Thursday, 15 October 2015

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సంపూర్ణ రామాయణం - బాలకాండ 2 Sampoorna Valmeeki Ramayanam By Brahama Sree Changanti Koteswara Rao Garu Balakanda Day 2

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సంపూర్ణ రామాయణం - బాలకాండ 2

బాల కాండ

రెండవ రోజు ప్రవచనము




నేను నిన్నటి రోజు ప్రసంగం పూర్తిచేసే సమయానికి వాల్మీకి మహర్షికి నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని చెప్పినటువంటి ఘట్టాన్ని మీతో మనవిచేసి ఉన్నాను. సంక్షేప రామాయణాన్ని చెప్పినప్పుడూ శ్రీ రామాయణంలో జరిగినటువంటి ప్రతి చిన్న విషయాన్ని ఒక పాత్ర వేరొక పాత్రతో మాట్లాడినటువంటి ప్రతి మాటనీ ఆసాంతమూ నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పలేదు, ఆయన చెప్పినది కేవలం విహంగ వీక్షణంగా... ఒక నూరు శ్లోకముల దగ్గర్లో ఆ సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి ఉపదేశం చేశారు.
ఇప్పుడూ అసలు నారద మహర్షి వాల్మీకి మహర్షికీ ఉపదేశం చేసినటువంటి కారణం రామాయణ రచన చెయ్యడానికి కారణమూ అనీ... ఖచ్చితంగా చెప్పడం కష్టం ఎందుచేత అంటే అది ఒక ప్రశ్న జవాబు. ఉపనిషత్ ఎలా వచ్చిందో... అలా వచ్చిందంతే, నేను రామాయణ రచన చేస్తానూ అని వాల్మీకి మహర్షి అడగలేదు, నువ్వు రామాయణ రచన చెయ్యీ అని నారదుడు చెప్పలేదు. కేవలం పదహారు గుణములు ఉన్నటువంటి వ్యక్తీ... ఈ కాలంలో ఈ లోకంలో నాతోపాటుగా భూమండలం మీద నేను నా మాంస నేత్రములతో చూడడానికి యోగ్యమైనరీతిలో ఉన్నాడా! అన్న వాల్మీకి ప్రశ్నకు జవాబుగా సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పాడు. ఇప్పుడూ సంక్షేప రామాయణం విన్నటువంటి వాల్మీకి మహర్షీ శ్రీ రామాయణ రచన చెయ్యాలి, ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండీ... రామాయణ రచన చెయ్యడమూ అంటే రామ చంద్ర మూర్తి యొక్క ఆవిర్భావము దగ్గర్నుంచీ ఉండాలి అందులో, అప్పటికి జరిగిపోయిందిగా కథా, రాముడు పుట్టేశాడూ, రాముడు విద్యా భాష్యం చేశాడూ, రాముడికి కళ్యాణం పూర్తై పోయిందీ, రాముడు అరణ్యవాసానికి వెళ్ళి వచ్చేశాడూ, రావణ సంహారం అయిపోయిందీ, ఇప్పుడూ రాజారాముడిగా సీతమ్మ తల్లిని ప్రజలచేత నిందకలిగిందని దూరముగా విడిచిపెట్టాడు, సీతమ్మ తల్లి ఇద్దరు పిల్లలకీ తల్లి అయింది ఇటువంటి సమయంలో నారద మహర్షివచ్చి సంక్షేప రామాయణాన్ని చెప్పారు.
ఇప్పుడు రామాయణ రచన చెయ్యాలీ అంటే... వాల్మీకి మహర్షి ప్రతి విషయాన్నీ ఆ పాత్రల్ని అడిగన్నా తెలుసుకోవాలి, లేదా రచన చేసే ఉద్దేశ్యము ఉన్నదీ అనీ మనకు ఇప్పటి వరకు ఏం కనపడదు. కానీ... నూరు శ్లోకముల దగ్గరలో ఉన్నటువంటి సంక్షేప రామాయణాన్నీ విన్న వాల్మీకి మహర్షి యొక్క హృదయ స్థితిని మీరు గమనించవలసి ఉంటుంది. ఇంత పటిక బెల్లం మీరు నమిలి తినేశారనుకోండీ... ఆ మధురిమా నోటికి అంటుకుని ఉండిపోతుంది అదిదాని తియ్యతనం ఉండిపోతుంది, అలా సంక్షేప రామాయణాన్ని విన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క హృదయం పరవశించి పోయింది. ఎంత పరవశించి పోయిందంటే... నూరు శ్లోకాలలోనే చెప్పినా ఆయన విశేషమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఇప్పుడు ఆయన గుండెలు నిండా ఎవరు నిండిపోయారంటే రాముడు నిండిపోయాడు. రామ కథ నిండిపోయింది, విన్నది నూరు శ్లోకాలే కానీ రామ కథ అంతా ఆయన గుండెల్లో నిండిపోయి ఆ రాముడే లోపల ప్రకాశిస్తున్నాడు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఇప్పుడు మీరు బాగా గమనించండి! మీరు ఏవస్తువు గురించీ ఏ వ్యక్తి గురించైనా బాగా ఆలోచన చేస్తారో... దాని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. నేనూ అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి, సమ్మునతమైన పదవిని అలంకరించి, అప్పుడు కూడా అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి శరీరం విడిచిపెట్టినటువంటి ఒక మహానుభావుని యొక్క చరిత్ర నేను చదివి ఉన్నాననుకోండీ! అదీ... నా మనస్సు మీద ప్రభావముంటుంది. అప్పుడూ నేను వెళ్ళీ బీరువాలోంచి ఒక పట్టుపంచె తీసి కట్టుకోవాలని అనిపించదు, ఆ పుస్తకం చదివిన ప్రభావం నామీద ఏం చేస్తుందంటే... ఎందుకీ ఆడంబరాలన్నీ ఒక నూలు పంచె కట్టుకుంటే చాలదా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే మీ మనసుని అది హత్తుకుంటే నీ మనస్సు మీద ప్రభావముంటుంది. మనస్సుని హత్తుకోలేదనుకోండీ! మీరు చదవడమనేటటువంటిది జరిగిపోతుంది. కంటికి ధర్మం చూడ్డం, చదివేయడం వచ్చు కాబట్టి మనసు అక్షరాల్ని గుర్తుపడుతుంది చదివేస్తుంది. చెవికి వినడం ధర్మం వాల్మీకి మహర్షి కేవలం విన్నది నిజమైతే దాని ప్రభావము ఆయన మీద ఉండక్కరలేదు.
ఇప్పుడు ఆ ప్రభావం ఆయన మీద ఉందా లేదా? ఉంది ఎలా ఉండాలి రామాయణం వింటే, సంక్షేప రామాయణం వింటే... ఇప్పుడా ప్రభావం ఎలా ఉండి ఉండాలి వాల్మీకి మహర్షి మీద ఇది మీరు పట్టుకోవడానికీ వాల్మీకి మహర్షి రామాయణంలోనే ఒక చమత్కారం ఉంది. ఇప్పుడు సంక్షేప రామాయణం విన్న వాల్మీకి యొక్క పరిస్థితి ఏలా ఉందీ?.. ఇది మీరు గమనించడానికీ... ఒక చిన్న ఆధారమే అన్నట్టుగా ఉంటుంది. వచ్చినటువంటి నారద మహర్షీ సంక్షేప రామాయణం చెప్పడానికి వచ్చారూ... చెప్పడం పూర్తైపోయింది. చెప్పడం పూర్తైపోగానే మళ్ళీ తన స్థితిలోకి తాను జారిపోయారు ఆయన. ఇది చాలా గమత్తైనటువంటి ప్రక్రియా... ఎప్పుడూ లోపల భగవంతున్ని నిరంతరం భావన చేసీ ఆ ఆనందంలో తన్మయత్వం పొందేటటువంటి స్థితిని అనుభవించడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులూ... బాహ్యంలో అనేక రకాలైన అనుబందాలతో నిలబడడాన్ని ఎంత తక్కువ చేద్దామా అని చూస్తుంటారు. ఎందుకో తెలుసాండీ... దానికో కారణం ఉంది ఒక అన్నయ్య దగ్గరికెళ్ళి మీరు నిలబడ్డారనుకోండీ... మీరొక తమ్ముడిగా మాట్లాడవలసి ఉంటుంది, అదొక పాత్ర కాసేపుంటుంది ఆ పాత్ర, మీరు అన్నయ్య దగ్గరున్నంత సేపూ తమ్ముడిగా మాట్లాడాలి. ఇప్పుడూ నీ తమ్ముడొచ్చాడనుకోండీ ఇప్పుడు మీరు అన్నయ్యగా మాట్లాడాలి అదొక పాత్ర, ఇప్పుడు మీ భార్య వచ్చిందనుకోండీ మీరు భర్తగా మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడీ పాత్రలుగా మారుతున్నదీ... ఈ మారడాలు మారడాలు అనేటటువంటివన్నీ ఎందులోంచి వస్తున్నాయో...  దానిగా తాను ఉండడానికి ఇష్టపడుతాడు. అంటే ఇన్ని పాత్రలుగా మనసు మీద ప్రభావం చూపించి తాను మారుతున్నటువంటి స్థితికీ ఆది ఎక్కడుందీ... మారని స్థితి ఒక్కటుంది ʻసత్యంʼ అది ఈశ్వరుడు తాను లోపల ఆ ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఆయన తపస్వీ వాగ్విదాం వరమ్ ! ఆయన నారదుడుకాబట్టి ఆయన ప్రయోజనమేమిటీ... సంక్షేప రామాయణం చెప్పడం చెప్పేశారు. చెప్పేన తర్వాత ఇంకా వాల్మీకి మహర్షి ఏం చేస్తారూ?... బాగా అందుకున్నారా... అందుకోలేదా... నేను చెప్పింది అర్థమయిందా, అర్థమవ్వలేదా... నేను చెప్పిందానివల్ల ఏదైనా ప్రయోజనం సాధిస్తాడా! సాధించడా? ఇవి ఆయనకు అనవసరం తాను చెప్పవలసింది చెప్పేశారు. ఆయనకీ ఆ విశ్వాసం కూడా అలాగే ఉంటుంది గురువుకీ, మీకు నారదుడు ఏలా ఉంటాడో... శ్రీ రామాయణమంతా గురువుల యొక్క వైభవాన్ని ప్రకటన చేస్తుందండీ! చిట్ట చివర యుద్ధ కాండలో అగస్త్యుడు వస్తాడు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తాడు జగామ చ యథాగతం యుద్ధమయ్యే వరకు ఉండడు, నేను చెప్పాను చచ్చిపోతాడంతే రావణుడు, ఆయనకు ధైర్యం నమ్మకం అంతే ఆయన వెళ్ళిపోతాడు అంతే. అదేదో ఉండి చూద్దాం రావణుడు చనిపోయాడో లేడో...  ఉండి చూడడం ఏమిటండీ?... చనిపోయి తీరుతాడు అది విశ్వాసం గురువుకీ, తను చెప్పిన దాని మీద తనకు నమ్మకం లేనివాడు గురుపదవిలో ఏలా కూర్చుంటాడు కాబట్టి తను చెప్పిన వాక్కు మీద తనకంత విస్వాసం. గురువుగారి వాక్కు మీద అంత విశ్వాసమున్నవాడు శిష్యుడు నిన్నటి రోజున  మీకో మనవి చేశాను, ఆ విశ్వాసంతో లోతుగా విషయాన్ని తెలుసుకోవడం కోసమని చేసినటువంటి ప్రశ్న పరి ప్రశ్న అందుకనీ, ప్రశ్న అడుగడానికనీ ముందు వినయం ఉంటుందీ వినయంతో పాటు గురువుగారి ప్రజ్ఞ మీద అచంచల విశ్వాసం ఉంటుంది.
ఇప్పుడు నారదుడు ఏలా వచ్చాడో...?  ఆలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, అది మీరు స్వర్గలోకానికి వెళ్ళిరనుకోండీ, బ్రహ్మ లోకానికీ వెళ్ళారనండీ, ఇంకోచోటకి వెళ్ళారనండీ... అసలు వెళ్ళిందెక్కడికంటేతాను ఎప్పుడూ ఏస్థితి తప్ప వేరొక స్థితి లేదో, ఆస్థితి కాక వేరొక స్థితికి రావడం, వుండవలసిన సహజస్థితికి భిన్నమో ఆ స్థితిలో ఉండడానికి ఇష్టం లేక తన సహజ స్వరూప స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే తాను బ్రహ్మముగా స్థిరపడిపోయాడు మళ్ళీ... అంతర్ముకుడై తాను తానుగా ఇప్పుడు తాను గురువా కాదు విశ్వం పశ్యతి కార్యాకరణతయా అని శంకరాచార్యులవారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టూ కృతకంగా కనబడేటటువంటి ఈ అనుబంధాలన్నింటికీ కూడా అతీతమైన స్థితిలో తానుండవలసినటువంటి సహజ స్థితిలోకి తానూ జారిపోయాడు జారిపోయి నారద మహర్షి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాల్మీకి మహర్షి పరిస్థితి ఏమిటీ? ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్పారు ఏమనీ? ఏటువంటి వాల్మీకి ఏటువంటి  నారదుడూ... ఇద్దరూ కూడా తపస్స్వాధ్యాయనిరతం ఇద్దరూ నిత్య నైమిక్తిక కర్మలయందు వైక్లవ్యం లేకుండా ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఎందుకలా ప్రవర్తించాలి వాళ్ళు బ్రహ్మముగా నిలబడిపోయినప్పుడు ఇంకమళ్ళీ సంధ్యావందనం అవసరమా? అవసరమే? ఎవరి కొరకో తెలుసాండీ! నారద మహర్షి అక్కడ ఉండగా... అసుర సంధ్యా వేళకి సంధ్యావందనం చేయకపోతే... నారదుడే చేయలేదు కదాండీ అంటారు మీగిలినవాళ్ళు ఇందులో ఉన్న తమాషా ఏంటో తెలుసాండీ! ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు, ఒక అజ్ఞానినీ మీరు అనుకరించ కూడదు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
బాగా జ్ఞాపకం పెట్టుకోండీ ఈ విషయం... ఒక జ్ఞానిని అనుకరించలేరు, ఒక భగవాన్ రమణులు గోచీ పెట్టుకొన్నారుగదాని మీరూ గోచి పెట్టుకుని ఆయనలా తిరిగితే మీరు రమణ మహర్షి అవడం సాధ్యంకాదు. భగవాన్ రమణులూ... ధ్యానంలో ఉండగా... ఆయన తొడలకింద తేళ్ళూ, జెర్రిలూ పట్టుకొని తొడలు కొరుక్కుతినేసి నెత్తురు కాల్వలై ప్రవహించినా... ఆయనకు శరీరమునందు స్మృతిలేదు. ఆయనలా గోచీ పెట్టుకోగలవేమో... ఆయనలా... నువ్వు ఆ స్థితిలో నిలబడిపోయి బాహ్యము నుంచి విడిపడిపోవడం నీకు సాధ్యమవుతుందాజ్ఞానిని అనుకరించ వద్దూ... జ్ఞానిగా నువ్వు అయిన తరువాత, నీవు జ్ఞానివి కాగలిగితే... నీ స్థితి నీ కొస్తుందప్పుడు, తప్పా అప్పటి వరకు నీవు జ్ఞానివై పోయినట్టూ... రమనులులేలా ఉంటారో, రామకృష్ణ పరమహంస ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎలా ఉంటారో, ఒక చంద్ర శేఖర భారతి ఎలా ఉంటారో అలా ఉండే ప్రయత్నం నీవు చేయకూడదు అది సాధ్యమయ్యే విషయం కాదు.
చంద్ర శేఖర భారతీ... పుష్పార్చన చేస్తూ... చేస్తూ... సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే బిందెలతో నీళ్ళు తెచ్చి ఆయన మీద పోసేసేవాళ్ళు ఆయనకు బాహ్య స్మృతి ఉండేది కాదు ఒళ్ళంత తుడిచేసి బట్టలాగేసి చుట్టేసేవారు అలాగే ఉండేవారు కొన్ని రోజులు అదే సమాధి స్థితిలో ఉండేవారు. ఏదీ అలా నేను కూడా నటిస్తానండీ అంటే కుదిరే విషయమా! అది సాధ్యం కాదు జ్ఞానిని అనుకరించ రాదూ అనుకరించే ప్రయత్నమూ చేయ్యకూడదు లేదా జ్ఞానిని అనుకరించలేవు అజ్ఞానినీ... అనుకరించరాదు. జ్ఞానీ సంధ్యావందనం చేయకపోవచ్చూ, జ్ఞానీ బట్టకట్టక పోవచ్చు, ఒక అజ్ఞానీ బట్ట కట్టక పోవచ్చూ, తండ్రికి తద్దినం పెట్టక పోవచ్చూ, వాడు చేస్తున్నాడని నీవు చేయకూడదు. ఈ రెండిటికి మధ్యలో నీ పరిధి తెలుసుకొని నీవు ప్రవర్తిస్తే పైకి ఎక్కుతావు, ఈ ఎక్కేటటువంటి ప్రస్తానమునకు సాధన అని పేరు. అజ్ఞానిని చూసి అలా చేయకుండా ఉండడం, జ్ఞానిని అనుకరుంచే ప్రయత్నం చేయక పోవడం, అజ్ఞాని చూసి వాడు బాగుపడాలని కోరుకొనీ, నీవు జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయడానికి నిశ్ఛలమైన చిత్తంతో కర్మాచరణం చేసేటటువంటి ప్రక్రియకు సాధనా అని పేరు శాస్త్రంలో.
కాబట్టి ఇప్పుడూ... చెయ్యకపోతే సంధ్యావందనం నారదుడు చెయ్యలేదూ... వాల్మీకి చెయ్యలేదూ... మేమెందుకు చెయ్యాలంటారు. ఇది యదార్థంగా జరిగింది అరుణాచలంలో... రమణ మహర్షి దేహబంధు ఒకాయనా... సంధ్యావందనం చేయడం మానేశాడు. మానేస్తే చెప్పారు అంతేవాసులు అయ్యా ఆయన సంధ్యావందనం చెయ్యడట్టాని, ఎందుకు చెయ్యడో అడగండీ అన్నాడు, ఎందుకు చెయ్యవూ అని అడిగారు. ఆయన చెయ్యట్లేదుగా రమణ మహర్షీ... నేనేందుకు చెయ్యాలీ...? రమణ మహర్షి చెయ్యలేదూ అంటే ఆయన నిద్రలోకూడా బ్రహ్మముగా రమిస్తారాయన ఆయన, ఆయనా... ఇంక శరీరం పడిపోయే స్థితి వచ్చేసిందీ, ఆయనకు సర్కోమా వ్యాది పుట్టి చేతి మీద పుండు పుట్టింది నొప్పి అంతా ఒకచోట పెడితే సర్కోమా అని పేరు, అందులోవున్న చెడురక్తం లాగేయడం కోసమనీ... జలగలు తెచ్చి కరిపించారు, కరిపిస్తే అవి నెత్తురు తాగేస్తున్నాయి, తాగుతూంటే ఆయన ఇలా కూర్చున్నారు. ఆ జలగలు ఎంతకీ కిందపడకపోతే లాగేశారు వాటిని లాగేసి కింద పడేశారు అవి నెత్తురు తాగి కదలకుండా ఉన్నాయి. ఆయన చూసి అన్నారూ... ఓ వీటికి బ్రాహ్మీ స్థితి అబ్బిందే అనీ... నీవు అనగలవా... ఎవరో అన్నారూ మీకు సర్కోమా వచ్చిందీ పుండు పడిందీ అన్నారు. ఆయనన్నారూ కాదూ... శమంతకమణి నా యోచేయి ఎక్కిందీ... ఎర్ర బంగారం పెడుతోందన్నారు నెత్తురు కారుతోంటే ఆయన సాక్షీ ఈ శరీరానికి అది జ్ఞాని యొక్క స్థితి. కాబట్టి జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు కానీ... నిత్యనైమిత్తిక కర్మలు వారు ఎందుకు చేస్తారంటే నేను చెయ్యకపోతే వీడు నేనూ చెయ్యక్కరలేదని మానేస్తాడెమోనని చేస్తారు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
హృదయం రామ చంద్ర మూర్తియందు రమిస్తోంది వాల్మీకి మహర్షికీ... ఇప్పుడాయన అన్నారూ నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్యవిశారదః ! పూజయామాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః !! శిష్యులతో కలిసి నారద మహర్షిని అర్చించిన పిదప నారద మహర్షి వెళ్ళిపోయారు స ముహూర్తం గతే తస్మిన్దేవలోకం మునిస్తదా ! జగామ తమసాతీరం జాహ్నవ్యా స్త్వవిదూరతః !! తమసా నదికి ఆయన మాధ్యాత్మిక సంధ్యావందనం కొరకు బయలుదేరారు ఎవరూ? వాల్మీకి మహర్షి. ఇప్పుడు వెడుతున్నదీ మద్యాహ్న కాలంలో సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తున్నారు. సంధ్యావందనానికి ముందూ... స్నానం చెయ్యాలి, స్నానం చెయ్యడానికి దగ్గరలో ఉన్నటువంటి తమసా నది తీరానికి వెళుతున్నారు.
గురువుగారు తమసా నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి వెడుతుంటే శిష్యులేం చేస్తారూ... గురువుగారు సంధ్యావందనం చేసొస్తారండీ మనమెందుకని కూర్చుంటారా? అది కాదు శిష్యుడంటే... శిష్యుడంటే... గురువుగారు ఏపని చెయ్యబోతున్నారో... తెలుసుకొని గురువుగారు ఆ పని చెయ్యడానికి ఉపక్రమించేటప్పుడు ఆయన మనస్సు దానియందు స్థిరముగా నిలబడి ఆయన సంతోషించడానికి వీలైన రీతిలో దానికి కావలసిన బాహ్యోపకరణములను సిద్ధం చేస్తాడు. గురువుగారు ఏం చేస్తారిప్పుడూ... సంధ్యావందనం చేసుకోవడానికి వెడుతున్నారూ అంటే... ఒక కలశపట్టుకొని వెళుతారు, ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళుతున్నారంటే ఆయన కట్టుకున్న బట్టతో స్నానం చెస్తారాయన. ఇప్పుడాయన ఆ తడిబట్ట విప్పేసీ... ఓ పొడిబట్ట కట్టుకుంటారు కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడూ... వేళౌవుతోంది, తమసా నదికి వెళ్ళాలి సంధ్యావందనానికి అన్నారు అంటే ఇప్పుడు శిష్యుడేం పట్టుకొని బయలుదేరాలి, శిష్యుడు గబగబా ఆయనకు ఒక పొడిబట్టా, ఒక నీటి పాత్రా పట్టుకుని ఆయన వెనకాల వెళ్ళాలి.
ఇదీ... తండ్రి హృదయాన్ని కొడుకు ఎలా తెలుసుకుంటాడో? గురువు హృదయాన్ని శిష్యుడు అలా తెలుసుకుంటాడు. అందుకే... గురువు పక్కన శిష్యుడు ఉండీ, గురువుగారికి శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించడం జన్మ జన్మాంతర సుకృతం. అసలు నిఖచ్చిగా మాట్లాడలంటే, ఆ శుశ్రూష చేసేటటువంటి అదృష్టం కొన్ని కోట్ల జన్మల తరువాత లభిస్తుంది. అందరికి లభించదు ఎందుకంటే గురువుగారి యొక్క ప్రవర్తనను చూడగలిగినటువంటి అదృష్టము శిష్యుడికి పడుతుంది. ఆయన ఏం చేస్తూంటారూ, ఆయన ఎలా ప్రవర్తిస్తూంటారు, ఆయనేం మాట్లాడుతూంటారు, ఆయన ఎంత సేపు ఎందులో కూర్చుంటుంటారు ఆయన మనస్సు ఎందులో రమిస్తుంటుంది ఆయన దేనికి చికాకుపడుతుంటారు ఇవి బాగా అర్థమౌతాయి. గురువుగారిని సేవించడం అంటేపరబ్రహ్మమును సేవించడమే... పరబ్రహ్మమును సేవించడం చాలా కష్టమే మీమనసు పెట్టాలి, గురువుగారిని సేవించడం చాలా తెలిక ఎందుకో తెలుసాండీ! గురువుగారు నిత్య తృప్తుడు ఆయనకేమి లోపల కోరికలేమీ ఉండవు, ఉండవు కాబట్టి బిడ్డని ఎలా చూస్తాడో... గురువు తన శిష్యున్ని అలా చూస్తాడు. ప్రతీ క్షణం కూడా అయ్యో పాపం నా బిడ్డా... వాడు తిన్నాడో లేదో అని ఎలా తాపత్రయపడుతాడో శిష్యుడి గురించి అలా తాపత్రయ పడుతాడు. పిల్లవాడు వాడు కాకపోతే ఎవరు చేస్తారు తప్పూ? అన్నట్టే... శిష్యుడు దోషం చేస్తే మన్నించి అలా చేయకు ఇలా చేయ్యి అని చెబుతాడు. గురు శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించేది కాదు. ఆ శుశ్రూష చేసేటప్పుడు ఆ ఉత్సాహం ఉండాలి గురువుగారు కదిలితే, గురువు బయలుదేరితే, గురువుగారి వెంట వెళ్ళడం అంటే... చాలా అదృష్టమండీ! అదీ లభించమంటే లభించేటటువంటి అవకాశం కాదు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
కాబట్టీ ఇప్పుడు వెనకాతల బయలుదేరాడు శిష్యుడు భరద్వాజుడు అని పేరు అయనకు, ఆ శిష్యుడు కూడా గురువుగారివెంట బయలుదేరాడు, గురువుగారివెంట ఆయనేం దేవాలయాలకీనూ, తీర్థయార్థలకీ వెళ్ళడం లేదు సంధ్యావందనానికి వెళుతున్నారు. మొత్తం వందలమంది శిష్యులందులకుంచరు మనసేరిగిన శిష్యుడొకరు గబగబా ఆ వల్కాన్ని దాన్ని పదకొండు గంటలకే సిద్ధంగా పెట్టేసుకొంటారు గురువుగారికోసం. గురువుగారు సంధ్యావందనం కోసం వెళ్తారు వెళ్ళాలనీ, కాబట్టి ఇప్పుడు అతను బయలుదేరాడు ఇద్దరూ కలిసి తమసా నది దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు తమసా నదిలో దిగి స్నానం చెయ్యాలి వాల్మీకి మహర్షి ఆయన ఒక్కసారి ఆనది ఒడ్డున నిలబడ్డాడు, నిలబడి ఆ నీటి వంక చూశాడు మీరు జాగ్రత్తగా గమనించండీ! ఎప్పుడైనా ఎవరైనా చేసే పని. నేనే గంగానదిలో స్నానానికి కాశీ పట్టణానికి వెళ్ళాననుకోండీ, అమాంతంగా గంగ కనుబడగానే దూకేయనుగా... ఓ సారి ఒడ్డున నిలబడీ, ఆ మెట్లమీద నిలబడీ... ఆ గంగా తీరాన్నీ, ఆ ప్రవహిస్తున్నటువంటి నీటినీ, దురంగా ఉన్న ఇసుక తిన్నెలనీ, వెనక్కి తల తిప్పితే కనబడే విశ్వనాథుడి దేవాలయ శిఖరాన్నీ, స్నానం చేస్తున్నటువంటి మహాత్ముల్నీ చూసి, ఆ గంగ నీటికొక నమస్కారం చేసి, అమ్మా ఎంత అదృష్టమమ్మా ఇన్నాళ్ళకీ స్నానానికొచ్చానమ్మా అమ్మా! నినుఁ జూచిన నరుఁ బొమ్మా యని ముక్తి కడకుఁ బుత్తు వఁట కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా! అంటాడు పరీక్షిత్తు భాగవతంలో. అమ్మా గంగా ఎన్నాళ్ళకొచ్చానమ్మా నా అదృష్టమమ్మా, నా పాపాలు పోతున్నాయమ్మా, అమ్మలను మించిన అమ్మవు కదమ్మా అని ముందు లోపల ఆనందం పొందిన తరువాత అందులో అడుగు పెట్టి మునక వేస్తాడు.
అలా ఆయన కూడా తమసా నది తీరాన నీటి వంక చూశాడు. ఒక ఋషికి ఏం కనపడాలి ఆ నీటిలో ఒక పవిత్రతా, నీటిలో ఒక ఈశ్వర విభూతి ఆయనకి సాక్షాత్కరించాలి. ఆయనంటున్నారు వాల్మీకి మహర్షీ అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ ! రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యథా !! ఆయన ఓ భరద్వాజ నిశామయా... భరద్వాజా శిష్యుడా చూడవోయ్! ఏమిటి చూడాలి... ఇద్దరూ చూస్తున్నారు గదా నీటినీ... గురువు ఏ కళ్ళజోళ్లో నుంచి చూస్తున్నాడో ఆ కళ్ళ జోళ్ళలలోంచి చూడమనంటున్నాడు శిష్యున్ని. ఎందుకు ఇదేమైనా ఉపదేశమా! అలా చూడాలా... నీటిని కాదు ఇది శిష్యుడికి చెబుతున్న మాట కాదు కావాలని ఏదో అతడికి చెప్తే నేర్చుకోవాలసిన విషయం అందులో ఏం లేదు. మరి ఎందుకు చెప్తున్నారు వాల్మీకి మహర్షి, దాన్ని రామాయణంలో అంత గొప్పగా రాయవలసిన అవసరం ఏమిటి ఈ శ్లోకాన్ని? అంటే... వాల్మీకి హృదయమేలా ఉందో మీకు అర్థమవుతుంది. నేను ఇంట్లో ఏ పరిస్థితిల్లో బయలుదేరి బయటికొచ్చానో... ఆ ప్రభావము నా మనసు మీద ఉంటుంది. నేను ఎవరితోనో అరగంట సేపు పేద్ద గొడవ పెట్టుకొని కారు


