస్య చ వీర స్య సాఽరోగా చాఽపి మధ్యమా !!
నా తండ్రి దశరథ మహారాజుగారు సంతోషంగా క్షేమంగా ఉన్నాడా..! మహాత్ముడైనటువంటి
ఆర్యపుత్రుడు రామ చంద్ర మూర్తి కుశలంగా ఉన్నాడా! కౌసల్యా దేవి కుశలమా! లక్ష్మణుడు
కుశలమా! ఇక్కడ వరకు బాగా అడిగాడు ఆత్మ కామా సదా చణ్డీ క్రోధనా ప్రాజ్ఞ మానినీ !
అరోగా చాఽపి కైకేయూ మాతా మే కిమ్ ఉవాచ హ !! తనంత గొప్పది లేదనుకునేది ఎప్పుడూ కోపంగా ఉండేదీ
చాలా కోపంగా ఇతరులపట్ల ప్రవర్తించేదీ అయిన మా అమ్మ కైకమ్మ కుశలంగా ఉందా..? అని
అడిగాడు. అందరూ కుశలంగా ఉన్నారు నీవు తొందరగా బయలుదేరు అన్నారు, మేనమామ దగ్గరకు
వెళ్ళాడు మీరు ఏమనుకోవద్దు నేను బయలుదేరి పోతున్నాను అన్నారు సరే వెళ్ళిరమ్మన్నారు
ఆయనకి కేకయ మహారాజుగారు భద్రగజాలు ఇచ్చాడు చిత్రమైన కంబళులు ఇచ్చాడు మృగ చర్మములను
ఇచ్చాడు ధనమునిచ్చాడు రెండు వేల బంగారు నాణ్యములనిచ్చారు, 16 వందల గుఱ్ఱములనిచ్చాడు,
గొప్ప మెరికలైనటువంటి అంగ రక్షకుల్ని ఇచ్చాడు ఆ తరువాత మేనమామ అయినటువంటి
యుధాజిత్తు గొప్ప గొప్ప అందమైనటువంటి ఏనుగులను ఇచ్చాడు గుఱ్ఱాలనిచ్చాడు పెద్ద
పులుల్లా తిరిగేటటువంటి వేట కుక్కల్ని ఇచ్చాడు ఈ సంబారాలన్ని తరువాత తీసుకెళుతాను ముందు
నా మనసు పీడతో ఉంది నేను తొందరగా ఇంటికి వెళుతాను అన్నాడు రాజు కాబట్టి చతురంగ
బలాలతో ఉన్నాడు కాబట్టి దూతలు వచ్చినటువంటి అడ్డదారిలో కాకుండా ఇతరమైనటువంటి
మార్గంలో బయలుదేరి ఎన్నో దేశాలు దాటుకుంటూ అయోధ్యా నగరాన్ని చేరుకున్నాడు, అయోధ్యా
నగరం వంకచూశాడు ఎక్కడ చూసినా దుశ్శకునములే ఇంటి మీద పథాకములులేవు ఇంటి ముందు
ముగ్గులులేవు ఎవరూ అన్నం వండుకున్న దాఖలులేవు దేవాలయాలు తెరవలేదు పూజలుచేయలేదు
ఎవరి ముఖాలలోను కళలేదు కాంతిలేదు వాడిపోయి అందరూ ఏడ్చి ఏడ్చిన వాళ్ళల్లా ఉన్నారు
బయటికివచ్చిన వాళ్ళులేరు తనముఖం చూసిన వాళ్ళులేరు ఉద్యాన వనాలన్నీ ఖాలీ ఎక్కడా
ఎవరూ నవ్వుతూ సంతోషంగా ఒక్కరు కనపడలేదు.
|
ఏదో ప్రమాదాన్ని
నామనసు శంకిస్తూంది అని భయపడుతూ భయపడుతూ గబగబా తండ్రిగారు ఉండేటటువంటి
అంతఃపురంలోకివెళ్లాడు, ఖాలీగావుంది ఎవ్వరూ ఏమీ జవాబు చెప్పలేదు పరిగెత్తుకుంటూ
కైకమ్మ ఉండేటటువంటి ప్రాసాదానికి వెళ్ళాడు, వెళ్ళి ఆ కైకమ్మని చూశాడు, కైకమ్మ కూడా
భరతున్ని చూసింది అనుప్రాప్తం తు తం దృష్ట్వా కైకేయీ ప్రోషితం సుతమ్ ! ఉత్పపాత
తదా హృష్టా త్యక్త్వా సౌవర్ణమ్ ఆసనం !! ఎగిరి గంతేసి ఒక్కసారి బంగారు ఆసనం మీద
నుంచి లేచింది, లేచి కొడుకుని దగ్గరిగా తీసుకుని కూర్చోబెట్టుకుంది. నాయనా నీ
తండ్రి చచ్చిపోయాడురా..! సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళిపోయారుగా అని ఆవిడేమి
చెప్పలేదు ఆవిడేం చెప్పిందంటే ఆర్యక స్తే సుకుశలీ యుధాజిన్ మాతుల స్తవ !