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
దిగాననుకోండీ, ఈ శ్వరుని యొక్క అనుగ్రహము చేత అటువంటివి జరుగుకుండుగాక!, వస్తే ఏవుతుందీ మనస్సూ ఆ వ్యగ్రతతో ఉంటుంది. అప్పుడూ, గబుక్కున ఎవరో నలుగురొచ్చి నమస్కారం చేశారనుకోండి, ఎందుకలా మీద పడుతారు? అని చికాకు పడుతారు. ఎందుకని వాళ్ళేం చేశారని, వాళ్ళు ప్రసన్నంగా ఉన్నారు నువ్వేలేవు, నీ మనస్సు వ్యగ్రతతో ఉంది అదీ ప్రభావాన్ని చూపిస్తుంది. 
ఇప్పుడు వాల్మీకి మహర్షీ భరద్వాజుడికి చెప్పేది చాలా గొప్ప వేదాంత మేమీ చెప్పట్లేదు శిష్యుడికి, వాల్మీకి మహర్షి యొక్క మనోస్థితి ఎలా ఉందో మీకు అర్థమవుతుందీ శ్లోకంలో అకర్దమమిదం తీర్థం ఈ నీటిని చూశావా? భరద్వాజా... బురదలేదు రమణీయం ప్రసన్నామ్బు నీరు చూశావా ఎంత రమనీయంగా ఉందో.., ఎక్కడా... నిర్మలంగా మట్టి లేకుండా చక్కగా శ్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు. ఎలా ఉన్నాయటా... సన్మనుష్యమనో యథా ఇది పట్టుకోవాలి. సన్మనుష్యుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో... మంచి మనిషి యొక్క మనస్సు ఎలా ఉంటుందో, ఈ నీళ్ళలలా ఉన్నాయి. ఏం ఇవ్వాల ఆ ఉపమానమెందుకు పడింది వాల్మీకి మహర్షికీ, మంచి మనిషి పదహారు గుణములున్నవాడెవరని అడిగాడు నారదుడ్ని, పదహారు గుణములున్న మహాపురుషుడెవరో నారద మహర్షి సంక్షేప రామాయణంలో చెప్పాడు. అంత గొప్ప హృదయముండీ, అంత మంచి మనిషైనటువంటి రాముడు ఆయన గుండెలు నిండా నిండిపోయాడు. ఇప్పుడు ఆ రాముని యొక్క స్వచ్ఛతా రాముని యొక్క నిర్మలత్వం రాముని హృదయంలో ఏ పాపమూ లేని స్థితీ, పాపము లేని స్థితి అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి పాపము లేని స్థితి అంటే ఎదో చెయ్యకూడని పని చెయ్యకుండా ఉండడమని కాదు నా ఉద్దేశం. పాపమూ అన్నమాటను మీరు ఎలా అర్థం చేసుకోవలసి ఉంటుందంటే... ఈశ్వర ప్రస్థాననమునందూ ప్రతిబంధక స్వరూపము అని అర్థం చేసుకోవాలి. భగవంతున్ని చేరుకొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అడ్డుగా వచ్చేది ఏదో... దానికి పాపం అని పేరు.
రామాయణ ప్రసంగం విందామని మీరు బయలుదేరారనుకోండీ, అప్పుడే మీకూ ఎప్పుడూరాని వ్యక్తి వచ్చీ ఎనిమిదన్నరకి ఇంట్లోంచి వెళ్ళిపోయాడనుకోండి, ఎన్నిమార్లు వాచీ చూసినా మీరు చేసుకున్న పాపము రామాయణ కథా ప్రసంగము మీరు వినకుండా మీ బంధు రూపములో అడ్డు వచ్చినదీ... దానికి పాపం అని పేరు. ప్రతిబంధక స్వరూపంగా వస్తుంది. ఈశ్వర ప్రస్తానమునందు అడ్డోస్తుంది. ఈశ్వరానుగ్రహముందనుకోండీ... అసలు మనము వెడతామా అనేది వెళ్ళెట్టు చేస్తుంది. అంతే తేడా ఇది నిలబెట్టుకోవాలి ఇది నిలబెట్టుకుంటే మీరు ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్ఠం చేసుకుంటారు. నేను వెళ్ళగలిగాను అని అన్నారనుకోండీ, అవును నువ్వే వెళ్ళిగలిగావంటాడు, ఇంకోసారి సంకల్పం చేయ్యి, ఇదీ తెలుసుకోవాలి సన్మనుష్యమనో యథా లోపలా రాముడున్నాడు. ఏమిటి బురదలేని తనం? రాముని యొక్క ప్రస్తానంలో ప్రతి బంధకాలొచ్చి నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే ఆయన మనసుతోకానీ శరీరంతో కానీ వేద విరుద్ధమైనటువంటి అధర్మమైనపని చేసినటువంటివాడుకాడు. అందుకే ఆయన ఏ సంకల్పం చేస్తాడో, ఆ సంకల్పములు నెరవేరుతాయి. ఆంటే ఆయన హృదయము పాపముతో ఉన్నది కాదూ! నిర్మలమైన మనస్సున్నవాడూ... అంటే ఎప్పుడో ఏదో జరిగినటువంటి సందర్భాలకీ సంబంధించిన విషయాలనీ కడుపులో పెట్టుకునీ వాటి ప్రభావంతో ఇప్పటి జీవితాన్ని పాడుచేసుకొనేవాడు కాడు. ఇది సుందర కాండలో అడిగిందండి సీతమ్మ ఈ మాట ఏమడిగిందో తెలుసా! కచ్చిత్ పురుష కారం చ దైవం చ ప్రతిపద్యతె అని అడిగిందండీ, భార్య కనపడడం లేదనీ చెయ్యవలసిన పనులూ, ఈశ్వరారాధనా రాముడు మానేశాడా హనుమా అని అడిగింది ఆవిడ, ఎంత పెద్ద మాటండీ!


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
మీరు చూడడండీ... ఇవాళ పంపు రావట్లేదండీ అన్నారనుకోండీ, అంతే... మొట్ట మొదట మనం మానేసేదేంటంటే సంధ్యావందనమే, తరువాత మానేసేదేంటటంటే పూజ. తప్పకుండా మినహాయింపు లేకుండా చేసేది టిఫిను, కాఫీ. అంటే... ఎందువల్ల మీరు రాజీ పడగలుగుతున్నారూ అంటే, ఏదైనా ఒక చిన్న విషయం వచ్చిందీ అనేటప్పటికీ దానితో వ్యగ్రత పొందుతాడన్నమాట, తన వ్యక్తిత్వమంతా ఏమైపోతుందంటే... సన్నివేషంతో ముడిపడి పోతుంది. ఓ పీఠ కాలుమీద పడిందండీ! ఆ వేళ్ళు నొప్పి చేశాయ్, ఏండీ - పూజ చేసుకుంటారా మీరైతేనూ... ఈ వ్వాళ మడి నీళ్ళు పెట్టైనా అందనుకోండీ, ఏం పూజ చేసుకోవాలి నా బుర్రా...? పీఠ పడిపోయింది కదా కాలు మీదా! ఆహాఁ.. పోనిలేండైతే, పూజ చేసుకోరు కదా... పోనీ అయితే పీఠ వేయనా? కూర్చుంటారా, కుర్చిలో కూర్చొని చేసుకుంటారా? సంధ్యావందనం మానకూడదు కదా! ఏమిటి కుర్చీలో కూర్చొని చేయడం - వాడు అటూ ఇటూ తిరుగుతుంటాడు ఆ మనవడు వాడు ఏకాలు తొక్కేస్తాడోయని భయం. అన్నం తింటారా? అని అడిగారనుకోండీ ఏం తిన్ను నాలుగు అడుగు వేసొచ్చి అక్కడ కూర్చుందామంటే, ఏలా కూర్చోనూ?  తొడ ఒత్తుకొందంటే కాలు నొప్పేస్తుంది. ఆఫీసు కెళ్తారా? బూట్లో కాలెలా పెట్టనూ... అంటే ఏ పని మీరు చెప్పండీ? ఆయనకు కాలుమీద పడిన పీఠతో మమేకంచెందే వ్యక్తిత్వం. ఇదీ ఏమిటంటే... ఇటువంటి వాళ్ళూ ప్రతి చిన్న సంఘటనతో మమేకమై తాము చెయ్య వలసినటువంటి విహిత కర్మాచరణమునందు వైక్లైవ్యమును పొందుతారు.
రాముడు అటువంటి వాడు కాడు సంఘటనలన్నవి జరుగుతాయి జీవితమన్న తరువాత ఎత్తు పల్లాలు ఉంటాయి ప్రస్తానాలుంటాయి, దాని కోసం ఈశ్వరార్చన విడిచిపెట్టటడం కుదరదు, ఇది నా జన్మ ప్రయోజనము దాన్ని నేను వదలలేను కాబట్టి రాముడేం చేస్తాడంటే భార్యనెవరో ఎత్తుకు పోయారు, సంధ్యావందనం చేస్తాడు, జఠాయువు చచ్చిపోయాడు, అగ్ని హోత్రం చేసేస్తాడు, దశరథ మహారాజురాజు గారు చచ్చిపోయాడని తెలిసిందీ... వెంటనే తనేం తింటాడో దాంతో పితృ తర్పణం చేస్తాడు. అంటే విహిత కర్మాచరణం ఏది చెయ్యాలో అది వదిలిపెట్టడు చేస్తాడు తప్పా, చెయ్యవలసింది వదిలిపెట్టేసి జరిగిన సంఘటనలతో మమేకమై ఏడుస్తూ కూర్చోవడమో, నవ్వుతూ కూర్చోవడమో రాముడికి రాదు. రామాయణం వినడానికి పనికొచ్చేది కాదు అనుష్టాన పర్యంతంలోకి రావాలి మీరు కూడా రాముడు కాగలరు, ఎప్పుడూ... మిమ్మల్ని మీరు ఇది పరిశీలించు కోవడం మీకు రావాలి. ఏదో ఒక చిన్న సన్నివేశంతోటో, సందర్భంతోటో మమేకమై నా జన్మ ప్రయోజనాన్ని నేను విస్మరిస్తున్నానా... ఏది జన్మ ప్రయోజనము. ఈ శరీరంతో రావడం మహత్ భ్యాగ్యం. ఇది ఉంటే నేనేం చేయగలనంటే... ఈశ్వరున్ని చేరుకొనేటటువంటి మార్గంలో నడవగలనూ... నాకో కారుందనుకోండీ, నేనా కూర్లో కూర్చొని సుఖంగా ప్రవచన మందిరానికి రాగలనూ, కారెంత వరకూ పనికొస్తుందీ... నన్ను తీసుకొని అక్కడ వరకూ తీసుకొస్తుంది. అంతేకానీ... ఓ కారా నన్ను ఇంటి నుంచి ఇక్కడ వరకు చల్లగా ఎసీలో తీసుకొచ్చావ్, పాపం నీవు అక్కడుండిపోవడం నేను ఇక్కడ కూర్చోవడం ఏమిటీ, నువ్వు వేదికమీదికి రా, అన్నాననుకోండీ... మాస్టారూ చాలు రెండు రోజులు రామాయణం అంటారు మీరు. కదా! ఎందుకంటారూ... ఒక్కటే కారణం అదీ వస్తువునీ ఎక్కడ వరకు ఉపయోగించుకోవాలో తెలియని తనం.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఈ శరీరంతో మీరొచ్చిందెందుకూ మీరు తరించడానికి, ఈ జన్మలో ఓ ఆఫీసరు, ఈ జన్మలో ఓ తమ్ముడు, ఈ జన్మలో ఓ అన్న, ఈ జన్మలో ఓ భార్యా కాతే కాంత కస్తే పుత్రహ సంసారో అమయతీవ విచిత్రహ కస్యత్వం కహ కుత ఆయాతహ త్త్వం చింతయ తదిహ భ్రాతహ ఊపిరాగిపోయిన మరుక్షణంలో ఈ పాత్రలన్నీ అంతర్ధానమైపోతాయి మరి నీ జన్మ ప్రయోజనం నశించిపోవట్లా. సంఘటనలు జగకుండా ఉంటాయా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది లేచిన తరువాత, ఏదో ఒకటి ఫోను రాకుండా ఉంటుందాండీ! ఎక్కడ నుంచో ఏదో వస్తుంది దానికి నీవు మానేసేది సంధ్యావందనం, పూజానా...? దానికోసం నీవు ఆరోజు గజేంద్ర మోక్షం చదువుకోవడం మానేస్తావా?, దానికోసం నీవు గుడికెళ్ళడం మానేస్తావా, నీ ప్రయోజనమేమైపోతోందీ... నీ జన్మేమైపోతోందీ, నీవు ఈ శరీరాన్ని పొందినందుకు ఉపయోగమేమైపోతోందీ ఇదీ... 
కమలాక్షు నర్చించు కరములు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ ;
సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు ; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము ;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు ; మధువైరి దవి లిన మనము మనము ;
భగవంతు వలగొను పదములు పదములు ; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి ;
దేవదేవుని చింతించు దినము దినము ; చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు ;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు ; తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి
అంటాడు ప్రహల్లాదుడు, నీకొక రోజూ సార్థకత పొందిందీ అంటే నీవు దీనితో ఎందుకొచ్చావో దానికి దీన్నీ ఆరోజు ఉపయోగించావా! ఏదో ఒకటి విన్నానని చెప్పి దాంతో మమేకం చెంది దీన్ని విడిచిపెట్టావా?... ఇదీ తెలుసుకోగలిగితే, లోపల ప్రతి బంధకాలు నిలబడకుండా విహిత కర్మాచరణమునందు పూనికతో ఉన్నవాడని, ఇదీ ఎందువల్ల కనబడుతోంది ఆ నదిలో నీటిని చూస్తే ఎందుకిలా మాట్లాడగలుగుతున్నారు వాల్మీకి మహర్షి, అంటే ఆయన గుండెలు నిండా రాముడు నిండి పోయాడు. పరమదయాళువైన రాముడు, ఎవ్వరి మీదా కోపం పెట్టుకోని రాముడు, ఎవడు ఎంత పాపం చేసినా క్షమించగలిగిన రాముడు, మార్చుకుంటాడేమోనని అవకాశం ఇచ్చే రాముడు, ఉదారుడైనటువంటి రాముడు, మన్నించగలిగిన రాముడు, ఏదైనా ఇచ్చేయగలిగినటువంటి రాముడు, ఇంకోడు సంతోషిస్తే సంతోషించగలిన రాముడు, తనకంటూ వేరు సంతోషము లేని రాముడు. రాముడి సంతోషం ఏమిటంటే నీ సంతోషమే తన సంతోషం. రాముడి సంతోషం ఇంక వేరె ఏం లేదు. సీతమ్మ సంతోషం మన సంతోషమే ఆవిడ సంతోషం, ఆవిడ సంతోషం ఇంక వేరె ఏమీ లేదు ఇదీ రాముడు.
అబ్బాహ్..! ఏమి రాముడు ఎంత నిర్మలమైన హృదయం, ఇదిగో ఈ నీటిలా ఉంది కాబట్టీ ఈ నీరు ఎలా ఉందో? అలా ఉన్నాడయ్యా సన్మనుష్యమనో యథా సన్మనుష్యుడు చక్కని సహృదయుడైనటువంటి మనుష్యుని యొక్క మనసు ఏలా ఉంటుందో... నీళ్ళు అలా ఉన్నాయి. ఎందుకొచ్చింది ఈ మాట గుండె నింఢా రాముడు నిండిపోయాడు. ఇంత గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు, దీనికి పూర్తి విరుద్ధంగా ఒకటి జరిగిందనుకోండీ ఇది మీరు ఇప్పుడు పట్టుకోవాలి ఈ సన్నివేశాన్ని. ఈశ్వరుడు ఏదీ కాకతాళీయంగా జరిగినవి కావు రామాయణం రావాలీ అంటే ఏన్ని పరీక్షలు జరిగితే రామాయణం వచ్చిందో చూడండీ...  సీతమ్మ తల్లి ముందు వెళ్ళింది, లవకుశులు పుట్టారు, శిష్యులు దొరికెట్టు చేసింది, నారదుడొచ్చాడు, బుద్ధి ప్రచోదనం చేయించి ప్రశ్న వేయించింది సంక్షేప రామాయణం చెప్పించింది, వాల్మీకి హృదయం నిండిపోయింది. ఇప్పుడా తమసా నది యందు స్నానం చేసే ముందు హృదయంలోకి రాముడు ప్రవేశించాడో లేడో, నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు వాల్మీకి హృదయంలో ప్రవేశించాడో లేదో మీకీ శ్లోకం వల్ల తెలుస్తుంది అందుకూ ఆ శ్లోకం. ఇప్పుడు మనసునింఢా రాముడు, ఈ మనసు నిండా ఉన్నటువంటి రాముడూ సంతోషంతో ఆనందంతో ఇప్పుడు ఆయన దిగుతున్నాడు దేనికి దిగుతున్నాడు సంధ్యావందనం చెయ్యాలి, మనమూ స్నానం చేస్తాము. రాముడూ స్నానం చేస్తాడు, ఎదర విందురు గాని రాముడు స్నానం అంటే ఎలా ఉంటుందో?... ఇప్పుడు సంధ్యావందనమంటే ఎలా ఉంటుందో, రాముడి అగ్ని హోత్రమంటే ఎలా ఉంటుందో, రాముడు ఒకటి చదవడమంటే ఎలా ఉంటుందో, రాముడు ఒకటి కట్టడం అంటే ఎలా ఉంటుందో, రాముడు బాణం వేయడమంటే ఎలా ఉంటుందో మీరు చూద్దురు కానీ...


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఇప్పుడూ ఆయన ఇన్నాళ్ళు చేశాడు సంధ్యావందనం ఇప్పుడు రాముడు గుండె నిండా నిండిపోయిన తరువాత నీటిలోకి ప్రవేశిస్తూంటే ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది. ఎందుకు నిండిపోవాలి? ఆయనని విడిచి ఉండలేక అనుగమించి వచ్చినటువంటి లక్ష్మణుడు గుర్తోస్తారు గదాండీ రాముడనేటప్పటికీ, ఎందుకొచ్చాడు లక్ష్మణుడు వెళ్ళమన్నారా ఎవరైనా... ఎవరూ వెళ్ళమనలేదు ఎందుకు కొచ్చేశాడు. అన్నీ వదులుకొని అన్నయ్య సేవ ఏం చేశాడు. అంటే అన్నయ్య స్నానం చేస్తూంటే అన్నగారికి బట్టలు పట్టుకెళ్ళాడు. అన్నయ్య స్నానం చేస్తే ఓ పూర్ణ కలశంతో నీళ్ళు పెట్టాడు, అన్నయ్య పూజ చేసుకుంటానంటే పువ్వులు పెట్టాడు. అన్నయ్య ఒరేయ్ ఇల్లు కట్రా మనకంటే వాస్తుకు సరిపోయ్యేట్టు ఇల్లు కట్టాడు, పర్ణశాల వేశాడు. ఇన్ని చేసినటువంటి లక్ష్మణుడు రామున్ని ఎలా అనుగమించాడో, అలా ఈ భరద్వాజుడు నన్ను అనుగమించి నేను సంధ్యావందనం చేసుకోవడానికి వస్తే, నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకొన్న తరువాత తాను చేసుకోవాలని నన్ను సేవించడానికి నా వెంట వచ్చాడు. ఇప్పుడు శిష్యున్ని చూస్తే... రాముడి వెంట లక్ష్మణుడు గుర్తుకు రావాలి కదాండీ! ఆ ప్రభావం ఉన్నప్పుడూ, కాబట్టి ఇప్పుడూ వాల్మీకి రాముడయ్యారు ఒక రకంగా కాబట్టి ఆయనంటున్నారూ...
న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ! ఇదమేవావగాహిష్యే తమసాతీర్థముత్తమమ్ !! ఉత్తమమైనటువంటి ఈ తమసా తీర్థంలో నేను దిగి స్నానం చేస్తాను.  నాయనా భరద్వాజా న్యస్యతాం కలశస్తాత ఆ నీటిని తీసుకెళ్ళడం కోసం నీవు తీసుకొచ్చిన ఆ కలశం ఉందే దాన్ని కింద పెట్టు దీయతాం వల్కలం మమ నీవ్వు పట్టుకొచ్చిన బట్టలున్నాయే అవి ఇలా ఇయ్యి, అంటే మీకు ఏం అర్థం అవుతోంది ఇప్పుడూ... ఎవరు పట్టుకున్నారు పాత్రా, శిష్యుడు పట్టుకున్నాడు. ఎవడు పట్టుకున్నాడు వస్త్రాలు, వాల్మీకి కట్టుకోవలసినవీ శిష్యుడు పట్టుకున్నాడు. గురువుగారి వెనకాల శిష్యుడు వెళ్ళడమంటే దేనికోసం వెళ్ళాలిలంటే... గురువుగారి శుశ్రూషని ప్రతి క్షణం వాంచించి వెడుతాడు. అంటే ఇది అతను పట్టుకున్నాడూ, అతని దగ్గర గురువుగారు  ఇప్పుడు పుచ్చుకుంటుంన్నాడు. ఇదీ ఒక శిష్యుడు గురువుని అనువర్తించేటటువంటి విధానం. రాముడు లక్ష్మణుని పట్ల ఎంత ప్రీతి చెందాడో... అలా తన శిష్యుని పట్లా గురువు అంత ప్రీతి చెందుతున్నాడు. దేనికంత ప్రీతి... ఎందుకు శిష్యునితో ఆ తమసానది తీర్థం చూపించి, నాన్నా నేను దిగుతున్నాను స్నానానికని చెప్పడం. అది చెప్పవలసిన పెద్ద విషయమా కాదు బాగా గుర్తుపెట్టుకోండీ! గురువు కోరుకొనేది ఏదీ ఉండదూ... అలా కోరుకున్ననాడు వాడు గురువు కాదు బరువు. గురువెప్పుడంటే గురువుకి తాను పొందవలసినదన్నది ఏమీ లేదసలు ఇంకా... తాను పొందవలసింది ఈశ్వరుడొక్కడే. అది తాను లోపల ఆనందం అనుభవిస్తున్నాడు ఇంకేం కావాలి నాకు నాకేం అఖర్లేదంటాడు. మీదికిది కావాలా అని అడిగారనుకోండీ, నాకెందుకండీ అంటాడు. మీకు లేదు కదండీ అన్నారనుకోండీ, నాకు లేకపోవడమేంటండీ అంటారాయన అదీ గురువంటే.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
రమణ మహర్షికీ... ఒళ్ళు తుడుచుకోడానికి ఒ తువ్వాలుండేది, అందరికన్నా ముందు లేచి మూడింటికి స్నానం చేసి ఆ తువ్వాలు చెట్టు తొర్రలో పెట్టేవారు. ఒకప్పుడు శిష్యులందరూ కలిసి అందులో హైకోర్టు జడ్జీస్ కూడా ఉన్నారు. గురువుగారు తుడుచుకొనే తువ్వాలు ఒకసారి చూద్దామని అందులో పెడుతున్నారు రోజూ... అని తొర్రలోంచి తీసారు. అందులో నూలు పోగులు తక్కువా కన్నాలు ఎక్కువ. వారు చూసి అన్నారు భగవన్... మీకు ఇంత మంది శిష్యులం ఉన్నాం, ఒక తువ్వాలు కొనివ్వమాండీ! ఏంటండీ ఈ తువ్వాలని అడిగారు. ఆయన్నన్నారూ ఎవరు చెప్పారు ఆది తువ్వాలని మీరు నాకు తువ్వాలు త్యాగలరా! నేను ఒళ్ళు తుడుచుకొనే తువ్వాలు ఏమిటో తెలుసా! దేవేంద్రుడు, సహస్త్రాక్షుడు, వెయ్యి కన్నాలున్నట్టు కనబడుతోంది. అది ఇంద్రుడు ఇంద్రునితో తుడుచుకొంటాను. మీరెక్కడ తేగలరు ఇంద్రున్ని తువ్వాలుగా... ఇది తృప్తితటే... గురువు నిత్య తృప్తుతుడు, అంత తృప్తితో ఉంటాడాయన. ఆయనకేదో ఇంకోటి కావాలనే ఆలోచన ఏమీ ఉండదాయనకు, అలా కాళీగా ఉండేంత మనసేమీ ఉండదాయనకు.
కాబట్టీ... శిష్యుడు ఒక కలశ పాత్ర పట్టుకొచ్చాడని, శిష్యుడు తనను అనుభవించాడనీ, శిష్యుడు బట్టలు పట్టుకొచ్చాడనీ పొంగిపోతున్నాడాయన. ఇది గురువు పొంగంటే... ఇలాంటి పొంగు మీకు లోకంలో ఎక్కడా కనపడదు. ఎంత చేసినా ఇంకా, ఏదో చేయలేదని ఏడ్చేవాళ్ళుంటారు. ఒక్క గురువు మాత్రం, చిన్న దానికి అంత పొంగి పోతాడు. ఒక గురువు యొక్క స్థితినీ, ఒక్క గురువు యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తోంది రామాయణం. అందుకే నేను మీతో మనవి చేస్తుంటాను. శ్రీ రామాయణం చెప్పడమంటే... అనుభవైక వేద్యమే తప్పా... ఒక్క శ్లోకం చదువుకోవడం కళ్ళుమూసుకొని ఒక్కసారి ఆ తమసా తీరమూ, ఆ వాల్మీకి మహర్షి, ఆ శిష్యుడూ, ఆ వైభవమూ, ఆ గురువూ ఆ హృదయం తలచుకొని ఓ పావుగంట కళ్ళు మూసుకొని, ఆనంద ఝరి లోపల కలుగుతోంటే... సంతోషపడడమే కానీ, మీరు ఎన్ని శ్లోకాలు చెప్తారు. 24 వేల శ్లోకాలున్నాయి 42 రోజుల్లో సంపూర్ణ రామాయణ ప్రవచనం అంటే... యదార్థానికి ఏదో చెప్పానని ఒక తృప్తి అంతే తప్పా నిజానికి రామాయణం మీరు అనుభవించవలసినటువంటిది కదా! అంటే నీవు అన్నీ మానేస్తున్నావా అని అనుకోకండి సుమా! కాబట్టీ...


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఇప్పుడూ ఈ మాట చెప్పీ అయన స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని బయటికొచ్చారు, ఇప్పుడు ఆయన మనసు చాలా ప్రసన్నంగా ఉంది. రామ కథని అనుసంధానం చేసుకోవడానికి, నడిచి వెళిపోతున్నారు, ఇప్పుడూ ఒక చిత్రమైన సంఘటన జరిగింది తస్యాభ్యాశే తు మిథునం చరన్తమనపాయినమ్ ! దదర్శ భగవాంస్తత్ర క్రౌఞ్చయోశ్చారునిస్వనమ్ !! క్రౌఞ్చ పక్షులు రెండున్నాయ్, అందులో ʻక్రౌఞ్చిʼ అంటే ఆడ పక్షి. ʻక్రౌఞ్చముʼ అంటే మగ పక్షి. ఈ మగ పక్షీ - ఆడ పక్షీ కామోద్రేకంతో ఉన్నాయి శ్చారునిస్వనమ్ మధుర మధురమైనటువంటి ధ్వనులు చేస్తున్నాయి. ఈ తమసా నది తీరంలో ఉన్న చెట్టు మీదా గిరికీలు కొడుతున్నాయి. క్రౌఞ్చి తిరుగుతోందీ, క్రౌఞ్చము తిరుగుతోంది. ఎంతో సంతోషంగా ఒక దాని వెంట ఒకటీ తిరుగుతోంది. దీన్నెవరు చూశారు అంటే ఇది చూసినటువంటివారుని కవి వర్ణించట్లేదు ఆ పక్షులు ఎగురుతున్నాయి ఆనందంగా అన్న విషయాన్ని కేవల వర్ణంగా ప్రకృతి వర్ణనగా  చెప్పట్లేదు, దీన్నెవరు చూశారట దదర్శ భగవాంస్తత్ర 'భగవాన్' అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి, ఎందుకంటే... బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనీ... మనకీ ఆర్యోక్తి ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మముని అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయనే ఇప్పుడు భగవన్. భగవన్ వాల్మీకి మహర్షి చూశాడు, కన్ను చూస్తే గుర్తుండదుగా ఇది మనసు కూడా చూసింది. ఏమిటి చూసిందీ... క్రౌఞ్చము వెంట తిరుగుతున్న క్రౌఞ్చి, క్రౌఞ్చి చుట్టూ తిరుగుతున్న క్రౌఞ్చమూ, అవి రెండూ చేస్తున్న మధుర నాదమూ, అవీ సంతోషంగా ఉన్నాయి, ఆయనా సంతోషంగా ఉన్నాడు రాముడు గుర్తొస్తున్నాడూ! ఇయ్యన సంతోష పడుతున్నాడు, అవీ సంతోష పడుతున్నాయి, సంతోషంగా రాముడు గుర్తొచ్చికాదు, కామోద్రేకం చేత సంతోషంతో ఉన్నాయి. అవేందుకు సంతోష పడుతున్నాయో అయనకు అనవసం అవి సంతోషంగా ఉన్నాయి ఈయనకూ సంతోషమే ఇది ఎవరి లక్షణం రాముడి లక్షణం మీరు సంతోషంగా ఉంటే తానూ సంతోషమే.
ఇంతలో హఠాత్తుగా తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః !! ఆ క్రౌఞ్చమూ క్రౌఞ్చి సంతోషంగా తిరుగుతున్నటువంటి సన్నివేశాన్ని పాపనిశ్చయుడైనటువంటి ఒక బోయవాడొకడు చూశాడు ఆ బాగా రెండూ తిరుగుతున్నాయిరా మగపక్షీ ఆడపక్షీ అనుకొన్నాడు, చూసి ఒక బాణాన్నీ ఆకర్ణాంతమూ లాగి విడిచి పెట్టాడు. విడిచి పెడితే ఆ బాణము వెళ్ళీ మగ పక్షి యొక్క గుండెల్లో గుచ్చుకునీ నెత్తురు కారుతూ దాని తలంతా నెత్తురంటుకునీ కింద పడిపోయింది. కిందపడిపోయి భూమిపై కొట్టుకూంటోంది తం శోణితపరీతాఙ్గం మేష్టమానం మహీతలే ! భార్యా తు నిహతం దృష్ట్వా రురావ కరుణాం గిరమ్ !! ఆ కింద పడిపోయినటువంటి పక్షి మగ పక్షి నెత్తుటి తోటి తల ఆడిస్తూ కొట్టుకొని ఏడుస్తూంటే, ప్రాణం విడిచి పెట్టడానికి సిద్ధపడుతుంటే, ఆడ పక్షి క్రౌఞ్చి, ఆ మగ పక్షి యొక్క బాధ చూడలేక పెద్దగా అరుస్తూ ఆర్థనాదం చేస్తూ మగ పక్షి బాధ తన బాధగా మార్చుకొనీ, ఒక్కసారి దాని చుట్టూ తిరుగుతోంది నేల మీద దీన్నీ వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా ! తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై !! తదా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితమ్ ! ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత !! సంతోషంగా ఇంక నడచి వెళ్ళిపోతున్నారు వెనక పూర్ణ కలశాన్ని పట్టుకుని భరద్వాజుడు వచ్చేస్తున్నాడు వాల్మీకి మహర్షి ఇలా చూశాడు రెండు క్రౌఞ్చ పక్షుల్ని చూసి సంతోషిస్తున్నారు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
అకస్మాత్తుగా బోయవాడు బాణాన్ని లాగుతుండడం చూశారు అన్నన్నన్నా... బాణం వేసేస్తారేమో! అనుకుంటున్నారు... వేసేశాడు, వేసేశాడు పక్షిపడిపోయింది ఆడ పక్షి ఏడుస్తోందీ! ఇది చూశాడు ఆయన మనసు గిలగిలగిలగిల కొట్టుకు పోయింది లోపల్నుంచీ దయ పెల్లుభికి పోయింది. అరెరే ఏం తప్పు చేసిందరా ఆడ పక్షీ! ఏం తప్పు చేసింది మగ పక్షి ఆడుకుంటున్నాయి రెండూ, ఆడు కుంటుంన్నటువంటి పక్షుల మీద నిర్ధాక్షిణ్యంగా ఆ బాణం వేసి మగ పక్షిని కొట్టేశాడే బోయవాడూ! ఆయన తథా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితమ్ ! ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత !! ఆ లోపలనుండి పెళ్ళుబికినటువంటి కారుణ్యం చేత ఆ విషయాన్ని చూసినటువంటి ఋషి తతః కరుణవేదిత్వాదధర్మోయమితి ద్విజః ! నిశామ్య రుదతీం క్రౌఞ్చీమిదం వచనమబ్రవీత్ !! ఆయన యొక్క ప్రమేయం లేకుండానే ఏడుస్తూ అరుస్తూ ధ్వనిచేస్తూ మగ పక్షి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ ఆడ క్రౌఞ్చిని చూడగానే, ఆయన హృదయంలో శోక  మొచ్చింది. ఎందుకో ఆయన్న కొట్టారా ఎవరైనా... ఏం లేదూ మగ పక్షిని కొట్టారు ఆడ పక్షి ఏడుస్తోంది. ఇప్పుడు ఆడ పక్షి ఏడుపు తన ఏడుపైంది, తన బాధైంది మగ పక్షి కోసం గిలగిలగిల కొట్టుకుంటున్న ఆడ పక్షి బాధలో తాను పరకాయ ప్రవేశం చేశాడు ఇది ఎవరి లక్షణం. ఇంకొకరి బాధ చూడలేని దయా స్వరూపం సర్వభూతేషు సర్వభూత హితే రతః సర్వభూతముల యొక్క హితాన్ని కాంక్షించడం రాముని యొక్క లక్షణం. సంక్షేప రామాయణం ఆయన మనసు మీద అంత ప్రభావం చూపించింది.
అనుకోకుండా ఆయన నోటి వెంట ఒక మాట పైకి వచ్చేసింది ఆయన కావాలని అంటంలేదు ఈ మాట మీరు బాగా గుర్తు పెట్టుకోండి, ఈ సంఘటన ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయింది. శాస్త్రంలో ఒక మాటొకటుంది "ప్రమాదము" ఇంగ్లీషులో "accident - accident" అంటుంటాం ప్రమాదం అన్న మాటకు అర్థమేమిటో తెలుసాండీమీ బుద్ధిచేత మీరు తప్పించుకోలేని సంఘటనకు "ప్రమాదం" అని పేరు అంటే ఆయన ఆలోచించో, ఆయనకున్నటువంటి పరపతిని ఉపయోగించో తప్పించుకోడానికి అవకాశంలేనటువంటి రీతిలో ఒక ఉపద్రవం వచ్చి మీద పడిపోతే, దానికి ప్రమాదము అని పేరు. అనుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నాడు, అనుకోకుండా అటునుంచి ఇంకో బండివచ్చి కొట్టేసింది. తప్పుకునేదానికి అతని మెదడు ఆలోచించే అవకాశంలేదు ఆలోచించలేని వాడు కాదు ఆలోచించ లేని పరిస్థితి ఏర్పడింది కింద పడిపోయాడు దెబ్బలు తగిలాయి దీనికే ప్రమాదమని పేరు.
అలా అనుకోని సందర్భం, దీనికి కదిలిపోయింది మనసు, ఎలా కదిలిపోయిందీ... రెండు రకాలుగా కదలచ్చూ, మూడు రకాలుగా కదలచ్చూ, ఒకటీ చూడకూడదని చూశామబ్బా ఇంకా ఏం చూడాలి. ఇంక దానిని చూడద్దూ మనకున్న స్థితిపోతుంది అనవసరంగా, ఏదో సంతోషంగా ఉందామని వెళ్ళిపోవచ్చు ఒకటి. రెండో స్థితి ఉంటుంది అబ్బా భలే పడిపోయిందిరా గిరగిరా తిరుగుతున్న దాన్ని ఎంత నైపుణ్యంగా కొట్టాడురా ఆ పక్షినీ, ఖచ్చితంగా ఒక్క బాణం గుండెలలో గుచ్చుకు పడిపోయింది. ఆడ పక్షి అది దాన్ని కూడా కొడతాడా... ఈ పక్షినే తీసుకెళుతాడా బోయవాడు దగ్గరికొచ్చాక ఆడ పక్షి పారిపోతుందా, చెట్టుమీద కూర్చొని ఇంకా ఏడుస్తుందా! ఇప్పుడా పక్షిని ఎలా రెక్కలు పీకేస్తాడు, ఏలా కాలుస్తాడూ చూద్దామని అనుకోవచ్చు. మూడూ ఆ పక్షి పడినటువంటి బాధ బాణపు దెబ్బతగిలి మగ పక్షి పడుతున్నటువంటి బాధని, భర్త మరణిస్తున్నప్పుడు చూస్తూ, ఏమీ చేయలేని స్థితిలో ఏడుస్తున్నటువంటి ఆడ పక్షి బాధనీ, తన బాధగా మార్చుకొనీ


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
తనను ఏమీ కొట్టక పోయినా బోయవానిని తాను తిట్టోచ్చు. బుద్దుందా లేదా అన్నం లేదంటే అడుక్కుతిని తినొచ్చయ్యా పక్షిని కొట్టాలా? కొట్టడం కొట్టావు ఏదీ? మళ్ళీ లేచి ఏగేరట్టు చేయ్యీ! అని దెబ్బలాట పెట్టుకోవచ్చు దేనికీ... అంటే ఆ బాధతో తాను పరకాయ ప్రవేశం చేసి తాదాత్మకత పొందితే...
ఇప్పుడూ అలా దెబ్బలాట పెట్టుకోవాలీ... అలా తన ప్రమేయం లేకుండా నోటివెంట ఒక మాట వచ్చేయాలంటే లోపల ఉన్న దయ ఇంక లోపల పట్టి ఆగక నోటి వెంట వాక్కులుగా ప్రవహించి బయటికి వెల్లువెత్తాలి. వెల్లువెత్తితే తన ప్రమేయం లేకుండా వచ్చేయాలి మాట. అది ఏమని వచ్చేసింది ఆయనకు నోటి వెంట, ఇప్పటి వరకు ఉన్నది మనో భావన, ఇప్పుడొచ్చింది నోటి వెంట వాక్కు పైకొచ్చింది. ఇప్పుడు పైకొస్తే ఎవరు సాక్షి, శిష్యుడు సాక్షి భరద్వాజుడు వెనకాతలే ఉన్నాడు. ఇప్పటి వరకు వాల్మీకి మహర్షి హృదమేలా ఉందీ... భరద్వాజుడికి కూడా తెలియదు ఎందుకంటే ఎవరి మనసు వారికే తెలియాలి ఈశ్వరుడికి తెలియాలి కదండీ! ఈశ్వరుడికి తెలుసూ మీకు తెలుసు మీ మనసు గురించి. ఇప్పుడాయన పైకి అంటున్నారు, ఏమనీమా నిషాద ప్రతిష్ఠాం త్వమగమశ్శాశ్వతీస్పమాః ! యత్త్రౌఞ్చమిథునాదేకమవదీః కామమోహితమ్ !! అన్నాడు, సంతోషంగా తిరుగుతున్నటువంటి పక్షులలో జంట ఒకదానిని దారుణమైన బాణంతో కొట్టి చంపి బాధాపరితత్వమైన హృదయంతో ఆడ పక్షి ఎగిరేటట్టుగా చేసినటువంటి కఠినాత్ముడైన ఓ బోయవాడా! నీవు ఎక్కువ కాలము జీవించు కుందువు గాక! శాపవాక్కు విడిచి పెట్టాడు, ఒక బోయవాడికి ఇంత శాపవాక్కు ఇవ్వాలండీ ఆయన...
ఇక్కడ రామాయం పుట్టిందీ... అనీ అన్నారు పెద్దలు. ఇప్పుడు పుట్టింది రామాయణం అని, అదేమిటండీ రామాయణం ఇప్పుడు పుట్టటమేమిటండీ! అని అడిగారు. ఇది మీరు కొంచెం చమత్కారంగా వాల్మీకి ఉన్నటువంటి స్థితినీ అన్వయం చేసి శ్లోకాలను తిప్పండీ తిప్పితే రామాయణం వచ్చేస్తుంది. ఆయన మనసులో రామాయణం ఉందని నిరూపిస్తుంది మళ్ళీ, మీకు ఎలా వస్తుందో? నేనొక్కసారి కొద్దిగా పరిశీలన చేసి చూపిస్తాను... ప్రతి పదార్థంతో సహా వ్యాఖ్యానం సాధ్యమయ్యే విషయం ఏం కాదు సమయాన్ని దృష్టిలో పెట్టుకొనీ... తస్యాభ్యాశే తు మిథునం చరన్తమనపాయినమ్ ! దదర్శ భగవాంస్తత్ర క్రౌఞ్చయోశ్చారునిస్వనమ్ !! నీటి ఒడ్డున, సముద్రపు ఒడ్డున దక్షిణ తీరంలో ఒక దాని వెంట ఒకటి కామ మోహితులై, ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ కామమే జీవిత పరమావధిగా తిరుగుతున్నటువంటి మగ పక్షీ దానిని అను వర్తిస్తున్నటువంటి ఆడ పక్షీని భగవానుడు చూశాడు. ఎవరిని? దక్షిణ సముద్ర తీరం దగ్గర ఉన్న కాంచన లంకని పరిపాలిస్తున్న రావణాసురుని అను వర్తిస్తున్న మండోదరి వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నటువంటి జీవనం.
దీన్ని శ్రీమహా విష్ణువు చూశారు, పాపము చేస్తూ కామ మోహితుడై జీవితం గడుపుతున్నాడు ఇప్పుడూ... తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః ! జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః !! నిషాదుడైనటువంటి బోయవాడూ ఎప్పుడూ కూడా పాపనిశ్చయం కలిగి, కామోద్రేకంతో లోకం వెంట పడి ఆడవాళ్ళను చరపట్టడమే ప్రధాన ధేయంగా బ్రతికేటటువంటి రావణాసురున్ని చూశాడు. ఇప్పుడు నిశాదుడు చూశాడు నిశాదుడు అంటే బోయవాడు. మరి నిశాదుడు విష్ణువు ఏలా అవుతాడు నిశీదంతి అత్రి సర్వాణి జగంతి ఇతి నిషాదః ఈ లోకమంతా ఎవరిని ఆధారం చేసుకొని బతుకుతొందో, పుడుతోందో, పెరుగుతోందో, లయమౌతోందో వాడికి నిషాదుడని పేరు ఆయన విష్ణువు. కాబట్టి ఇప్పుడు విష్ణువు చూశారు. వీడు కామ మోహితుడై, పాపం చేస్తున్నాడు పర స్త్రీలను చెరబడుతున్నాడూ, ఇక వీడు ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆయన బాణాన్ని విడిచి పెట్టారు అంటే లోపల రామాయణం తిరుగుతోంది ఆయనకి తం శోణితపరీతాఙ్గం వేష్టమానం మహీతలే ! రామ బాణం తగిలినటువంటి రావణాసురిని పది తల కాలయలు నెత్తుటితో తడిసి నేల మీద పడిపోయాయి భార్యా తు నిహతం దృష్ట్వా రురావ కరుణాం గిరమ్ ! ఆ పడిపోయినటువంటి రావణుని దేహం మీద పడి మండోదరి గుండెలు బాదుకొని ఏడుస్తోందీ... ఈ సన్నివేషం ఆయన మనసులో కనపడింది ఆ రావణుడు ఒకసారి మనసులో కనపడ్డాడు రావణా అన్న మాట మెదిలింది ఆయన మనసులో, మెదలగానే


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా ! తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై !!
తదా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితమ్ ! ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత !! 
తతః కరుణవేదిత్వాద ధర్మోయమిత ద్విజః ! నిశామ్య రుదతీం క్రౌఞ్చీమిదం వచనమబ్రవీత్ !!
ఆ కింద పడిపోయినటువంటి రావాణాసురిడి యొక్క శరీరాన్ని కౌగలించుకొని ఏడుస్తున్నటువంటి మండోదరీ యొక్క సన్నివేషం మనసులో కదలగానే, పాపాత్ముడై పర  స్త్రీలని చరబట్టీ వేదం చదువుకొని కూడా ధర్మా ధర్మములు తెలిసి కూడా, అధర్మాన్ని పాటించి ధర్మాన్ని విడిచిపెట్టి తాను అనుసరిస్తున్నది ధర్మమని బుకాయించి మరణించినటువంటి పరమ పాపాత్ముడైన ఈ రావాణాసురుడి గురించిన తలంపు నా మదిలో కలగడం కూడా మహా పాపమే... అని జుగుప్స కలిగినటువంటి మహర్షి, అంతటి పాపాత్ముడైన రావణున్ని పడగొట్టినటువంటి రామ చంద్ర మూర్తిని మనసులో దర్శనం చేసి మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమశ్శాశ్వతీస్సమాః ! యత్త్రౌఞ్చమిథునాదేకమవధీః కామమోహితమ్ !! కామం చేత కన్ను మిన్ను కానక తిరుగుతూ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి రావణ మండోదరుల యొక్క జంటలో రావణుడు అనేటటువంటి క్రౌఞ్చ పక్షిని బాణంతో పడగొట్టినటువంటి విష్ణుస్వరూపుడవైన రామ చంద్రమూర్తీ నీ కీర్తి పదికాలముల శోభిల్లి లోకమంతటి చేత ఆదరించి నమస్కరించుగాక! మంగళా చరణ శ్లోకమైంది. ఇందాకటి శాప వాక్కు ఇప్పటి రామాయణంగా తిప్పేస్తే శ్లోకాల్లోకి, ఆ శ్లోకంలో శ్రీ మహా విష్ణువుని కీర్తించి ఆయనకి మంగళా శాసనం చేసినటువంటి శ్లోకంగా మారిపోయింది. కాదు! రామాయణమంతా ఆ శ్లోకంలోకి వచ్చేసింది. మొత్తం ఏడు కాండలూ ఆ శ్లోకంలోకి వచ్చాయి. ఎలా వచ్చాయిమా నిషాదః మా నిషాదః అంటే "మాం" అంటే లక్ష్మీ దేవి, లక్ష్మీ దేవితో కూడినవాడు. రాముడు శ్రీ రాముడయ్యాడు సీతా కళ్యాణం తరువాత అందుకని శ్రీరాముడు, సీతారాముడు "బాల కాండ" ప్రతిష్ఠాం త్వం తండ్రి యైనటువంటి దశరథ మహారాజుగారి యొక్క మాటనీ నిలబెట్టడం కోసమనీ, సత్యమునందు నిలబెట్టటం కోసమనీ అరణ్యవాసం చేసినటువంటి మహానుభావా ప్రతిష్ఠా త్వమగమః నీ యొక్క కీర్తి చిరకాలమూ ఉండిపోతుంది.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
నీ గురించి పిత్రువాక్య పరిపాలకుడని లోకం శ్లాగిస్తుంది. "కాబట్టి అయోధ్య కాండ" శ్శాశ్వతీస్సమాః మాట తప్పకుండా పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం చేసిటప్పుడు భరతుడే వచ్చి శత్రుజ్ఞుడే వచ్చి, సుమిత్రా, కౌసల్యా, కైకేయీ వచ్చి, వశిష్టుడొచ్చి, జాబాలి వచ్చి, ఋషులొచ్చి, పౌరులొచ్చి, జానపదులొచ్చి రాజ్యం తిరిగి తీసేసుకొమ్మ వరమడిగిన నేనే అంటున్నాను రామా మళ్ళీ రాజ్యం తీసుకో. ఎవరి కోసం అడిగిందో ఆ భరతున్ని చెప్తున్నాను రామా! రాజ్యం తీసేసుకో!... అన్నా సరే... సత్యమేశ్వరో లోకే సత్యే ధర్మం ప్రతిష్ఠితః ! సత్యమూలాని సర్వాణి సత్యాన్న పరమం పదం !! నాకు సత్యం తప్పా ఇంకోటి అక్కర్లేదు ఎవరు వరమడిగాడో ఆ నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ వరాల్ని వెనక్కి తీసుకుంటున్నాను రామా రా అనిచెప్పడానికి తండ్రి లేడు. ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అంటే, తండ్రి పై లోకాల్లో సంతోషించాలంటే నేను పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయడం వినా నాకు మార్గం లేదు. అని మాటకు కట్టుబడి పద్నాలుగేళ్ళు ఆరణ్య వాసం చేసి "తృణం" క్రింద రాజ్యాన్ని విడిచి పెట్టినటువంటి మహా పురుషుడిగా రామా నీ కీర్తి పది కాలములు శోభిల్లి రామాయణం లోకంలో యుగాలతో సంబంధం లేకుండా ప్రవచనం చెయ్యబడి చెప్పబడి ఆదరింపబడి నమస్కరింపబడుతుంది. "కాబట్టి అరణ్య కాండ". క్రౌఞ్చమిథునాదేకం క్రౌఞ్చమిథునాత్ క్రౌఞ్చము, క్రౌఞ్చి ఇవీ... వాలీ తార. వాలీ తార సక్రమం. వాలీ రుమ, సుగ్రీవుని భార్యమైనటువంటి రుమని వాలి అనుభవించాడు. కాబట్టీ, కామ ప్రధానముగా తిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాలిని నిగ్రహించినటువంటి స్వరూపమున్నవాడా "కిష్కికింద కాండ". లేదూ... అందులోనే ఒక గమ్మత్తుంది క్రౌఞ్చౌ అంటే పరివేదనచేత కృషించి పోయిన ప్రాణి. ఎవరు తనకు కనపడాలని తాపత్రయ పడుతోందో వాళ్ళు కనపడక పోవడం వల్ల నీరస పడి బాగా కృషించి పోతే క్రౌఞ్చౌ అని పిలుస్తారు.
ఏ రామ చంద్రమూర్తి తన పక్కన ఉండాలని కోరుకొని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం కోసమని అయోధ్య కన్న నీపక్కనున్న ఆరణ్యవాసమే నాకు గొప్పదని సీతమ్మ తల్లి వచ్చిందో... ఆ అరణ్యవాసంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి తీసికెళ్ళి అశోక వనంలో శింశుపా వృక్షం కింద కూర్చోబెట్టినప్పుడు. మళ్ళీ నా భర్త రాముడితో నేను ఎప్పుడు కలిసి ఉంటానో అని మనుసులో కలిసే ఉన్నా బాహ్యంలో కూడా రాముడు తన పక్కకి రావాలని, పరితపించి పరితపించి, శోకించి, ఉపవశించి, కృషించి పోయిన సీతమ్మ తల్లి కథ చెప్పబడింది కాబట్టి "సుందర కాండ". కాబట్టి క్రౌఞ్చమిథునాదేకం ఒక్కడే... రామ నామాన్ని - రామ కథనీ ఒకటికి పదిమాట్లు ఎలా చెప్పాలో... ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో... ఎక్కడ వివరంగా చెప్పాలో... ఎక్కడ నామం చెప్పాలో.., ఎక్కడ భక్తి ప్రకటనం చెయ్యాలో, అక్కడ రామ నామ వైభవాన్ని ప్రకాశింపజేసి ఒక్కడే... ఎవ్వరూ చేయలేని సంకల్పం చేసి, ఒక్కడే నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఒక్కడే అంత మంది రాక్షసులను వధించి, ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి, ఒక్కడే పట్టుకొచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చి, ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం పుచ్చుకొని, ఒక్కడే కొన్ని లక్షల మంది రాక్షసుల్ని తెగటార్చి, ఒక్కడే నిర్భయంగా రావాణాసురిడికి సందేశం చెప్పి, ఒక్కడే నిర్భయంగా ఆనాడు ఆ పర్వతం నుంచి బయలుదేరి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి "దృష్టా సీతా" నేను దృష్టాసీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్ ʻసీతమ్మ తల్లి చూడబడును సీతమ్మ తల్లీʼ అని క్షేమ వార్త చెప్పాడో... అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాధని ప్రకాశింపజేసిన సుందర కాండ అందులో ఉంది.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
కాబట్టి, అక్కడా... క్రౌఞ్చమిథునాదేకంమవదీః కామయోహితమ్ కామమోహితులైనటువంటి ఆ రావణాసురుని పడగొట్టినటువంటి సందర్భమైన యుద్ధ కాండ అందులోకొచ్చింది కాబట్టీ, ఆ తరువాత జరిగినటువంటి కథను కూడా చెప్పింది కాబట్టీ, ఎందు చేతనంటే రామ చంద్ర మూర్తి మీద మనసున్నటువంటి సీతమ్మని రాజ ధర్మం కోసం విడిచిపెట్టి బాధపెట్టిన సందర్భంతో కూడినటుంటి ఉత్తర కాండ కలిసింది కాబట్టీ ఏడు కాండలతో ఉన్న రామాయణం ఒక్క శ్లోకంలోకి లోపల రామాయణమే తిరుగుతున్న మహర్షికి క్రౌఞ్చ - క్రౌఞ్చిల యొక్క మిధునంలో ఒక పక్షి పడిపోతే, శ్లోక రూపంలో నోటివెంట సంపూర్ణ రామాయణం మొదటి శ్లోకంగా పైకి వచ్చింది. కాబట్టి మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమశ్శాశ్వతీస్సమాః ! యత్త్రౌఞ్చమిథునాదేకమవధీః కామమోహితమ్ !! ఇప్పుడు ఈ మాట అంటే... భరద్వాజుడు విన్నాడు.
ఇది పైకి శాప వాక్కులా ఉంది కానీ! అబ్బా ఎంత మంగళ ప్రదంగా ఉందీ శ్లోకం... అని అదే పనిగా ఆ శ్లోకాన్ని చదువు కొంటున్నాడు ఇది చదువుకొంటూ... ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తరువాత ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్న తరువాత కూడా మహర్షి మనసులో ఆ శ్లోకమే తిరుగుతోంది. అదేంటది శాపవాక్కు అయితే నోటివెంట అన్నిమాట్లు రాకూడదుగా! ఇన్ని మాట్లు తిరుగుతోందేమిటీ... మళ్ళీ భరద్వాజుడ్ని పిలిచాడు ఆయనా ఈ శ్లోకమే చెప్పాడు, చాలా బాగుంది గురువుగారు ఆ శ్లోకమూ అనీ పాదబద్ధోక్షరసమస్తన్త్రీలయసమన్వితః ! శోకాఽఽర్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా !! నా శోకము శ్లోకమైందయ్యా దీనికి నాలుగు పాదాలు ఉన్నాయి ఒక్కక్క పాదానికి సమానంగా అక్షరాలున్నాయి, ఇది సంగీతానికి కట్టుబడుతోంది తంత్రీలయ సమన్వితమైంది దీన్ని వీణ మీద వాయించచ్చు దీన్ని పక్క వాయిద్యాలతో గీతంగా ఆలాపనగా చేయవచ్చు పాట పాడచ్చు దీనికి ఇన్ని లక్షణాలెలా కుదిరాయ్! నేను క్రౌఞ్చ మిధునం చూసి, బోయవాడు వేసిన బాణానికి బాధపడి అన్న శ్లోకం ఇంత అద్భుతంగా ఏలా వచ్చింది ఆశ్చర్య పోతున్నారు ఆశ్చరపోతూ కూర్చుని భరద్వాజుడుతో మాట్లాడుతున్నారు.
ఇంతలో గొప్ప తేజస్సు ఒకటి ఆశ్రమ వాకిట కనబడింది ఏమిటని ఇటు తల తిప్పి చూశారు అజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః ! చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుఙ్గవమ్ !! నాలుగు ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం పట్టుకుని హంస వాహనం దిగి అడుగు వేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు. ముందు కొడుకొచ్చారు, వెనక తండ్రొస్తున్నారు లేచి నిలబడ్డారు. మనసంతా రామాయణం, మనసంతా శ్లోకం, అనుకోకుండా చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం పరమానందం. ఏమిటి ఒకదాని వెంట ఒకటి ఈసన్నివేశాలు ఆనందంతో ఏది తర్వాత ఏది చేస్తున్నారో దేని తర్వాత ఏది జరుగుతోందో మనసు నిలబట్టం లేదు. ఏమిటి ఈ విచిత్రం? ఆశ్చర్యపోయారు వాల్మీకిః అథ తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః ! ప్రాఞ్జలిః ప్రయతో భూత్వా తస్ధౌ పరమవిస్మితః !! చాలా ఆశ్చర్యపోయారు ఇప్పుడు బ్రహ్మగారు రావడం ఏమిటి? మహానుభావుడు ఎంతో తపస్సు చేసి తపస్సు చేసి తపస్సు చేస్తే ఒక్కసారి అలా ప్రత్యక్షమయ్యేటటువంటి వాడు. తనంత తానుగా ఆశ్రమానికి వచ్చాడు హంసవాహనం దిగి లోపలికి నడిచి వస్తున్నాడు ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డారు