ప్రవాసా చ్చ సుఖం పుత్ర సర్వం మే వక్తుమ్ అర్హసి !! ఏవం పృష్ఠ స్తు కైకేయ్యా
ప్రియం పార్థివ నన్దనః ! ఆచష్ట భరతః సర్వం మాత్రే రాజీవ లోనః !! నాయనా! మీ
మేనమామ యుధాజిత్తు కుశలమా..! మీ తాతగారు కేకయరాజు కుశలమా అక్కడ నీవు ఏమేమి చూశావు,
ఎలా గడిపావు ఎంత సంతోషంగా ఉన్నావు ఏదీ అవన్నీ చెప్పూ... అంది.
|
చెప్పవలసినవన్నీ చెప్పాడు కానీ... ఆయన మనసు మాత్రం దశరథుడి కోసం
వెంపర్లాడుతోంది. ఆయన అన్నాడు అమ్మా అంతఃపురానికి వెళ్ళాను నాన్నగారు అంతఃపురంలో
లేరు అక్కడ లేకపోతే ఇక్కడే ఉండేవారు కదా నాన్నగారూ ఈ పర్యంకం మీద నాన్నగారు
లేరేమమ్మా..? మహానుభావుడు కదమ్మా తండ్రి నన్ను చూడగానే ఎంతో ప్రేమతో
పరుగెత్తుకొచ్చీ నా మూర్ధన్యస్థానం మీదముద్దు పెట్టేవాడూ..? అలాంటి నాన్నగారు
కనపడటం లేదూ అమ్మా నాన్నగారు ఏదమ్మా అని అడిగాడు, ఆవిడందీ యా గతిః సర్వ భూతానాం
తాం గతిం తే పితా గతః ! రాజా మహాత్మా తేజస్వ యాయజూక స్సతాం గతిః !! ఆ... అదేం
పెద్ద విషయమురా! పుట్టిన సర్వభూతములూ చిట్టచివర ఎక్కడకిపోతాయో మీ నాన్న అక్కడికి
పోయాడురా అన్నది, ఆశ్చర్యపోయాడు త చ్ఛ్రుత్వా భరతో వాక్యం ధర్మ అభిజనవాన్ శుచిః
! పపాత సహసా భూమౌ పితృ శోక బల అర్దితః !! పిత్రుశోకంతో నేల మీద పడి తన్నుక
తన్నుక ఏడ్చాడు, మహానుభావుడమ్మా నా తండ్రి క్వ స పాణిః సుఖ స్పర్శ స్త స్యాఽక్లిష్ట కర్మణః !
యేన మాం రజసా ధ్వస్తమ్ అభీక్ష్ణం పరిమార్జతి !! అమ్మా నేను ఆడుకుంటే నా ఒంటి మీద మట్టిపడితే
నేను వెళ్ళిపోతుంటే నన్నుపిలిచి నా తండ్రి ఒంగి ప్రియమార నవ్వుతూ ఆచేత్తో నా
ఒంటిమీది మట్టంతా తుడిచేవాడమ్మా ఆ చెయ్యి నా ఒంటికి తగిలినప్పుడు ఎంత సంతోషంగా
ఉండేదో తెలుసా..? అమ్మా ఇంక ఆ చెయ్యి నాకు తగలదా..! కదలడా తండ్రీ అని భరతుడు
ఏడుస్తుంటే...
ఆవిడందీ ఎందుకయ్యా ఏడుస్తావు, నీవు కాబోయే మహారాజువి
లే లేచి స్వస్థత పొందూ..? ప్రతి బంధకంలేని ఈ రాజ్యాన్ని నీవు ఏలవలసి ఉందీ అంటే ఆయన
అన్నాడూ యే మే భ్రాతా పితా బన్ధు యస్య దాసోఽస్మి ధీమతః ! తస్య
మాం శీఘ్రమ్ ఆఖ్యాహి రామస్యాఽక్లిష్ట కర్మణః !! ఏ కార్యానైనా అవలీలగా సాధించగలిగినటువంటి
మహానుభావుడు నా అన్న రామ చంద్ర మూర్తి పెద్దవాడు అయనే నాకు ఇంక తండ్రి జేష్ఠుడు
అమ్మా నేను ఆయన పాదములపట్టి నమస్కరించి ఆయన దగ్గరకు వెడితేతప్ప నాకు మనఃశాంతి
లేదు, అమ్మా పితా హి భవతి జ్యేష్ఠో ధర్మమ్ ఆర్య స్య జానతః ! తస్య పాదౌ
గ్రహీష్యామి స హీదానీం గతి ర్మమ !! ఆ రామ చంద్ర మూర్తి పాదములు పట్టుకోవడం
ఒక్కటే నాకుగతి అప్పుడే నాకు శాంతి ఏదమ్మా రాముడూ అని అడిగాడు, అడిగి అమ్మా
నాన్నగారికి ఏమనారోగ్యం ఎందుకు మరణించాడమ్మా ఇంకా ఏదో యజ్ఞం చేస్తున్నారో, పెద్ద
కొడుక్కి రాముడికి యౌవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తున్నారో అనుకున్నాను అమ్మా ఏమి
అనారోగ్యం వచ్చింది, ఎందుకు అకస్మాత్తుగా చనిపోయారు చనిపోతూ చనిపోతూ ఆఖర్నా ఏమి
చెప్పారమ్మా అని అడిగాడు, ఆవిడందీ పశ్చిమం సాధు సందేశమ్ ఇచ్ఛామి శ్రోతుమ్
ఆత్మనః ! ఇతి పృష్టా యథా తత్త్వం కైకేయీ వాక్యమ్ అబ్రవీత్ !! రామేతి రాజా విలపన్
హా సీతే లక్ష్మణేతి చ ! స మహాత్మా పరం లోకం గతో గతిమతాం వరః !! చిట్ట చివరా మీ
నాన్న చనిపోయే ముందు హా రామా! హా సీతా! హా లక్ష్మణా! మీరు నాకు కనపడరా అని ఏడుస్తూ
చచ్చిపోయాడు రా... అంది. అదేమిటమ్మా అలా చచ్చిపోవడమేమిటమ్మా రామ చంద్ర మూర్తి
అన్నగారు ధర్మాత్ముడు తండ్రి పక్కన ఉండాలిగదా! లక్ష్మణుడు ఉండాలిగదా! సీతమ్మ
ఉండాలిగదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా అన్నాడు. ఏమిలేదురా అబ్బాయ్ నేను రెండు
వరాలు అడిగాను స హి రాజ సుతః పుత్ర చీర వాసా మహా వనమ్ ! దణ్డకాన్ సహ వైదేహ్యా
లక్ష్మాఽనుచరో గతః !! 14 యేళ్ళు అరణ్యవాసం చెయ్యమని నేను అడిగానని రాముడు సీతమ్మతో కలిసి అడవికి
వెళ్ళుతుంటే తగుదునమ్మా అని లక్ష్మణుడు కూడా బయలు దేరి శుశ్రూష చేస్తానని
వెళ్ళిపోయాడు, వాళ్ళు అడవికి పోయారు ఈయన చచ్చిపోయాడు, కాబట్టీ ఎవ్వరూ లేరురా
పక్కనా అంది.