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
మహా వినయంతో ఇలా ఒంగి నమస్కారం చేస్తూ... ఆ బ్రహ్మ గారికి స్వాగతం చెప్పారు ఆయన లోపలికి వచ్చారు, లోపలికి వచ్చారు కాని మనసంతా ఎక్కడుంది... ఇంతటి మహాత్ముడు వచ్చాడే... బ్రహ్మగారొచ్చారే అన్న ఉత్సాహం సంతోషం ఆయనకేదో మనం పూజ చేద్దామనిలేదు ఇంకా లోపల రామాయణం - రామాయణం, రామాయణం ఆ సంక్షేప రామాయణం అదే తిరుగుతోంది ఆ శ్లోకం ఎందుకొచ్చింది నా నోటి వెంట ఏంటి అంత గొప్పగా ఉందా శ్లోకం, ఏమిటి ఆ సమానమైన అక్షరాలేమిటి? ఇటు వీణకు కట్టుబడ్డమేమిటిసంగీతానికి కట్టుబడ్డం ఏమిటి? ఏమిటీ గమ్మత్తు తెల్లబోతున్నాడాయన వచ్చారు కూర్చో బెట్టారు.
ఆర్ఘ్యమిచ్చారు పాద్యమిచ్చారు ఆసనమిచ్చారు అన్నీ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆయనేదో మాట్లాడుతున్నారు బ్రహ్మగారు ఈయన వింటున్నారు. నారదుడు మాట్లాడింది చెవులలోంచి మనసులోకి వెళ్ళింది, నారదుడి తండ్రి సాక్ష్యాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మాట్లాడుతుంటే... అంటున్నారు కానీ చెవ్వుల్లోకి మాట వెలుతున్నాయి కానీ మనసు ఇంకొక చోట వుంది ఇది తేడా! సాక్ష్యాత్తు బ్రహ్మగారే వచ్చారు వచ్చినా వాల్మీకి మహర్షి మనస్సు అక్కడ లేదు మరెక్కడుంది? అంటే పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణబుద్ధినా ! యస్తాదృశం చారురవం క్రౌఞ్చం హన్యాదకారణాత్ !! అరెరే! ఆ రెండు క్రౌఞ్చ పక్షులు అలా తిరుగుతుంటే పాపాత్ముడు బాణం పెట్టి కొట్టేశాడురా! పాపాం ఆడ పక్షి ఎంత ఏడుస్తోందిరా, మనసులో బాధతో ఆ సన్నివేశం ఆశ్లోకం అవే తిరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మ గారు కనిపెట్టారు బ్రహ్మగారికి ఆమాత్రం తెలియదాండీ! మహానుభావుడు దేనిగురించి పరివేదన చెందుతున్నాడో? తానే వచ్చినా మనసు ఎందుకు నిలబడటం లేదో, ఎందుకు తనమీద దృష్టి పెట్టలేక పోతున్నాడో? తను చెప్పింది ఎందుకు వింటంలేదో... అర్థమైంది.
ఆయనన్నారూ... ఓ వాల్మీకి మహర్షీ! నీ నోటివెంట ఆ శ్లోకం ఎందుకొచ్చిందో తెలుసామచ్ఛన్ధాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ ! రామస్య చరితం సర్వం కురు త్వమృపిసత్తమ !! నా శక్తి స్వరూపమైనటువంటి సరస్వతీ నిన్ను అనుగ్రహించింది. అనుగ్రహించీ నీ నోటివెంట రామాయణ కావ్యం ఆవిర్భవించబోతోంది అందుకే దానికి మొదటి శ్లోకం మంగళాచరన శ్లోకంగా నీ నోటివెంట వచ్చింది. అందుకే ఆశ్లోకం నీ నోట్లో అలా తిరుగుతోందీ... అందులో ఏడు కాండలు సంక్షిప్తంగా ఆ శ్లోకంలోకి ఇమిడిపోయాయి ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః ! వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛ్రుతమ్ !! నారదుడు నీకు ఏ సంక్షేప రామాయణాన్ని చెప్పాడో, ఆ సంక్షేప రామాయణాన్ని ఆ రామ కథని లోకానికంతటికీ అభిరాముడైనటువంటి ఆ రాముడి యొక్క చరిత్రని శ్రీ రామాయణంగా రచనచేయ్యి ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండీ! రచన చెయ్ అని వరమిచ్చాడు రచన చేయడానికి ఆయన నూరు శ్లోకాలే చెప్పాడు సంక్షేప రామాయణమే వాల్మీకికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాల్మీకి రచన చేస్తే ఏం చేయాలి? మళ్లీ ఆ సంక్షేప రామాయణమే రాయాలి కదా! అంతకన్నా ఆయనకేం తెలియదు కదా జరిగిపోయింది పైగా ఇప్పుడు... నారదుడు చెప్పిన సంక్షేప రామాయణాన్ని రామాయణంగా విస్తరించి రాసేటట్టుగా బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి వరాన్ని, శక్తినీ, సరస్వతీ కటాక్షాన్ని కృపచేయడానికి ఏది చూసి ఇస్తున్నారు. మీరు బాగా ఆలోచించండీ! ఇప్పుడు నారదుడు వచ్చి వెళ్ళిన తరువాత బ్రహ్మగారు వచ్చి వరమిస్తున్నారు బ్రహ్మగారే ముందు వచ్చి నూరు శ్లోకాలు చెప్పేసి ఇవ్వచ్చుగా ఈ వరం మరి ముందుగా బ్రహ్మగారు ఎందుకు రాలేదు నారదుడు ముందెందుకు వచ్చాడు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
అంటే బాగా గమనించండీ! సంక్షేప రామాయణం విన్నంత మాత్రం చేత మనసు ఆనంద పారవశ్యంలో మగ్నమై మనసంతా రాముడు నిండిపోయి స్నానం చేస్తున్నా... సంధ్యావందనం చేస్తున్నా... క్రౌఞ్చ మిథునం చూస్తున్నా... బాణం పెట్టి కొట్టడం చూస్తున్నా... లోపల రామాయణమే తిరిగి రామాయణ కథయే శాప వాక్కు నిద్దామన్న శ్లోక వాక్యంలోకి చేరిపోయేటట్టుగా పారవశ్యం పొందినటువంటి వాల్మీకి మహర్షి హృదయ స్థితీ, రెండు అంతటి కారుణ్య మూర్తియైనటువంటి వాల్మీకి హృదయం. అంటే రామాయణం చెప్పడానికి రామాయణం రచించడానికీ ఉండవలసిన లక్షణం ఏదై ఉండాలి కేవలం సరస్వతీ కటాక్షం ఉంటే సరిపోదు కేవలం శ్లోకాలు చెప్పగలిగితే సరిపోదు. ఏది ఉండాలి? లోకము యొక్క బాధను చూసి తన బాధగా బాధపడగలగినటువంటి అమృత హృదయం ఉండాలి. అంత సున్నిత మనస్కుడై ఉండాలి అంత సున్నిత మనస్కుడు వాల్మీకియేనా పరీక్ష పెట్టి చూశారు క్రౌఞ్చ మిథునంతో ఆ పరీక్షలో నెగ్గారు వాల్మీకి మహర్షి ఒక పక్షి కోసం అంత పరితపిస్తున్నాడాయన.
ఇంతటి సున్నిత మనస్కుడు గనక ఈయనే రామాయణ రచనకి అర్హుడూ... ఇప్పుడు వరమిస్తున్నారు బ్రహ్మగారన్నారు రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః ! రామస్య సహసౌమిత్రేః రాక్షసానాం చసర్వశః !! నాయనా నీకు వరమిస్తున్నాను నువ్వు ఆచమనం చేసి కళ్ళు మూసుకుని కూర్చోంటే రహస్యం చ ప్రకాశం చ రామాయణంలో పాత్రలు తమ మనసులలో ఏమనుకున్నయో కూడా నీకు అర్థమైపోతోంది. రామాయణంలో పాత్రలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాయో ఇది చూడవచ్చా ఇది చూడకూడదాయనేది ఉండదు నీకు కనపడని సన్నివేశమేది ఉండదు లోకంలో నీకు రామాయణంలో ప్రతి చిన్న విషయం నీ మనసుకి దుర్గోచరం అవుతుంది. ఆ పాత్రలు మనసులు కూడా నీకు అర్థమైపోతాయి అలా నీవు రచన చెయ్యగలవు వైదేహ్య శ్చాపి య ద్వృత్తం ప్రకాశం యది వా రహః ! తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి !!  నీవు సీతమ్మ తల్లి హృదయంలో ఉన్నటువంటి భావనలను, రాక్షసుల మనసులో ఉన్నటువంటి భావనలను అన్నిటినీ అర్థం చేసుకొని రామాయణ రచన చేస్తావు న తే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్ !!  నాయనా నీవిప్పుడు శ్లోకబద్ధం చేసి నీవు ఈ శ్రీ రామాయణ కావ్యాన్నంతట్నీ నిర్మించు నా శక్తియైన సరస్వతీ అనుగ్రహాన్ని నీకు కలుగేటట్టుగా నీకు నేను వరమిస్తున్నాను యావత్ స్థాస్యన్తి గిరయస్సరితశ్చ మహీతలే ! తాపద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి !! ఎంత కాలం ఈ పర్వతాలు ఉంటాయో ఎంత కాలం నదులు ప్రవహిస్తాయో అంతకాలం నీవు రచన చేసినటువంటి రామాయణం ఈ లోకాలన్నింటిలోనూ చెప్పబడుతుంది యావద్రామాయణకథా త్వత్కృతా ప్రచరిష్యతి ! తావదూర్థ్వమధశ్చ త్వం మల్లోకేషు నివత్స్యసి !! ఎంత కాలం ఈ రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుందో అంతకాలం ఊర్ధ్వ లోకాల్లో, అధో లోకాల్లో, నా లోకంలో కూడా ఉండగలిగినటువంటి శక్తిని నీకు నేను కృప చేస్తున్నాను నీకు నేను వరమిస్తున్నాను.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఇప్పుడు మీరూ బాగా గమనించి చూస్తే... శ్రీ రామాయణ రచనలో జరిగిపోయినటువంటి కథని అర్థం చేసుకొని అందులో ఒక్క మాట అబద్ధం ఉండదూ అని బ్రహ్మగారు వరమిస్తున్నారు వాల్మీకి మహర్షికి, అందుకే లోకంలో రామాయణాలు చాలా ఉండచ్చు, ఆ ఏదో రామాయం చెప్పాడులెండీ అంటారు అందుకే ఎన్నో రామాయణాలు ఉండొచ్చు, కానీ మీకు ఎప్పుడైనా ఏది సత్యం ఇందులో, ఈ సన్నివేశం ఈ రచన కరెక్టా ఇది సత్యమా? అని మీకు రెండిటిలో అనుమానం వస్తే... మీరు ప్రమాణంగా తీసుకోవలసిన రామాయణం ఒక్క వాల్మీకి రామాయణమే. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పారో? అదే సత్యం తప్పా మిగిలిన రామాయణాల్లో వారి భావన చేత వారి దర్శన సౌక్యము చేత దానివలన కలిగిన భావోద్రేకము చేతా అక్కడక్కడా కొన్ని అధికంగా ఉండి ఉండవచ్చు. కాని పరమ సత్యం మాత్రం జరిగిన రామ కథ మాత్రం యథాతధం ఒక్క వాల్మీకి రచించినటువంటి రామాయణం అందుకే అది వేదోప బృంహ్మణము అయ్యింది రామాయణం.
ఇప్పుడు వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు, ఎలా వచ్చారో బ్రహ్మగారు అలా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు ఆయన మనసంతా ఆనందం ఎప్పుడెప్పుడు అంతర్ముఖున్నైపోయి ఆ పాత్రలన్నిటినీ చూస్తూ రామాయణ రచన చేస్తానాని ఉవ్విళ్ళూరిపోయారు. కూర్చున్నారు దర్భాసనం వేసుకొని ఉపస్పృశ్యోదకం సమ్యగ్మునిస్థ్సిత్వా కృతాఞ్ఙలిః ! ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిమ్ ! ! తూర్పు ముఖంగా దర్భలు ఉండేటట్టుగా ఆసనాన్ని వేసుకొని ఆచమనం చేసి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. కూర్చుంటే రామాయణ కథంతా ఆయన కళ్ళ ముందు కట్టినట్టుగా కనబడుతోంది. సంక్షేప రామాయణంలో ఎలా చెప్పబడిందో... అలా రామాయణం ఏడు కాండలలో ఉన్నటువంటి కథా భాగాన్నంతటినీ కూడా మొట్ట మొదట్నుంచీ ఉత్తర కాండ వరకూ భూత భవిషత్ వర్తమాన కాలముల దర్శనముల సమర్థత చేత శ్రీ రామాయణ రచన వాల్మీకి మహర్షి పూర్తి చేశారు. శ్రీ రామాయణ రచన పూర్తైంది చతుర్వింశత్ సహస్రాణి శ్లోకానామ్ ఉక్తవాన్  ఋషిః ! తథా సర్గశతాన్ పంచ షట్కాండని తథోత్తరమ్ ! ! 24 వేల శ్లోకములు ఒక్కొక్క శ్లోకానికీ ప్రతి వెయ్యి శ్లోకాలలో మొదటి శ్లోకానికి మొదటి అక్షరం గాయత్రీ మహా మంత్రము మొక్క 24 బీజాక్షరాలు ఒక అక్షరంతో ప్రారంభమౌతుంటుంది. అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాక్విదాం వరం అందులో ’ గాయత్రీ మంత్రము 24 అక్షరములల్లో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభమైంది. అందుకే శ్రీరామాయణం చెప్పడం అంటే, శ్రీరామాయణాన్ని చదవడం అంటే గాయత్రీ మహా మంత్రము యొక్క వ్యాఖ్యానము  అంతట్నీ చదవడంతో సమానం.
కాబట్టి ఒక్కొక్క అక్షరానికి వేయ్యి శ్లోకాలు చొప్పున 24 వేల శ్లోకములతో రచన చేశారు. చేసి తథా సర్గశతాన్పఞ్చ షట్కాణ్డాని తథోత్తరమ్ 500 సర్గలు 6 కాండలు ఆ పైన ఉత్తర కాండ వీటితో శ్రీ రామాయణ రచన చేశారు. శ్రీ రామాయణాన్నినంతటిని దగ్గర పెట్టుకుని, ఆయన ఒక్కసారి ఆలోచించారట! చిన్తయామాస కోన్వేతత్ప్రయుఞ్ఙీయాదితి ప్రభుః ఇంత గొప్ప రామాయణాన్ని రచన చేశాను గదా! ఈ రామాయణాన్ని పాడగలిగిన వారెవరూ..? మీరు బాగా గుర్తు పెట్టుకోండి! శ్రీ రామాయణం ప్రారంభం దగ్గర్నుంచి కూడా మొదటి శ్లోకం నుంచీ కూడా వీణా నాదానికీ, తంత్రీలయ సమన్వితమై సంగీతానికి కట్టుబడింది. అసలు రామాయణాన్ని సంగీత బద్ధంగా వింటే చాలా గొప్పగా ఉంటుంది. కానీ మన దురదృష్టమేమిటంటే... కనీసం ఒక్క సర్గ, ఇవ్వాళ అసలు రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాల్నీ అలా సంగీత బద్ధంగా పాడించే ప్రయత్నంలేదు. అసలు నాకైతే అనిపిస్తుందీ... ఏనాడు వాల్మీకి మహర్షీ, ఏనాడు గాయిత్రీ, ఏనాడు సీతారాములు సంతోషిస్తారంటే కనీసంలో కనీసం ఒక్క సర్గ - ఎవరైనా సాధన చేసి దాన్ని కఛేరీగా రాగతాళములయందు ప్రవేశమున్నవారు, గురుముక తహః సంగీతం నేర్చుకున్నవారు, సామ వేదం కనుక శ్రీ రామాయణాన్ని అలా పాడగలిగితే... పక్క వాయిధ్యాలతో వీణా నాదంతో కలిపి పాడగలిగితే, నిజంగా అక్కడ సీతారాములు వచ్చి కూర్చొని విని సంతోషిస్తారు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
కాబట్టీ ఇప్పుడు ఎవరు అంత గాంధర్వ వేదం తెలిసివునవాళ్ళు. ఎవరు ఈ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలరు? అని 24 వేల శ్లోకాలతో కూడిన రామాయణ గ్రంధాన్ని దగ్గర పెట్టుకునీ... మహర్షి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూంటే తస్య చిన్తయమానస్య మహర్షేర్భావితాత్మనః ! అగృహ్ణీతాం తతః పాదౌ మునివేషౌ కుశీలవౌ !! కుశీలవౌ, మనం లవకుశులంటుంటాం. కుశీలవౌ ఎందుకంటే? ఒక గమ్మత్తుంది ఉత్తర కాండలో ఒక విషయాన్ని చెపుతారు, సీతమ్మ తల్లికీ అర్దరాత్రి వేళ ఇద్దరు మగపిల్లలు పుట్టారన్నారు ఇద్దరు మగ పిల్లలు పుడితే... భూత ప్రేత పిశాచాదులు పసి పిల్లలకు ఆపద కల్పిస్తాయి అందుకని మహర్షిని వచ్చి రక్ష పెట్టమన్నారు. రక్ష పెట్టమంటే మహర్షి లోపలికి వెళ్ళీ దర్బల్ని చేత్తో పట్టుకునీ దర్భల యొక్క పై భాగాన్ని కౌశలముతో తెంపారు పై ముక్కలు తెంపి చేత్తో పట్టుకుని మంత్రాన్ని అభిమంత్రించి పిల్లల జోలికి ఎటువంటి భూత గ్రహాలు రాకుండా అక్కడ పురటాల పసి పిల్లలుతో ఉండగా ఎంత మహర్షి అయిన దగ్గరికి వెళ్ళరు గనుక వృద్ధ స్త్రీలను పిలిచి దర్భల యొక్క పై భాగంతో రక్ష పెట్టాలంటే కవల పిల్లల్లో పెద్దవాడికి పై భాగంతో రక్ష పెట్టాలి. అందుకని పైన ఉన్న ముక్కల్ని వృద్ధ స్త్రీలకిచ్చీ రక్ష పెట్టమన్నారు. దర్భల యొక్క పై భాగంతో రక్ష పెట్టబడ్డవాడు పెద్దవాడు గనుక కుశుడు అని పిలిచారాయన్ను, కుశీలవా - దర్భల యొక్క క్రింది భాగాన్ని లవములని పిలుస్తారు. ఈ లవములను చేతిలో పట్టుకుని అభిమంత్రించి వృద్ధ స్త్రీలకు ఇచ్చినప్పుడు మొదటి వాడి తర్వాత పుట్టినవాడికి రక్ష పెట్టారు. అందుకు దర్భల యొక్క కింది ముక్కలు చేత్తో పట్టుకుని ఎవరికి రక్ష పెట్టారో వాడు రెండో వాడు, వాడు లవముల చేత రక్ష పెట్టారు కాబట్టి  లవుడయ్యాడు. కశీలవౌ ఈ రామాయణాన్ని ఎవరు గానం చేస్తారో? అని మహర్షి ఆలోచిస్తూంటే... ఆసలు రామాయణ కథా నాయిక అయిన నా తల్లి సీతమ్మ తల్లి ఆ ఆశ్రమంలో వాల్మీకి మహర్షిని తరింపజేయడానికి రామాయణ ప్రచారానికి తానే శిష్యుల్ని కూడా సిద్ధం చేసి ఇచ్చింది.
మునివేషాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలిద్దరూ వచ్చీ కళ్ళు మూసుకొని రామాయణాన్ని ఎవరు ప్రచారం చేస్తారు అనీ ఆలోచిస్తున్న మహర్షినీ తన చిన్ని చిన్ని చేతులతో ఆయన పాదాలను రెండూ పట్టుకుని నమస్కారం చేశారు కళ్ళు విప్పి చూశారు మహర్షి ఎదురుగుండా కుశలవులు కనపడ్డారు. ఆయన అనుకున్నారు ఓ...! నా తల్లి రామాయణ ప్రచారానికి కావలసిన శిష్యుల్ని కూడా నాకు ఇచ్చేసింది. ఇదీ! ఆయన మనసులోని ఆనందం అందుకని ఆయన అన్నారు కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ ! పౌలస్త్యవదమిత్యేవ చకార చరితవ్రతః !! శిష్యుల్ని చూసి సంతోషంతో చెప్తున్నారు నాయనా రామాయణ రచన చేశానురా! ఇది ఆదికావ్యం ఈ రామాయణాన్ని మీరు గానం చేయ్యాలి ప్రతీచోటా ఈ రామాయణానికి నేను పెట్టుకున్న పేర్లేమిటో తెలుసా! కావ్యం రామాయణం కృత్స్నం ఎన్ని విహిత కర్మలు చెయ్యాలో అన్ని విహిత కర్మలు చేసిన వాల్మీకి మహర్షీ కర్మ నిష్టుడైన వాల్మీకి మహర్షీ పరమ జ్ఞానియైన వాల్మీకి మహర్షీ గొప్ప తపస్వీయైన వాల్మీకి మహర్షీ వాక్యవిశారదుడైన వాల్మీకి మహర్షీ... నారదుడు, బ్రహ యొక్క అనుగ్రహము పొందినటువంటి వాల్మీకి మహర్షి అద్భుతమైన వర ప్రసాదితమైన వాల్మీకి మహర్షి రచన చేసినటువటి శ్రీ రామాయణాన్ని నేను పెట్టుకున్న పేర్లు ఇవీ అని చెప్పుకుంటుంన్నారు సంతోషంతో... వీళ్ళు నా బిడ్డలు అని పరిచయం చేసినప్పుడు తండ్రి ఎలా పొంగిపోతాడో, వీళ్ళు నా శిష్యులు అని పరిచయం చేసినప్పుడు గురువు ఎలా పొంగిపోతాడో, తాను రచన చేసిన ఆదికావ్యం యుగాలతో సంబంధం లేకుండా మనుష్య జాతిని ఉద్దరించగలిగిన ఆదికావ్యం అటువంటి కావ్యానికి పేరు పరిచయం చేస్తున్నారు కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ ! దీనికి 'రామాయణం' అని పేరు పెట్టానురా... అంటారు మొదట. రామాయణం అంటే... రామస్య ఆయనం రామాయః ఆయనం అందులోనే ఇద్దరున్నారు రామస్య ఆయనం రాముని యొక్క నడక ఆయనం అంటే కదలికలు ఎవరి మీద ఆధారపడి అన్నీ కదులుతాయే అది రామాయణం. రామాయణం ఎవరిమీద ఆధారపడి కదులుతాయి? రాముడి మీద ఆధారపడి కదులుతుంది కథంతానూ ఒక్కొక్క చోట రాముడు కనపడడు కానీ రాముడి పేరు చెప్పి కథంతా నడుస్తూంటూంది సుందర కాండలో రాముడు కనబడడు. కాని రామ నామం, రామ కథ ఒకటికి పదిమార్లు వినపడుతూంటూంది రామ కథా మృత సంజీవనీ, చచ్చిపోయేవాన్ని బతికిస్తుంది రామ కథా అటువంటి రామ కథతో నిండిపోయింది కాబట్టి రామాయణం కాదు కాదు ఆయనం అంటే కదలిక.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
కదలికా అంటే... మనం నేను కదలాలనుకోండీ నా రెండు కాళ్ళతో కదులుతాను ఒక కాలుతీసి ముందు పెట్టి ఆ కాలు మీద నా శరీరపు బరువును ఊంచుకొని రెండవ కాలు పైకెత్తి ముందుకు తెచ్చివేసి మళ్లీ రెండవ కాలు పైకెత్తి మొదటి కాలిమీద బరువూంచి రెండవ కాలు ముందుకు వేస్తే అలా కదులుతున్నటువంటి పాదముల వలన నా శరీరము కదిలి ముందుకు వెడితే ఆయనం కదలికా అంటారు. కదలికకి రెండు కాళ్ళుండాలి రెండు కాళ్ళుంటే కదులుతాం రెండు కాళ్ళు పెట్టుకుని మనం కదిలితే రాముడు కూడా రెండు కాళ్ళు పెట్టుకు కదిలాడు. బాహ్యంలో ఉన్న కాళ్ళు కావు ఒకటి సత్యము ఒకటి ధర్మము ఒక కాలు తీసివేస్తే ధర్మము రెండో కాలు సత్యము ధర్మం మీద నిలబడితే సత్యం మీద నిలబడుతాడు సత్యాన్ని పైకెత్తితే ధర్మం మీద నిలబడుతాడు. సత్యధర్మములను అనుష్టించి నడిచి ధర్మానికి మారు రూపియై రామో విగ్రహవాన్ ధర్మః అనిపించుకుని ఈ లోకానికి ధర్మ స్వరూపాన్ని తన ప్రవర్తనలచేత నిరూపించి నిర్వచించిన మహాపురుషుడు కనుక రాముని యొక్క కదలికలు చెప్పిన కథ కనుక కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ ! ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర చెప్పానూ అన్నారు.
ఏమిరామస్య ఆయనం అలాగే...  రామాయాః ఆయనం, ʻరామాʼ అంటే సీతమ్మ తల్లి, ʻరామʼ అంటే రాముడు రామా అంటే సీతమ్మ ఇద్దరు పేర్లలలో ఒదిగిపోయారు. అసలు ఎప్పుడూ అంతే... జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ వాల్లెప్పుడూ ఒకరితో ఒకరు కలిసిపోయి ఉంటారు. ఆవిడ శర్వుడైతే-ఆమె శెర్వాణి, ఆయన రుద్రుడైతే-ఆమె రుద్రాణి, ఆయన భవుడౌతే-ఆమె భవాని, ఆయన శివుడైతే-ఆమె శివాని, ఆయన రాముడైతే-ఆమె సీతమ్మ. పేర్లు కలిసిపోతాయ్ తత్వాలు కలిసిపోతాయ్ పాలలో పంచదార కలిసిపోయినట్టు కలిసిపోయే తత్వమున్నటువంటి స్వభావాలు ఆ స్వరూపాలు మరి రామ కథా అంటే సీతమ్మ కథే గా... మళ్లీ సీతాయాశ్చరితం మహత్ అని ఎందుకనాలి? అంటే పెద్ద రహస్యం ఒకటుంది రాముడు నరుడిగా పుట్టాడు ఈ లోకంలో, పుట్టి నరుడిగా ప్రవర్తించాడు కాని సీతమ్మ నరకాంతగా పుట్టినది కాదు. మనం ప్రాణి యొక్క పుట్టుక ఏ జాతికి చెందినది అని నిర్ణయించేటప్పుడు ఆ ప్రాణి పుట్టుకను ఆధారం చేసుకొని చెప్తాము. ఒక కుక్కకు పుడితే... కుక్కా! అంటాం ఒక నక్కకు పుడితే... నక్కా! అంటాం మనిషికి పుడితే... మనిషీ! అంటాం అసలు పుట్టుకే లేకపోతే? అసలు పుట్టుకే లేనిది ఈ భూ ప్రపంచంలో జరాయుద అండజ శ్వేదజ ఉగ్విజగములలోకి రాదు. మరెవరై ఉండాలి? ఆమె ఖచ్చితంగా దేవకాంత యై ఉండాలి? ఇప్పుడెవరు సీతమ్మ? సీతమ్మ అయోనిజ. ఆమె ఒక తల్లికీ తండ్రికీ - గర్భవాసం చేయడం చేత పుట్టిన తల్లి కాదు. అయోనిజగా నాగటి చాలుకు దొరికింది తనకు తాను పేరు పెట్టుకుంది ʻసీతాʼ అన్న పేరు జనకుడు పెట్టలేదు తనకు తానే పెట్టుకుంది తనకు తాను పెట్టుకునీ, జనకున్ని ఉద్దరించడానికి, జనకునికి కీర్తినివ్వడానికి దొరికింది కాబట్టీ  జానకీ అని ప్రఖ్యాతి వహించింది అటువంటి సీతమ్మ నరకాంత కాదు, కానీ నరున్ని వివాహము చేసుకొని నరకాంతగా ప్రవర్తించింది. మహా పతివ్రతగా నిలబడింది, ఒక మహా పతివ్రతగా నిలబడింది పతీవ్రతగా నిలబడినటువంటి నరకాంత ఎంత తపస్సు చేసినవాడైనా... ఎంత గొప్పవాడైనా... ధర్మం తప్పినవాడైతే తాను పాతివ్రత్యంతో నిలబడగలిగితే... పది తలలున్న రావణున్నైనా ఎలా పడగొట్టగలదో... నిరూపించింది సుందర కాండలో సీతమ్మ తల్లి.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
కాబట్టి సీతమ్మ తల్లి యొక్క చరిత్ర పుట్టవలసిన అవసరం లేని తల్లి అయోనిజగా పుట్టి, నరకాంతగా నటించి రాముడి భార్యగా సీతమ్మగా ఒక నరకాంతగా ధర్మాన్ని లోకానికి నిరూపించి చూపించి రావణ సంహారంలో భర్తకు తోడ్పడి, రాముడి యొక్క ప్రఖ్యాతికి సీతమ్మ కారణమైంది. మీకొక్క సందర్భం చెప్తాను... శబర్మతి ఆశ్రమంలో గాంధీజీ తరచూ చెప్తుండేవారు ఈ విషయాన్ని, రావణాసురుడు సీతమ్మ తల్లిని రామ లక్ష్మణులు లేనప్పుడు అపహరించి తీసుకొని వెళ్లి లంకా పట్టణంలో అశోక వనంలో శింశుపా వృక్షం క్రింద బందించి ఉంచినప్పుడు. హనుమ వెళ్ళి అమ్మా నిన్ను తీసుకెళ్లి నేను వెళ్లి మళ్లీ రామ చంద్ర మూర్తి యొక్క పాదారవిందములందు సమర్పించుకొని కృత కృత్యుడునౌతాను తల్లీ అని, వచ్చి నా భుజాల మీద కూర్చో అని అడిగినప్పుడు, సీతమ్మ తల్లి ఎగిరి గంతేసి ఆయన భుజముల మీద కూర్చొని వెళ్ళిపోయి ఉండి ఉంటే... రాముడి కీర్తి ఇవ్వాళ ఇలా ఉండి ఉండేదా! మనం రామాయణం చెప్పుకునే వాళ్లమా? ఆవిడ ఒక్క మాటంది, నువ్వే కాదయ్యా పుత్ర సమానుడైన సరే రాను. రాముడే రావాలి నన్ను తీసుకెళ్లాలి తప్ప, పర పురుషుడని తెలిసి తెలిసి నేను మాత్రం ముట్టుకుని వెనక్కి రాను. రాముడే వచ్చి నన్ను తీసుకెళ్లాలి రాముడే రావణ సంహారం చెయ్యాలి ఆ తల్లి రామునియందు అంత గొప్ప ప్రేమ ప్రకటనం చేసి పాతివ్రత్యాన్ని నిరూపించుకొనబడింది కనుక, ఇప్పటికీ లోకంలో ఓర్పు అంటే మా అమ్మ సీతమ్మే... మాత అంటే మా అమ్మ సీతమ్మే, చిరునవ్వు అంటే మా అమ్మ సీతమ్మే, లావణ్యం అంటే మా అమ్మ సీతమ్మే, అనువర్తించడం అంటే మా అమ్మ సీతమ్మే, బిడ్డల్ని గారాబంగా చూడ్డం అంటే మా అమ్మ సీతమ్మే, ఒక కోడలంటే మా అమ్మ సీతమ్మే, ఒక కూతురంటే మా అమ్మ సీతమ్మే.
వాల్మీకి కావ్యానికి కథా నాయికియై, అపారమైన కీర్తిగడించి ఇప్పటికి లోకంలో లక్ష్మీ అంటారు, రుక్మినీ అంటారు, జాంబవతీ అంటారు. సీతా అని మాత్రం ఎవ్వరూ అనరు సీతమ్మా...! అంటారు. పక్కన అమ్మ తనాన్ని పేరులో కూడా చెర్చుకొనేటట్టుగా రాసీ భూతమైన కారుణ్య స్వరూపంగా ఈ లోకంలో ప్రకాశించినటువంటి తల్లి యొక్క చరిత్ర నేను చెప్పానన్న ఆనందాన్నిచెప్పకుండా ఉండలేక ఆ తల్లి ఈ ఆశ్రమంలో వచ్చి ఉండబట్టి గదా ఈ రామాయణం చెప్పే అదృష్టం నాకు దొరికింది.  ఇది ప్రచారం చేయడానికి  నాకు శిష్యుల్ని కూడా ఇచ్చింది నా తల్లి... ఆ ఆనందంతో కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ ! పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రతః !! పౌలస్త్య వధ- పౌలస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవనుడు,  వైశ్రవనుడి యొక్క కుమారుడు విశ్వవసు బ్రహ్మ, ఆ విస్వవసు బ్రహ్మ కుమారుడు రావణ బ్రహ్మ. కాబట్టి ఆ పౌలస్త్య వంశంలో పుట్టినటువంటి రావణ సంహారాన్ని చెప్పినటువంటి కథ కాబట్టీ... ఈ మూడు పేర్లతో నేనీ రామాయణాన్ని పిలుచుకుంటున్నానయ్యా. 


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితమ్ ! జాతిభిస్సప్తభిర్భద్ధం తన్త్రీలయసమన్వితమ్ !!
రసైశ్శృఙ్గారకారుణ్యహాస్యవీరభయానకైః ! రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతామ్ !!
తౌ తు గాన్ధర్వతత్త్వజ్ఞౌ మూర్చనాస్థానకోవిదౌ ! భ్రాతరౌ స్వరసమ్పన్నౌ గన్ధర్వావివ రూపిణౌ !!
రూపలక్షణసమ్పన్నౌ మధురస్వరభాషిణౌ ! భిమ్భాదివోద్ధృతౌ రామదేహాత్తథాపరౌ !!   
తంత్ర మధ్యమ తార స్థాయిలో గాణం చెయ్యగలిగినటువంటి వాళ్ళు, బింబము నుంచి వచ్చిన ప్రతి భింబములా రామ చంద్ర మూర్తి యొక్క కాంతితో వచ్చినటువంటి, రామ చంద్ర మూర్తి బిడ్డలైనటువంటి లవకుశులు. గొప్ప కంఠమున్న వాళ్ళు, భక్తి ఉన్న వాళ్ళు, పారవశ్యమున్న వాళ్ళు, సంగీత విద్య నేర్చుకున్న వాళ్ళు, స్వరం తెలిసున్న వాళ్ళు, లయ తెలిసున్న వాళ్ళు, వాద్య పరికరములు ఎలా మోగుతాయో వాటితో ఎలా కలిపి పాడాలో తెలిసున్న వాళ్ళు మీవంటి శిష్యులు లభించడం నా అదృష్టం. నాయనా! మీరు రామాయణాన్ని అన్ని చోట్లా పాడి, మీ ఇద్దరూ రామాయణాన్ని ప్రచారం చేయండీ అని అన్నాడు మహర్షీ.
బాగా గుర్తు పెట్టుకోండీ! రామాయణ ప్రవచనం దేనికొరకో? రామాయణ ప్రవచనం ధర్మం విస్తరించుట కొరకు తప్పా! లవకుశుల్ని దీని కొరకు నువ్వు రామాయణాన్ని ప్రచారం చెయ్యమని ఎప్పుడూ వాల్మీకి మహర్షి చెప్పలేదూ... ఎవరం రామాయణం చెప్పినా ఇది గుర్తు పెట్టుకోవాలి! రామాయణం దేని కొరకు కేవలం ధర్మ ప్రచారం కొరకురామా!... అని అనడం, రామాయణం చెప్పడం, కొన్ని కోట్ల జన్మల తరువాత జరిగేటటువంటి సౌభాగ్యం అంత గొప్ప సౌభాగ్యాన్ని పనికి మాలిన వస్తువుల కోసం అమ్ముకుంటామా! ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి పురంబులు, వాహనంబులున్, సొమ్ములుగొన్ని పుచ్చికొని, చొక్కి, శరీరము వాసి, కాలుచే, సమ్మెట వ్రేటలంబడక, సమ్మతితో శ్రీహరికిచ్చి చెప్పెనీ, బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ అంటాడు పోతనగారు భాగవతంలో... రామాయణం అనేటటువంటిది ధర్మ వ్యాప్తి కొరకు చెప్పుకోబడెటటువంటి ఆది కావ్యం. కాబట్టి ఈ రామాయణాన్ని మొదట ఎక్కడ గానం చేశారంటే... లవకుశులు ఆశ్రమంలో చుట్టూ ఉన్నటువంటి మునుల మధ్యలో గానం చేశారు వాళ్లందరూ విన్నారు ఎంత తన్వయత్వాన్నో పొందేశారు. ఇప్పుడు ఇంత తన్వయత్వం పొందినటువంటి మునులూ... ఆ ఆనందం ఆగలేదు ఏదో ఒకటి పిల్లలకి బహుమానం ఇవ్వాలి, అపారమైన సంతోషం కలిగిందనుకోండీ! ఏదో ఒక బహుమానం ఇవ్వాలి ఇవ్వకుండా ఉండలేరు ఏమిస్తారు వాళ్ళు కాబట్టి వారెంచేశారంటే... ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ ! ఒకాయన గబగబా తనదగ్గరున్న కలశాన్ని తీసి చేతిలో పెట్టాడట. నాయనా ఈ కలశ పాత్ర తోటి సంధ్యావందనం చేసుకోరా! అని ఒక కలశ చేతిలో పెట్టేశాడట, ఇంకో ఆయన... ప్రసన్నో వల్కలం కశ్చి ఒకాయన గబగబా తాను కట్టుకునేటటువంటి ఆ ముని వల్కాలుంటాయే?.. బట్టలు ఒక జత తీసి ఇచ్చి ఒరే నాయనా ఈ బట్టలు కట్టుకోండిరా! అని ఇచ్చేశారట ద్దదౌ తాభ్యాం మహాయశాః !! ఒకాయన కృష్ణాజనం ఇచ్చేశాడట, ఒకాయన మేఖల ఇచ్చేశాడట, ఒకాయన మౌంజీ ఇచ్చాడట బ్రహ్మచారులకు కావలసినటువంటి వస్తువులన్నీ అంటే... ఏనుగులు గుర్రాలు ఇవ్వకూడదు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
గొడుగో, జన్నిదమో, కమండలువో, నాకున్ ముంజియో, దండమో వడుగేనెక్కడ? భూములెక్కడ ? కరుల్, వామాక్షు లశ్వంబులెక్క ? నిత్యోచిత కర్మమెక్కడ ? మదాకాంక్షామితంబైన మూ డడుగుల మేరయ త్రోవ కిచ్చుటదె బ్రహ్మండంబు నా పాలికిన్ అంటాడు వామన మూర్తి, భలి చక్రవర్తి దగ్గరికి వచ్చి బ్రహ్మచారి ఆశ్రమ నియమం ప్రకారం తనకు పనికొచ్చేదే పుచ్చుకోవాలి కాబట్టి ఒకాయన దండమిచ్చాడు ఒకాయన మౌంజీ ఇచ్చాడు ఒకాయన మేఖలా ఇచ్చాడు ఒకాయన వల్కములిచ్చాడు ఒకాయన కలశ పాత్ర ఇచ్చాడు యజ్ఞోపమీతము ఇచ్చాడు వాళ్ళందరూ పొంగిపోయి వాళ్ళందరన్నారూ... ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సమ్ప్రకీర్తితమ్ ! పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమమ్ !! అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ! ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతిమనోహరమ్ !! ఏమి ఆశ్చర్య కరమైనవీ వ్యాఖ్యానం రా నాయనా! అద్భుతము రామాయణం ఆపాతమధురం, ఆదికావ్యం రాబోయేటటువంటి తరాలలో కవులందరికీ శ్రీ రామయణం ఆదర్శమవుతుంది. ఈ రామాయణం ఎక్కడ చెప్పబడుతుందో ఎక్కడ చదువుతారో అక్కడక్కడల్లా ఆయుష్యం అపమృత్యుదోషం పోయి, పూర్ణమైనటుంటి ఆయుష్యు కలుగుతుంది.
సమస్తమైనటువంటి వేదముల యొక్క సారాంశము ఈ రామాయణంలోకి వచ్చింది ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్తత్ర గాయకౌ ! రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజః !! రాజ మార్గాలలో, రాజ వీధులలో పెద్ద పెద్ద కూడళ్ళలో నిలబడి లవకుశులిద్దరూ ఆ శ్రీ రామాయణ గానం చేస్తూ ఉండేవారు. ఎక్కడ చూసినా అందరూ ఆ రామాయణ గాధ విని పొంగిపోతున్నారు. ఒకానొకనాడు భరతాగ్రజుడే చూశాడు. ఎవరు భరతాగ్రజుడు రామ చంద్ర మూర్తి చూశాడు 'అబ్బా... ఏమి రామాయణం ఏమి రామాయణం' పిల్లలిద్దరూ ఎంత బాగా పాడుతున్నారు..? ఆయనకు తెలుసా తన పిల్లలేననీ అంటే తెలియదు ఎంతో పొంగిపోయారు. అంతః పురానికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి కూర్చో బెట్టారు భరతున్ని శత్రుజ్ఞున్ని లక్ష్మణున్ని కౌశల్యనీ సుమిత్రనీ కైకేయినీ మంత్రులనీ అందర్నీ పిలిచారు వినండి! వినండి! వినండి! వీళ్లింద్దరూ పిల్లలూ వీరు రామాయణం పాడుతున్నారు నేను అటుగా వస్తూ విన్నాను పిల్లలు ఎంత మనోహరమైన కంఠాలతో పాడుతారు... వాళ్ళు పాడుతారు ఎవ్వరూ మాట్లాడ కుండా వినండీ అన్నాడు. అందరూ వింటున్నారు కుశలవులిద్దరూ గానం చేస్తున్నారు రామ చంద్ర మూర్తి కన్నులు మూసుకొని తన కథ తాను వింటూ తనలో తాను రమిస్తున్నాడు భగవంతుడే తన కథ తాను వింటూ తాను పొంగి పోయిన కథ రామ కథా! అటువంటి అమృత ధారయైనటువంటి రామ కథా ప్రవచనాన్ని కుశలవులు శ్రీ రామాయణంగా ప్రారంభంచేశారు దాన్ని వాల్మీకి మహర్షి ప్రారంభం చేస్తున్నారు ఆయనంటారూ... అయోధ్యానగరాన్ని మొట్టమొదట వర్ణన చేస్తున్నారు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
కోసలో నామ ముదితస్స్పీతో జనపదో మహాన్ ! నివిష్టస్సరయూతీరే ప్రభూతధనధాన్యవాన్ !!
అయోధ్యా నామ నగరీ తత్రాఽఽసీ ల్లోక విశ్రుతా ! మనునా మానవేన్ద్రేణ యా పురీ నిర్మితా స్వయమ్ !! 
ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ ! శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్తమహాపథా !!
రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభితా ! ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః !!
తాం తు రాజా దశరథో మహారాష్ట్రవివర్థనః ! పురీమావాసయామాస దివం దేవపతిర్యథా !!
ఒకానొకప్పుడు కోసల దేశమనేటటువంటి దేశం ఉండేది. ఆ దేశము చాలా విస్తీర్ణమై విశాలమైనటువంటి దేశం. అటువంటి దేశం సరయూ తీరంలో దాని రాజధానియైనటువంటి అయోధ్యా నగరం ఉండేది. ఆ అయోధ్యా నగరాన్ని ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మనువు స్వయంగా నిర్మించినటువంటి గొప్ప నగరం. ఈనాడు మోక్షపురుల్లో అయోధ్య ఒకటి. అది 12 యోజనముల పొడవు 3 యోజనముల వెడల్పు కలిగినటుంటి గొప్ప పట్టణం. రాజ మార్గములు గొప్ప గొప్ప వీధులు మార్గముల క్రింది అది విభాగము చేయబడి ఉండేది. ఎప్పుడు దాన్ని నీళ్ళు చల్లి ఉంచేవారు దాని మీద పువ్వులు చల్లి ఉంచేవారు మంచి సువాసనలతో ఉండేది గొప్ప గొప్ప కవాటములు ఎక్కడ చూసినా దానికి అగర్తలు ఆపైన శతజ్ఞులను అమర్చి ఉంచేవారు. శత్రు దుర్భేజ్యమైనటుంటి పట్టణం సూతమాగధసమ్బాధాం శ్రీమతీ మతులప్రభామ్ ! ఉచ్చాట్టాలధ్వజవతీం శతఘ్నీశతసజ్కలామ్ ! ! సూత మాగదులూ బృందములు బృందములుగా అక్కడ ఉండేవారు సూతుడూ మాగధీ అని ఇద్దరుంటారు వాళ్ళిద్దరూ రాజు గారి పక్కన నిలబడి ఉంటారు సూతుడు ఎప్పుడూ ఎం చేస్తాడంటే…? రాజు యొక్క వంశాన్ని కీర్తిస్తుంటాడు.
నీ ముందువాళ్ళు ఎటువంటి వారు, మీ తాత గారు ఎటువంటి వాడు, ముత్తాత గారు ఎటువంటివారు, నీవంశ కర్త ఎటువంటి వారు అని కీర్తన చేస్తుంటారు. ఎందుకు చేస్తారంటే..? ఒక్కటే కారణం సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు న్యాయాన్ని పరిపాలన చేస్తాడు శిక్షలు వేస్తాడు ఆయన పక్షపాతానికిలోనై ధర్మాన్ని విస్మరించాడనుకోండీ... ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి ధర్మమునందు తాను నిలబడాలి అంటే... తన వంశము ఎంత గొప్పదో తెలిసి ఉండాలి కాబట్టి సూతుడు కీర్తన చేస్తాడు, మాగది అంటే రాజు సాధించినటువంటి విజయములను స్తోత్రం చేస్తుంటాడు కాబట్టి ఇప్పుడు తాను అపకీర్తి తెచ్చుకోకుండా ఆ విజయములు ఎలా సాధించాడో అటువంటి కీర్తిని, పెంచుకొనేటటువంటి రీతిలో తన ప్రవర్తన ఉండేటట్టుగా రాజు తనను తాను నియంత్రించుకొనేటటువంటి అవకాశం వాటివల్ల కలుగుతుంది. అంతేకాని ఇద్దరు మనుష్యుల్ని పెట్టుకుని అదేపనిగా పొగిడించుకొనే ప్రక్రియ కాదు అందుకని ఉంటారు సూత మాగదులు అక్కడా సామస్తరాజసజ్ఞైశ్చ బలికర్మభిరాఽఽవృతామ్ ! నానాదేశనివాసైశ్చ వణిగ్భిరుపశోభితామ్ !! అనేక మంది సామంత రాజులు అయోధ్యా నగరానికి వచ్చేవారు కప్పం కట్టడానికి వచ్చినటువంటి రాజులుండేవారు అనేక దేశాల్నుంచి వచ్చినవారుండేవారు. వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వర్తకులుంటుండేవారు అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి ఆనేకములైనటువంటి హర్మ్యములు సౌధములూ గృహములూ నిర్మింపబడి ఉండేవి.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
అక్కడ ఉండేటటువంటి ప్రజల గొప్ప తనమేమిటంటే... వాళ్ళు మహా రథులు ఎంత మందినైనా బాణములు పెట్టి కొట్టగలరు కానీ వాళ్లకొక నీయమము ఉండేదట యే చ బాణైర్న విధ్యన్ని వివిక్తమపరాపరమ్ ! శబ్దవేధ్యం చ వితతం లఘుహస్తా విశారదాః !! తండ్రిలేని వాన్ని కానీ బిడ్డలు లేని వాన్ని కానీ అటువంటి వాణ్ణి చంపేవారు కాదట ముందు వెనకాల ఎవరూ లేరు కాబట్టి ఆర్థి చెందినవాన్ని కాని వెన్ను చూపి పారిపోతున్నవాన్ని కాని అటువంటి వాణ్ణి ఎన్నడూ బాణం పెట్టి కొట్టేవారు కాదట క్రూర మృగాల్ని వేటాడేటప్పుడు బాణంతో వేటాడేవారట పిడిగుద్దులు గుద్ది చంపి కూడా క్రూర మృగాలను సంహరించేవారట. అంటే నీతి నియమాలకు కట్టుబడినటువంటి ప్రజలతో సంపదలతో వర్ధిల్లుతున్నటువంటి దేశం కోసల దేశం.
తస్యాం పుర్యామయోధ్యాయాం వేదవిత్సర్వసఙ్గ్రహః ! దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపదప్రియః !!
ఇక్ష్వాకూణామతిరథో యజ్వా ధర్మరతో వశీ ! మహర్షికల్పో రాజర్షిస్త్రిషు లోకేషు విశ్రుతః !!
బలవాన్నిహతామిత్రో మిత్రవాన్విజితేన్ద్రిః ! ధనైశ్చ సంగ్రహై శ్చాన్యైః శక్ర వైశ్రవణోపమః !!
యథా మనుర్మహాతేజా లోకస్య పరిరక్షితా ! తథా దశరథో రాజా వసఞ్ఙగదపాలయత్ !!
ఆ రాజ్యాన్ని అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు వేదం చదువుకొన్నటువంటి వాళ్ళనీ శూరులైనవాళ్ళనీ పండితులైనవాళ్ళనీ ఉదారముగా దక్షిణములనిచ్చి కానుకలనిచ్చీ వశం చేసుకొన్నటువంటివాడు. ఆయన దీర్ఘదర్శీ ఎప్పుడో జరుగుబోయేటటువంటి విశయాన్నీ ఇప్పుడే లెక్క కట్టగలిగినటువంటి సునిషితమైన మేధా సంపత్తి ఉన్నవాడు అతిరథో అంటే ఏక కాలంలో అనేక మంది రథులతో యుద్ధం చేయగల నేర్పరి యజ్వా అంటే అనేక రకములైన యజ్ఞములను చేసినటువంటి వాడు ధర్మరతో వశీ అంటే ధర్మాన్ని నిరంతరం ఆచరించే స్వభావం ఉన్నవాడు మహర్షికల్పో రాజర్షిస్త్రిషు లోకేషు విశ్రుతః ఆయనా మహర్షి తుల్యమైనటువంటి వాడు. రాజర్షి ముల్లోకములలోనూ సుప్రసిద్ధమైనవాడు బలవాన్నిహతామిత్రో అమిత్రులైనటువంటివారిని అంటే శత్రువులందరినీ కూడా నిగ్రహించినటువంటి వాడు మిత్రవాన్విజితేన్ద్రిః మంచి ధైర్యమున్నవాళ్లు బలవంతులు మిత్రులుగా గలిగినవాడు విజితేన్ద్రిః ఇంద్రియములను నిగ్రహించినవాడు ధనైశ్చ సజ్ఞహైశ్చాక్రవైశ్రవణోపమః  ధనాన్ని అనేకమైన ఇతర వస్తువుల్ని ఎన్నింటిని సేకరించ గలిగాడంటే... శ్చక్రవైశ్రవణోపమః శ్చక్రవైశ్రవణోపః శక్రహ అంటే ఇంద్రుడు, వైశ్రవణుడు అంటే కుభేరుడు ఇంద్రుడు కుభేరుడు ఎంత ఐశ్వర్యవంతులో అంతటి ఐశ్వర్య వంతుడు యథా మనుర్మహాతేజా లోకస్య పరిరక్షితా  మనువు ఇక్ష్వాకు వంశంలో ఎలా పరిపాలన చేశాడో అంత ధర్మ బద్ధంగా పరిపాలన చేసినటువంటి మహానుభావుడు.
ఆ అయోధ్యా నగరంలో కామీ వా న కదర్యో వా సృశంసః పురషః క్వచిత్ ! ద్రష్టుం శక్యమయోధ్యాయాన్నా విద్వాన్న చ నాస్తికః !!  ఇది చాలా ప్రధానమైన విషయం. సంపత్తి ఎంత ఉన్నదీ అన్నది కాదు ప్రజల యొక్క నడవడి ఎలా ఉన్నదీ అన్నది చాలా ముఖ్యం ప్రభువు యొక్క పరిపాలనలో ధర్మం ఎలా ఉంటుందీ అన్నది ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి తెలుసుకోవచ్చు. అక్కడా విచ్చలవిడి కామంతో ధర్మ బద్ధం కాని కామంతో ప్రవర్తించేటటువంటివాడు ఉండడట లోభియైనవాడు ఉండడట ఎక్కడా కూడా విద్వాంసుడు కానివాడు ఉండడట ఎక్కడా కూడా నాస్తికుడైనటువంటి వాడు ఉండడట సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాస్సుసంయతాః ! ఉదితాశ్శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః !! మహర్షులు ఎలా నిర్మలమైన మనస్సుతో ఉంటారో...