అంటే అయన అన్నారు అడవికి ఎందుకు వెళ్ళాడమ్మా వరాలు అన్నమాట బాగాచెవిలో పడలేదు,
అడవికి వెళ్ళారు అన్నది వినపడింది కచ్చి న్న బ్రాహ్మణ వధం హృతం రామేణ కస్య చిత్
! కచ్చి న్నాఽఽఢ్యో దరిద్రో వా తేనాఽపాపో విహింసితః !! అమ్మా ఒకవేళ రాముడు బ్రాహ్మణ ధనాన్ని ఏమైనా
అపహరించాడా లేదా లేకపోతే భ్రూణహత్య చేశాడా... పాపాత్ములైన వారిని శిక్షించకుండా
వదిలివేశారా పుణ్యాత్ములైన వారినిశిక్షించాడా... ఎందుకు అడవులకు పంపాడమ్మా
తండ్రిగారు, తండ్రి అడవులకు పంపడే... అన్నాడు, అడవులలో ఉన్నారని చెప్పింది. ఎందుకు
అడవులకు వెళ్ళారమ్మా..? అంటే ఆవిడ అందీ అయినా రాముడు ఎప్పుడూ అటువంటి పాపపు
పనులుచేయడు, ఏ పాపమూ చేయలేదు నేనే వరాలు అడిగాను నీకోసం అని చెప్పీ రాజ్యం నీకు
ఇప్పించాలనీ ఆయన ఎంతో సంతోషపడిపోతాడనుకుంది, అకంటకం చేయడం కోసం రాముడు
అరణ్యవాసానికి వెళ్ళాలనీ నీకు రాజ్యం ఇమ్మనీ అడిగాను, మీ నాన్న సత్యవాక్యమునకు
బద్ధుడై రాజ్య మిచ్చానని రామున్ని అడవులకు పంపాడు, పంపి కొడుకుని చూడకుండా ఉండలేక
కలవరిస్తూ కలవరిస్తూ మరణించాడురా... దానివల్ల ఇప్పుడు ఇంక కంటకం లేదు, నీకు
అప్రతిహతంగా రాజ్యం చిక్కింది మా శోకం మా చ సంతాపం ధైర్యం ఆశ్రయ పుత్రక ! త్వ
దధీనా హి నగరీ రాజ్యం చైత దనామయం !! ఇప్పుడు దశథుడు లేడు రాముడు లేడు
లక్ష్మణుడు లేడు సీతమ్మ లేదు రాజ్యం అకంటకం, హాయిగా భరతా! నీవు ఈ రాజ్యాన్ని
పరిపాలించు.
|
భరతుడు అన్నాడూ దుఃఖే
మే దుఃఖమ్ అకరో ర్వ్రణే క్షారమ్ ఇవాఽఽదధాః ! రాజానం ప్రేత భావస్థం కృత్వా రామం చ
తాపసం !! తండ్రి
చచ్చిపోయాడని నేను ఏడుస్తుంటే..? నాకోసం రాజ్యం అడిగానని నీవు చెప్తున్నావు, అమ్మా
నాకు ఇది ఎలా ఉందో తెలుసా..! పుండు మీద కారం చల్లినట్లువుంది మృత్యు మాఽఽపాదితో రాజా త్వయా
మే పాప దర్శిని ! సుఖం పరిహృతం మోహా త్కులే స్మిన్ కుల పాంసని !! తండ్రిని చంపేసినటువంటి అనార్హురాలివి, మహా
పాపాత్మురాలివి, కులాన్నంతటిని పాడుచేసినదానివి వినాశితో మహా రాజః పితా మే ధర్మ
వత్సలః ! కస్మాత్ ప్రవ్రాజితో రామః కస్మా దేవ వనం గతః !! తండ్రి మరణించడానికి
రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి నీవు ఒక్కతివే కారణమమ్మా నిన్నుచూస్తేనే నాకు
పరమ అసహ్యమేస్తూంది కౌసల్యా చ సుమిత్రా చ పుత్ర శోకాఽభి పీడితే !