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఆ రాజ్యంలో ఉండేటటువంటి స్త్రీలు కానీ పురుషులుకానీ అంత చక్కటి మనస్సుతో అంత నిర్మలమైన జీవితాన్ని చేస్తున్నవారు నాకుణ్డలీ నామకుటీ నాస్తరగ్వీ నాల్పభోగవాన్ ! నామృష్టో నానులిప్తాఙ్గో నాసుగన్ధశ్చ విద్యతే !! ఇది చాలా చమత్కారమండీ! వాల్మీకి రచనలో నాకుణ్డలీ చెవులకు కుండలాలు పెట్టుకోని వాడు ఎవ్వడూ లేడట. నామకుటీ పైన తలకీ ఆ బట్ట కట్టుకోనటువంటి వాడు ఎవ్వడూ లేడట నాస్తరగ్వీ నాల్పభోగవాన్ ఎవ్వరూ అల్ప భోగమును అనుభవించినవాడు లేడు కడుపునిండా అన్నం తినని వాళ్ళు లేరు అక్కడా నామృష్టా అభ్యంగన స్నానం చెయ్యని వాళ్ళు లేరు నానులిప్తాఙ్గో చక్కగా ఒంటికి చందనాదులు పూసుకోనటువంటి వారు లేరట నాసుగ్ధశ్చ విద్యతే చక్కగా లలాటమునుందు బొట్టు పెట్టుకోనటువంటి వాడు లేడు అందరూ అలా ఉండేవారట. ఇక్కడ మీరు ఒకటి గమనించండీ! ఇదంతా బాగానే ఉందికానీ అల్పభోగవాన్ అంటే ఎలా కుదురుతుందండీ... అల్పభోగవాన్ అంటే తక్కువ భోగమనుభవించే వాడు ఎవ్వడూ లేడట, తక్కువ భోగం అనుభవించ కుండా ఉండటం ఎలా కుదురుతుందీ... అంటే మీకు నేనొటి చెప్తాను.
నాకు ఒక సారీ... వెంకటాచలంలో ఒక మహానుభావుడు కనబడ్డాడు. ఆయన ఒకళ్ల ఇంటికెళ్ళీ అమ్మా నాకింత అన్నం కొంచెం పెరుగూ పెట్టండమ్మా చాలూ అని అడిగాడట. అడిగితే ఆయన చాలా ఆకలి మీద ఉన్నాడు ఆవిడా ఇంత అన్నం వండీ ఆయన ఎక్కడా భోజనం చెయ్యడూ... ఇంత అన్నం వండీ ఇంత పెరుగు ఇచ్చింది ఇస్తే... ఆయన దానిని నివేదన చేసుకొని దేవతార్చన చేసుకొని, భోజనం చేశాడు. ఆయన నాతో ఒసారి మాట్లాడుతూ అన్నారూ... పెరుగు వేసుకొని అన్నం తినేస్తే... ఈశ్వరుడు సంతోషం చేస్తాడండీ ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టే అన్నాడు. నే నన్నీ తినేసినట్టే అని ఆయన అనలేదు ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టే నండీ అన్నాడు నాకు ఆమాట చమత్కారంగా అనిపించి నేను అన్నాను ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టు ఎలా అవుతుందండీ అన్నాను. ఎన్ని పెట్టినా ఆఖరునకి పెరుగువేసి పెడతాముగదా కోటేశ్వరరావుగారు అన్నారు. నేను పెరుగేసి పెట్టేస్తే ముందు మిగతావన్నీ పెట్టేసినట్టే అనుకుంటాడు ఈశ్వరుడు అందుకె నేను పెరుగేసుకు తిన్నానండీ అన్నాడు.
పెరుగేసుకు తినడం తాను తినడం కాదు అహం వైశ్వా నరో భూత్వాః ప్రాణీనాం దేహ మాశ్రితః ! ప్రాణీనా సమాయుక్తః పచమ్యన్నం చతుర్విధం !! ఇక్కడున్నవానికి నేను అన్నీ ఇచ్చేశాను ఇదీ నాల్పభోగీ నేను తక్కువ భోగంలో ఉన్నానూ అన్న భావన వానిలో ఉంటే వాడు తక్కువ భోగంలో ఉన్నారని మీరనాలి. ఎవరికి వాడు తృప్తిగా ఉన్నారనుకోండీ ఈశ్వరుడు నా కేమివ్వలేదు అని అనుకున్నాడనుకోండి, ఇంకా వాడు తక్కువ భోగంలో ఉన్నాడని ఎలా అనుకుంటారు. ఏమండీ పాపం మీకు ఏసి లేదే అన్నారనుకోండీ! ‘ఎసిలేక పోవడమేంటండీ బాబూ... మాకు ఎంత గాలో తెలుసా..! చూశారా ఎదురుగుండా రావి చెట్టు, మఱ్ఱి చెట్టు, సంపంగి చెట్టు అబ్బో.. ఎంత సువాసనలో... కోటేశ్వరావుగారు మీరు ఒక్క రోజు ఈ అరుగు మీద మంచం వేసుకొని పడుకున్నారంటే, ఇంకా ఎప్పుడూ ఎసిలో పడుకోరు అంటారు. రాత్రయ్యేటప్పటికి పారిజాత పువ్వులు విరుస్తాయీ... వాటినుంచి సువాసన వస్తుందండీ..! జాజి  పందిరినించీనీ, తెల్లవారేటప్పటికి కోయిలలు అరుస్తుంటాయి, చిలకలరుస్తుంటాయి. మీకు వెంకటేశ్వర సుప్రభాతంలో వినబడినట్లు, శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో వినబడినట్లు, ఆ చిలుకల అరుపులు, కోయిలల అరుపులు ఆ బృంగముల యొక్క ధ్వనులూ ఇవన్నీ వింటూ మీరు చక్కగా నిద్రలేవచ్చు తెలుసా ఆకాశ సింధు కమలాని మనోహరాణి, ఆదాయ పాదయుగ మర్చయుతుం ప్రపన్నాః అని చదవడం కాదు మా ఇంట్లో మంచం మీద పడుకొని ఇలా నిద్రలేచేటప్పటికి ఎర్ర బడుతున్న ఆకాశం ఉదయిస్తున్న సూర్య బింబం ఇవన్నీ కనబడుతుంటే, దూరంగా మా ఇంటి కిటికీ లోంచి సముద్రం కూడా కనబడుతుంది చూశారా... ఇది మా వైభవం అని అన్నరనుకోండీ... ఆయనకు అక్కడ అరుగుమీద ఫ్యాను గూడా లేదు. ఏమండీ మరి దోమలు పీకుతున్నాయి గదాండీ మీఇంట్లో అన్నారనుకోండీ అవి ఏమిటనుకొంటున్నారూ... అవి సాక్షాత్తుగా ఉపనిషత్ స్వరూపాలు స్మృతులకు చివరుంటాయి. చెవులకు కరుస్తుంటాయి అవి విష్ణుతత్వం సర్వవ్యాపకత్వం రాత్రనక పగలనకా అన్ని చోట్లా ఉంటాయి ఏమండీ నా కింత పెట్టినవాడు నా నెత్తుటి చుక్క తాగితే, మరి ఆయన నాకూ పెట్టాడు నాలోంచి దానికి పెట్టాడు. పొనీలెద్దురు నా అంత నేను ఎవ్వరికీ పెట్టలేను అదేదో ఆ నెత్తుటి చుక్క తాగే అదృష్టం ఇలాగైనా దొరికింది అన్నాడనుకోండీ ఇంక ఆయన్ని ఏమంటారండీ! ఏం లేదని మీరంటారు చెప్పండి నాకు ఇది నాల్పభోగవాన్ అంటే ప్రజల యొక్క మనః స్థితిని ఆవిష్కరిస్తుంది.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఇది వాల్మీకి మహర్షి రచన అంటే... అంత గొప్పగా ఉంటుంది నాకుణ్డలీ నామకుటీ నాస్తరగ్వీ నాల్పభోగవాన్ ! నామృష్టో నానులిప్తాఙ్గో నాసుగన్ధశ్చ విద్యతే !! నామృష్టభోజీ నాదాతా నాప్యనఙ్గదనిష్కధృక్ ! నాహస్తాభరణో వాపి దృశ్యతే నాప్యనాత్మవాన్ !! ఆత్మ జ్ఞానము లేనివాడు అక్కడ లేడట కడుపారా హాయిగా భోజనం చేయ్యకుండని వాడు అక్కడ లేడట. ఒకడికి పెట్టకుండా తినేవాడు ఎవరూ లేడట నాప్యనఙ్గదనిష్కధృక్ చేతులకు ఆభరణాలు మంచి కంకణాలు వేసుకోని వాడు కంఠానికి హారాలు వేసుకోనివాడు ఆ ఊరిలో ఏవరూ ఉండరట అంటే అందరూ ఐశ్వర్యంతోటి గుణములతోటి ధర్మంతోటి శోభిల్లుతున్నటువంటి వాళ్ళు స్వకర్మనిరతా నిత్యం బ్రాహ్మణా విజితేన్ద్రియాః ! దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ పరిగ్రహే !! అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు ఎప్పుడూ స్వకర్మాచరణమునందు అనురక్తి కలిగిఉండి, ఎవడు ఏమిస్తే అది పుచ్చుకొందామనే ఆర్తితో ఉండేవాళ్ళు కారట మనమే వారికేంపెడదామని చూస్తుండేవారట. తప్పా మనమెప్పడు దానం పుచ్చుకుందామనే ప్రయత్నం ఉన్న బ్రాహ్మణులు కారట. అటువంటి చోట దశరథ మహారాజు గారు పరిపాలన చేస్తున్నారు. ఇంత గొప్పగా పరిపాలన ఎలా చేయగలిగాడు అంటే ఆయన దగ్గరున్న మంత్రులు అటువంటి వాళ్ళు.
అష్టౌ బభూవుర్వీరస్య తస్యామాత్యా యశస్వినః ! శుచయశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః !!
ధృష్టిర్ఙయన్తో విజయస్సిద్ధార్థో హ్యర్థసాధకః ! అశోకో మన్త్రపాలశ్చ సుమన్త్రశ్చాష్టమోభవత్ !!
ఎనమండుగురు మంత్రులు ప్రధానులైన మంత్రులుగా ఉండేవాళ్ళు ధృష్టీ, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. ఎనమండుగురు మంత్రులు ప్రధాన మంత్రులుగా ఉండి రాజ్య పాలన చేస్తుండేవాడు. వాళ్ళు ఎప్పుడూ రాజ కార్యం సాధించడంలో శ్రద్ధాళువులై ఉండేవారు వసిష్ఠో వామదేవశ్చ మన్త్రిణశ్చ తథాపరే !! (ఋత్విజౌ ద్వాషభిమతౌ తస్యాస్తాషిసత్తమౌ ! వసిష్ఠో వామదేవశ్చ మన్త్రిణశ్చ తధాపరే !!) ప్రధాన పురోహితులుగా వశిష్టుడు, వామదేవుడూ ఉండేటటువంటివాళ్ళు విద్యావినీతా హ్రీమస్తః కుశలా నియతేన్ద్రియాః ! శ్రీమన్తశ్చ మహాత్మానశ్శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః !! కీర్తిమన్తః ప్రణిహితాః యథావచనకారిణః ! తేజః క్షమాయశః ప్రాప్తా స్మితపూర్వాభి భాషిణః !! ఆ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విద్యా


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
వినయ సంపన్నులు. వాళ్ళు ఏ ఏ పనులు చేయాలో ఆయా పనులకు సంబంధించిన విషయాలన్నీ పరిపూర్ణంగా తెలిసున్నవాళ్ళు. అంతే తప్పా అసలు దానిగురించి ఏమి తెలియకుండా మంత్రై పోయినవాళ్లు కాదు. పరిపూర్ణంగా ఆ విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్న వాళ్ళు ఆ మంత్రిత్వాన్ని నిర్వర్తిస్తుండేటటువంటి వాళ్ళు. వాళ్ళు అన్నిటికన్నా గొప్ప విషయమేమిటో తెలుసాండీ... ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాళ్ళు. సహజముగా వారు గొప్ప ఐశ్వర్య సంపన్నులు అటువంటి వాళ్ళు సుచయక్తాను రక్తాశ్చా గొప్ప సుచి కలిగినవాళ్ళు, సుచికలిగినవాళ్ళు అంటే పారదర్శకతతో పని చేసేటటువంటి వాళ్ళు తప్పా ఈ పని మనం చేస్తే మనకేమొస్తుందనే ఆలోచన అసలు లేనివాళ్ళు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బంధు ప్రీతి, లంచగొండితనమూ, ఆశ్రిత పక్షపాతము, సంకుచితత్వము ఇటువంటి దుర్గుణములకు దూరముగా ఉండేటటువంటి వారు, ధర్మానికి కట్టుబడి పని చేసేటటువంటి వాళ్ళు కుశలా వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః ! ప్రాప్తకాలం తు తే దణ్డం ధారయేయుస్సుతేష్వపి !! వారు ఎంత కౌశల్యము కలిగినవారంటే కౌశల్యము అనే మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. కౌశల్యము అంటే ఏమిటో తెలుసాండీ! ఎక్కడ వరకు దేన్ని వాడాలో అక్కడ వరకు మాత్రమే దాన్ని వాడగలిగితే దాన్ని కౌశలము అంటారు. కుశ అంటే దర్భా- దర్భని ఎంత వరకు త్రుంచాలో అంత వరకే త్రుంచాలి అవసరం లేకపోయినా కట్ట కట్టుకొని వెళ్ళిపోవడం పనికి వచ్చినా పనికి రాక పోయిన దర్భను తుంచి వేయడం ఇటువంటి పనులు చేయకూడదు ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వాడుకోగలిగిన ప్రజ్ఞకి కౌశలమని పేరు. వాడు అన్యాయం చేయలేదు తప్పు చెయ్యలేదు అంటే శత్రువని తెలిసినా వారు శిక్ష వేయ్యరు. తన కొడుకే అని తెలిసిన తప్పు చేసిన వానిని శిక్ష వెయ్యకుండా ఉండరు. అటువంటి ధర్మాత్ములైనటువంటి మంత్రులు అయోధ్యాధి పతియైనటువంటి ఆ దశరథ మహారాజు గారికి సహయం చేస్తూండేవాళ్ళు పరిపాలనలో గురోర్గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విదేశేష్వపి విజ్ఞాతాస్సర్వతో బుద్ధినిశ్చయాత్ !! ఇది చాలా చాలా గొప్ప మాటండీ రామాయణంలో తల్లిదండ్రులు గురువులు పెద్దలూ మొదలైనటువంటి వారికి సంబంధించినటువంటి గుణములను తాము గ్రహించి స్తోత్రం చేసి అనుష్టించడానికి ఆదర్శంగా స్వీకరించారు తప్పా మంత్రులు వారియందు దోషములు ఉన్నా వీరు చూసేవారు కాదు మాట్లాడేవారు కాదు.
నాకు ఈ మాట చెప్తుంటే ఒక మాట గుర్తుకు వస్తుందీ... చంద్ర శేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడూ... నేను మా నాన్న గారిని చాలా జాగ్రత్తగా చూస్తాను శభాశ్!  మా నాన్న గారిని ఎంతో గౌరవిస్తాను శభాశ్! మా నాన్న గారికి నేను అన్నం పెడుతున్నాను చాలా సంతోషం! కానీ... మా నాన్న గారు నన్ను ప్రేమించరు నేను చెప్పిన మాట వినరు నోర్ మూయ్ అన్నారాయన. నీ ధర్మము ఎంతవరకంటే... తండ్రికి కొడుకుగా తండ్రిని అనువర్తించడం, తండ్రిగా తండ్రిని కీర్తించడం, తండ్రి యొక్క గుణములను కీర్తించడం, తండ్రి నిన్ను దూషిస్తే... నాన్నగారి ఆశీర్వచమనుకొని వెళ్ళిపో అంతే కాని, తండ్రి యొక్క దోషములు చూసే స్థితి నీకు లేదు. తండ్రి యొక్క దోషములను ఎంచడం కుమారుని యొక్క లక్షణం కాదు. గురువు యొక్క దోషములు శిష్యుడు ఎన్నడూ చూడ కూడదు. గురువుగారి గుణము ఒక్కటే చూడాలి. ఇది చూడడం తెలిసున్నవాళ్ళు దశరథ మహారాజు గారి దగ్గర మంత్రులుగా పని చేస్తున్న మంత్రులట. మంత్రులే అలా ఉంటే... మంత్రులు అటువంటి నడవడితో ఉంటే... రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందండీ! కాబట్టి దశరథ మహారాజు గారి యొక్క రాజ్యం అత్యంత వైభవంగా జరిగిపోతూందీ... ఇక్కడ సుతార్ధం తప్యమానస్య నాసీద్వంశకరస్సుతః !! ( తస్య త్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః ! సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరస్సుతః !!) అంతా సంతోషంగా ఉన్నా దశరథ మహారాజు గారికి మాత్రం ఒక్క బాధ ఉండిపోయింది.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఎమిటా బాధ?. అయ్యోవంశకరుడైనట్టి కుమారుడు లేడు సంతానం లేదు అందుకని ఆయనేం చేశారంటే... సుయజ్ఞం వామదేవం చ జాబాలిం అథ కాశ్యపం ! పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజ సత్తమాః !! ఒకసారీ ఆయన కూర్చుని ఆలోచించాడు నాకు సంతానం కలగలేదు నాకు సంతానం కలగకుండా ఉండడానికి కారణం బహుషహా ఏదో ఒక నేను చేసిన పాపం ప్రతిబంధకమై అడ్డుపడి నేను తండ్రిని కాకుండా నన్ను బాధ పెడుతుంది ఇప్పుడు ఆ పాపమును తొలగించుకోవాలి. పాపమును తొలగించుకోవాలీ అంటే, ప్రాయశ్చిత్త కర్మ ఒకటి జరగాలి అటువంటి కర్మ ఎంతో గొప్పది చేస్తే తప్పా ఆ పాపం పోదు పాపం పోతే తప్ప నాకు కుమారులు కలుగరు అంత గొప్ప కర్మ నేను చెయ్యాలంటే... ఆశిస్తున్నది అంత పెద్ద ప్రయోజనం కాబట్టి నేను అశ్వమేధ యాగం చెయ్యాలి. అశ్వమేధ యాగం చేయ్యాలనే సంకల్పం చెయ్యడం దశరథ మహారాజుకి వేదం మీద ఉన్న నమ్మకానికి పరాకాష్ట ఆయన అంత జాగ్రత్తగా విషయాన్ని విశ్లేషించి చూశాడు చూసి వెంటనే మంత్రిని పిలిచి నా పురోహితులైనటువంటివార్ని ఋషుల్ని అందర్నీ పిలవండీ నా సంకల్పం చెప్తానన్నాడు వెంటనే వెళ్ళారు సుయజ్ఞం వామదేవం చ జాబాలిం అథ కాశ్యపం ! పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజ సత్తమాః !! జాబాలి, కాశ్యపుడు, వశిష్టుడు, సుమంత్రుడు మొదలైనటువంటి పురోహితుల్ని ఋషుల్ని అందర్నీ తీసుకొచ్చారట దశరథ మహారాజు గారు తన హృదయాన్ని ఆవిష్కరించారు నేను అశ్వమేధ యాగం చెయ్యాలనుకుంటున్నాను మహాత్ములారా మీరందరూ సహకరించి కార్యం సఫలం అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండని చాలా సంతోషించారు.
వశిష్టుడు మొదలైన మహర్షులందరూ అన్నారు సర్వధా ప్రాప్స్యసే పుత్రానభిషేతాంశ్చ పార్థివ ! యస్య తే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా !! కొడుకు పుట్టాలని కోరుకోవడం గొప్పకాదు, పుట్టినటువంటి కొడుకు ఏడిపించుకు తినేవాడు పుట్టాడనుకోండీ ఏమిటి దానివల్ల ఉపయోగం. ఏడు తరాలు కిందపడిపోతాయి పుట్టకూడని కొడుకుకాని పుడితే, వశిష్టాదులు దశరథ మహారాజు గారు చేసుకున్న నిర్ణయాన్ని శ్లాగించారు వేదాన్నినమ్మాడు ఏ పాపముందో అది పోగొట్టుకునే ప్రక్రియయందు నిమగ్నమౌతానంటున్నాడు సంతోషించి వాళ్లన్నారూ... నీకు కీర్తి తీసుకురాగలిగనటువంటి కుమారులు జన్మిస్తారు నీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండీ... అశ్వమేధం చెయ్యడం వల్ల బిడ్డలు పుట్టాలా? గురువుగారి చేసిన ఆశీర్వచనానికి అశ్వమేధం వల్ల బిడ్డలు పుడుతారా? అశ్వమేధం జరిగి బిడ్డలు పుట్టడం కాదు గురువుగారి ఆశీర్వచనానికి అశ్వమేధం జరిగి బిడ్డలు పుడుతారు గురువుగారి సంకల్పానికి అవి జరిగి తీరుతాయి. ఇప్పుడు కృతకృత్యుడు అయిపోయాడాలేదా దశరథ మహారాజు అందుకు పిలిచాడు అమాయకుడై పిలువలేదు. వాల్లోక్కసారి తప్పకుండా... ʻశుభం భూయాత్ నడూ జరుగుతుందిపనిʼ అని అన్నారనుకోండీ... అయి తీరుతుంది. ఎందుకో తెలుసాండీ... కేవల వాక్కు కాదు ఆ వాక్కు వెనక తపస్సు ఉంది ఆ తపస్సుతో కూడిన వాక్కు సత్యమై తీరుతుంది వాళ్ళన్నది సత్యమౌతుంది సత్యం వాళ్ళు మాట్లాడడంకాదు ఇది బాగా గుర్తు పెట్టుకోండీ... సత్యం వాళ్ళు మాట్లాడటం కాదు వాళ్ళన్నది సత్యమౌతుంది ఆయన దీర్ఘాయుస్మాన్ భవ అన్నాడనుకోండి రేపు చావవలసినవాడు నూరేళ్ల తరువాత చస్తారు పూర్ణాయుర్దాయం కలుగుతుంది అంతే... ఎందుకని అంటే ఆయన వాక్కు సత్యమవుతుంది ఈశ్వరుడు ఉన్నదెందుకంటే... అటువంటి వాళ్ళ వాక్కు సత్యం చేయడానికే మార్కేండేయోపాఖ్యానం మీకు చెప్పట్లేదూ...