దుష్కరం యది జీవేతాం ప్రాప్య త్వాం జననీం మమ !! నిన్ను తల్లిలా చూసినటువంటి రామున్ని
లక్ష్మణున్ని అడవులకుపంపించీ బిడ్డలనుంచి దూరమై కౌసల్యా సుమిత్రా ఏడ్చేటట్లుచేశావు
కదామ్మా... ఎంత పాపాన్ని మూటకట్టుకుంటున్నావు తథా జ్యేష్ఠా హి మే మాతా కౌసల్యా
దీర్ఘ దర్శినీ ! త్వయి ధర్మం సమాస్థాయ భగిన్యామ్ ఇవ వర్తతే !! ఆ కౌసల్యా తల్లీ
ఎంత బాధపడుతుందో నిన్ను ధర్మబుద్ధితో సోదరిలా చూసింది, సోదరిలా చూసినందుకు ఆవిడ్నీ
ఎంత బాధపెట్టావమ్మా... ఎంతకష్టం తెచ్చిపెట్టావమ్మా... న మే వికాంక్షా జాయేత
త్యక్తుం త్వాం పాప నిశ్చయాం ! యది రామ స్య నాఽపేక్షా త్వయి స్యా
న్మాతృవ త్సదా !! నిన్ను నేను అసలు ఇప్పుడే ఇక్కడే ఈక్షణంలోనే విడిచి పెట్టేసిండేవాన్ని కాని
ఎందుకు నేను నిన్ను ఇంకా గౌరవించి అమ్మా అని అంతఃపురంలోనే ఉంచవలసి వస్తూందో
తెలుసా... ఒక్కటే కారణం యది రామ స్య నాఽపేక్షా త్వయి స్యా
న్యాతృవ త్సదా రాముడు నిన్ను కూడా కన్న తల్లిలా భావించాడు, నేను నిన్ను బయటికి తోసేస్తే
రాముడి తల్లిని తోసేసిన దోషం నాకు అంటుకుంటుంది అందుకని నిన్ను అంతఃపురంలో
ఉంచుతున్నాను లేకపోతే నీవు చెప్పినటువంటి ఈ మాటవిన్న ఉత్తర క్షణంలో నిన్ను పైకి
తోసేసివుండాల్సింది.
ఆడ పుట్టుక పుట్టావు తల్లివి అయ్యావు ఒకరికి భార్యవి నీకుకష్టం అంటే ఏమిటో
తెలియలేదు, అంతక్రోధంతో ప్రవర్తిస్తావా..? అన్యదా కిల ధర్మజ్ఞా సురభిః సుర
సంమతా ! వహమానౌ దదర్శో ర్వ్యాం పుత్రౌ విగత చేతసౌ !! ఒకానొకప్పుడు కామ ధేనువు ఆకాశ
మార్గంలో వెళ్ళిపోతూంది, వెళ్ళిపోతున్నటువంటి కామధేనువు కిందకి చూసింది, ఒకపూట
పూటంత పొలం దున్నాయి రెండు ఎద్దులు ఇంత కష్టపడి పొలం దున్నినటువంటి రెండెద్దులు
ఇంక దున్నలేక క్లేశపడీ నడవలేక బాధపడి కిందకి కాళ్ళు వంచితే రైతు తోకమెలిపెట్టి
నడ్డిమీదకొట్టాడు, కొడితే ఆ బాధచూసి నా వంశంలో పుట్టినటువంటి పుత్రులు ఈ ఎద్దులు
వీటిని రైతు ఇంత బాధపెడతాడా అని కామధేనువు ఏడ్చింది, ఆ కామధేనువు కన్నులవెంట పడిన
కన్నీటి బిందువులు కిందవెడుతున్నటువంటి ఇంద్రుడి మీదపడ్డాయి, అత్యంత సువాసనతో ఉన్న
ఆ నీటిబిందువులని చూసి పైకిచూశాడు కామధేనువు కనపడింది, కామధేనువా నువ్వు
ఏడుస్తున్నావు ఎందుకూ అడిగాడు, నా సమస్త అవయవములలోంచి పుట్టినవారయా బిడ్డలంటే..?
అన్ని అవయవముల తేజస్సు నుంచి పుట్టినవాళ్ళు ప్రత్యేకించి కొడుకూ హృదయము నుంచి కూడా
చైతన్యం కదిలితే పుట్టినవాడు, అటువంటి నా బిడ్డలు లోకంలో భూమి మీద ఎంత
కష్టపడుతున్నారో చూడూ! అని కామధేనువు ఏడ్చింది.
|
అప్పుడు ఇంద్రుడు
అనుకున్నాడు ముక్కున వేలేసుకొనీ యస్యాః పుత్ర సహస్రై స్తు కృత్స్నం వ్యాప్య
మిదం జగత్ ! తాం దృష్ట్వా రుదతీం శక్రో న సుతా న్మన్యతే పరం !! ఓహో...
ఎన్నివేల దూడలు ఉన్నాయి ఈ కామధేనువుకి ఈ భూమి మీద ఉన్న ఇన్నీ ఆవులూ దూడలూ ఎద్దులూ
దానిబిడ్డలే... ఇంతమంది బిడ్డలున్నా ఇద్దరి బిడ్డలకి కష్టంవస్తే కామధేనువు
తట్టుకోలేకపోయింది, ఇది కదా..? పుత్ర ప్రేమ అంటే... అని నేను అనుకున్నాను, అని
ఇంద్రుడు అనుకున్నాడు ఆరోజున. అమ్మా అన్నివేల ఆవులూ దూడలూ ఉన్నటువంటి కామధేనువూ...
ఇద్దరు బిడ్డలు కష్టపడితే ఏడ్చిందే లేకలేక లేకలేక అశ్వమేధ యాగంచేసి అంతకష్టపడి
అన్నిపూజలు అన్నినోములూ నోస్తే పుట్టిన సుగుణాభి రాముడమ్మా నా అన్న కౌసల్యకీ...
ఒక్కగానొక్క కొడుకు 14 సంవత్సరములు అడవులకు వెళ్ళిపొమ్మన్నావే... నారచీర కట్టుకుని
వెళ్ళిపొమ్మన్నావే... అసలు ఎండ కన్నెరుగని నా తల్లి నా వదిన సీతమ్మ వెళ్ళిపోయిందే,
మా అమ్మ కౌసల్య ఎంత బాధపడి ఉంటుందమ్మా... నీవు మనిషివా పశువువా ఎలా పంపించావమ్మా
ఇలాగా... పైగా వరాలు కోరానని చెప్తావా... ఇప్పుడు ఈ కల్మషం కడుక్కోవడానికి నేను
ఎంత బాధపడాలమ్మా... నీకు ప్రాయశ్చిత్తం ఒక్కటే, ఏ రాముడు అరణ్యంలో తాపసిగా ఉండాలని
వరమడిగావో ఆ రాముడి స్థానంలో నేను వెళ్ళిపోతాను తాపసిగా, నార చీరలు కట్టుకొని
వెళ్ళిపోతాను రాజ్యం అన్నది నాకు అక్కరలేదు ఇది మా అన్నగారిది, ఇక్కడా ఈ వంశంలో జ్యేష్ఠపుత్రుడికే
రాజ్యం అమ్మా నేను రాజ్యం పుచ్చుకోను, నీవు ఏడుస్తూ నాకు రాజ్యం దక్కకుండానే నేను
అరణ్యంలో ఉంటే నీవు అంతఃపురంలో ఉండి చూడాలి, రాముడు రాజ్యం చేస్తాడు, నేను ఉండను సా
త్వ మఽగ్నిం ప్రవిశ వా స్వయం వా దండకాన్ విశ ! రజ్జం బధాన వా కంఠే న హి తేఽన్యత్ పరాయణం !! నా అంత నిన్ను చంపడానికి చేతులు రావటంలేదు,
ఇంకా బతకాలని కోరిక పెట్టుకోకు, ఇంత ఘోరమైన పనిచేసి నీ మొఖం ఎవ్వరికీ చూపించకు నీ అంత
నీవు సా త్వ మఽగ్నిం ప్రవిశ వా అగ్నిహోత్రంలో దూకిచచ్చిపో... లేకపోతే
దండకారణ్యానికి నీవు వెళ్ళిపో... లేకపోతే కంఠానికి ఉరితాడు వేసుకొని చచ్చిపో...
తప్పా ఇక నీవు బ్రతికివుండవద్దు ఎందుకంటే నీకు ఆ అవకాశం పోయింది, నీవు అంత
ఘోరమైనటువంటి అన్యాయం చేసేశావు.
అనీ నా తల్లి కౌసల్య ఎంత బాధపడుతోందో రాముడు వెళ్ళిపోయి ఇప్పటికి ఇన్నిరోజులు
అయిపోయింది, అని పరుగుపరుగున కౌసల్యా మందిరానికి వెళ్తున్నాడు, భరతుడు వేస్తున్న
కేకలు వినిపించాయి కౌసల్యకి, భరతుడు వచ్చాడు సుమిత్రా..! వెళ్ళి ఒక్కసారి
రాజ్యంకోసం తల్లిని కలిసి ఎంత సంతోషిస్తున్నాడో..? చూసివద్దాం పదా అంది. ʻభరించాడు నిందలు
కాబట్టి భరతుడుʼ కౌసల్య వస్తూంది సుమిత్రతో ఊగిపోతూంది నీరసపడిపోయి, ముఖం నల్లపడిపోయి కొడుకు
పక్కనలేడు భర్త మరణించాడు, ఎంత క్లేషంతోనో గాలికి ఊగిపోతున్న అరటి చెట్టులా ఉంది
కౌసల్యా, సుమిత్రని తీసుకొని వస్తూంటే తానే ఎదురెళ్ళీ కౌసల్య కాళ్ళమీద పడ్డాడు,
కౌసల్య రెండు భుజాలు పట్టుకుని పైకి ఎత్తుతూ అందీ ఇదం తే రాజ్య కామ స్య రాజ్యం
ప్రాప్తమ్ అకణ్టకమ్ ! సంప్రాప్తం బత కైకేయ్యా శీఘ్రం క్రూరేణ కర్మణా !! నాయనా!
మీ అమ్మ చాలా క్రూర కర్మ చేసి నీకు రాజ్యం తెచ్చి పెట్టింది సంతోషమా అంది, అకంటకం
నా కొడుకులేడు నీకు అడ్డులేదు, హాయిగా రాజ్యం పట్టం కట్టుకుని అనుభవిస్తావా
సంతోషమేనా నాయనా... నీవు కోరుకున్నది నీకు దొరికిందా అంది.
|
అనేటప్పటికి భరతుడూ
కన్నుల నీరు కారుస్తూ తల నేలకేసి కొట్టుకునీ... నేల మీదపడి దొర్లుతూ కౌసల్య రెండు
పాదాలు పట్టుకునీ తల కౌసల్య పాదముల మీదపెట్టి కన్నుల నీరు కారి ఏడుస్తూ కౌసల్య
పాదములను అభిషేకం చేసి కడుగుతూ అన్నాడూ ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యం చ
ప్రతిమే హ తు ! హన్తు పాదేన గాం సుప్తాం యస్యాఽఽర్యోఽనుమతే గతః !! అమ్మా తెలిసి తెలిసి నేనుకాని రాముడు
అరణ్యవాసానికి వెళ్ళిపోయాడూ నాకోసం మా అమ్మ వరాలడిగిందని తెలిసి కూడా నేను
రాజ్యాన్ని పొందడానికి అలా ఆలోచించినవాడనైతే... నాకిది తెలిసున్నవాడనైతే,
నిద్రపోతున్నటువంటి ఆవుని కాలితో తంతే ఏ పాతకము వస్తుందో ఆ పాతకము నన్ను
చుట్టుకొనుగాక, సూర్య భగవానుడికి ఎదురుగుండా మలమూత్రములు విడిచిపెడితే ఏ పాతకములు
వస్తాయో అది నన్ను పట్టి కుదుపు గాకా..! కారయిత్వా మహత్ కర్మ భర్తా భృత్యమ్
అనర్థకమ్ ! అధర్మో యోఽస్య సోఽస్యాఽస్తు యస్యాఽఽర్యోఽనుమతే గతః !! చాలా కష్టమైనటువంటిపని తన దగ్గర ఒక నౌకరుని
పెట్టి చేయించి చేయించి చేయించి కూలి ఇస్తాడని ఆశపడి చమటోడ్చి నౌకరు పనిచేసిన
తరువాత కూలి ఇవ్వకుండా పంపించినటువంటి వ్యక్తి, ఆ నౌకరు ఏడుస్తుంటే సంతోషించినవాడికి ఏ పాతకం
చుట్టుకుంటుందో ఆ పాతకం నన్ను చుట్టుకుంటుందమ్మా, రాముడు అరణ్యాలకి వెళ్ళాడు నాకు
రాజ్యం ఇమ్మని అడిగిందని నాకా విషయం నిజంగా తెలిసుంటే పరిపాలయమాన స్య రాజ్ఞో
భూతాని పుత్రవత్ ! తత స్తం ద్రుహ్యతాం పాపం యస్యాఽఽర్యోఽనుమతే గతః !! కన్నబిడ్డల్లా ప్రజలను పరిపాలించేటటువంటి రాజు,
అంత గొప్ప పరిపాలన చేసేటటువంటి రాజు ఉండగా అటువంటి రాజుకు ద్రోహం తలపెడితే ఎటువంటి
పాపం వస్తుందో... రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడనీ ఇటువంటి వరాలు మా అమ్మ
అడిగిందనీ, నాకు ముందు తెలిసి ఉంటే ఆ పాతకం నన్ను కట్టి కుదిపేస్తుందమ్మా...