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
కాబట్టీ ఇప్పుడు వాళ్లందరూ ఆశీర్వచనం చేస్తే సంతోష పడిపోయాడు ఆయనన్నాడూ సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ ! శాస్తయశ్చాభివర్ధన్తాం యథాకల్పం యథావిధి !! శాస్తయశ్చాభివర్ధన్తాం మీరు సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవాటాన్ని నిర్మించండి అక్కడ శాంతి ప్రక్రియ ప్రారంభించండి అశ్వమేధ యాగం అనేటటువంటిది ఎవడు పడితే వాళ్ళు చెయ్యాగలిగితే ఈ పాటికి చాలా మంది రాజులు చేసి ఉండేవారు అశ్వమేధ యాగం చాలా కష్టం దాన్ని పాడు చేయడానికి బ్రహ్మ రాక్షసులు వస్తూ ఉంటారు. ఆ బ్రహ్మ రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని కాని పాడు చెయ్యడం తటస్థించిందో యజమాని నశించిపోతాడు. కాబట్టి మీ అందరూ విషయాలు తెలిసున్న వారు కనుక యజ్ఞం సక్రమంగా జరిగేటట్టుగా నాకు సహకరించీ యజ్ఞంలో నేను కృతార్థుడు నయ్యేటట్లు బిడ్డలను పొందేటట్లూ నాకు సహకరించండీ అని అడిగాడు. అడిగితే వాళ్లందరూ సంతోషించి తప్పకుండా మహారాజా మేమందరమూ ఆ యజ్ఞవాటాన్ని నిర్మాణం చేసి తొందరలో మనం యజ్ఞం ప్రారంభం చేద్దామన్నారు తాసాం తేనాతికాన్తేన వచనేన సువర్చసామ్ ముఖపద్మాన్యశోభన్త పద్మానీవ హిమాత్యయే !! పద్మములంటే ఆ పద్మముల మీద పడినటువంటి మంచు తొలగిపోయిన తరువాత శోభించినటువంటి పద్మములు ఎలా ఉంటాయో... గురువుగారు ఆశీర్వదించారు మనకు బిడ్డలు పుడుతారటా మనం అశ్వమేధ యాగం చేస్తే మీరు కూడా నా పక్కన కూర్చుందురుగానని యజ్ఞం చేసేటప్పుడు రాజు పక్కన కూర్చోవడానికి అర్హత ఉన్నటువంటి కాంతని ధర్మపత్నీ అంటారు. పత్నులకు వెళ్లి చెప్తే వాళ్ల ముఖాలన్నీ వికశించి మంచు తొలగిన పద్మాల్లా అయ్యాయట. అంటే అమ్మతనంకోసం వాళ్లెంత పరితపిస్తున్నారో మీరు గమనించండి. ఇవ్వాళ ఆయోధ్యా నగరంలో ఇంతకు మించిన పండగ లేదు. దశరథుడు తండ్రిగాబోతున్నాడు ఆయన పత్నులు తల్లులు కాబోతున్నారు అంతా సంతోషంగా ఉన్నారు ఆజ్ఞ ఇచ్చాడు లోపలికి వెళ్ళాడు.
నన్ను మన్నించండీ! నువ్విలా చెప్పుకు పోతున్నావు వాచీ చూడవేం అనుకోకండీ, నా తాపత్రయం ఒకటుంది అందుకని దయచేసి సహకరించండీ నేనూ ఈ సర్గ చెప్పి ఆపేస్తాను. ఏమంటే నా బాధ ఒకటుంది 42 రోజులలో నేను సంపూర్ణ రామాయం పూర్తి చేయవలసి ఉంటుంది అందుకనీ...
కాశ్యపస్యతు పుత్రోస్తి విభణ్డక ఇతి శ్రుతః ఋష్యశృఙ్గ ఇతి ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి !! సుమంత్రుడనేటటువంటి మంత్రీ- ఈ అంతః పురంలోకి వెళ్లిపోయినటువంటి దశరథ మహారాజు గారిని కలుసుకొనీ, మహారాజా నీతో నేనొక విషయం చెప్పవలసి ఉందీ అన్నాడు. మంత్రి వచ్చాడు అంటే ఎదో ముఖ్యమైన విషయం అని, సుమంత్రున్ని కూర్చోబెట్టి ఏ విషయమూ అని అడిగాడు అడిగితే ఆయన చెప్తున్నాడు. ఎక్కడి విషయం చెప్తున్నాడో తెలుసాండీ! ఒకానొకప్పుడూ... ఇప్పుడు జరిగినటువంటి కథ కాదు సనత్ కుమారుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఆయన ఒకరు, సనత్ కుమారుడు ఋషులతో ఎప్పుడో ఇతః పూర్వం మాట్లాడినటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను నాకా విషయం తెలుసు నేనా విషయం చెబుతాను విను దశరథ మహారాజా అన్నాడు. ఏమిటా  విషయం అని అడిగాడు కాశ్యపస్యతు పుత్రోస్తి కశ్యప ప్రజాపతి, కాశ్యపుడనేటటువంటి ఋషికి పుత్రుడూ విభణ్డక మహర్షి. విభణ్డక మహర్షి యొక్క పుత్రుడూ ఋష్యశృంగ మహర్షి. ఇది సర్గ ఎలా వెళ్ళిందో అలా చెప్పడం కన్నా నేను దాన్ని తేట తెల్లంగా చెప్పడం మీకు తెలిగ్గా ఉంటుంది. ఎందుకంటే సర్గా కొంచెం చెప్పిన తరువాత దశరథ మహారాజు గారు వివరణ అడిగిన తరువాత సుమంత్రుడు బాగా వివరణ చేస్తాడు. కాబట్టి మీకు బాగా అర్థమయ్యే రీతిలో మీరు తెలియని వారు కాదూ, మీకు అన్నీ తెలుసు కానీ నా తృప్తి ఆ రీతిలో అవిష్కరించే ప్రయత్నం చేస్తాను.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
విభండక మహర్షికి ఒకకుమారుడు ఆయన పేరు ఋష్యశృంగుడు, ఈ ఋష్యశృంగుడు గురించి ఒక మాట చెప్పారు మహర్షి ద్వైవిధ్వం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రథితం రాజన్విప్రైశ్చ కథితం సదా !! ఈయన ద్వైవిధ బ్రహ్మ చర్యని అవలంభిస్తాడు. బ్రహ్మ చర్యం రెండు రకాలేమిటండీ...? అంటే తాను బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నప్పుడు మేఖలా, మౌంజీ మొదలైనటువంటి వాటిని ధరించి, అగ్ని హోత్రాన్ని, తండ్రినీ ఆరాధిస్తూ గడిపి గాయిత్రీ మంత్ర అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత, వేదము చేత ప్రతిపాదించబడిన అనుభవైకవేద్యమైనటువంటి ఈశ్వర తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోడానికి కావలసిన సమస్త విధ్య అభసించేటటువంటి ప్రక్రియకి బ్రహ్మచర్యం అని పేరు. అప్పుడు పాటించేటటువంటి నియమ నిష్టలు అప్పడు అగ్నినీ తండ్రినీ ఆరాధిస్తాడు. తండ్రీ అని నేనెందుకన్నానంటే గాయిత్రిని ఉపదేశిస్తాడు కాబట్టి ఋషికుమారుడు కనుక ఋషియే ఆశ్రమాన్నినడిపి విద్యాబోధ చేస్తాడు గనుక తండ్రి, లేకపోతే గురువు. రెండవ బ్రహ్మ చర్యము ఎప్పుడుంటుందంటే... తాను గృహస్తాశ్రంలో ఉన్నా ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలములయందు భార్యతో సమాగమం జరగకూడదో, భార్యతో రమించకూడదో, ఆయా రోజులలో భార్యతో రమించకుండా ఉండి, రమించవచ్చని వేదము అంగీకరించిన రోజులలో మాత్రమే రమించగలిగినవాడు నిత్య బ్రహ్మచారి ఆయన కూడా బ్రహ్మచారియే. ఆయన బ్రహ్మ చర్యం పోయిందని చెప్పడానికి ఏమి ఉండదు అందుకని రెండు రకాల బ్రహ్మచర్యమూ ఋష్యశృంగుడికి ఉంది.
ఈ ఋష్యశృంగుడి పేరు చాలా చిత్రమైన పేరు ఆయనకీ పుట్టుకచేత కొమ్ము ఉంది తలమీద ఆ కొమ్ము ఉండడం చేత ఆయనని ఒక మృగం, అంటే ఒక జింక యొక్క పిల్లవాడిగా గుర్తించారందుకని ఋష్యశృంగుడూ అని పిలిచేవారు. ఋష్యశృంగున్ని గుర్తుపట్టడానికి మీరేనాండీ ఋష్యశృంగుడు అని మనం అడగక్కరలేదు ఎందుకో తెలుసాండీ తలమీద కొమ్ము ఎవరికీ ఉండదు ఒక్క ఋష్యశృంగుడికే ఉంటుంది. తలమీద కొమ్ముతో ఎవరైనా వచ్చారనుకోండి అయన ఋష్యశృంగుడు అని గుర్తుపట్టాలి. అసలు అలా ఎలా పుట్టాడు అంటే విభణ్డక మహర్షి ఒకానొక రోజున నదీలో స్నానం చేయడానికి వెళ్లాడు నదిలో స్నానం ఎందుకు చేస్తారు నిత్యకర్మాచరణకు యోగ్యత కొరకు నదీ స్నానానికి వెలుతారు నదీ స్నానం ఎప్పుడెప్పుడు చేస్తారు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఆ సమయంలో మనసెలా ఉంటుంది ఈశ్వరార్చనా కౌశలంతో ఉంటుంది. అటువంటి మహర్షి నదిలో స్నానం చేస్తుండగా ఎదురు గుండా ఊర్వశి కనిపించింది, ఊర్వశి కనపడితే మనసు స్థిమితం తప్పిపోయేంత ఇంద్రియాల యొక్క పటుత్వం లేనివాడా ఏమి ఇంద్రియాలను నిగ్రహించలేనివాడా ఏమిటి విభణ్డకుడు కాడు కానీ, ఊర్వశి కనపడినంత మాత్రం చేత విభణ్డక మహర్షి యొక్క రేతస్సు పతనమైంది అది నీటిలో వెళిపోతోంది అక్కడికి ఒక మృగి అంటే ఆడ జంతువు, ఒక ఆడ లేడి వచ్చి ఆ నీటిని తాగింది దాహంతో ఆనీటితో పాటుగా విభణ్డక మహర్షి రేతస్సును కుడా తాగింది అది కూడా లోపలికి వెళ్లిపోయింది వెళ్లిపోతే అది గర్భం దాల్చింది గర్భం దాల్చిన తరువాత దానికో కొడుకు పుట్టాడు. తండ్రివంటి తేజస్సు, తల్లిలా ఓ కొమ్ము రెండింటితో పుట్టాడు పుట్టాక ఆ లేడి మల్లీ ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోయింది లేడి నీళ్లెందుకు తాగిందండీ!


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
అంటే మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలి ఇక్కడ రామాయణంలో సౌందర్యలహరిలో శంకర భగవత్ పాదులు ఒక శ్లోకం చేశారు హరిస్త్వామారధ్య ప్రణత-జన-సౌభాగ్య-జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభ మనయత్ ! (స్మరోపి త్వాం నత్వా రతినయన-లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్) శ్రీమహా విష్ణువు అమ్మవారిని బాగా ఉపాసన చేశాడు చేస్తే శ్రీమహా విష్ణువుకి అమ్మవారు ఏ వరం ఇచ్చిందంటే... తనంత అందం ఆయనకి ఇచ్చింది. ఇస్తే నారాయణుడు, నారాయణికి అన్నగారు కదాండీ ఆయన తన చెల్లెల్ని బాగా ఉపాసన చేస్తే ఏం చేసింది. తనంత అందం తన అన్నయ్యకిచ్చింది ఇప్పుడు అన్నయ్య అచ్చు చెల్లెలంత అందంగా ఉన్నాడు. ఇప్పుడు మోహినీ వేషం కట్టాడాయన కడితే అంమృతాన్ని తేలికగా దేవతలకి కిచ్చాడు రాక్షసులకి ఇవ్వకుండా చేశాడు ఇది పరమశివునికి తెలిసింది. పరమశివుడు ఏం చేశాడు మా ఆవిడ అందమంతా వచ్చేసిందట మా బావమరిదికి ఆడ వేషం కడితే అదేమిటో నేను చూడాలని అనుకుంటాడు. అనుకుని ఓసారి ఆ వేశం మళ్లీ చూపించవోయ్ అచ్చం మా ఆవిడ అంత అందంగా ఉన్నావటగదా చూడాలని ఉంది. వద్దు బావా ఎందుకొచ్చింది గొడవ వదిలెయ్య అన్నాడు కాదులే చూపించు అన్నాడు ఆయన మోహినీ వేష మెత్తాడు, ఈయన వెంటపడ్డాడు ఈయన వెంటపడ్డాడు పరమశివునికి రేతః పతనమైంది శంకరాచార్యులవారన్నారు అమ్మా నీవు ఎంత గొప్పదానివమ్మా మీ ఆయన్ని బజారుకీడ్చావా అని అన్నారు.
జాగ్రత్తగా ఆలోచించండి విష్ణు మూర్తికి అంత సౌందర్యమిస్తే మోహినీ స్వరూపంలో ఆయన ఉంటే... పురరిపుమపి క్షోభ మనయత్ పరమ శివుడి యొక్క మనసు క్షోభించి పోయి ఆయన వెంటపడ్డాడు మోహినీ వెంట, రేతః పతనమైంది. పర స్త్రీ కోసం పరుగెత్తి రేతః పతనం చేసుకొన్నవాడు పరమ శివుడు అని ఆయనకు అపకీర్తి వచ్చింది. ఎంత కీర్తి తెచ్చావమ్మా మీ ఆయనకు సదా పతివ్రతా అన్నాడు మరి అదేమిటి ఆ శ్లోకం ఎందుకు రచన చేసినట్టూ శంకరాచార్యుల వారు మీరు బాగా పట్టుకుంటే... అమ్మవారు శ్రీమహా విష్ణువుకి తన సౌందర్యానంతటినీ ఇచ్చి మోహినీ స్వరూపంగా నారాయణుడు పురుషుడు అంత అందంగా కనపడితే తప్పా పరమశివుడి యొక్క రేతస్సు, తన భార్య కనపడితే తప్ప పతనం అవదు. శివ కేశవుల మధ్య అనురాగముదయించి రేతస్సు పతనం అయితే తప్పా అయ్యప్ప స్వామి పుట్టరు అయ్యప్ప స్వామి పుడితే తప్పా మహిషి సంహరింపబడదు మహిషి సంహారం కోసమనీ విష్ణువుకి తన యొక్క అందాన్నిచ్చి తన భర్త యొక్క రేతః పతనం చేయించి రాక్షస సంహారం చేయించి ధర్మ శాస్త్ర అయిన అయ్యప్ప జననమునకు కారణమైన ఓ తల్లీ నీకు నమస్కారము. ఇది శంకరాచార్యులవారి హృదయం తప్పా నీ భర్తను బజారులో పాడేసిందానా అన్నది కాదు పైకలా కనపడుతుంది శ్లోకం కాని లోపల స్తోత్రం చేశారాయన అమ్మవారిని. మహాత్ముల యొక్క జననమునకు అమ్మవారు ఒక పెద్ద ప్రణాళిక నిర్మాణం చేస్తుంది ఒక మహాత్ముడు ఒక కారణానికి పుట్టాలి కానీ అంతటి మహాత్ముడు పుట్టడానికి అంతటి మహాత్ముడి తేజస్సు కలగాలి అది ఆ తల్లి సంకల్పం.
కాబట్టి ఇప్పుడు విభణ్డక మహర్షి యొక్క తేజస్సు కదలాలి, ఊర్వశి కనపడితే మనసు కదిలింది కదిలిందంటే కారణ మేమిటీ... అమ్మవారు ఒక మహాత్ముడి యొక్క జననాన్ని కోరింది మరి లేడి ఎందుకు తాగాలిఅంటే... ఆలేడి సామాన్య స్త్రీ కాదు ఆమె చిత్ర రేఖా అనే అప్సరసా ఇవన్నీ రామాయణంలో ఉన్నవి కావు నేను అనుషంగిక గ్రంధాలు పరిశీలనం చేసి మీకు చెప్తున్నవి. ఈ చిత్ర రేఖ అప్సరసా ఒకా నొకప్పుడు ఇంద్రుడి యొక్క ఆస్థానంలో నృత్యం చేస్తూంటుంది. చేస్తున్నప్పుడు ఆమె యొక్క ఆ నాట్యాన్ని చూసి సంతోషించి లేళ్ళు, జింకలూ కూడా వచ్చి నిలబడ్డాయి. ఆవిడ నాట్యం చేస్తూనే ఇంద్రుడి వంక చూడకుండా లేడి వంక చూసింది లేడి ఎంత బాగా చూస్తోందో అని లేడి వంక చూస్తూ నాట్యం చేసింది నా  వంక చూసి నాట్యం చేయకుండా లేడి వంక చూసి నాట్యం చేశావు కనుక మృగివై పుట్టూ అన్నాడు ఇంద్రుడు. నాకు శాప విమోచనం ఏమీ అని అడిగింది మహానుభావుడైన విభణ్డక మహర్షి రేతస్సు పతనమౌతుంది ఒక మహానుభావుడి జన్మకోసం ఆ రేతస్సును నీవు తాగి గర్భం ధరించు, ఒక మహాత్ముడికి జన్మ నిచ్చి నీవు మళ్లీ అప్సరసగా వస్తావన్నాడు అందుకని చిత్రలేఖ లేడిగా ఉండి ఆ రేతస్సును త్రాగింది ఋష్యశృంగున్ని జన్మింపజేసింది.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఈ ఋష్యశృంగ మహర్షీ మహానుభావుడు ఎంతటి మహానుభావుడంటే... విభణ్డక మహర్షితో కలిసి ఆశ్రమంలో పెరిగాడు ఎలా పెరుగాడో తెలుసాండీ ఆయనకి ఆ అడవిలో నాన్నగారు తెచ్చి ఇచ్చిన పళ్ళు తప్పా ఇంకొక పండు తెలియదు నాన్నగారు తెచ్చి ఇచ్చిన పదార్థాలు ఏవున్నాయో... అవే లోకంలో ఉంటాయనుకునేవాడు ఆయన. ఆయనకి ఏం తెలుసంటే నాన్నగారొక్కరే తెలుసు లోకంలో అమ్మ అన్న మాట లేదుగా ఆయనకి లేడికి గదా పుట్టాడు. అందుకని ఆడది అన్నది ఆయనకు తెలియదు అసలు ఆడదన్నది ఒకటి ఉంటుంది ఆ స్త్రీ శరీరం ఒకలా ఉంటుంది పురుషుడి శరీరం ఒకలా ఉంటుందీ... అసలు ఆయనకు తెలియదు. ఆయనకేం తెలుసంటే... నిత్య తృప్తుడు ఎందుకు నిత్య తృప్తుడు అంటే? నాన్న గారు చెప్పిన దానిమీద మనసు పెట్టాడు సూర్యోదయానికి ముందు స్నానం చేయి స్నానం చేయడం ఆయనకు తృప్తి అగ్నిహోత్రం చేయి అగ్నిహోత్రం చేయడం ఆయనకు తృప్తి స్వాధ్యాయం చేయి వేదం చదువుకోవడం ఆయనకు తృప్తి ఇలా నిత్య తృప్తుడై నాకు ఇది లేదన్న భావన లేకుండా బతికేస్తున్నాడు ఇంత గొప్ప తపస్సు చేసేసాడేమో అపారవంతుడైనటువంటి శక్తివంతుడై పోయాడు ఆ ఋష్యశృంగ మహర్షి ఆయన అరణ్యంలో ఉన్నాడు ఆయన అరణ్యంలో ఉన్నటువంటి కాలంలో ఆయన  పెరుగుతున్న కాలంలో ఒక తమాషా ఒకటి జరిగింది.
అక్కడే ఉన్న అంగ రాజ్యాన్ని రోమపాదుడనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయన ఒక అధర్మం చేశాడు దానివల్ల వర్షాలు పడ్డం మానేశాయి ఏమిటీ ఆ అధర్మంమళ్లీ అదోటి వస్తుంది కదాండీ... ఏం అధర్మం చేశాడు ఆయన తనకు కొడుకులు పుట్టలేదు సంతానం కలగలేదని బ్రాహ్మణులను పిలిచి యధేచ్చగా దానం చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు ధనం దానం పుచ్చుకుని ఇంటికి వెళ్లిపోయి మళ్లీ కొడుకుని తీసుకొచ్చి మహారాజా ఇందాక నాకు ధనమిచ్చారు వీడు నా కొడుకు నిర్ధనుడు వీనికి ఒక గోవుని ఇవ్వండి అన్నాడు. అంటే రాజు రోమపాదుడు ఆ బ్రాహ్మణ పుత్రున్ని చూసి బ్రాహ్మణుల ఆశకి అంతులేదూ ఎన్నిచ్చినా ఇంకా తెచ్చి వాళ్ల పిల్లల్ని తెచ్చి వాళ్లనీ అడుగుతూనే ఉంటారు అని పకపకా నవ్వాడు. మహారాజా నువ్వు దానం ఇస్తున్నావు కాబట్టి చేస్తున్నావు కాబట్టీ, నా కొడుకు నిర్ధనుడు కాబట్టీ బ్రాహ్మణులు రాజు దగ్గర యాచించి తీసుకోవచ్చు కాబట్టీ ఒక గోవును అడిగాను నేను ఒక గోవును అడిగినందుకు మనసు ఖేదపడేటట్టు ఇన్ని మాటలు మాట్లాడావు నీ మనసు కూడా ఖేద పడాలంటే... నా పుత్రుడిని అన్నందుకు నేను ఎలా ఖేద పడ్డానో నీకు పుత్రులు లాంటివారు నీ బిడ్డలందరూ ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు కనక ఈ ప్రజలకు అన్నం లేకపోతే నువ్వెంత బాధ పడుతావో అప్పుడు నీకు తెలుస్తుంది అన్నం లేక నా కొడుకు బాధ పడుతుంటే ఒక గోవును అడిగితే ఇలా అన్నావు నీ బిడ్డలందరూ అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అన్నం లేక ఏడిస్తే... నీకు తెలుస్తుంది ఆ బాధేమిటో..? అలా జరగాలంటే క్షామం వచ్చేయాలి నీ రాజ్యమంతా కాబట్టి రాజ్యమునందు క్షామము కలుగు గాక అని శపించి వెళ్లిపోయాడు ఆ బ్రాహ్మణుడు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
ఇప్పుడు రాజ్యంలో వర్షాలు పడ్డం ఆగిపోయాయి, దేశమంతా క్షామం వచ్చింది అన్నం లేదు. ప్రజలందరూ ఏడుస్తున్నారు ప్రభువు బాధపడ్డాడు బ్రాహ్మణనింద చేశాను, ఇక్కడ మీరు ఒక మాట నన్ను అడగచ్చు ఏమండీ ఆయన అలా అన్నారనుకోండీ రాజు, బ్రాహ్మణుడు అంతపెద్ద శాపవాక్కు విడిచిపెట్టడం అవసరమంటారా? అంటే నేనొక మాట చెప్పవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు సహనం పాటించి ఉండి ఉంటే ఇంకా ఉదారుడై ఉండేవాడు అనవలసి ఉంటుంది ఎందుకో తెలుసాండీ... శ్రీ రామాయణంలో మళ్ళీ రేపు ఎల్లుండి కొన్ని పాత్రలు కనబడుతాయి. ఎంత అవమానించినా ఎంత తపస్సున్నా వాళ్ళు శాప వాక్కు విడిచిపెట్టరు మేము ఓర్పు వహించాము నాన్నగారూ అంటారు. ఆ ఓర్పు గొప్పదమ్మా దానిలోనే లోకముంది అంటాడు కుశనాబుడు. కాబట్టి ఓర్పు పట్టలేకపోతే... ఎంతమంది ప్రమాదానికి వెళ్లిపోతారో ఎప్పుడు పడితే అప్పుడు పనికిమాలిన హాస్యప్రసంగం చేస్తే... ఎంత ప్రమాదాలు వస్తాయో వాక్కు శక్తేమిటో రామాయణం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రోమపాదుడి రాజ్యంలో క్షామం ఉంది కాబట్టి ఇప్పుడు అడిగాడు మంత్రుల్ని ఈ క్షామం పోవాలి వర్షాలు పడాలి ఏం చేయాలి అని అడిగాడు.
మహాత్ముడు అరణ్యంలో ఉన్నాడు ఋష్యశృంగుడు ఆయన కానీ వచ్చి అడుగు పెట్టాడా వర్ష ధారలు పడిపోతాయి అంతటి ధర్మాత్ముడు తేజస్సాలి. కాని ఆయన ఎందుకొస్తాడు ఆయనతో వెళ్లి మాట్లాడడం ఎవరి తరం విభణ్డకుడు చూశాడంటే శపిస్తాడు. కాబట్టి మేం వెళ్లం అన్నారు మరి ఎలా తీసుకు రావాలని అడిగారు. అడిగితే చమత్కారమైన, ప్రమాదము లేనటువంటి ఒక పద్దతిని మీకు చెప్తాను రాజా మీరు అలా చేయండన్నారు మంత్రులు ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి !  పురం అనాయయిష్యామః క్షిప్రం చ అధ్యవసీయతాం !! మనసుని క్షోభ పెట్టగల శక్తి ఇంద్రియాలకుంది. ఇంద్రియములు ఏవిచూస్తే... ఏవి అనుభవిస్తే పట్టుతప్పి క్షోభచెందుతాయో... అటువంటివి ఋష్యశృంగుడికి కనపడెట్టు చెయ్యాలి అన్నారు. కాబట్టి ఇప్పుడు ఋష్యశృంగుడు ఇదిస్తే వస్తాననడానికి ఆయన ఇది నాకు లేదనడు నిత్య తృప్తుడు. మరి ఇప్పుడు ఆయన వెంపర్లాడాలంటే... ఆయన యవ్వనంలో ఉన్నాడు కాబట్టి బాగా అలంకరింపబడినటువంటి సౌంధర్యవతులైన గణికలు, గణికలంటే వైశ్యల్ని పంపించారు. వాళ్లేం చేశారు? దగ్గరికి వెళ్లాలంటే విభణ్డకుడు ఉన్నాడేమో ఆశ్రమంలోననే భయం శపిస్తాడు నా కొడుకు దగ్గరకు ఎందుకు వచ్చారని, అందుకని వాళ్ళువెళ్ళడం మానేసి దూరంగా ఎక్కడో పాటలు పాడుకుంటున్నారు, ఒక వెళ విభణ్డకుడు చూస్తే, ఓహోమీరు ఇక్కడున్నారని తెలియదని వెళ్లిపోవచ్చు ఋష్యశృంగుడు వస్తే కార్యం నిరవేరుతుంది అందుకనీ వాళ్ళు పాటలు పాడుతున్నారు.
అక్కడికి ఒక రోజునా... దైవవశాత్తు అనే అనవలసి ఉంటుంది ఋష్యశృంగుడు వెళ్లాడట వచ్చినవాడు విభణ్డకుడు కాదు ఋష్యశృంగుడే అని వారు ఎలా గుర్తుపట్టారు కొమ్ము అదే ఆధారం తలమీద కొమ్ముందికదండీ వాళ్లు సంతోషించారు వచ్చేశాడు ఋష్యశృంగుడని. ఆయన దగ్గరకొచ్చాడు వచ్చిన తరువాత ఆయనతో వాళ్లు మాట్లాడినప్పుడు ఆయన అడిగాడు మీరు ఎవరుఎక్కడుంటారు?, ఏం చేస్తుంటారు? అని అడిగాడు  అడిగితే మేమందరం కూడా వేదం నేర్చుకుంటుంటాం మేమందరం


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
కూడా మా స్వకర్మ మేం చేస్తుంటాం ఆయనకు అలా చెప్తేనే సంతోషిస్తాడు అంతకన్నా ఇంకేం చెప్పినా ఇంకోటి చెప్పినా ఆయనకు తెలియదు. వెడుతూనే మేం వేశ్యులం అని చెపితే వేశ్యలంటే ఏం అని అడుగుతాడు ఆయన, ఆయనకు అసలు స్త్రీ పురుష భేధమే తెలియదు అందుకనీ వీళ్ళందరూ ఈ మాట చెబితే ఆయనన్నారు మీరు ఎంతటి మహాత్మలు కాబట్టి మీ అందరూ మా ఆశ్రమానికి రండీ అన్నాడు రామాయణంలో ఒక గమ్మత్తుంది అక్కడో  శ్లోకంలో ఏమిటో తెలుసాండీ ఆ శ్లోకంలో రహస్యం ఇహాఽఽఆశ్రమ పదోస్మాకం సమీపే శుభ దర్శనాః ! కరిష్యే వోత్రపూజాం వై సర్వేషాం విధి పూర్వకం !! అన్నాడు ఋష్యశృంగుడు సర్వేషాం అన్నాడు తెలుగులో దీనిని మార్చడం కుదరదు సంస్కృతానికే ఉంది ఆ పట్టు సర్వేషాం అంటే మగవాళ్ళనంటారు ʻసర్వాసాంʼ అంటే ఆడవాళ్లనంటారు.
 మీరందరూ మా ఆశ్రమానికి రండి సర్వేషాం అంటే మగ ఆడా తేడా తెలియదుగా ఋష్యశృంగుడికి అందుకనె వాళ్లు కూడా తన లాంటి వాళ్లె అనుకున్నాడు. అబ్బో మీ అందరూ ఎంత ఎలా ఉన్నారో నా దగ్గర పూజ స్వీకరిద్దురుగాని నా ఆశ్రమానికి రండీ అన్నాడు సర్వాసాం ఆడవాళ్లందరూ అక్కడికి వెళ్లారు వెడితే ఆయనేం చేశారు తతః తాః తం సమాలింగ్య సర్వా హర్షసమన్వితాః ! ఆయన వాళ్లను కూర్చోబెట్టి ఆగతానాం తు తతః పూజాం ఋషి పుత్రః చకారహ ! ఇదద అర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలం చ నః !! వాళ్ళను కూర్చోబెట్టి ఆసనమిచ్చాడు ఆర్ఘ్యమిచ్చాడు పాద్యమిచ్చాడు చేతులు కడిగాడు కాళ్ళు కడిగాడు వాళ్ళకు పళ్ళు పెట్టాడు తినండన్నాడు మీరేం చదువుకుంటున్నాడన్నాడు. మేం ఇది చేసుకుంటాం మీరేం చేస్తుంటారు మేమిలా స్వాధ్యాయం చేస్తుంటాం అని కబుర్లు చెప్పారు వాళ్ళు అన్నీ విని అన్నీ చూసి అన్నారూ... ఎందుకొచ్చారు వాళ్ళు ఈయన్ని తీసుకెళ్ళి పోవాలి ఈయనకి ఇతః పూర్వం ఏం తెలియదో అది రుచి చూపించాలి అందుకని ఇంద్రియములను ఉద్రేకపరచాలి వాళ్లన్నారూ ఇవి పళ్ళు ఇవి తిను అన్నారు. మేం తినే పళ్ళు తిను అన్నారు ఏం తెచ్చారు? అవి పళ్ళు కావు? రజోగుణ సంపత్తిని కల్పించగించగలిగినట్టి ఇంట్లో పచనం చేయుబడినటువంటి పదార్థములు మధుర పదార్థములు, ఆ పదార్థములు, ఈ పదార్థములు ఏవో రొట్టెలు, అవి ఇవి లడ్లు అనుకోండీ, జిలేబీలనుకోండీ, ఏవో అనుకోవడానికి తప్పేముంది. అలాంటి పదార్థాలన్ని తెచ్చి అక్కడ పెట్టి పళ్ళన్నారు ఆయన ఇవి పళ్ళేమిటి అని ఆయన అనలేదు ఎందుకనలేదు ఆయనకు తెలియదు ఎందుకంటే ఆయనకు ఏమిటి తెలుసు వాళ్ళ నాయన గారు ఇచ్చిన పళ్ళు తినడమే తెలుసు అందుకే ఆయనేం అనుకుంటున్నాడు ఓహో ఇవి పళ్ళె అని తీసుకున్నాడు ఇప్పుడవి తిన్నాడు. తినేటప్పటికి బుద్ది మారుతుంది కదండీ! వాళ్లేం చేశారంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేం బయలుదేరుతున్నాం ఎప్పుడైనా మాకు కనబడుతూ ఉండూ అక్కడ పాటలు పాడుతూంటామనీ... అందరూ ఆయనని కౌగలించుకుని వెళ్ళారు ఇప్పుడు ఆయనకి స్పర్శలో ఒక తేడా కనపడింది ఇంతకన్నా స్పష్టంగా నేను చెప్పక్కర్లేదు నేను ఉపన్యాసం కాబట్టీ ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
కానీ ఈయన మనసు మాత్రం క్షోభించడం మొదలు పెట్టింది వాళ్ళు ఎక్కడ కనపడుతారు ఎక్కడ కనబడుతారనీ తండ్రి వెళిపోయిన తరువాత వీళ్ళ కోసం ఈయ్యన తిరిగాడు తిరిగితే వాళ్ళు కనపడ్డారు వాళ్ళకు తెలుసు వస్తాడని వాళ్ళు ఏమి అనుకోకు మా ఆశ్రమం ఇక్కడే ఉందీ నిన్న మీ ఆశ్రమానికి వచ్చాముగా నువ్వు ఇవ్వాళ మా ఆశ్రమానికి రా... అని ఊళ్లోకి


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
తీసుకెళ్ళారు. ఊళ్ళోకి తీసుకెళితే ఎప్పుడైతే అంగరాజ్యంలోకి ఆయన ప్రవేశించాడో... గమ్మత్తు జరిగింది అడవిదాటాడు అంగ రాజ్యంలోకి అడుగు పెడుతున్నాడనాలో పెట్టాడనాలో వచ్చేశాడనాలో మనకు తెలియదు ఎందుకో తెలుసాండీ! రామాయణం అంత గమ్మత్తు తత్రచ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా !! ఆయనతో వర్షం వచ్చేసింది ఆయన వచ్చాక వర్షం రాలేదు ఆయనతో వచ్చేసింది అంతే వర్షం పర్జన్యుడు ప్రీతి చెందాడు ఇంతటి మహాత్ముడు అడుగు పెడుతున్నాడు. వర్ష ధారలు పడ్డాయి వచ్చిన క్షామం పోయింది ప్రజలందరూ సంతోషించారు ఇప్పుడు రాజేం చేశాడో తెలుసాండీ... గబగబా వచ్చి సాస్టాంగ మనస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి మట్టి తన తలకు తగిలేటట్టుగా నేల మీదపడి నమస్కారం చేశాడు ఎందుకనీ, ఒక బ్రాహ్మణుడితో మాట్లాడినప్పుడు ఏ మాట మాట్లాడకూడదో అది మాట్లాడితే ఆయన ఆగ్రహానికి గురైతే... ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక ప్రమాదం లోపల ఉంది ఏంటది? విభణ్డకునికి తెలిస్తే... అందుకనీ ఇంత అనుగ్రహించావు మహానుభావా నీవ్వు పరమ ప్రీతి చెందుతావు ఎన్ని దోషాలున్నా క్షమించేస్తావు నేలమీద పడిపోతే... కాబట్టి ప్రీతి చెందుతావని నేలమీద పడిపోయాడట ఇప్పుడు జ్ఞానం వచ్చింది రాజుకి నేల మీద పడ్డాడు. చూశాడు మీ నాన్నగారు క్షమించాలి మీరు క్షమించాలి ఏం క్షమించినట్లే ఏం ఫరవాలేదు అంతః పురంలోకి వెళ్ళాడు అంతఃపురం ప్రవేశ్య అస్మై కన్యాం దత్త్వా యథావిధి ! శాంతాం శాంతేన మనసా రాజా హర్షం అవాస సః !! ఆ ఋష్యశృంగుడికి శాంతాదేవినిచ్చి తన కుమార్తెను వివాహం చేశాడట.
ఋష్యశృంగుడు కూడా మామ గారి దగ్గరే ఉంటుంన్నారు చాలా ఆనందంగా ఉంటున్నారు ఎవరు చెప్తున్నారు ఈ కథా? సుమంత్రుడు దశరథ మహా రాజుకి అంతఃపురంలో చెప్తున్నాడు ఆ ఋష్యశృంగుడు ఉన్నాడు, రోమపాదుడి అల్లుడు ఆ రోమపాదుడు నీకు మిత్రుడు, నాకు ఆనాడు బ్రహ్మమానస పుత్రుడు ఏం చెప్పాడో తెలుసా? ఆనాడు ఋషులతో చెప్పిన విషయం ఏమిటో తెలుసా? ఇక్ష్వకు వంశంలో దశరథుడు పుడతాడు కానీ ఆయనకీ బిడ్డలుండరు, బిడ్డలు లేకపోతే అశ్వమేధ యాగం చేద్దాం అనుకుంటాడు, కానీ ఆ అశ్వమేధ యాగం చేసి ఆయన యొక్క పాపాన్ని పోగొట్టి ఆయన పుత్రవంతుడై తండ్రియై స్వర్గాన్ని పొందాలంటే అపారమైనటువంటి తపస్సశక్తి కలిగిన మహా పురుషుడైన ఋష్యశృంగుడు శాంతా సహితుడై వచ్చి కూర్చోవాలి కూర్చుంటే అది పూర్ణత్వాన్ని పొందుతుంది ఋష్యశృంగుడు రాకపోతే మాత్రం ఎన్ని ఉన్నా అది పూర్తవదు. కాబట్టి ఋష్యశృంగున్ని నీవు తీసుకురావాలి, తీసుకురావాలంటే రెండే మార్గాలు నువ్వే... బయలుదేరి వెళ్ళాలి. ఎవరినో పంపించకు నువ్వు వెళ్ళు, వెళ్ళి నువ్వే నమస్కారంచేసి రోమపాదుడ్ని అడుగు. అల్లుడు పుత్రపంచకంలో ఒకడు ఐదుగురు కొడుకులలో ఒకడు కాబట్టీ మామ గారికి స్వాత్యంత్రం ఉంటుంది పెద్దవాడు కాబట్టి మామ గారిని అడుగు. అయ్యా! మీ అల్లున్ని పంపించు నేను యజ్ఞం చేస్తున్నాను అని అడుగు నీ మీద ప్రీతితో స్నేహితుడు కాబట్టి రోమపాదుడు పంపిస్తాడు శాంతా సహితుడై వస్తాడు గృహస్తాశ్రమంలో ఉన్నాడు కాబట్టీ భార్యాతో కలసి వస్తాడు పార్వతీ పరమేశ్వరుల్లాంటి వాళ్లిద్దర్ని చక్కగా నమస్కారం చెయ్యేచ్చు కాబట్టి ఇద్దర్నీ తీసుకురా అన్నాడు బయలుదేరాడు దశరథ మహారాజు దశరథ మహారాజు గారు వెళ్ళాడు.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
అంగరాజు కూతురి పేరు శాంత, ఆ శాంత ఋష్యశృంగుడు ఆ అంగరాజ్యంలో ఉండడాన్ని గమనించి అక్కడికి వెళ్ళిన దశరథ మహారాజు గారు రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్తున్నాడు అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతా భర్తా మమ క్రతుం అహరేత త్వయాఽఽజ్ఞప్తః సంతానార్థం కులస్య చ !! మహానుభావా రోమపాదుడా నీ అల్లుడు ఋష్యశృంగుడున్నాడే మీ అమ్మయి శాంతనీ నా రాజ్యానికి పంపిస్తే నేను చేసేటటువంటి యజ్ఞానికి వాళ్ళిద్దరూ వచ్చి కూర్చున్నారా ఆధ్వర్యం వహించాడా దేవతలు ప్రీతి చెందుతారు యజ్ఞం పూర్తవుతుంది. నాకు కొడుకులు పుడుతారు స్వర్గలోకానికి వెళుతాను నీ అల్లున్ని పంపవయ్యా అన్నాడు అడిగితే ప్రీతి చెందాడు రోమపాదుడు తప్పకుండా పంపిస్తానన్నాడు దశరథ మహారాజు గారు ఋష్యశృంగుడి దగ్గరకు వెళ్ళాడు మామ గారిని అడిగి విడిచి పెట్టకూడదుగా మహానుభావుడుగదా ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించాడు తం చ రాజా దశరథో యశస్ కామః కృతాంలిః ! ఋష్యశృఙ్గం ద్విజ శ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్ !! యజ్ఞార్థం ప్రసవార్ధం చ స్వర్గార్థం చ నరేశ్వరః ! లభతే చ స తం కామం ద్విజ ముఖ్యాత్ విశాంపతిః !! అయ్యా మహానుభావా ఋష్యశృంగుడా ఇంతకన్నా నేనేం చెయ్యగలను నా రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నాను నువ్వు శాంతా సహితుడవై వచ్చి ఆ యజ్ఞంలో కూర్చొని నా చేత చేయిస్తే నీ తపస్సు శక్తి చేత నువ్వు కూర్చుని చేయిస్తే దేవతలు అనుగ్రహిస్తారు నాకు కొడుకులు పుడుతారు. మహానుభావా రావయ్యా అన్నాడు ఇలా చేతులు జోడించి నేల మీద పడి కూర్చొని అడిగితే... మహాత్ములైనవారు ఎంత కష్టానికైనా సిద్ధపడీ అవతలివాళ్ళకు లొంగిపోయి ఆ కార్యానికి బయలుదేరి పోతాడు ఎందుకంటే వారి హృదయములు అంత ప్రసన్నములు.
కాబట్టి ఋష్యశృంగుడు అంగీకరించాడు వస్తున్నానన్నాడు దశరథ మహారాజుతో బయలు దేరాడు పొంగిపోయాడు దశరథుడు కబురు చేశాడు. ఓ... అంతటా పన్నీరు చల్లండి సువాసనలు వెదజల్లేటట్లుగా రహదారుల అన్నిటా పుష్పాలు అలంకరించండి సుగంధాలన్నికూడా విరజిమ్మేటట్లుగా అంతఃపురాన్ని సిద్దం చెయ్యండి శాంతా సహితుడై మహానుభావుడు తపస్స్చక్రవర్తి ఋష్యశృంగుడు వస్తున్నాడన్నారు. అంతా సిద్దం చేశారు బయలుదేరి వెళ్ళారు అంతఃపుర కాంతలు ఎదురొచ్చారు ఆ ఋష్యశృంగుడికీ శాంతకీ స్వాగతం చెప్పారు అంతఃపుర స్త్రీయ స్సర్వా శాంతాం దృష్ట్వా తథాఽఽగతాం ! సహ భర్త్రా విశాలాక్షీం ఆనందం ఉపాగమన్ !! ఆ వచ్చిన శాంత దగ్గరికి అంతఃపుర స్త్రీలందరూ ఎదురొచ్చారు వచ్చారు. అమ్మా నీవొచ్చావమ్మా నీ భర్తతో కలసి మా కార్యం పూర్తైపోయినట్లే తల్లీ నీవు ఎంత సంతోషంగా ఉన్నావోయని ఆమెకు ఎదురొచ్చి అంతఃపుర కాంతలు స్వాగతం చెప్పారు. దశరథడు దగ్గరుండి ఋష్యశృంగున్ని తీసుకొచ్చాడు ఋష్యశృంగుడు శాంతా అందరూ అంతఃపుర ప్రవేశం చేశారు. కాబట్టి దశరథ మహారాజు గారి కోరిక తీరిపోయినట్లే ఆ ఋష్యశృంగ మహర్షి తిరిగినటువంటి ప్రాంతం గనుక.
ఆ త్రేతా యుగంలో ఎప్పుడో అక్కడ తపస్సు చేసి తిరిగినటువంటి ప్రాంతంలో ఉండి ఉన్నందుకూ, యుగం మారిపోయినా ఆయన యొక్క తపస్సు యొక్క ప్రభావం చేత ఇప్పటికీ కలియుగంలో శంకరభగవత్ పాదులు ఆ మార్గం గుండా వెలుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తుంగానది తీరంలో ఒక నాగుపాము ఒక కప్ప ఎండా కాలంలో ఇంక గెంత లేక శోశించి ఉండిపోతే... ఒక నాగు పాము పడగవిప్పి కప్పకి అచ్చాదన ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయి ఒక కప్పకి పాము నీడనివ్వడమేమిటని అంతర్ముఖులై చూశారు. ఇక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి తిరుగాడిన తపో భూమి. ఈ భూమి ఇంత గొప్ప భూమి ఇక్కడ నేను సార్వభౌమ పీఠాన్ని స్థాపిస్తానన్నారు. అక్కడే మహానుభావుడు శంకరభగవత్ పాదుచార్యులు స్వామివారు మనందరికోసమని అక్కడ పెట్టినటువంటి ఆ పీఠానికే శృంగగిరి పీఠము అని పేరు. ʻశృంగేరీ పీఠముʼ శృంగేరీ పీఠ సదృశమైనటువంటి ఈ పీఠంలో మనం ఇవ్వాళ శ్రీ రామాయణంలో ఋష్యశృంగ మహర్షి యొక్క గొప్ప తనాన్నీ, శాంతా సహితుడైనటువంటి ఋష్యశృంగుడు, దశరథ మహారాజు అంతఃపురాన్ని చేరుకున్నటువంటి వాడైన ఘట్టాన్ని చెప్పుకునీ... ఇంత గొప్ప తిథినాడు బహుళ పక్ష విదియనాడు రెండో రోజు ఇటువంటి మహర్షిని గురించి చెప్పుకొని విని మనందరం తరించి పోయాం. అందుకని ఈ ఘట్టం పూర్తయ్యే వరకు మిమ్మల్నందర్నీ కూర్చోమనీ కొద్దిగా ఆలశ్యం చేసినా నన్ను మన్నించి మీరు కూర్చున్నందుకు శిరస్సు వంచి మిమ్మల్నందరినీ కృతజ్ఞతలు ఆవిష్కరించు చున్నాను.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
దీని తరువాత రేపటి రోజునా పుత్రకామేష్టి జరుగుతుంది అశ్వమేధయాగం జరుగుతుంది రామ చంద్ర మూర్తి ఆవిర్భవిస్తారు రామ చంద్ర మూర్తి ఆవిర్భవించడమంటే... లోకాలన్నిటికీ పండగ ఎంత గొప్ప పండగో... రేపటి రోజున రామ చంద్ర మూర్తి పుట్టడం వింటేచాలు అపారమైన సంతోషం మనం రామానుగ్రహానికి పాత్రులవుతాం. రేపు ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రార్థనా శ్లోకాలు కూడా పూర్తి చేసేస్తాను 6:30 ప్రసంగం మొదలై పోతుంది. ఎందుకంటే... అశ్వమేధమవ్వాలి పుత్రకామేష్ఠి అవ్వాలి యజ్ఞ పాయస పాత్ర ఇవ్వాలి భార్యలు తినాలి బిడ్డలు కలగాలి బిడ్డలు కలిగిన తరువాత వారికి నామ కరణం జరగాలి. రేపు రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు పుడితే... ఆ ఘట్టం చెప్పుకుని నేను తరించి పోవాలి, సీతాకళ్యాణం ఏడవ రోజుకి పూర్తి చెయ్యాలి ఇందులో మళ్ళీ హరి ప్రసాద్ గారు చాలా గొప్ప సంకల్పం చేశారు. ఎల్లుండీ, రామ చంద్ర మూర్తి మొట్ట మొదట విశ్వామిత్ర మహర్షిని చూస్తాడు విశ్వామిత్ర మహర్షి దర్శనం అంటే అత్యద్భుతం బాల కాండకి పేరు విశ్వామిత్రుడి వల్లె వచ్చింది. అసలు ఇంక అక్కడ్నుంచి ఉంటుందండీ రామాయణం... స్నాతకం చేశాడండీ! ఏమి మాట్లాడుతాడండీ రామ చంద్ర మూర్తితో... విశ్వామిత్రుడు. అసలు విశ్వామిత్రుడు రావడం రాముడు వెళ్ళడం విశ్వామిత్రుడు మాట్లాడడం  కౌశల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ఇప్పటికీ సుప్రభాతానికి మకుటం అదే. అటువంటి ఘట్టాలన్నీ ప్రారంభమవుతాయి.
గంగావతరణం, శణ్ముకోత్పత్తి అసలు ఫల శృతి చెప్పని మహర్షి ఫల శృతి చెప్తారు. ఎల్లుండి విశ్వామిత్ర మహర్షి దర్శనం అవుతుంది కాబట్టి ఎల్లుండికి పై రోజున ఉదయమో ఎప్పుడో వారు సమయాన్ని ప్రకటనం చేస్తారూ... సప్తర్షులను ఆవాహన చేసి అపురూపమైన ప్రక్రియ ఆయా గోత్రాలలో ఆయా ఋషులు ఉన్నటువంటి వేదం చదువుకున్నటువంటి పండితుల్ని భార్యలతో సహా సప్తర్షుల ఆహ్వానం చేసి సప్తర్షిలుగా పూజ చేస్తారు. విశ్వామిత్రున్ని వశిష్టున్ని వేదిక మీద పిలిచి పూజ చేస్తుంటే... ఇక్కడే ఉన్నాడు నాతండ్రి రామ భద్రుడు సీతా సహితుడై ఎంత పొంగిపోతాడో.. ఒక పక్క రామాయణమా ఒక పక్క రామ నామమూ ఒక పక్క హనుమాన్ చాలీసా ఒక పక్క శ్రీరామా జయ రామ జయ జయ రామా ఒక పక్కనేమో సప్తర్షి పూజా ఒక పక్క విశ్వామిత్రుడు రావడమా రామ చంద్ర మూర్తి పొంగిపోయి ఇలా ఇలా తొంగి చూస్తూనే ఉంటాడు. ఆనంద పడిపోతాడు ఇలా లేచి నిలబడే ఉంటాడు విశ్వామిత్రుడు వచ్చి వెళ్ళేవరకు అంత గురు భక్తి తత్పరుడు విశ్వామిత్రుడు వచ్చి ఉండగా మనం ఉంటే చాలు సప్తర్షి పూజా విశ్వామిత్ర దర్శనంలో రామ చంద్ర మూర్తి యొక్క పరిపూర్ణ  అనుగ్రహానికి మనం తరించి పాత్రులమవుదాం.


  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
కాబట్టి రేపు రామ చంద్ర మూర్తి జన్మించేటటువంటి సందర్భం చెప్పగలిగినటువంటి భాగ్యము రామ చంద్ర మూర్తి నిర్హేతుక కృపా కటాక్షణముల చేత నాకు కలిగించు గాక అని సాంజలి బంధకంగా ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ. మనం ఇప్పుడు ఒక్క పదకొండు మార్లు రామ చంద్ర మూర్తి మీద రామనామం చెప్పుకొని తదనంతరం ఇవ్వాల్టి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొందాం.
శ్రీ రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము 
కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగరు రామ నామము !!రా!!
గౌరికిది ఉపదేశ నామము కమలయజుడు జపియించు నామము !!రా!!
గోచరంబగు జగములోపల గోప్యమైనది రామ నామము !!రా!!
శిష్ఠజనముల దివ్యదృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము !!రా!!
ఆత్మ సంయయోగ సిద్ధికి ఆయుధము శ్రీ రామ నామము !!రా!!
తుంటరీ కామాదులను మంటకలుపునది శ్రీ రామ నామము !!రా!!
మేరు గిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామ నామము !!రా!!
ధాత వ్రాసిన రాత తుడిచెడి దైవమే శ్రీ రామ నామము !!రా!!
అష్టదళముల కమలమందున అమరి యున్నది రామ నామము !!రా!!
జానకీ హృత్ కమలమందున అలరుచున్నది రామ నామము !!రా!!
భక్తితో ప్రహ్లదుడడిగిన వరమునొసగెను రామ నామము !!రా!!
గుట్టుగా గురు సేవ చేసిన గుణములొసగును రామ నామము !!రా!!
తల్లివలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామ నామము !!రా!!
మంగళంభగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీ రామ నామము !!రా!!



  బాల కాండ రెండవ రోజు ప్రవచనము
మంగళా శాసన పరై ర్మ దాచార్య పురోగమైః ! సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్ !!
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే ! చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ !!
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే ! శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ !!
కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా.  శ్రవమ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ! !
సర్వం శ్రీ ఉమా బ్రహ్మార్పణమస్తూ !