బలి షడ్భాగమ్ ఉద్ధృత్య నృపస్యాఽరక్షతః ప్రజాః ! అధర్మో యోఽస్య సోస్యాస్తు
యస్యాఽఽర్యోఽనుమతే గతః !! అమ్మా ఆరవ భాగం పన్ను రాజు ప్రజల దగ్గర పుచ్చుకుని ప్రజల క్షేమం చూడనివాడికి
ఎటువంటి పాపం వస్తుందో నాకు తెలిసి రాముడు అరణ్యవాసానికి వెళ్ళివుంటే, నేను రాజ్యం
కోరుకుంటే నాకా పాపం కట్టికుదిపేస్తుంది. అమ్మా కాదు కాదు ఉపవాసాది వ్రతములు
పాటించి చాలా కష్టపడి మంత్రభాగం చదివి యజ్ఞ యాగాది క్రతువులను పూర్తిచేసిన తరువాత
ఆ యజమాని దక్షిణ ఇవ్వకుండా బ్రాహ్మణుల్ని పంపించేస్తే బాధపడుతూ ఆ బ్రాహ్మణులు
వెళ్ళిపోతే ఆ యజమానికి ఎటువంటి మహాపాతకం తగులుతుందో అటువంటి పాతకం నాకు
వస్తుందమ్మా... రణరంగంలో వెన్నుచూపి సైన్యానికి వెన్నుపోటు పొడిచీ పారిపోయినటువంటి
క్షత్రియుడికి ఎంతటి మహాపాతకం వస్తుందో అటువంటి పాతకం నాకు వస్తుంది, గురువు ఎంతో
కష్టపడి మధించిన శాస్త్రాన్ని వాత్సల్యంతో బోధచేస్తే అసలు పట్టించుకోకుండా దానిని
మరిచిపోయినవాడు ఎటువంటి దుర్గతి పొందుతాడో నాకు తెలిసి నిజంగా నేనుకానీ రామున్ని
మా అమ్మ వరాలు అడగడం నాకు తెలిసి జరిగివుంటే... నాకు అటువంటి పాతకం వస్తుంది.
అమ్మా పాయసము నువ్వుల అన్నమూ అంటే పులగమూ మేకపాలు దేవతలకూ పితృదేవతలకూ
పెట్టకుండా తిన్నవాడికి ఎంత పాతకము వస్తుందో నిజంగా అంత పాతకం మా అమ్మా నాకు
తెలిసి వరాలు అడిగి ఉంటే నాకు అటువంటి పాతకం వస్తుంది. అమ్మా వీడు ఈ రహస్యాన్ని
దాస్తాడు అని నమ్మి మిత్రుడైనవాడు ఒక రహస్యాన్నిచెప్తే ఆ రహస్యాన్ని బట్టబయలుచేసి
లోకనిందకి మిత్రుడు కారణమయ్యేటట్టుగా మిత్రద్రోహం చేసినటువంటి వ్యక్తి ఏ పాతకం
వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగితే నాకా పాతకం వస్తుంది, అమ్మా పరిజనలూ కుటుంబమూ
ఉండగా వారికి పెట్టకుండా షడ్రుషోపేతమైన మధురాన్నాన్ని యజమాని ఒక్కడే తింటే ఏ పాతకం
వస్తుందో అటువంటి పాతకం నిజంగా నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగితే అది నాకు
వస్తుంది, సంతతి పొందకుండానే అర్ధాయ్యుష్యుతో మరణించినవాడు ఎటువంటి పాతకాన్ని
పొందుతాడో అటువంటి పాతకం నిజంగా నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగితే నాకు వస్తుంది,
స్త్రీలనూ బాలబాలికలను వృద్ధులనూ రాజులనూ ఒక్కసారిచంపేస్తే ఎంత పాతకం వస్తుందో
నాకి తెలిసి మా అమ్మ వరాలు అడిగి ఉంటే అంత పాతకం వస్తుంది, అమ్మకూడనటువంటి
పదార్థాలు ఇతరులకు ప్రాణహాణి కలిగించేటటువంటి పదార్థాలను లత్తుకా తేనే మాంసము
లోహమూ ఇటువంటి నిషిద్దమైనటువంటి వస్తువులను విక్రయించి భార్యా పుత్రులను
పోషించినవాడికి ఎటువంటి మహాపాతకము వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగి ఉంటే
నాకు అటువంటి మహాపాతకము వస్తుంది, మాసిపోయి చినిగిపోయిన వస్త్రాలు కట్టుకుని పుర్రె
చేతపట్టుకుని ఉన్మత్తుడనై ఇల్లుల్లూ తిరిగీ బిక్షమెత్తుకుని తిరిగేటటువంటి
భయంకరమైన జీవితం నిజంగా నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగి ఉంటే నాకు వస్తుంది నన్ను
కట్టికుదుపుతుంది.
|
అమ్మా మద్యపానము
స్త్రీ సంఘమమూ జూదక్రీడలూ ఇటువంటివి అలవాటైనవాడు ఏ దుర్గతిని పొందుతాడో... నాకు
తెలిసి మా అమ్మ వరాలు అడిగి ఉంటే అంతటి దుర్గతులు కలుగుతాయి, అమ్మా నాకు ఏ పాపమూ
తెలియదు, నిజంగా చెప్తున్నాను, పదిమంది నీరు త్రాగేటటువంటి నీటిలో
విషంకలిపినటువంటివాడు ఎటువంటి పాపం వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగితే
అంతటి పాపం వస్తుంది, ఉభయ సంధ్యలలో నిద్రించినవాడికి, పరుల ఇండ్లకీ నిప్పు
పెట్టినవాడికీ ద్రోహం తలపెట్టినవాడికీ ద్రోహం చెయ్యాలనుకున్నవాడికీ స్వర్గస్తులైన
పిత్రుదేవతలకీ శ్రాద్ధ కర్మలు చెయ్యనివానికీ ఈ జన్మలో పరమ దరిద్రుడై పుట్టి, అనేక
మంది పిల్లలు పుట్టి పిల్లలందరూ దీర్ఘవ్యాధులతో బాధపడడానికి హేతువైన పెద్ద పాపాలు
ఆ వ్యక్తి ఏమేమిచేసి ఉంటాడో అన్ని పాపాలు కూడా నాకు వస్తాయమ్మా... నాకు తెలిసి మా
అమ్మ ఈ వరాలు అడిగి ఉంటే... నిరీక్షించుచున్నటువంటి దీనులకు అన్నం పెట్టకుండా
వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ ఎదురుగుండా నిలబడి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు
సంతోషించినటువంటివాడికి అటువంటిలోభికి ఏగతిపడుతుందో నాకు ఆ గతి పడుతుందమ్మా...
ఋతుకాలంలో భార్య దగ్గరికి వచ్చీ నాతో సంఘమించమని కోరితే ఋతూస్నాతయైన భార్యతో
సంఘమించని భర్తకి ఏదోషం వస్తుందో అంతటి మహాపాతకం నాకు వస్తుందమ్మా నాకు తెలిసి మా
అమ్మ వరాలు కోరి ఉంటే, పెండ్లి అడిన ధర్మ పత్నిని కాదని పర స్త్రీతో రమించినవాడికి
ఎంతటి మహాపాతకం వస్తుందో అంత మహా పాతకం నాకు వస్తుందమ్మా నాకు తెలిసి మా అమ్మ
వరాలు అడిగి ఉంటే.
అమ్మా అన్నదానాదులు చెయ్యకుండా స్త్రీలను వేధించీ పానీయం ఇవ్వకుండా లేగదూడకు
మిగలకుండా పదిరోజుల పాలు జున్నును వండుకుతిన్నవాడికి ఎంత పాపము వస్తుందో అంత
మహాపాతకం నాకు వస్తుంది, అందుకే సంధ్యావందనం గాయిత్రీ చేయేవాళ్ళేకాదు ʻజున్ను తినరు
పెద్దలు.ʼ ఇదే కారణం జున్నుతీసుకొస్తే ఓ నవ్వు నవ్వుతారు తప్పా జున్ను ఎన్నడూ
ముట్టుకోరు ఎందుకంటే భరతుడు పెట్టిన మహాపాతకాల చిట్టాలో అదికూడా ఉంది, ఆవుకి దూడ
పుడితే 10 రోజులు ఆ పాలు తాగకూడదు, ముట్టుకోకూడదు దానితో ఏదీ వండుక తినకూడదు, ఆవు
పాల విషయంలో కాబట్టీ పానీయములను మురికి చేసేటటువంటివాడికి ఎటువంటి పాపము వస్తుందో
అటువంటి పాపము వస్తుంది కాబట్టి పక్షపాతం వహించి ఒకన్ని గెలిపించిన పాతకం ఎలా
ఉంటుందో అలాంటి పాతకం నాకు చుట్టుకుంటుంది అమ్మా నేను నిజం చెప్తున్నాను నాకు
తెలియదమ్మా, రాముడు మహాత్ముడు నాకు తల్లి తండ్రి అన్న తమ్ముడు గురువు సద్గతి
ఈశ్వరుడు అన్నీ నాకు రాముడే నేను ఎన్నడూ రామునికి అపచారం చేయను, రాముడిదే సింహాసనం
అమ్మా ఈ నింద నా మీదపడింది నేను మేనమామ ఇంట్లో ఉండగా మా అమ్మ ఈ వరాలు అడిగింది
ఎందుకు అడిగిందో నాకు తెలియదు తల్లీ నన్ను మన్నించి నన్ను అర్థం చేసుకో అమ్మా అని
ఏడ్చి ఏడ్చి తల కొట్టుకొని మూర్ఛపోయి సంజ్ఞపొందినటువంటి భరతున్ని కౌసల్య లేవదీసి
తన తొడమీద కూర్చో బెట్టుకొనీ భుజం
|
పట్టుకొని మార్కొనీ నాయనా నాకు తెలుసురా..! నీవు
అంత బెంగ పెట్టుకోకు అంత ఏడవకు తండ్రీ! నీ ప్రేమ నాకు తెలుసూ అని కౌసల్య
ఊరడిచింది.
తెల్లవారింది తైల ద్రోణిలో ఉన్నటువంటి దశరథ మహారాజుగారి యొక్క పార్థివ శరీరం పచ్చగా
నిద్రపోతున్నట్టువుంది దాన్ని ఒక శిబికలో పడుకోబెట్టారు సమంత్రకంగా స్మశానానికి
తీసుకెల్ళారు క్షితిమీద పడుకోబెట్టి ఆజ్యాన్నిపోశారు, ఇక్ష్వాకు వంశంలో ఆచారం ఉంది
కాబట్టీ పల్లకీల మీద రథాల మీదా రాణులు కూడా వచ్చారు, స్మశానంలో భరతుడూ శత్రుజ్ఞుడూ
ఏడుస్తూ మహానుభావుడు వేలసంవత్సరములు పరిపాలించి యజ్ఞ యాగాదులు చేసినవాడు, బిడ్డలో
బిడ్డలో బిడ్డలో బిడ్డలో అని ఏడ్చి మా కోసమనీ అశ్వమేధంచేశాడు, రామా! రామా! రామా!
రామా! అంటూ బతికాడు, ఆ రాముడికి యౌవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని కోరుకున్నాడు,
అటువంటి తండ్రికి నేను ఇచ్చిన బహుమానం, నన్ను కన్నందుకు నా తల్లి ఇచ్చిన బహుమానం
ఏమిటంటే ఆయన్ను చచ్చిపోయేటట్టుచేసి చచ్చిపోయేముందు కూడా దగ్గర ఉండకుండా తండ్రీ
నీకు ప్రేతసంస్కారం చేస్తున్నాను, నేను మన్నింపబడెదునుగాకా అని అగ్నిహోత్రం
వెలిగించి భరత శత్రుఘ్నులు ఇది స్మశానం అని కూడా చూడకుండా... ఆ ఇసుకలోపడి దొర్లి
దొర్లి ఏడుస్తుంటే... వశిష్టాది మహర్షిలు ఊరడించి అంతఃపురానికి తీసుకెళ్ళారు,
ఎన్నో దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు. కానీ గుండె రగిలిపోతుంది బాధతోటి ఆ బాధతోనే
తనకు 10వ రోజు అసౌచంతీరాక స్మశానానికి వెళ్ళి తండ్రి కాలిపోయినటువంటి వేది దగ్గరవున్న
బూది దగ్గర నిలబడితే ఇన్ని కోర్కెలు కోరిన తండ్రీ చిట్టచివరికి బాధలన్నిటికి
దూరంగా బూదికుప్పవై మిగిలావు.
కొడుకులో కొడుకులో అన్నందుకు మేము నీకిచ్చినటువంటి కానుక ఇది, అని బాధపడుతూ నా
తండ్రి శరీరంలోని అస్తులు అని ఆ బూదిలోకి చేతులు జొనిపి ఏడుస్తూ ఆ అస్తులను ఏరి కుండలో
పెట్టి తీసుకొచ్చీ, ఒకచోట భద్రపరిచీ మళ్ళీ తిరిగి అంతఃపురానికి వస్తే... వశిష్టాది
మహర్షులు అనునయ వాక్యములు పలికి ఆ భరత శత్రుజ్ఞుల్ని ఊరడిల్ల చేశారు. కాబట్టి కొంత
ఊరడిల్లిన మనసుతో ఆ భరత శత్రుజ్ఞులు ఉన్నారు, దశరథ మహారాజుగారికి 12వరోజు
కార్యక్రమం కూడా పూర్తైపోయింది అన్న మంగళవాక్యంతో ఆయన ఉత్తమ లోకాలుపొందాడు. ఇప్పుడు
మనం మనః శాంతిని పొందాడన్న ఒకగంభీరమైన వాక్యం దగ్గర సమాప్తంచేస్తూ నాకు తెలుసు మీ
మొఖాలు చూస్తూంటేనే తెలుస్తూంది సభ ఎంత ఉద్విగ్నంగా ఉందో... కాబట్టి ఇక్కడితో
ఇవ్వాల్టి ఉపన్యాసాన్ని పూర్తిచేస్తున్నాను.
11 మార్లు మనం రామ నామం చెప్తాం, మనందరికి కూడా సంతోషం కలుగుతోంది. రామ కథకు
ఉన్న గొప్పతనం అదేనండీ మనం ఎన్ని మార్లువిన్నా ఇప్పుడే ఉన్నట్లు ఉంటుంది.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము !! రా !!
పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీ రామ నామము !! రా !!
భగదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీ రామ నామము !! రా !!
ఆలు బిడ్డల సౌఖ్యము కన్ననూ అధికమైనది రామ నామము !! రా !!
|
కోరి కొలచిన
వారికెల్లను కొంగు బంగరు రామ నామము !! రా !!
దారినొంటిగ నడుచువారికి తోడు నీడే రామ నామము !! రా !!
కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామ నామము !! రా !!
ప్రణవమను ఓంకారనాధ బ్రహ్మమే శ్రీ రామ నామము !! రా !!
విజ్ఞుడగు గురునాశ్రయించిన విషదమగు శ్రీ రామ నామము !! రా !!
అల కుచేలుని చేతి అటకుల నారగించిన రామ నామము !! రా !!
త్రికుట మధ్యమందునవెలిగే జ్ఞాన జోతియే రామ నామము !! రా !!
దూర ద్రుష్టియు లేనివారికి దుర్లభము శ్రీ రామ నామము !! రా !!
గుట్టుగా గురుసేవచేసిన గుణములొసగును రామ నామము !! రా !!
తల్లివలెరక్షించు సుజనులనెల్లకాలము రామ నామము !! రా !!
మంగళంబగు భక్తితోపాడిన శుభకరంబగు శ్రీ రామ నామము !! రా !!
....
మంగళా శాసన....
............